నా జీవన యానంలో(ఆత్మ కథ ) … కోనసీమలో-60 – కె .వరలక్ష్మి

కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి

అక్కడ మా మావగారు పైకి అంటున్నారు. ఇక్కడ ఎవరూ అనడం లేదు. పైగా బాబు మీద అమితమైన ప్రేమను కురిపిస్తున్నారు. అయినా నన్ను ఏదో ఒక గిల్టీ కుదిపేస్తోంది.

‘మీరెలాగూ విజయవాడలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తున్నారు కదా! మనం అక్కడికి వెళ్ళిపోదామండీ’ అన్నాను మోహన్ తో. ‘ప్రస్తుతం ఆ ఉద్యోగం కూడా ఊడిపోయినట్లే’ అన్నాడు మోహన్. ‘అదేంటి?’ అన్నాను నేను ఆశ్చర్యంగా. నా గొంతులోంచి ఆ పదం ఒక కేకలాగా బయటికి వచ్చింది. ‘అయినా బావగారు (విజయభర్త) నాకేం జీతం బత్తెం ఇవ్వడం లేదు. కేవలం తిండికి, ప్రయాణం ఖర్చులకీ ఇస్తున్నాడంతే. కాకపోయినా అతన్ని రాజమండ్రి తీసుకొచ్చెయ్యాలని ఆంటీ, చిన్నాన్న గారు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మెడికల్ ప్రాక్టీసు లాంటిదేదో పెట్టించాలనుకుంటున్నారు. నీకో విషయం చెప్తాను ఎవరికీ చెప్పకు. ఆయన విజయతో పెళ్ళికి ముందే రేడియో ఆర్టిస్టు ఒకావిడని గుళ్లో పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని కూడా కన్నాడు. విజయని ఇక్కడుంచి అక్కడ కూడా కాపురం వెలగబెడుతున్నాడు. అందుకే…’ అన్నాడు.

తర్వాత అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆంటీ వాళ్ళూ అల్లుడ్ని రాజమండ్రి తీసుకొచ్చేసి స్టేడియం పక్క రోడ్డుకి ఆనించి ఉన్న పెద్ద ఇల్లొకటి అద్దెకు తీసుకుని వాళ్ళ కుటుంబాన్ని అందులో దించేరు. హాస్పిటల్ బోర్డు పెట్టించేరు. అతన్ని వెతుక్కుంటూ వచ్చి హోటల్ రూంలో దిగిన రేడియో ఆర్టిస్టుని మా అత్తగారు ఆంటీ, విజయ వెళ్ళి బాగా కొట్టి బెదిరించి అతన్తో సంబంధం లేకుండా సంతకాలు పెట్టించుకుని వచ్చేరు. ఆ రేడియో ఆర్టిస్టు జీవికకోసం సినిమాల్లోనూ, సీరియల్స్ లోనూ చిన్న చిన్న కేరెక్టర్స్ చేస్తూ బతుకుతోంది ఇప్పటికీ.

అమలాపురం అవతల ఉన్న పల్లంకుర్రు హైస్కూల్లో మోహన్ కి పోస్టింగ్ ఇచ్చినట్టు అక్టోబర్లో లెటర్ వచ్చింది. నవంబర్ 11న మోహన్ జాయినవ్వాల్సి ఉండగా నవంబరు మొదటివారంలో పెద్ద తుఫాన్ ప్రారంభమైంది. గాలికి పెద్దవృక్షాలు కూలిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అప్పుడే ముమ్మిడివరం దగ్గర ఉన్న ఎప్పటిదో పెద్ద మర్రి వృక్షం కూకటివేళ్లతో కూలిపోయిందట. ఇంచుమించు పదిరోజులు జనం బైటికి అడుగుపెట్టలేనంత గాలివాన. ఇంట్లో అన్నీ ఉన్నవాళ్ళకి ఫర్వాలేదు కానీ, రోజు కూలి చేసుకుని బతికే వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోయారు. అప్పటికే మాలపల్లె చాలా వరకూ హైవే పక్కకి తరలి వెళ్ళిపోయినా, పాత పరిచయాన్ని పురస్కరించుకుని కొందరు వచ్చి, ‘అప్పయ్యగారూ, కున్ని నూకలుంటే ఎట్టండి’ అని మా అమ్మను అడిగేవారు. గాదుల్లో ధాన్యం లేదు. బియ్యం కొనుక్కునే రోజులొచ్చాయి. అయినా మా అమ్మ కొంచెం బియ్యం, అణో బేడో డబ్బులు ఇచ్చి పంపించేది. రోజూ మధ్యాహ్నం వేళ మా చిన్న చెల్లిని పంపించి మసీదు దగ్గర కాకి వాళ్ల కొట్లో వేయించే వేడి వేడి బఠానీలు, సెనగలుతెప్పించేది. ఇంట్లో ఉన్న వేరుసెనక్కాయలు వేయించేది. అవి తింటూ జోరున హోరున కురుస్తున్న వానను చూస్తూ కథలు చెప్పుకుంటూ ఎంజాయ్ చేశాం.

మోహన్ నవంబరు 10న బయలుదేరి వెళ్ళి స్కూలు మూసి ఉండటం వల్ల హెడ్ మాస్టారు ఇంటికి వెళ్ళి జాయినింగ్ రిపోర్టు ఇచ్చి, కందికుప్ప ఇవతల ఉన్న దొంతికుర్రులో ఇల్లుచూసి, ఎడ్వాన్సు ఇచ్చేసి వచ్చాడు. స్కూలు రి ఓపెన్ నాటికి కొద్దిపాటి వంటసామగ్రి, పరుపు, చాప లాంటివి పేక్ చేసుకుని బాబుని తీసుకుని బయలుదేరాం. అప్పటికి కోనసీమకు వెళ్ళడానికి గోదావరి మీద వంతెనలు లేవు, జగ్గంపేటనుంచి కాకినాడ వరకూ ఒక బస్సు, కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ ఇంకోబస్సు కోటిపల్లి రేవులో పడవ ఎక్కి అవతల ముక్తేశ్వరం లో దిగి మరో రెండు బస్సులు ఎక్కి దిగి దొంతికుర్రులో దిగాం. దారిపొడుగునా కూలిన చెట్లు, ధ్వంసమైన చేలు, తోటలు చూస్తూ ప్రయాణం, ఏదో తెలీని దిగులు ఆవరించింది నన్ను. దొంతికుర్రు ఊరు మొదట్లోనే దిగి రోడ్డు పక్క కుడి వైపు ఇళ్ల మధ్య నుంచి వెళ్తే చిన్న పంట కాలువ దాని మీద వేసిన సిమెంటు పలక కాలిబాట, దాటివెళ్తే కాలువపక్కన కొబ్బరితోటలో ఒకే ఒక్క పెంకుటిల్లు మూడు పోర్షన్లది. ఈ చివర మెట్లున్న పడమటివైపు పోర్షన్ మాది. ఎత్తైన అరుగులు, ఒక పెద్ద గది,దాని వెనకున్న చిన్న గది వంట గది . కొబ్బరి తడకల స్నానాల గది , దాని వెనకున్న కొబ్బరితోటంతా ఓపెన్ టాయ్ లెట్. నల్లగా సన్నగా ఉన్న ఇల్లుగలావిడ. బాపనమ్మ చంటి పిల్లాణ్ణి చంకనేసుకుని ఎదురొచ్చింది. మనవడేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది కొడుకని. పెళ్లిళ్ళైన కూతుళ్ళు ఉన్నారట. బ్రిటిషు పాలనా కాలంలో పనులకోసం రంగూన్ వెళ్ళి సంపాదించి ఆర్థికంగా బాగా ఎదిగిన సెట్టి బలిజలు కోనసీమలో చాలామంది ఉన్నారని, ఈ ఊరిని కొప్పిశెట్టి దొంతికుర్రు అంటారని మోహన్ చెప్పాడు.

నేను బాబును ఎత్తుకుంటే మోహన్ పెద్దగదిలో చాప వేసి, దాని మీద పరుపు పక్క వేశాడు. రెండో మూట విప్పి వంట సామగ్రి వంటింట్లో సర్దేడు. ఈలోపల ఇల్లుగలావిడ తల్లి పొట్టిగా ఉన్న ఓ ముసలావిడ వచ్చి నన్ను ఎగాదిగా పరికించి ‘ఏంటోల్లు మీరు?’ అంది. ముందు నాకర్థం కాలేదు. అయ్యాక, చెప్పేను. ఆవిడ లబోదిబో మని నెత్తీనోరూ కొట్టేసుకుని ఆకాశం కేసి చూస్తూ ‘ఏవి రోజులొచ్చేయిరా బెమ్మదేవుడా! గొల్లోళ్ళకి సదువులూ ఉజ్జోగాలూనా?’ అంది. అక్కడే తోలుకొచ్చిన గేదెల్ని కట్రాటలకి కడుతున్న పాలేరుని ‘ఓరి నాగిగే’ అని కేకేసింది. తలకి చుట్టుకున్న గుడ్డను విప్పి దులుపుతూ యాభై ఏళ్ళు పైబడిన ఆ వ్యక్తి మా దగ్గరకొచ్చేడు. ‘ఇడుగో ఈడు సూడు మీగొల్లోడే, మా పాలేరు. మొగోళ్ళు పాలేర్లు, ఆడోళ్ళు పని మనుసులూను’ అంది. మా ఊళ్ళో సరిగ్గా దీనికి వ్యతిరేకంగా వాళ్లకులం వాళ్లు పనులూ చేస్తారు . పెద్దావిడతో వాదనెందుకులే’ అని ఊరుకున్నాను.

ఇంటి ముందున్న కాలవనీళ్ళు గిన్నెలు తోముకోడానికి, బట్టలుతుక్కోడానికి, స్నానానికీ వాడేవాళ్ళం. ఇంటివెనుక పెరట్లో ఉన్న నూతినీళ్ళు తాగడానికి, వంటకి చుట్టూ గోదారి కాలువలున్నా అక్కడ తవ్వితే పడేది ఉప్పునీరే, సముద్రం దగ్గర్లో ఉండటం వల్ల కావచ్చు. కందికుప్ప ఊరు సముద్రం పక్కనే ఉందట. పెద్ద పెద్ద సముద్రం చేపలు సైకిళ్ళమీద అమలాపురం వెళ్తాయట. రోడ్డు పక్క ఇళ్ళవాళ్ళు ఆ చేపలు కొని వాటాలు వేసి కాలవకివతల ఉన్న మాక్కూడా ఇచ్చేవారు. తాజా చేపముక్కలు పావలాకి రెండు పూటలకి సరిపడేన్ని వచ్చేవి. శుక్ర, శని వారాలు తప్ప రోజుకోరకం చేపలు కొనేవాళ్ళు. ఇంకొకావిడ బుట్టతో పచ్చిరొయ్యలు, కాల్చిన రావలు, కట్ట పరిగెలు తెచ్చేది. బేడ ఇస్తే మా కూరకి సరిపడా పెట్టేది. బేడ అంటే పన్నెండు పైసలు. అంత తాజాగా కదులుతున్న రొయ్యలు, సముద్రం చేపల్ని నేనక్కడే చూసేను. చంటిపిల్లాడితో చేసుకోలేనని తనే చేసి ఇచ్చేది.

మా ఇల్లు గలావిడ బియ్యం, చిక్కటి గేదె పాలు, పొయ్యిలోకి కొబ్బరి డొక్కలు, వాళ్ళు ఆడించుకున్న నూనె వగైరాలన్నీ ఇచ్చి నెలకోసారి అద్దెతో బాటు డబ్బులు తీసుకునేది. మాస్టారి భార్యను కాబట్టి నన్నందరూ ‘పంతులమ్మా’ అనేవాళ్ళు. నాన్ వెజ్ తిననితోజుల్లో తలా ఒక కొబ్బరికాయ పంపించేవారు. ఒక చెక్క పచ్చడో, కూరో చేసి మిగతా చెక్కలు కోరి కొబ్బరుండలు చేసేదాన్ని. ఎవరమ్మాయైనా పెద్దమనిషి అయితే కూర్చోబెట్టేటప్పుడు బియ్యం, ధాన్యం, కొబ్బరి కాయ పట్టుకుని వెళ్ళేవారు. ధాన్యం అమ్మాయి చాపకింద పోసేవారు. అప్పటికింకా ఇంతంత ఖర్చుపెట్టే రోజులు రాలేదు. ఏ ఫంక్షన్ కైనా మామూలు భోజనాలే పెట్టేవారు. రిటర్న్ గిఫ్టులు ఇవ్వడాల్లాంటివి అప్పటికింకా ప్రారంభం కాలేదు.

అక్కడి ఆడవాళ్ళు తీరికగా ఉండేవాళ్ళు కాదు. చెట్టు నుంచి ఎండుకొబ్బరి కాయ పడిందంటే వాకిట్లో చిన్న గొయ్యితీసి మట్టితో కప్పేవారు. అలా వాకిళ్లనిండా రకరకాల సైజుల కొబ్బరిమొక్కలుండేవి. సైకిళ్ల వెనక పెద్ద గంపలు కట్టుకుని ఆ మొక్కల్ని కొనే వాళ్ళొచ్చినపుడు అమ్మి కొంత ఆదాయం సంపాదించేవారు. అలా సంపాదించిన డబ్బుతో బంగారం కొనుక్కుంటామని చెప్పిందొకావిడ.

ఎప్పుడూ ఆకాశంనిండా మబ్బులు కమ్మి వాతావరణమే తేడాగా ఉండేదక్కడ. ఎప్పుడో తప్ప కొత్త మనుషులు కన్పించే వాళ్ళు కాదు. నాకేదో బెంగగా దిగులుగా ఉండేది. నా ఫ్రెండ్సు మీనాక్షి, ఆదిలక్ష్మి, మా నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు రాసే ఉత్తరాలకోసం ఎదురుచూస్తూ ఉండేదాన్ని. మా నాన్న ఎప్పుడూ బాబు గురించి జాగ్రత్తలు రాస్తూ ఉండేవారు. బాబుకి చకచకా పాకడం వచ్చేసింది. వాడు నిద్రపోయేటప్పుడు తప్ప నాకు ఏపనీ చేసుకోవడానికి వీలయ్యేది కాదు. అటు వంటింట్లో పొయ్యి దగ్గరకో, ఇటు వీధి అరుగుమీదకో పాకుతూ వెళ్ళిపోయేవాడు. నేను గమనించి పెరిగెత్తుకొచ్చేలోగా ఎత్తైన అరుగుమీదనించి నాలుగైదుసార్లు పడిపోయాడు. మనవడిని చూడకుండా ఉండలేక మా నాన్న డిశంబర్లో వచ్చి మమ్మల్ని పండగకి రమ్మని పిలిచేరు. సరిగ్గా ఆయన ఉన్నప్పుడు బాబు మరోసారి పడ్డాడు. అంతే, మీకు చంటి పిల్లాడ్ని చూసుకోవడం రావటం లేదంటూ బాబుని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు బస్సెక్కే వరకూ బాగానే ఉన్నాను కానీ, వాడులేని ఇంటిని చూస్తుంటే నాకు దుఃఖం ఆగలేదు. మోహన్ స్కూలునుంచి వచ్చేసరికి నా కళ్ళు వాచిపోయాయి. వెంటనే వెళ్ళి తీసుకొచ్చెయ్యమని ఏడుపు మొదలు పెట్టాను. ‘అలా ఏం బావుంటుంది? పోనీలే ఓ పది రోజులు వాళ్ళ దగ్గరుండనీలే, సంక్రాంతి సెలవులీయగానే వెళ్ళి పండగెళ్లగానే తీసుకొచ్చేసుకుందాం.’ అన్నాడు. కానీ, నాకు తిండి సహించడం లేదు. నిద్ర రావడం లేదు. నా దుఃఖం బెంగ చూడలేక రెండోరోజు ఆదివారం వస్తే మోహన్ వెళ్ళి తీసుకొచ్చేసేడు. వాడు పాస్ పోసినప్పుడల్లా చెడ్డీలు బైట పడేస్తూ వచ్చేడట. మళ్ళీ చెడ్డీలు కొనేవరకూ నా పాతచీరొకటి చింపి వాడి మొలకి కడుతూ ఉండేదాన్ని. సామాన్లు తెచ్చుకున్న అట్టపెట్టెలో నుంచో బెట్టి వంట చేసుకోవడానికి ప్రయత్నిస్తే పెట్టెను పడేసి పాక్కుంటూ వచ్చి నా వీపు పట్టుకుని నుంచునేవాడు. నేనేదైనా రాసుకోవాలనీ, బొమ్మలు గీయాలనీ ప్రయత్నిస్తే ఆ పెన్సిల్ తీస్కుని గీతలు పెట్టేసేవాడు. అలా రోజులు మధురంగా గడుస్తున్నాయనుకున్నప్పుడు మోహన్ కి పేకాట పిచ్చి పట్టుకుంది. రోడ్డు మీదికున్న కొప్పిశెట్టి మాస్టారింట్లో పెద్ద పేకాట క్లబ్బు నడుస్తుందట. సాయంకాలం స్కూలునుంచి ఇంటికి రాకుండా అక్కడుండిపోయి ఏ తెల్లవారుఝామునో వచ్చేవాడు. భయంతో, బాధతో నాకు నిద్రపట్టేది కాదు. ఏ అవసరానికీ నా చేతిలో ఒక్క పైసా ఉండేది కాదు. ఒక్క రూపాయి కావాలన్నా ఇల్లు గలావిడని రాసుకోమని అప్పు తీసుకోవాల్సిందే.

మా అత్తగారు ఎప్పటిలాగే నెలాఖర్లో వచ్చి రెండో తారీఖున వెళ్తున్నారు. ఆ నెలలో వస్తూ వాళ్ళ పెద్ద చెల్లెలు (ఆంటీ) రెండో కొడుకు గోపాల్ ని వెంట బెట్టుకొచ్చారు. వాడు స్కూలు ఫైనల్ ఫెయిలై రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ లో అల్లరి చిల్లర పనులు చేస్తూ గొడవలు తెస్తున్నాడట. అప్పటికి నాలుగు సార్లు రాసి ఫెయిలయ్యాడట. ఇక్కడ చదివించి పరీక్షకి కట్టించమని పంపించేరు. వచ్చిన మర్నాడే ఒక గొడవ. అలా కొబ్బరితోటల్లో కెళ్ళినప్పుడు బోలెడన్ని కొబ్బరికాయలు గుట్టగా పోసి ఉంటే నాలుగు కాయలు తీసేడట. పాలేరు వెంటబెట్టుకు వచ్చి జాగ్రత్త చెప్పి వెళ్ళాడు. ఈసారి మా అత్తగారు వారం పైగా ఉన్నారు. ఆవిడింక బయల్దేరదామనుకుంటూండగా తెల్లవారుతూనే ఓ పదిమంది కర్రలు పట్టుకుని వచ్చి, ‘ఏడీ, ఆ కుర్రోడ్ని బైటికి పంపండి.’ అని కేకలు మొదలుపెట్టారు. స్కూల్లో ఒకాయన కూతుర్ని పలకరించి మాట్లాడేదట. మిగతావాళ్ళ కొడుకుల్ని ‘అరే, ఒరే’ అని పిలుస్తున్నాడట. ‘ఆయనంటేమేస్టారు కాబట్టి ఊరుకుంటున్నాం. అసలు మీ కులవేంటి? గోత్రమేంటీ? గొల్లోళ్ళు మమ్మల్ని మరియాద లేకుండా పిలుత్తారా!?’ అంటూ పెద్ద గొడవ. సాధారణంగా అలాంటి సందర్భాల్లో మోహన్ పోట్లాటకి దిగిపోతాడు. ఏకళనున్నాడో వాళ్ళకి సర్దిచెప్పి పంపేసేడు. మోహన్ ‘ ఫర్వాలేదులే’ అని చెప్తున్నా మా అత్తగారు వినలేదు. ‘ఇదేం ఊరురా బాబూ’ అంటూ గోపాల్ ని తీసుకుని వెళ్ళిపోయారు.

మేం సంక్రాంతికి వెళ్ళొచ్చాక ఎదుటివరస ఇంట్లో ఒకమ్మాయికి పెళ్ళి రాజమండ్రిలో పెళ్ళి చేశారు. శోభనం ఇక్కడ, మోహన్ నీ నన్నూ భోజనానికీ, దంపతి తాంబూలం అందుకోవడానికీ పిల్చేరు. అమ్మాయి పదో తరగతి చదువుతోంది. లావుగా పొట్టిగా నల్లగ ఉంటుంది. పెళ్ళి కొడుకు కూడా అలాగే ఉన్నాడు కానీ, కాస్త పొడవు, హైదరాబాదులో ఏదో ఉద్యోగం చేస్తున్నాడట. మొదట దొంగచూపుల్తోనూ, ఆ తర్వాత కళ్ళు తిప్పుకోకుండా నన్నే చూడ్డం మొదలుపెట్టాడు. తాంబూలం అందుకున్న వెంటనే మోహన్ పద పద అని ఇంటికి లాక్కొచ్చేసేడు. మోహన్ మొహం చూస్తే నాకు నవ్వాగలేదు. పరుపు మీద పడిపోయి మరీ నవ్వాను. ఎందుకో తెలియక పోయినా మా బాబు కూడా రెండు పళ్ళనీ ప్రదర్శిస్తూ నవ్వు కొనసాగించాడు.

– కె .వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో