నా జీవనయానం లో…..

                                                     ఏడవ తరగతిలో …. 

కె.వరలక్ష్మి                సెకండ్ ఫాంలో మొదట తెలీదు కాని , రెండో రోజు తెలిసింది ఆరవతరగతిలో సగం మందికి పైగా ఫెయిలైపోయేరని . మగ పిల్లలు కొందరు మానేసినా చాలా మంది తిరిగి ఆరవతరగతిలో కూర్చున్నారు . ఆడ పిల్లలు మాత్రం ఫెయిలైన వాళ్లందరూ మానేసేరు . పాసైన వాళ్లు కూడా కొందరు మానేసేరు . ఆరవతరగతి చదువు చాలనుకుని . మా క్లాసు చిక్కి శల్యమై ఒకే ఒక్క డివిజనైంది .

మొదటి రోజు ఒక్క పూటలో వదిలేసారు . మా తెలుగు మాస్టారు పొదలాడ నుంచి జగ్గంపేట చేరే సరికి సాయం కాలమైందట . అప్పుడు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి అటెండర్ని మా ఇంటికి పంపించేరు . నేను వెంటనే వెళ్లేను . మాస్టారూ , నేనూ ఎంతగా ఏడ్చామో చెప్పలేను . ఆ మాస్టారు తిరిగి వెళ్లిపోయేరు .

పదిహేను రోజుల తర్వాత ఆకెళ్ల సత్యవతి గార్ని పెళ్లి చేసుకుని తిరిగి వచ్చేరు .

“అయ్యో , అంత ప్రేమించిన అమ్మాయిని అప్పుడే మర్చిపోయేరా మేస్టారు ? ఛీ , ఈ మొగోళ్లంతా ఇంతే “ అంది మా అమ్మ . సత్యవతిగారు స్కూల్ ఫైనల్ పాసయ్యేరట ఆ సంవత్సరమే .చక్కటి గాత్రం , అందమైన రూపం . ఆవిడ పెద్ద చెల్లెలు సర్వ లక్ష్మి తొమ్మిది , చిన్న చెల్లెలు రామలక్ష్మి ఏడవతరగతి చదువుతున్నారు . వాళ్ల తండ్రి గారు ఆకెళ్ల సూర్య నారాయణ మూర్తి గారు ఆలమూరు నుంచి ఇక్కడికి బదిలీ మీద ఆ నెలలోనే వచ్చేసారు . మాస్టారు కానాభట్ల వారి ఇల్లు ఖాళీ చేసి వెంట్రా ప్రగడ నమశ్శివాయ గారి ఇంట్లోకి మారేరు . ఆ పక్క పోర్షన్లో ఆయన అత్తవారి కుటుంబం దిగేరు .

మాఊరి లైబ్రేరియన్ శివాజీ గార్ని పెళ్లి చేసుకున్న విమలాదేవి గారు హిందీ టీచర్ గా వచ్చేరు . ఫస్ట్ ఫాం నుంచి స్కూల్ ఫైనల్ వరకూ ఆవిడే హిందీ చెప్పే వారు . ఈ స్కూలుకి వచ్చిన మొట్ట మొదటి ఉపాధ్యాయిని ఆవిడేనట . ఆవిడతో ఇప్పటికీ నేను మరిచిపోలేని ఒక సంఘటన జరిగింది . టీచర్స్ ఎవ్వరితో నేను చొరవగా మాట్లాడేదాన్ని కాదు . భయ భక్తుల్తో దూర దూరంగా ఉండేదాన్ని . విమలాదేవి గారు మా ఇంటికి కొంత దూరంలో కోమట్ల ఇంట్లో అద్దెకుండేవారు . రోజూ స్కూలుకి మా ఇంటి ముందుగా వెళ్లే వారు . మా ఇంటి ముందు బడ్డీ కొట్టు ఎప్పుడూ గొడవలు పడడం , మా ఇంటి కెదురుగా మాల పల్లె – అన్నీ చూసి నా మీద ఒక చులకన అభిప్రాయం ఉండే దావిడకి . ఏ ట్యూషనూ , ఎవ్వరి సహాయం లేకుండా నా అంతటికి నేను బుద్ధి గా చదువుకుని తరగతిలో మొదటి స్థానంలో వస్తున్నానంటే ఆవిడకి నమ్మకం కలిగేదు కాదనుకుంటా . ఒకసారి అర్ధ సంవత్సర పరీక్షలు జరుగు తూండగా మూడొంతులు రాసేసిన నా చేతిలో పేపరు లాక్కుని నన్ను క్లాసు బైటికెళ్లి నిలబడుమన్నా రావిడ . ఏం జరుగుతుందో నాకర్ధం కాలేదు . హెడ్మాస్టార్ని పిలిచించి నా పేపరు చూపిస్తూ ఏదో మాట్లాడేరు . ఆవిడ కూర్చున్న కుర్చీ పక్క తెల్ల గోడను పరిశీలించి ఆయన నన్ను పిలిచేరు . నేను వెళ్లి చూస్తే ఆ గోడ మీద పెన్సిల్ తో కొన్ని జవాబులు రాసి ఉన్నాయి . నేను ఆశ్చర్యపోయేను . అప్పటికే నాకు చదువు విషయంలో కొన్ని నియమాలున్నాయి . ఆ నియమాన్ని పట్టుదలగా ఆచరించే దాన్ని . నేను పాఠాన్ని అర్ధం చేసుకుంటూ క్షుణ్ణంగా చదివేదాన్ని . అందువలన నాకు ఎవ్వరి సహాయం పరీక్షలో అవసరమ య్యేది కాదు . విషయం అర్ధమయ్యేక నాకు ఏడు పాగలేదు . అంతలో హెడ్మా స్టారికి స్ఫురించి , నా చోటు క్లాసులో వెనకెక్కడో ఉందని గమనించి , మొదటి బెంచీలో కూర్చున్న A అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయి పేపర్ని పరిశీలించి గద్దించి అడిగితే ఆ అమ్మాయి తప్పు ఒప్పుకుంది . చేతి వ్రాతను కూడా పట్టించు కోకుండా నా మీద అంతటి అభాండం వేసేరావిడ . అప్పటి నా పదేళ్ల క్రితం ఈ ఊరి మహిళా మండలి అధ్యక్షురాలిగా ఏక గ్రీవంగా నన్ను ఎన్నుకున్నప్పుడు “ ఈ వరలక్ష్మి నా స్టూడెంట్ “ అన్నారావిడ సభలో గర్వంగా .

ముందు సంవత్సరంలో మొదలు పెట్టి డా . జయ గారి హాస్పిటలు కట్టడం పూర్తి చేసారు . పక్కనే ఇల్లు కట్టడానికి స్థలాన్ని సిద్ధం చేసారు . దాంతో పుంత పక్క మాల పల్లె సగం ఇళ్ళు మాయమైపోయాయి .

ఆ సంవత్సరమే కొత్త నారాయణ గారి చెల్లెలు పాపాజీ పెళ్లి చాలా ఘనంగా జరిగింది . కారులో ఊరేగింపు , బుట్ట బొమ్మలు గుర్రాలు , బేండు మేళం , సన్నాయి మేళం , ఊరేగింపు , పొడవునా పెట్రోమాక్స్ లైట్లకు బదులు ట్యూబ్ లైట్లు వగైరాల్తో , ఊరేగింపులో భోగం మేళం ఆ పెళ్లి తర్వాత చూడలేదు . బంగాళా బీడులో పెద్ద స్టేజి కట్టి సంపత్ కుమార్ నాట్యం ఏర్పాటు చేసారు . ఆయన చేసే జాలరి నృత్యం చూసి తీరాల్సిందే .

క్రమంగా పల్లకీ ఊరేగింపులు కూడా తగ్గుతూ వచ్చేయి . బోయీలు ఒహాం …ఒహాం …అంటూ మేనాలో పెళ్లి కూతుర్ని అత్తింటికి తీసుకెళ్లే సాంప్రదాయం కూడా వెనకబడింది .

ఆ సంవత్సరంలోనే నన్ను మొదటి సారి తేలు కుట్టింది . నవారు మంచం బిగించడంలో మా నాన్నమ్మకి సాయం చెయ్యబోతే నవారు గళ్ళల్లో ఉన్న తేలు నా కుడి చేతి చిటికెన వేలు మీద ఒక్కటిచ్చింది . ‘ అమ్మా ‘ అని నేను అరిచిన అరుపుతో ఇంటికి అటు వైపున్న మా నాన్న ఒక్క పరుగుతో వచ్చేసారు . తోట రామారావు గారింటికి తీసుకెళ్లి మంత్రం వేయించేరు . ఉల్లి పాయ చితక్కొట్టి పట్టేరు . సైకిల్ డైనమో కరెంటు నీళ్లల్లోకి పెట్టి చెయ్యి ముంచేరు . నొప్పి వేలుని దాటి పైకైతే పాకలేదు కాని కుట్టిన చోట నిప్పు కణికెతో అంటించి నంత బాధ . గంట తర్వాత పరాకు మాటలు , నవ్వులూనట , దెయ్యం పట్టిందని ఖాన్ సాయెబు గార్ని పిల్చు కొచ్చేరు . నాకు నొప్పి తగ్గి తెల్లవారు ఝాము నెప్పుడో నిద్ర పట్టే వరకూ మా వీధంతా నా చుట్టూనే ఉంది .

అప్పటికింకా ఊరికి రిక్షాలు రాలేదు . అతంత మాత్రపు దూరాలు నడిచి వెళ్ళటమే. ఒకసారి మా నానమ్మ పప్పులు కొనటానికి నగరం ఆయలుదేరింది .నగరం కమ్మ వారిళ్ళల్లో వేయించి శుభ్రం చేసిన కందిపప్పు , పెసర పప్పు లాంటివి అమ్ముతూండే వారు . మా నాన్నమ్మ వెంటనేనూ . కోనేరు దాటి నాలుగడుగులు వెళ్ళేక చూసుకుంటే నా జడలో జడ గంటలు లేవు . వెంటనే వెతుక్కుంటూ వెనక్కొచ్చేసేం . దొరకలేడు .అప్పట్నుంచీ మా అమ్మ “ చిన్నప్పుడు విజయవాడ దుర్గ గుడిలో అరతులం మొల బిళ్ల , ఇప్పుడు అరతులం జడ గంటలు – మొత్తం తులం బంగారం పోగొట్టేవు “ అంటూ ఉండేది .

అప్పట్లో సినిమా డైరెక్టరు సి.పుల్లయ్య గారు సరిగా నడవని థియేటర్లని లీజుకు తీసుకుని రిపేర్లు చేయించి సినిమాలు ఆడించే కార్యక్రమం పెట్టుకున్నారు . ఆక్రమంలో మాఊరి సీతారామా టాకీస్ ని కూడా తీసుకున్నారు . మిగతా పనుల్తో బాటు థియేటర్ చుట్టూ మంచి పూలతోట కూడా నాటించేరు . బోలెడన్ని గులాబీలు పూసేవి . సంపెంగలు , నాగ సంపెగలు లాంటి పూలతో థియేటర్ పరిమళించి పోయేది . పుల్లయ్య గారు ఇక్కడునన్ని రోజులూ తోట కెదురుగా    మడత కుర్చీ వేసుకుని కూర్చునే వారు . మా ఇంటి కెదురుగా ఉన్న పడాల వాళ్లమ్మాయి సత్యవతి (పన్నెం డేళ్ళు ) ఆయనకి వండి పెట్టడానికి వెళ్తుండేది . అప్పుడప్పుడు మద్రాసు కూడా వెళ్లోచ్చేది . సినిమాల్లో వాడిన గిల్టు నగలు , బట్టలు లాంటివి తెచ్చుకుని వీధిలో అందరకీ చూపించేది . థియేటర్ వాళ్లు మామైక్స్ అద్దెకు తీసుకోవడం వలన మా ఇంటందరికీ సినిమా ఫ్రీ . నేను మా తమ్ముళ్లనీ , చెల్లెళ్ళ నీ తీసుకుని వచ్చిన సినిమా కల్లా వెళ్లి పోయేదాన్ని . ఇంట్లోంచి పట్టు కెళ్ళిన జంతికలో , దార్లో కొన్నకరకజ్జమో తింటూ రోడ్డు మధ్యలో కూర్చునే వాళ్లం   .

ఎప్పుడో తప్ప ఒక బస్సో , లారీనో వచ్చేది కాదు . ‘నమో వేంకటేశ ‘ పాట వినపడ్డాక లేచి పరుగెత్తే వాళ్లం . అప్పుడప్పుడు పుల్లయ్య గారు నా చేత పద్యాలు పాడించుకుని విని ఆనందంగా తల ఊపేవారు .

మర్నాడు మా అమ్మకీ , నాన్నమ్మకీ ఆ సినిమా కథ చెప్పడం ఒక డ్యూటీ నాకు . మా తమ్ముళ్లు  , చెల్లెళ్లు  కూడా అదే కథని చెప్పమని నా వెంట తిరిగేవారు . నాకు ఏ కాస్త తీరిక దొరికినా ఏదో ఒక కథల పుస్తకమో , నవలో పట్టుకుని రెండిళ్ల అవతలున్న మా పిన్నమ్మ ఇంటికి వెళ్లిపోయేదాన్ని . తను వంట చేసుకుంటూంటే నేను గదిలో మంచం మీద  పడుకుని పుస్తకం చదువుకునే దాన్ని . తన ఇంటి వెనక ఉన్న కాకి వాళ్ల కొట్లోంచి అప్పుడే వేయించిన బఠానీ లో , సెనగలో  తెప్పించి పెట్టేది ; లేదా గారెలో , పకోడీలో  చేసి పెట్టేది .

నాగభూషణం గారి ‘ రక్త కన్నీరు ‘ నాటకం మార్మోగి పోతోంది . టిక్కెట్లు దొరకనంత విజయవంతంగా నడుస్తోంది . పుల్లయ్య గారు ఆ నాటకాన్ని సీతారామా టాకీస్ లో ఆడించారు . చాల మందికి టిక్కెట్లు దొరకలేదు . మా నాన్నా నేనూ గ్రీన్ రూంలో కూచుని నాటకం చూసాం . ఆ రోజు హీరోయిన్ గా శారద గారు వచ్చింది . సీత గారు నాతో బోలెడు కబుర్లు చెప్పింది . మా నాన్నతో ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని నాగ భూషణం గారు మా నాన్నని అడిగేరు . “ అమ్మాయిని ఫీల్డుకి పంపించే ఉద్దేశమే మైనా ఉందా ?” అని. మా నాన్న ఏదో చెప్పబోయే లోగా పెద్ద ఆరిందాలాగా నేనన్నాను “ లేదండీ , నేను బాగా చదువుకుని డాక్టరవుతాను “ అని .

ఆ నాటకం తర్వాత మా నాన్నకి డ్రామా థియేటరొకటి కట్టాలని ఆసక్తి మొదలైంది . ఇప్పుడు ఊరి మధ్యలో ఉన్న పెట్రోల్ బంక్ వెనక అప్పుడన్నీపొలాలు . అప్పటికి బంక్ లేదు . పైడిపల్లి  వారి ఇల్లుండేది  రోడ్డు కానుకుని . ఆ ఇంటి వెనక ఒక ఎకరం కాబోలు కొని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించి , తూర్పు – పశ్చిమాల్లో పెద్ద గేట్లు పెట్టించేరు . గ్రీన్ రూమ్స్ కోసం రెండు గదులు కట్టించేరు . పర్మిషన్ దొరక్కో ఏమో ఆ కల నెరవేరలేదు . తర్వాత దాంట్లో గడ్డిమేట్లు , పశువుల్ని కట్టేవారు . రెండేళ్ల తర్వాత మా పిన్నమ్మ అద్దె ఇంటి నుంచి యిక్కడి రెండు గదుల ఇంటికి మారింది . ఆ స్థలాన్ని తర్వాత మా నాన్న అమ్మేసినప్పుడు కొత్త నారాయణ గారు కొనుక్కున్నారు .

ఆ గోడ కానుకుని  రాజుల కుటుంబం ఒకటుండేది . శుభ్రతకు మారు పేరన్పించేలా  తాటాకుల ఇల్లు , అలికి ముగ్గులేసిన పచ్చని వాకిలి , వాకిలి చుట్టూ పూలతో నిండిన బంతి మొక్కలు ఎంతో బావుండేది . ఆ ఇంటి వారమ్మాయి ఖాదర్ (అప్పట్లో రాజుల కుటుంబాలు కొన్ని ఖాదర్ వలీ బాబా  భక్తులట ) నా ఈడుదే . ఒకకాలు పొట్టిగా ఉండడం వాళ్ళ మోకాలు మీద చెయ్యి ఆన్చి నడిచేది . ఎంత పనిమంతురాలంటే – ఆ ఇంటిని అద్దంలా తనే ఉంచేది . చకచకా వంట చేసేసేది . “ అమ్మయ్యా! ఏం కూర చెయ్యమంటారు ?” అని వాళ్ళమ్మ గార్ని అడిగి పెరట్లోని వంకాయలో , చిక్కుడు కాయలో కోసి క్షణాల్లో వండేసేది . ఆదివారం వస్తే నా కోసం ఎదురు చూస్తూ ఉండేది . తను బడి కెళ్లి చదువు కోలేదు . నేను చెప్పే కథలు – కబుర్లు వినడం తనకిష్టం . వాళ్ల వంటై పోయేక చిలగడ దుంపల పూర్ణంతో  చిట్టి బూరెలు వండి , అన్నం , పప్పు చేసేది . బొమ్మల పెళ్లి చేసి మా తమ్ముళ్లు చెల్లెళ్లకీ , వాళ్ల తమ్ముళ్ల కీ బాదం ఆకుల్లో వడ్డనలు చేసేది . పనిలో ఆచురుకుతనం నాకు లేక ఆ అమ్మాయంటే నాకెంతో ఇష్టంగా ఉండేది .

ఒకసారి ఆ విషయం నా స్కూల్లో ఫ్రెండ్ లీలకి చెప్తే “ ఆ మాత్రం వంట మనం చెయ్యలేమా ?” అంది .  ఒక ఆదివారం మా పిన్నమ్మ ఇంటి పెరట్లో ఉన్న ఇల్లు గల వాళ్లు పశువులశాలలో పొయ్యి పెట్టి వంట చేసి అందరికీ వడ్డించేం . చివర్లో పొయ్యి ఆర్పడం మరిచిపోయేం . అది నెమ్మదిగా రాజుకుని మధ్యాహ్నం ఎండ వేళకి  పశువులశాల అంటుకుంది . చుట్టు పక్కల వాళ్లోచ్చి ఆర్పేసారు .

మా ఇంటికి పుంత వైపు ముందు గదిలో నెలకి రెండు సార్లు చిట్టీ పాటలు జరిగేవి . ఆ  రోజు నేను స్కూలు నుంచి ఇంటి కొచ్చేసరికి  ఆ గదిలో ముతక ఖద్దరు పంచె , చొక్కా ధరించిన ఒక పెద్దాయన కూర్చుని ఉన్నాడు . ఆయన నన్ను పరిశీలనగా గమనించేను . నేను గది దాటగానే మా నాన్నను వివరాలు అడిగి ఒక పెళ్లి సంబంధం చెప్పేడట . రాజమండ్రిలో మొల్లి ఎర్రయ్య గారు అనే    మోతుబరి ఒకాయనున్నాడట . ఆయనకీ అల్యూమినియం ఫేక్టరీలు , అద్దెలకిచ్చే  ఇల్లు వగైరాలున్నాయట .  ఐదుగురు కూతుళ్లే  కావడంతో పెద్ద కూతురి కొడుకుని పెంచుతున్నారట . ఆ అబ్బాయి ట్రెయినింగ్ కాలేజ్ లో సెవెంత్ ఫాం (ఇంటర్ ) చదువుతున్నాడట . పెద్దాయనకి ఆరోగ్యం బాగాలేక మనవడికి పెళ్లి చేసేయ్యాలనుకుంటున్నాడట . పల్లెటూళ్లో  పుట్టి పెరిగిన అమ్మాయిని చెయ్యాలని వాళ్ల ఉద్దేశమట . లోపలికొచ్చేక మానాన్న మా అమ్మతో , నాన్నమ్మతో చెప్తూంటే అక్కడే కూర్చుని చదువుకుంటున్న నేనూ విన్నాను . అప్పటికి నాలో పల్లకీ ఎక్కడం లాంటి బాల్య చాపల్యం కొంత తగ్గుతూ వస్తోంది . పైగా పెళ్లంటే  కొంత భయం కూడా పట్టుకుంది . అన్నిటికీ మించి నా చదువు !నేను వెంటనే చెప్పేసేను “ నాన్న నేను పెద్ద చదువు చదువుకుంటాను . నాకు పెళ్ళోద్దు “ అని

“ పన్నెండేళ్లు  దాటేక , పిల్ల పెద్దదయ్యేక పెళ్లి చేత్తారా ఏటి అని ఉప్పుడుకే   కులపోళ్లందరూ అడుగుతున్నారే బాబూ “ అంది మానాన్నమ్మ .

“ సంబంధం చూత్తే  మాత్రం అప్పుడే పెళ్లి జేసేత్తావా ఏటి “! అంది మా అమ్మ .

“  నన్ను  చదువుకోనిస్తారంటేనే  నేను పెళ్లికి ఒప్పుకొంటాను “ అన్నాను .

“ అలాగే అడుగుదాంలే నాన్నా “ అన్నారు మా నాన్న .

మంచి రోజు చూసి మధ్య వర్తిగార్ని వెంట బెట్టుకుని మా అమ్మా , నాన్నా వాళ్లింటికెళ్లి చూసొచ్చేరు . పడ్డ డాబా ఇల్లు అని మురిసి పోయింది మా అమ్మ . “ అబ్బాయి నల్లగా ఉన్నాడు , మరీ అర్భకంగా ఉన్నాడు “ అన్నారు మా నాన్న .

పెద్దాయన మంచం మీదున్నాడట .

పెళ్లి చూపులకి వస్తున్నామని మధ్యవర్తి చేత కబురు చేసేరు . ఆ రోజు నన్ను స్కూలు మాన్పించి , పట్టు పరికిణీ జాకెట్టు వేసి , నగలు అలంకరించి , బిగించిన జడ నిండా పూలు పెట్టి తయారు చేసేరు . పొద్దుట వస్తామన్న వాళ్లు సాయంకాలమైనా రాలేదు . తర్వాతెప్పుడో  తెల్సింది – అప్పటికి రెండు రోజుల ముందే పెద్దాయన కాలం చేసాడట . అబ్బాయి చదువు పూర్తయ్యే వరకూ ఇంక పెళ్లి  మాటెత్తరట . నాకొక పెద్ద బరువు దించు కున్నట్టయ్యింది . హమ్మయ్య , ఇక నేను హాయిగా చదువుకో వచ్చు !

ఇదంతా ఏడవతరగతి పరీక్షలకి ముందు జరిగింది . ఆ సంవత్సరం స్కూలు వార్షికోత్సవానికి మా తెలుగు మాస్టారు ‘ ఆదర్శ విద్యార్ధి ‘ నాటకం రాసేరు . కచ దేవయానుల కథ అది . కచ పాత్రో , దేవయాని పాత్రో నా చేత వేయించాలని మాస్టారి అభిప్రాయం . బృహస్పతి , శుక్రాచార్యుల పాత్రలకి స్కూలు మొత్తం గాలించినా అబ్బాయిల్లోగాని , అమ్మాయిల్లోగాని ఎవరూ దొరకలేదు . దొరికిన నలుగురైదుగురూ సంస్కృత సమాసాల్తో ,శ్లోకాలతో నిండిన సంభాషణలు పలక లేకపొతున్నారు . వార్షికోత్సవం దగ్గరికి వచ్చేస్తుండగా మాస్టారు నిర్ణయం మార్చుకుని కచుడిగా ఆకెళ్ల రామలక్ష్మి ని , దేవయానిగా మీనాక్షిని , ముందు బృహస్పతిగా , తర్వాత శుక్రాచార్యుడిగా నన్ను నిర్ణయించి రిహార్సల్స్ జరిపించేరు .

ఆ రోజుల్లో మరొక ఎంటర్టైన్మెంట్ ఏదీ లేక వార్షికోత్సవానికి ఊరు మొత్తం తరలి వచ్చేది . “ ఆదర్శ విద్యార్ధి “మూడు గంటల నాటకం . పద్యాలకి , పాటలకి దన్నుగా హార్మొనీ , తబలా ఉన్నాయి . ఎలాంటి అలికిడి చెయ్యకుండా నాటకం మొత్తాన్ని ఏకాగ్రతతో చూసేరు జనం .

నాటకం ముగియగానే స్కూలు కమిటీ ప్రెసిడెంటు వెంట్రాప్రగడ సత్యం గారు ఎకాయెకి స్టేజి మీదికి వచ్చేసి “ బృహస్పతిగా వేసిన వాడిని, శుక్రాచార్యుడిగా వేసిన వాడిని స్టేజి మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను “ అన్నారు .

మా మాస్టారు “ రా …రా ..” అని తొందర పెట్టి గడ్డాలూ , మీసాలూ లాగేసి నన్ను స్టేజి మీదికి తీసుకేళ్లేరు .

“ ఇంకొకడేది ?” అన్నారు సత్యం గారు .

“ రెండు వీడేనండి “ అన్నారు మాస్టారు .

“ఎవరి కుర్రాడివిరా నువ్వు ?” అడిగేరు సత్యం గారు .

నేను మైకు దగ్గర కొచ్చి “ నేను పల్లా వెంకట రమణ గారి అమ్మాయినండి “ అన్నాను పెద్దాయనకి నమస్కరిస్తూ .

“నువ్వు అమ్మాయివా ?” అంటూ  తెల్లబోయారాయన . వీక్షకులు కూడా చప్పట్లు మార్మోగించేరు .

ఒక యాదవ కులం అమ్మాయి చేత అంత స్పష్టంగా సంభాషణలు , శ్లోకాలు పలికించినందుకు  మా మాస్టారికి ఒకటే ప్రశంసలజల్లు . మొదటి బహుమతి బృహస్పతి పాత్రకి , రెండవ బహుమతి శుక్రుడి పాత్రకి అంటూ రెండు బహుమతులిచ్చేరు . మిగతా విభాగాల్లో జూనియర్స్ లో ఎప్పట్లాగే బోలెడన్ని బహుమతుల్తో బాటు స్కూలు ఉత్తమ విద్యార్ధిని బహుమతి కూడా ఇచ్చేరు . ఇంటికి వచ్చేక “ అంత గొప్ప పేరు తెచ్చుకుంటే పిల్లని మేచ్చుకోరేం ?” అంది మా అమ్మ .

“ మన పిల్లల్ని మనవే మెచ్చుకోకూడదు . ముందు దిష్టి తియ్యి “ అన్నారు మా నాన్న .

బహుమతిగా వచ్చిన పుస్తకాల్లో “ రుద్రమ దేవి “ కూడా ఉంది . ఆ కథ నాకు చాలా  ఎప్పటికైనా ఓరుగల్లు కోట , కాకతీయుల ఆలయాలు చూడాలని అన్పించింది .

అబ్బాయిల్లో ఉత్తమ విద్యార్ధి అవధాని చాలా తెలివైన వాడు . ఇంగ్లీషు లో , లెక్కల్లో మొదటి మార్కులన్నీ అతనివేనట  వాళ్ల క్లాసులో . దగ్గరలో ఉన్న బూరుగుపూడి నుంచి వస్తూ ఉండేవాడు . “ పెద్ద క్లాసుల్లో కెళ్లేక అతనిలాగ చదవాలి ‘ అనుకునేదాన్ని . పెద్దయ్యాక అతను డాక్టరో , సైంటిస్టో అయినట్టు తెలిసింది . అతని అన్నయ్యలు కొందరు పెద్ద చదువుల్లో ఉండేవారట అప్పటికే .

ఇప్పటిలాగ ఇంతంత డబ్బు పోసి కార్పొరేట్ చదువులు చదివించక పోయినా ఆసక్తి ఉన్న వాళ్లు అప్పట్లో అలా చదువుకునే వారు.

ఖాదర్ వాళ్లింట్లోంచి రోజుల వయసున్న ఒక కుక్క పిల్లనీ , పిల్లి పిల్లనీ తెచ్చుకున్నాం . వాళ్ళమ్మ గారు బుల్లి కోడి పిల్లను కూడా ఇచ్చేరు . ఒక సెలవు రోజున అయిదుగురం బడ్డీ అంచున కాళ్లు వెళ్లాడేసుకు కూర్చుని వాటితో ఆడుతున్నాం . కోడి పిల్ల నా వొళ్లో ఉండిపోయింది . నాలుగైదు వీధి కుక్కలు ఒక్కసారిగా వచ్చి పిల్లి పిల్లనీ , కుక్క పిల్లనీ ఎత్తు పోయేయి . మేమంతా కెవ్వుమని పెట్టిన కేకలకి వీధి వీధంతా క్షణాల్లో మా ఇంటి ముందు చేరిపోయేరు . కాస్సేపటి తర్వాత మా ఏడుపులు చూసి వాళ్లు నవ్వడం .

– కె . వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

ఆత్మ కథలు, నా జీవన యానంలో...Permalink

One Response to నా జీవనయానం లో…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో