జ్ఞాపకాలు – 1- నా ఇంటర్మీడియట్ చదువు – కె. వరలక్ష్మి

కె.వరలక్ష్మి

అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది .

స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది . స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక . మాధ్యమిక చదవకుండానే డైరెక్టుగా రాష్ట్ర భాషకు అటెండై పాసయ్యాను . అప్పటికి హిందీ అక్కయ్యగారు ట్యూషన్స్ మానేసారని గుర్తు . నేను సొంతంగానే చదువుకునే దాన్ని . రాజమండ్రిలో పుష్కరాల రేవు పక్కనున్న రాణీ మహల్లో గర్ల్స్ హైస్కూల్ ఉండేది . హిందీ పరీక్షలు అక్కడ జరుగుతూండేవి . ఆరు నెలల కొక పరీక్ష కావడం వలన ప్రవీణ వరకూ రాసేసాను .
నాకు పై చదువులకు వెళ్లాలని ఉండేది . స్కూలు బాధ్యత ఓ పక్క , పిల్లలు ముగ్గురూ చిన్న వాళ్ళు కావడం వలన కాలేజ్ కి వెళ్లే అవకాశం లేదు . ప్రైవేటుగానే చదవాలి . అప్పటికి ఒక్క సంవత్సరం పి .యు .సి తీసేసి రెండేళ్ల ఇంటర్మీడియట్ పెట్టేరు కాలేజె స్ లో . హైస్కూల్స్ లో 11 వ తరగతి తీసేసారు . చదువుకోవాలనైతే ఉంది కాని , ఎలా ప్రొసిడవ్వాలో తెలీదు . నా జీవిత సహచరుడు మోహన్ కి ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది .

ఆరోజు వేణుగోపాల స్వామి గుడి ముందున్న గ్రంధాలయానికి వెళ్లి వస్తున్నాను .దారిలో వెంకట్రావు మాస్టారి ట్యూషన్ సెంటర్ ముందు బోలెడన్ని చెప్పుల జతలు కన్పించాయి . నా బుర్రలో ఒక బల్బు వెలిగింది . అది ఒక చిన్న కుటీరంలాంటిది . అప్పుడెప్పుడో నా ఫ్రెండ్ మీనాక్షి వెంట ఒకే ఒక్క సారి వెళ్లేను . సంశయిస్తూనే లోపలికి అడుగు పెట్టేను . విషయం విని మాస్టారు “ వీళ్లంతా ఇంటర్మీడియట్ కి వెళ్తున్న వాళ్లే . ఈ సంవత్సరానికి ఫీజు కట్టే టైం అయిపోయింది “ అన్నారు . అంతలో ఓ అబ్బాయి “ లేదు మాస్టారూ . ఫైన్ తో కట్టడానికి ఇంకా రెండు రోజుల టైముంది “ అన్నాడు . అంతే , నేను అప్పటికప్పుడు మాస్టారి దగ్గరున్న అప్లికేషన్ ఫాం ఫిలప్ చేసేసి , ఫీజు కట్టేసాను . ఇంటర్మీడియట్ రెండేళ్ళూ కలిపి ఒకేసారి పరీక్షలు రాసే అవకాశముంది .”కాని , పరీక్షలు మూడు నెలలు కూడా లేవు . చదవాల్సిన సబ్జెక్ట్ వరకూ నేనివ్వగలను . స్కూలు , బాధ్యతల మధ్య నువ్వు చదవగలవా ? “ అన్నారు మాస్టారు .

“తప్పకుండా చదవగలను మాస్టారూ , కాని నేను వీళ్లందరిలాగా రోజూ ట్యూషన్ కి రాలేను . ఆదివారం మాత్రం రాగలను , మిగతా రోజుల్లో ఇంటి దగ్గరే చదువుకుంటాను “ అన్నాను .

“అయ్యో , అలా అయితే ఎలా ? “ అన్నారు మాస్టారు .

“ నేను రాసుకున్న నోట్సులూ అవీ ఇస్తాలెండి “ అన్నాడు అయ్యరుగారబ్బాయి గొట్టి . అప్పటికప్పుడు ఓ నోట్ బుక్ ఇచ్చేసాడు . ముత్యాల్లాంటి అక్షరాల్తో నీట్ గా రాసుకున్నాడు .

ఈ గొట్టి (వెంకటేశ్వర్రావు) మా పెద్ద తమ్ముడి క్లాస్ మేట్ . చిన్నప్పుడు తరచుగా మా ఇంటికొచ్చేవాడు. మా తమ్ముడు , చెల్లి , గొట్టి కలిసి స్కూల్ ఫంక్షన్స్ లో బుర్ర కథ చెప్పేవారు . చిన్నప్పుడంతా సుశీల గొంతులాగా ఉండేది వాడి గొంతు . అద్భుతంగా పాడేవాడు . మంచి చురుకైనవాడు .

“టైమెంతో లేదు కాబట్టి మీరు మళ్ళీ రాసుకోవడం పెట్టుకోకండి . టెక్ట్స్ లూ , నోట్సులూ అన్నీ నేనిస్తాను . మీరు చదువుకుని ఇస్తూ ఉండండి “ అన్నాడు . అలాగే ఇచ్చేవాడు .

ప్రతీ ఆదివారం మాస్టారు టెస్ట్ పెట్టేవారు . పదేళ్ల గేప్ తర్వాత చదువంటూ మొదలు పెట్టింది . ఎలా చదువుతుందో అనే సంశయం ఉండేది మాస్టారికి . నేను చకచకా ఆన్సరు చెయ్యడం చూసి తృప్తి పడ్డారు .

మిగిలిన అందరూ ఎక్కడెక్కడో పరీక్షలు రాసారు . నాకు మాత్రం రాజమండ్రిలో కందుకూరి రాజ్యలక్ష్మి విమెన్స్ కాలేజ్ సెంటర్ వచ్చింది . మొదటి రోజు హాల్ టెకెట్ కోసం వెళ్లినప్పుడు మోహన్ సిగరెట్ కాలుస్తూ ఆఫీస్ రూంలోకి రావడం చూసి తనని బైటికి పంపించేసారు . నేను కొంత అవమానం ఫీలయ్యేను . ఇరవై తొమ్మిదేళ్ల ఆ వయసుకే అతనికి విపరీతమైన స్మోకింగ్ హేబిట్ ఉండేది . చెప్పినా వినేవాడు కాదు . గుడ్డిలో మెల్ల ఏంటంటే ఇంట్లో గదుల్లో కాల్చొద్దు అని చెప్తే వినేవాడు . బైటికెళ్లి కాల్చుకునేవాడు.

మోహన్ కి నేను ఇంటర్ పాసవ్వలేనని ఓ గట్టిధీమా . ఇదేవైనా హైస్కూలు చదువు అనుకున్నావా అని ఎద్దేవా చేసేవాడు . నాక్కూడా లోపల ఒక భయమేదో ఉండేది . “రెండు సంవత్సరాల సబ్జెక్ట్ ని మూడు నెలల్లో చదివి పాసవ్వగలవా” అని . మోహన అప్పటికి ఏలేశ్వరం హైస్కూల్లో చేస్తూండేవాడు . తెల్లవారు ఝామునే లేచి వంట చేసి అతనికి కేరేజ్ ఇచ్చి , పిల్లల్నీ ఇంటినీ చక్కదిద్దుకుంటూ , స్కూల్లో టీచింగ్ ఓ పక్క , ఆఫీస్ వర్క్ మరో పక్క చేస్తూ , రాత్రి పిల్లల్ని నిద్రపుచ్చి నేను పుస్తకం చేతిలోకి తీసుకునే సరికి తొమ్మిదో , పదో అయ్యేది . నాలుగు పేజీలు చదివే సరికి నిద్ర ముంచుకొచ్చేది. తీరా రిజల్ట్స్ వచ్చేక చూస్తే నేనూ , కాలేజ్ లో చదువుతున్న కోమట్ల అబ్బాయి కొత్త నాగేశ్వర్రావు మాత్రమే పాసయ్యాం . నాకోసం నోట్స్ రాసి , టెక్ట్స్ పుస్తకాలు తెచ్చి ఇచ్చిన గొట్టి ఫెయిలయ్యాడు .

నేను చదివేసిన పుస్తకాలు పట్టుకెళ్ళడానికీ . కొత్త పుస్తకాలు ఇవ్వడానికీ ఆ అబ్బాయి తరచుగా మా ఇంటికి వచ్చేవాడు . తెల్లగా సన్నగా పొట్టిగా కాటుకదిద్దినట్టుండే కళ్ళతో టెన్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయిలా ఉండేవాడు . చిన్నప్పటి అతని పాట గుర్తుకొచ్చి ఓసారి ఏదైనా పాడమని అడిగితే జయభేరి లోని ఘంటశాల గారి పాటొకటి అద్భుతంగా పాడేడు . మేమున్న ఇంటికి పెద్ద వాకిలి ఉండేది . అక్కడ కూర్చుని పాడి వెళ్లేవాడు . అతను దేనికైనా నవ్వితే ముందు అతని కళ్ళు నవ్వుతో విచ్చుకునేవి . పన్నుమీద పన్ను తళుక్కున మెరిసేది . అతను హైస్కూల్లో మోహన్ దగ్గర చదువుకోవడం వలన మాపట్ల చాలా గౌరవంగా మసలేవాడు . అతని పాటల వల్ల నాకేమో అతని పట్ల ఒక సుహృద్భావం ఉండేది .

