గౌతమీ గంగ

                            పెళ్ళివార్ని వెంట పెట్టుకొని రావడానికి సుబ్బారావు గారి తమ్ముడు రవణయ్యగారూ సుబ్బమ్మగారి అన్నగారు సుబ్బన్నగారు వెళ్ళారు. శృంగవృక్ష గ్రామంలో పెళ్ళివారు పెందరాళే మధ్యాహ్న భోజనాలు కానిచ్చుకొని గ్రామ మునసబుగారు కట్టించిన రెండెడ్ల గూడు బండిలో ఓ పెద్ద ముత్తయిదువునూ, ఓ పిల్లనూ, పెళ్ళికొడుకునూ, తోడు పెళ్ళికొడుకునూ ఎక్కించారు. మిగతావారు కాలినడకను బయలుదేరారు. సత్తెమ్మగారూ మంగమ్మగారూ వితంతువులు కనుక పెళ్ళి బృందానికి కాస్త వెనుకగా వాళ్ళు నడిచారు. ఇంటి చాకలి ఓ కావడిలో అరటిగెల మొదలైన పెళ్ళి సంబారాలు పట్టుకొని పెళ్ళివారితో నడిచాడు. ఇంటి మంగలి అతడి తమ్ముడూ రాండోళ్లమేళం చేసారు. రాండోళ్లు అన్నది ఒకరకమైన చర్మవాద్యం. వాటి ధ్వని కాస్త ఎక్కువగానే వుంటుంది. పందిట్లో కాసేపు రాండోళ్ల మేళం జరిగాక ఓ పెద్ద ముత్తయిదువును శకునం రమ్మని పెళ్ళి బృందం తరలివెళ్లింది. వారు కాలి నడకన సమీపంలో వున్న భీమవరం గ్రామం చేరి అక్కడ గోదావరి కాలువలో రాదారి పడవ ఎక్కి దీపాలు  పెట్టే వేళకు ఏలూరు చేరారు. ఆ రోజుల్లో గోదావరి నదిలోనూ, కృష్ణా నదిలోనూ,  వీటి కాలువలలోనూ రాదారి పడవలే ముఖ్య  ప్రయాణ సాధనాలు. వీటికి కొంత మేర ఎడ్లబండ్లకు వుండేలాంటి వెదురుపెళ్ళ తడికతో గూడు వుండేది. ఎండ వానల బాధపడకుండా ప్రయాణీకులు  అందులో కూర్చొనేవారు.

                                జనాలకు కావలసిన నిత్యావసర వస్తువులు కూడా వీటిలోనే రవాణా అయ్యేవి. బియ్యం, పప్పు ధాన్యాలు, మిరపకాయలు, చింతపండు, బెల్లం, కూరగాయలూ, వస్త్రాలు,  మొదలైనవన్నీ ఆ పడవల్లోనే ఒక చోటు నుండి మరొక చోటుకు రవాణా చేసేవారు. పడవ రేవులోకి వచ్చేసరికి లచ్చన్నగారూ, సుబ్బారావుగారు ముత్యాలపల్లకి తీసుకొని వచ్చి సిద్ధంగా వున్నారు. విడిది దగ్గరే కనుక పెళ్ళికొడుకును పల్లకీలో ఎక్కించి మిగతావారు కాలినడకనే బయలుదేరారు. ముగ్గురు ముత్తయిదువులు ఎదురుగా వచ్చి రాండోళ్ళ మేళం జరుగుతుండగా పెళ్ళి కొడుక్కి తోడ పెళ్ళికొడుక్కూ ఎర్రని అక్షతలూ, పచ్చని అక్షతలతో దిష్టి తీసి ద్వారానికి రెండు వైపులా పడవేసి చెంబునీళ్ళతో కాళ్ళు కడిగి, తడి చేతులతో కళ్ళు తుడిచి కర్పూరం, చాయపసుపులో క్రొత్త సున్నం కలిపిన వసంతంతో హారతి ఇచ్చారు. మంగళహారతులు పాడుతూ పెండ్లికొడుకును లోనికి తీసుకువెళ్ళారు. జంబుఖానాలు పరచి మగపెళ్ళి వార్ని కూర్చోబెట్టారు. మగవాళ్ళందరికీ సుబ్బారావుగారు సమీప బంధువులూ మజ్జిగ దాహం ఇచ్చి గంధం పూసి, పన్నీరు చల్లి తాంబూలాలు ఇచ్చారు. ఆడవారికి సుబ్బమ్మగారు తోడి కోడలు పాదాలకూ పసుపురాసి పారాణిపెట్టి నుదుట కుంకుమ బొట్టుపెట్టి, మెడకు, ముంజేతులకు, చెంపలకూ గంధం పూసి తాంబూలాలు ఇచ్చారు. అది మాఘమాసం కావడం వలన చిరుచలిగా వుంది. పెళ్ళివారందరికి స్నానాలకు వేడి నీరు కాచారు. అందరూ స్నానాలు ముగించే వేళకు సుబ్బారావుగారు, భార్య బంధువుల్ని వెంట పెట్టుకొని బాజాలతో వచ్చి సుబ్బారావు గారు వంటలయ్యాయి మడికట్టుకొని భోజనాలకు రండి అని మగవారికి చెప్తుంటే సుబ్బమ్మగారు ఆడవారికి నుదుట బొట్టు పెట్టి ఆ విధంగా చెప్పారు. ముసలమ్మల వద్దకు వెళ్ళి పిన్నీ,  అత్తా, మీకు అటుకులు కడిగివుంచాం ఫలహారాలకు రండి అని చెప్పారు. ఆ రోజుల్లో అటుకులు కడిగి, అందులో ఆవకాయ పెరుగు వేసుకొని తినడం ఫలహారం. మామూలుగా వితంతువులు రాత్రివేళ తినే మినపరొట్టే,  కొయ్యరొట్టె, ఉప్పుడు పిండివంటివి పెండ్లి జరిగే ఇంటిలో చేయరాదు. వెంటనే వెడితే ఆత్రగాళ్లు అనుకుంటారని మగ పెళ్లివారు కొంతసేపు తాత్సర్యంచేసి ఓ గంట పోయాక బయలుదేరారు. మగపెళ్ళివారి భోజనాలు ముగిస్తే గాని పెండ్లి ఇంట్లో ఎవరూ అన్నం ముద్ద ముట్టరు. చిన్నపిల్లలు ఆకలికి ఆగలేక గోల పెడుతున్నారు. ముసలివారు నీరసంగా   ఓ మూలవరిగారు.

                    భోజనాల కార్యక్రమం ముగిసేసరికే అర్థరాత్రి కావస్తూంది. మర్నాడు ఉదయమే లగ్నం, చాలీచాలని నిద్రతో తూగుతున్నా అందరు ఉత్సాహంగానే పెళ్ళి వేడుకల్లో పాల్గొన్నారు. పీటల మీదనుంచి వధూవరుల్ని లేవతీసాక భోజనాల కార్యక్రమం ప్రారంభమయింది. సుబ్బమ్మగారి  అక్కగారి కుమార్తెలిద్దరినీ మొగల్తూరు గ్రామంలోనే ఇచ్చారు కదా. వారు కొంత ధనవంతులు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేవారిని ప్రొప్రయిటర్స్‌ అనే అర్థంలో పప్పు రైటర్స్‌ అనేవారు వేళాకోళంగా. అన్న దమ్ముల కుమారులైన  ఆ తోడల్లుళ్ళిద్దరూ పిన్నత్తగారి కూతురి పెళ్ళికి వచ్చారు. పెళ్ళి వారిని వేళాకోళం చేయడం ఆ రోజుల్లో    ఓ సరదా.  సహృదయులైన మగపెళ్ళివారు ఆ పరిహాసాలకు హాయిగా  నవ్వుకునేవారు. చిన్నల్లుడు వంట వారి వద్ద చేరి పెరట్లో గరికంతా కోసి తెచ్చి నూనెలో వేసి బాగా పోపూ, పచ్చి మిర్చీ చేర్చి పచ్చడి చేయించాడు. తాము మొగల్తూరు నుంచి తెచ్చిన పెరుగు కడవలలో ఓ దాంట్లో తౌడు కలిపి బాగా పచ్చిమిర్చీ, కొత్తిమీర,  కలిపి పోపు వేయించారు. భోజనాల వేళ తోడళ్ళులిద్దరూ, ఆరేసిన పట్టు తాపితాలు కట్టి, పట్టు ఉత్తరీయాలు నడుముకు బిగించి వడ్డనకు దిగారు. గోంగూర పచ్చడీ, కొబ్బరికాయ పెరుగు పచ్చడీ మహారుచిగా వున్నాయని మగపెళ్ళివారు మరీ మరీ వడ్డిపించుకొని తిన్నారు. భోజనాలు ముగిసే వేళకు చిన్నల్లుడు సుబ్రహ్మణ్యం కొంటి. అతడు వంట పెద్ద మనిషిని పందిరిలోకి పిలిచి వెంకయ్యగారు ఈ రోజు మీరు చేసిన పచ్చళ్ళు ఏమిటండీ..? అని అడిగాడు. నాయనా నువ్వే కదా గరిక పచ్చడీ, తౌడు, పెరుగు పచ్చడీ చేయమన్నావు అన్నాడు ఆ అమాయకుడు.

                                 ఇంకేం వుంది అగ్ని రగుల్కొంది. మాకు గడ్డి పెడతారా? అని పెద్దగా కేకలు పెట్టి పెళ్ళివారంతా విస్తర్ల ముందునుంచి లేచిపోయారు. సత్తెమ్మగారు, మంగమ్మగారు సుబ్బమ్మగారి బుగ్గలు పొడుస్తూ తగాదాకు దిగారు. మాకు చేసిన అవమానానికి ఇంతకింతా అనుభవిస్తారు అంటూ శాపనార్థాలు పెట్టారు. ఆడపెళ్ళివారు మగపెళ్ళివారు కూడా తమకు లోకువగా వున్న ఆడవారినే తిట్టారు. కొట్టడం తరువాయిగా నానా హంగామా చేసారు. విడిది  ఇంటికెళ్ళి ఆడపెళ్ళి వారు జరిగిన దానికి క్షమించమనీ, ఇటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతామనీ మళ్ళీ వంటలు చేయిస్తాము భోజనాలు పూర్తి చేయమనీ ఎంత బ్రతిమాలినా వాళ్ళు మెత్తబడలేదు. మూడు రaాముల వేళ అటుకులు నూనెలో వేయించి కారం జల్లి మిఠాయి మినుప సున్నుండలు కావిడిలో పెట్టుకొని మరో కావిడిలో మిరియాల  పొడి కలిపిన పానకం ఓ కడవలోనూ కరివేపాకు శొంఠిపొడి ఉప్పు  కలిపిన మజ్జిగ ఓ కడవలోనూ పెట్టుకొని రెండు కావిళ్ళు వంట బ్రాహ్మల చేత పట్టించుకొని ఆడపెళ్ళివారు విడిదింటికి వచ్చారు.

                                    సత్తెమ్మ,  మంగమ్మ కాళ్ళు సుబ్బమ్మగారి చేత పట్టించి జరిగిన అపరాథానికి క్షమార్పణ చెప్పించి మళ్ళీ ఇటువంటి కుర్రచేష్టలు జరిగితే చెవికుదపా ఇస్తామని హామి ఇచ్చి మగపెళ్ళివార్ని ప్రసన్నం చేసుకున్నారు. గంటసేపు బతిమాలిన తర్వాత వారు కరిగారు. మగపెళ్ళి వారందరికి తామరాకులో ఫలహారాలు పెట్టి వారి వారి అభిరుచి ప్రకారం మజ్జిగ, పానకంతో దాహం తీర్చారు. అప్పటికి సుబ్బమ్మగారి అక్క కూతుర్లు రావమ్మ, సీతమ్మలు పెళ్లి కూతురికి చేమంతిపూలతో జడకుట్టి ముఖంతోమించి నుదుట కళ్యాణ తిలకం దిద్ది, కనులకు కాటుక బుగ్గను చాదుబొట్టు, బుగ్గలకు, మెడకు, ముంజేతులకు గంధం పూసి, కాళ్ళకు పసుపు పూసి పారాణి పెట్టి అలంకారాలు చేసారు. వధూవరుల్ని పల్లకీలో కూర్చొపెట్టి, ఆడపెళ్ళి వారి, మగపెళ్ళి వారి ఆడంగులంతా నాలుగు వీధులు ఊరేగించారు. చాకలి పందిట్లో పట్టి మంచం వాల్చి, పరుపు పరచి చలువ దుప్పటి పరచాడు. ముత్తయిదువులు తెచ్చిన అన్నాన్ని వధూవరులకు చూపిస్తారు. ఈ కార్యక్రమం ముగిసాక భోజనాలు జరుగుతాయి. ఈ సమయంలో వధూవరులకు ఏకపాత్ర భోజనం విహితం. వరుడు పరిష్యం పట్టి నేయి వేసిన పప్పూ  అన్నం కలిపి తొలి ముద్ద వధువు చేతిలో పెడతాడు. ఇరువురూ భోజనం ముగించాక వరుడు ఉత్తరాషోశన పట్టి ‘‘అర్థినా ముదకం దత్తం అక్షయ్యముపతిష్టతు’’ అంటాడు. మనిద్దరం ఇక మీదట కలిసి అతిథి అభ్యాగతులకు అన్నదానం చేద్దాం’’ అని దీని అర్థం. కొన్ని ప్రాంతాల్లో వటువుకు తల్లితో ఏకపాత్ర భోజనం విహితం. ఆంధ్రులలో వటువు భుజించాక కొంత పెరుగూ అన్నం విస్తరిలో మిగిల్చి చేయి కడుక్కోమంటారు. అందులో కొన్ని వెండి నాణేలు వేసి వటువు చెల్లెల్ని ఆ అన్నం తిని ఆ నాణాలు కడిగి తీసుకోమంటారు. హిందూ సాంప్రదాయంలో ఎంగిలి నిషిద్ధం. ‘‘ఎంగిలి కలిపినా హీనులనెల్ల పల్లేరు ముళ్ళలో దొర్లింతుననెనూ’’ అని స్త్రీలు పాడుకుంటూ ఎవరికైనా ఎంగిలిపెట్టిన వార్ని యమధర్మరాజు పల్లేరు కంపల్లో దొర్లిస్తాడని పరస్పరం హెచ్చరించుకుంటూ వుంటారు. ఒక్క సంబంధీకుల విషయంలో మాత్రమే ఈ ఎంగిలి పాటించనక్కరలేదని ఆ ఆచారం చెప్తుంది. గ్రామీణులు సన్నిహిత బంధువుల మధ్య వివాహబంధాలు శ్రేయస్కరం అని చెప్పడానికి ‘‘నోటికి చేతికి ఎంగిలి లేని సంబంధం’’ అంటారు.

                           మర్నాడు ఉదయమే లేచి దంతధావనం స్నానాదికాలు ముగించుకొని పెళ్లివారంతా తయారు అయ్యారు. ఈనాటి వారికి విడ్డూరంగా వుండే ఒక ఆచారం ఆనాడు విధిగా పాటించేవారు. పెండ్లిరోజు పెళ్ళికి కొన్ని గంటలు ముందుగా వధూవరులకు మంగళస్నానాలు చేయిస్తారు. కొన్ని చోట్ల విడిగా చేయిస్తారు. ఆ సమయంలో వధూవరులు ధరించిన బట్టలు వంటబ్రాహ్మణులకు చెందుతాయి. ఈ మంగళస్నానాలు జరిగాక ఐదు రోజులు వివాహపు తంతు జరిగి నాగవల్లి రోజు వరకు వధూవరులు స్నానాలు చేయరాదు. పెండ్లిలో మంగళసూత్రధారణకు ముందు కన్యాదాత వరునికి మంత్రయుక్తంగా ఇచ్చిన ఎర్రంచు తెల్లని చీర,  పంచలచాపు సూత్రధారణకు ముందు ధరిస్తాడు. వధువు ఆ మధుపర్కమనే శ్వేతవస్త్రాల్ని ధరించి తలంబ్రాలు బియ్యం వుంచిన రెండు పళ్ళాలు, జ్యోతులు వుంచిన పళ్ళాలు రెండు ధరించిన ఎనిమిది మంది ముత్తయిదువుల మధ్యన నడిచి కళ్యాణ మండపంలోకి వస్తుంది. వరుని కాళ్ళు పళ్లెంలో వుంచి తన భార్య నీరు పోస్తుండగా కన్యాదాత కడిగి కన్యను గుమ్మడిపండు తాంబూలంతో మంత్రయుక్తంగా ధారపోసాక, జీలకర్ర బెల్లం నూరిన ముద్ద వధూవరులు ఒండొరుల శిరస్సులపై వుంచుకొని ధర్మార్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థ సాధనలో ఒకరికి ఒకరు బాసటగా వుంటామని ప్రమాణం చేసుకుంటారు. హస్తమస్తక సంయోగం అని ఒక వ్యక్తి తన అరచేతిని ఎదుటివారి శిరస్సుపై బ్రహ్మరథం వుండే చోట వుంచితే వీరిలోని ఆత్మశక్తులు వారిలో ప్రవేశిస్తాయని హిందువుల నమ్మకం. ఈ విధంగా వధూవరులలో ఒకరిలో వుండే మంచి గుణాలు మరొకరిలో ప్రవర్తిస్తాయన్నమాట.
    
                                       
                           వరుడు, వధువుకు తొలిసారిగా బహుకరించేది ఏ విధమైన ఆడంబరంలేని ఈ ఎర్రంచు తెల్లచీరే. నాగవల్లి వరకు వధూవరులు ఈ వస్త్రాన్ని విడవరు. వీటిని దీక్షా వస్త్రాలు అంటారు. మంగళస్నానాలు  ముగిసాక నాగవల్లి వరకూ పెండ్లి కూతురు, పెండ్లికొడుకు స్నానం చేయరాదు. ఇది నేటికాలంలో  విడ్డూరంగా వున్నా ఆనాడు అందరూ పాటించేవారు.
మరునాడు ఉదయం పెళ్ళివారి ఆడంగులంతా స్నానాదికాలు ముగించుకొని, మంగళవాయిద్యాలతో విడిది ఇంటికి వెళ్ళి మగపెళ్ళి వారిని వరుడిని పెళ్ళింటికి పిలుచుకొని వస్తారు. వీరమ్మగారు కొడుకుని కోడలిని చెరోవైపునా కూర్చోపెట్టుకొని పెళ్ళి పీట మీద కూర్చొన్నారు. సత్యానికి పినతల్లి పెదతల్లి వరుస అయిన ముత్తయిదువులు, వారి కుమార్తెలూ కూడా ఆ పీటమీద కూర్చొన్నారు. సుబ్బమ్మగారు వధూవరులతో సహా వారందరికీ పసుపు పూసి పారాణి పెట్టారు. వియ్యపురాలుకి ఒక కాలికి ఓ విధంగానూ రెండవ పాదానికి మరోవిధంగానూ పారాణి వుంచారు. నుదుట ఆవునేతిలో ముంచి పిల్లకాసు అద్దాక అందరికి కుంకుమ తిలకాలు దిద్దారు.  మెడకు గంధం పూసి, వీరమ్మగారికి బుగ్గలకూ, మూతికి కూడా పూసారు. తాము కుట్టిన వియ్యపురాలి రవిక వీరమ్మగారికి తొడిగి, నెల్లాళ్ళుగా కష్టపడి తయారుచేసిన నగలు వీరమ్మగారికి, బంధుస్త్రీలకు అలంకరించారు. మిరపకాయల దండలు మొదలైన దండలు వేసి బొట్టుపెట్టి వియ్యపురాలికి ఇచ్చి క్రొత్త చెంబుతో నీళ్ళిచ్చి పళ్ళు తోమించడానికి ఓ పెద్ద దూలం పట్టుకొని వచ్చారు.

ఆడపెళ్ళి వారి స్త్రీలు నలుగుల పాటలు అందుకున్నారు.
‘‘కానుగపుల్లలు,  వేపపుల్లలు విడిదికి పంపితిమీ! మేము విడిదికి పంపితీమీ
పారపళ్ళ వియ్యపురాలు పళ్ళే తోమదుగా! తాను పళ్ళే తోమదుగా
అగరు నూనెలు దంతపు దువ్వెన విడిదికి పంపితిమీ! మేము విడిదికి పంపితిమీ
చింపిరిజుట్టు వియ్యపురాలూ తలనే దువ్వదుగా! తాను తలనే దువ్వదుగా
మల్లెపువ్వులు సంపంగి  పువ్వులూ విడిదికి పంపితిమీ! మేము విడిదికి పంపితిమీ
వియ్యమెరుగని వియ్యపురాలూ పూలే ముడవదుగా! తానూ పూలే ముడవదుగా
తమలపాకులూ, ఏలకకాయలూ విడిదికి పంపితిమీ ! మేము విడిదికి పంపితిమీ.
బోసినోటి వియ్యపురాలు విడియము (తాంబూలము) వెయ్యదుగా! తానూ విడియము వెయ్యదుగా  అని పాడుతూంటే మగ పెళ్ళివారు పీటమీంచి లేచి వెళ్ళిపోయారు.

               ఇదేమిటి తమ ఇళ్లలో అన్ని పెళ్ళిళ్ళలోనూ ఈ తంతు వుంటుందే. ఆడపెళ్ళి వారు తనకు చేసిన  మర్యాదలన్నీ మగపెళ్ళి వారు మళ్ళీ ఆడపెళ్ళివారికి చేస్తారు. అందరూ కలిసి హాయిగా నవ్వుకుంటారు. ఇదేమిటి రత్నం అత్తగారికి ఈ సరదాలేం లేవా? మగపెళ్ళివారు ఆడపెళ్ళివారి పాటలకు జవాబుగా పాటలు పాడకుండా ఇలా లేచి వెళ్ళిపోయారేమిటి? ఎంతోసేపు బ్రతిమాలి వారిని తిరిగి పీటపై కూర్చోబెట్టారు. పెళ్ళి నాలుగు రోజులూ వధూవరులకు ముంజేతులకు ఓ పెద్ద ముత్తయిదువ నూనె రాసి పసుపు అలది ఆ పసుపు ఒండొరుల మధుపర్కాలతో తుడుస్తుంది. దీన్ని పసుపుల నలుగు కార్యక్రమం అంటారు. పెండ్లి పీటలపై కూర్చోబెట్టి ఈ లాంఛనం చేసాకనే, వియ్యపురాలు ఆడబిడ్డలకు జరిపే మర్యాదలు చేస్తారు. మరి ఆ నాలుగు రోజులూ మధుపర్కాలు మార్చటం, స్నానం చేయడం చేయరాదు కదా, ఈ నూనె అలది పసుపు రాయడం ప్రత్యామ్నాయం అన్నమాట. అనారోగ్య పరిస్థితుల్లో ఒళ్ళంతా తడిబట్టతో తుడిచి విభూది రాస్తే విభూతి స్నానం. ఇదే శుద్ధి. మరి నేటి స్పాంజిబాత్‌లు ఆ రోజుల్లో లేవు కదా.

                 ఈ కార్యక్రమాల తరువాత ఊరేగింపు సాగింది. వధూవరుల్ని పల్లకీలో కూర్చోబెట్టి నడవడానికి మారాం చేసే బంధువుల పిల్లల్ని వారి మధ్య పల్లకీలో కూర్చోబెడతారు. వియ్యపురాళిద్దరూ తలో పసుపు పళ్ళెం చేతబట్టి ఊరేగింపు చూడవచ్చిన ముత్తయిదువులందరికీ ముఖాన బొట్టుపెట్టి చారెడు పసుపు వారి దోసిట్లో పోస్తారు. మంగళవాయిద్యాలతో ఊరేగింపు  జరిగాక వధూవరులకు దిష్టి తీసి హారతులిచ్చి పాటలు పాడుతూ పెళ్ళింట్లో అగ్నిహోత్రాల ముందు కూర్చోబెడతారు. పెళ్ళి  జరిగిన రోజు  లగాయతూ నాగవల్లి వరకూ రెండు పూటలా ఈ అగ్నికార్యం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వర్ణించే పాట కూడా వుంది. నాగవల్లి నాడు అగ్నికి ఉద్వాసన జరుగుతుంది. ఈ అగ్నిని పునఃసంధానం రోజున ఔపోసన అనే కార్యక్రమంతో పునరుద్ధరిస్తారు. ముత్తయిదువులంతా స్నానాలు  చేసి, తలలు దువ్వుకొని పూలు ముడుచుకొని కుంకుమబొట్లు,  గంధాలు, పసుపు పారాణిలు ధరించి ఉన్నంతలో మేలైన నగలూ, చీరలు ధరించి ఈ వేడుకల్లో పాల్గొంటారు మహోత్సాహంగా. లాజహోమం వేళ  వధువు తోడబుట్టిన వాడు వధూవరులతోపాటు పెండ్లిపీటపై అగ్ని సముఖాన ఆసీనుడై తన సోదరి దోసిట్లో పేలాలు ఉంచుతూ ‘‘అమ్మాయీ! పెళ్ళి చేసి నిన్ను పంపేస్తున్నామని బాధపడకు. నా జీవిత పర్యంతం నీకు కష్టసుఖాల్లో నేను నీకు బాసటగా వుంటాను.’’ అని మంత్రం చదువుతూ ఆమె చేత పేలాలు అగ్నిలో హోమం చేయిస్తాడు. వరుడు బావమరిదికి నూతన వస్త్రాలు బహుకరించి సన్మానిస్తాడు. దీన్ని లాజ కట్నం అంటారు. 

                             3వ రోజున సదస్యం. సదస్సు అంటే పండిత సభ కదా. వేద పండితుల్ని ఆహ్వానించి వేదపఠనం చేసి వధూవరుల్ని ఆశీర్వదింపచేసి వారికి భూరి దక్షిణలిచ్చి సత్కరిస్తారు. ఈ సందర్భంలో వియ్యంకులిద్దరూ పోటీ పడుతూ విద్వాంసులకు సంభావనలిస్తారు. కలతలు రాకుండా వరుని తండ్రి ఇచ్చిన దాంట్లో సగం మాత్రమే వధువు తండ్రి ఇవ్వాలని కొన్నిచోట్ల నిబంధన పెడ్తారు. విద్వాంసులకు వారి పాండిత్యాన్ని బట్టి పారితోషికాలిస్తారు. ఏ పాండిత్యం లేని సామాన్యులకు దొడ్డి సంభావన అని కొద్ది ధనం ఇస్తారు. ఈ సదస్యం వేళ వధువుకు మామగారు వెల గల పట్టుచీర బహుకరిస్తారు. కార్యక్రమం ముగిసే ముందు వధూవరులకు మంగళహారతి ఇస్తారు.  ఈ మంగళహారతి పళ్ళెంలో వేసే బహుమానం మామూలుగా ఇంటి ఆడపడుచులకు చెందవలసినది. ఈ సందర్భంలో వధువుకు చెందుతుంది. ఈ సొమ్ము వరుని తండ్రి వేస్తాడు. ఇది వియ్యాలవారి విభవానికి నిదర్శనం. కుటుంబంగారు సదస్యం మంగళహారతిలో ఒక రూపాయి వేసారు. ఆడపెళ్లివారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. స్థాళీపాకం వేళ కూడా వారు ఇలాగే చేసారు. స్థాళీపాకంలో వధువుకు మంత్రయుక్తంగా స్వర్ణాభరణాలు పెడతారు. వీరు పసుపు దారాన్ని గుచ్చి పిల్లకాసు కట్టారు. ఆడబిడ్డ వరుస అయ్యే బంధువుల అమ్మాయికి మాత్రం పరికిణీగుడ్డ పెట్టించుకున్నారు. నాటి రోజుల్లో పెళ్ళికి నగలూ, శోభనానికి పట్టుచీర అని సామెత. వధువు పసిపిల్ల కనుక నూతన వస్త్రాలు ఇవ్వవలసిన సందర్భంలో వారి వారి శక్తిని బట్టి వధువుకు పరికిణీ గుడ్డలే పెట్టేవారు. కార్యానికి మాత్రం వెలకల బనారస్‌ పట్టుచీర పెట్టేవారు.

             5వ రోజున నాగవల్లి ఉదయం యధాప్రకారం పసుపుల నలుగు కార్యక్రమం అయ్యాక వధూవరుల ఊరేగింపు జరిగింది. ఆడపెళ్ళివారి ఉత్సాహం చల్లారడంతో వియ్యపురాలి పాటలూ, వరుస పాటలూ ఏమీ లేవు.. పెండ్లి కూతుర్ని పెండ్లింట్లో దింపివచ్చి, వరుడు విడిదింట్లో చాకలి పరచిన పాన్పుపై అలకమంచం ఎక్కాడు.
‘‘రావోయి రంగధామ నాగవల్లికీ! లేచి రావోయి రంగథామ నాగవల్లికీ! ఓరోరి కట్నాలిస్తా లేచి రావోయి! నీకు వెండి చెంబులిస్తా లేచి రావోయి.’’ అని వధువు తండ్రి అంటే.
‘‘ఓరోరి కట్నాలు వల్ల రానుపొండి! నాకు వెండి చెంబులు వల్ల రానుపొండి! నేను రానండి మామగారు రానుపొండి!’’ అని వరుడు అంటే

‘‘పట్టుబట్టలిస్తా లేచి రావోయి! నీకు రిస్టువాచి ఇస్తా లేచి రావోయి నాగవల్లికీ’’
‘‘పట్టుబట్టల వల్ల రానుపొండి! నాకు రిస్టువాచీ వల్ల రానుపొండి!   నేను రానండి మామగారు         రానుపొండి! నాగవల్లికీ’’
‘‘సైకిల్‌ బండీ  ఇస్తా లేచి రావోయి! నీకు కుర్చీ, మేజాలిస్తా లేచిరావోయి నాగవల్లికీ’’
‘‘సైకిల్‌ బండీ వల్ల రానండీ! నాకు కుర్చీ మేజాలు వల్ల రానుపొండీ!  నేను రానండి మామగారు         రానుపొండి! నాగవల్లికీ’’
‘‘వెంకటరత్నానిస్తా లేచిరావోయి! నీకు బంగారు బొమ్మనిస్తా లేచిరావోయి! రావోయి రంగథామ!         నాగవల్లికి’’
‘‘వెంకటరత్నం వల్ల వస్తానండీ! నేను బంగారు బొమ్మ కొరకు వస్తానండీ! నేను వస్తానండీ మామగారు!        నాగవల్లికీ’’

                      అని సీతమ్మ రావమ్మలు పాడుతుండగానే సత్యం పానుపు మీద నుంచి ఒక్క ఉరుకు క్రిందకు ఉరికాడు.
పాపం అతడికి చల్దన్నం వేళమించిపోయి ఆకలి అవుతుందాయె. అందరూ  సరదాగా నవ్వుకున్నారు. మామగారు జామారు తాంబూలం వరునిచేతిలో పెట్టగానే అందరూ పెళ్ళికొడుకుని తీసుకొని పెళ్ళింటికి వెళ్ళారు. అత్తవారింటికి అలక తీరి వచ్చిన పెళ్ళికొడుకుని నీ భార్య ఎక్కడ వుందో వెదకి తెచ్చుకో అంటారు. వస్తూనే పెండ్లింటి గడపపై ఓ కొత్తగిన్నెలో అరిసెలు వేసి పెడతారు. ఈ దొంగవేలెం గిన్నె వరునికి దక్కుతుంది. ఈ గిన్నె పెండ్లివారి విభవాన్ని అనుసరించి  వెండిదో కంచుదో వుంటుంది. అందరూ చూస్తుండగా అరిసెలతో సహా ఈ గిన్నెను వరుడు దొంగిలిస్తాడు. దీని అర్థం తెలిసినా తెలియకపోయినా ఈ కార్యక్రమం నేటికి జరుగుతూ వుంది.

                      పెండ్లిలో వరుడు తోలు చెప్పులు ధరించరాదు. కర్రతో చేసిన బొటనవేలి వద్ద పెద్ద బొడిపెగల పాంకోళ్ళు అనే పాదరక్షలు వరుడు ధరిస్తాడు. రాముడు భరతునకు తన గుర్తుగా ఇచ్చినవి ఈ పాదుకలే. ఈ పాదుకలు సన్యాసులు, పండితులూ కూడా ధరించేవారు. వరుడు గుమ్మంలో విడిచిన పాంకోళ్లను ఆడపెళ్ళి వారి పనిమనిషి దాచేస్తుంది. అదో వేడుక. ఆమెకు ఈనాం (బహుమతి) ఇచ్చి వరుడు ఆ పాంకోళ్ళు తిరిగి దక్కించుకుంటాడు. లోపలికి వచ్చిన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కొరకు కొంత వెదికాక పెళ్ళికూతురుకు బావగారి వరుస అయిన యువకుడు పెళ్ళికూతుర్ని వరుడుకు అప్పగిస్తాడు. తోడళ్ళుణ్ణి మరదలి మాడతో సత్కరించి పెళ్ళికొడుకు నాగవల్లికి సిద్ధమౌతాడు. ఈ నాగవల్లి కార్యక్రమం చాలా సరదా అయినది. అన్నట్టు మాడ అంటే 2 అణాల బరువుగల బంగారం. కాని ఈ మరదలి మాడ ఎవరూ బంగారం ఇవ్వరు. నూతన వస్త్రాల్ని బహుకరిస్తుంటారు. బంగారం చవకగా వున్న రోజుల్లో మాడ కొరకు 2 రూపాయలు ఇచ్చేవారట. అలాగే వరహా అనే బంగారు నాణెం కొరకు 5 రూపాయలు ఇచ్చేవారట. ఇదంతా పాతకాలం ముచ్చట.

–  కాశీచయనుల వెంకటమహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, గౌతమీగంగPermalink

2 Responses to గౌతమీ గంగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో