వెన్నెల రాత్రి ప్రియునికో ప్రేమ లేఖ

ప్రియా,

టి.వి.యస్ .రామానుజరావు

టి.వి.యస్ .రామానుజరావు

నీకు పెద్ద ఉత్తరం రాద్దామని ఇప్పుడే భోజనం చేసి కూర్చున్నాను. నేను తినే తిండిలో మూడొంతులు నీ కొడుకే తినేస్తున్నాడేమో, కడుపులో తంతున్నాడు. వాడేం చేసినా, ముద్దుగానే ఉంది నాకిప్పుడు. సంవత్సరం క్రితం మనం ఇద్దరమే! మరికొన్నాళ్ళలో మూడో మనిషి ప్రవేశిస్తున్నాడు మన ఇంట్లోకి.
స్కైపు, ఫెసుబుక్ వచ్చాక మనిషి ఎదురుగా వుండి మాట్లాడుతున్నట్లున్నా, ఎందుకో ఉత్తరం రాయడంలో తృప్తి, అది అవతలి మనిషి చదువుకుంటే కలిగే ఆనందం నా ఉద్దేశంలో మరింత ఎక్కువ. నీకు నేను ఉత్తరం రాయడం ఇదే మొదటి సారి అనుకుంటాను. అయినా, నువ్వు నేను విడిగా ఉన్నది ఎప్పుడు? ఇప్పుడు ఉత్తరం రాస్తున్నప్పుడు కూడా నువ్వు నా పక్కనే వుండి చదువుతున్నట్లే వుంది సుమా!
నేను పురిటికి మా పుట్టింటికి వెడతానంటే నువ్వు పెట్టిన బుంగ మూతి ఇప్పటికి నాకు గుర్తుంది. మొదటి సారి పురుడు కనుక మా వాళ్ళు ఏడో నెల రాగానే తీసుకువెడదామని మనింటికి వచ్చినప్పుడు నువ్వు వీల్లేదని భీష్మించుకు కూర్చున్నావు. మా నాన్న గారు రెండు రోజులు బ్రతిమలాడితే గానీ నువ్వు వొప్పుకోలేదు. నేను బయల్దేరే రోజు నువ్వు చూసిన చూపుకి నా గుండె కరిగి నీరయ్యింది. ఆ క్షణంలో ప్రయాణం మానేద్దామని ఎంత అనిపించిందో. ఆ మాట అంటే ,మా అమ్మా, నాన్నా కోప్పడుతారని ఆగిపోయాను. ఆ ముందు రోజు రాత్రి
“స్వప్నా, ఇవాళ పౌర్ణమి కదా, అలా చెరువు కట్ట దాకా వెడదాం రా అన్నావు!”
“ఇప్పుడా, చీకటి పడింది,అమ్మ వోద్దంటుంది, పురుగు పుట్రా ఉంటాయని!”
“అలవాటయిన చోటు! ఏం ఉండవులే! అలా వెన్నెల్లో తిరిగి వద్దాం!”
అమ్మ గొణుగుతున్నా వినకుండా నేను నీతో వచ్చాను.
పండు వెన్నెల ప్రపంచమంతా పరుచుకుంటోంది. చంద్రుడు వెండి మబ్బుల రధంపై సాగిపోతున్నాడు. పాలరాయి పరచిన బాటపై నడుస్తూ, అటూ ఇటూ ఆర్చిపై పాకించిన సన్నజాజి తీగలను, మల్లె తీగెలను తప్పిస్తూ, నువ్వు నాకు చెయ్యి అందిస్తుంటే, చుట్టూ అల్లుకున్న ప్రకృతి సోయగాలకు నామనసు పరవశించిపోయింది. అప్పుడు అమ్మ మాట విని నీతో రాకపోతే ఇంత మధుర భావన నాలో నిలిచిపోయేది కాదేమో. ఇంటి ముందు తోటలో సిమెంటు బెంచిపై ఇద్దరం కూర్చున్నాం. మన ఇంటి కాంపౌండులో తోట, అది దాటితే చెరువు కట్ట. రాలిన అగ్నిపూలపై చెట్ల నీడలు దోబూచు లాడుతున్నాయి.
“చూడు, ఈ వెన్నెల ఎంత మనోహరమైందో, పున్నాగ పూల పరిమళానికి మనసు వివశమై పోతోంది.”అన్నావు నువ్వు.
“ అవును, ఈ ప్రపంచాన్ని మనోహరంగా మార్చే శక్తి ఉంది వెన్నెలకే. అది మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం.”
“అవును, ఇంత అందమైన వెన్నెల రాత్రి నీకు ఏమనిపిస్తోంది?” అడిగావు.
“ఈ వెన్నెల రాత్రి ఆకాశంలో వెండి తెరల మధ్య మల్లెపూల రాసులు పోసిన తెల్ల మబ్బుల పరుపుపై, నీ వొడిలో తల పెట్టుకుని పడుకోవాలని ఉంది.”
“మధురమైన ఆలోచన! ఇంకా ఏమనిపిస్తోంది?”అడిగావు.
“ఈ భూమి చుట్టూ టాప్ లేని విమానంపై ప్రయాణం చేసి రావాలని వుంది.”
“ఓహ్! మరింత మధుర భావన! తలచుకుంటేనే మనసు పరవశించి పోతోంది.”
“ఆకులో ఆకునై, పూవులో పూవునై,కొమ్మలో కొమ్మనై,నును లేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా?”నేను కూని రాగం తీశాను.
“అమ్మో వొద్దు! నేను నిన్ను వెతకలేను!”అన్నావు అల్లరిగా.
“ఇప్పుడు నువ్వు ఒక పాట పాడితే బాగుంటుంది.”
అప్పుడు నువ్వు ‘హాయి,హాయిగా ఆమని సాగే’ అంటూ పాట అందుకున్నావు. ఆ చల్లని వాతావరణంలో కమ్మని నీ గానం ప్రవహిస్తుంటే, నేను అరమోడ్పు కన్నులతో పాటలోని మాధుర్యాన్ని ఆనందించాను. చెట్లపై పక్షులు కూడా కిలకిలా రావాలు మాని నిశ్శబ్దంగా నీ పాట విన్నాయి. ఆనందం పట్టలేక నీ పెదాలపై నా వేలితో తాకి నా పెదాలకు రాసుకున్నాను.
“ఇలాగైనా నీ పెదాలపై మధుర రాగాలు నాకు అంటుతాయేమో”అంటుంటే నువ్వు నవ్వావు.
రాత్రి హొయలు వోలకపోస్తూ, వెన్నెల తివాచిపై నడిచిపోతుంటే, ఎక్కడి నుంచో చల్లని పిల్లగాలి ఒకటి మల్లెపూల పరిమళాలు వెదజల్లుతూ నన్ను తాకింది. నేను ఒక్క సారి ఒణికి పోయి నిన్ను చుట్టేశాను. నువ్వు నన్ను దగ్గరకు తీసుకుని, నీ శాలువా నాకు కప్పావు. ఆ క్షణంలో మన పరిచయం గుర్తుకు వచ్చింది. అనుకోకుండా ఒక పెళ్ళిలో మనకు పరిచయం ఏర్పడింది. ఒకే వీధిలో ఉంటున్న మనకు అప్పటి దాకా పరిచయం లేకపోవడం ఆశ్చర్యమే. ఆ నాటి పరిచయం స్నేహంగా మారింది. ఇలాగే ఒక పున్నమినాటి రాత్రి చెరువు దగ్గర నువ్వు పెళ్ళి ప్రపోజల్ తెచ్చావు. నేను ఆనందంగా ఒప్పుకున్నాను. మన ఇద్దర్ని కలిపిన ఈ చెరువు కట్ట అంటే నీకు ఇష్టం. నాకూ ఇష్టమే. అందుకే దగ్గరలో ప్లాటు తీసుకుని, మన అభిరుచికి తగ్గట్టు ఇల్లు కట్టించావు. అప్పటినుంచి ప్రతి పున్నమి రాత్రికి ఇలా చెరువు దగ్గర తోటలో కొంత సమయం గడిపి నిద్రపోవడం అలవాటయ్యింది.
ఆలోచనలో మునిగిపోయిన నా బుగ్గపై నీ పెదాలతో ముద్రలు వేస్తూ,”ఏమిటి, ఆలోచిస్తున్నావు?”అడిగావు.
నేనప్పుడు సిగ్గుపడుతూ చెప్పాను”ఇలాంటి పౌర్ణమి రోజు రాత్రి నువ్వు మన పెళ్లి ప్రపోజల్ తెచ్చావు. ఇలాగే ఆ రోజూ అమృతం కురిసిన రాత్రి.”
“నీలో కవిత్వం పుడుతోందే”అన్నావు నవ్వుతూ.
“ఈ వెన్నెలలో, మన చెరువులో పడవ షికారు చేస్తే ఎంత బాగుంటుందో”అన్నాను.
“పడవలేక పోయినా ఆ పాట పాడుతాను అంటూ ‘పయనించే మన వలపుల బంగారు నావా” అంటూ నువ్వు పాడిన పాటకు నేను “ఆ పాటలో ఏదో ఆర్ద్రత వుంది” అంటూ నిన్ను అల్లుకుపోయాను.
“అవును. ఆ పాటలో ఆర్ద్రతతో పాటు, గొప్ప మాధుర్యం వుంది. ఘంటసాల పాడిన చాలా గొప్ప పాట అది. మనిషికి సంగీతం దేవుడిచ్చిన వరం.నాకు ఒక గొప్ప స్నేహితుడు, తోడూ నీడా కూడా”
“నేను వచ్చాక కూడానా?”నేను చిరుకోపంతో ప్రశ్నించాను.
“అసలైన ప్రేమకు ఈర్ష్యా ద్వేషాలు ఉండకూడదు” అన్నావు నవ్వుతూ.
“అసలు ప్రేమ ఎలా పుడుతుంది? ఆకర్షణ వలనా?”
“ఆకర్షణ వల్ల పుట్టే ప్రేమ బలమైనది కాదు. ఆకర్షణ తగ్గగానే ఆ ప్రేమ కూడా మాయమౌతుంది. అసలైన ప్రేమ జీవితాంతం వుంటుంది.”
“అసలైన ప్రేమ ఎలా పుడుతుంది? సినిమాల్లో లాగా మొదటి పరిచయంతోటే ప్రేమ పుడుతుందా?”అడిగాను.
“అది ఆకర్షణే గానీ,ప్రేమ కాదు. అసలైన ప్రేమ వేరు. ప్రేమికులు తమ వ్యక్తిత్వాలు వేరైనా, మానసికంగా ఏకత్వాన్ని పొందినప్పుడే అసలైన ప్రేమ మొదలు అవుతుంది. ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు కోరుకోవాలి. ఒకరి కోసం మరోకరన్న భావన వుండాలి. అదీ ప్రేమంటే. అది తాత్కాలికం కాదు, జీవితాంతం వుండేది” అంటూ వివరించావు.
“మనిషి సౌందర్యాన్ని కోరుకోవడం తప్పా?”
“తప్పు కాదు. అందంగా ఉండాలనుకోవడం ఆడవారి హక్కు. అందాన్ని ఆరాధించడం దైవత్వం అనుకుంటే, దాన్ని అనుభవించి విసిరేయాలనుకోవడం రాక్షత్వం.”
“ప్రేమకు పరాకాష్ట శృంగారమేనా?”
“అది తప్పు. ఆకర్షణ వల్ల పుట్టిన ప్రేమ శృంగారంతో ముగుస్తుంది. ప్రస్తుతం సమాజంలో రుగ్మతలన్నిటికీ ఆకర్షణను ప్రేమగా ప్రేమించి, శృంగారానికి లొంగిపోవడమే కారణం. భార్యా భర్తలు కూడా మానసికంగా, శారీరకంగా ఒకటై జీవితంలో శృంగారాన్ని అనుభవించి హాయిగా జీవిం చాలి.”
“ఈ నీ ప్రేమ కోసమే కదా ఇన్నాళ్ళు ఆగాను” అన్నాను నీ భుజంపై తల వాల్చి.
“నేను వెతికిందీ నీ లాంటి ప్రేమమయి కావాలనే” అంటూ నువ్వు నీ క్రచేస్ అందుకుని నా క్రచేస్ అందించావు.
ఆ రోజు శశాంక్, నువ్వు నా జీవితంలో వెన్నెల నింపిన రోజు. ఇక్కడికి వచ్చిన దగ్గరనుంచి ప్రతి రోజూ మన మధుర ప్రేమను గుర్తు చేసుకుని గానీ నిద్ర పోను.
ఇంకా ఉత్తరం రాయాలనే ఉంది. అమ్మ “ఆరుబయట చలిలో కూర్చోకు, తొందరగా పడుకో” అంటూ ఇందాకటి నుంచీ పిలుస్తోంది. తనకేం తెలుసు, ఈ వెన్నెల వానలో ప్రియునికో ప్రేమ లేఖ రాయడంలో ఉన్న మాధుర్యం?
నీ దగ్గర నుంచీ ప్రేమ పందిరిని మోసుకొచ్చే ఉత్తర వాహకుడి కోసం ఎదురు చూస్తుంటాను!

                                                                                                   నీ ప్రేమ స్వప్నాల పల్లకి

  • – టి.వి.యస్ .రామానుజరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)