కవిత్వంలో జీవితాన్ని ఇమిడ్చిన విశ్వకవిసామ్రాట్ “గుర్రం జాషువా”

                పుట్టుకతో దళితుడై, కృషిలో కవిశేఖరుడై, నవయుగకవి చక్రవర్తియై తెలుగు సాహితీ గగనంలో విజయ కేతనాన్ని ఉవ్వెత్తున ఎగరేసిన విశ్వమానవుడు గుర్రం జాషువా. తాను పడిన వేదనని గుండెకు గుచ్చుకునేలా హృద్యంగా వర్ణించిన మహాకవి. సాహిత్యంలో నిమ్నవర్గాలకు ప్రవేశం లేని కాలంలో సగర్వంగా దళిత బావుటాని ఎగురవేసి ఆనాటి మహాపండితుల చేత గండపెండేరాలు తొడిగించుకొన్నవాడు. నేటి దళిత, శ్రామిక వర్గం అదిగో మా కీర్తిశిఖరం, అది గదిగో మా అక్షరబావుటా అని గర్వించదగిన కవి గుర్రం జాషువా.  

                       ఆయన కవిత్వంలో మాటలగారడీలు లేవు. అలంకారాలు, ఆడంబరాలు అసలే లేవు. పాండిత్యపు కసరత్తులు అంతకన్నా లేవు. కవితా మహారాష్ట్రానికి మకుటంలేని పీష్వా అని కవితా ప్రియులచే అనిపించుకొన్న ధన్యజీవి  నవ యుగకవి చక్రవర్తి గుర్రం జాషువా. తెలుగు కవితా పూదోటలో విరిసిన గుల్ మొహర్ గుర్రం జాషువా. తన పద్యం నడకలో గుర్రం గిట్టల సవ్వడిని వినిపించిన మధురకవి. ఈయన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన అమూల్య కవి మాణిక్యం. తండ్రి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన యాదవుడు, తల్లి నిమ్న కులానికి చెందిన మహిళ. ఇద్దరిదీ వర్ణాంతర వివాహం. ఆ కారణం వల్ల ఏ మతం వాళ్ళు జాషువాని ఆదరించలేదు.

                      దానికితోడు మూఢాచారాలతో నిండిన ఆనాటి సమాజం బాలుడైన జాషువా మీద ఛీత్కారాల వర్షం కురిపిం చింది. బడిలో చేరిన తరువాత ఉపాధ్యాయులు తోటి విద్యార్థులనుంచి అవమానాల జడివాన ఎదురైంది. దానితో తనను ఛీత్కరించిన వారిపై తిరుగుబాటు చేసి విజయం సాధించడం బాల్యం నుంచే అలవాటుగా మారింది. కటిక బీద కుటుంబంలో జన్మించినా, సహజాతమైన సుకవిత్వ సంపదను వదలలేదు. సాహితీ లోకంలో కూడా వివక్షని, చిన్న చూపుని భరించిన జాషువా తన కవిత్వం ద్వారా కవిగా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. కాబట్టి ఏ సామాజిక ఆర్ధిక నేపధ్యం నుంచి జాషువా జీవితం సాగింది అనేది తెలుసుకుంటేనే ఆయన కవిత్వాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోగలుగు తాం.

                          జాషువా చిన్నతనం నుంచి అటు వ్యక్తిగా, ఇటు కళావేత్తగా కుల వివక్షత వల్ల ఎంతగానో నలిగిపోయాడు. ‘నా కథ’ లోని ‘వ్యధా ఘట్టములు’ ఆ గుండెకోతకు, ఆ ఆవేదనకు అక్షర రూపాలుగా కనిపిస్తాయి. “లోకం నా వంక కోరగా, వారగా చూచింది, అనాదరించింది, అసత్కరించింది, సత్కరించింది, దూరపర్చింది, చేరదీసింది” (నా కథ – ఒక మాట) అనే ఈ మాటలు జాషువా జీవిత ప్రస్థానాన్ని తెలియచేస్తాయి. జాషువా హృదయాన్ని కలచి వేసిన సంఘటన లెన్నెన్నో అతని జీవితంలో జరిగాయి. ఆయన కవితా సృష్టికి ప్రత్యక్ష నేపథ్యాలైన (కారణాలైన) ఆయా సంఘటనలను తెలుసుకుంటూ జాషువా కవితా హృదయంలోకి తొంగిచూడడమే ప్రస్తుతాంశం.  

                          చిన్నతనంలో ఒక రోజు జాషువా వినుకొండ పట్టణంలోని ఒక వీధిలో వెళుతుండగా, అగ్రవర్ణానికి చెందిన మరో బాలుడూ ఆ వీధినే పోతూ “నన్ను తాకకు, దూరంగా పో!” అని ఈసడించుకున్నాడట. ఆ అవమానాన్ని భరించ లేక తన ఆవేదనను తల్లిముందు వెళ్ళబుచ్చగా ఆమె బాలుని కన్నీరు తుడిచింది. తన కళ్ళలో నీళ్ళుబుకుతున్నా తమాయించుకుంది. ఆ పిల్లవాడే మరికొంచెం ఎదిగి కవితలల్లటం మొదలుపెట్టాడు. బాలకవిగా తాను రాసిన రాతల్ని చూసి శెబాష్ అని మెచ్చుకొనేవాడు ఏ ఒక్కడూ లేకపోయేసరికి మళ్ళీ వ్యధకు గురి కావలసి వచ్చింది. మద్దెలకి డోలు తోడైనట్లుగా తన ఊళ్ళోని వైష్ణవ పూజారి కూడా ‘ఇతర జాతులు కైతలల్లరాద’ని ‘పురాణయుగ ధర్మసూత్రాల’ను వల్లించి, జాషువా లేత మనసును గాయపరిచాడు.

                       ఆయన కవితా వ్యాసంగ ప్రారంభదినాలలోనే జరిగిన మరొక సంఘటనని చూద్దాం. తన ఆశుకవితా నైపుణ్యం తో కొప్పరపు సుబ్బారావు అనే పండితుడు వినుకొండలో జరిగిన ఒక సభలో ప్రజలను ఉర్రూతలూగించాడు. జాషువా ఆయన్ని అభినందిస్తూ పద్యాలు అప్పటికప్పుడు ఏవో గిలికాడు. వాటిని ఆయనకు అందజేయటానికి భయపడుతూ, సభాస్థలి దగ్గర తారట్లాడే జాషువాని ఆయన బ్రాహ్మణమిత్రుడొకడు వేదిక దగ్గరకు తీసుకెళ్ళాడు. సుబ్బారావు పద్యాలు తీసుకొని చదివి, సహృదయంతో బాలకవిని అభినందించాడు. సభలో ‘గుసగుసలు’ బయలుదేరాయి. ‘అభాగ్యుడీ నిమ్నజుడు సభ లోని కెట్టు జొరబడెన’ని పదిమందీ వెంటనే లేచి వెళ్ళిపోయారు. అలనాడు భారత కాలంలో అస్త్రవిద్యా ప్రదర్శనలో కర్ణుడికి జరిగిన అవమానమే తిరిగి జాషువాకీ తన జీవితంలో ఈ రూపంలో జరిగింది. ఆ రోజంతా ఇల్లు దాటి బైటికి రాకుండా, భోజనం చేయకుండా, తనలో తానే ఏడ్చు కుంటూ దుఃఖంలో తలమున్కలై పొద్దుపుచ్చాడట.

                       అందుకేనేమో “చక్కని కవితకు కులమే/యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం/కెక్కడి ధర్మము తల్లీ? /దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రీ!” (ఖం.కా.భాగం-2,సందే) అని ఎంతగానో బాధపడ్డాడు. ఇలాంటి సన్నివేశాల నెన్నింటినో ఆయన కవిగా నిలదొక్కుకునే రోజులలో ఎదుర్కొన్నాడు. “కవీ! కుల భేద శాకినుల్‌ మెదలెడు దేశ మిద్ది నిను మెచ్చదు, మెచ్చిన మెచ్చకున్న శారద నిను మెచ్చె, మానకుము ప్రాప్తకవిత్వ పరిశ్రమంబులన్‌” (నా కథ)- అని జాషువా భుజం తట్టి కందుకూరి వీరేశలింగం అన్న మాటలు జాషువాకు ఆదర్శాలయ్యాయి.

                          అలాగే 1933-34 సం.ల ప్రాంతంలో ఒకనాడు జాషువా వెంకటగిరి రాజైన యాచేంద్రభూపతిని సందర్శించ టానికి రైల్లో వెళ్తున్నాడు. రైల్లో పరిచయమైన వ్యక్తి జాషువా కవి అని తెలుసుకొని ఆయన కవితలు విని ఎంతో సంతో షించాడు, జాషువాను ఎంతగానో అభినందించాడు. ఇంతలో ప్రసంగం కులం మీదకు మళ్లింది. జాషువాని ఆయన ‘మీదే కుల’మని ప్రశ్నించాడు. జాషువా చెప్పాడు; అంతే అప్పటి వరకు జాషువాని పొడిగిన వ్యక్తే చివాలున లేచి వెళ్లి పోయాడు. గుండెను పిండే ఈ సంఘటన జాషువా హృదయాన్ని కలచివేసింది. అందుకే ఆ బాధ

“నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూప రే

ఖా కమనీయ వైఖరులు గాంచి ‘భళిభళి’! యన్నవాడె మీ

దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో

బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్” (ఖం.కా.భాగం-2)

                              అనే పద్యంగా అవతరించింది. ఇలాంటి సన్నివేశాలకు జాషువా జీవితంలో కొదవలేదు. ఆ కారణంగానే ‘ఎంత కోయిల పాట వృథయయ్యెనో కదా/ చిక్కు చీకటి వన సీమలందు/ ఎన్ని వెన్నెల వాగులింకి పోయెనొ కదా/ కటికి కొండల మీద మిటకరించి/ ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను/ యెంత రత్న కాంతి యెంత శాంతి/ ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనొ/ పుట్టరాని చోట పుట్టు కతన’ అంటూ- తన అసమాన కవితాసౌందర్యం పుట్ట రాని చోట పుట్టిన కారణంగా ఎలా నిరాదరణకు గురైందో వ్యక్తం చేశాడు. అంతే కాదు, అన్నింటి కంటే విచిత్రమైనా విషయం ఏమిటంటే అటు క్రైస్తవ సోదరులచేత వెలివేయబడ్డాడు. ఇటు హిందువుల చేత ఈసడింపబడ్డాడు. ఇంటి నుండి తరిమివేయబడ్డాడు.

                     కవిగా ఆయన లబ్దప్రతిష్టుడైన తర్వాత కూడా సభల్లో, సన్మానాల్లో ఈయన గురించి ప్రసంగించే వక్తలు ‘పంచమ జాతిలో పుట్టి ఇంత గొప్పకవిగా రాణించినవాడు’ అని అంటుంటే జాషువా గుండెలు అవిసిపోయేవి. ‘నన్ను జాషువాగా ఎందుకు గుర్తించరు?’ అని ఆయన అంటుండే వాడట. ఇలా ఆయన జీవితంలో కుల ప్రాతిపదిక మీద ఎన్ని దూషణల్ని, తిరస్కారాల్ని ఎదుర్కొన్నా, వాటిని లెక్కచేయలేదు! ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు.

“గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయ చేత న

న్నెవ్వెధి దూఱినన్ ననువరించిన శారద లేచిపోవునే

యవ్వసుధాస్థలిం బొడమరే రసలుబ్ధులు ఘంట మూనెదన్

రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్” 

               ఇలాంటి విశ్వాసంతో, మొక్కవోని ధైర్యంతో తనను ఈసడించిన సమాజానికి ఎదురొడ్డి కవితలు రచించిన జాషువా ఇలా అంటాడు. “జీవితం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది. నా గురువులు ఇద్దరు – పేదరికం, కులమత భేదం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే గాని బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్ర్యాన్ని, కులభేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలిచాను. వాటిపై కత్తి కట్టాను. అయితే కత్తి నా కవిత. నా కవితకు సంఘంపై ద్వేషం లేదు. దాని విధానం పైనే నా ద్వేషం” (మా నాన్న।పు।10) అని ప్రకటించాడు.

               జాషువాకు గురుత్వాన్ని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతే రాత్రిపూట రహస్యంగా ఊరికి దూరంగా ఉన్న పాడపడ్డ మసీదులో గుడ్డిదీపపు వెలుతురులో పురాణేతిహాసాలు అధ్యయనం చేసి పద్య సౌందర్యాన్ని చేజిక్కించు కున్నాడు. అస్పృశ్యత, దారిద్ర్యం వెంట తరుముతున్నా, కులం పేరుతో జనాలు మాటలతో కుళ్ళపొడుస్తున్నా లెక్కచేయక సాహితీ క్షేత్రంలో ఒక తారగా ఎదగాలన్న పట్టుదలని విస్మరించక కృషితో, పట్టుదలతో ముందుకి సాగి ఆధునిక తెలుగు కవులలో ప్రముఖ స్థానం పొందాడు.

                 అంటరానితనంలోని అవమానాన్ని, దారిద్ర్యంలోని బాధను తాను స్వయంగా అనుభవించాడు. తన తోటి సోదరులు, బంధువులు జీర్ణ కుటీరాలలో ఉంటూ రోజుకూలిపై అర్థాకలితో మాడుతూ బ్రతక లేక బ్రతికే వారి బాధలను, జీవిత గాధలను ప్రత్యక్షంగా చూశాడు. తెలివికి కలిమిలేములతో నిమిత్తం లేదనీ, ప్రతిభను కులమతాల తక్కెడలో తూచ రాదనీ విశ్వసించి, కులమతాల కతీతమైన మానవత తొణికిసలాడే మరో ప్రపంచం కోసం అర్రులు చాచాడు.

                      విశ్వమానవ సౌభాతృత్వం నా ఆదర్శం, ఒక జాతికి మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావనేది జాషువా భావన. ఈ ఆదర్శంతోనే ఆయన తన కావ్యాలన్నీ రాశాడు. ముఖ్యంగా ‘గబ్బిలం’ కావ్యం విషయానికొస్తే అవి ఆయన నిరాశ్రయుడిగా గుంటూరులో కాలం గడుపుతున్న రోజులు. ఒక పాడుబడిన ఇల్లు దొరికింది, అదీ స్మశానానికి పక్కనే. గబ్బిలాలకు ఆటపట్టయింది ఆ ఇల్లు. రాత్రిళ్ళు చిన్న ఆముదపు దీపం. ఆ అంధకారంలో ఆయనకి గబ్బిలాలే నేస్తాలు.

“ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె

విహరణము సేయసాగె గబ్బిలమొకండు

దాని పక్షానిలంబున వాని చిన్ని

యాముదపు దేపమల్లన నారిపోయె”

                ఓ వైపు ఆత్మవ్యధ, మరోవైపు కటిక చీకటి. ఇంకో ప్రక్క గబ్బిలాల సంచారం. ఆ విపత్కర పరిస్థితిలో, తనకీ సమాజానికీ సామరస్యం కుదరలేదు. ఆ ఆవేదనలో రూపుదిద్దుకొన్న ఆలోచనాధార ఫలితమే దళిత వేదనకు అక్షరా కృతిగా భావించదగిన ‘గబ్బిలం’ అనే కావ్యం. అంతర్బాహ్య సంఘర్షణల నుంచి కావ్యం ఆవిర్భవించింది. జాషువా జీవితానుభవ దృశ్యాలే ‘గబ్బిలం’ రచనకు ప్రత్యక్ష హేతువులు. అందువల్లే ‘గబ్బిలం’ లోని ప్రతి పద్యంలోనూ ఆత్మీయతా స్పర్శ తొణికిసలాడుతుంటుంది. భరతమాతకు కడగొట్టు బిడ్డడైన ఒక అరుంధతీ సుతుడు-సమాజంలో పాతుకు పోయిన అంటరానితనాన్ని, వర్ణ వ్యవస్థలోని క్రూరత్వాన్ని-తన సందేశంగా శివునికి గబ్బిలం ద్వారా విన్నవించుకోవటం ఈ కావ్యేతివృత్తం. జాషువా తన వైయక్తిక బాధను, తన జాతి జనుల సమిష్టి బాధను ప్రత్యేకించి పలికినా, అది సాధారణీ కరణాన్ని పొందింది. సర్వపాఠక సమాదరణాన్ని ప్రోది చేసుకుంది.

            జీవితమంతా వడగాల్పులు, అడుగడుగునా అవమానాలు, అవహేళనలు, ఛీత్కారాలు ఎదురైనప్పటికీ వెన్నె ల్లాంటి కవిత్వాన్ని సృజించాడు. లెక్కలేనన్ని కవితా ఖండికలు, గబ్బిలం, బాపూజీ, గిజిగాడు, క్రొత్త లోకం, ఫిరదౌసి, ఆంధ్రమాత, నేతాజీ, ముంతాజు మహలు, క్రీస్తు చరిత్ర, సాలీడు, చంద్రోదయం, శిశువు, కాందిశీకుడు మొదలైన ముప్పై ఆరు గ్రంధాల్ని రచించాడు. వాటిలో క్రీస్తు చరిత్రకు 1964 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అదే సంవత్సరంలో శాసనమండలి సభ్యునిగా ఎన్నుకోబడ్డారు.

                           ఈ విషయంలో ఒక్క ‘ప్రభుత్వ ఆస్థాన కవి’ పదవి ఇవ్వలేదనే కొరత తప్ప జాషువాకు ఇక ఏ కొరతా లేదు. నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్‌, కవికోకిల, కవిదిగ్గజ, మధుర శ్రీనాథ మొదలైన బిరుదులే గాక, ఆంధ్ర విశ్వ విద్యాలయం ‘కళా ప్రపూర్ణ’ బిరుదునిస్తే, 1976లో భారతప్రభుత్వం ’పద్మభూషణ’ పురస్కారాన్ని యిచ్చి ఆయన కవితా వైభవాన్ని గుర్తించింది. ఇంకా మహాపండితులు, అవధానులు, మహాకవి శేఖరులు, బ్రాహ్మణులు అయిన తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వారు జాషువా వామపాదాన్ని పట్టి గండపెండేరాన్ని తొడిగి వారి విశ్వ కవితా సౌందర్యానికి తగిన గౌరవాన్నందించారు. జాషువా హృదయశల్యాన్ని సమూలంగా పెరికివేసిన సంఘటన ఇది.

                       చివరిగా జాషువా జీవితంలో జరిగిన మరొక సంఘటన కవితా ప్రియులకు ఆసక్తిని కలిగిస్తుంది. అదేమంటే ఒకసారి జాషువాకు, మరో ప్రముఖ కవికి కలిపి ఒక సాహిత్య బహుమతి ఇవ్వడం జరిగింది. జాషువా అంటే అంతగా పడని ఆ కవి “‘గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాట కట్టేశారు” అని అన్నాడు. అప్పుడు గుర్రం జాషువా “నిజమే, ఈ ఒక్కసారికి మాత్రం ఆయనతో ఏకీభవించకుండా ఉండలేకపోతున్నాను, నేను గుర్రాన్ని మరి ఆయన ఏమిటో ఆయనే చెప్పాలి'” అని అన్నాడు.

                     ‘క్రీస్తు చరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా జరిగిన అభినందన సభలో జాషువా కంటే ముందు ఆ అవార్డు అందుకున్న విశ్వనాథ సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఈ రోజుల్లో గాడిదలకు కూడా సాహిత్య అకాడమీ అవార్డులు వస్తున్నాయి’ అన్నారు. దానికి స్పందిస్తూ ‘గాడిదలకు అవార్డులు ఇస్తున్నమాట వాస్తవమే, దురదృష్టవశాత్తూ గాడిదలకు ముందే ఆ అవార్డులు వస్తున్నాయి. తరువాత గుర్రాలకు వస్తున్నాయి’ అన్నారు జాషువా! ఆయన ఇంటిపేరు ‘గుర్రం’ కావడం గమనార్హం.

జాషువా జీవిత ప్రస్థానంలోని మైలురాళ్ళు:

            1910 లో మేరీని పెళ్ళి చేసుకున్నాక, మిషనరీ పాఠశాలలో ప్రాధమికోపాధ్యాయునిగా నెలకు మూడు రూపాయల జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసారు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈయన పని. ఆ విధముగా మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా ఊరూరా తిరిగే సమయములో  వీరేశలింగం, చిలక మర్తుల ఆశీర్వాదములతో కావ్యజగత్తులో స్థిరపడ్డారు. తిరుపతి వేంకట కవుల ప్రోత్సాహం కూడా తోడై  ఆయనను ముందుకు నడిపింది.

            తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పని చేసారు. అటు పిమ్మట 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసారు. 1946-60 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసారు. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి లో సభ్యత్వం లభించింది. 1971 జులై 24వ తేదీన ఆయన కుల మతాలు లేని, అంటరానితనం లేని అమరపురికి చేరుకున్నారు.

            ఇంతటి ఘనకీర్తి పొందిన (సెప్టెంబరు 28వ తేదీ) గుర్రంజాషువా జన్మదినోత్సవ సందర్భంగా ఆయనని తప్పక స్మరించుకోవాలి.  జాషువా కవితాభిమానులు ఆయన కవితా పటిమను ధీరోదాత్తతను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలలో నడవాలి. కనీసం ఆయన కవితలలో నుండి ఒక ఖండికైనా చదివితే-అదే ఆ మహనీయునికి మన మిచ్చే నిజమైన, ఘనమైన ‘నివాళి’. “రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు” అని అన్న జాషువా మాటలు అక్షర సత్యమే కానీ జాషువా ప్రజల నాలుకలపైనే కాదు హృదిలో కూడా పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఓ సుమధుర కవీ! అందుకో మా ఈ వినమ్ర వందనం.

 – పి . వి  లక్ష్మణరావు 

ఉపయుక్త గ్రంథసూచి:

         గబ్బిలం – (వ్యాఖ్యానం – కఠెవరపు వెంకట్రామయ్య)

  • వివిధ పత్రికలలో వచ్చిన ప్రత్యేక కథనాలు  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
UncategorizedPermalink

3 Responses to కవిత్వంలో జీవితాన్ని ఇమిడ్చిన విశ్వకవిసామ్రాట్ “గుర్రం జాషువా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో