తిరిగి ప్రవాసానికి…


”హమ్మయ్య! ఇప్పటికి కుదిరిందండీ
మన జనం లోకి రావటానికి!ఎలాగైనా మన హైదరాబాద్ వాతావరణం,ఇక్కడి

జీవితమేవేరనుకోండి.మన పిల్లలు హాయిగా తెలుగు మీడియంలో చదువుకుంటారు. చక్కని తెలుగు

నేర్చుకుంటారు.వారానికోమాటుఊరెళ్ళి వ్యవసాయం చూసుకుంటూండచ్చు.”అలివిమాలిన తృప్తీ  ఆనందమూ కన్నుల్లో,

చెంపల్లో తళుకులీనుతుండగా భర్తకళ్ళల్లోకి చూస్తూ అంది ప్రసూన.

”అవునోయ్ మరి ఈ ట్రాన్స్ఫరుకి అంతగా శ్రమించి ,ప్రయత్నాలు చేసింది ఎందుకనుకున్నావ్ ?  ఈ సౌకర్యాల కోసమేగా?

మనమొస్తున్నట్టు కబురంది మా భువనగిరి చెల్లి నిన్న సాయంత్రానికే ఎలా పరిగెట్టుకొచ్చిందో చూసావా!…

ఊ ….ఇంతకీ ఇల్లెలా  వుంది?నీకు నచ్చిందా?”ఉత్సాహంగా అడిగాడు హరీంద్ర.

”ఇంటికేమండీ !బ్రహ్మాండంగా వుంది.మన ఎం.ఎల్.ఏ.గారు సమస్త సౌకర్యాలు అమిరేలాగా ,చూడ ముచ్చటగా

కట్టించుకున్నారుగా! ఏదో మనూరి వాడు కాబట్టి మనకి పదిహేనొందలకిచ్చాడు . మరొకళ్లకయితే రెండు వేలకి తక్కువ

పుచ్చుకోడు.”

”చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నాం.ఆ అబిమానం పోలేదు మరి.సరేగాని ఇహ వొదినా మరదళ్ళు సామాన్లు సర్దే యజ్ఞం

మొదలెడతారు కాబోలు.ముందుగా నాకు ఓ కప్పు కాఫీ యిప్పిస్తే టిఫిన్ క్యాంటీన్ లో కానిచ్చేస్తాను.”

”అయ్యో ఇంకా పాలు పొంగించలేదండీ!మీ చెల్లి ఇప్పుడే స్నానం ముగించి, ఆ ప్రయత్నమే చేస్తోంది.పాలు పొంగించందే మరేదీ

పొయ్యి మీద కెక్కించ గూడదు  కదండీ!” నొచ్చుకుంది ప్రసూన.

”సరే సరే కానివ్వండి.ఆ క్యాంటీన్ కాఫీ  బాగుండి చావదు.టీ తో సరిపెట్టుకుంటాన్లే ఈ పూటకు ” అంటూ పిల్లలకి ‘బై’ చెప్పి

‘మారుతీ’లో కూర్చుని కంపెనీ దారి పట్టించాడు హరీంద్ర.

హరీంద్ర,ప్రసూనల కుటుంబాలు  ముప్పయ్యేళ్ళకి ముందే కృష్ణా తీరమొదిలి తెలంగాణాకి తరలి వచ్చాయి.  అప్పట్లో ఎకరం

ఏభయ్ రూపాయల కాడికి ఏభయ్ ఎకరాలు కొనుక్కుని హరీంద్ర తల్లిదండ్రులు మెదక్ దగ్గర ఓ పల్లెటూర్లో స్థిరపడ్డారు.ప్రసూన

అమ్మా నాన్నలు  నిజామాబాదు దగ్గర ఎకరం వంద చొప్పున ముప్పై ఎకరాల మాగాణి కొని అక్కడ కాపురంబెట్టారు.

హరీంద్ర తండ్రి రాఘవయ్య గారు తెలివైన వ్యవసాయదారుడు,కష్టజీవి.పొలంలో మంచి జలపడే చోట  బోరు వేయించి సమృద్ధిగా

నీరు లభించే ఒనరేర్పరుచుకున్నాడు.వ్యవసాయ శాఖ వారి సలహాల్నీ ఆధునిక వ్యవసాయ పద్ధతుల్నీ జాగ్రత్తగా అవలంభించి

రెండేళ్లకే బీడును సస్యశ్యామలం చేయగలిగాడు.

హరీంద్ర కు పదేళ్లకిందట ప్రసూనతో పెళ్ళవగానే డిల్లీలో  ఉద్యోగమయింది.ఫారిన్ కొలాబరేషన్ తో నడుస్తోన్న ఓ గవర్నమెంట్

రక్షణశాఖ  పర్చేజింగ్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు.ఐదారేళ్ళ క్రితం ఈ కంపెనీ బ్రాంచ్  ఒకటి   హైదరాబాద్ లోనూ

ప్రారంభించబడింది.`రెండేళ్ళ క్రితం తండ్రి పోయినప్పటినుంచీ కౌలుదార్ల చేతుల్లో పంటలూ పొలమూ తీవ్రంగా దెబ్బతింటున్నట్టు

గమనించి  హైదరాబాద్ రావటానికి భగీరథ ప్రయత్నాలు చేశాడు హరీంద్ర. ఈనాటికి ట్రాన్స్ఫర్ రావటం ,తన కోర్కె నెరవేరటం

జరిగింది.ఏ గదిలో ఉండాల్సిన సామాన్లు ఆ గదుల్లో పొందికగా సర్ది,పెరడు శుభ్రం చేయించే సరికి వారం పట్టింది.

ఇంటి ముంగిలి నిండా రక రకాల పూల మొక్కలూ, ఇంటికిరుపక్కలా ,పెరట్లో అన్ని రకాల పండ్ల చెట్లూ వున్నాయి.ఇంటినంతా

ముచ్చటగా చూసుకుని తృప్తిగా నిట్టూర్చింది ప్రసూన.

ఇంట్లో దిగి అప్పుడే వారమయింది. ఇరుగుపొరుగుల పరిచయమింకా అవలేదు.ప్రక్కింటి వాళ్లయినా పలకరించక పోవటం

చిత్రమనిపించింది ప్రసూనకు.ఓ సాయంత్రం ఆ వీధిలో పదిళ్ళకీ  వెళ్లి తనని పరిచయం చేసుకుంది.ప్రతి ఇంట్లోనూ ‘పేటా’  అనే

ఆగ్రా మిఠాయి ప్యాకెట్టును పిల్లల చేతుల్లో ఉంచింది.తన భర్త ఉద్యోగ వివరాలనుంచీ సిటీకి చేరువలోనే తమ స్వంత వూరున్న

సంగతీ అందుకనే డిల్లీ నుంచి ఇక్కడికి    ట్రాన్స్ఫర్  చేయించుకున్నామనీ   ఎంతో కలుపుగోలుగా అరమరికలు లేకుండా

మాట్లాడి , తీరిక చేసుకుని తమింటి కొచ్చి  కొంచెం సేపు గడిపి  వెళ్ళండి  అని  ప్రతి ఇల్లాల్నీ ఆహ్వానించి వచ్చింది.

వేసవి సెలవులు గడిచిపోయి స్కూళ్ళు తెరవడం మొదలయ్యింది.ప్రసూన పిల్లలిద్దరికీ స్కూలు అడ్మిషన్లు దొరికాయి.రోజూ

స్కూలుకి వెళ్తున్నారు.వాళ్లీ ఊరొచ్చి అప్పుడే రెండు నెలలు కావస్తోంది.చుట్టుపక్కల పిల్లలతో ఇంకా జట్టు కలవలేదు.ఇంటికి

ఇంతవరకూ పెద్ద వాళ్ళెవరూ  రాకపోవటంతో సహజంగా వాళ్ళ  వెంబడి వచ్చే పిల్లలూ రాలేదు.బాబు,పాప బొత్తిగా

పసివాళ్ళు.దిగులు దిగులుగా కాంపౌండ్ లోపలే ఆడుకుంటున్నారు.

***                                        ***                                                           ***                                                 ***

అరవై కుటుంబాలున్న ఆ చిన్న కాలనీలో హరీంద్ర సహోద్యోగులు పదిమంది వున్నారు.మిగిలిన వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్

ఏర్పడ్డప్పుడే రాజధానికొచ్చారు. అంతపెద్ద చదువులు లేనప్పటికీ ప్రభుత్వ ,ప్రైవేట్ కంపెనీల్లో  మంచి జాబ్ లు  సంపాదించ

గలిగారు.చాలా మంది తమ ఉద్యోగాలతో పాటు స్వంత ఇండస్ట్రీలు,సైడు బిజినెస్సులు నడుపుకుంటూ బాగా వృద్ధిలో కొచ్చారు.

స్వంత  ఇళ్ళు ఏర్పరచుకున్నారు. ప్రతి ఒక్కరూ సుఖంగా బతకటం ,పైకి రావటం కోరతగిందే.అయితే తెల్లారిందగ్గర్నించీ

మగవాళ్ళ బ్రతుకు పరుగుపందెంగా మారి,విశ్రాంతి అంటే ‘టైం వేస్టు’ అనుకునే స్థితికి రావటం ఎంతవరకు మేలు?ఇటు

ఆడవాళ్లేమో ‘నవ ధనిక వర్గానికి’ అద్భుతమైన ప్రతీకలుగా మారారు.ప్రక్కింటి వాళ్ళతో  మాట్లాడటం తమ ఘనతకు

భంగం అనుకునే ఒంటెత్తు పోకడలు ప్రబలమవుతున్నప్పుడు ‘మనిషి సంఘజీవి కాదేమో’ననే అనుమానం రాక తప్పదు.

ఈ వాతావరణంలో ప్రసూనకి ఊపిరి సలపనట్టుగా ఉంది.కాలనీలో కుటుంబాలన్నీ ఏ విధాన ,ఏంచేస్తే దగ్గరవుతాయా ఆలోచన

పట్టుకుందామెకు.దాంతో మళ్ళీ చాలా మంది ఆడవారిని కలిసి తమ మహిళా మండలి ఒక దాన్ని స్థాపించుకుందామని

ప్రతిపాదించి,దాని వల్ల కలిగే లాభాలన్నీ వివరించింది. రోజూ మూడు నాలుగు గంటల మధ్య కమ్యూనిటీ హాల్ లో అందరూ

కలుసుకుని కొత్త కొత్త వంటకాలు, తమ చేతి పనులు ఒకరనుంచి మరొకరం నేర్చుకుందామంది.అందరం కలిసి కొన్ని

వారపత్రికలు తెప్పించుకు చదువుతూ క్రమంగా చిన్న గ్రంథాలయం    ఏర్పాటు చేసుకుని మనసుకి చైతన్యం

కలిగించుకుందామని కూడా బోధించింది.వచ్చే ఆదివారం కాలనీ స్త్రీలందరం తమ ఇంట్లో మొదటి సమావేశం ఏర్పాటు

చేసుకుందామని ప్రతి ఒక్కరూ తప్పక హాజరవ్వాలని చెప్పింది.అందుకందరూ అంగీకరించారు.

ఆదివారం వచ్చింది.ఆడవారు మాత్రం మీటింగుకి రాలేదు.ఎంతో ఎదురు చూడగా చూడగా ముగ్గురు కాలేజీ అమ్మాయిలు

మాత్రం వచ్చి ప్రసూనతో పాటు నిరాశగా నిట్టూర్చారు.

కార్తీక మాసపు వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంది.స్నేహ మధురిమకూ ,పరస్పర సహాయసానుభూతులకూ దూరమై తను

బొత్తిగా ఒంటరిది అన్నట్టు అనిపించసాగింది ప్రసూనకు.ప్రతి ఏటా డిల్లీలో ఈ మాసంలో ఎంత  ఆర్భాటంగా వనభోజనాలు

ఏర్పాటు చేసుకుండే వాళ్ళు?   కాలనీలోని ఆడా మగా, పిల్లా జెల్లా అందరి మొఖాల్లో ఆనంద దివ్వెలు ఎలా వెలుగుతుండేవి !

ప్రసూనకి మళ్ళీ బుర్రలో కొత్త ఆలోచనలు మెరిసి హౌస్ విజిట్స్ కి బయల్దేరింది.వనభోజనాల గురించి ఒక్కొక్క ఇంటావిడకీ

చెప్పింది.ఇంటికో పదార్ధం  చేసుకు ఇందిరాపార్కుకో,సంజీవయ్య పార్కుకో పోయి బంతి  భోజనాలు తినేసి , ఆటలతో పాటలతో

సంతోషంగా గడిపి వద్దామని ఉత్సాహపరిచింది.”మగాళ్ళు లేకుండా ఆడాళ్ళు ఒక్కళ్ళమే బయటకొచ్చే అలవాటు మాకు లేదు”

“ఫలానా ఇంటి వాళ్ళకూ మాకూ మాటల్లేవు.మరి వాళ్లోస్తున్న  చోటికి మేమెలా వస్తాం?”

“ఇంత వరకూ మా కుటుంబాలతో తప్ప ఇతరులతో కలిసి తిని ఎరగం.ఇప్పుడు మైల కూడు తినాలంటే ప్రాణ మొప్పదు ”

ఇలాంటి రకరకాల అభ్యంతరాలతో వారం రోజుల ప్రసూన కృషి నిష్ఫలంగా మిగిలింది.

ఆమెకి తన మీద తనకి విశ్వాసం సన్నగిల్లింది.తన మీదనే బోలెడు కోపం వచ్చింది.తాని ఒట్టి అసమర్ధురాలు. కార్య దీక్షత  లేని

మనిషి. ఉన్నట్టుండి ఇంతలావు తలనొప్పి పట్టుకుందే!కణతలు నొక్కుకుంటూ పడక మీద వాలి కళ్ళు మూసుకుంది.ఎంతకీ

నిద్ర పట్టడం లేదు.డిల్లీలో గడిచిన రోజులూ ,అక్కడ జరిగిన ఒక్కొక్క సంఘటనా కళ్ళలో మెదిలాయి.

అక్కడ కంపెనీ క్వార్టర్స్ లో ఆఫీసు క్యాడరూ,వర్కర్ల క్యాడర్లకూ చెందినా యాభయ్ తెలుగు కుటుంబాలుండేవి .ఉద్యోగ స్థాయిలో

వ్యత్యాసాలు,కంపెనీ ఆవరణ వరకే.ఇళ్ళ దగ్గర ప్రతివారిలో”తెలుగు జాతి మంది.నిండుగా వెలుగుజాతి మనది”అనే గొప్ప సోదర

భావం సమృద్ధిగా వుండేది.ఏ కన్నాట్ ప్లేస్ లోనో కుతుబ్ మీనార్  దగ్గరో తెలుగు  కంఠం  ఏదైనా వినబడితే, మంజుల వీణా

నిస్వనంగా  వినబడి ప్రాణం లేచివచ్చేది.నిమిషాల్లో వారితో పరిచయాలైపోయ్ ఆత్మీయత వెల్లివిరిసేది.చక చక

అడ్రస్సులిచ్చుకుని ఒకరి ఇంటికి మరొకరు రమ్మని ఆహ్వానించుకోవటం జరిగేది. తెలుగు వారైతే  చాలు కులం, గోత్రం, ప్రాంతం,

అంతస్తు ఏది అక్కర్లేదు.

అక్కడ స్త్రీలలో కొంతమంది గ్రాడ్యుయేట్లు ,పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయిన వారు వంటపనులకే  తమ చదువుని అంకితం  చెయ్యటం

ఇష్టం లేని వారు ,m.ed, b.ed చేసి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ,షిఫ్ట్ సిస్టం వల్ల పిల్లలు పన్నెండు గంటలకి ఇంటికి

వచ్చేస్తే రెండింటికి చేరుకునే వారు.అమ్మ వాళ్ళు వచ్చేవరకు పిల్లలు తమకిష్టమైన ఆంటీ వాళ్ళ  ఇళ్ళల్లో ,వాళ్ళిచ్చే చిరుతిళ్ళు

తింటూ ,వాళ్ళ ప్రేమాదరణలో ఆడుకోవటం రివాజు.ఉద్యోగినులకిక పిల్లల్ని గురించి  చింతించాల్సిన అవసరమే వుండేది కాదు.

ఒక ఆపద సమయంలో ఇరుగుపొరుగు వారు తమనెంత ఆదుకున్నారో     మర్చిపో గలదా  తను!కొన్ని పరిస్థితుల కారణంగా

రెండో కాన్పుకి తన పుట్టింటి కెళ్ళకుండా కంపెనీ హాస్పిటల్ లోనే జరుపుకోవాల్సి వచ్చింది. ఉత్తర దేశపు  స్త్రీలయితే అసలు

మొదటికాన్పుకే పుట్టింటి కెళ్లరు.కంపెనీ హాస్పిటల్ పరిశుద్ధత కు మారు పేరనాలి.ఉచిత వైద్యం,అమిత శ్రద్ధ చూపే డాక్టర్లు

,అవిరామంగా సేవలు చేసే నర్సులు.. ఇన్ని రకాల సౌకర్యాలు పుట్టింట్లోవుండవుగా మరి!ఒక అర్ధరాత్రి వేళ తనకు నొప్పులు

మొదలయ్యాయి.హరీంద్ర కంగారు పడుతూ గ్యారేజీ నుంచి కారు బయటికి తీసి తనను

నెమ్మదిగా కారు దగ్గరకు తీసికెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.తమ ఇంటి పై భాగానా, పక్క క్వార్టర్ లోనూ వున్న లక్ష్మి

,భారతి,స్వర్ణ గార్లు తన కేకలూ అలికిడీ విని , పరిస్థితి గ్రహించి వున్న పళంగా వచ్చి,కార్లో కూర్చుని హాస్పిటల్ కి   వచ్చారు.

తెల్లవారు ఝామున పాప పుట్టేంత వరకూ కాన్పులవార్డుకి ఎదురుగా ,గడ్డ కట్టే జనవరి నెల చలిలో అలా కూర్చుండి

పోయారు.పుట్టుకతోనే పాపకి పచ్చ కామెర్లోచ్చాయి.అందుకు ప్రత్యేక చికిత్స అవసరమై పది పన్నెండు  రోజుల వరకు డిస్చార్జీ

కాలేక పోయింది తను.అన్నాళ్ళూ ఇటు తనకవసరమైనవీ .. బాబూ,శ్రీవారికీ కావలిసిన సకలమూ పంపారు.ఇంటికొచ్చాక

కూడా నెల్లాళ్ళ వరకూ ఎవరో ఒకరు క్యారియర్లు పంపుతుండేవారు.కాలనీలో ఎవరికి కాన్పయినా  యిదే పద్ధతీ -యిదే ఆదరణ.

ఆంధ్రాకి వెళ్లి తిరిగి వచ్చే ప్రతి వాళ్ళూ – కాకినాడ  కాజాలో,విశాఖ పనస పళ్ళో,బందరు గాజు రొయ్యలో తెస్తారు. ఒక సారి తను

కూడా -హైదరాబాదు నుంచి ఆరు కేజీల దేశవాళీ రేగుపళ్ళు తీసికెళ్లింది.ఎలా ఎగబడి,ఎంతిష్టంగా తిన్నారందరూ  !

తమ కాలనీకి అన్ని హంగులున్న క్లబ్బుంది.చక్కని గ్రంధాలయముంది. సాయంత్రమయ్యే సరికి పిల్లలూ పెద్దలూ అంతా అక్కడ

ప్రత్యక్షం.కొత్త  దంపతులూ,ఆడామగా పిల్లలూ .. టేబుల్ టెన్నిస్ ,షటిల్,బాడ్మింటన్ పరవళ్ళు తొక్కుతూ ఆడటం బహు

ముచ్చటనిపించేది  తనకు .

ప్రతి ఏడు – తెలుగు కుటుంబాలన్నీ తప్పని   సరిగా ఉగాది వేడుకలు అట్టహాసంగా చేసుకునేవి.అలాగే క్లబ్బు వార్షికోత్సవాలని

మిగిలిన రాష్ట్రాలవారితో కలిసి అత్యుత్సాహంగా జరుపుకునేవారు.మగవారితో పోటాపోటీగా – స్త్రీలంతా ఆటపాటల పోటీల్లో ,నృత్య

నాటక ప్రదర్శనల్లో స్వేచ్ఛగా ,నిస్సంకోచంగా పాల్గొంటూ ఉండేవాళ్ళు  . పంజాబీ సోదరులు ఆడా మగా  భాంగ్రా నృత్యం

మొదలు పెడితే ,హుషారెగదన్ని  ఈలలూ, చప్పట్లూ గంతులతో ఎంతకీ నృత్యం  ముగించేవాళ్ళు కాదు.ఆ ఉల్లాసం , ఆ

ఆత్మీయతా మచ్చుకైనా కనబడవే ఇక్కడ?

***                                                        ***                                                                ***

ప్రసూన ఓ సాయంత్రం పూల చెట్లకి నీళ్ళు పెడుతుండగా బాబు గది క్లాస్మేట్ ..కుర్రాడొకడు  రొప్పుతూ వచ్చి”మీ అబ్బాయి

బస్సు దిగుతూ పడిపోయాడండీ !”అని కబురందించాడు.నీళ్ళ ట్యూబు కిందపడేసి బస్టాండుకి పరుగుదీసింది ప్రసూన.కొడుకు

బొక్కబోర్లా అలాగే పడివున్నాడు.భద్రంగా లేవనెత్త బోయింది. ఒక్కపెట్టున ప్రాణాలు పోతున్నట్టు అరిచాడు వాడు.ఎలాగో ఆటో

డ్రైవర్ సహాయంతో వాడిని ఇంటికి చేర్చి హరీంద్రకు ఫోన్  చేసింది.తక్షణం హరీంద్ర వచ్చి వాలి పోయాడు.నిజం ఆర్థ్రోపెడిక్ లో

అడ్మిట్ చేసారు  . పిల్లాడి ఎడమ భుజం విరిగి ఎముకలు ఒక దాని మీదకి ఒకటి ఎక్కాయి.మోచేతి జాయింట్ తొలగింది.చేతికి

కిందనుంచి పైదాకా ప్లాస్టర్లు వేశారు. తగిన చికిత్స లన్నీ చేయడానికి నెల్లాళ్ళు హాస్పిటల్ లో వుంచమన్నారు  . ప్రసూన ఒక్కటే

హాస్పిటల్ కీ  ఇంటికీ తిరుగుతోంది.రాత్రుళ్ళు అక్కడే ఉంటోంది.పాపను ఆ నెల్లాళ్ళూ స్కూల్ మాన్పించి తాతగారింటి దగ్గర

వదిలొచ్చాడు హరీంద్ర. బాబుకి పూర్తిగా నయమై కట్టిప్పే సరికి రెండు నెలలు పట్టింది. పక్కిళ్ళ వాళ్ళు ఎప్పుడైనా పలకరించే

వాళ్ళు.దూరపు వాళ్ళదీ లేదు.ఎలాంటి సహాయమూ ఎవరినుంచీ అందలేదు.ఎడారిలో బ్రతుకుతున్నామనుకొంది  ప్రసూన.

***                                                           ***                                                    ***

హరీంద్ర కుటుంబం తమ స్వంత ప్రదేశమనే చోటుకొచ్చి అప్పుడే పది నెలలయింది.

సంవత్సరాది పండుగ రావటానికి ఇంకా ఇరవైరోజులుంది.ఇప్పటికి దంపతులిద్దరి చిత్తాలు బొత్తిగా మెత్తగిల్లి పోయాయి.దేని మీద

ఆసక్తిలేదు. హుషారు లేదు.

ఈ పండుగకి కాలేజీ అమ్మాయిల్లో ఎందుకనో వున్నట్టుండి హుషారు పుట్టుకొచ్చింది.బిలబిల మంటూ ప్రసూనను చుట్టేశారు.

అందరూ కలిసి ప్రవాసాంధ్రుల మాదిరిగా ఉగాది వేడుకలు జరుపుకుందామన్నారు.ఆటలు,పాటలు ,వ్యాసరచన పోటీలు జరిపి

గెలిచినా పిల్లలకు బహుమతులిచ్చుకుందామన్నారు.పోటీల్లో పాల్గొనటానికి తమ అక్కల్నీ ,వదినల్నీ వొప్పించామన్నారు.ఈ

మాటలకి ప్రసూన ప్రాణం లేచి వచ్చింది. ఇన్నాళ్ళ తన కృషికి సత్ఫలితాలు కనబడుతున్నాయికదా అని పొంగిపోయింది.

కమ్యూనిటీ హాల్ ఆవరణలో ఆటలు ప్రాక్టీస్ ప్రారంభమయ్యాయి.వయసులో వున్న అమ్మాయిలు  రన్నింగ్ రేస్  ప్రాక్టీస్

చేస్తున్నారు.నాలుగు రోజులు గడిచేసరికల్లా మగవాళ్ళ దృష్టికి ఈ సంగతి వెళ్ళింది.వెంటనే అరడజను మంది మగ మహా

రాజులూ రాత్రి ఏడుగంటలప్పుడు హరీంద్ర ఇంటి మీదకొచ్చి ”ఏమిటి సర్ ఈ దారుణం?ఆటలా పోటీలని,రన్నింగ్ రేసులనీ

ఇళ్ళల్లో వుండే ఆడోళ్ళని  బజారుకెక్కించటం మీ ఆవిడకేమన్నా బాగుందా? పరువున్న కుటుంబాలు మావన్నీ. మా

కళ్ళముందు మా ఆడాళ్ళు ఎగిరిగంతులేస్తూ పరుగులు పెడుతుంటే చూస్తూ వూరుకునేందుకు మేము గాజులు

తొడుక్కున్నామా ? మీ ఆవిడకేమీ పనీ పాటా లేనట్టుంది.కొంచెం అదుపులో పెట్టుకుంటే మర్యాదగా వుంటుంది.”అంటూ

దులిపేసి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు.

***                                                                      ***                                                        ***

మరో నాలుగు మాసాలకి  భూమ్యాకాశాలు తలక్రిందులయ్యే ప్రయత్నాలు చేసి మళ్ళీ డిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగారు

ప్రసూన హరీంద్ర.ప్రతీ విషయంలో ప్రతీ కార్యక్రమంలో    ముందుండే ఉత్సాహభరితమయిన నిష్కపటమైన జంట మళ్ళీ  తమతో

వచ్చి కలిసినందుకు తెలుగు కుటుంబాలన్నీ ఎంతో సంతోష పడ్డాయి.ముందుగా స్వర్ణ ,లక్ష్మి, భారతీలు పరుగు పరుగున వచ్చి

మనసారా పలకరించి కరువు తీరా కబుర్లు చెప్పారు.స్నానాలు ముగించుకు హాయిగా నడుములు వాల్చి ప్రయాణ బడలిక

తీర్చుకొమ్మని  వంట ప్రయత్నాలేం  చెయ్యొద్దని ,క్యారియర్లు పంపుతామని మరీ మరీ వొప్పించి వెళ్ళారు.

రెండు మూడు రోజుల వరకూ, ఆడవాళ్ళూ మగవాళ్ళూ బృందాలుగా వచ్చి,హరీంద్ర వాళ్ళను పలకరించి తిరిగి వచ్చినందుకు

అభినందించి పోతూనే వున్నారు. హడావుడి కాస్త సద్దుమణిగాక ”హమ్మయ్య! ఎంతయితేనేం మళ్ళీ రాగలిగామండీ..

నిజమయిన ఆప్తుల మధ్యకి!ఈ స్నేహం ,ఈ ఆత్మీయత సంవత్సరం  పాటు కోల్పోయి ఎంత బెంగటిల్లి పోయామండీ !అంది

ప్రసూన నిశ్చింతగా ఊపిరి తీస్తూ.

“నీ మాట అక్షరాలా నిజం ప్రసూనా !” హరీంద్ర మందహాసం చేస్తూ మనస్ఫూర్తిగా  బలపరిచాడు.*

నంబూరి పరిపూర్ణ.

కథలు, , , , , , , , , Permalink

2 Responses to తిరిగి ప్రవాసానికి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో