స్త్రీ యాత్రికులు

మహా యాత్రికురాలుఇసాబెల్లా బర్డ్‌ బిషప్‌

              ఈ బ్రిటీష్‌ యాత్రికురాలు ఇంగ్లండులోని యార్క్‌షైర్‌లో ఒక మత బోధకుని ఇంట్లో పుట్టింది. వారిది మధ్యతరగతి కుటుంబం. ఆమెకు తోడుగా ఒక చెల్లెలు తప్ప మరెవ్వరూ లేరు. ఇసాబెల్లా చిన్నతనం నుండీ అనారో గ్యంతో బాధపడేది. వీలైనంత ఎక్కువగా బయట తిరగటమే ఆమెకు ‘మందు’ అని డాక్టర్లు చెప్పటంతో వాళ్ళ నాన్న ఇసాబెల్లాని గుర్రంమీద ఎక్కించుకొని పరిసరాల్లోని పల్లెల్లో తిప్పేవాడు. ఆ విధంగా ఇసాబెల్లా ప్రకృతికి దగ్గిరయ్యింది. తర్వాతిరోజుల్లో అలా తిరగడం ఇసాబెల్లాకి ఒక అలవాటుగా మారింది. తండ్రి గ్రామాల్లో తిరిగి మత ప్రచారం చేస్తున్నప్పుడు పెద్ద కూతుర్ని వెంట తీసుకెళ్ళటం ఎప్పుడూ మరచిపోయేవాడు కాదు. ఆ సమయాల్లో ఇసాబెల్లా, పంటపొలాల్లో ఎగిరే పకక్షుల గురించి, ఆకాశంలో తిరిగే మేఘాల గురించి, సరస్సుల్లో వికసించే పువ్వుల గురించి ఎన్నో ప్రశ్నలడిగేది. ఆయనతో తరచుగా చర్చికి వెళ్ళటంవలన బైబిలు అంతా కంఠోపాఠమైంది. ఎలాంటి విషయాన్నైనా ఒకసారి వింటే అర్థంచేసుకోవడం, గంటల తరబడి చర్చిలో నిలబడటం కూడా అలవాటైంది.
   

                  ఇసాబెల్లాకి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి గుర్రపు స్వారీ, చర్చిలో సువార్త చెప్పటం బాగా వచ్చాయి. వ్యాసరచన పోటీల్లో స్కూల్లో ఆమెకే ఫస్టుమార్కులు వచ్చేవి. తన తెలివి తేటలు వయసు ఎంతగా పెరిగిపోతున్నాయ్ష్మో తన ఆరోగ్యం అంతగా క్షీణించటం మొదలయ్యింది.
   

                      ఆమెకి పధ్ధెనిమిది సం||ల వయస్సప్పుడు వెన్నెముక మీద పుట్టిన ఒక కణితిని ఆపరేషన్‌ ద్వారా తొలగించవలసి వచ్చింది. ఆ బాధతో నడవలేక, కొంతకాలం మంచానికే పరిమితం అయ్యింది. హాయిగా నవ్వుతూ, తుళ్ళుతూ తిరగాల్సిన వయసులో అలాగ అనారోగ్యంతో మంచా నికి అతుక్కుపోయి, ఆసుపత్రి కిటికీల్లో గుండా కదలిపోయే ప్రపంచాన్ని చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సంవత్సరం అంతా ఎన్ని కలలు కంటూ గడిపిందో మరి! త్వరగా లేచిపోయి లేడిలాగా తిరగాలనీ, హుషారుగా గుర్రపుస్వారీ చేద్దామనీ, మంచంమీది నుండి లేచి, పక్షిలాగా పైకెగిరిపోవాలని కలలు కంటూ జీవించిందేమో.
   

                   అలాగ మంచానికి పరిమితమైన ఇసాబెల్లా భవిష్యత్‌లో అద్భుత మైన సాహసాలు చేస్తుందనీ, ఉత్తర అమెరికా, హవాయి దీవులు, సెంట్రల్‌ ఆసియా, టిబెట్‌, చైనా దేశాల్లో పర్యటిస్తుందనీ, రైలు, పడవ, జడలబర్రె, ఏనుగు, పల్లకీ లాంటి వైవిధ్యమైన వాహనాల మీద ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆమె రాసిన తొమ్మిది యాత్రా గ్రంథాలు ఆనాటి బెస్ట్‌ సెల్లర్స్‌. అంతేకాకుండా రాయల్‌ జాగ్రఫికల్‌ సొసైటీలో ఉపన్యాసం ఇచ్చిన మొదటి మహిళగా ఈమె చరిత్ర సృష్టిం చింది.
  

                      ‘లేచి తిరగటం ఎలాగా?’ అనుకొంటూ మంచంమీదే కాలం గడుపుతున్న ఇసా బెల్లాకు ‘నీవు లేచి తిరగాలి. అదే నీ జబ్బు నయం చేస్తుంది’ అని డాక్టర్లు చెప్పగానే, వాళ్ళ నాన్నగారి వద్ద వందపౌండ్లు డబ్బు తీసుకుని ప్రయాణానికి సిద్ధం అవుతుంది.  ఇసాబెల్లా అందగత్తెకాదు. పొట్టిగా ఉంటుంది. పై పళ్ళు కొంచెం ఎత్తు. ఎలాగూ కాస్త జబ్బు మనిషి. కాబట్టి మగాళ్ళవలన ఆమెకి అంత ఇబ్బంది ఉండదు అని నిశ్చయించుకొన్నాక ఆమెని ఒంటరిగా ప్రయాణా నికి పంపటానికి తల్లి దండ్రులు ఒప్పుకుని, జాగ్రత్తలు చెప్పి, దీవించి పంపుతారు.
   

                  ఇసాబెల్లా మొదటగా కెనడాలోని ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ దీవిలో ఉంటున్న తన కజిన్‌ వద్దకి వెళితే మంచిది అనుకొంది. ‘నీ ఆరోగ్యం బాగయిందాకా అక్కడే ఉండు’ అని తల్లిదండ్రులు భరోసా ఇవ్వటంతో ఇక ఆలస్యం చెయ్యకుండా 1854 వ సం|| జూలైలో తన ఇరవైమూడవ సంవత్సరంలో లివర్‌పూల్‌లో ఓడమీద బయలుదేరుతుంది. దారిలో ప్రతిరోజూ ఇంటికి ఉత్తరాలు రాసేది. వాటిని తన చెల్లి ప్రేమగా చదువుకొని జాగ్రత్తగా దాచేది.
   

ఆరునెలల తరువాత క్షేమంగా ఆరోగ్యంతో ఇంటికి వచ్చిన ఇసాబెల్లా తన ఉత్తరాలన్నీ తానే చదువుకొని ఆశ్చర్యపడుతుంది. ఈ యాత్ర వలన ఆమె ఆరోగ్యం చాలావరకు నయమవుతుంది. ఆ సంతోషంలో వాళ్ళ నాన్న ‘ఆ ఉత్తరాలన్నీ ఒక పుస్తక రూపంలో ముద్రిస్తే బాగుంటుంది’ అని సలహాఇస్తాడు.
   
                 ఈ విజయాన్ని ఆనందిస్తూ ఇంటివద్ద ఉన్న ఇసాబెల్లాకి మళ్ళీ ఆరోగ్యం చెడిపోతుంది. సాధారణంగా ఎవరికైనా బయట తిరిగితే ఆరోగ్యం చెడిపోతుంది. కానీ, ఈమెకి అది వ్యతిరేక దిశలో పనిచేయటం విచిత్రంగా ఉంది. ‘మరోసారి బయటకి వెళ్ళి తిరగటమే దానికి మందు’ అని డాక్టర్లు చెప్పటంతో మళ్ళీ పెట్టెలు సర్దుకుని యాత్రకి బయలుదేరుతుంది. ఈ రెండో యాత్రకూడా ఆమెరికాలోనే చేస్తుంది. కానీ ఈసారి ఒక సంవత్సరం పాటు తిరుగుతుంది. తండ్రి ప్రభావం వలన మత విషయాల పట్ల కుతూహలంతో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో తిరిగి ‘ఆరోగ్యం బాగు పడింది’ అని నిర్ధారించుకొన్న తరువాత తిరిగి ఇంటికి వస్తుంది. ఈ అనుభవాలన్నీ పుస్తకంలో రాస్తుంది.
   

            ఇలా ఉండగా 1866 వ సం||లో ఇసాబెల్లా తల్లి మరణిస్తుంది. అక్కాచెల్లెళ్ళు తండ్రి నుండి వేరైపోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో, ఆ ఇద్దరూ వేరే ఇల్లు తీసుకుని ఉంటారు . కలసి ఉండటం వలన వారిద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత ఎక్కువ అవుతాయి. చెల్లెలి బాధ్యత తాను తీసుకోక తప్పలేదు. ఆమెకి తోడుగా ఇంట్లో ఉంటే తన ఆరోగ్యం పాడవుతుంది. తనేమో తిరగక తప్పదు. ఇలాంటి ఆలోచనలతో ఒక్కోసారి ఇసాబెల్లా డిప్రెషన్‌లోకి వెళ్ళేది. ఈ సారి కొండ ప్రాంతాలు, సముద్రతీరాల వెంట తిరిగితే తన ఆరోగ్యానికి మంచి దని సలహా ఇస్తారు డాక్టర్లు ఇసాబెల్లాకి.
   

             దీంతో తన మూడవ యాత్రకు సిద్ధమై 1868 వ సం|| జూన్‌లో తన ముప్ఫైఏడవ సంవత్సరంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వెళుతుంద్ష్మి చెల్లెలిని ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి. ఎగిసిపడే సముద్రకెరటాలు, గజిబిజిగా ఉన్న పర్వతమార్గాలు, అడవి ప్రజల ఆచార వ్యవహారాలు, ఇవన్నీ ఇసాబెల్లాకి ఎంతో సంతోషాన్నిచ్చాయి. బాహ్య ప్రపంచంలో తనకు పరిచయమైన వ్యక్తులు, ప్రదేశాలు ఆమెకి ఇచ్చినంత ఆనందం, ఇంటి వద్ద లేదు అని తెలుసుకొంటుంది. ఈ మూడో యాత్రలో తన మూడో నేత్రం తెరుచుకొన్నట్లయి ‘యాత్రలు చేయటం ఎప్పటికీ ఆపకూడదు’ అని నిర్ణయించుకొంటుంది. తన జీవితాంతం వరకూ ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
   

                  ఆరు నెలలు దీవుల్లో గడిపిన తరువాత, చెల్లెలి వద్దకి చేరుకున్న ఇసాబెల్లా తన యాత్రానుభవాలన్నీ  పుస్తకంలో రాసింది  అప్పటినుండి ఇసాబెల్లాకి పుస్తకాల ద్వారా డబ్బురావటం మొదలుపెడుతుంది. ఆ డబ్బులో ఎక్కువ భాగాన్ని చెల్లెల్ని సంతోషపెట్టటానికి, ఆమె ఆరోగ్యానికి ఇస్తుంటుంది. ఈ మూడో పుస్తకం 1875 వ సం||లో ముద్రించారు. బ్రిటీష్‌ స్త్రీలకి ప్రపంచాన్ని చూపుతున్న గైడ్‌గా ఇసాబెల్లాని అభివర్ణించారు. అందువలన ఆమె సాహిత్యాన్ని ఎంతో కుతూహలంతో చదివేవారు. ఆమె ఎక్కడెక్కడ తిరిగినా అమెరికా మీద మమకారం తగ్గలేదు. మొదటి రెండు యాత్రల్లో ఆమె తిరగని రాష్ట్రం లేదు. ఈసారి ఆమెకి కోలరాడో రాష్ట్రంలోని రాకీ పర్వతాల్లో తిరగాలని కోరిక కలిగింది. తన నాలుగో యాత్రని ఆ దిశగానే మళ్ళించిన ఇసాబెల్లాకి ఊహించని సంఘటనలు జరుగుతాయి. మరచిపోలేని వ్యక్తులు తారసపడతారు.
   

                ఆ కొండ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు మౌంటెన్‌ జిమ్‌ అనే యువకుడు పరిచయమై తనకి గైడ్‌గా ఉంటానంటాడు. పదిహేనువేల అడుగుల ఎత్తు ఉండే ఆ పర్వతాల్లో జిమ్‌ని తోడుగా తీసుకొని ఇసాబెల్లా బాగా తిరుగుతుంది. ఆమెకి ఎలాంటి ప్రమాదాలు రాకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు జిమ్‌. ఆమె ఇంతవరకూ చేయని పని ఈ యాత్రలో చేయవలసివస్తుంది. జిమ్‌ని ప్రేమించటమే ఆమె చేసిన కొత్త పని. అలా ఎందుకు జరిగిందో తనకే తెలియదు. కానీ ఆ విషయం ఎవ్వరితోటీ చెప్పదు. కానీ జిమ్‌ని ఎవరో కాల్చి చంపేస్తారు. ఆ సమయంలో వేరేచోట ఉన్న ఇసాబెల్లాకి, జిమ్‌ తనగదిలోకి వచ్చి తనతో చివరిసారిగా మాట్లాడి నట్లు అనిపించిందట. పిస్టలు లేకుండా ఆ అడవుల్లో తిరిగిన ఇసాబెల్లాకి, జిమ్‌ మరణం ఎంతో భయాన్ని కలిగిస్తుంది. అంతకంటే ముఖ్యంగా ‘ప్రేమలో పడటం’ అనే భావన ఆమెను పిరికిదాన్నిగా చేస్తుంది. అలాంటి చేదు అనుభవాలతో ఇంటికి వచ్చిన ఇసాబెల్లా కొంతకాలం యాత్రలు మానేసి, చెల్లికి తోడుగా ఉండటంలో ఆనందం పొందుతుంది.
   

               1879 వ సం||లో మొదటిసారి వెలుగుచూసిన తన రాకీ పర్వతాల అనుభవాల పుస్తకం  జిమ్‌ని ఎంతగానో పొగుడుతుంది. అతనికి ఒక కన్నులేదు అనే విషయం కూడా మనకి అప్పుడే తెలుస్తుంది. ఈ పుస్తకం ప్రతి సంవత్సరం పునర్ము ద్రణ అయి, కొత్తగా ముస్తాబై పర్వత ప్రియుల హృదయాల్లో ముద్రలు వేస్తూనే ఉంది. ఇంటివద్ద విశ్రాంతి తీసుకొంటున్న ఇసాబెల్లాకి, తన చెల్లెలి ఆరోగ్యా న్ని చూస్తున్న డాక్టరు పరిచయమవుతాడు. అతని పేరు జాన్‌ బిషప్‌. ఈయన పరిచయం అయినప్పటి నుండీ ఆమెకి విశ్రాంతి కరువైపోతుంది. బిషప్‌ తనకన్నా పదిసంవత్సరాల చిన్నవాడు. తనని వదలకుండా తిరిగేవాడు. ‘నేను పెళ్ళిచేసుకొనే రకం కాదు’ అని చెప్పినా వినిపించుకోకుండా అదే పనిగా తిరగటం ఇసాబెల్లాకు నచ్చదు. నిజానికి తల్లిని కావాలని ఇసాబెల్లాకి ఎప్పుడూ లేదు. అలాంటప్పుడు ‘పెళ్ళి మాత్రం ఎందుకు?’ అనుకొనేది. బిషప్‌ రూపం కళ్ళముందుకి రాసాగింది. కొత్త ప్రదేశాలు, కొత్త ప్రకృతితో ఆమె చుట్టరికాన్ని కలుపుకొంది కానీ, మనుషుల్ని ఎప్పుడూ నమ్ముకోలేదు.
   

                    ఈ సమస్యకి పరిష్కారం వెతుక్కోవటానికా అన్నట్లు, చెల్లికి కూడా చెప్పకుండా జపాన్‌కి పారిపోతుంది ఇసాబెల్లా. అక్కడి గ్రామీణ జీవితాన్ని ఆనందించాక సింగపూర్‌, మలయా దేశాలకు వెళుతుంది. అదే ఊపులో మలేషియా వెళ్ళి, అక్కడి అడవుల్లో ఏనుగుమీద యాత్రలు కూడా చేస్తుంది. ఆమె శక్తి, ధైర్యం చూసిన స్థానికులు ‘నువ్వు ఆరుగురు మగవాళ్ళతో సమానం’ అనేవారు. ఆ తరువాత కొన్ని నెలలకి ఈజిప్టు మీదుగా ఇంటికి చేరుకుంటుంది ఇసాబెల్లా. చెల్లిని ఒంటరిగా వదిలివేసి ఇన్నాళ్ళూ తిరిగినందుకు మరోసారి బాధపడుతుంది. రోజుకి 5, 6 గంటలు పనిచేసి తన జపాన్‌ యాత్రా గ్రంథం పూర్తిచేస్తుంది. . ఇది 1880 వ సం||లో అచ్చవుతుంది. దాని తరువాత మూడు సంవత్సరాలకి ఇంతలో అనారోగ్యంతో ఉన్న తన చెల్లెలు అకస్మాత్తుగా మరణి స్తుంది. ఈ పరిస్థితుల్లో ఇసాబెల్లా ఒంటరిదైపోతుంది. ఉన్న ఒక్క తోడు తన చెల్లెలు. ఆ తోడు కాస్తా పోవటంతో మానసికంగా దెబ్బతింటుంది. తనూ మనిషే, నోట్లో మాట చెప్పుకోవటానికి తోడుకావాలి. ఎంతకాలం ఒంటరిగా ఉండగలదు?
   

                    డాక్టర్‌ బిషప్‌ ఎప్పటిలాగే తనవెంట తిరుగుతూనే ఉన్నాడు. పైగా తనని ఓదార్చటానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. చివరికి అతని ప్రేమ శక్తి ముందు తాను కరిగిపోయి, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడక, వెంటనే బిషప్‌ని పెళ్ళిచేసుకొంటుంది.
    బిషప్‌ తనకి తోడుగా ఉండి, చెల్లెలు లేని లోటు తీరుస్తున్నాడు అనుకుందే తప్ప బిషప్‌ని భర్తగా ఎప్పుడూ భావించలేదు ఇసబెల్లా. తనని భార్య పాత్రలో ఎప్పుడూ ఊహించుకోలేదు. పెళ్ళినాటికి ఇసాబెల్లా వయసు సరిగ్గా యాభై సంవత్సరాలు. బిషప్‌కి నలభై. తన చెల్లెలు కాని బతికి ఉంటే తాను ఎప్పటికీ పెళ్ళి చేసుకొనేదే కాదు . పెళ్ళయిన ఐదు సంవత్సరాల కల్లా బిషప్‌కి ఎనీమియా జబ్బుచేసి మరణిస్తాడు. ఇసాబెల్లా జీవితంలో వరుసగా తల్లినీ, చెల్లినీ, ఇప్పుడు భర్తనీ కోల్పోతుంది. గుండె రాయి చేసుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది తనకి. ఇక ఆమెకి జీవితంలో తోడు ఎవరూ లేరు. ఎంతో నిరాశకి గురవు తుంది. పగలంతా తన నీడే తనకి తోడు. రేపు ఉదయం ఆ నీడ మరలా వస్తుంది కదా అనే ఆశే, రాత్రికి తోడు. ఇలాంటి స్థితిలో ఇల్లు వదిలిపెట్టి తనకు నచ్చిన ప్రతిచోటా తిరగటం మొదలుపెట్టింది. పేరుకి తగ్గట్టుగానే ఇసాబెల్లా బర్డ్‌, ఒక ప్రయాణాల పక్షిగా మారిపోయింది.
   

       కొంతకాలం స్కూల్లో పిల్లలకి ఫ్రెంచి భాష నేర్పింది. మరికొంతకాలం డ్రాయింగ్‌, పెయింటింగ్‌ నేర్పి కాలక్షేపం చేసింది. మగవాడి మాదిరిగా బట్టలు వేసుకుని ధైర్యంగా తిరగటం నేర్చుకొంటుంది.  1887 వ సం||లో లండన్‌ వెళ్ళి నర్సింగ్‌లో శిక్షణ తీసుకుని కొంత కాలం రోగులకు సేవలు చేసింది. ఎన్ని పనులు చేసినా అవి ఆమెకి తృప్తి నివ్వలేదు. చర్చిలో సువార్త చెప్పి స్వాంతన పొందటానికి ప్రయత్నించింది. అయినా ఆవిడ మనసుకి శాంతి దొరకలేదు. చివరికి తన సామానంతా సర్దుకుని ఆసియా వైపుగా బయలు దేరింది.  ఆసియా అంటే ఆమెకి ఎప్పటి నుండో ఇష్టం.  ఆనాటికి ఆసియాలో దుర్భేద్యమైనదిగా చెప్పబడుతున్న టిబెట్‌కి వెళ్ళాలని ఆలోచన చేస్తుంది.     అక్కడ తన భర్తపేరు మీద వైద్యశాల కట్టించాలని అనుకుంది. ప్రఖ్యాత రచయిత ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ ఈమెకి బాగా తెలుసు. అతని ద్వారా మధ్య ఆసియాకి సంబంధించిన దేశపటాలు తెప్పించి వాటిని అధ్యయనం చేసింది. ఈ ఆసియా యాత్ర తన ఆరవ యాత్ర.
   

                        1889 వ సం||లో ముస్లిం దేశాలగుండా బయలుదేరి, మార్చినాటికి పాకిస్తాన్‌లోని కరాచీ చేరుకుంటుంది. ఆ పరిసరాల్లో స్త్రీలకి స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేకపోవటం చూసి ఎంతో స్పందిస్తుంది. వారు పాటించే బహు భార్యావ్యవస్థని కూడా ద్వేషిస్తుంది. ఎంతో మంది ముస్లిం స్త్రీలు ఇసాబెల్లాని కలిసి ‘మందులు ఏమన్నా ఉంటే ఇవ్వాల్సిందిగా’ కోరతారు. ‘ఎందుకూ?’ అని అడిగితే ‘నా సవతి ముఖం కాలిపోవాలి’ అనో ‘ఫలానా ఆవిడ కొడుకుని చంపేయటానికి’ అనో వివరించేవాళ్ళు. అలాంటి పరిసరాల్లో ఉండలేక లాహోర్‌ వచ్చి శ్రీనగర్‌కి వెళదామనుకొంటుంది. ఇసాబెల్లా ఇండియాలో అడుగుపెట్టాక అక్కడ ఇంగ్లీషు మాటలు విని ఎంతో సంతోష పడుతుంది.
 

– ప్రొ .ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో