గాజు బొమ్మ (కథ )- శివలీల .కె

వింధ్య స్ర్ర్పింగ్ కాట్ పై పడుకుని, తదేకంగా సీలింగ్ ఫ్యాన్ నే చూస్తోంది. ఫ్యాన్ బ్లేడ్స్ ఫాస్ట్ గా తిరుగుతున్నాయి. ఏసీ గాలి శరవేగంగా రూమ్ అంతా సర్క్యులేట్ అవుతోంది. ఆ గాలికి, చేతితో ఉన్న మ్యాగజీన్ పేజీలు పరపర శబ్ధం చేస్తున్నాయి. కిటికీలకున్నపల్చటి నీలిరంగు పరదాలు నిశ్శబ్ధంగా కదుల్తున్నాయి. పక్క లేన్ లో గల్లీ క్రికెట్ ఆడుతున్న బస్తీ పిల్లల అరుపులూకేకలూ . ఆ శబ్ధాలను డామినేట్ చేస్తూ దూరంగా ఉన్న గుడి నుంచి వినిపిస్తున్న భక్తి పాటలు. ఇంకోనాడైతే ఇలాంటి చిన్నచిన్న విషయాలను ఎంతో ఎంజాయ్ చేసేది. ఈ రోజు అవన్నీ గమనించే స్థితిలో లేదు. మనసంతా అదోలా ఉంది ఆమెకి. దేనిపైనా ఏకాగ్రత  కుదరడం లేదు. ఉదయం  వినయ్ తో జరిగిన సంభాషణ మళ్లీ గుర్తొచ్చింది.

‘లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం… సాయంత్రం  త్వరగా వచ్చెయ్ వినయ్…’

డ్రెస్సింగ్ టేబిల్ ముందు నిల్చుని టై ఎడ్జస్ట్ చేసుకుంటున్న వినయ్ ని గోముగా అడిగింది వింధ్య.

‘టైం లేదు వింధ్యా. నాకు ఆఫీసులో చిరిగి చాటవుతోంది. అయినా కొత్తగా ఈ రిక్వైర్మెంట్లేంటి. పెళ్లికి ముందంటే ఏదో అలా గడిచిపోయింది. ఇప్పుడు బయటికెందుకు. బోర్ కొడితే ఆన్లైన్ షాపింగ్ చెయ్. నీక్కావాల్సినవి కొనుక్కో. రెండునెలల్లో డెలివరీ కదా… బేబీ నీడ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకో’

తల తిప్పకుండా సమాధానం చెప్పి… క్లోజెట్ కిందున్న డ్రా విసురుగా లాగి షూ బయటికి తీసి, శబ్ధం వచ్చేలా నేలకేసి కొట్టాడు వినయ్.

వినయ్ గురించి తెలిసిందే. అయినా పట్టు వదలలేదు వింధ్య. ఎలాగైనా అతణ్నికన్విన్స్ చేయాలనుకుంది.

‘పోనీ మూవీకెళ్దామా. ఇంట్లో నేనొక్కదాన్నే ఉండలేక పోతున్నా. బోర్ కొడుతుంది’ ప్రాధేయపడింది.

‘బోర్ కొడుతోందా !!! ఫూలిష్ గా మాట్లాడకు. కాలు కదిపితే కార్పెట్లు. ఇంటినిండా పనివాళ్లు. ఈ లైఫ్ కోసం తపిస్తారు ఎంతో మంది అమ్మాయిలు. ఇక సినిమాలూ షికార్లూ అంటావా… అవన్నీ మిడిల్ క్లాస్ ఫార్మాలిటీస్. నెలకో సినిమాకి వెళ్లడం, మొక్కుబడిగా ఏదో హోటల్లో డిన్నర్ చేయడం, డబ్బు ఖర్చు చేయడానికి బితుకుబితుకు మంటూ సంవత్సరానికో ట్రిప్ కెళ్లడం ఇలాంటివన్నీ నాకు నచ్చవు. అయినా ఇది వరకే ఈ విషయం నీకు చాలా క్లియర్ గా చెప్పాను. మళ్లీ నన్ను విసిగిస్తావెందుకు. నీకేం కావాలన్నా చేసిపెట్టే ఫుల్ టైం కుక్ అరేంజ్ చేశానుగా. చేసిపెడతాడు. కావల్సినంత తిను. షాపింగ్ చేయాలనిపిస్తే ఆన్లైన్ లో చెయ్. రెస్టారెంట్ ఫుడ్ తినాలనిపిస్తే డ్రైవర్ ను పంపి తెప్పించుకో… బీ ఇండిపెండెంట్! అంతేకానీ ప్రతిదానికీ నా పనిమానుకుని నీ వెంట తిప్పుకోవాలని చూడకు… గాట్ ఇట్!’ వీలైనంత కటువుగా మాట్లాడుతూ… షూ లేస్ గట్టిగా బిగించాడు.

‘అది కాదు వినయ్’ వింధ్య మనసులో ఏమూలో మిణుకు మిణుకుమంటున్న ఆశ.

వాక్యం పూర్తి చేసే అవకాశం ఇవ్వలేదతను వింధ్యకు.

‘ఐయామ్ డన్. మధ్యాహ్నం బోర్డ్ మీటింగ్ ఉంది. లంచ్ కి రావడం కుదర్దు. సాయంత్రం బిజినెస్ మీట్. అక్కడే డిన్నర్ అండ్ పార్టీ. నా కోసం ఎదురు చూడకు’ తను చెప్పాల్సింది చెప్పి, వింధ్య వంక తలతిప్పి కూడా చూడకుండా లాప్ టాప్ తీసుకుని ఆఫీస్ కు బయల్దేరాడు వినయ్.

అతని మనస్థత్వం ముందే తెలిసినా మనసంతా ఏదో చేదు తిన్నట్టయింది వింధ్యకు.

భోజనం ఇంట్లో చేయకపోతే వింధ్య బాధపడుతుందని తెలుసు అతనికి. కానీ… ఇష్టం లేనిదేదైనా మాట్లాడితే ఆమెకు అతను వేసే శిక్ష అది. చెప్పాలంటే అది చాలా చిన్నశిక్షే. ఆ విషయం అతనికీ తెలుసు. కానీ ఆమె ఉన్న మానసిక పరిస్థితికి ఆ డోస్ సరిపోతుందని అతని అభిప్రాయం.

వింధ్యను బయటికి తీసుకెళ్లడం వినయ్ కి ఇష్టం ఉండదు. కానీ ఆ విషయం అతను వింధ్యకు చెప్పడు. ఒకవేళ తన అభిప్రాయం వింధ్యకు తెలిసిపోతే… ఇక ఆమె అడగడం మానేస్తుందని అతని ఫీలింగ్.అందికే వింధ్య అడిగినప్పుడల్లా ఏదో సాకు చెప్తుంటాడు. ప్రస్తుతం వింధ్య ప్రెగ్నెంట్. ‘నో’ చెప్పడానికి ఈసారి ఒక బలమైన కారణం దొరికింది.

ఇంతలో ఫోన్ మోగింది.

‘తాజ్ బంజారాలో డిజైనర్ వేర్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. వెళ్దామా’ ఆతృతగా అడుగుతోంది స్వప్న. ఆమె వింధ్య క్లాస్ మెట్.

‘లేదే నేను రాలేను’ నిర్లిప్తంగా సమాధానమిచ్చింది వింధ్య.

‘పోనీ నెక్ట్స్ వీక్ బుక్ ఎగ్జిబిషన్ కి వస్తావా. బుక్స్ చదవడం, మంచి బుక్స్ కలెక్ట్ చేయడం నీ హాబీ కదా. మన క్లాస్ మెట్స్ అంతా వస్తున్నారు. చాలారోజులైంది అందరూ నిన్ను చూసి. నువ్వు కూడా అందరినీ చూసినట్టు ఉంటుంది. ’

‘చూస్తానే. కుదురుతుందో లేదో. పెళ్లయిన తర్వాత అంతా అయిపోయిందే. ఇంకేం హాబీలు.. నా బొంద’ మాటల్లో చెప్పలేనంత వైరాగ్యం.

‘ఏంటే బాబు… మ్యారేజ్ తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది వింధ్యా. నువ్వు హాపీగానే ఉంటున్నావా అసలు’

‘నాకేం తక్కువే. వినయ్ మాటల్లో చెప్పాలంటే, చుట్టూ పనివాళ్లు, బయటి పనులన్నీ చూసుకోవడానికి అకౌంటెంట్, లగ్జరీ కారు, దానికో డ్రైవర్… అసలు… నేను బయటికి వెళ్లే అవసరమే లేదు. అన్ని పనులు చకచకా జరిగిపోతాయ్ మంత్రమేసినట్టుగా’ ఎంత ఆనందంగా చెబ్దామనుకున్నా పేలవంగా మారిపోయింది ఆమె స్వరం.

‘ఏంటో తల్లీ హైక్లాస్ లైఫ్ నీది. మహారాణిలా బతుకుతున్నా అంటావు ఎప్పుడూ. నిన్ను చూస్తే షోకేస్ లో ఉన్న గాజుబొమ్మే గుర్తొస్తుంది నాకు. అడుగు బయటికి పెట్టకుండా ఇంకా ఎన్నాళ్లు ఇంట్లోనే మగ్గుతావు వింధ్యా? నీ ఇంట్లో నువ్వే బంధీలా మారిపోతున్నావ్. నీకర్థం కావట్లేదు ఈ విషయం. త్వరలో మీటవుదాం లేవే. నేనే వస్తాను మీ ఇంటికి. నువ్వు ఇల్లు కదలవు కదా సారీ కదలనివ్వడు కదా మీ శ్రీవారు’

ఫోన్ కట్ చేసిన శబ్దం విని భారంగా నిట్టూర్చింది వింధ్య.

‘అవును… నా ఇంట్లో నేనే బంధీని. అసలు ఇది నా ఇల్లేనా, ఒకవేళ నా ఇల్లే అయితే నేనిక్కడ బంధీనెందుకవుతాను’ విరక్తిగా అనుకుంది.

మళ్లీ గతం తాలూకు ఆలోచనలు. ఆమె మనసు కదిలిపోతోంది.

డ్రైవింగ్ నేర్చుకోవాలని పట్టుబట్టింది పెళ్లైన కొత్తలో. వినయ్ పడనివ్వలేదు. యాక్సిడెంట్ అవుతుందేమో అని కంగారు పడుతున్నాడు అనుకుంది. ఆ ఆలోచనే మానుకుంది. బయటి పనులు చేయడానికి అకౌంటెంట్ ని తీసుకున్నాడు. కాలు కందకుండా చూసుకుంటున్నాడని ఎగిరి గంతేసింది. కొన్నాళ్ల తర్వాత, ఉద్యోగం మానేయమన్నాడు. తన స్టేటస్ కి ఇలాంటి ఉద్యోగం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకుంది. మరో ఆలోచనలేకుండా రిజైన్ చేసింది. బ్యూటీ సర్వీసెస్ కోసం బయటికెందుకు… ఇంటికే పిలిపించుకోవచ్చుగా అన్నాడు. అతనిదంతా అతిప్రేమ అనుకుని తలాడించింది. కానీ వినయ్ ఓ పద్ధతి ప్రకారం, తనను చాలా తెలివిగా కట్టడిచేస్తూ… తన చుట్టూ ఓ బలమైన గోడ కడుతున్నాడని గ్రహించలేకపోయింది.

రోజులు గడిచేకొద్దీ అతని మనస్తత్వం వింధ్యకు మెల్లగా అర్థమవసాగింది. తను ఇండిపెండెంట్ కావడం వినయ్ కి అస్సలు ఇష్టంలేదని తెలుసుకుని నిలువెల్ల కుంగిపోయింది.

                                                                         ********

అప్పుటి నుంచి వినయ్ ని మార్చడానికి వింధ్య ప్రయత్నిస్తూనే ఉంది. చాలా మందిలాగా మాట్లాడకుండా అలిగింది. పట్టించుకోలేదతను. ముఖం నల్లగా మార్చి, మూతి ముడుచుకుంది. లైట్ తీసుకున్నాడు. కొన్నికథలు చదివి, ఇన్స్ఫైర్ అయ్యి… తన ఫీలింగ్స్ అన్నీ వివరిస్తూ పెద్ద మెయిల్ కూడా రాసింది. రెండు లైన్లు చదివి డైరెక్టుగా డిలీట్ బటన్ నొక్కాడు.

చివరి ప్రయత్నంగా చెప్పాపెట్టకుండా పుట్టింటికి వెళ్లాలనుకుంది. అనుకుందే తడవుగా బయల్దేరింది. ఆ రాత్రి ఖాళీగా ఉన్న ఇల్లు చూసి ఆశ్చర్యపోయాడు వినయ్. వెంటనే డ్రైవర్ కి పోన్ చేశాడు. ‘అమ్మగారు వద్దన్నా వినకుండా ఆటోలో వెళ్లారండీ. లగేజీ కూడా ఉంది’. వింధ్యకు తెలియకుండా ఆమె ఫోన్ లో అమర్చిన జిపిఎస్ ట్రాకర్ ద్వారా ఆమె ఎక్కడికి వెళ్తున్నదీ తెలుకున్నాడు. హాయిగా డిన్నర్ ముగించి, నిశ్చింతగా నిద్రపోయాడు.

                                                                      ******

‘ఏమ్మా… రెండు నెలల్లో డెలివరీ పెట్టుకుని ఒంటరిగా వచ్చావే…ఈ సమయంలో జర్నీ చేయడం ఎందుకు. ఫోన్ కొడితే మేమే వచ్చేవాళ్లం కదా’ ఒంటరిగా వచ్చిన కూతుర్ని చూసి

ఆశ్చర్యంగా అడిగింది తల్లి.

‘ముందు లోపలికి రానివ్వమ్మా’ తల్లి చేతిలో లగేజీ బ్యాగు ఉంచుతూ అలసటగా అంది వింధ్య.

‘కారేదీ… డ్రైవర్ ని ఈ పూటకు బయటే తినేయమని చెప్పు’ వింధ్యనుద్ధేశించి అంటున్న భర్తను కళ్లతోనే ఆపేసిందామె.

వారం రోజులు గడిచాయి. కూతురు నోరు విప్పడం లేదు. వినయ్ ప్రస్తావన తీసుకు వస్తే  చాలు చిరాగ్గా తన గదిలోకి వెళ్లిపోతోంది. కొంపదీసి అల్లుడితో గొడవపడలేదు కదా. అనుమానం కాస్తా పెనుభూతమైంది.

ఓ రాత్రి మంచినీళ్లకోసం కిచెన్ లోకి వచ్చిన వింధ్యకు తల్లిదండ్రుల మాటలు చెవిన పడ్డాయి. అలా వినడం సభ్యత కాదనిపించినా వాళ్ల మాటల్లో వినయ్ పేరు దొర్లడం వల్ల మరింత జాగ్రత్తగా వినసాగింది.

‘ఇది వినయ్ తో గొడవపడి గానీ ఇక్కడికి రాలేదు కదా’ అమ్మ స్వరంలో భయం.

‘నాకూ అలాగే అనిపిస్తోంది. వాళ్ల పొట్లాట చిలికి చిలికి గాలి వాన కాకముందే దీన్ని అక్కడికి పంపేయాలి’

‘అల్లుడు పుణ్యమా అని మనకి అన్ని ఖర్చులు జరిగిపోతున్నాయి. అతనిచ్చిన డబ్బులతోనే కదా ఇల్లుకట్టాము. ఆయనొక బంగారు బాతు. అది పెట్టే బంగారు గుడ్డు మన చేతిలోకి రావాలంటే వింధ్య ఒక్కటే మార్గం. ఎలాగైనా మనం దానికి సర్థిచెప్పి రెండు రోజుల్లో అల్లుడి దగ్గరికి పంపేద్దాం’ నాన్న మాటలకు మద్దతిచ్చింది అమ్మ.

‘దీనీ అందంచూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గానీ… అంత ఆస్తిపరుడైన అబ్బాయిని మనం తేగలమా. పైగా అత్తమామలు, ఆడపడుచుల పోరే లేదు. కష్టసుఖాల విలువ దీనికేం తెలుసు. ఏదో స్వేచ్ఛ స్వాతంత్య్రం అని పిచ్చి వాగుడు వాగుతుంది. రెండురోజుల్లో నేనే తీసుకెళ్లి దింపి వస్తాను’

తన భర్త పంపే డబ్బు గురించి తపనే తప్ప తన ఫీలింగ్స్ ఏ మాత్రం పట్టని తల్లిదండ్రుల సంభాషణ విని నిర్ఘాంతపోయింది వింధ్య. కన్నీళ్లు ధారలా చెంపల్ని తడిమేస్తుండగా తన గదివైపు భారంగా అడుగులేసింది. అలసటతో, కళ్లుతిరుగుతున్నట్టుగా అనిపించి అలాగే బెడ్ మీద వాలిపోయింది.

తర్వాత రోజు ఎప్పటిలానే తెల్లారింది.

పొద్దున్నే టిఫిన్ కూడా తినకుండా బ్యాగు సర్ధుకుని బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న వింధ్యను చూసి ఒకరిముఖాలొకరు చూసుకున్నారు తల్లిదండ్రులు. కళ్లలో ఆనందం కూతురు గమనించకుండా జాగ్రత్త పడ్డారు.

‘పదమ్మా. టిఫిన్ దేముంది. దార్లో హోటల్లో తినేద్దాం’ మళ్లీ వింధ్య ఎక్కడ మనసు మార్చుకుంటుందో అని ఆందోళనతో హుటాహుటిన బయల్దేరాడు వింధ్య తండ్రి. మార్లమద్యంలో హోటల్లో ఫలహారం చేసినా… ఆ తండ్రీ కూతుర్ల మధ్య మౌనం రాజ్యమేలింది.

మామగారితో పాటు ఇంటికి వచ్చిన వింధ్యను చూసి ఓ వంకర నవ్వు నవ్వాడు వినయ్.

‘ఎలా ఉన్నారంకుల్’

‘బాగానే ఉన్నాం బాబు. మీరు బాగున్నారా’ వినయ్ ముఖకవళికలు గమనించినా గమనించనట్టుగా ప్రవర్తించసాగాడు వింధ్య తండ్రి.

సమాధానమివ్వకుండా తల మాత్రమే ఊపి, డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు వినయ్. కనీసం మామగారిని మాటవరసకైనా తిన్నారా అనిగానీ, తినమని గానీ అడగలేదు. అదేం పెద్దవిషయం కానట్టుగా నవ్వుతూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు వింధ్య తండ్రి.

ఇదంతా చూస్తూ ఇంకా అక్కడే ఉండలేక తన గదిలోకి దారితీసింది వింధ్య.

వినయ్ విసిరిపడేసే డబ్బే తన తండ్రికి ముఖ్యం. మామగారి బతుకు తను పెట్టిన బిక్షే అనుకుంటాడు తన భర్త. అందుకే వినయ్ మామగారికి మర్యాద ఇవ్వడం… డబ్బు ఇవ్వకపోవడం లాంటివి చేయడు. ఎందుకంటే… తన ప్రవర్తనని భరిస్తూ… అణిగిమణిగి ఉండే మామగారిని చూసినప్పుడుల్లా తనపై తనకే లెక్కలేనంత గర్వంగా ఉంటుంది వినయ్ కి . తాను సంపాదించే డబ్బు వల్లే ఇందంతా సాధ్యమని అతని ప్రగాఢ నమ్మకం.

ఇవన్నీ వింధ్యకు తెలిసినా తల్లిదండ్రులకు ఏమీ చెప్పదు. చెప్పినా వారికి అర్థంకాదు. అర్థమైనా పట్టించుకోరు. వారి దృష్టిలో వినయ్ దేవుడు. అడగకుండానే నోట్లు కుమ్మరించే దయామయుడు. వింధ్య పడే బాధ వారికి ఓ బాధలా కనిపించదు.

తండ్రి నానా జాగ్రత్తలు చెప్పి ఊరికి బయల్దేరాడు. వినయ్ లో ఏ మార్పూ లేదు. నిస్సహాయంగా రోజులు లెక్కపెడుతోంది వింధ్య. ఏమీ చేయలేని పరిస్థితి. మరో రెండు నెలలు ఎలాంటి ప్రత్యేకతా లేకుండానే గడిచిపోయాయి. వింధ్యకు తొమ్మిది నెలలు నిండాయి.

ఓ ప్రీమియమ్ హాస్పిటల్ లో వింధ్యకు పండంటి మగబిడ్డ పుట్టాడు. తన వారసుడిని చూడగానే వినయ్ ఎగిరి గంతేశాడు.

నాలుగో రోజు సాయంత్రం, వింధ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జయి ఇంటికి వచ్చింది. హాల్లో లాప్ టాప్ ముందేసుకుని, క్రికెట్ చూస్తున్నాడు వినయ్. కొడుకుతో ఇంట్లోకి అడుగుపెట్టిన వింధ్యని గమనించీ గమనించనట్టుగా చూసి మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యాడు. అలవాటైపోయిన వ్యవహారమే కనుక, వింధ్యకూడా నెమ్మదిగా బిడ్డని తీసుకుని తన గదివైపు అడుగులేసింది. కొన్నాళ్ల తర్వాత, రకరకాల జాగ్రత్తలు చెప్పి, బాబుకోసం ఆయాని ఏర్పాటు చేసి వింధ్య తల్లిదండ్రులు తిరుగుముఖం పట్టారు.

ఎప్పటిలాగే మళ్లీ తెల్లారింది.

కిటికీనుంచి ప్రసరిస్తున్న ఉషోదయకాంతులలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన కొడుకు వైపే తృప్తిగా చూస్తూ హాయిగా ఊపిరితీసుకుంది వింధ్య. ఇప్పుడామే మనసులో కొడుకును మనిషిగా పెంచి, పెద్దచేయాలన్న ఆశే తప్ప… భర్తను మార్చాలన్న తాపత్రయం లేదు.

ఆమె లక్ష్యం ఇప్పుడు వినయ్ లో మార్పు తీసుకురావడం కాదు. కొడుకుని ఉన్నతంగా తీర్చిదిద్దడం. అలా అనుకున్న ప్రతిసారీ వింధ్య మనసు ఆనందంతో ఉప్పొంగింది. ఆమె ముఖం వింత కాంతితో మెరిసింది.

– శివలీల .కె

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Comments are closed.