మహిళా సర్పంచులు
ఇటివలే జరిగిన పంతాయితీ ఎన్నికలలో మహిళలు అధిక సంఖ్యలో పోటి చేయడం ఆనందించదగ్గ విషయంగానే కనిపిస్తుంది . మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అనుసరించి మహిళలకు 50 % స్థానాలు కేటాయించడం మంచి విషయంగానే అంగీకరించాలి .
విజయం పొందిన ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ ఉంటుందనే నానుడి మహిళల స్థానాల విషయంలో తారుమారైనట్టుగా కనిపిస్తుంది . ఎక్కడ చూసిన సర్పంచి పోటికి దిగిన స్త్రీల ప్లెక్సీలు , పోస్టర్లు స్త్రీలను నిజంగానే నిద్రలేవనిచ్చారేమో అన్నట్లుగా సందడి సందడిగా కనిపించింది . కాని ఈ పోస్టర్ల వెనక , ఈ పదవుల వెనక , విజయం వరించిన స్త్రీల వెనక అభ్యర్ధుల పతులు పాలకులుగా చురుకైన పాత్రను వహిస్తున్నారు . చాలా చోట్ల ఇప్పటికే ఎన్నికలలో మహిళా కౌన్సిలర్లు , సర్పంచులు పేరుకు మాత్రం పదవుల్లో ఉండి తమ భర్తలో , కొడుకులో యంత్రాంగాన్ని నడిపించడం జగమెరిగిన విషయమే . పైగా ఎక్కువ శాతం ఈ మహిళా సర్పంచులంతా రాజకీయ చరిత్ర ఉన్న నేతల భార్యలు కావటం చూస్తుంటే 50% మహిళా రిజర్వేషన్లు ఏ రకంగా ఉపయోగ పడుతున్నాయో అర్ధమవుతుంది .
వీటన్నింటికి తోడు దళిత రిజర్వేషన్ లతో తప్పనిసరై మహిళా సర్పంచులుగా మారిన స్త్రీలకి ఉన్న అధికారం , హక్కు గమనిస్తే దళిత మహిళా సర్పంచులపై ఆధిపత్య కులాలు జరుపుతున్న దాడులు ప్రత్యక్షసాక్ష్యాలుగా నిలుస్తాయి . కొన్ని పంచాయితీలలో దళిత మహిళా సర్పంచులకు కార్యాలయాలలో కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా ఇవ్వరు. నేలపైనే కూర్చుని విధులు నిర్వహించిన సంఘటనలు కూడా ఉన్నాయి . మరికొన్ని చోట్ల మహిళా అధికారులను వారి పై అధికారుల ముందు కూర్చోనీయక పోవడం , మహిళా సర్పంచుల్ని సంప్రదించకుండా వారిని పక్కకు పెట్టి అధికారులే కార్యక్రమాల్ని పూర్తి చేయటం జరుగుతూ ఉన్నాయి . మరొక చోట దళిత మహిళా సర్పంచి పదవిలోకి రాగానే ఉప సర్పంచిగా ఉన్న ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి పంచాయితీ బల్లల్ని విరగగొట్టడం వంటి దాడులు దళిత స్త్రీలపై జరుగుతూనే ఉన్నాయి . ఇటివల లక్ష్మీం పేటలో భూమి తగాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారిని మర్చిపోవక ముందే అదే గ్రామానికి చెందిన మరొక విషయం ఆశ్చర్యానికి గురి చేసింది . ఆ గ్రామంలో దళితులకి సీటు కేటాయించినందుకు మరొక వర్గం ఓటర్లంతా ఎన్నికల్ని బహిష్కరించారు .
ఇవన్ని చూస్తే మహిళా సాధికారతలో ఎంత అధికారం వుందో , మహిళా సర్పంచులుగా విజయం సాధించిన తరవాత కూడా ఎంత మంది అభ్యర్ధులు తమ సొంత నిర్ణయాలతో తమ ప్రాంతాలను పరిపాలిస్తారో , ఎంత మంది స్త్రీలు తెర ముందు వ్యక్తులుగా మిగిలిపోతారో చూడాల్సి ఉంది .
– హేమలత పుట్ల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
7 Responses to సంపాదకీయం