వాడిన మొగ్గలు- క్రిష్ణ వేణి

FGM- Female Genital Mutilation. స్త్రీ జననాంగ భాగాలను కత్తిరించడం.

      సున్తీ గురించి మనం చదివినప్పుడు మనకి చటుక్కున తట్టేది పేదవడిన ఆఫ్రికన్ దేశాలు. ఈ ఏహ్యమైన ఆచారం అలాంటి దూరప్రదేశాలలో, అనాగరికమైన ప్రాంతాల్లో, నిరక్షసాస్యత ఎక్కువున్న దేశాల్లో మాత్రమే పాటించబడుతుందని అనుకుంటాం మనం. కానీ ఇది మన దేశంలో కూడా ఉందని మనం ఊహించలేం.
దావూదీ బోహ్రా శాఖలో, ఖట్నా పేరిట కొనసాగుతున్న దురాచారం ఇది.
          వీరు యెమెన్ నుంచి ఆవిర్భవించి, 16వ శతాబ్దంలో భారతదేశంలో స్థిరపడిన తెగ. వర్తకులు. ఈ జనసంఘం ఎక్కువగా మహారాష్ట్రా, రాజస్థాన్ మరియు గుజరాత్లో ఉంది. భారతదేశానికి బయట, స్త్రీ సున్నతిని ఆచరించే దేశాలు ప్రధానంగా పాకిస్తాను, శ్రీలంకా, ఇండోనేషియా, ఈజిప్ట్, ఎథియోపియా, సొమాలియా, గినియా మరియు ఆఫ్రికా.
మన దేశంలో ఖట్నా గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడరు. ఇది గుజరాత్లో మరియు ముంబయిలో- ప్రధానంగా ముస్లిమ్ దావూదీ బొహ్రా కమ్యూనిటీలో విరివిగా ఆచరింపబడుతోందన్నది ఒక యదార్థం. ఈ కమ్యూనిటీలో ఉన్న ఆడపిల్లలకి ఈ బాధాకరమైన ప్రయోగపు వివరణ ఏదీ ఇవ్వబడదు.
        భారతదేశంలో ఒక మిలియనుమంది ఉన్న బొహ్రా సమాజపు ఈ శాఖని ఇస్మైలీ షియాలని పిలుస్తారు. వీరే FGM ఆచారాన్ని పాటించేవారు. ఇది ఖురాను ప్రకారం మొహమ్మదీయుల ఆచారం కాదు. పురుష సున్నతిలా కాక ఇది ఒక రహస్యమైన ఆచారకాండగా జరపబడుతుంది.
         ఆధునిక భారతదేశంలో, ఇది అతి జాగ్రత్తగా మరుగు చేసి పెట్టబడిన రహస్యం. ట్యాబూ. అయిదారేళ్ళు మించకుండానే ఆడపిల్లలకి ఎనస్థీషియా కూడా ఇవ్వకుండా, రేజరు బ్లేడుతో సున్నతి చేస్తారు. కాకపోతే మిగతా దేశాల్లోలాగా కాకుండా ఈ కమ్యూనిటీలో ఆడపిల్లల clitoris కొసలని మాత్రం కొంత కత్తిరించి వేస్తారు. గుడ్డిలో మెల్ల! దీన్ని జరిపించేది నిపుణులైన డాక్టర్లు కారు. స్థానికంగా “ఖట్నా” అనబడే ఈ ఆచారానికి ఏ వైద్యపరమైన సమర్థింపూ లేదు. FGM వెనక ఉన్న కారణాలు షరియత్‌ని పాటించడం, కుటుంబ గౌరవం, పురుషునికి హెచ్చయే లైంగిక సంతుష్టి, సామాజిక ఆమోదం (ముఖ్యంగా పెళ్ళికి), కన్యత్వాన్ని/ సచ్ఛీలతని పరిరక్షించడం అని చెప్తారు.

ddఈ కమ్యూనిటీలో ఉన్న పురుషులు వర్తకులు కనుక వారు తరచూ దూర ప్రయాణాలు చేస్తారు. వారు ఇంటి బయట ఉన్నప్పుడు, భార్యలకి లైంగిక ఇచ్ఛలు కలగకుండా ఖట్నా చేయిస్తే సరిపోతుందన్నది ప్రధానమైన కారణం. నిజానికి ఇది అమ్మాయిలకి/స్త్రీలకి భావప్రాప్తి కలగకుండా తీసుకునే జాగ్రత్త.
ప్రతీ సంవత్సరం మన దేశంలో వందమంది బొహ్రా అమ్మాయిలకి సున్నతి చేయబడుతుంది.
భారతదేశంలో అతి ఉన్నత చదువులు చదువుకున్న కమ్యూనిటీ దావూదీ బొహ్రాలది. అయినప్పటికీ దేశంలో FGM ని ఆచరించేది ఇదొక్క ముస్లిం కమ్యూనిటీయే.
             FGM వల్ల ఆరోగ్యకరమైన లాభాలేమీ లేవు. నిజానికి ఇది ఆడపిల్లలకీ, స్త్రీలకీ ఒక విధంగా హానే కలిగిస్తుంది. FGM చేయబడిన దశమీద ఆధారపడి- దానివల్ల కలిగే తీవ్రమైన నొప్పి, షాకు, ఇన్ఫెక్షన్, ఋతుస్రావం సమయమప్పుడు చిక్కులు, గర్భం, ప్రసవంలో కష్టాలు, sexual dysfunction, మానసిక హాని అనేక పరిణామాలలో కొన్ని. అదనంగా చెప్పుకోదగ్గ మానసికలైంగిక, సామాజిక పరిణామాలింకా ఎన్నో ఉన్నాయి.
ముంబయిలాంటి పట్టణాల్లో ఈ ప్రక్రియని పుట్టీపుట్టగానే హాస్పిటళ్ళలోనే జరిపించేస్తారు.
           విచారకరమైన సంగతి- ఈ బాధాకరమైన ప్రక్రియ ఆడపిల్లలమీద మిగతా స్త్రీలు జరిపించడం- తల్లులూ, అమ్మమ్మలూ, నాయనమ్మలూ. ఆడపిల్లలు పెద్దయి, తమకి జరిగినది తెలిసిన తరువాత తల్లులని నిందిస్తారు-ఈ మూర్ఖ సాంప్రదాయానికి తమ తల్లులు కూడా బలయేరని తెలిసేటప్పటివరకూ.
           WHO ప్రకారం FGM స్త్రీ పురుషుల మధ్యనున్న అసమానతలని ప్రతిబింబిస్తుంది. ఇది చిన్నపిల్లలమీద జరపబడుతుంది కనుక ఇది పిల్లల హక్కుల ఉల్లంఘన కూడా.
స్త్రీలు తమ హక్కులకోసం పోరాడటం హెచ్చవుతున్న ఈ కాలంలో, ఒక సుసంపన్నమైన సమాజం- స్త్రీల చదువూ ఉద్యోగం మీదా ప్రగతిశీల అభిప్రాయాలు ఉన్న కమ్యూనిటీ- స్త్రీలని ఈ మధ్యయుగానికి సంబంధించిన ఆటవిక ఆచారానికి గురి చేస్తోందన్నది ఆశ్చర్యకరమైన విషయం.
           UN- FGM ని మానవహక్కుల ఉల్లంఘింపుగా ప్రకటించి, బ్యాన్ చేసింది. కానీ మన దేశంలో ఏ బ్యానూ లేదు. ఖట్నా ఇంకా కొనసాగుతూ ఉండటానికి కారణం ఈ అంశంమీద స్త్రీలతో కానీ మీడియాతో కానీ వివాదం చేయడం అనవసరం అన్న బోహ్రా కమ్యూనిటీ యొక్క ప్రధాన యాజకులు.
ఈ మధ్యయుగాలకి సంబంధించిన ఆచారాన్ని ఆపే మార్గమేది? ఈ కమ్యూనిటీకి చెందిన స్త్రీలు దీని గురించి ఇప్పటివరకూ ఎందుకు పోరాడలేదు?
ఈ స్త్రీలు బయటపడ్డానికి భయపడే కారణాలు రెండు.
ఒకటి- అజ్ఞానం. తమకి ఏమిటి జరిగిందో అన్న సంగతి ఒక వయస్సు దాటేదాకా చాలామందికి తెలియదు. తెలిసే ఆస్కారం కూడా లేదు.
            రెండవ కారణం- భయం. తమ కుటుంబాలకి కానీ ఏదైనా ప్రమాదం ముప్పిల్లుతుందేమోనన్న తీవ్రమైన, నిజమైన, స్పష్టమైన భయం. ఇది పరిధీకృత సమాజం. మతాధికారులకి మనుష్యుల జీవితాలమీద పూర్తి అధికారం ఉంటుంది. గీత దాటినివారినీ, నియమాలని అతిక్రమించిన వారినీ సామాజిక వెలి వేయడం సామాన్యం ఇక్కడ.
ఇది మనుష్యులకి ఉండే ప్రాధమిక హక్కులని అణిచి వేయడం కాదా! 21వ శతాబ్దంలో, ప్రజాస్వామ్యంలో కూడా ఇలా జరుగుతోందన్నది ఆశ్చర్యమే. ఈ చిన్న సమాజంలో, దీనిపట్ల తిరగబడుతున్నవారి సంఖ్య ఇంకా స్వల్పమైనది.
స్త్రీలుగా వారు ఒక మైనారిటీ. ఆ మైనారిటీలో కూడా వారు మొహమ్మదీయులు. మళ్ళీ దానిలో కూడా, వారు బొహ్రాలు. అన్నీ మైనారిటీలే.
            ఈ యథా(పూర్వ)స్థితిని విడగొట్టే దారేది? ప్రభుత్వం UN లో భాగమే మరియు ఇది మానవ హక్కుల గురించిన ఇష్యూ. స్త్రీలు మానసికంగా, భౌతికంగా లైంగికంగా కూడా నష్టపోతున్నారు దీనివల్ల. ఈ ఆచారం త్వరలోనే అంతం అవాల్సిన అవసరం ఉంది.
మెల్లమెల్లగా ఈ ఇష్యూ తక్కువ ట్యాబూగా మారుతోంది.
          బోహ్రా దావూదీ సమాజానికి చెందిన స్త్రీలు ఈ ఆచారాన్నీ, దీనికీ ఇస్లాము మతానికీ ఉన్న సంబంధాన్నీ ఇప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఏక్టివిస్టుల ప్రకారం, ఈ మధ్య అనేకమైన కుటుంబాలు తమ కూతుళ్ళు ఈ ఆచారానికి గురవకుండా జాగ్రత్త పడుతున్నాయి. అయితే, వారు తమ సమాజంనుండి వెలివేయబడుతున్నారు.
ఇప్పుడు, మొట్టమొదటిసారిగా 17 మంది స్త్రీలు ఈ ఆచారం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, చరిత్రని తిరగరాస్తున్నారు. వీరు FGMని బ్యాన్ చేయమని change.org ద్వారా ప్రభుత్వానికి పెటిషన్ పెట్టారు.ఇప్పటికి 42,000 సంతకాలు కూడాయి.
నాలుగు సంవత్సరాల కిందట కూడా వారు ఒక పెటిషన్ వేశారు కానీ అది అప్పుడు చెత్తబుట్టకే పరిమితం అయింది.
హిందూ పత్రికలో పని చేసే మినీ. పి. థామస్ దీని గురించి ఒక షార్టు ఫిల్ము కూడా తీశారు. వీడియో చూడండి.
               ఈ విధమైన ఆచారాల వెనుక మతసంబంధమైన స్వమతబోధనలు మాత్రం ఉంటాయి. ఉదా. ఋతుస్రావ సమయంలో హిందూ స్త్రీలకి గుళ్ళకి వెళ్ళే అనుమతి ఉండదు. క్రిస్టియన్ అమ్మాయిలు గర్భ విచ్చిత్తి చేయించుకోకూడదు. ఎవరూ మతాన్ని కానీ సంప్రదాయాన్ని కానీ ప్రశ్నించకపోవడం వల్ల ఈ సంస్కృతి పెరుగుతూనే ఉంది.
సాంప్రదాయం పేరిటా, మతం పేరిటా స్రీలు చాలాకాలమే హింసకి గురయారు.
సాంప్రదాయాన్ని నరకడం ఇంచుమించు అసంభవమే. యువతుల సున్నిత శరీర భాగాలని నరకడం ఎక్కువ సులభం.

 • – క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

18 comments

 • ప్రసాద్ చరసాల

  ఈ ఆచారం ఆఫ్రికన్ తెగల్లో వుందని తెలుసు గానీ, ఇండియాలో కూడా ఇన్ని వందల ఏళ్ళు ఇది గుట్టు చప్పుడు కాకుండా బోహ్రా తెగలో వుందంటే, ఆచారపు, నమ్మకపు పట్టు ఎంత గట్టిదో అర్థమవుతోంది.

  వున్నత చదువులు గానీ, ఆర్థిక స్థోమత గానీ ఈ పరమ పైశాచిక చేష్టలను ఆపలేకపోతున్నాయంటే మనిషి నమ్మకమే అన్నింటికీ పైన నిలుస్తున్నది.

 • Gautham Kashyap

  మంచి వ్యాసం వ్రాశారు. కనీసం ఈ క్రూరమైన ఆచారాన్ని మహమ్మదీయ మతంలోని ఎక్కువ తెగలు వ్యతిరేకించడం ప్రశంశనీయం. డా. గౌతమ్ కశ్యప్

  • Krishna Veni Chari

   గౌతమ్‍ కశ్యప్‍ గారూ,
   ఈ మధ్యనే వ్యతిరేకించడం ఊపందుకుంటున్నది.
   థేంక్యూ-చదివినందుకూ, కామెంటుకీ కూడా 🙂

 • manasa

  దీని గురించి మొట్టమొదటి సారి విన్నప్పుడు తట్టుకోలేకపోయాను. ఇన్నాళ్ళకి తెలుగులో చదివాను. మనకి తెలియని దుష్ట సంప్రదాయాలు చాలా ఉన్నాయి. ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. త్వరలో ఆ స్త్రీలకి విముక్తి కలగాలని కోరుకుంటున్నా 🙁

 • కిరణ్ కుమార్

  మరో సారి ఇంకో సంఘీక దురాచారం గురించి చక్కటి వివరణాత్మక వ్యాసం అందించారు.

  ఈ సమస్య గురించి కొన్ని రోజుల క్రితం కార్లో దేగ్గర్లోని ఊరికి వెళ్తున్నప్పుడు రేడియోలో ఈ విషయమై ఉద్యమిస్తున్న ఒక ఆక్టివిస్ట్ తో జరిగిన చర్చ విన్నాను. ఇలాంటివి కూడా ఉంటాయా చాలా ఆశ్చర్యం కలిగింది. తరువాత కొంత శోదన చేయగా చాలా విషయాలు తెలిసాయి. కొంత శోధన తరువాత ఈ విషయం గురించి ఇంకా తెలుసుకోవడానికి భయం వేసింది. ఇది చేస్తున్నప్పుడు కలిగే షాక్ వలన చిన్నపిల్లలు మరణించిన సంఘటనలు చాలా ఉన్నాయని తెలిసింది. కాస్త వయసు వచ్చినాకా చేస్తే ఆ పిల్లలు మానసిక క్షొబను అనుభవించి జీవితాంతం మెంటల్ బ్యాలెన్స్ తప్పిన వారు కూడా చాలా మంది ఉన్నారుట. ఇప్పటి వరకు ఈ దురాచారం కేవలం ఆఫ్రికా దేశాలలోనే ఉందని అనుకున్నాను. మీ వ్యాసం వలన ఇది మిగితా దేశాలలో కూడా ఉందని తెలిసింది. భారత్ లో ఇలాంటి ఆచారం ఇంకా ఉందని ఇప్పుడు మీ వ్యాసంతో తెలియటంతో నమ్మలేకున్నాను. ఇలాంటి విషయాలపై మతాలకు అతీతంగా కఠిన చట్టాలు చెయ్యాలి.

  • Krishna Veni Chari

   Kiran Kumar garu,
   true about the mental balance you mentione.
   It is an unforgetful and a medieval practice which leaves its mark throughout the lives of those young girls.
   Thanks a great deal for your encouragement as always.

 • పురుషుల సుంతీ గురించి విన్నాము కాని , స్త్రీలకు కూడా ఇలా చేస్తారని ఎప్పుడూ వినలేదు.ఎంత హేయమైన ఆచారం.

  • Krishna Veni Chari

   అవును మాలగారూ, ఈ మధ్య న్యూస్లో బాగా ప్రచారం చేస్తున్నారు.
   థేంక్యూ

 • Suresh

  పురుషుల విషయం లో సుంతీ అన్నది ఒక విధంగా మంచే చేస్తుంది అని ప్రయోగాలు చెప్తున్నాయి. కానీ, ఆడవారి విషయం వింటుంటే దారుణం అనిపిస్తుంది. ఇటువంటి వ్యాసాలూ రావటం చాలా అవసరం. చాలా మందికి ఇటువంటి ఆచారాలు ఉంటాయని కూడా తెలియదనుకొంటాను.

  • Krishna Veni Chari

   Since it has been on news quite a bit in the recent past, was certain that most were aware. Thank you.

 • Lakshmi Narayana Addagiri

  ఈ ఆచారము అత్యంత హెయకరమైనధి, భాదకరము ,ఈ పోస్ట్ పెట్టినందుకు ధన్యవాదములు…

 • Krishna Veni Chari

  మీరెప్పుడూ అందించే ప్రోత్సాహానికి ధన్యవాదాలు వెంకట్ అద్దంకిగారు.
  ఈ సమస్య గురించి చదువుతూ ఉండాలి కనుక దీని గురించి రాశాను తప్ప నేను దీన్ని కనిపెట్టలేదు.మరొకసారి థేంక్యూ.

 • వనజ తాతినేని

  ఎంత అమానుషం . ఇదివరకు ఇలాంటి విషయం ఎక్కడో విన్నాను కానీ ఇంత వివరంగా ఇప్పుడే తెలుసుకోవడం . అవమానకరంగా కూడా ఉందండీ !
  ఎలాంటి దురాచారాలు ఎప్పుడు పోతాయో ! 🙁 . పై వ్యాఖ్యతో కూడా ఏకీభవిస్తున్నాను .
  థాంక్ యూ కృష్ణ వేణి గారు .

 • Venkata S Addanki

  అత్యంత హేహ్యకరం. దీని వెనుక ఉన్న కారణం ఆరోగ్యపరమైన కారణం కాకపోవడం,పైగా దాస్యశృంఖలాల వల్లే వివాహేతర సంబంధాలను నిరోధించడానికి తీసుకునే జాగ్రత్త అనడం మరింత జుగుప్సాకరం. మొదటిసారి ఈ విధమైన ఆచారం ఆచరణలో ఉన్నదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏది ఏమైనా వారు పెట్టిన పిటీషన్ ని అనుసరించి మత పెద్దలతో చర్చలు జరిపించి ఈ విధమైన కాండని అంతం చేసే విధంగా ప్రభుత్వం, రాజకీయనాయకులు, న్యాయస్ధానాలూ స్పందించాలి. మీరన్నట్లు కారణం లైంగికేచ్ఛను చంపడమే అయితే ఇది మధ్య లేక రాతియుగపు ఆచారమే. దీన్ని అంతమొందించేందుకు నడుంకట్టాలి. ముఖ్యంగా ఆ కమ్యూనిటీకి చెందిన యువతరం ఎదిరించి నిలబడాలి. ఇటువంటి సామాజిక దురాచారాన్ని కేవలం ఒక తెగకు సంబంధించినదే కానివ్వండి బయటకుతీసుకొచ్చి పదిమందికీ తెలియజెయ్యడం అన్నది చాలా ముఖ్యం. మీరు నిజంగా గొప్పవారు, అభినందనీయులు. మీ యొక్క ఈ రచన కొంతమంది ఆ జాతి స్త్రీలని అటువంటి దురాచారాన్ని దూరం చేయగలిగినా మీ యొక్క లక్ష్యం నెరవేరినట్లే. మంచి సమస్యను కూలంకుషంగా శోధించి వివరాలు అందించిన మీకు నా అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)