ఒక ఇల్లాలి కథ
రచయిత్రి;జి.యస్.లక్ష్మి
రచయిత్రి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు,బి.ఎ(లిట్),ఎం.ఎ.(సొషియాలజీ),డిప్లమా ఇన్ మ్యూజిక్ (కర్ణాటక సంగీతం, వీణ)చేసారు.గత పన్నెండు సంవత్సరాలుగా రచనలు చేస్తున్నారు.ఇప్పటి వరకూ డెభ్బై కి పైగా కథలు వివిధ ప్రింటు,అంతర్జాల పత్రికలల్లో ప్రచురించబడ్డాయి.”నాన్నలూ నేర్చుకోండిలా”, మినీ నవలగా నవంబర్ ,2011 ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది.కొన్ని కథలు కథావాహిని,ఆటా(అమెరికన్ తెలుగు అసోషియేషన్) జ్ఞాపక సంచిక, కథాకేళి, ప్రమదాక్షరి కథాసంపుటాలల్లో చోటు చేసుకున్నాయి. పలు కథలకు వివిధ పత్రికలల్లో బహుమతులు వచ్చాయి. బహుమతి పొందిన కథలల్లో కొన్నింటిని “అతను-ఆమె-కాలం” (బహుమతి కథల మణిహారం ) పేరిట కథల సంపుటిగా ప్రచురించారు.ఇరవై సంవత్సరాల నుండి ఆకాశవాణిలో పలు ప్రసంగాలు, కదంబ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి.
“ఒక ఇల్లాలి కథ ” అన్న ఈ నవల 6 సెప్టెంబర్ 2007 నుండి,17 జనవరి 2008 వరకు 20 వారాల పాటు ఆంధ్రభూమి పత్రిక లో ధారావాహికంగా ప్రచురించబడింది.
ఇంటికి దీపం ఇల్లాలు,ఇల్లాలు కంట తడిపెడితే ఇంటికి అశుభం వగైరా వగైరా సూక్తులు చెపుతూ ఇల్లాలిని పొగుడుతూ ఉంటారు. కాని నిజ జీవితము లో ఇల్లాళ్ళకు ఈ గౌరవం దక్కుతోందా?
సుందరమ్మ అత్తగారికైతే ఘోషా లో, ఇంటి పనిలోనే జీవితం గడిచిపోయింది. ఆ రోజులల్లో వంద ఎకరాలున్నవాళ్ళైనా సరే ,వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళకి ఈ రోజుల్లో ఉన్న సదుపాయాలు ఉండేవి కాదు. శారీరికంగా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది.ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళున్నా అందరికీ పని ఉండేది. పొద్దుగూకులూ ఇంట్లో ఏదైనా పని చూసుకోవటం తప్పితే వాళ్ళ సంగతేమిటి అని ఆలోచన ఉండేది కాదు. సుందరమ్మ తండ్రి జగన్నాథంగారికి కోనసీమలో సుక్షేత్రమైన పంటభూమి,కొబ్బరి తోటలు , సిరీసంపదా ఉన్నాయి. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు, ఆరుగు కొడుకులు. సుందరమ్మకు తొమ్మిది సంవత్సరాలకే పెళ్ళైంది. పదమూడోఏట కాపురానికి వెళ్ళింది.భర్త చదువు కోసం అత్తామామలతో కాకినాడ వెళ్ళి రెండు గదుల ఇంట్లో ఉంది. అత్తగారు చెప్పినట్లుగా కొప్పు ముడుచుకోవటము, గోచీపోసి చీర కట్టుకోవటము నేర్చుకుంది. ఒద్దికగా కాపురము చేసుకుంటోంది. బాల్య చాపల్యము ఆపుకోలేక ,పక్కింటి నుంచి సంగీతము వినిపిస్తూ ఉంటే వెళ్ళి, పక్కవాళ్ళ పని మనిషినని చెప్పి ఆ హార్మనీ పెట్టె తెచ్చుకుంది. పక్కవాళ్ళు పోలీసులను పిలిచి గొడవ ఆయ్యే సరికి మామగారు తండ్రిని పిలిచి పుట్టింటికి పంపేసాడు. తండ్రి అంతకన్న పౌరుషంగా మామగారి మీద దావా వేసి బంగారము, మనోవర్తి తీసుకొని విడాకులు ఇప్పించేసాడు. అవేవీ సుందరమ్మ చేతికి రాలేదు. చివరి వరకు పుట్టింట్లో అందరికీ సేవలు చేయటమే సరిపోయింది. తండ్రి తదనంతరము కొంచము గట్టిగా వాదించి మరదలు, పిల్లలకు ఒక గది, కొంత డబ్బు సమకూర్చ కలిగింది. అదొక్కటే ఆమే చేయగలిగింది.ఆమె తప్పేమీ లేకుండానే పెద్దవాళ్ళ పంతాలల్లో ఆమె జీవితం నలిగిపోయింది.
సరస్వతి జగన్నాథరావు గారి కోడలు.పరమేశ్వరం భార్య.స్వరాజ్యం,తిలక్ లకు తల్లి.వ్యవసాయం చేసుకునేవాడికి పిల్లనిస్తే చాకిరీతోనే సరిపోతుంది.పిల్లవాడు చదువుకుంటున్నాడు. ప్లీడరీ చదువుతే మెజిస్ట్రేట్ అవుతాడు లేదా ప్రాక్టీస్ పెట్టినా రెండు చేతులా సంపాదిస్తాడు అని సరస్వతి తండ్రి ఆలోచించి చదువుకుంటున్న పరమేశ్వరానికి సరస్వతి ని ఇచ్చి పెళ్ళిచేసారు. సరస్వతి ఎంత బాధ్యతగా ఉండాలో సరిగ్గా అలాగే ఉండేది. అత్తా,మామగారు, ఆడపడుచులు, బావగార్లు, మరుదులు ఉమ్మడి కుటుంబములో ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. కాని పరమేశ్వరం చదువుకుంటుండగానే స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉద్యమంలో పాల్గొని జైల్ కు వెళ్ళటము , రావటమే సరిపోయింది. చివరిసారిగా 1946 లో జైల్ కు వెళ్ళి తిరిగి రాలేదు.అసలు ఉన్నాడో , చనిపోయాడో కూడా తెలీదు.సుందరమ్మ వారికి ఓ గూడు ఏర్పర్చకలిగింది. బయటవారి ముందు బయటపడకుండా బావగార్ల ఇళ్ళళ్ళో సాయం చేసి వారు ఇచ్చింది పుచ్చుకొని గుట్టుగా సంసారం గడుపుకొచ్చింది. తండ్రి మూలంగానే ఈ కష్టాలు అని పిల్లలు అంటే ఒప్పుకునేది కాదు.”ఊళ్ళో ఇంత మంది ఉన్నారు.ఒక్కళ్ళైనా దేశం కోసం జైలుకెళ్ళారా? అందుకే ఈ ఊళ్ళో అందరికంటే మీ నాన్నగారు గొప్పవారు.ఎవరి కుటుంబం వారు చూసుకోవటం కాదు.దేశాన్ని బానిసత్వం నుంచి విడిపించటం గొప్ప.”అనేది.అలా చెపుతున్నప్పుడు ఆమే మొహం తేజోమయం అయ్యేది.కళ్ళళ్ళో కాంతులు కురిసేవి.ఎన్ని కష్టాలు పడ్డా ఏరోజూ భర్తను నిందించలేదు.నిజంగా దేశం కోసం పోరాడిన యోధుల కన్న వారి తో సమానముగా త్యాగాలు చేసిన వారి భార్యల త్యాగము గొప్పది.వారి త్యాగానికి గుర్తిపులేదు. చదువు కాని, అన్నదమ్ముల సహకారము కాని లేకుండా కష్టపడి పిల్లలను తీర్చిదిద్దిన సరస్వతి పాత్ర అపూర్వమైనది.
స్వరాజ్య తల్లీ , మేనత్త ఏదో గుట్టుగా సంసారం గుంజుకొస్తున్నారు.స్వరాజ్యం పెళ్ళిడుకొచ్చింది.బాధ్యత తీసుకొని సంబంధం చూసి పెళ్ళిచేసే పెద్ద దిక్కు ఎవరూ లేరు.అలాంటిరోజులల్లో రమణమూర్తి స్వరాజ్యం ను చూసి ఇష్టపడి,పెళ్ళిచేసుకుంటానని సూర్యం మాష్టారితో కబురు చేసాడు.దాని తో పాటు పెళ్ళు తరువాత స్వరాజ్యం ను ఎవరూ కలవరాదని , పుట్టింటి తో సంబంధం ఉండకూడదనీ కండీషన్ పెట్టాడు .చాలా ఆలోచించి, వాళ్ళున్న పరిస్థితులల్లో ఇంకోవేరే సంబంధం తేలేరని,మంచిసంబంధం వదులుకోవద్దని స్వరాజ్యంను ,రమణమూర్తికి ఇచ్చి పెళ్ళిచేసి పంపించేసారు తల్లీ, మేనత్త.రమణమూర్తి వంశం వారికి ఏమున్నా లేకపోయినా పంతాలూ పట్టుదలలూ ఎక్కువ.వాళ్ళు ఏదన్నా మాట అన్నారంటే మిన్ను విరిగి మీద పడినా సరే ఆ మాట మీదే నిలబడతారు.మహా పౌరుషం కలవారని పేరు.అలాంటి వాడికి భార్యగా వచ్చింది స్వరాజ్యం. పెద్దవాళ్ళు చెప్పినట్టు పతియే ప్రత్యక్షదైవం అనుకొంది. ఆ కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. నలుగురిలో రమణమూర్తి గొప్ప వ్యక్తి అన్నట్లు ఇంప్రెషన్ ఇచ్చేది.అందరూ ఆయనను గౌరవించి, వినయంగా మాట్లాడేటట్టు చేసేది. ఆడపడుచును,మరిదిని సొంతపిల్లలా పెంచి వారి కోరికలు తీర్చేది.అందరూ తనను ఉపయోగించుకుంటున్నారని తెలిసినా పట్టించుకునేది కాదు.అంత విధేయముగా ఉన్న స్వరాజ్యము తల్లికి బాగాలేదని తెలిసి , అత్తగారి అనుమతి తో , భర్త ఊళ్ళో లేనప్పుడు పుట్టింటి కి వెళ్ళింది.తన మాట జవదాటి,తనకు చెప్పకుండా పుట్టింటి కి వెళ్ళిందన్న కోపం తో తిరిగి వచ్చిన ఆమె ఇంట్లోకి రాకుండా తలుపులుమూసేసాడు రమణమూర్తి.తిరిగి తమ్ముడి ఇంటికి చేరిన స్వరాజ్యం తన మరదలు లలిత, మేనకోడలు స్రవంతి సహకారంతో కోలుకుంది.తనకంటూ ఒక బాటను ఏర్పర్చుకుంది.మనోవర్తి కోసం రమణమూర్తి మీద దావా వేసింది. ఇంటికి తిరిగి రమ్మన్న అత్తగారి మాటను త్రోసిపుచ్చింది.తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంది. అమాయకురాలైన స్వరాజ్యంలో మార్పు వచ్చింది. ఈతరం యువతకి ప్రతినిధి స్రవంతి. ఇంజనీరింగ్ చదువుతోంది. స్వతంత్ర భావాలు కలది. అత్తకు అండగా నిలబడుతుంది.అన్యాయాన్ని ఎదుర్కునే స్వభావము కలది.
ఇలా ఐదుతరాల స్త్రీల వ్యక్తిత్వాన్ని, వారి పరిస్థితులను చూపించారు రచయిత్రి ఈ “ఒక ఇల్లాలి కథ” నవలలో.సరస్వతి తరం వరకూ చాలా మంది ఇల్లాళ్ళకు అంతగా గౌరవం దక్కలేదు. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పరిస్థితులు మారుతున్నట్లుగా లలిత, స్రవంతిల పాత్రలతో చూపించారు. స్వాతంత్ర్యసమరం రోజుల గురించి బాగా వివరించారు. అప్పటి నుంచి కొద్ది కొద్దిగా మారుతున్న సామాజిక స్థితి గతులు,కుటుంబసాంప్రదాయాలు,ఉమ్మడికుటుంబాలల్లో స్త్రీల పరిస్థితులు చూపించారు.కవర్ పేజీ లోనే బురద నుంచి బయటకు వచ్చిన తామరపూవును స్త్రీ పరిస్థితిలో వచ్చిన మార్పుకు సింబాలిక్ గా గొప్పగా చూపించారు. ఇక ముగింపు గురించి అంటే తనను తాను నిలబెట్టుకున్న స్వరాజ్యం అందరికీ ఆదర్శంగా ఉండాలి అన్నట్లుగా చిత్రీకరించాను అన్నారు.అదీ నిజమే.
ఈ నవల అన్ని పుస్తకాల షాపులల్లోనూ దొరుకుతుంది.ధర;150 రూపాయలు/
-మాలా కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 Responses to ఒక ఇల్లాలి కథ(పుస్తక సమీక్ష )- మాలా కుమార్