అప్పటికి జగ్గంపేట ఊరు చాలా చిన్నది . ట్యూషన్ లో నో , రోడ్డు మీదో పుస్తకాలు ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియ జనానికి వింతగా కన్పించింది . ఆ అబ్బాయికీ నాకూ ఒక అక్రమ సంబంధాన్ని అంటగట్టేసారు . అది తెలిసి పరీక్షల తర్వాత అతను కన్పించడం మానేసాడు . అనుకోకుండా ఎక్కడైనా ఎదురుపడితే నవ్వీ నవ్వనట్టు కళ్లతోనే నవ్వి తప్పుకోనేవాడు . గాయకుడిగా ఎంతో ఎదగాల్సిన వాడు ఈ పల్లెటూరి వాతావరణంలో హోటల్ , అక్కడికొచ్చే రకరకాల జనాలతో స్నేహాల వల్ల వెనకబడిపోయి , పదేళ్ల క్రితం అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లేడు .

మళ్ళీ వెనక్కెళ్తే అంత తేలికగా ఇంటర్మీడియట్ పాస్ కావడం నాలో ధైర్యాన్ని నింపింది . చదువును కొనసాగించే ఆసక్తి పెరిగింది . వెంటనే డిగ్రీ చదవడానికి ఫీజు కట్టేసాను . సైన్సెస్ తో చదవాలని ఉన్నా ఇంట్లో నుంచి అది వీలు పడదు కాబట్టి స్పెషల్ తెలుగు , హిస్టరీ , సోషియాలజీ తీసుకున్నాను .

హాల్ టికెట్ కోసం వెళ్లినప్పుడు రాజమండ్రి విమెన్స్ కాలేజ్ ఇంటర్మీడియేట్ క్లాసులో సౌందర్యానికి మారుపేరు అన్నట్టున్న ఒక అమ్మాయిని చూసేను . అప్పటికి విమెన్స్ కాలేజ్ తాటాకు షెడ్లలో ఉండేది . బెంచికి ఈ చివర పొడవైన జడతో ఉన్న అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయేను . ఆ అమ్మాయే తర్వాత సినీనటి జయప్రదగా మారిన లలితకుమారి .
జగ్గంపేటలో మొట్ట మొదటి ప్రైవేటు స్కూలు నాదే . ఊళ్ళో అందరూ తెలిసిన వాళ్లే . ఫీజ్ పది రూపాయలే అయినా అడగడానికి చాలా మొహమాటంగా ఉండేది . కొందరు వచ్చి కూర్చుని గంటలు గంటలు కదిలే వాళ్ళు కాదు . వెళ్లమని చెప్పలేకపోయేదాన్ని .

పిల్లల్ని యూనిఫాం వేసి నీట్ గా పంపమని ఇళ్ళకెళ్లి చెప్పినా వినే వాళ్లు కాదు . అలా కాదని మా ఇంగ్లీషు టీచరు నీట్ గా పంపని పేరెంట్స్ ఒక రూపాయి ఫైన్ కట్టాలని స్లిప్పులు పంపింది . అంతే , “ పది రూపాయలు కాకుండా ఇంకో రూపాయి తీసేసుకుంటారా ?” అంటూ కొందరు స్కూలు మీదికి గొడవ కొచ్చేవారు . ఇంకో పక్క మోహన్ హెరాస్మెంటు తన జీతమే కాకుండా స్కూల్ ఫీజులు కూడా ఖర్చు పెట్టేసుకునేవాడు . అందుకే టీచర్స్ కి ఒక రోజు ముందే జీతాలు ఇచ్చేసేదాన్ని . జీవితం చాలా డిస్టర్బ్ డు గా ఉండేది .

అటు కలకత్తా లోనూ , ఇటు ఉత్తరాంధ్ర లోనూ నక్సల్బరీ ఉద్యమం ఊపందుకున్న రోజులవి . పేపర్లో చూస్తూండే దాన్ని . అప్పటికి నాకు ఆఫీసు రూమ్ అంటూ వేరుగా లేదు . బైట అరుగు మీదే టేబుల్ ఉండేది . అప్పుడప్పుడూ ఎవరో సోవియట్ లాండ్ మేగ జైన్స్ లో నక్స ల్బరీ సాహిత్యాన్ని , పాంప్లెట్స్ నీ ఉంచి పేపర్ వెయిట్ కింద పెట్టి వెళ్లేవారు . రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఒకబ్బాయి కాకినాడ నుంచి వచ్చి ఉద్యమం గురించి కబుర్లు చెప్పి వెళ్లేవాడు . కాళీపట్నం మాస్టారి కథలు , రంగనాయకమ్మ గారి నవలలు , నవీన్ గారి అంపశయ్య నా మీద ప్రభావాన్ని చూపించడం మొదలైంది . ఒక దశలో ఉద్యమంలో చేరిపోదామా అన్పించ సాగింది . కాని , పిల్లలు – వాళ్ల పెంపకం బాధ్యత నన్నుత్త పిరికిదాన్ని చేసి సంకెళ్లతో బంధించేసాయి .

(ఇంకా ఉంది )

కె.వరలక్ష్మి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో