కాళిదాసు కవిత్వం లో స్త్రీ

ISSN 2278 – 4780

కవికుల గురువు కాళిదాసు రచనలు. ఆగాధమైన లోతు కలవి. ధర్మశాస్త్రజ్ఞులు
ధర్మ శాస్త్రంబని, కవి వృషభులు మహా కావ్యమని, నన్నయ్యగారు భారతాన్ని ధర్మ శాస్త్రజ్ఞులకు, కవులకు, రాజనీతిజ్ఞులకు, ఏ దృష్టితో చూచేవారికి ఆయా రస భావస్పోరకంగా వుంటుందని చెప్పారు. ఒక్క భారతమే కాదు, ఏ ఉత్తమ కావ్యమైనా అంతే. ప్రకృతి సౌందర్యం, రసోచితి వంట ఉదాత్త విషయాలతో పాటు కాళిదాసు రచనల్లో ఆనాటి సాంఘిక విషయాలెన్నో మన ముందు నిలుస్తాయి. మానవుని జీవితంలో వివిధ థల్లో తల్లిగా, సోదరిగా, భార్యగా, కుమార్తెగా అనేక రూపాల్లో స్త్రీ అతని జీవితంలో అల్లుకొని పోయి తనదైన వ్యక్తిత్వం ద్వారా పురుషుడి ఉన్నతికైనా, అధోగతికైనా, ప్రత్యక్షంగానూ, పరీక్షంగానూ, దోహదం చేస్తూ వుంటుంది. అలాగే పురుషుని యొక్క స్వభావ, శీలాల వల్ల స్త్రీ యొక్క ప్రకృతి కూడా కొన్ని మార్పులు పొందుతూ వుంటుంది. ఒకరి గొప్ప, మరొకరి తక్కువ అని లేకుండా పరస్పరమైన ఈ అవినాభావ సంబంధాన్ని ప్రాచీనులు బాగా ఆకళించుకున్నారు. తొలి కావ్యపు తొలిపలుకులోనే వాగర్భముల వలె అవినాభావము సమాన ప్రతిపత్తి కలిగిన ఆది దంపతుల్ని ప్రస్తుతించాడు కాళిదాసు. అసలు ఆయన పేరే కాళిదాసు. అమ్మకు ప్రియమైన సేవకుడు. ఇక ఆయన రచనల్లో సర్వత్రా నాటి సంఘంలో స్త్రీకి వున్న ప్రాధాన్యతని తన భావనా బలంతో ఎన్నో రెట్లు పైకి లేపి ఉన్నత శిఖరాల్ని అభివసింప చేసాడు.

ఆయన సృష్టిగా మనకు లభ్యమయ్యే 7 కావ్యాలలో ఋతుసంహారం, మేఘసందేశం కేవలం వర్ణనాతమ్మక, ఖండ కావ్యాలు. అయినా అవకాశం దొరికినప్పుడల్లా స్త్రీ యొక్క బాహ్య , మానసిక సౌందర్యాన్ని తన దివ్య లేఖినితో మనముందు చిత్రిస్తూనే వుంటాడు. రఘు వంశం
మొదటి 8 సర్గలలోనూ కథ శరవేగంతో పరుగెడుతూ ఎన్నో తరాల రాజుల (కథ) చరిత్ర నడుస్తుంది.

అవకాశం దొరికినప్పుడల్లా అనేక ఉదాత్త స్త్రీ పాత్రలు ప్రత్యక్షమవుతూ వుంటాయి.  9వ సర్గ మొదలు 15వ సర్గ పర్యంతం రామ కథ నడుస్తుంది. అందులో 9వ సర్గ రామాయణ గాధకు పీఠికాప్రాయం.  జగదేవకవీరుడు, ఆదర్శపుత్రుడు, ఉత్తమ సోదరుడు, ఆదర్శ ప్రభువు అయిన
రాఉని కథను వర్ణించేముందు, రఘుకులాలంకారులైన ఆ సోదర చతుష్టయం యొక్క తల్లి తండ్రుల గుణశీలాన్ని ఎంతగా వర్ణిస్తాడంటే అంతటి ఉదాత్తులకు యిటువంటి పుత్రులు కాకపోతే మరెవరు పుడతారు అనిపిస్తుంది.

వాల్మీకి, రామాయణంలో ”చండీ మమ మాతా” అని కుమారుడైన భరతుని చేత ”కీప స్వభావురాలు, దురుసు మనిషి అయినా మా అమ్మ కులంలో ఏం ఉపద్రవం తేలేదు కదా
అని తనను వెంటనే బయలుదేరి రమ్మన్న వార్తాహరులను ప్రశ్నింప చేస్తాడు.  ఈ కైకకు ఒక పూర్వ రంగాన్ని సంతరించి, థరథుడంతటి ఉదారుడూ, ధీరుడూ, వీరుడూ అయిన చక్రవర్తిని అంతగా ఆకట్టుకోగలిగిన కైక బాహ్య, అంతర సౌందర్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో చిత్రించాడు కాళిదాసు.  ”తమల బంత పలీం పతిదేవతా, శిఖరిణా మివ సాగర మాపగా:” అని మువ్వురు రాణులను సమాన ప్రతిపత్తిని సూచిస్తూ, ఈ కైక దురహంకారి కాదు.  ఉత్తమ కులజ, పతివ్రత. పరిస్థితుల ప్రాబల్యం వల్ల భర్త మరణానికి కారకురాలుగా కనపడుతున్న ఈమె, పామర స్త్రీ కాదు, అని చెప్తూ, దాన్ని బలపరచడానికి పాయసప్రాసన ఘట్టంలో భర్తయొక్క అభిప్రాయాన్ని మనస్సులోది మనస్సులోనే గ్రహించి పట్టమహిషి కౌసల్యతో పాటు తానూ, తన పాయసంలో సగభాగం యిచ్చి,
సుమిత్రను సగౌరవంగా ఆదరించింది.  ఈ పాయస విభజన విషయంలో వివిధ రామాయణాల్లో
కవులంతా అనేక లెక్కలు లెక్కలు సూచించారు.  అన్నిటిలో కాళిదాసు సమన్వయమే సబబుగా కనిపిస్తుంది. ఇద్దరూ రెండు భాగాలు యివ్వడం వల్ల కవలలు జన్మించారు. ఎవరి పాయసం వలన వారి సంతానంతో మైత్రిగల కుమారులు జన్మించారు. రామలక్ష్మణులు కవలలు కాకపోయినా, ఈ నాటికీ ప్రతీ కవలలకూ స్త్రీ పురుష బేధం లేకుండా వారి పేరునే ధరింప చేస్తున్నారు.  అంతటి బలపరాక్రమాలు లేకపోయినా భరత శతృఘ్నులూ ఆదర్శ జంటే.
”అర్చితా తస్య కౌశల్యా, ప్రియా కైకయ వంశజా, అత: సంభావితాం తాఖ్యాం సుమిత్రా మైచ్ఛ
దీశ్వర:” ఇక్కడ థరథుని దక్షిణ నాయకత్వాన్ని కూడా కవి నిరూపించాడు.  కౌసల్య పూజ్యురాలు, కైక వలపు మిఠారి.  సుమిత్ర వారిద్దరి చేత గౌరవింపబడాలని థరథుడు పెదవి కదల్చకుండానే
సాధించాడు.  కాలం కర్మం కూడి రాక, సంసారం నడివీధిన పడి, యింటి పెద్దకొడుకు, కోడలూ అడవుల పాలై, యజమాని పరలోకానికే తరలిపోవలసి వచ్చింది కాని, అంతవరకూ ఆ సంసారం
గుంభనంగా, సామరస్యంగానే నడుస్తుంది సుమా అంటూ, కావ్య జగత్తులో అంతవరకు అప్రతిష్టపాలైన థరథ మహారాజు సంసారానికి ఒక ప్రతిష్ట కల్పించాడు కాళిదాసు.

ముదివయస్సులో ముచ్చటపడి సంతానాన్ని పొందిన గృహస్తు థరథుడు.  కొడుకులు చేతికెదిగి వచ్చే నాటికి చెవుల్లో జుట్టు కూడా నెరసిపోయేటంతగా జరాక్రాంతుడయ్యాడు.  కాళిదాసు దృష్టికి ఈ విషయం మరోలా గోచరించింది.

”తం కర్ణమూల మాగత్య రామే శ్రీ రామేన్య స్యతామితి
కైకెయ్యా శంకితే వగదతే పలితచ్ఛద్మనా జరా”

ఉత్సాహానికి, యవన శోభకు రూపాంతరం కైక.  ఆవిడ పేరు చెప్నేనే వార్థక్యానికి
హడల్‌.  అంచేత చెవుల్లో జుట్టు తెల్లబడటమనే మిషతో ”ఏమయ్యా! యింకా ఎంతకాలమీ తాపత్రయం.  రాముడికి రాజ్యం అప్పగించి, బంధ విముక్తుడివి కా” అని వార్థక్యం చెవిలో చెప్తుందట.  ఈ భవబంధ విముక్తి ఆయనకు మరోలా కలిగింది.

ఇక సీతమ్మ.  ఆవిడ ఉదాత్తతని లోకమంతా శ్లాఘిస్తూంది.  కాని ఎంతటి సహనానికైనా ఓ హద్దు వుండదా?  అన్ని కష్టాలూ భరించి అగ్ని పరీక్షకు నిలిచినా అవమానించాడే మాట మాత్రం చెప్పకుండా అడవులకు వెడల నడిపాడే!  ఈ సందర్భంగా కవులంతా ముక్త కంఠంతో జగన్మాత పక్షాన నిలిచి రాముణ్ణి దుయ్యబట్టారు.  ఒక్క కాళిదాసు, ఆయన వెనుక, నిర్వచనోత్తర రామాయణంలో తిక్కనగారు మాత్రం అంతటి క్లిష్ట థలో కూడా సీతచేత ఒక పరుష వాక్యం కూడ పలికించక సీతారాముల దాంపత్యాన్ని పరాకాష్ఠకు చేర్చారు.

ఇన్నాళ్లూ కల్పవృక్షంలా వున్న రాముడు ఆమె పట్ల అసిపత్ర వృక్షంగా (నరకంలో వుండే ముళ్ల చెట్టు) మారాడు.  ఈ దుశ్చర్యను సకల చరాచర ప్రకృతీ గర్హిస్తూ ప్రతిఘటిస్తూంది.
ఉత్తుంగ తరంగ హస్తయైన గంగాదేవి తన చేతులను పైకెత్తు ఈ దారుణాన్ని ప్రతిషేదిస్తూంది. ఎక్కడ జానకి ఆడిన ప్రతీ మాటా నర్మగర్భంగా వుంటూ ధ్వనిగా రాముణ్ణి అధిక్షేపిస్తూనే వున్నాయి.
మళ్ళీ ఎక్కడా నిందా వాక్యం కనపడదు.  ఆమె చతురత అంతా ఈ సందర్భంలో వ్యక్తమౌతుంది.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనే కదా వ్యక్తిత్వాలు బయటపడేది.  లక్ష్మణుడిని ”నాయనా! నీ తప్పేం వుందిలే నీవు అన్నచాటువాడివి” అంటూనే  ”బిడౌజసా లిష్ఠురి వాగ్రజాన” అని ఇంద్రోపేంద్రులతో
ఆ అన్నతమ్ముల్ని పోల్చింది.  ఎక్కడో త్రివిక్రమావతారంనాటి బాంధవ్యమిది.  విష్ణువు అదితికి కొడుకై వామనుడిగా పుట్టాడు.  గనుక ఆయన ఇంద్రునికి తమ్ముడు వేదకాలంలో ఇందుడు ప్రధాన దైవం.  శివకేశవులకు ప్రాధానం లేదు.  పురాణకాలంలో విష్ణువే ఇందున్ని కన్నా అధికుడు. ఆయనకు ఏ పదవీ లేకపోయినా ఇంద్రుని ఇంద్రత్వాన్ని సురక్షితంగా కాపాడేది ఆయనే. రామావతారంలో, కృష్ణావతారంలో రావణుడు, నరకుడు మొదలైన రాక్షసుల్ని సంహరిస్తూ ఇంద్ర పదవిని కాపాడుతూ వచ్చాడు.  అటువంటి ఇంద్రోపేంద్రుల బాంధవ్యాన్ని సామ్యంగా
చెప్తూ నీవు సామాన్యుడవు కాదు.  తలచుకుంటే ఈ అన్యాయాన్ని నివారించలేవా? అని ధన్యాత్మకంగా లక్ష్మణున్ని నిలబెట్టి ప్రశ్నిస్తూంది వైదేహి.

తరువాత శ్లోకంలో నా గర్భంలో వున్న ఇక్ష్వాకు కుల సంతతిని తలచి నన్ను దీవిస్తూ వుండండి అని అత్తలకు నమస్కరిస్తూ ప్రార్థిస్తుంది.  ఇక్కడ సుప్రీంకోర్డు న్యాయవాదిలా సీత ప్రతివాదం చేస్తూంది.  ఏనాడో జరిగిపోయింది రావణ సంహారం.  అగ్ని పరీక్షలో నెగ్గాక, పంచ భూతాలూ, ఆఖరికి స్వర్గంలో వున్న థరథుడితో సహా అందరూ ఆమె సౌశీల్యాన్ని నిరూపించాకనే
ఇంటికి తెచ్చాడు రాఘవుడు.  ఇన్నాళ్ళూ ఏ పొరపొచ్చాలూ లేకుండా కాపురం చేసారు.  దాంపత్య ధర్మం సఫలం కాబోతున్న ఈ సమయంలో మీ కుమారుడు చేసిన ఈ పని సబబైనదేనా అని సీత వాచ్యంగా అయితే అనలేదు. కాని భావకుడైన ప్రతి పాఠకుడి మదిలోనూ ఈ భావాలు మొదలవుతాయి. ”ప్రజాభిషేకం ముయివర్తమానం సూనో రనుధ్యాయత చేతసతి” అన్న శ్లోకం
చదివినప్పుడు అనేక విధాలుగా రామున్ని ఔదార్యాన్నీ, తన దురదృష్టాన్ని తలపోసి విలపించాక,
చివరిమాటగా ఓ మహారాజా! నీవు విడచిపెట్టినంత మాత్రాన మన సంబంధం అంతం కాలేదు సుమా!  నీవు రాజువు.  వర్ణాశ్రమాలకు రక్షకుడివి.  తాపసినైన నా క్షేమం విచారించక ఎక్కడకు
పోతావు అంటూంది.  అవును మరి జనకుని ఆస్థానంలో మెత్రేయి, గార్గి వంటి విదుషీమణుల వాదనా పాటవాన్ని ఉగ్గుపాలతో ఆకళించుకుంది.  ఇక్ష్వాకు సార్వభౌముడైన రాముని సహధర్మ చారిణి, పట్ట మహిషి.  ఈమెతో సమానంగా మాట్లాడగలిగిన వారెవరు.
సీత హృదయా వేదనని, అవమాన భారాన్ని వీటన్నింటినీ అతిక్రమిస్తూ రాముని పట్ల ఆమెకు గల అనురాగాన్ని ఈ విధంగా కాళిదాసు చిత్రించాడు.  ఆమె చెప్పే ప్రతి మాటా పది మాటల్ని ధ్వనిగా సూచిస్తూ మన చేత ఆలోచింపచేస్తూంది.

కుమార సంభవం కావ్యం గిరిజా కళ్యాణ గాధ.  లోకమాత కళ్యాణం జగత్తులోని
స్త్రీలందరికీ శుభప్రదం.  ఈ సందర్భంలో సంఘంలో ఆడపిల్ల పరిస్థితి. ఆమె వివాహం పట్ల తల్లితండ్రులకు గల ఆరాటం, బాధ్యత కవి నాటికీ, నేటికీ నిలచిపోయేటంత సహజసుందరంగా చిత్రించాడు. దక్ష యజ్ఞంలో దగ్ధమైన సతీదేవి హిమవంతుని ఇంట వెలసింది.. సతీ సతీయేగా విస్పష్ఠదేహాతాం జన్మనే శైలవథూం ప్రపేదే”.  ప్రత్యేకంగా మేనాదేవి గర్భాన పుట్టాలని సతీదేవి
కాంక్షయట.  జితేంద్రియురాలైన మేనాదేవి అద్రిరాజుల గర్భాన పుట్టాలని ఆమె కోరిక అని మరో శ్లోకంలో చెప్తాడు.  ”సమ్మక ప్రయోగాద పరిక్షతాయాం నీతా లిలోత్సాహ గుణేస సంపతీ” బాగుగా విచారించి ప్రయోగించిన అడ్డులేని నీతివలన ఉత్సాహవంతుని సంపదలా అంటున్నాడు.  ఈ రెండు శ్లోకాలను జాగ్రత్తగా యోచిస్తే ప్రత్యేకమైన అర్థం గోచరిస్తుంది.  దక్షపత్ని అమాయకురాలు, చండశాసనుడైన భర్త దురాగతాన్ని విచారించలేక, గంపెడాశతో పుట్టింటికి పిలువకపోయినా వచ్చిన కన్నకూతుర్ని పన్నెత్తి పలకరించడానికి, కన్నెత్తి చూడటానికి కూడా నోచుకోనిది ఆ తల్లి కళ్లెదుటే ముద్దుబిడ్డ బూడిద కావడం, భర్త యాగం ధ్వంసం కావడమే కాక భర్తకు శిరచ్ఛేదం కూడా జరిగిపోయింది. అయినా ఆమె ఏమి చెయ్యలేక పోయింది.  అయితే ఆమె సామాన్యురాలా? కాదు. సాక్షాత్తు ప్రజాపతి కూతురు.  ఉత్తమ ఇల్లాలు.  అయితే పరిస్థితులకు ఎదురు నిలవగల వ్యక్తిత్వం, అవకాశం కూడా ఆమెకు లేవు.  అందుకే దాక్షాయణి ఈసారి తన కాపురం కలకలలాడటానికి దోహదం చేయగల తల్లిని కోరి ఎన్నుకొంది.  లోకమాత తల్లియైన మేనాదేవి శీలాన్ని ఈ విధంగా ఆది నుంచీ పరిపోషిస్తూ వచ్చాడు కాళిదాసు.  హిమవంతుని ఇంట పెరుగుతున్న పార్వతిని చూచి
నారదుడు ఈమె తన ప్రేమ చేత శివుని అర్థభాగాన్ని పొందుతుందని చెప్పాడు. అప్పుడు
” కన్యావరయతే రూపం మాతా విత్తం” అన్నట్లుగా ఆ బూడిద బుస్సన్నకు పిల్లనివ్వడానికి మేనాదేవి అభ్యంతరం చెప్పిందా? లేదా?  కవి తన సహజ ఛమత్కార ధోరణిలో ఆమె ప్రస్తావనే ఇక్కడ తేలేదు. అవసరమైనప్పుడు ఒక్కమాటలో విశేషార్థాలు స్ఫురింప చెయ్యడం.  ఒక్కోసారి మాట కూడా చెప్పకుండానే పాఠకుడి భావనా సామర్థ్యానికే విషయాన్ని వదలివేయడం ఉత్తమ కవి లక్షణం కదా!  అదే కాళిదాసు ప్రత్యేకత.

ఆనాటి స్త్రీ వినయశీల.  పరిస్థితులు సవ్యంగా జరుగుతున్నంత కాలం ఆమె తెరచాటునే వుంటుంది.  అన్ని విషయాలూ సాకల్యంగా ఆకళించుకుంటూ సమయం వచ్చినప్పుడు
మాత్రమే తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి జటిల సమస్యల్ని పరిష్కరిస్తుంది.  శివునికి పరిచర్య చేయడానికి హిమవంతుడు పార్వతిని నియమించాడు.  తపో దీక్షలో వున్న ఆయనకు పూలు కోసి యిస్తూ, యజ్ఞవేదిక అలికి, ముగ్గులు పెడుతూ, అభిషేక జలం, సమిధలు తెచ్చి యిస్తూ, తచ్ఛిరశ్చంద్ర పాదముల చేత శ్రమని పోగొట్టుకుంటూ ఉపచిస్తూంది పార్వతి.

మన్మథ దాహంతో మూర్ఛపోయిన కుమార్తెను ఐరావతం తామరతూడను వలె
చేతులతో ఎత్తుకొని అత్యంత ఆర్తితో యిల్చు చేర్చాడు తండ్రి.  అప్పుడు మేనాదేవి పార్వతిని ఊరార్చిందో, రుద్రుణ్ణే నిందించిందో, సుకుమారియైన కుమార్తెను ఆ తిక్క శంకరుని సేవకు
నియమించిన భర్తనే సాధించిందో కాళిదాసు మనకేం చెప్పలేదు.  తనంత తానుగా పరిస్థితుల్ని
తరచి ఆలోచించి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని ఆ దంపతులు తమ కుమార్తెకే విడచిపెట్టారు.

శివుని హృదయంలో స్థానం సంపాదించాలంటే తపస్సే సాధనమని నిశ్చయించు
కుంది పార్వతి.  తన మనస్సులోని మాటను తొలిసారి తల్లికే చెప్పింది ఆమె.  ఆ తల్లి ఏమాలో
చించిందో కుమార్తెను బిగియార కౌగలించుకుని తపస్సు చేయాలనే నిర్ణయాన్నుండి మరల్చడానికి
ప్రయత్నించింది.  అల్లారు ముద్దుగా పెరిగిన సుకుమారి తపస్సు చేయడం సాధ్యమా?  కోమలమైన శిరీష పుష్పం మెత్తని తుమ్మెద పాదాన్నయితే సహించగలదు కాని, పక్షిపాదాన్ని సహించగలదా? అయినా ఎందుకమ్మా ఇంత శ్రమ.  దేవతలంతా మన ముంగిటే కదా విహరిస్తూ వుంటారు.  వాళ్లంతా మనకు ఇల్లడ వున్న వాళ్ళే కదా.  వాళ్ళను అర్చించడానికి నువ్వు ఎక్కడకో వెళ్ళడం ఏమిటి?  అని ఆమెను మరల్చడానికి ప్రయత్నించింది.  ఈ మాటల్ని ఆమె సహజపు మాతృత్వపు మమకారం వల్లే అందో కుమార్తె అభినివేశపు లోతుల్ని కొలవడానికే అందో.

ఈ సన్నివేశానికి ముగ్ధుడైన శ్రీనాథుడు తన హర విలాసంలో ” గ్రుచ్ఛి కౌగలించుకొని
అమ్మ హీధర సార్వభౌమ దేవి చతుర భంగి పుత్రి కిట్టులనియె” ”ఇక్కడ లేరే వేల్పులు” అనే పద్యాలతో అపర మల్లినాథ సూరివలె కాళిదాసు శ్లోకాల సోబగుకు అద్దం పడుతున్నాడు.  పల్లానికి పారే నీటినీ, ఈప్సితార్థం పట్ల స్థిరమైన నిశ్చయం గల మనస్సుని అడ్డగించడం ఎవరి తరం?
ఎంత ప్రయత్నించినా కుమార్తె నిశ్చయాన్ని మార్చలేకపోయింది ఆ తల్లి.  తరువాత చెలికత్తెల
చేత తండ్రిని తనకు తపస్సు చేసి కార్యస్థిని పొందటానికి అనుమతి కోరింది.

 – కాశీచైనుల వెంకటమహాలక్ష్మి

(ముగింపు వచ్చే సంచికలో)

UncategorizedPermalink

One Response to కాళిదాసు కవిత్వం లో స్త్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో