ఒసామా – శివ లక్ష్మి

Director: Siddiq Barmak
Country: Afghanistan, Ireland, Japan
Language: Dari Farsi with English Subtitles.
Duration: 84 minutes
Age Group: Above 13 years.

123

Doc021-150x150ఇతివృత్తం : అమానుషమైన స్త్రీ అణచివేత అమలవుతున్న దేశంలో ఒక బాలిక, బాలుడి అవతారమెత్తి పడరాని అగచాట్లు పడుతుంది. ఒక కుటుంబంలోని మూడు తరాల మహిళలను ప్రతినిధులుగా తీసుకుని తాలిబాన్ పాలన లోని ఆఫ్ఘానీ మహిళల దుర్భరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని పార్శ్వాలను దృశ్యీకరించడమే ఈ చలనచిత్ర సారాంశం.
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో ఉన్న సమయంలో ప్రజలపై ఎన్నో రకాల ఆంక్షలు,పెత్తనాలుండేవి.ముఖ్యంగా మహిళలపై అణచివేత మరీ దారుణంగా ఉండేది.వారికి సామాజిక జీవితం నిషేధించ బడింది. తాలిబన్లు స్త్రీలను బురఖా ధరించి తీరాలని నిర్భంధిస్తారు. వారిని ఎవరూ చూడకూడదనుకుంటారు ఎందుకంటే మహిళల ముఖం చూడడం వల్ల సమాజం లోని అన్ని రకాల అధోగతులు చుట్టుకుంటాయని,సర్వ నాశనమవుతుందని తాలిబన్ల బలమైన విశ్వాసం. పనిహక్కు లేదు.పనిహక్కు దేవుడెరుగు,అసలు స్త్రీలు భర్తతో తప్పించి బయట కనపడగూడదు.తప్పనిసరైతే బురఖాలో కాలికున్న చెప్పులు కూడా ఎవరికళ్ళబడకుండా ఒబ్బిడిగా వెళ్ళి, ఇంట్లో కొచ్చి పడాలి. యుద్ధాల వల్ల ఆఫ్గనిస్తాన్ లో మహిళలు వారి భర్తలు, తండ్రులు, కొడుకులను భారీ సంఖ్యలో పోగొట్టుకున్నారు.
ఈ దుర్భర పరిస్థితుల్లో ఒక ఇంట్లో మూడుతరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళలు అమ్మమ్మ-అమ్మ- మనవరాలు సాంపాదించే పురుషుడే లేకుండా దిక్కులేని వాళ్ళవుతారు. ఆమె భర్త ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మరణిస్తే, ఆమె సొదరుడు రష్యన్ యుద్ధంలో మరణిస్తాడు.ఆ ఇంట్లో పోషించే పురుషుడే ఉండడు. వృద్ధురాలైన తల్లినీ,బిడ్డనూ పోషించడం కోసం ఆమె ఒక హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తుంటుంది.అమ్మాయి కూడా తల్లికి తోడుగా అదే హాస్పిటల్ లో చిన్న చిన్న పనులు చేస్తూ అమ్మకు సహాయంగా ఉంటుంది. స్త్రీలు బయటికొచ్చి పని చెయ్యకూడదు అనే ఆంక్షతోపాటు తాలిబన్లు అకస్మాత్తుగా వీళ్లు పని చేస్తున్న హాస్పిటల్ కి నిధులు ఆపేస్తారు.ఆమెకు మూడు నెలల జీతం కూడా రావలసి ఉంటుంది.ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకునే వారెవరూ ఉండరు.పైగా తల్లీ-బిడ్డా ఎవరో పురుషుణ్ణి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకుని ఆ పూటకి ఇల్లు చేరడమే గగనమవుతుంది.
ఆకలితో అలమటించి పోతామని భయపడిన తల్లీ-అమ్మమ్మ రోజులు చాలా గడ్డుగా ఉన్నాయనీ,ఏదో ఒకటి చెయ్యకపోతే ప్రాణాలు నిలుపుకోలేమనీ అనుకుంటారు. ఇంకో దారే లేని పరిస్థితుల్లో మనవరాలికి మారువేషం వేసి, అబ్బాయిగా తయారు చేసి ఏదో ఒక పనికి పంపించాలని భావిస్తారు..బాలిక మాత్రం తాలిబన్లు ఈ సంగతి తెలిస్తే తనని చంపేస్తారని భీతిల్లిపోతుంది. నిస్సహాయంగా భయం భయంగా బేల చూపులు చూస్తూనే గత్యంతరం లేని పరిస్థితిలో అమ్మమ్మ-అమ్మ చెప్పినట్లే చెయ్యడానికి సంసిద్ధమౌతుంది. అమ్మమ్మ అమ్మాయి పొడవైన జుట్టంతా జడలు అల్లి కత్తిరిస్తుంది.అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న బట్టలు తెచ్చి వేస్తుంది.మొత్తానికి అందమైన సుకుమారమైన అమ్మాయి కాస్తా అచ్చం అబ్బాయిలా తయారవుతుంది. తండ్రి స్నేహితుణ్ణి బతిమాలి అబ్బాయికి చిన్న టీ దుకాణంలో పనికి కుదుర్చుకుంటారు. అందరూ మారువేషంలో ఉన్న అమ్మాయిని అబ్బాయనే అనుకుంటారు గానీ తల్లితో పాటు హాస్పిటల్ పనికి వెళ్ళొస్తున్నప్పుడు చూసిన “ఎస్పాండీ” అనే బాలుడు మాత్రం ఈ రహస్యాన్ని పసిగట్టేస్తాడు. అతనే “ఒసామా” అని పేరు పెడతాడు. ఒసామా బాలుడు కాదు బాలిక అని మిగిలిన పిల్లలకు అనుమానం వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఎస్పాండీ ఆదుకుంటాడు. “నాకు తెలుసు.అతను అబ్బాయే,పేరు ఒసామా అని చెప్పి రక్షించడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించవు.
1

ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కనాకష్టంగా బతుకీడుస్తున్న వాళ్ళను విధి ఈ రకంగా కూడా బతకనివ్వదల్చుకోలేదు. గ్రామం లోని బాలుర నందరినీ తాలిబాన్ శిబిరం నిర్వహించే ఒక మతపరమైన పాఠశాలకు తరలిస్తారు. తప్పనిసరిగా ఒసామా కూడా వెళ్ళవలసి వస్తుంది. ఈ పాఠశాలలో మతగురువులు పోరాడే పద్ధతులతో పాటు,భవిష్యత్తులో వివాహాల తర్వాత వారి వారి భార్యలతో ఎలా ప్రవర్తించాలో, తర్వాత స్నానంతో వారి శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా నేర్పిస్తారు. బాలిక తన రహస్యాన్ని తాలిబన్ల నుంచి కాపాడుకోవడానికి అవయవాలను శుభ్రం చేసుకునే సందర్భంలో తప్పించుకోవడానికి విఫలయత్నాలు చేస్తుంది. తాలిబాన్ ఉపాధ్యాయులు పెట్టే నరకయాతనల పరిక్షల సమయంలోనే మెన్సెస్ కూడా వచ్చి ఆమె కాళ్ళనుంచి రక్తం కారడం వల్ల, ఆమె ఒక బాలిక అని వాళ్ళకు తెలిసిపోతుంది. హాస్పిటల్ లో అరెస్ట్ చేసిన ఒక జర్ణలిస్ట్ నీ ,ఒక విదేశీ వనితతో పాటు ఆమెను జైలుకి పంపిస్తారు.పెద్ద పంచాయితీ చేసి మిగిలిన ఇద్దరికీ మరణ శిక్ష విధిస్తారు.ఇంతలో ఒక ముసలి ముల్లా వచ్చి తాను బాలికను వివాహ మాడతానంటాడు.అప్పటికే అతనికి ముగ్గురు భార్యలూ బోలెడంతమంది పిల్లలూ ఉంటారు.అది ఒక శిక్షగా ఆమెను అతనికిచ్చేస్తారు.అతని కౄరత్వం గురించి, అతని వల్ల తమ జీవితాలెలా నాశనమయ్యాయో అతని భార్యలే బాలికకు వివరించి చెప్తారు. సహాయ పడాలని ఉన్నా తాము ఏమీ చేయలేని నిస్సహాయులమని చెప్తారు. ఇంతకు ముందున్న భార్యలతో పాటు బాలికను కూడా బంధించి,ఒక ఇంటిపై భాగంలో పెట్టి పెద్ద తాళం వేస్తాడు. న్యాయ నిర్ణేతను “నన్ను ఈ ముసలివానికివ్వొద్దు. నాకు మా అమ్మ కావాలి.నన్ను అమ్మదగ్గరకు పంపించండి”అని దీనంగా,హృదయ విదారకంగా వేడుకుంటుంది బాలిక.జడ్జి మనసు కరగదు. పన్నెండు సంవత్సరాల పసిపిల్ల పండు ముసలివానికి ఆఖరి భార్య కాక తప్పలేదు.

“సిద్దిక్ బర్మెక్” ఈ సినిమా దర్శకులు.ఆయనే ఎడిటర్, స్క్రిప్ట్ కూడా ఆయనే రాశారు. ఇరానియన్ మానవతావాదం తో ప్రభావితులైన బర్మెక్ ఆఫ్ఘానీ మహిళల దుస్థితిని చాలా ఆర్ధ్ర్తతతో అద్యయనం చేశారు. మహిళల గురించి తాలిబన్ల దుర్మార్గపు ఆలోచనలను ప్రపంచం ముందుంచడానికి “ఒసామా” ను ఎంచుకున్నారు బర్మెక్. కానీ ఒసామా వారి జీవితంలో చిన్న భాగంగా మాత్రమే ప్రతిబింబిస్తుంది. కానీ ప్రతి మహిళ జీవిత సమస్యలను అర్థం చేసుకుని విశ్లేషించడానికి ఎంతో గుండెనిబ్బరం ఉండాలి. అయినా సరే మొట్టమొడటగా ఇంత ధైర్యం చేసిన బర్మెక్.ను ఎంతప్రశంసించినా తక్కువే! ఒక అమ్మాయి -అబ్బాయి వేషం వెయ్యడం గురించి ఒక వార్తా పత్రికలో చదివి ప్రభావితులయ్యారు బర్మెక్. ఒక వాస్తవిక కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి నిజంగా చాలా నిజాయితీతో పాటు ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలవ గలిగిన ధైర్య సాహసాలుండాలి. తాలిబన్ల రాక్షసత్వాన్ని చిత్రీకరించడంలో ఆయనెక్కడా రాజీ పడలేదు అద్దె పరికరాలతో, కాబూలీ వీధి ప్రజలే నటులుగా లు, బహు తక్కువ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు బర్మెక్.

ఒసామా గా నటించిన మెరీనా గోల్బెహార్ (Marina Golbahari), ఎస్పాండీ గా నటించిన ఆరిఫ్ హెరాటీ (Arif Herati ), తల్లిగా గా నటించిన యువతి జుబైడా సహార్ (Zubaida Sahar), ముల్లా గా నటించిన ఖ్వాజా నాదర్ (Khwaja Nader), అమ్మమ్మ గా నటించిన హమీదా రెఫా (Hamida Refah) – వీరందరూ అద్భుతమైన నటులే కాదు,మనసున్న మనుషులు కూడా! వీళ్ళందరి సహకారానికి మహనీయుడైన ఇబ్రహీం గాఫ్యురి ( Ebrahim Ghafur) సినిమాటో గ్రఫీ మరింత అమోఘంగా అమిరింది. యుద్దాలు జరిగిన చాలా సంవత్సరాల తర్వాత యుద్ధ ధ్వంస వాతావరణాన్ని కళ్ళకు కట్టించారు. గొప్ప ఆత్మ విశ్వాసమే ఆధారంగా దృశ్యీకరించిన చిత్రమిది

1996 నుండి ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం పూర్తిగా చిత్రనిర్మాణాల్ని నిషేధించింది. ఈ సినిమా ఆఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్, జపాన్, ఐర్లాండ్ ,ఇరాన్ కంపెనీల మధ్య ఒక అంతర్జాతీయ సహ-ఉత్పత్తి వల్ల ప్రపంచం ముందుకొచ్చింది. తక్షణం చూడవలసిన మిరకిల్ ఈ సినిమా ! నటులే కాని తారాగణం నుండి అద్భుతమైన ప్రదర్శనలు! ఈ సినిమా ఒక షాక్, ఒక విషాదం, ఒక నిరాశ, భయంకరమైన లేమి, మరణం, అన్నీ కలగలిపి ఒక అత్యంత అద్భుతమైన చిత్రాల్లో ఈ చిత్రం ఒకటి !!.

ఈ సినిమా.కథ మహిళలపై వ్యవస్థీకృతమైన అసంబద్ధ క్రూరత్వం గురించి చెప్తుంది. ఒక శతాబ్దం కంటే వెనకున్న ఇటువంటి ఆలోచనలు నమ్మటం కష్టం. మహిళలకు “గౌరవం” సంగతి అటుంచి
అమానుష భౌతిక, మానసిక హింసలు జీవితకాలమంతా ఆఫ్గనిస్తాన్ లో అమలవుతున్నవి. ఒక మహిళను గొంతు వరకూ పాతి పెట్టి ఆ పైన రాళ్ళు రువ్వే దృశ్యం కూడా ఉందీ సినిమాలో! బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని,యవ్వనాన్ని పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా మొత్తం దేశాన్ని తద్వారా తాలిబన్ ఇనుప పాలనను గొప్ప స్కోప్ లో చూపించారు బర్మెక్.

3
ప్రారంభ సన్నివేశాల్లో “క్షమించ గలనేమో కానీ మర్చిపోలేను” అనే నెల్సన్ మండేలా సూక్తి తో సినిమా మొదలవుతుంది. మొదటి సీన్ లోనే పైనుంచి కిందివరకూ ముఖాలుకూడా కనపడకుండా నీలి రంగు బుర్ఖాలు ధరించిన మహిళలు గుంపులు గుంపులు గా కనిపిస్తారు.
“ఆకలి మా ప్రాణాల్ని తోడేస్తుంది”.
“మేము వితంతువులం”.
“మాకు పని కావాలి”
“మేము రాజకీయం చెయ్యడం లేదు”
అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటారు.
చావుకి తెగించి మనుగడ కోసం పోరాటం చేస్తున్న మహిళల మీద తాలిబాన్ సైనికులు నీటి గొట్టాలను వదలడం, గ్రెనేడ్ లాంచర్లు పేల్చడం లాంటి దృశ్యాలను బాలిక తలుపు సందు గుండా చూస్తుంది .ఇది చాలా శక్తివంతమైన దృశ్యం. తర్వాత సినిమా మొత్తం దీనీ కొనసాగింపుగా నడుస్తుంది.

ఇక మన ఒసామాను తాలిబాన్ కర్కోటక మతాధిపతులు పెట్టే చిత్రహింసలు, మతమౌఢ్యంతో కొట్టుకుంటున్న ఆ మూర్ఖ ప్రపంచంలో ఇరుక్కుపోయిన ఒసామా రూపంలో ఉన్న చిన్నారి బాలికను చూస్తుంటే ప్రేక్షకుల గుండెలు భయంతో బిగదీసుకు పోతాయి.ఒక్కోక్షణం గడిచేకొద్దీ ఏమవుతుందోననే ఉత్కంఠ ఊపిరి తీసుకోనివ్వదు.ప్రేక్షకులకు ఎవరికి వారికే సినిమా చూస్తున్నప్పుడు మనందరం ఆధునిక నాగరిక ప్రపంచమనుకుని నివసిస్తున్న ఈ లోకం లోని ఒక చోట స్త్రీలు-బాలికల మీద ఇంత దారుణమైన అకృత్యాలు జరుగుతున్నాయా అనే దిగ్భ్రాంతి కలుగుతుంది. స్త్రీ జనాభా మీద అవ్యాజమైన ప్రేమ పుట్టుకొస్తుంది.తాలిబన్ల మీద జుగుప్సా,అసహ్యం పెరిగిపోతాయి. ఈ భూమ్మీద మనుషుల మెరుగైన మనుగడ కోసం తపించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి!బాధ్యతగా ఆలోచించాలి!! పట్టించు కోవాలి!!!
ఈ చిత్ర ప్రభావం వల్ల మనం చాలా రోజుల వరకూ ప్రశాంతంగా ఉండలేం.బాగా కలవరడుతుంది. దాదాపు ప్రతి వ్యక్తి లో ఒసామా( బిన్ లాడెన్) అంటే ,భయం కలిగించే ఒక పేరు. ఒక వృద్దురాలితోనూ,ఒక చిన్న బిడ్డ తోనూ పురుషుని తోడు లేని ఒక యువతి జీవితం ప్రమాదాల పాలు కానుందని సూచించడానికి డైరెక్టర్ ఈ పేరు పెట్టారనిపిస్తుంది.
సినిమాకి మూలస్తంభం లాంటి కీలక పాత్ర “ఒసామా” ను పోషించిన మెరీనా గోల్బెహార్ కి ఇదే మొదటి సినిమా అన్నా, నటనానుభవం లేదన్నా తెగ ఆశ్చర్యపోతాం. ఆ మాటకొస్తే ఇందులోని నటీ-నట వర్గమంతా ఆఫ్గనిస్తాన్ ప్రజలే! తన బాధను స్త్రీజాతి బాధగా చాటి చెప్పడం లో మెరీనా గోల్బెహార్ సఫలీకృతురాలైంది. తాను బాలిక ననే దానికి గుర్తుగా ఆమె కత్తిరించిన జడలను నిలువుగా అపురూపంగా ఒక చిన్న కుండీలో పాతి పెట్టిన దృశ్యం మర్చిపోలేం. అందమైన, వెంటాడే చిత్రాలూ చాలా ఉన్నాయి!

మానవాళి కి చాలా ముఖ్యమైన విషయాన్ని చర్చించి పరిశీలిస్తుందీ డాక్యుమెంటరీ. ఈ భూమ్మీద మనుషులు ఒకరినొకరు తెలుసుకోవడానికి,చేరువ కావడానికి,ప్రేమించుకోవడానికి అవకాశం కల్పిస్తుందీ సినిమా. మనలో ఒక మనిషి చిత్రహింసల కొలిమిలో తన్నుకుంటుంటే అది మనుషులందరి హింసగా భావింఛాలనే పాఠం కూడా ఉంది.

Festivals & Awards
“AFCAE Award Cannes Film Festival (2003);
Awarded”Cannes Junior Award” Cannes Film festival (2003);
Awarded “Golden Camera Special Mention” Cannes Film festival (2003);
Best Foreign Language Film, Golden globe, USA (2004);
Sutherland Trophy, London Film Festival (2004)

 – శివ లక్ష్మి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యూరోపియన్ యూనియన్ మహిళాచిత్రాలు, సినిమా సమీక్షలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to ఒసామా – శివ లక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో