భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

   

Naseer Ahammad

Naseer Ahammad

జమాలున్నీసా కుటుంబం యావత్తు అటు కమ్యూనిస్టులు కావటంగాని లేదా కమ్యూనిస్టు సానుభూతిపరుగా మెలగటం వలన, ఆ క్రమంలో కుటుంబ సభ్యులు ప్రదర్శించిన నిబద్దత మూలంగా కమ్యూనిస్టుపార్టీలో ప్రముఖులుగా వెలుగొందుతున్న వ్యక్తులతో సత్సంబంధాలు కుదిరాయి. ఆ కారణంగా ఆమె చెల్లెలు, తమ్ముళ్లకు ఖైఫీ అజ్మీ లాంటి ప్రముఖ కవుల కుటుంబం నుండి సంబంధాలు వచ్చాయి. ఆ విషయాన్ని కూడా జమాలున్నీసా ఈ విధంగా వివరించారు.
   

ఖైఫి అజ్మీ నా చిన్న ఆడబిడ్డను పెళ్ళిచేసుకున్నాడు. జకియా(నా చిన్న చెల్లెలు)ను విశ్వామిత్ర ఆదిల్‌కిచ్చి పెళ్ళిచేస్తే బాగుంటుందని ఆయన ఆన్నాడు. ఆదిల్‌ పార్టీ సభ్యుడవడమే ముఖ్యకారణం. అంటే పార్టీసభ్యులంటే ఆరోజుల్లో మంచి అభిప్రాయ ముండేది. వ్యక్తిగత సామర్థ్యముగాని, క్లాసు కల్చరల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ గురించిగాని ఆలోచించే వాళ్ళం కాదు. బతుల్‌ ఇంకోక ఉదాహరణ. ఆమె పార్టీసమావేశాల కొచ్చేది. పాటలు పాడేది, కవిత్వం చదివేది. ఆమె ఒక నవాబు కూతురు. పార్టీలోకి వచ్చింది. ఆమె తండ్రికి ఇంకోక స్త్రీతో సంబంధముండేది. తన తల్లి చనిపోయిందనే కసితో బతుల్‌ పార్టీలో చేరింది. అటువంటప్పుడు ఎన్నాళ్ళుంటుంది పార్టీలో ? కొంతవరకు కమిట్‌మెంట్‌, ఆసక్తి ఉండి రావటం వేరు-ఆమెకొక పదకొండు సంవత్సరాల కొడుకు కూడా ఉండేవాడు. ఆ థలో పార్టీలోకి చాలా మంది స్త్రీలు, పురుషులు వచ్చారు. పార్టీ వాళ్ళకు సైద్ధాంతికంగా సరియైన శిక్షణ కూడా ఇవ్వలేదు. మానసికంగా బతుల్‌ షియా అవటం వల్ల బాధను ఓర్చుకోగల్గాలి అనే భావంతోనూ, తన మానపసిక సమస్యలతోనూ పార్టీలోకి వచ్చింది. వాటిని దాటలేకపోయిదామె. తర్వాత ఆమె భర్తను వొదిలేసింది. పార్టీ మళ్ళీ కలపడానికి ప్రయత్నించింది. కాని చేయలేకపోయింది. పార్టీ ఆమెను సపోర్టు చేసింది. జహీర్‌ ఇంకో ఉదాహరణ. చాలా క్లిష్ట పరిస్థితులలో ఆమె కుటుంబాన్ని వదలి, పార్టీలో కొచ్చింది. మోయిస్‌ను పెళ్ళిచేసుకుంది. ఇద్దరూ పార్టీలో చాలా ఆక్టివ్‌గా ఉండేవాళ్ళు, ఆమె చివరిదాకా. మూడేళ్ళ క్రితం ఆమె కాన్సర్‌తో చనిపోయింది. అతను మెదక్‌ పార్టీ యూనిట్‌కి సెక్రటరీ.
    ఇప్పుడు పార్టీలో సరియైన ప్రోగ్రాం గాని, పనిగాని లేదు. పైగా ఆత్మవిమర్శన చేస్తూవుంటాము. నేను అమ్మాయిలనీ, అబ్బాయిలనీ పిలచి మీటింగులు పెట్టాను. మహేంద్ర కూడా వచ్చాడు. ఎలక్షన్ల తర్వాత ఎవరూ పట్టించు కోలేదు. యువకుల్ని చైతన్యవంతుల్ని చేసి కార్యకర్తలుగా తయారుచేయడానికి ఎటువంటి గట్టిప్రోగాం లేదు. చిన్నవాళ్ళను తేవాలి. మేమింకా ఎన్నాళ్ళు చేస్తాము ? 25,30 సంవత్సరాలు చేశాము. పార్లమెంటరీ బై ఎన్నికలప్పుడు రాజ్‌ (రాజ్‌ బహుదుర్‌ గౌడ్‌) కి చెప్పాను- ఎక్కువగా వోటు వచ్చింది ఆసిఫ్‌ నగర్‌ నుంచి-2200 దాకా, దాంట్లో 25-30 దాకా మా కుటుంబందే. రాజ్‌ అభ్యర్థి కాబట్టి మేమే తప్పనిసరిగా పనిచేయాలనుకున్నాం.
    చివరి వరకు కమ్యూనిస్టుగా కొనసాగిన ఆమె ఆనాటి త్యాగాలను, ఈ వివరాలను తెలిపేనాటికి కమ్యూనిస్టు పార్టీపరిస్థితి, పార్టీనాయకులు వారి కుటుంబాల తీరుతెన్నులను తన కుటుంబ సభ్యుల త్యాగాలతో పోల్చుతూ తన బాధను ఈ క్రింది విధంగా  వ్యక్తంచేశారు.
    ఇక, ఇప్పుడు పార్టీ లీడర్ల పిల్లల్ని చూస్తే…వాళ్ళు పార్టీకై ఏమి చేయరు. కొంత మంది మాస్కో వెళ్ళి వచ్చారు. అయితే పార్టీకేంచేశారు? నా అన్నదమ్ములా- జఫర్‌ ఆక్సిడెంటులో చనిపోయాడు. ఆన్వర్‌ చాలా కష్టాలు పడ్డాడు. జాల్నా జైలులో వున్నాడు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని తర్వాత చనిపోయాడు. ఆయన కూతురు ఎం.ఎస్‌. సి చేస్తున్నది. భార్య తర్వాత చదువుకుని ఉద్యోగం చేసింది…ఆ రోజుల్లో 500 మంది స్త్రీలను పోగుచేయగలిగేదాన్ని. ఇప్పుడు 50 మంది రారు అంటూ అమె నిరాశను వ్యక్తం చేశారు.
    ఈ విధంగా జాతీయోద్యమం, నిజాం వ్యతిరేకపోరాటం, తెలంగాణా రైతాంగ పోరాటాలలో చురుకుగా పాల్గొన్న జమాలున్నీసా చివరి వరకు ప్రజలకోసం పనిచేస్తూ గడిపారు.

తెలంగాణ రైతాంగపోరాటంలో పోరుబిడ్డలను ఆదుకున్న ధైర్యశాలి
 జైనాబీ
   

బలమైన శత్రువును సాయుధంగా ఎదుర్కోవడం కష్టతరమైనప్పటికి సాయుధ పోరాట యోధులకు ఆశ్రయమిచ్చి ఆదుకుని కడుపులోపెట్టుకుని కాపాడగల ప్రజల అండదండలు లభించినట్టయితే ఏ పోరాటమైనా ముందుకు సాగుతుంది. శత్రుగూఢాచారి డేగకళ్ళనుండి తప్పించుకోని ఆశ్రయమివ్వటం, ఆదుకొనటం సామాన్య ప్రజలకు కష్టతరమైన పని. ఆ కర్తవ్యాన్ని నిర్వహించబూనుకున్న ప్రజలు అత్యంత జాగురూకులై మెలగాల్సి ఉంటుంది. కట్టుతప్పితే, పట్టుజారితే ఆదుకున్న వారి ప్రాణాలకు మాత్రమే కాకుండా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యమకారుల  ప్రాణాలకు, ఉద్యమాల మనుగడకు పెనుప్రమాదం దాపురించగలదు. అటువంటి క్లిష్టతరమైన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌లో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో  సాహసోపేతంగా నిర్వహించిన పలువురు మహిళలున్నారు. ఆనాటి మహిళామతల్లులలో శ్రీమతి జైనాబీ ఒకరు.
   

అటు నిజాం పాలకులకు చెందిన రజాకారుల, ఇటు భారతీయ సైన్యం కళ్ళుగప్పి తెలంగాణ రైతాంగపోరాట యోధులకు అందండలుగా నిలచిన జైనాబీ రాజారం గ్రామం నివాసి. చిన్నతనంలో భర్తను పోగొట్టుకున్న ఆమె తన అన్నదమ్ములు, ఒక్కగానొక్క కుమారునితోపాటు రాజరంలో ఉంటున్నారు. అన్నదమ్ములు, కుమారుడు కూలీనాలీ చేసుకుని బ్రతుకు బండిన భారంగా ఈడ్చుతున్న కుటుంబం ఆమెది. భయానక పేదరికం తన కుటుంబాన్ని పట్టిపీడిస్తున్నట్టుగా చుట్టుప్రక్కల ఉన్న ప్రజానీకాన్ని చుట్టుముట్టి ఏ విధంగా సతాయిస్తుందో  స్వయం ఆమెది.
  

  ఆనాడు తెలంగాణ ప్రాంతంలో అటు నిజాం నవాబు, ఆ నిజాం నవాబు పేరుతో బ్రతికేస్తున్న భూస్వాములు వందల వేల ఎకరాలను తమ హస్తగతం చేసుకుని రైతులు, ప్రజల విూద పలు దాష్టీకాలకు పాల్పడుతున్నారు. భూమి విూద తిరుగులేని ఆధిపత్యం తెచ్చిపెట్టిన అహంకారంతో రైతాంగం విూద అంతులేని జులుం ప్రదర్శిస్తున్నారు. ఆనాడు వరంగల్‌ జిల్లా సూర్యాపేట తాలూకా దేశ్‌ముఖ్‌ జానా రెడ్డి ప్రతాప్‌రెడ్ది లక్షా 50వేల ఎకరాలకు, ఖమ్మం జిల్లా మదిర తాలూకా కల్లూరు దేశ్‌ముఖ్‌ లక్ష ఎకరాలకు, నల్గొండ జిల్లా జనగాం తాలూకాకు చెందిన విసున్నూర్‌ దేశ్‌ముఖ్‌ 40వేల ఎకరాలకు, సూర్యాపేట దేశముఖ్‌ 20వేల ఎకరాలకు, మిర్యాలగూడా తాలూకా బాబాసాహెబ్‌పేట దేశ్‌ముఖ్‌ 10వేల ఎకరాలకు తిరుగులేని  అధిపతులు. ఈ మేరకు 5వేల నుండి 10వేల ఎకరాలు కలిగిన మరెరదరో దేశముఖ్‌లు, లక్షల ఎకరాల భూమిని తమ హస్తగతం చేసుకుని రైతాంగం విూద, ఇతర ప్రజల విూద అంతులేని అధిపత్యాన్ని చలాయిస్తున్నారు. 

ఈ భూస్వాములు ప్రజలను గడ్డిపోచల్లా పరిగణిస్తూ, గ్రామాలలో వివిధ వృత్తులతో సేవలందిస్తున్న ప్రజలను తమ ఆజన్మాంత సేవకుల్లా లెక్కిస్తూ భయంకర వెట్టిచాకిరి చేయించుకుంటున్న దారుణపరిస్థితి తెలంగాణలో తాండవిస్తుంది. సంస్థానాధీశులు, రాజకుటుంబీకులు, పైగార్లులు, జాగీద్దారులు, బంజార్దారులు, ఇజ్జద్దారులు, మక్తాద్దారులు, దేశ్‌ ముఖ్‌లు, అగ్రహరీకులు తదితర పేర్లతో ఈ భూస్వామ్య శక్తులన్నీ భూమిని, సంపదను తమ చెప్పుచేతుల్లో తాము అడింది ఆట పాడిండి పాటగా సాగించుకుంటున్నారు.    

భూస్వామి ఆధిపత్యాన్ని ప్రశ్నించినా, అభిష్టానికి కించిత్తు నిరసన వ్యక్తం చేసినా  ఆత్మగౌరవం గల వ్యక్తికి ఇక నూకలుచెల్లినట్టే. ఈ మేరకు విస్నూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం దిశగా సాగిన రైతాంగ యోధులు బందగీ భూస్వాముల కుట్రలకు, కరకు కత్తులకు బలయ్యాలు.ఆయన సాగించిన వీరోచిత న్యాయపోరాటం నేపధ్యంగా రూపొందించిన మా భూమి నాటకం అనాడు రైతాంగ పోరాటాలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. భూస్వాముల అక్రమాలను, ఆధిపత్యాన్ని, అహంకారాన్ని ప్రశ్నించే సాహసాన్ని రైతు జనావళిలో రగిలించింది.
   

ఈ మేరకు సాగుతున్న  భూస్వాముల దోపిడిని అరికట్టేందుకు,  ఆరాచకాలను చరమగీతం పాడేందుకు ప్రజలు  కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో ముందుకు కదిలారు. ఏమిటీ జులుం ఇంకానా? ఇకపై సాగదు అంటూ తిరగబడ్డారు. ఆ కదలిక  చరిత్ర సృష్టించిన తెలంగాణ రైతాంగపోరాటానికి ఆయువుపట్టయ్యింది. ఈ పోరాటంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూస్వాములకు అండగా వచ్చిన శక్తులను ప్రజలు స్త్రీపురుషుల తేడాలేకుండా ఎంతో సాహసంతో ఎదుర్కొన్నారు. అందిన ఆయుధాన్ని, వ్యవసాయ పనిముట్టును తీసుకుని పురుషులు ఎగబడగా, మహిళలు రోకలిబండ, కారం సంచుల తోపాటుగా, వడిసెల పట్టి ముందుకు వచ్చారు. ఈ విధంగా ప్రత్యక్షంగా శత్రువుతో తలపడిన వారు కొందరైతే, పరోక్షంగా పోరుబాటన నడుస్తున్న యోధులకు, దళాలకు ఆశ్రయం కల్పించటం, ఆతిధ్యమివ్వటం, ఆయుధాలను అందివ్వటం, శత్రువు రాకపోకల సమాచారాన్ని చేరవేయటం, పార్టీ నుండి అందిన ఆదేశాలను, రహాస్య సమాచారాన్ని  పోరాట వీరులకు అందచేయడం లాంటి వ్యవహారాలను మహిళలు చాలా సమర్థవంతంగా నిర్వహించారు.
   

ఆ క్రమంలో రాజారం నివాసి జైనాబీ కూడా ఇతర మహిళా యోధురాళ్ళతో సమానంగా అత్యంత ప్రధానమైన రహాస్య కార్యకలాపాలను ఎంతో సమర్ధతతో నిర్వహించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, పోరాటయోధులకు అన్నపానీయాలు అందిస్తూ సహాయపడ్డారు. ప్రధాన దళం నుండి తప్పిపోయిన యోధులను క్షేమంగా దళంలో చేర్చటంలో ఎంతో సాహసోపేతంగా ప్రవర్తించారు. దండు రహాస్యాలు చెప్పమని వేధించిన మిలటరీ హింసాకాండను తట్టుకుని నిలబడ్డారు. భయానక చిత్రహింసలు, వేధింపులకు గురవుతూ కూడా  అత్యంత రహాస్యంగా అతి చాకచక్యంతో శత్రువు గూఢాచారుల కళ్ళుగప్పి దళసభ్యులకు జైనాబీ సహాయ సహకారాలు అందించి, ప్రజలు ప్రధానంగా రైతులు సాగిస్తున్న సాయుధ పోరాటం ఉజ్వలంగా సాగడానికి జైనాబీ తొడ్పడ్డారు.        
   

ఈ విధంగా తెలంగాణ సాయుధపోరాటంలో తనదైన భాగస్వామ్యాన్ని నిర్వర్తించిన జైనాబీ  గురించి ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య విరచిత  తెలంగాణ పోరాటంలో పాల్గొన్న మహిళల గురించి ఆయన తన గ్రంథంలో పేర్కొన్న వివరాలు-విశేషాలను 1999లో ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ‘ తెలంగాణా పోరాటంలో స్త్రీల వీరోచిత పాత్ర ‘ అను పేరుతో తెలుగులో ప్రచురించిన చిన్న పుస్తకంలో (పేజి. 8-9) జైనాబీ విశేషాలను ఈ క్రింది విధంగా ఉటంకించారు.  

జైనాబీ రాజారం గ్రామంలో ఒక పేదకుటుంబీకురాలు. చిన్నతనానే భర్త పోయాడు. ఒక్క కొడుకు, తమ్ముడు, తానూ కూలికిపోయి దాని మీద బ్రతికేవారు. చల్లా సీతారామిరెడ్డి – ఆదిరెడ్డి దళం ఆ దగ్గర గుట్టలనే కేంద్రంగా చేసుకుని పనిచేస్తుండేది. ఆ దళానికి ఆహారం అందించి వస్తుండేది జైనాబీ. భారత సైన్యాలు వచ్చిన తర్వాత పార్టీకి బాగా పలుకుబడిగల గ్రామాలన్నింటా పెట్టినట్టే రాజారంలోనూ ఒక మిలటరీ క్యాంపు పెట్టారు. దానికి భయపడకుండా, అదివరకుకన్న ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ, మరింత ధైర్యంగా దళాలకు ఆహారం చేరవేసే కార్యక్రమాన్ని సాగించింది. ముగ్గురు గెరిల్లా దళసభ్యులు పొరపాటున దారి తప్పి కల్సుకోలేకపోతే, వారికి రక్షణ ఇచ్చి మెల్లగా దళకేంద్రానికి పంపివేయగలిగింది.
   

ఒక రోజున మిలటరీ ఆమె ఇంటిపై దాడిచేసి, ఆమెను బాది ” సీతారామిరెడ్డి ఎక్కడున్నాడో చెప్పు-నిన్ను వదిలేస్తాం ” అంటూ హింసించారు. ” నాకు తెలియదు ” అన్నదే ఆమె జవాబు. జమేదారు అమెను బూటుకాళ్ళతో తొక్కాడు. వారి హింసాకాండకు తట్టుకుని నిలచి, మళ్ళీ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంది. పేదరికం జైనాబీకి అనుభవమే! అందుకే ఆమెకు పార్టీ అంటే అంత ప్రేమ, విశ్వాసమూ.ఈ విధంగా తెలంగాణా పోరాట మహోన్నత దినాలలో ముస్లిం స్త్రీలు, పురుషులు ఇతర సోదర జనసముదాయాలతో కలసి ప్రజల బాగు కోసం ఎంతటి సాహసోపేత కార్యక్రమాలయినా, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిర్వహించేందుకు ముందుకు వచ్చి తమ భాగస్వామ్యాన్ని అందించారు. పరాయిపాలకులు బానిసబంధనాల నుండి విముక్తికోసం గాని, భూమికోసం-భూస్వాముల నుండి విముక్తి కోసంగాని ప్రజలు సాగించిన అహింసాయుత -సాయుధపోరాట కార్యక్రమాలలో ఇతర జనసముదాయాలతో కలసి ముస్లిం మహిళలు ఉద్యమించి చరిత్రను సృష్టించారు.     
   

తెలంగాణ  ప్రజా పోరుకు తొడ్పడిన  యోధురాలు
రజియా బేగం

పరాయి పాలకుల పెత్తనం నుండి స్వదేశీయులను విముక్తిగావించేందుకు నడుం కట్టి ముందుకు నడిచిన మహిళామ తల్లులు కొందరు ఆ లక్ష్యం సాధించగానే విశ్రాతంగా కూర్చోలేదు. స్వదేశీ సంస్థానాలు ఇండియన్‌ యూనియన్‌లో కలవడానికి ఇష్టపడని థలో ఆయా సంస్థానాధీశుల అభిమతాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మేరకు ఉద్యమించారు. అంతటితో ఆగకుండా భూమికోసం-భుక్తికోసం-భూస్వాముల దాష్టీికాల నుండి విముక్తి కోసం సాగిన సాయుధపోరాటంలో కూడా తమదైన పాత్ర నిర్వహించారు. ఆ తరువాత  ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ, ప్రధానంగా మహిళల సమస్యల పరిష్కారం విూద దృష్టిసారించి తామెవ్వరికీ ఏమాత్రం తీసిపోమంటూ నిరూపణకు నిఖార్సయిన నిజంగా నిలచి చరిత్ర సృష్టించిన మహిళా పోరాటయోధులలో రజియా బేగం ఒకరు.

1914 ప్రాంతంలో హైదరాబాదు సంస్థానంలో రజియా బేగం జన్మించారు. ఆమె తల్లి హైదరాబాదుకు చెందిన వారు కాగా తండ్రి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారు. నైజాం సంస్థానంలోని పలు ప్రాంతాలలో ఆయన న్యాయాధికారిగా పనిచేశారు. తల్లి తండ్రులు ఉదార స్వభావులు కావటంలో తమ సంతానానికి తగినంత స్వేచ్ఛ కల్పించారు. ఆ విధంగా తండ్రి నుంచి లభించిన స్వేచ్ఛ ఫలితంగా రజియా బేగంకు అన్నదమ్ముల తోపాటుగా చిన్ననాటనే స్వతంత్రభావనలు అలవడ్డాయి. సన్నిహిత బంధువర్గం మాత్రం సనాతన సంప్రదాయవాదులు కావటంతో రజియా బేగం, ఆమె అన్నదమ్ములు, ఆమెతో పాటు ఉద్యమాలలో పాల్గొన్న కుటుంబ సభ్యులు పలు ఇక్కట్ల పాలయ్యారు.

రజియా బేగం 12 సంవత్సరాల వయస్సులోనే తన అక్కయ్య జమాలున్నీసా బాజి ఇతర కుటుంబ సభ్యులతో కలసి ‘ నిగార్‌ ‘ పత్రికను  చదవటం ఆరంభించారు. ఆనాడు  నైజాం సంస్థానంలో నిగార్‌ పత్రిక విూద నిషేధం ఉంది. లక్నోకు చెందిన నియాజ్‌ ఫతేపూరి సంపాదకత్వంలో నిగార్‌ పత్రిక వచ్చేది. ఆ పత్రిక ఛాందసత్వానికి, మతమౌఢ్యానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా స్వాతంత్య్రం, సామ్రాజ్యవాద వ్యతిరేక లక్ష్యాన్ని ముందుకు తీసుక పోవడానికి కృషిచేసింది. అందువల్ల  ఈ పత్రిక అత్యంత ప్రమాదకరమైనదని నైజాం ప్రభుత్వం భావించి సంస్థానంలోకి దాని ప్రవేశాన్ని నిషేధించింది. (హైదరాబాదు సంస్థానంలో రాజకీయ చైతన్యం, విద్యార్థి-యువజనుల పాత్ర (1938-1956), ఎస్‌.ఎం.జవాద్‌ రజ్వి, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ, 1985, పేజి.25)

ఈ నిగార్‌ ఉర్దూ పత్రిక చదవటం వలన మతపరమైన ఛాందసాలకు వ్యతిరేకంగా, బ్రిటీషర్ల మిత్రుడిగా మారిన నిజాం విూద జమాలున్నీసా  తనదైన స్వతంత్ర అభిప్రాయా లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ,  నేను  ఏడో తరగతిలో వున్నప్పటి నుండి ప్రార్ధనలు చేసేదాన్ని. ఖురాన్‌ చదవటం నేర్చుకున్నాను. నమాజ్‌ చేయటం, ‘రోజా’ అంటే రంజాన్‌ పండగప్పుడు ఉపవాసాలు చేయటం ఇవన్నీ చేసేది. కాలేజీ కొచ్చిన తర్వాత ఇవన్నీ మానేశాను. ఈ కర్మకాండలన్నీ మానేశాను. దేవుడు, కర్మకాండలు వేర్వేరనిపించింది. ‘ నిగార్‌ ‘ ప్రభావం ఉండేది,  అని అమె స్వయంగా చెప్పుకున్నారు. ఆ అభిప్రాయాల స్థిరత్వానికి ఆమె కుటుంబ వాతావరణం కూడా బాగా తొడ్పడింది. ఆమె అన్నదమ్ములు, అక్కయ్య జమాలున్నీసా కూడా స్వతంత్ర అలోచనలు కలిగిన వ్యక్తులు. ప్రజల పక్షంగా పోరాటలతో పాల్గొన్న ఉద్యమకారులు. ఆనాడు నిజాం విూద వ్యతిరేకతతోపాటుగా, మత సంబంధమైన కొన్ని ఆచార సంప్రదాయాల విషయంలో కూడా సమకాలీన సమాజానికి భిన్నంగా ప్రవర్తించటం వలన రజియా బేగం పలు ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ, మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. మతద్రోహులమని పిలిచేవాళ్ళని ఆమె చెప్పుకున్నారు. (మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రైతాంగపోరాటంలో స్త్రీలు-ఒక సజీవ చరిత్ర), స్త్రీ శక్తి సంఘటన, హైదరాబాద్‌, 1986, పేజి.173)

తల్లితండ్రులు ఉదార స్వభావులైనప్పటికి సన్నిహిత బంధువర్గం మాత్రం సనాతన సంప్రదాయవాదులు కావటంతో రజియా బేగం, ఆమె అన్నదమ్ములు, ఆమెతో పాటు ఉద్యమాలలో పాల్గొన్న కుటుంబ సభ్యులు పలు ఇక్కట్ల పాలయ్యారు. ఆ ఇబ్బందులను ఏమాత్రం ఖాతరు చేయకుండా తాము నిర్దేశించుకున్న మార్గంలో రజియా బేగం, తన సోదరి జమాలున్నీసా బాజి అన్నదమ్ములు అన్వర్‌, అఖ్తర్‌లతో కలసి ముందుకు సాగారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేయటం ప్రధానాశయంగా సాగిన ఆమె ఆ దిశగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు.
 

ఆ విషయాలను రజియా బేగం వివరిస్తూ,  మా కుటుంబం చాలా సంకుచిత స్వభావం కలది. ఒక్క మా తండ్రిగారే ఉదార స్వభావం కలవాడు. మేము పల్లెటూళ్ళో ఉండేది. బాజీ పెళ్ళయ్యిన (జమాలున్నీసా బాజి) తరువాత మాకు పట్నంలో ఒక చోటంటూ దొరికింది. మేము ఉర్దూ, పర్షియన్‌ నేర్చుకున్నాం. ఇంగ్లీషు వచ్చేదికాదు. ఒక గోడపత్రిక ‘ తమీర్‌ ‘ అని ప్రారంభించాం. అంతా చేత్తోనే రాసేవాళ్ళం. మేం చదివి ఇతరులను కూడా చదివించేవాళ్ళం. ఇంగ్లీషు నేర్చుకోవడం ప్రారంభించాను. రెండు డిక్షనరీలు ఉర్దూ-ఇంగ్లీషు-ఉర్దూ పెట్టుకుని నేర్చుకున్నాను. షేక్స్‌పియర్‌, విక్టర్‌ హ్యూగో చదివాను. అర్థమయినపుడు యెంతో ఆనందించాను. మెల్లిగా అనువాదాలు చేయడం ప్రారంభిం చాను. ‘ ఇవాన్‌ ‘ అనే పత్రిక చదవటం మొదలుపెట్టాను. చిన్న చిన్న కథలు రాయటం, తర్వాత ఉస్మానియా జర్నల్‌లో ప్రచురిచటం మొదలు పెట్టాను. ఒక నవల కూడా రాశాను, అని అన్నారు. (మనకు తెలియని మన చరిత్ర  పేజి.173)

ఆ విధంగా స్వయం కృషితో విద్యార్జన వైపు దృష్టిసారించిన రజియా తనకు నచ్చని ఆచారాలను పద్దతులను ఎంతో ధైర్యంతో వ్యతిరేకించారు. ఆ ప్రయత్నంలో మిత్రులను సంఘటిపర్చి సంఘం ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సాహిత్య కార్యక్రమాల పట్ల అత్యధిక శ్రద్దచూపారు. ఆ కార్యక్రమాలలో, యూనుస్‌ సలీమ్‌, ముస్లిమ్‌ జియా, ఇంకా చాలమంది రచయితలు నియాజ్‌, జాకిర్‌, హుస్సేన్‌, సాహిర్‌, జిగర్‌, సిద్ధిఖీ లాంటి కవులు వచ్చేవాళ్లు, కొంతమంది మా ఇంట్లోనే వుండేవాళ్లు. సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా జరిగేవి. మేమంతా మార్కిస్ట్స్‌ సాహిత్యం చదవలేదు. కాని నిగార్‌లో కొన్ని వ్యాసాలు వచ్చేవి. ఉర్దూ పత్రికలు చాలా ఉండేవి. రాజకీయల సమస్యలు కూడా చాలా చర్చించేది. యుద్ధ్దం , జర్మనీ, హిట్లర్‌, మొదలైనవి. ఉర్దూ, ఇంగ్లీషు పుస్తకాలు చాలా తెప్పించుకుని ఎన్నో నేర్చుకునే వాళ్ళం, అని రజియా వివరించారు.

చదువు విూద ఆసక్తిగల రజియా బేగం ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. ప్రధానంగా ఆంగ్లం నేర్చుకోవానుకున్నారు. అందుకు ఓ యువకుడ్ని నియమించుకున్నారు. అయితే ఆ ఏర్పాటును సంబంధీకులు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని ఆమె సోదరి జమాలున్నీసా బాజి చెబుతూ, రజియాకు ఇంగ్లీషు చ్పెటానికి ఒక బ్రహ్మణ అబ్బాయి వచ్చేవాడు. మా కుటుంబం అభ్యతంతరం పెట్టింది. బంధువులంతా వెలివేశారు. చాలా కొద్దిమంది అమ్మాయిలు  ఆ రోజుల్లో చదువుకునేవాళ్ళు. మా అమ్మ మమ్మలెప్పుడూ సపోర్టు చేసేది. ఒక స్నేహితురాలిలాగా, అని తల్లితండ్రుల ధోరణిని వివరించారు. ఈ విధంగా తల్లి-తండ్రి ప్రోత్సాహంలో రజియా బేగం యం.ఎ వరకు చదువుకున్నారు. ఆమె చదువు, విముక్తి పోరాటంలో భాగస్వామ్యం పెనవేసుకుని సాగాయి.

అక్క, అన్నదమ్ములతో కలసి ఆమె కూడా జాతీయోద్యంలో భాగస్వాములయ్యారు.  ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు మౌల్వీ హస్రత్‌ మోహాని రజియా బేగం కుటుంబానికి సన్నిహిత బంధువు. ఆయన తరుచు హైదరాబాదుకు రావటమే కాకుండా ప్రపంచ యుద్ధ్దం సమయంలో ఆయన హైదరాబాదులో చాలా కాలం ఉన్నారు. ఆయన ప్రభావం రజియా కుటుంబం విూద ఉండేది. ఆ ప్రభావం నుండి రజియా బేగం తప్పించుకోలేకపోయారు. స్వతహగా స్వేచ్ఛాయుత భావాలు గల ఆమె బ్రిటీషు బానిసత్వం నుండి విముక్తిని కోరుకున్నారు.ఆ కృషిలో భాగంగా ఆమె స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారు. జాతీయోద్యమ కార్యక్రమాల నిర్వహణకు అవసరమగు నిధులను నాయకులకు అందచేయటంలో చిన్నతనం నుండే బాధ్యతలు నిర్వహించారు. ఈ దిశగా చురుకుగా పనిచేస్తూ కూడా మొదట్నించీ జాతీయోద్యమంలో వుండేవాళ్ళం. మేమేం చేయడంలేదని ఎప్పుడూ అన్పించేది, అని రజియా సోదరీమణులు చెప్పుకున్నారు.

ఆ క్రమంలో సాగుతున్న రజియా కుటుంబానికి కమ్యూనిజం పరిచయం కావటంతో ప్రజల పక్షాన నిలచి పోరాడే స్వభావం గల రజియా అక్కచెళ్ళల్లు కమ్యూనిస్టు పార్టీ వైపుకు మొగ్గుచూపారు.  ఆ  పరిచయం మరింత ముందుకు వెళ్ళింది. ఆ విషయాన్ని వివరిస్తూ, 1941లో అభ్యుదయ రచయితల సంఘం అని ఒకటి వుండేది. మఖ్దూం, నజర్‌ హైదరాబాద్‌ ఎప్పుడూ వస్తూండేవారు. మేం నలుగురు అక్కచెల్లెళ్ళం. ఈ మీటింగులకి బహిరంగంగా వెళ్ళేవాళ్ళం. అమ్మకూడా వచ్చేది. కొంతమంది చిల్‌మన్ల (చాటున) వెనుక కూర్చునేవాళ్ళు…సజ్దాద్‌ జహీర్‌, ఓంకార్‌, పర్షాద్‌ లాంటి వాళ్ళు చాలా మంది అండర్‌గ్రౌండ్‌లో వున్నప్పుడు మా యింట్లో వుండేవాళ్ళు, అని పేర్కొన్నారు.

ఆ పరిచయాల కారణంగా ఏర్పడిన నూతన అభిప్రాయాల వలన రజియా బేగం కుటుంబం 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన లేదు. అయితే క్విట్‌ ఇండియా ఉద్యమం పట్ల సానుభూతి ఉండేదని ఆమె స్వయంగా వెల్లడించారు. 1942 ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ విూద నిషేదం విధించిన సందర్భంగా కూడా రజియా బేగం రహాస్యంగా కమ్యూనిస్టుల కార్యకలాపాలకు తొడ్పాటు అందించారు. నిజాం సంస్థానంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులే పలు ఇక్కట్లు పడుతుండగా, నిషేదిత కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరులుగా మరిన్ని కష్టాలు పడాల్సిన భయానక వాతావరణంలో కూడా రజియా బేగం కుటుంబం కమ్యూనిస్టు ఉద్యమకారులకు చేయూత నిచ్చారు.

ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూనే 1944లో రజియా బేగం యం.ఎ పూర్తి చేశారు. చదువుకుంటూనే ఆమె తన సోదరి జమాలున్నీ బాజిలో కలసి జాతీయోద్యమ కార్యక్రమాలు, కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలలో రహస్యంగా పాల్గొటూ వచ్చారు. చివరకు భారతీయులు స్వరాజ్యాన్ని సాధించుకున్నాక వెనువెంటనే ఆరంభమైన ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనం కోసం సాగిన పోరాటంలో తనదైన పాత్ర వహించారు. ఆ పోరాటం అంతిమ థకుచేరుతున్న సందర్భంగా అంకురించిన తెలంగాణ పోరాటంలో రజియా బేగం కుటుంబం యావత్తు పాల్గొంది. ఆమె సోదరి జమాలున్నీసా బాజి, ఉద్యమకారులైన తన అన్నదమ్ములు అన్వర్‌, అఖ్తర్‌ ఇతర సన్నిహిత బంధువులు కూడా తెలంగాణ పోరాటంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పాత్రధారులయ్యారు.   

ఈ సందర్భంగా రజియాబేగం పోలీసుల దాష్ట్టీకాలను ఎదుర్కొన్నారు.పలు మార్లు అరెస్టులకు గురయ్యారు. జైలులో కూడా గడిపారు. ఈ విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ,   ఆ రోజుల్లో చాలా మంది కామ్రెడ్లుతో పోరాటం గురించి మాట్లాడేదాన్ని, జైల్లోవున్నప్పుడు, ఒక స్త్రీ కామ్రోడ్‌తో మాట్లాడేదాన్ని. ఒక డైరీ కూడా రాసేదాన్ని. ఆది దొరికితే ఇంకా చాలా వివరాలు తెలుస్తాయి. నాకొక గది ఉండేది, అని ఆమె అన్నారు. ఆనాడు తెలంగాణ పోరాటయోధులు రావి నారాయణ రెడ్డి నాయకత్వంతో రజియా తన సోదరి- సోదరులతో కలసి పాల్గొన్నారు. నాయకుల ఆదేశాలను తు.చ తప్పక పాటిస్తూ, ఆడమగ భేదం లేకుండా ఎటువంటి ప్రమాదకర పని అప్పగించినా, ఏ తెలియని ప్రదేశానికి వెళ్ళిరమ్మని పంపినా ఏమాత్రం అధైర్యపడకుండా ఎంతో సాహసంతో ఆ బాధ్యతలు రజియా బేగం నిర్వర్తించారు.

ఉద్యమకార్యక్రమాలలో భాగంగా  పోరాట యోధులకు ఆశ్రయం కల్పిచటం, ఆయుధాలను దాచి పెట్టటం, ఉద్యకారులకు అందచేయటం, ఉద్యమకారులకు సమాచారాన్ని చేరవేయటం తదితర పనులను తమ ఇంటిని, ఆ పరిసర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రజియా బేగం నిర్వహించారు. ప్రముఖ కమ్యూనిస్టు నేతలు డాక్టర్‌ మహేంద్ర, రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొహిద్దీన్‌, రాజ్‌ బహుద్దూర్‌ గౌడ్‌, జవ్వాద్‌ రజ్వీ తదితరులకు ఆమె ఇంట్లో ఆతిధ్యం, ఆశ్రయం లభించింది. ఆ ఆశ్రయం నుండి నాయకులను మరింత సురక్షిత ప్రాంతాలకు చేరవేయటం లాంటి కార్యక్రమాలను పోలీసుల నిరంతర నిఘా నీడల్లో కూడా రజియా సమర్థవంతంగా నిర్వహించారు.

 1951 ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించాలా? కోనసాగించాలా? అను అంశం చర్చనీయాశంమైంది. ఆ సమయంలో, అఖ్తర్‌, గోపాలన్‌ ( ఎ.కె. గోపాలన్‌), జ్యోతిబసు, ముజఫర్‌ అహమ్మద్‌తో ఏర్పడిన డెలిగేషన్‌ ఒకటి వచ్చి- 1951లో సాయుధ పోరాటం కొనసాగించాలా? విరమించాలా? అనే విషయం చర్చించడానికి వచ్చారు… ఆ విషయం  గురించి చాలా రాత్రి వరకు మీటింగులు, చర్చలు జరిగేవి అని ఆమె వివరించారు. ఈ విషయంలో తన తండ్రి  ఎంతో సహకరించారని  విచ్చన నాయకులకు రజియా కుటుంబం తమ ఇంటి ముందు గల గృహంలో బస ఏర్పాట్లు చేశారని  ఆమె వెల్లడించారు.
 తెలంగాణ పోరాటం ముగిశాక పార్టీలో కొంత మేరకు స్తబ్దత ఏర్పడింది. ఆ తరువాత ఎన్నికలు రావటంతో రజియా ఆ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. సోదరి జమాలున్నీసా బాజితో కలసి ఆమె ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. చదువు విూద, మహిళా అభ్యున్నతి కార్యక్రమాల విూద  ఎక్కువగా దృష్టి సారించారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు వివిధ వృత్తులలో శిక్షణ, మహిళలలో చైతన్యం కలిగించేందుకు రాత్రి బడులు, గ్రంథాలయాలు ఏర్పాటు, ప్రగతిశీల సాహిత్యం చదివించటం, ఆయా అంశాల విూద చర్చలు జరపటం ఈ కేంద్రాలలో జరిగేది. ఈ కేంద్రాలకు ప్రమీలా తాయి లాంటి ప్రముఖులు విచ్చేశారు. ప్రముఖ కమ్యూనిస్టు నేతలు రజియా బేగం కుటుంబంలోని మహిళలు పలు మహిళా కేంద్రాలను ప్రారంభింప చేసి ఆ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఆ కార్యక్రమాలలో భాగంగా కలకత్తా, ఢిల్లీ లాంటి ప్రాంతాలతో జరుగు అఖిల భారత

మహిళా సంఘాల సమావేశాలలో ఆమె పాల్గొంటూ మహిళా ఉద్యమాలకు చేయూతనిచ్చారు.
చిన్నప్పటి నుండి రచనా వ్యాసాంగం విూద అధిక ఆసక్తి చూపిన రజియా బేగం 1944 ఎం.ఏ చేసి వుమెన్స్‌ కాలేజిలో లెక్చరర్‌ అయ్యారు. ఆ తరువాత 1966లో యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజిలో చేరారు. పర్షియన్‌లో పి.హెచ్‌.డి ఇరాన్‌లో చేశారు.  సరోజిని నాయుడు కుమార్తె  లీలామణి నాయుడుతో కలసి  కాలేజీలో సాహిత్య గోష్ఠులు జరుపుతూ ఔత్సాహిక కవులకు-రచయితలకు తోడ్పాటు అందించారు.  తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమాల తరువాత రజియాకు రాజకీయాల పట్ల అసక్తి తగ్గుముఖం పట్టింది. ఆ సమయంలో ఆమె తండ్రి రిటైర్‌ కావడంవల్ల, మిగతా వాళ్ళంతా పార్టీలో పని చేస్తుండటం వల్ల ఆమె కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. ఆర్థికంగా స్థిరపడి కుటుంబ భారాన్ని మోస్తున్నప్పటి పురుషులతో సమానమన్పించకపోవటంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని మరింత విస్తారంగా వివరించారు.

ఇంట్లో అంతా తోడ్పడేవాళ్ళు. పురుషులు కూడా కొంత పనిచేసేవాళ్ళు. పిల్లలు కూడా కొంత చేసేవాళ్ళు. అయినప్పటికీ కొంత మన బాధ్యతే అన్పిస్తుంది. కొన్ని కారణాలు పరిశీలించాలి. స్త్రీగా వుండటమనేది ఒకటి. యుగాల నుంచి వస్తున్న సాంఘిక వ్యవస్థ ఆమెను తక్కువ స్థాయిలో వుంచింది. ఆర్థిక స్వాతంత్య్రం వున్నప్పటికీ, స్త్రీ పురుషుని కంటే తక్కువగానే భావిస్తుంది. అతని మీదే ఆధారపడుతుంది. స్త్రీ ఒంటరిగా  ఉండటం మనేటటువంటి భయం ఘోరమైంది, ప్రపంచమంతటా వుంది. ఆమె తను ఒంటరిగా బయటకెళ్ళడానికి భయపడతారు, పురుషులైతే ఒంటరిగా వెళతాడు, ఎవరూ బాధించరు. పురుషుడికి స్వేచ్ఛవుంది. స్త్రీలను ఏ విధంగా చూస్తారనే దాని గురించి పుస్తకాలు రాస్తున్నారు. ఈ బంధాలెలా తెంచుకుంటామనేది చూడాలి. సిండరెల్లా అనే చక్కని పుస్తకంలో, స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నప్పటికి ఇంకా విముక్తి పొందకుండా వుండటమనే సమస్య  గురించి చర్చించారు. ఆ రోజుల్లో ఆర్థిక స్వాతంత్య్రమే ముఖ్యమైన సమస్య అనుకునేవాళ్ళం. నేను చదువుకుని, సంపాదించి ఎవరి మీద ఆధారపడకుండా వుంటానని నిర్ణయించుకున్నాను. నాన్నకు చెప్పాను, ఆయన ఏమీ అభ్యంతరం పెట్టలేదు, కాని బంధువులు విమర్శించారు. తర్వాత కూడా పెళ్ళి గురించి ఆలోచించలేదు. నాపనిలో నిమగ్నురాలినై, దాని గురించి ఆలోచించలేదు. బహుశ సరియైన సమయంలో ఎవరూ కనిపించలేదేమో! అన్ని సంబంధాలు కూడా వరకట్నం, బేరాలతో నియమించబడేవి. అవంటే అసహ్యం వచ్చి, ఎవరితోటీ ఆ విషయం గురించి మాట్లాడకపోయేది. నాన్న కూడా వాటిని వ్యతిరేకించేది. మా కుటుంబంలో చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు.

ఈ వాక్యాలు ఆమెలోని విప్లవాత్మక భావాలకు అద్దం పడతాయి. ఆ ఆభిప్రాయా లతో స్నేహం చేసిన రజియా బేగం చివరి వరకు వివాహం చేసుకోలేదు. చిన్న వయస్సు లోనే జాతీయోద్యమం, ఆ తరువాత కమ్యూనిస్టు ఉద్యమం, ఆ క్రమంలో ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనోద్యమం, అటు తరువాత తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు రజియా బేగం ఉద్యమాల చరిత్రలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

( ఇంకా ఉంది )  

– సయ్యద్ నశీర్ అహమ్మద్  

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

130

ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో