చిన్నప్పటి నా అమాయకత్వం

  నేనెప్పుడు ఒకటో రెండో చదవుతున్నాను . ఆ రోజు దీపావళి . అప్పటికి దీపావళి సామాను అమ్మడానికి ప్రభుత్వ అనుమతి తీసుకునే పద్ధతి ఉందో లేదో తెలీదు కాని మా నాన్న నెల రోజుల ముందే ఓ బండెడు దీపావళి సామానుకొని తెచ్చి కొట్లోపెట్టి అమ్మేవారు . మతాబులు, చిచ్చుబుడ్లూ  కుర్రాళ్లని పెట్టి భారీ ఎత్తున మా వాకిట్లోనే తయారు చేయించేవారు .  దీపావళి రోజు మాపుంత వాకిట్లో పొడవుగా వెదురు బద్దలతో  మూడు వరసల కంచె కట్టించి దాని పైన పేడ ముద్దలుంచి వాటిపైన ప్రమిదలు పెట్టి బోలెడన్ని దీపాలు వెలిగించేది మా అమ్మ . కొట్టు మూసేసి వచ్చేక మా నాన్నతో బాటు కుర్రాళ్ళు , మా మామయ్యలూ చాలా రాత్రి వరకూ టపాసులు పేల్చేవాళ్ళు . పిల్లలం కాకరపు   వ్వొత్తులు , అగ్గి పెట్టెలు  లాంటివి వెలిగించే వాళ్ళం .

           ఆ దీపావళి రోజు ముందే అమ్మేయగా మిగిలిన వాటిని ఇంట్లోకి సరిపడా ఉంచేసి మిగిలిన వాటిని మా పుంత వాకిట్లో ఓ గోనె పట్టా పరిచి దాని మీద పేర్చింది మా నాన్నమ్మ . పదో పరకో కొబ్బరి కాయలుంటే అవి కూడా ఓ పక్కగా పేర్చింది . అప్పట్లో మా ఊరికి పుంత దారే ఊళ్ళో కెళ్లడానికి ముఖ్యమైన రహదారి . దారిన వెళ్ళే వాళ్ళు కొనుక్కుంటారని  ఆవిడ ఉద్దేశం . ఓ ముక్కాలి పీటేసుకుని  కూర్చుంది . కాసేపయ్యేక నన్ను పిల్చి తను చద్దన్నం తిని వస్తానని , ఎవరైనా వస్తే ఏదెంత చెప్పాలో చెప్పి నన్నక్కడ కూర్చోబెట్టి లోపలి కెళ్ళింది . నేను తలంటుకున్న జుట్టు ఆరబెట్టుకుంటూ , కొత్త బట్టలు చూసుకుని మురిసిపోతూ కూర్చున్నాను .

         ఓ అపరిచితవ్యక్తి  సైకిలుకి పెద్ద సంచి తగిలించుకుని వచ్చేడు . ఏదెంత రేటో అడిగేడు .  “ కొబ్బరి కాయలు ఇంకా తక్కువకిస్తారేమో ఇంట్లో  కెళ్లి అడిగిరా “అన్నాడు . నేను సరేనని మా నాన్నమ్మ దగ్గరకెళ్లి స్థిమితంగా నిలబడి కాస్త గడ్డ పెరుగు చేతిలో పెట్టించుకుని తింటూ  విషయం చెప్పేను . వీలుకాదని చెప్పమంది  నాన్నమ్మ . సరేనని నేను బైటి కొచ్చేసరికి ఇంకేముంది ? అక్కడ గోనె పట్టా తప్ప ఇంకేం లేవు . వచ్చినవాడు జోరుగా సైకిలు  తోక్కుకుని వెళ్లి పోతున్నాడు. నాకు  విష యం అర్ధమై  బేరుమని ఏడుపు మొదలు పెట్టెను . నాన్నమ్మ పరుగెత్తు కొచ్చింది . ఏం లాభం , వాడెవడో అప్పటికే రోడ్డెక్కి మాయమైపోయేడు .

‘అంత తెలివితక్కువగా ఉంటే ఎలాగే తల్లీ ‘ అని  వాపోయింది నాన్నమ్మ .  అదే రోజుల్లో మరోసారి మా ఇంటి ముందు నుంచి పుర్రే  వాళ్ల వీధిలోని ఒకమ్మాయి వెళ్తోంది . వాళ్లకి నంది దగ్గర బడ్డీ  కొట్టు ఉండేది .

ఆరోజు మా నాన్న నాకు ఏదైనా కొనుక్కోవడానికి  ఒక పావలా కాసు ఇచ్చేరు. నాకు అప్పటికప్పుడు సేమ్యాతాత దగ్గర ఏదైనా తాగాలన్పించింది . ఆ రోజు సంత కాదు కాబట్టి సేమ్యా తాత  ఎక్కడుంటాడో తెలీదు . పుంతలోకి ఉన్న మా బడ్డీ మీద కాళ్లు వేళ్ళాడేసుకు కూర్చుని పావలాతో ఆడుతున్నాను . ఆ అమ్మాయి  పావలా బిళ్ళ చూసి నా దగ్గర కొచ్చింది .

“ఆ డబ్బులతో  ఏం చేస్తావ్ ?”

“ఏదైనా కొనుక్కుంటాను “

“ఏం కొనుక్కుంటావ్”

“ఏదైనా , సేమ్యా పాలో , షర్బత్ ఏదో ఒకటి “

“ బటానీలు కావాలా ?”

“ తాగేదేనా ?”

“ ఆ .. అవును . నా కూడా  వచ్చేవంటే  మా కొట్లో ఉంది , ఇత్తాను “

“ సరేపద ”

నేనక్కడికి వెళ్లగానే ముందు నా చేతిలో పావలా గుంజుకుంది  ఆ అమ్మాయి . సీసాలోంచి నాలుగు  బఠానీ గింజలు తీసి నా చేతిలో పోసింది . నాకీ గింజలొద్దు , బఠానీలు కావాలి “

“ అయ్యే  బటానీలు ”

“అయితే నాకొద్దు , తీసేసుకుని నా డబ్బులిచ్చెయ్”

“ ఏం డబ్బు ?”

నేను ఏడ్చుకుంటూ ఇంటి కొచ్చి నాన్నమ్మను పిల్చుకెళ్ళే   సరికి ఆ పిల్ల  అక్కడ లేదు.కొట్టు మీదున్న వాళ్ల  నాన్న ఆ రోజు వాళ్లమ్మాయి అక్కడికి రాలేదన్నాడు.తన కూతురు నా చేతిలోని పావలా ను గుంజుకోవటం అతను చూసేడు , అయినా అబద్ధమాడేసేడు.

ఆ రోజుల్లో పావలా అంటే ఎక్కువేమరి . ఒక మాదిరి కుటుంబానికి వంటకి సరిపడా   సరుకులోచ్చేసేవి .

కాస్సేపు గొడవైంది . మా నాన్నమ్మ నారెక్క పట్టు కుని  ఇంటికి లాక్కొచ్చి  కుదేసింది . “ఈ తెలివి తక్కువ దానికి ఎప్పుడూ ఎవ్వరూ  డబ్బులివ్వకండి “ అని ఓ ఆర్డరేసింది .

 ఇంకోసారి : వీధిలోకి పువ్వులు రాలేదని సెంటర్లో కెళ్లి  (నాలుగు రోడ్ల కూడలి ) చేమంతి పూలు కొనుక్కురమ్మని మా అమ్మ నా చేతికి ఒక అణా ఇచ్చింది. పూలబ్బాయి  పూలలో  ఓ ఎర్రగులాబీ కూడా వేసి తామరాకులో మృదువుగా పొట్లం కట్టి ఇచ్చేడు . నంది పక్క నుంచి పుంతలోకి దిగే చోట చేపల బజారు పెట్టేవారు . ఇంకొంచెం దిగువన చర్చి పక్కన పశువుల కబేళా. బోలెడన్ని రాబందులు , గ్రద్దలు ఉండేవి  అక్కడని చెప్పెను కదా !

                                 నేను పూల పొట్లం పట్టుకుని విలాసంగా కూనిరాగం తీసుకుంటూ వస్తున్నాను . గెద్ద ఒకటి ఫట్ మని నా చేతిలో పొట్లం ఎత్తుకుపోయింది . నేను షాక్ నుంచి తేరుకుని చూసుకుంటే చేతి వేళ్ళన్నీ గోళ్లతో గీరుకుపోయి రక్తం చిమ్ముతోంది . ఆరున్నొక్క రాగంతో ఇంటి వరకు వచ్చే సాను కానీ మా అమ్మ నావీపు విమానం మోగిస్తుందని భయం . పక్కన గాజుల  తాత వాళ్లింట్లో దాక్కున్నాను . తర్వాత మా అమ్మకి విషయం తెల్సి పళ్లు నూరుకుని ఊరుకుంది . నన్ను రక్షించే వాళ్లు చాలా  మంది ఉన్నారు కదా మరి ! మా అమ్మ ముడి చుట్టూ పూలు  లేక బోసిగా అన్పించింది . మా అమ్మ దగ్గర ముడి పూలు పెట్టుకునే వెండి చట్రం ఒకటుండేది . ఒక డబ్బాలో చిన్న చిన్న ప్లాస్టిక్ పూల లాంటివి లేత ఎరుపు . ముదురు  రంగుల్లో ఉండేవి . ఆ చట్రానికున్న  సూదుల్లో చేమంతి , మల్లె లాంటి ఏ పూలైనా గుచ్చి పైన ఆ ప్లాస్టిక్ పూలు గుచ్చితే పుష్పం మధ్యలో ఎర్రగా చాలా బావుండేవి . ఆ రోజుల్లో కొందరు పెళ్లి కాని అమ్మాయిలు జడపైన  కూడా అలా పూలు పెట్టుకునే వారు .

                        మా వీధిలో బడికి రాని పిల్లలు కొందరు చెయ్యడానికి పని  లేనప్పుడు బొమ్మల పెళ్లిళ్లు లాంటి ఆటలు ఆడేవారు . కొందరు  పిల్లలు ఓ చోట చేరి బొమ్మల పెళ్లి చేద్దాం అనుకునే వారు . అక్కడి నుంచి ప్రారంభమయ్యేది ఓ తతంగం . ముందుగా  పచ్చి తాటాకులు తెచ్చి ( అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ తాటి మొక్కలూ , ఈత మొక్కలూ ఉండేవి ) రెండు బొమ్మలు చేసేవారు . కుట్టు  మిషను  దగ్గరకెళ్లి రద్దు ముక్కలు ఏరి తెచ్చి వాటికి బట్టలు కట్టేవారు . కాటుక ,తిలకాల్తో  కళ్ళు , నోరు , బొట్టు లాంటివి దిద్దేవాళ్ళు . ఆ తర్వాత అందర్లోకీ  పొట్టిగా  ఉన్న పిల్లనో , పిల్లాడినో ఏరి , వాడి నెత్తిన  పీట ఒకటి తిరగేసిపెట్టి దానిపైన ఆ అంచున ఆడబొమ్మ , ఈ అంచున మగబొమ్మ పెట్టి మధ్యలో  గిన్నె ఒకటి పెట్టేవారు . ఇద్దరో ముగ్గురో సత్తు పళ్ళేల మీద కర్ర ముక్కల్తో వాయిస్తూంటే మిగతా వాళ్ళంతా “ బొమ్మల  బొమ్మల పెళ్లి ళ్ళోయ్ – బోడీ బోడీ పెళ్లి ళ్ళోయ్ “ అని  పాడుతూ వెంట నడిచేవారు . ఇంటింటి దగ్గరా ఆగి పాడుతూంటే వాళ్ళు  బియ్యమో , బెల్లం ముక్కో ఏదో ఒకటి తెచ్చి  గిన్నెలో  వేసేవారు .  అవన్నీ కలిపి చివర్లో చితుకుల పొయ్యి మీద గుజ్జనగూళ్ళు అనే అన్నం పేస్టు తయారు చేసి బాదం ఆకుల్లో  తినేసేవాళ్ళు .

                     ఒకట్రెండు సార్లు  బడిలేనప్పుడు పిలిస్తే నేనూ వెళ్ళేను . ఆ విషయం మా ఇంట్లో తెలీదు , ఒక సారి అలా వీధమ్మట ఇంటింటా బియ్యం అడుగుతూ పాడుతున్నాం . అందులో ‘ కొంత మంది పిల్లలైతే అడుక్కునే వాళ్లని అనుకరిస్తూ ‘ అమ్మా, కొన్ని బియ్యం ఎయ్యండమ్మా ‘అరుస్తున్నారు . అసలే నా  గొంతు పాటల్లో పెద్దది .   ఆ మధ్యాహ్నం మా నాన్న ఇంట్లో ఉన్న సంగతి నాకు తెలీదు .

అంతకు ముందు బియ్యంతో గిన్నె నిండిపోయింది . చిరుగులు లేకుండా ఉందని నా గౌను వొడి పట్టమని దాంట్లో   పోసారు. నా గొంతు విని మా నాన్న కోపంగా చిన్న కర్ర పుల్ల తీసుకుని బైటికొచ్చేరు . మా నాన్న మొహంలో కోపం చూడగానే గౌను అంచులు వదిలేసి పరుగెత్తేను . బియ్యం  అన్నీ మట్టిలో పడి పోయాయి . పాపం ఆ రోజు గుజ్జన గూళ్ళూలేవు ఏమీ లేవు .  ఆ రోజు  మానాన్న నన్ను తన పక్కన పడుకోబెట్టుకుని  జో కొడుతూ “ తప్పు నాన్నా , అలాగ ఇంటింటికీ  తిరిగి బియ్యం అడగకూడదు . కావాలంటే ఆడుకునే వాళ్ళందరూ తలో కాసిన్ని బియ్యం పట్టుకెళ్లి  ఆడుకోండి . లేదా మనింట్లోంచి  ఎన్ని కావాలో మీ అమ్మనడిగి పట్టికెళ్ళు “ అని మృదువు గా చెప్తూనే “బడి కెళ్తున్న పిల్లవి , అలా ఎండన పడి తిరగొచ్చా ?” అని కొంచెం గొంతు పెంచి అన్నారు . నేను నాన్న పొట్టలోకి ముడుచుకుపోయి “ ఇంకెప్పుడూ  చెయ్యను  “ అన్నాను .

                   మా ఊరికి   పగటి వేషగాళ్లు వచ్చినప్పుడూ , ఏడాదికోసారి జరిగే గ్రామ దేవత ఉత్సవాల్లోనూ శక్తి వేషం , తాటకి వేషం వేసేవారు . భయంకరమైన ఆ వేషాల తాలుకు డప్పుల మోత ఇంకా  భయంకరంగా  ఉండేది .  ఇంటి దగ్గరుంటే లోపలికి  పారిపోయి తలుపేసుకునేదాన్ని . అప్పటికవి  మనుషులు వేసుకున్న వేషాలని తెలీదు నాకు .స్కూలు నుంచి వచ్చేటప్పుడు ఎదురుపడితే ఇక చూడాలి నా పాట్లు ! కన్పించిన సందుల్లోకి , గొందుల్లోకి  పారిపోయి  గుండెని అరచేత్తో పట్టుకుని దాక్కునేదాన్ని . అలా పరుగెత్తబోయి కొన్ని సార్లు మంచి నీళ్ల  చెరువు పావంచాల మీంచి దొర్లిపోయి జ్వరం తెచ్చుకున్నాను .  టీకాల వాళ్ళంటే కూడా చాలా భయంగా ఉండేది నాకు .  వీధిలోకి టీకాల వాళ్లు వచ్చారని కబురందితే చాలు ఇత్తడి  గంగాళంలోకో , గాబులోకో  వెళ్లిపోయి దాక్కునేదాన్ని , స్కూల్లో ఉన్నప్పుడైతే చిటికిన  వేలు చూపించి  , వెనక వైపు పడిపోయిన ఇటుకల  గోడ మీది నుంచి జారి మోచేతులు  డొక్కు పోయి రక్తం వచ్చినా సరే పారిపోయే దాన్ని . నెత్తిమీద దొర టోపీ లాంటిది పెట్టుకుని ,  నలిగిపోయిన పేంటూ  షర్టూ వెడల్పైన బెల్టుతో ఇన్ షర్ట్ చేసుకున్న  టీకాల ఇన్ స్పెక్టరు  , సరంజామా మోసుకొచ్చే అతని అసిస్టెంటూ నా కళ్ళకి  కిరాతకమైన భయంకరాకారుల్లా కన్పించేవారు . సన్నని గొట్టం చివర బిగించి ఉన్న పళ్ళ చక్రం స్పిరిట్ లేంపు మీద కాల్చి మందులో ముంచి జబ్బ మీదో , ముంజేతి మీదో రెండు సార్లు బర్రుమని తిప్పేవారు . అంతే , కొన్ని గంటల్లో జ్వరంతో పడకెయ్యాలిందే . అలా ఎన్ని సార్లు పారిపొయినా చివరికి మూడో తరగతి చదివేటప్పుడు పందిరి మంచం కింద దాక్కున్న నన్ను ఎత్తుకుని వెళ్లి టీకాలు  వేయించేసారు మా నాన్న . అలా  మా చెల్లెళ్ళు తమ్ముళ్ళ కన్నా నేనే టీకాలు ఆలస్యంగా వేయించుకున్నాను . కాని , ఆరోజు ఆ బోటిల్ లోని మందుతో టీకాలు వేయించుకున్న వాళ్ళందరికీ కీలాయిడ్  టెండెన్సీ వచ్చింది . అంటే చర్మం  మీద ఏ గాటుపడినా అది పొంగిపోయి నెమ్మదిగా పెరగడం మీద ఫ్రారంభిస్తుంది . అప్పట్లో మశూచి ఎక్కువగా ఉండడం వలన తరచుగా టీకాల వాళ్లు ఊళ్ళల్లో కొచ్చి అందరికీ టీకాలు వేస్తూ ఉండేవారు .

                        ఆ రోజుల్లో కొన్ని సినిమాల్లో తండ్రి మరణించినా , కుటుంబాన్ని వదిలేసి నాన్నఎక్కడికైనా వెళ్ళిపోయినా ఆ కుటుంబంలో పెద్ద పిల్లలు తమ్ముళ్ళ నీ ,చెల్లెళ్ళ నీ  వెంటేసుకుని రోడ్ల మీద అడుక్కొంటున్నట్టు చూపించేవారు . నేను రోజు పొద్దున్నే స్నానం కాగానే మా దేవుడి గదిలోకెళ్ళి “ మా నాన్న చచ్చిపోకూడదు ఎక్కడికీ వెళ్లి పోకూడదు “ అని ప్రార్ధించేదాన్ని . అప్పుడప్పుడూ మా నాన్నమ్మని అడుగుతూ ఉండేదాన్ని “ నాన్న ఎక్కడికీ వెళ్ళిపోరు కదా “ అని . “ ఎందుకెళ్ళి పోతాడు ?” అనేది నాన్నమ్మ . ఒకసారి మా అమ్మతో “ నాకు చాలా పాటలు వచ్చేసాయి . ఇప్పుడిక నాన్న చచ్చిపోయినా ఫర్వాలేదు , ఎక్కడికైనా వెళ్లి పోయినా ఫర్వాలేదు “ అన్నాను . అంతే , నా వీపు  మీద చెళ్ళు మని ఒక పెసరట్టు , నెత్తి మీద రెండు మొట్టి కాయలు పడ్డాయి .

                   ఒకసారి ఎవరో మా ఊరి నుంచి యాత్రా స్పెషల్ బస్సు వేస్తే మా నాన్న శ్రీశైలం మొదలైన రాయలసీమ పుణ్య క్షేత్రాలన్నీ చూసి వచ్చారు . అక్కడి స్థల పురాణాల పుస్తకాలన్నీ కొనుక్కొచ్చారు .  దీపారాధన , అన్న సమారాధన అయ్యాక ఎప్పటిలాగానే పురాణ కాలక్షేపం మొదలైంది . ఆ పుణ్య క్షేత్రం ఎలా ఉందో తన మాటల్లో ముందుగా చెప్పి ఆ తర్వాత ఆ పుస్తకాన్ని చదువుతూ  వ్యాఖ్యానంతో  చెప్పడం , మా నాన్న చెప్పే విధానం ఆకట్టుకొనేలా ఉండేది . నేను రోజూ మా నాన్న పక్కనే కూర్చుని ఆసక్తిగా వింటూ ఉండేదాన్ని . 

                  ఆ వరసలో క్రమంగా బ్రహ్మంగారి మఠం , ఆయన జీవిత చరిత్ర చెప్పి , కాల జ్ఞానం చదవడం మొదలు పెట్టేరు . యుగాంతం గురించి,  యుగాంతానికి ముందు ఏమేం విచిత్రాలు జరుగుతాయో రాయబడింది . యాగండి బసవన్న , లేపాక్షి నందీశ్వరుడు ఆకాశంలో రంకెలేస్తూ పరుగెడతాయంటే సరదాగానే అన్పించింది . కానీ రాత్రి నడి ఝాము వేళ మేక ఒక్కొక్కరి ఇంటింటి  ముందు అరుస్తూ  వెళ్తుందని , ఆ అరుపు విన్న వాళ్ళందరూ చచ్చిపోతారనీ విన్నప్పుడు భలే భయం పట్టుకుంది . రాత్రి నిద్రలో మేక అరువు విన్పిస్తే చాలు లేచి  కూర్చునేదాన్ని . పక్కనే ఉన్న నాన్నమ్మని నిద్ర లేపేసేదాన్ని .

“నాన్నమ్మా , ఎక్కడో మేక అరిచింది “

“ అయితే ఏంటి ? “

“ తెల్లారే వరకూ మనం బతికుంటామా , చచ్చిపోతామా ? “

“అబ్బ , పడుకోవే తల్లీ “

మా నాన్నమ్మ అటు తిరిగి పడుకునేది . చాన్నాళ్ల పాటు మేక అరుపు నన్ను చాలా భయ పెట్టింది .

               తాగే వాళ్ళంటే కూడా భయంగా ఉండేది . మా వీధి చివర ఒక సారాయి కొట్టు ఉండేదని చెప్పేను కదా ! చాలా మందిని తాగక ముందు ఎలా ఉంటారో , తాగేక ఎలా నడుచుకుంటారో గమనించడం వలన ఆ భయంగా పట్టుకుంది . మా ఊళ్ళో అత్తరు సాయెబు ఒకాయన ఉండేవాడు . ఆయన బహుశా కాబూల్ నుంచి వచ్చినట్టున్నాడు . మంచి ఆజానుబాహువు , షేర్వాణి , కుర్తా , ఆపైన ఓవర్ కోట్ , కాబూలీ  తలపాగా , కాళ్లకు ముందు మొనతేలిన ఛడావులు వేసుకుని ఉదయాన్నే కడిగిన ముత్యంలా  బైటికొచ్చేవాడు . భుజానకున్న జోలెలో రకరకాల అత్తర్ల  సీసాలు . అతను  నడుస్తున్న వీధులు పూల అత్తర్ల పరిమళాలతో  గుభాళించిపోయేవి . ఆయన  మా నాన్నను ‘తమ్ముడు ‘ అని ఒకలాంటి తమాషా యాసతో పిలిచేవాడు . మా నాన్నకు అత్తర్ల పిచ్చి బాగా ఉండేది . మా ఇంట్లో ఎప్పుడూ  నాలుగైదు రకాల సెంటు సీసాలు ఉండేది . ఏ కొత్త రకం సెంటు వచ్చినా ముందుగా మానాన్నకే అమ్మేవాడు . అప్పట్లో సెంటు సీసాలు అల్యూమినియంవి , గాజువి భలే అందంగా ఉండేవి . ఇప్పట్లాగా  షాపుల్లో దొరికేవి కావు .

                ఇంతకీ ఆ అత్తరు సాయెబుగారు రోజంతా చుట్టు పక్కల ఊళ్లల్లో కూడా తిరిగి అమ్మిన డబ్బుల్తో సాయంకాలానికి సారాయి కొట్టు దగ్గరకి చేరుకునేవాడు . అందరితో ఎంతో మర్యాదగా మసులుకునే ఆయన తాగడం మొదలు పెట్టిన కాస్సేపటికి తిట్ల దండకం మొదలు పెట్టేవాడు . ఎంతగా తాగే వాడంటే ఏపెంట కుప్ప మీదో స్పృహ తప్పి పడిపోయేవాడు . వాళ్ల వాళ్లు వచ్చి అత్తర్ల సంచినీ ఆయన్నీ మోసుకెళ్ళే వారు . ఈ మొత్తం దృశ్యం చూస్తూంటే నాకు కడుపులోంచీ దుఃఖం వచ్చేసేది .

                       ఇంకోసారి ఇంకో సంఘటన కూడా బాగా భయపెట్టింది  నన్ను . మా కాంపౌండు లోపల వాకిలి మొత్తం గచ్చు చేసి  ఉండేవి . కరెంటు  లేని  రోజులుకావడం వలన సాయంకాలం ఆరు గంటలకే పిల్లలకి భోజనాలు పెట్టేసేవారు . ఎనిమిదయ్యే సరికి నిద్ర . 

                   ఆ రోజు మా గేటు వైపు వాకిట్లో కోడిగుడ్డు దీపం వెలుతురులో పిల్లలం అన్నాలు తింటున్నాం . మా  నాన్నమ్మ , అమ్మ తినిపిస్తున్నారు . శీతాకాలం , చీకటి రోజులని గుర్తు . గేటు ఎప్పుడూ తెరిచే   ఉండేది . ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు మా నూతికి నీళ్ళకి వచ్చేవాళ్లు . నేను గేటు వైపు తిరిగి కూర్చుని ఉన్నాను . నేను నిర్ఘాంతపోయి  చూస్తూ ఉండగానే  ఒక భారీ ఆకారం పరుగుపరుగున వచ్చి  మా అన్నం గిన్నెల మీది నుంచి లంఘించి  ఇంట్లోకి దూసుకుపోయింది . అందరం భయం తో పెద్దగా గీ పెట్టేసాం . అంతలో  దబ్బుమన్న చప్పుడు , మా అరుపులకు చుట్టుపక్కల ఇళ్ళల్లో  వాళ్ళంతా వచ్చేసేరు . అందరం  కలిసి దీపాలు పట్టుకుని వెళ్లి చూస్తే మా   పెద్దింట్లోంచి వీధి గది లోకెళ్లే మెట్ల మీద ఒక  వ్యక్తి పడిపోయి  ఉన్నాడు .  బాధతో మూలుగుతున్నాడు .  

                         ఇంతకీ అతనిది మా పొరుగూరట , అతను సారాయి కొట్లో తాగుతూండగా పోలీసులు (ఎక్సైజ్ వాళ్లు ) వచ్చేరట . భయంతో పారిపోతూ సందు మలుపనుకుని మా గేటులోపలికి వచ్చేసాడు . వెనక్కెళ్లే ధైర్యం  లేక ఇంట్లోకి వెళ్లిపోయేడు . మెట్లున్నాయని తెలీక తన్నుకుని  పడిపోయేడు . తెల్లని పంచె , చొక్కా వేసుకుని ఉన్నాడు . అతన్ని తెలిసిన వాళ్లెవరో గుర్తు పట్టేరు . సాయం పట్టినా లేవలేక గోలగోల పెట్టేసాడు . దగ్గరలో ఉన్న డాక్టరు దగ్గరకి తీసుకెళ్తే అతని కాలు విరిగిపోయిందని తెలిసిందట . అప్పటికే కొంత పెద్ద వయసుకావడం వల్లనో ఏమో అతని కాలు బాగవలేదు . నడకలో వైకల్యం ఎప్పటికీ  ఉండిపోయింది . ఏంటో తెలీదు కాని , తాగి తూలుకుంటూ వెళ్ళే వాళ్లని చూస్తే నాకు కడుపులో తిప్పేసి వాంతులైపోయేవి .

– కె. వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to చిన్నప్పటి నా అమాయకత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో