రెండు మూడు రోజులనుంచీ ఇక్కడంతా అల్లరిగా ఉంది. మూకుమ్మడిగా గ్రామాలకు గ్రామాలు అడవిని నరికి పోడు చేసుకోవడానికి బయలుదేరడం, అర్థరాత్రి అపరాత్రి తేడా లేకుండా చెట్లను నరకడం ఆపడానికి మా సిబ్బంది ఆపసోపాలు పడడం నానా భీభత్సంగా గడిచిపోయింది. ప్రపంచమంతా ఒకవైపు చూస్తుంటె మనవాళ్ళంతా ఒకవైపు వొరిగిపోయినట్టు,అడవిని నరికి ఆ భూమిని ముక్కలుముక్కలుగా ఎవరికి తోచిన హద్దులు వాళ్ళు గీసుకొని ప్రభుత్వానికి, రాజ్యాంగబద్ద వ్యవస్థలకు సవాలు విసురుతున్నారు. అమాయకమైన అడవి ప్రాణులు దిక్కూమొక్కూ లేక చెల్లాచెదురయ్యే పరిస్థితి. నిజంగా ఇట్లా ఆక్రమణకు పాల్పడిన భూమికి వారు హక్కుదారులు అవగలరా అంటే చట్టపనరంగా ఎప్పటికీ కాలేరు. మరి ఎందుకని ఇంతటి కల్లోలం సృష్టిస్తున్నారు, వారిని ఇంతకు తెగించేలాచేస్తున్న మూలాలు ఏమిటి అంటే సులభంగా అర్థం చేసుకునేందుకు గత కొంతకాలంగా భూమి లభ్యతతగ్గడం, విలువపెరగడం, చట్టాల అమలులోని లొసుగులు, వీలున్నంతమేర పొందగల అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నంచేస్తే పోయేదేముంది అన్నఆలోచన. వెరసి ఇలాగ యేటికోసారైనా, ఎక్కడో ఒకచోటనైనా ఇటువంటి పరిస్థితులు తప్పడంలేదు. మరి కొంతకాలం ఇది కొనసాగుతుంది. ఎంత నిఖార్సైన అడవిని మిగుల్చుకోగలగితే అంతవరకూ ప్రయత్నం చేయడం మా కర్తవ్యంగా కనిపిస్తుంది.
శరదృతువు ముగిసి హేమంతానికి మారే కాలం దగ్గర పడుతున్నది. గతమాసంలో వానలకు చెదిరిన చెట్లు మళ్ళీ కుదురుకుని మామలౌతున్నాయి. హేమంతంలో అడవినిండుగా రకరకాలపూలతో, ముదురుఆకుపచ్చగా ఉంటుంది. వాతావరణంలో వేడితగ్గి ఉంటుంది కనుక ఎంత నడిచినా అలసట రాదు కాకపోతే త్వరగా చీకటి పడుతుంది. మా విడిది చుట్టూ చీకటితోనూ, చల్లటిగాలితోనూ అడవిలోనేఉన్న భావన కలిగిస్తుంది. విస్తరించిన అడవిలో ఒకమూలగా ఏర్పాటైన కార్యాలయాలు కదా అలా అనిపించడం సహజమే. ఒకవేళ చెట్లు ఇక్కడ లేకపోతే బోసిపోయినట్టు ఉండేదేమో. ఈమధ్య రోజువారీ పనుల్లోపడి ముందరికన్నాత్వరగా విషయాలను మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది. తోడుగా ఎవరూలేకుండా ఉన్నప్పుడుమాత్రం మర్చిపోయినవనుకున్నవి మెరుపులా మెరిసి మాయమవుతున్నాయి. సమస్యలు చుట్టుముట్టడంవల్ల కావచ్చు, మరేదైనా కావచ్చు, అయితే ఒక చిన్నపూలచెట్టు, తాను ఎంత చిన్నదైనా తనచుట్టూ సీతాకోకల్ని వెర్రిగా తిరిగేలా చేసుకుంటున్నది. ఎంతలా అంటే అవి ఆ చిన్ని మొక్కమీద కుప్పలుగా వాలిపోయేలాగా, ఆ చిన్న పూల చెట్టు లేకపోతే మా వసతి మొత్తం చిన్నబోయేదేమో.
ఈమధ్య స్థిమితంగా ఉన్నట్టు అనిపించడం లేదు. కోరినప్పుడు కోరినచోటికి ఉన్నఫళంగా ఎగిరిపోయి సేదతీరే అవకాశం పక్షులకు ఉంటుంది. రెక్కలున్నజీవులుగా పుట్టడం గొప్పప్రకృతి కానుక. కోరిన తావుకు చేరగలగడంకన్నా సంతృప్తి ఏముంటుంది. కొన్నిపక్షులు వలస పోతాయి, ఇతర జీవాలు వలస పోతాయి,మనుషులూ వలసపోతారు. ఇతరజీవులు జీవించడానికో, జీవనచక్రం పూర్తిచేసుకోవడానికో వలస పోతాయి. చాలా సంధర్భాల్లో మనుషుల వలస బతుకుదెరువే. నాగరికత పెరిగినాకొద్దీ సౌకర్యంతమైన జీవితంకోసం మనం పాకులాడతాం. సౌకర్యాలు పొందడమూ అందరికీ సాధ్యంకాదు. వాటిని అందుకోవడం కోసం మోయలేనన్ని బరువులు పెట్టుకున్నాం కదా, బహుశా అప్పుడే మనకుమనం శత్రువు అయిపోయామేమో. సగటుఉద్యోగిగా బతుకుదెరువుకు మనం ఉన్నచోటు కదిలి బయటకువస్తే ఎంతోకొంత సర్ధుబాటు తప్పదుకదా. ఒకమనిషి పశువులను పెంచితే పెంచిన పశువుల్ని మేపడానికి ప్రతిరోజూ పశువుల కాపరికి ఇచ్చి పంపిస్తాడు. అవి అతనితో వెళ్లిపోతాయి, ఆ దినమంతా గడిపేసి తిరిగి ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చిన పశువు యధావిధిగా తన స్థానంలో ఉంటుంది. దాని మెడకి తాడుకట్టకపోయినా అది ఎక్కడికీవెళ్ళదు. అది బుద్ధిగా అక్కడే ఉంటుంది, అయినా సరే యజమాని దాని మెడకు తాడు కడతాడు. అది ఎక్కడికీ వెళ్ళదని తెలిసినా సరే దాని మెడకుతాడు కడతాడు. పశువూ, యజమాని ఇద్దరూ తాడుకు అనుసంధానించబడతారు. ప్రతి ఉదయం తాడు తీయడం ప్రతి సాయంత్రం తాడు తగిలించడం యజమానికి అలవాటైపోతుంది. తాడు వదిలేశాక బయటకు వెళ్లడం,వచ్చాక తాడుకట్టించుకోవడం ఆ పశువుకూ అలవాటైపోతుంది. తాడు లేకపోయినా ఆ ఇద్దరు జీవితాల్లో ఏం మార్పు రాదు అయినా సరే ఒకరినొకరికి బంధించటానికి తాడు అక్కడ మిగిలి ఉంటుంది. యే పనీ అలవాటుగా మారవద్దనీ అంటాడు ఓషో. అలామారడంవల్ల మనసు ఆపనిని ఆస్వాదించడం మానివేస్తుందని ఓషో వివరణ. బతుకుదెరువే అయినా కొన్నాళ్ళకోసమైనా చేసే ఉద్యోగం ఉత్త అలవాటుగా మారకుండా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయేమో. అందుకే యే శాఖలోనూలేనంత అలజడి మా శాఖలో కలుగుతున్నది. అయితే పంజరాన్ని వెతుక్కుంటూ పోయే పక్షులూ ఉంటాయని చేస్తున్నకొలువులూ,అలవాట్లు నిరూపిస్తూ ఉంటాయి.
కరోనామహమ్మారి అదుపులోకి వస్తున్నది అనుకునే సమయంలో మాజిల్లా సిబ్బందిలో ఒక మహిళా అధికారిని కోల్పోయాం. ఇంతకీ ఎటునాగారం రావడానికి, వచ్చిన తర్వాత అనుకున్న లక్ష్యాలలో మొట్టమొదటిది బెట్టుడుతలకు సంబంధించినటువంటి ఆవాసాలు కనిపెట్టడం, వాటి అలవాట్లకు తగిన విధంగా అవకాశాలను పెంపుచేయడం. కొన్ని కొన్ని అవాంతరాలవల్ల అనుకున్న విధంగా ఏ పనీ ముందుకువెళ్లడం జరగలేదు. కొంతలోకొంత నయంగా కాస్త పాతరికార్డులు తిరగవేయడంవేయడంవరకు చేయగలిగాను. పులి కనిపించినతర్వాత పులిమీద ఉన్నటువంటి ఆసక్తి అయితేనేం, పాటించవలసిన నియమాలు అయితేనేం చాలావరకు సమయాన్ని కేటాయించవల్సి వచ్చింది. తదుపరి యధావిధిగా చేయవలసిన పనులు ఉండనే ఉన్నాయి.
ఈరోజున ఐలాపురం ఇంకా మరికొన్ని ఆవాసగ్రామాలవైపు వెళ్ళవలసి ఉంది.ములుగుజిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే సమ్మక్క,సారలమ్మ జాతరకు ఇతర రాష్ట్రాలనుంచీ భక్తులు కాలినడకనవస్తూ ఉంటారు.సరైన రోడ్డు మార్గం లేక, ఉన్నమార్గం వర్షాలకు కొట్టుకుపోయీ, మరికొన్నిసార్లు వాగులు వంకలూ అడ్డువచ్చి ఇబ్బందిపడడం జరుగుతున్నది. అందువల్ల ఉన్నరోడ్డును కొంచం విస్తరిస్తూ ఎక్కువకాలం మన్నేలావేయడమే పనిని ప్రభుత్వం చేపట్టింది. ఇది అభయారణ్యంకనుక అటవీ సంరక్షణ చట్టం -1980 ప్రకారం అన్ని రకాల అనుమతులు తీసుకున్న తరువాతనే పనులు చేయవలసి ఉంటుంది కనుక అనుమతుల విషయంలో ప్రతి స్థాయిలోనూ సరిగ్గా క్షేత్రసందర్శనsచేసి రిపోర్టు చేయవలసి ఉంటుంది. కేంద్రప్రభుత్వం ఈమధ్య ఒకకొత్త సూచన చేసింది. అభయారణ్యాలలో జంతువులు అటూఇటూ తిరుగుతుంటాయి కనుక వాటి చలనానికి ఇబ్బంది కలగకుండా డిజైన్లలో అవసరమైనవిధంగా మార్పులుచేయమని సూచించింది. ఉదాహరణకు ఒకఅటవీ భూభాగం రోడ్డువల్ల రెండుగా విడిపోవలసివస్తే ఊరికే రోడ్డువేయకుండా అవసరమున్నచోట వంతెనలు, టన్నెల్స్ ఏర్పాటు చేయడంవల్ల వన్యప్రాణుల మార్గానికి అవరోధంలేకుండా చేయవచ్చునని ఆలోచన. అనుమతుల విషయంలో జాప్యాన్ని నివారించడానికి ఇదంతా ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుంది. వంతెనలు, రోడ్లువంటి ప్రతిపాదనలతో సంభందిత శాఖలు ముందుకు వచ్చినప్పుడు ఈ పని మొదలవుతుంది. చాలా జాగ్రత్తగా చేయకపోతే ఆయా సంస్థలు, అధికారులు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనవల్సి వస్తుంది.
బయటివెళ్లాడానికిముందు కార్యాలయంలో కొంత పరిశీలిచవల్సిన అంశాలను చూడడంకోసం ఆగవలసి వచ్చింది. కార్యాలయంముందు పెద్దచెట్టు ఒకటి ఉంటుంది. అది దాదాపుగా కార్యాలయానికి గొడుగుపడుతుంది. ముందుకు వంగిన కొన్ని కొమ్మలనీడ మెట్లదాకావస్తుంది. తల్లి, బిడ్డతలమీద ఎండపడకుండా చేయడ్డు పెట్టినట్టు పక్కనున్న చెట్టునీడ విస్తరిస్తుంటుంది. ఆపైన కొంచం దూరంలోనే ప్రహరీ , ప్రహరీ అవతలా మళ్ళీ నాటిన కొత్తచెట్లు ఎదుగుతూ బయట ప్రపంచానికి తెరకడుతుంటాయి. కార్యాలయంఉన్నటువంటి చెట్లమీదకి ఇట్లాగే కొన్ని పక్షులు వస్తూపోతూ ఉంటాయి. వాటిసందడిలో ప్రపంచంవేసిన సవాళ్లను కాసేపైనా మర్చిపోవచ్చు. వాటిదో ప్రపంచం. ఒకసారి కార్యాలయ అవరణలోకి వస్తే ఈ ప్రపంచం మన ప్రపంచం అయిపోతుంది. ఓసారి చిగురించి, విరగపూసి, మరోసారి ఆకులు రాల్చే ఈచెట్టు తానుమారి ఋతువు మారినట్లు గుర్తుచేస్తుంది. అన్నేఫ్రాంక్ తన డైరీలోఇలాగే రాసుకుంది. రెండో ప్రపంచయుద్దకాలంలో నాజీలచేతులకు చిక్కకముందు, రహస్యస్థావరంలో తలదాచుకున్న యూదుకుటుంబపు చిన్నారి అన్నెఫ్రాంక్, తన రహస్యస్థావరంనుంచి బయటకి చూడ్డానికి ఒక బాదంచెట్టులాంటిది (హార్స్ చెస్ట్ నట్ అంటారు ఇంగ్లీషులో) ఉందని, అది బయట ప్రపంచాన్ని కనపడనీయకుండా ఉన్నాకానీ ఋతువుల్ని గమనించే అవకాశం కల్పించిందనీ రాసుకుంది. మా కార్యాలయం ముందున్న చెట్టుగాలికి ఊగినప్పుడల్లా నాలో ఘాఢంగా ఇంకిపోయిన అన్నేఫ్రాంక్ భావాలు కదలాడుతుంటాయి.
తమ జీవితాల్లో ఏర్పడిన అనూహ్య పరిస్థితుల్లో ఆమె తండ్రి జర్మనీ నాజీల చేతులకు చిక్కకుండా ఏర్పాటుచేసుకున్న రహస్య స్థావరంలో ఉండవలసి వచ్చినప్పుడు అన్నేఫ్రాంక్ అన్న పదమూడేళ్ళ కిశోరబాలిక తనడైరీకి కిట్టి అనే పేరు పెట్టుకుని తన మనసులోని భావాలను రాసింది. వారు అజ్ఞాతవాసం గడిపిన కాలంలో ఇరవైఆరు నెలలపాటు (జూన్ 1942 – ఆగష్టు 1944)తన డైరీ కిట్టికి ఉత్తరాలు రాసుకుంది. అలా రాసే క్రమంలో వారి స్థావరానికి బయట చెట్టు ఒకటి ఉందని రాసింది. మంచుకురిసే సమయంలో మెరుస్తున్న మంచుబిందువులను, ఆ చెట్టు కొమ్మల సందులనుంచి ఎగిరిపోతున్న పక్షులను చూసుకున్నది. ఆమెలేఖల్లో పేర్కొన్న చెట్టు వారిని బయట ప్రపంచానికి కనబడకుండా కొమ్మలడ్డుపెట్టి ఉంటుంది. ఆమస్టర్డమ్ నగరపు రెండో ప్రపంచ యుద్దపు వేడిసెగలను ఆపి చల్లనిగాలి వాళ్ళమీదకి విసిరి ఉంటుంది. అయితే విషాదంగా నాజీకాంపులో ముగిసిన ఆ పాప జీవితం,ఆమె ఉత్తరాలు యుద్దానంతరం వెలుగులోకి వచ్చి మానవతావాదులందరినీ కదిలించాయి. ఆ కిశోరబాలిక భావాలకు సాహితీలోకం ఆశ్చర్యపోయింది. అజ్ఞాతవాసంలో వారున్న రసహ్యస్థావరం ప్రసిద్దస్థలంగా మారింది. రహస్యస్థావరంతో పాటుగా అక్కడ ఉన్న చెట్టుకూడా ప్రసిద్ధికెక్కింది. మానవతావాదులు ఆ చెట్టుకు అన్నేఫ్రాంక్ చెట్టుగా నామకరణం చేశారు. అయితే గత దశాబ్దంలో ఆచెట్టు మెల్లిగా శిలీంధ్రాలవల్ల రోగాలబారినపడి, బలహీనపడి ఆగష్టు 2010 లో పెనుగాలికి నేలకూలింది.ఆ చెట్టు నుంచి విత్తనాలు సేకరించి , మొక్కలుగా పెంచి మానవత్వ సజీవ నికేతనాలుగా ప్రసిద్ద స్థలాలలో నాటి భావితారాలకు అవివేకంగా విజ్ఞాన గాయాలను చేసుకోవద్దని సూచనగా నాటారు. అలా నాటిన పదకొండు ప్రసిద్దస్థలాలలో న్యూయార్క్ లో సెప్టెంబర్ 11 న ఉగ్రదాడిలో నేలకూలిన ప్రపంచ వ్యాపార దిగ్గజ సంస్థల స్మృతివనం ఒకటి.
అన్నేఫ్రాంక్ చెట్టును ప్రపంచం గుర్తుపెట్టుకుంది. ఎరిక్ కాట్జ్ (Eric katz), Anne Frank’s Tree, Nature’s confrontation with Technology, domination and the Holocaust అనే పరుతో పుస్తకం వేసి ముందుమాటలో ఇలా అంటాడు “మనం అడవులను కేవలం కలపవనాలుగా భావిస్తే అవి మానవప్రయోజనాలనుమాత్రమే తీర్చగలవు,అదే అడవులను ఉద్యానవనాలుగానో, స్మృతివనాలుగానో చూస్తే అవి మనకు వినోదాన్నిమాత్రమే అందించగలవు, అదే అడవులను సహజ వన్యత్వంగా గుర్తిస్తే బహుశా ప్రకృతి అద్భుతమైన దివ్యత్వానికి ప్రతీకగా ప్రాపంచిక వాస్తవాలనుంచి బయటపడవేసి స్వీయ సాక్షాత్కారాన్నివ్యక్తం చేస్తుంది”.,అని. అతను చెప్పిన మాటానిజమని భావిస్తాను. ఈ భూమిమీద అనంతమైన జీవవైవిధ్యంలో దివ్యత్వం లేనిది ఎక్కడని! ఒకవేళ ఎవరైనా ఆ దివ్యత్వపుపరిమళాన్ని గుర్తించగలగడమంటూ జరిగితే వారు ఎప్పుడూ ఒంటరి కారు, వారు అదే దివ్యత్వం భాగంలో అవుతారు. అప్పుడు కనిపించే భౌతికప్రపంచం తాలూకువేవీ కదిలించలేని మనోస్థితిలో ఉంటారు. ఏదైనా ఒకసమాజం లేదా వ్యక్తులు అంతటి దివ్యస్థితివైపు ప్రయాణించడం సాధ్యమయ్యే పనేనా, చేసే పనులంటే కేవలం బతుకుదెరువో ఆధిపత్యం నిలుపుకోవడమోనా, అందుకోసం దేన్నైనా విచ్చిన్నం చేయవచ్చునా, మానవులు గంపగుత్తగా మొత్తం ప్రకృతిని అజమాయిషీ చేసే స్థాయిని తీసుకోవచ్చునా ? మానవ విధ్వంసాలకు మించి మనల్ని మనం ఉద్దరించుకోలేమా?దేశాలు, ప్రాంతాలు, సమాజాలు కుంచించుపోయినప్పుడల్లా విధ్వంసాలు తప్పవా అన్నట్టుగా కదిలించే వాస్తవాలు కదా ఇవన్నీ.
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అదీ చట్టప్రకారం చేపట్టేదే అయినా కొన్నిసార్లు చెట్లను తొలగించవల్సి వస్తుంది. ఇంతకుమునుపు పెద్దచెట్లను నరికివేయడం తప్ప మార్గం ఉండేదికాదు. అన్నేఫ్రాంక్ చెట్టు విషయంలో చేసినట్టు విత్తనాలు సేకరించి పెంపు చేసుకోవడమేగానీ మరోమార్గం లేకపోయేది.ఇప్పుడు ట్రీ ట్రాన్స్ లొకేషన్ అంటే వృక్ష స్థానంతరీకరణ పద్దతి ప్రాచుర్యంలోకి వస్తున్నది. అరుదైన, విలువైన చెట్లను ప్రత్యేకపద్దతిలో కత్తిరించి వానియొక్క పరిమాణాన్ని సాగమకన్న తగ్గించి పెద్ద పెద్ద ప్రొక్లేయినర్ల సహాయంతో పెకిలించి సరైన వాహనంలో అనుకొన్న చోటకి తరలించి నాటుతున్నారు. వీటి పునరుజ్జీవనానికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఈ పద్దతిలో చెట్లను సంరక్షించడం చాలా ఖర్చుతో కూడుకున్నదీ ఇంకా నిపుణులూ అవసరం. క్షేత్రస్థాయిలో విజయవంతమకావడమనేది ఆయా వృక్షజాతుల స్వభావాన్నిబట్టి ఉంటుంది. ఇప్పుడు రాబోయే ప్రాజెక్టులలో అవసరమున్నచోట చెట్లతరలింపునుకూడా ప్రతిపాదించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రతిపాదనలు అంగీకరించబడితే ఆ పని మొదలౌతుంది.
ముందుగా అనుకున్నట్లుగానే ఎంచుకున్న ప్రాంతాలకు వెళ్లిపోయాము. ఒక్క దారి తప్ప రెండువైపులా అడవే ఉంటుంది. టేకు, నల్లమద్ది, కొడిస మరికొన్ని చెట్లతో కలిసిపోయి ఉంది. అక్కడక్కడా పెద్దపెద్ద ఇప్పచెట్లు. వీరాపూరంలో ఒక మామిడిచెట్టు ఉందనీ ఆచెట్టు మామిడికాయలే పచ్చడకు వాడతారనీ, ఒక యేడు కాస్తే మరో యేడు కాయదనీ, కాయలు కాయని యేట చెట్టు చెప్పిన కాలజ్ఞానంలాగా ఆ యేడు వానలు కురవడం ఎక్కువో తక్కువో ఉంటుందనీ నమ్ముతారనీ అన్నారు. ఈ యేడు కాత లేదట. మా చిన్నప్పుడు ఇలాటి మాటలు వినేవాళ్ళం. చింతచెట్లు బాగా కాస్తే , శీతాఫలాలు బాగా కాస్తే,మామిడికాత బాగావస్తే, వానలు కురవడంలోనూ, ఎండలు కాయడంలోనూ ఎక్కువతక్కువలు అంచనా వేయడం, ఇంకా ఒక జాతిచెట్లు బాగాపంట వస్తే మరో పంట తగ్గడంమో, పెరగడమో ఉంటుందని ఊహించడం తరాలుగా గమనించి చెప్పిన వృక్ష కాలజ్ఞానం. ఆదిమసమాజల్లో పరిశోధనలు నిర్వహనించినవారు కూడా ఈ వృక్షకాలజ్ఞానాలను రాసిపెట్టారు.ఈ పరిశీలనకూడా ఆయా సమాజాల అనుభవ జ్ఞానం.దానివల్ల బహుశా దిగుబడినీ, నిల్వలను నిర్ణయించుకునేవారేమో. మా సిబ్బంది, వీరాపురం మామిడి చెట్టుకాత వచ్చి ఉంటే మనమూ కొన్ని తీసుకునేవాళ్ళమని అనుకున్నారు. ఒక్కచెట్టే అంతమందికి కాతను అందించడం గొప్పవిషయమే. అక్కడక్కడా రెండు,మూడు పెద్దచెట్లు నిట్టనిలువుగా మాడిపోయి కనిపించాయి. అవి పిడుగుపడి కాలిపోయిన చెట్లు. ఒకచెట్టుకైతే ఒకపెద్దకొమ్మ కాలిపోతే మరోవైపు బలహీనంగా చావుబతుకులమీద ఉన్నట్టు ఉంది.
అడవిలో చెట్లమీద పిడుగుపడడం సాధారణమే. కర్ర నిజానికి మంచి విద్యుత్ నిరోధకం. అయితే బతికిఉన్న చెట్లు తొంభైశాతం నీటిని కలిగి ఉంటాయి. నీరు మంచి విద్యుత్ వాహకం కనుక, పిడుగుపాటును ఆకర్శిస్తుంది. అందునా చెట్లు భూమిపై ఎత్తుగా ఉండడమూ కారణమే. బహుశా అందుకేనేమో తాడి చెట్లమీదనే ఎక్కువగా పిడుగులు పడతాయి. పిడుగుపాటుకు నిలువుగా కాలి మసైన చెట్లు ఎన్నోఉన్నాయి. చిక్కని అడవులలో అక్కడక్కడా ఇవి ఎరుక పెట్టినట్టు మసిబారి కనిపిస్తుంటాయి.
అడవులంతటా ఒకేలా ఉండవని, యే ప్రాంతానికి తగినవిధంగా అక్కడి జీవజాలం రూపు దిద్దుకుంటుందనేదీ తెలిసిన విషయమే. అడవులను అధ్యయనం చేయడంకోసం నవీన విజ్ఞానం విభిన్నరకాలుగా వర్గీకరించింది. పురాణాలు ఇచ్చిన అరణ్యాల పేర్లు, వివరణలు వేరు. నవీన అటవీ వర్గీకరణ వేరు.అవి వేరువేరని ఇప్పుడు తెలిసింది. భారతదేశంలోని అడవుల వర్గీకరణను ఛాంపియన్ & సేథ్ అనే ఇద్దరు వర్షపాతాన్ని, ఉష్ణోగ్రతల వైరుధ్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రతిపాదించారు. మనదేశంలో ఇప్పటికీ పాటించే అడవులవర్గీకరణ అదే. చిన్నప్పటి కథల్లో విన్న అడవి లక్షణం అయితే ఒకే ఒక్కటి. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అని. బాగా దట్టమైన అడవులని అనుకునేది కానీ ఆ మాటల అసలు అర్థం ఎవరూ చెప్పలేదు. అటవీశాఖ అధ్యయనాల్లో సాంప్రదాయక విజ్ఞానాన్ని, పలుకుబడులను, ఆదిమ సమాజలనుంచి నేర్చుకోవాల్సిన అటవీవనరుల నిర్వహణ, విషయసేకరణ ప్రాధాన్యతనుగుర్తుచేసే విధంగా ‘శక్తి’శివరామకృష్ణగారి సంపాదకత్వంలో వచ్చిన తెలుగు గిరిజన సాహిత్యం లో చదివినప్పుడు మాత్రమే తెలుసుకోగలిగాను. ఈ పుస్తకంలోవారు గిరిజన సమాజాల నుంచి పాటలు, కథలు, అనుభవాలు ముఖతా విన్నది విన్నట్టుగా సేకరించి గ్రంథస్థం చేశారు. దీన్నికేంద్రసాహిత్యఅకాడెమీ మొన్నీమధ్యనే ప్రచురించింది. పుస్తకంలో వివరించిన ప్రకారం మామిడి, పనసపండ్ల తీపి తినే చీమలు ఆయా చెట్లు లేకపోతే అక్కడ ఉండవు కనుక అవి చీమలు దూరని చిట్టడవులనీ, జముడుకాకులు బాగా ఉండే అడవుల్లోకి మన ఊరకాకులు వెళ్ళావు కనుక కాకులు దూరని కారడవులు అంటారనీ చెప్పారు. ఇంకా ఇదివరకు అసలు వినని పలుకుబడులు, పులులు దూరని పుల్లటడవులంటే కంప ఎక్కువుండే అడవులు,పాములుదూరని పేపటడవులు అంటే పేకబెత్తం (Cane) పొదలుండె అడవులు,గద్దలు దూరని గిద్దటడవులు అంటే గుడ్లగూబలుండే అడవులని పేర్కొనడం కొత్త విషయాలను నేర్పింది. బహుశా ఇలా నేర్చుకోవాలేమో అనిపించేలా ఎన్నో సంప్రదాయాలను, ఆనువశింకాంశాలను క్రోడీకరించి అందించారిందులో. ఈ పుస్తకంలో మరో విషయమూ తెలిసింది, అదేమంటే బెట్టుడుతల వేట. ఈ అంశం కోసమే నేను చాలా పుస్తకాలు పరిశీలించాను. ఏటూరునాగారంలో పరిచయమైన కొందరిని అడిగాను. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే ఆ వివరాలని మాకు తెలిస్తే కేసులు వేస్తామనే భయం. మనకై మనం పరిశోధించాలంటే అనేక అడ్డంకులు. ఈపుస్తకంలో కొందరు గిరిజనులు వేటకు వెళ్ళిన సంధర్భం పేర్కొంటూ బెట్టుడుతను పట్టుకోవడానికి చెట్టుకొమ్మల్ని నరకడం, అది చెట్టుతొర్రలో దూరినప్పుడు చేతికి గుడ్డ చుట్టుకొని బయటకు లాగడం,పట్టుకోవడం తదుపరి భోంచేయడం. ఇలాగ ఒక వివరణ అంటూ లేకపోతే ధృవీకరించలేము కదా.
ఇప్పుడు ఏటూరునగరం అడవులు,అక్రమ నరుకుళ్లకు పోయిన చెట్లు పోగా చీమలు దూరని చిట్టడవులు మాత్రమే. గట్టిగా చెట్లున్నచోట నిట్టనిలువుగా నిలిచిన మొసలి చర్మపు నల్లమద్దులు, మరికొన్ని జాతులు. సర్వాయికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్దతీగలు, వాటి ఆధారమే రెండుచేతుల్లోకి వచ్చేంత ధృఢంగా దారురూపం దాల్చినవి కొన్నింటిని చూడగలిగాను. వేపచెట్ల మీద బదనికలు అవే పరాన్నజీవులుగా ఉండే కొన్నిమొక్కలూ చూశాను. ఇటువంటి చిట్టడవులు పక్షులవైవిధ్యానికి బాగుంటాయి. టేకువనాలు అదృశ్యం అయ్యాక మిశ్రమజాతులు విస్తరిస్తున్న అడవులివి. కాబట్టి ముందుకన్నా ఎక్కువ వైవిధ్యం కలిగిన పక్షిజాతులు లభించే అవకాశం ఉంది. పక్షుల వివరాలు సేకరించడంకొరకు ప్రత్యేక సంస్థలు ఉంటాయి. మనకున్న ఆర్థికవనరులనుబట్టి తగిన అనుమతులతో వారి సహాయం తీసుకొని తెలుసుకోవచ్చు. అది అవసరం కూడా. ఆయా అడవుల ప్రశస్త్యాన్ని ఇనుమడింప చేసేంత గొప్ప వివరంగా మిగిలిపోతుంది. కొన్నిసార్లు అదెంతటి విలువైనదీ.అరుదైనదీ అవుతుందంటే కలివికోడి అనే పక్షి కోసం ప్రపంచం అంతా ఎదురుచూసినట్టు ఉంటుంది.
ఒకపుడు థామస్ జర్దాన్ ( Thomus C Jerdon )అనే ఒక బ్రిటిష్ సైనికఅధికారి ఉండేవాడు. అతను బ్రిటిష్పరిపాలనాకాలంలో మిలిటరీవైద్యుడు. నెల్లూరువైద్యశాలలో సర్జన్గా నియమితులయ్యాక అక్కడి యానాదులద్వారా స్థానిక జీవజాతుల గురించి తెలుసుకునేవాడు. స్వతహాగా జీవజాలంపట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు కనుక అవన్నీ ఆయన పరిశీలనలో భాగం అయ్యాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇట్లా ఆయా ప్రాంతాల జీవజాలంవివరాలు సేకరించి పుస్తకాలు వేశాడు. బర్డ్స్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పక్షులకు సంభంధించిన విలువైన సేవను మనకు అందించాడు.అది 1862లో వేసిన పుస్తకం.నాటి భారతదేశం మొత్తం పక్షిజాతులవివరాలు క్రోడీకరించిన పుస్తకమది. ఆయన ప్రస్తుత కడపజిల్లాలో మొదటిసారి కలివికోడిని గుర్తించాడు. అంటే అప్పటికి మనకు పక్షి తెలియదని కాదు, వివిధ జాతుల నమోదులో కొత్తగా చేరిందని అర్థం. జర్దాన్ తెలుగులో ఈ పక్షిపేరు అడవి వూట తిత్తి అని పేర్కొన్నాడు, బహుశా ఈపేరును నాటి యానాదుల వాడుకలో ఉండెనేమో. ఇతని మరో గొప్ప పని, తమిళనాడులో ఉన్నప్పుడు తిరుచినాపల్లిలోని స్థానిక చిత్రకారుల సహాయంతో తాను సేకరించిన పక్షుల బొమ్మలు వేయించడం. అది Illustrations of Indian Ornithology పేరుతో పుస్తకం వేయడం. జర్దాన్ మొదటిసారి 1848లో కలివికోడి ఒకటి ఉందని చెప్తే మరలా 1900లో హోవార్డ్ క్యాంబెల్ అనే మరో బ్రిటిష్ అధికారి తానా పక్షిని చూశానని చెప్పడం ఆ తర్వాత మరో ఎనభైయేళ్లు యే పరిశోధకులకు దొరక్కపోవడం వల్ల అందరూ ఆ పక్షిని అంతరించిపోయిందని అనుకున్నారు. మనదేశపు పక్షిశాస్త్ర పితామహుడు సలీంఅలీ కలివికోడిని మరలా గుర్తించడంకోసం కొన్నిఫోటోలను స్థానికులకు అందేలా చేసి ఒక వేళ ఆపక్షి కనబడితే తెలియజేయాలని సూచించాడు. ఒకనాడు 1986లో ఒక ఐతన్న అనే గొర్రెలకాపరి కలివికోడిని గమనించి పట్టుకొని ఇంటికి తెచ్చి వెంటనే అటవీశాఖను సంప్రదించడం, అటవీశాఖ సలీంఅలీకి తెలియజేయడం వారు వెంటనే ఐతన్నను కలుసుకోవడం జరిగింది. అయితే అప్పటికి వారం రోజులుగా తిండి నీళ్ళు ముట్టని ఆ కలివికోడి ప్రాణాలు విడిచింది. పక్షిమరణం అందరిని నిరాశకు గురిచేసినా ఆ పక్షి అంతరించి పోలేదనీ ఇంకా ఉనికిలోనే ఉన్నదని నిరూపన మాత్రం మిగిలింది. చనిపొయినపక్షిని టాక్సీడెర్మీ ద్వారా సంరక్షించి భద్రపరిచారు. 1848నుంచి 1986లోవరకు మిగిలిన ఒకేఒక్క సాక్ష్యమది. అప్పుడప్పుడు కలివికోడి కనిపించిందని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాని ఆన వాళ్ళు గుర్తించడం మన సంరక్షణ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయనే భావించాలి.
ప్రస్తుతం కలివికోడి ఉంటుందని భావించిన ప్రాంతాన్నిలంకమల్లేశ్వర అభయారణ్యంగా ప్రకటించి సంరక్షిస్తున్నారు., భవిష్యత్తులో మళ్ళీ కనిపించాలన్న ఆశతో.ఈ సంఘటన ఒక్కటి సరిపోదా మన వనరులెంత విలువైనవో తెలుసుకోవడానికి. అందుబాటులో ఉన్నదేన్నైనా మన భవిష్యత్తు తరాలకోసం అందుబాటులో ఉంచడం ఎంత ముఖ్యమో తెలియజేసే విషయాలివి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, కలివికోడి అని ఎందుకన్నారంటే అది ఉండేది కలివిపొదల్లో. నిశాచర పక్షి, సరిగ్గా ఎగరలేదు. కలివిపొదలు ముళ్లుండె చిన్నపొదలు. కలివిపొదలు తప్పితే ఈపక్షి బతకడం ఇబ్బందేనని అందువల్ల కలివిపొదలను రక్షించడమూ అవసరమేనని గుర్తించి వాటిని సంరక్షిస్తున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టే సమయంలో కలివిపొదలున్న భూభాగం ధ్వంసం అవుతుందన్న కారణంగా కాలువ వెళ్ళే మార్గాన్ని పునః సమీక్షించారు. ఈ కేసు సుప్రీంకోర్టుదాకా వెళ్ళింది.ఆవాసాల విధ్వంసం నుంచి మమ్మల్ని రక్షించండి అని సరిగా ఎగరడమూ రాని పిడికెడు పిట్ట గొంతెత్తి లోకానికి మొరపెట్టుకున్నట్టు జరిగిందది. అంతపెద్ద తెలుగుగంగ ప్రాజెక్టు మార్గాన్ని మళ్లించగలిగింది.ఇది కలివికోడి సాధించిన విజయం. మన అడవులపట్ల మనకు తెలియవలసిన కనీస వివరాలను ఎప్పటికప్పుడు సమకాలీనంగా సరిచూసుకోవడం అవసరమని తెలియజేసే సందర్భాలివి. అడవిని పెనవేసుకున్న అపురూప జీవితాలివి. సున్నితమైన, అమూల్యమైన జీవ వనరులకు నష్టం కలగకుండా యే ప్రాజెక్టునైనా చేపట్టడం ఎంతో ముఖ్యమైన అంశమని రుజువు చేస్తాయి. ఇంత తెలిశాక ఒక్కో మొక్కా చెట్టూ, పిట్టను చూడకుండా ముందుకు వెళ్లలేను. అయితే సమకాలీన జీవజాలపు వివరాలు సేకరించడంలో వెనుకబడ్డామని ఒప్పుకోవాల్సి వస్తుంది.
మా బృందం అంతా రోడ్డు ప్రాజెక్టుకోసం ఎంచుకున్న స్థలం పరిశీలించి యే యే చెట్లు తీయవల్సి వస్తుందో జాబితా రూపొందించే పనిలో పడింది. జాబితాలో చెట్టు శాస్త్రీయ నామం, స్థానిక నామం, ఎత్తు, చుట్టుకొలత అది ఉన్న స్థానం వంటి వివరాలుంటాయి. వీటిని మదించి విలువను లెక్కించడం జరుగుతుంది. రెండు మూడు దశలలో వివరాలను సరిచేసుకోవడం ఉంటుంది. మరోవైపు పనులు త్వరగా పూర్తిచేయాలనే ఒత్తిడి ఉండనే ఉంటుంది. సాధ్యమైనంతమేర చీకటిపడేవరకు సంబంధిత సిబ్బంది ఇవాళ ఈ పనిలోనే ఉంటారు. మేము కొన్నిచెట్లను పరిశీలించి తుపాకుల గూడెం వైపు వెళ్లిపోయాము. తుపాకుల గూడెంలో ఛత్తీస్గడ్ , తెలంగాణ సరిహద్దులను కలుపుతూ పెద్ద వంతెనను కడుతున్నారు. ప్రాజెక్టు అనుమతులు పొందినప్పుడు కొన్ని చెట్లను తరలించడం సూచించారు. ఆ పనీ ఒకసారి చూసుకొని వెళ్దామని మధ్యాహ్నం తరువాత వచ్చాము. చిన్నచిన్న గూడేలు దాటుకుంటూ తుపాకులగూడెం చేరుకునే సరికి మధ్యాహ్నం మూడైంది. ప్రాజెక్టు అధికారులు సాదరంగా ఆహ్వానించి ఎలా కడుతున్నారో, వారి పనులు ఏమిటో ఒక్కొక్కటి చూపించారు. త్వరలోనే ప్రాజెక్టును అందుబాటులోకి తేగలమని ఆశావాహకంగా ఉన్నట్టు చెప్పారు. అక్కడ వేలాది మంది పనిచేస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఎంత క్లిష్టమైనదో అనిపించింది. తేడా వస్తే అది చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. నిర్మానుష్య మైన ఈ అడవిలో ఒకానొకప్పుడు తుపాకుల మోత మోగింది. నక్సలిజం బాగా వేళ్లూనుకున్న దశలో ఇక్కడి గూడేలలో తుపాకులను దాచేవారని అందువల్ల గూడేనికి తుపాకుల గూడెం అన్న పేరు వాడుకలోకి వచ్చిందని మాట. ఇప్పుడు తుపాకుల మోత తగ్గినా పేరు మాత్రం అట్లాగే ఉండిపోయింది. చీకటిపడేదాక అక్కడే ఉన్నాము. అందుబాటులో ఉన్నవన్నీ చూసే ప్రయత్నం చేశాము. తిరిగి వెళ్ళేటప్పటికి చుక్కలు పొడుస్తున్నాయి.
పాకాలలోనూ, వరంగల్ పల్లెల్లోనూ ఎదురుపడ్డట్టు సాయంసంధ్యలో ఇంటికివస్తున్న బలిష్టమైన పశువులు ఎదురుపడలేదు.ఇంతకుముందు చూసిన ఇక్కడి పశువులు ఆకారంలోనూ, శరీరధృడత్వంలోనూ చిన్నవి. గూడెల్లో గొర్రెలకన్నా మేకలు ఎక్కువ చూశాను. గొర్రెలు భూమి మీద , మేకలు కొమ్మల మీద ఆధారపడి బతుకుతాయి. అడవిలో పొదలు,చెట్లు, గడ్డి తక్కువ కనుక చెట్ల మీదనే బతికే మేకలు పెంచుతారేమో. చిన్నచిన్న గుడిసెలు సన్నని రోడ్లు, మధ్యలో ఎక్కడా తినడానికి ఏమీ దొరకదు. చల్లగాలికి ఆకలివేయలేదుగానీ కోయగూడేల వంటల రుచి మనకెట్లా దొరికేది అనుకున్నాను. సాంస్కృతిక ఏకీకరణ దిశగా ప్రపంచం పరుగెత్తుతుండగా కోయలూ మారుతున్నారు. చైనీస్ నూడుల్స్,పెప్సీ, కోలా వంటివి పల్లెలను చుట్టుముట్టి చాలా కాలమే అయింది. అక్కడక్కడా వీటిని అమ్మే చిన్నపాటి దుకాణాలు వెలశాయి. మేమెక్కడికి వెళ్ళినా మార్కెట్లో ఉన్న మంచి నీళ్ళ సీసాలు కొని ఇవ్వడానికి పల్లె ప్రజలూ సిద్దపడ్డం గమనించాను. మన వనరులపట్ల ఉదాసీనత కొట్టొచ్చినట్టు కనిపించే విషయమది. ఇంటికైతే చేరుకున్నాము. చుక్కలు తేట పడ్డాయి. విడిదిలో ఒక్కదాన్నే ఉంటాను కనుక నాకే ఆరాటమూ లేదు. నేను వెళ్ళేటప్పటికి నా ఇంట్లో ఉన్న బల్ల మీద సుధీర్ కోదాటి గారు సూచించిన Around the world in Eighty Trees పుస్తకం ఎదురుచూస్తుంది. సుధీర్ గారు కెనడాలో స్థిరపడిన తెలంగాణవారు. రూరల్ లైబ్రరి ఫౌండేషన్ పేరుతో గ్రామీణ పాఠశాలల్లో మంచి పుస్తకాలను, పత్రికలను అందించే ఉద్ధేశ్యంతో విద్యావంతులైన ఔత్సా హికులు ఏర్పాటు చేసుకున్న సంస్థ ద్వారా గ్రామీణ విద్యార్థులకు విద్యా సౌకర్యాలు మెరిగుపరిచే పనిలో నిమగ్నమయ్యారు. మాటల్లో ఒకసారి జొనాథన్ డ్రోరి రాసిన Around the world in Eighty Trees సూచించారు. పుస్తకం ఈమధ్యే నన్ను చేరుకుంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కొన్ని చెట్లను వివిధ దేశాల వారీగా వివరించే ప్రయత్నం చేసన పుస్తకమది.కొన్ని చదివాను, మరికొన్ని చదవాల్సి ఉంది. ఈ పుస్తకంలోనూ అన్నేఫ్రాంక్ చెట్టు ప్రస్తావన వస్తుంది. మన దేశంనుంచి పేర్కొన్న చెట్లు తక్కువే. జొనాథన్ మనదేశం నుంచి జీడిమామిడి, మర్రి, వక్క,వేప, రావి చెట్లను పేర్కొన్నాడు. జొనాథన్ దృష్టి కోణం యేదైనప్పటికి మనదేశం నుంచి టేకు చెట్టు లేకపోవడం లోపమే. ఎందుకంటే బహుశా ప్రపంచంలో ఆర్థిక వనరులను ఉత్పత్తి చేయడంలోనూ, వన విధ్వంసాన్ని చవిచూసిన వృక్షంగానూ ఆఖరికి బ్రిటిష్ ఇండియాలో బర్మాలో బ్రిటిష్ అధికార వ్యాప్తికి మూలమైన చెట్టు, స్వదేశీ సంస్థానాల్లో తిరుబాట్లకు కారణమైన చెట్టు జొనాథన్ దృషికి రాలేకపోయింది. జొనాథన్ ఈ పుస్తక పరిచయ వాక్యాల్లోనే డంబ్ కేన్ (Dumb cane-Dieffenbachia) గురించి తెలియయజేసి విస్మయం కలిగించాడు. డంబ్ కేన్ మొక్క స్రావాలు గొంతు పనిచేయకుండా చేయగలవు. ఒకనాటి అమెరికాలో బానిస వ్యాపారం బాగా నడిచిన రోజుల్లో బానిసల గొంతు పెగలకుండా చేయడానికి వాడే వాళ్ళంట. ఎంత విషాదం , ఎంత విషాదం ! తోటిమానవుణ్ణి మూగవాణ్ని చేయడానికి తన తెలివితేటల్ని వాడారు కొందరు. ఇలాంటివె మరెన్నో కథలవంటి వాస్తవాలు ప్రతీ దేశపు చరితలోనూ ముడిపడిఉన్నాయి. అవి వెలికే తెచ్చే ప్రయత్తం చేశాడు జొనాథన్. కొత్తతరం తెలుసుకోవాల్సిన విషయాలే ఇవి.
ఇవాళ ఉదయంనుంచి పొద్దుపోయేదాకా బయటే గడిచింది. పొద్దున్నుంచి తలుపులు మూసే ఉండడం వల్ల బయటకన్నా ఇంటి లోపల వేడి ఎక్కువైంది. గదిలో ఉన్న కిటికీ తెరచి బయటకు చూస్తే ఉదయం అంతా సీతాకోకలతో నిండిన చిన్నిపూల మొక్క ఆకులు ముకుళించుకొని నిద్రకు ఉపక్రమిస్తున్నట్టు కనిపించింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ మొక్క చుట్టూ తిరిగే సీతాకోకల అల్లరిమామలుది కాదు.నీలోని సమస్త ప్రేమను, దయను పంచుకోవడానికి ఎవరూ లేకపోవడం అసలైన పేదరికం. ఆ చిన్న పూలమొక్క పేదరాలు కాదు. ఉదయనికల్లా తనలోని శక్తిని తేనేగా మార్చి చిట్టి చిట్టి సీతాకోకల ఆకలి తీర్చే దయగల తల్లి, దయామయి. నాకిప్పుడు గురువు.
-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~