మృత్యుం (న) చమే ….

  

జీవితం సుందరమైన , సుమధురమైన అనుక్షణం ఆస్వాదయోగ్యమైన ఓ స్వప్నం .

    మరణం – భయంకరమైన బాధాకరమైన కోరి ఆహ్వానించ  తగని ఓ సత్యం  ! 

                   ఈ మద్య  ఓ కాఫీ సాయంత్రం ఓ మిత్రుడి నుంచి ఫోను – ` అమ్మ పోయింది పావుగంట అయ్యింది ‘ అని . అతని గుండెల్లో బాధ నాకు తెలుసు , గొంతులో చిన్న రిలీఫ్ కూడా తెలుస్తోంది . మరో పావుగంటలో అతడి దగ్గర వున్నాను . జేబులో పర్స్ , చేతిలో సెల్లూ మరచిపోకపోవడం  నా ప్లానింగ్ కి నిదర్శనం కాదు , అనుబంధాలపై అవసరాలు చెలాయించే పెత్తనానికి ఓ ఋజువు మాత్రమే .నేను వెళ్ళే సరికి కుటుంబసభ్యులు తొమ్మండుగురు కాక – చుట్టుపక్కల యిళ్ళ వాళ్ళు కొద్దిమంది వున్నారు . ఎక్కాడా ఏడుపులూ పెడబొబ్బలూ లేవు . ఎనభై ఏళ్ళు దాటాక కేవలం కొద్ది గంటలు మాత్రం ఆస్పత్రిలో వుండి కన్నుమూసిన ఆవిడ జీవితపు నిష్క్రమణ క్షణాలలో నిశ్శబ్దంగా ప్రార్దిస్తున్నారు . అందరి హృదయాలలోనూ బాధ వుంది , ఆ వయసులో ఎక్కువ యాతన పడకుండా సునాయాస మరణాన్ని పొందగలిగిన అదృష్టం పట్ల కాస్త రిలీఫ్ వుంది . ఆవిడ రామాయణ , భారత భాగవతాలు, భగవద్గీత , ప్రతీ రోజూ తెలుగు పేపరూ తప్ప ఏమీ చదువుకోలేదు . ఓ మద్య తరగతి కుటుంబంలో స్త్రీ అనుభవించే అన్ని రకాల కష్టాలనీ చాలా సహనంతో నేర్పుతో అధిగమించింది . పిల్లలనీ మనవలనీ కనీసపు సౌఖ్యాలతో ప్రశాంతంగా గౌరవంగా బ్రతకగలిగేలా ముఖ్యంగా వారిచుట్టూ వుండే సమాజానికి వీలైనంత ఉపయోగపడేలా తీర్చిదిద్దింది . మరణానికి ఒక్కరోజు ముందు పేపర్ లో నేత్రదానానికి సంబంధించిన వార్త చూసి  ` నేను పోయాక నా కళ్ళు ఎవరికయినా యిచ్చేసే ఏర్పాటు చేయి నాయనా ‘ అని కొడుక్కి చెప్పింది . నేను వెళ్ళిన మరో మూడు గంటలలో ఆ కార్యక్రమాన్నీ పూర్తి చేయగలిగేం . ఈ పాటికి ఆ కళ్ళు మళ్ళీ ఈ లోకాన్ని చూస్తూనే వుండి వుంటాయి . పెద్ద కొడుకు పెళ్ళయిన అతికొద్ది రోజులలోనే ఏదో ప్రమాదంలో మరణిస్తే …పదహారురోజుల పండుగయినా కాని కొత్త కోడలిని రాచిరంపాన పెట్టి కడుపున పెట్టుకోలేదు , కడుపులో పెట్టుకుని చూసుకుంది . కొన్నాళ్ళ తర్వాత భర్త మరణించినా మిగిలిన పిల్లల్నీ మనవల్నీ తీర్చిదిద్దడంలో ప్రదానపాత్ర తానే అయింది . మృత్యువే తనకు తానుగా వచ్చి  దేహీ అన్నప్పుడు సాఫల్యమైన జీవితపు పరిపూర్ణ పాత్రని ఆమె ముందుంచి నిశ్శబ్ధంగా ఈ లోకం నుంచి నిష్క్రమించింది , గమనించండి మృత్యువుని స్వయంగా ఆహ్వానించి కాదు . యిది సగటు మనిషి మరణానికి ఓ సుందరమైన పార్శ్వ్యం , జీవితానికి ఓ సాఫల్యమైన ముగింపు . 

                            కానీ అన్ని మరణాలూ ఒకే పార్శ్వ్యంతో వుండవు  … అన్ని జీవితాలకీ ముగింపు ఒకేలా వుండదు . సుమారు యిదే సమయంలో పత్రికలలో … విదేశాలలో చదువుకుని ముంబై లో స్థిరపడి భారత దేశపు అగ్రశ్రేణి కధానాయకుడి సరసన మొదటి సినిమాలోనే అవకాశాన్ని చేజిక్కించుకుని అపురూపమైన విజయాన్నీ చవిచూసిన ఓ నటి స్వీయ మరణ వార్త ….నాకెందుకో క్లియోపాత్రాని గుర్తు తెచ్చింది . సర్వాంగ సుందరంగా అలంకరించుకుని పాము చేత కాటు వేయించుకుని మరణించబోయే క్షణంలో ” ….The stroke of death is as lover’s pinch / which hurts and is desired ..”  అనుకున్న క్లియోపాత్రా . ప్రతీ ప్రేమ కథకీ ముగింపు విషాదమే … అన్నారో సినీ కవి కాకపోతే కొన్ని ప్రేమకథలు పెళ్ళితో కూడా ముగుస్తాయి అదింకా విషాదం అంటాడో మిత్రుడు కాసింత సర్కాస్టిక్ గా . యిరవైయవ శతాబ్ధపు చిత్రకారులలో ప్రపంచంలో అగ్రగామిగా ‘ క్యూబిజం ‘ కి ఆద్యుడిగా ప్రసిద్దిగాంచిన పికాసో వెర్రి మొర్రి చేష్టలనీ చిత్రహింసలనీ భరించలేక ఆయన నలుగురి భార్యలలో ఒకరైన వాల్టర్ ఆత్మహత్య చేసుకుంది , మరో భార్య జాక్విలిల్రొక్ రివాల్వర్ తో కాల్చుకుని చచ్చిపోయింది .మిగతా భార్యలూ ప్రియురాళ్ళ సంగతి భగవంతుడి కెరుక . 

                          మనం చరిత్ర పాఠాలు నేర్చుకుంటాం కానీ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోం .

                                    కేవలం గత సంవత్సరం అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలోనే  నలభై అయిదువేల మందికి పైగా మహిళలు ఆత్మ హత్య చేసుకున్నారు . సగటున రోజుకి నూట యిరవి తొమ్మిది మంది మహిళలు . వ్యక్తిగత కారణాలు , భావోద్రేకాలు ఈ మహిళల ఆత్మహత్యలకి ప్రధాన కారణాలు కాగా వీరిలో 67.9 శాతం వివాహితులు . ప్రతీ ఆరు ఆత్మహత్యలలోనూ ఒకటి గృహిణిది గా గుర్తించబడింది .

                           మనిషి పుట్టుకకి మోహావేశం కేవలం ఓ భౌతికమైన కారణం కావచ్చు కానీ అంతర్గతమైన అంతిమకారణం మరోటుంటుంది . దానిని వెదుక్కుంటూ జీవన సాఫల్యాన్ని సాధించడానికి మనిషి బ్రతికి తీరాలి . 

                       శంకరాచార్య , క్రీస్తు , కీట్స్ , శ్రీనివాస రామానుజన్ , ఈ తరంలో కల్పనా చావ్లా …వీరిలో ఎవ్వరూ తమ నలభైవ పడిని చూడలేదు కానీ కొన్ని వందల సంవత్సరాలకి సరిపడా సాధించి జీవన సాఫల్యాన్ని పొందారు . కారణం చాలా చిన్నది వీరెవ్వరి ప్రేమా కేవలం వ్యక్తి పట్ల కాదు . ఓ ధర్మం పట్ల , వ్యక్తుల పట్ల , ఓ భావం పట్ల , సిద్ధాంతం పట్ల , శాస్త్రం పట్ల , మొత్తం మానవాళి పట్ల .

                        బ్రతకడం ఒక కర్తవ్యం. దానిని విధిలేక కొనసాగించకూడదు , అనుక్షణం ఆస్వాదిస్తూ  ఆనందంగా నిర్వహించాలి . అసలీ ఆత్మహత్యల వెనుక మౌలికమైన కారణం ప్రేమ కాదు , వారి జీవితం పట్ల వారికి ప్రేమ లేకపోవడం . చదువు , ఉద్యోగం , ప్రేమ , పెళ్ళి ,వైఫల్యాలు , అప్పులు , అవమానాలు ….కారణాలేమైనా మనిషికి  తన జీవితం కంటే ఎక్కువ కాదన్న ఒక్క నమ్మకాన్ని , కోల్పోయిన వేటినయినా తిరిగి పొందవచ్చు ఒక్క జీవితాన్ని తప్ప అనే అవగాహనని చాలా చిన్న వయసునుంచే ఈ తరంలో కల్గించవలసిన నైతికమైన బాధ్యత అందరిపైనా వుంది . కాకుంటే గంటకి పదిహేను గా నమోదయిన ఆత్మహత్యల రేటు సెకనుకి ఒకటిగా మారడానికి ఎన్నో సంవత్సరాలు పట్టదు . వృద్దించమే , వృద్దంచమే అని భగవంతుని వేడుకున్న చమకకారుడు కూడా మృత్యుంచమే (మరణాన్నివ్వు)  అని వేడుకోలేదు. ఎందుకంటే ఈ మద్యనే సీతారామశాస్త్రి గారు చెప్పినట్లు బ్రతకడం  ఓ కర్తవ్యం . 

 బ్రతుకంటే అమ్మ ఒడి  బ్రతుకంటే కాదు అలజడి 

బ్రతుకంటే నాన్న ఎద సడి బ్రతుకంటే కాదు మృతి ఒడి 

ఆకులు రాలిన శిశిరం కొసలో తరువు తనువు చాలిస్తుందా 

ఆశల చిగురులు పోగుచేసుకుని ఆమనిగా విరబూస్తుందా 

ఆ మానుకున్న ఆశాదృక్పధం మనిషికి లేకుందా 

సృష్టినింక ఏ ప్రాణికైన ఆహ్వానమరణముందా  ….

ఎప్పుడో వ్రాసుకున్న పాటలోని ఆఖరి చరణం ఈ కాలం కి ముక్తాయింపు .

                        ‘ కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్ సమాః …” కర్తవ్యాన్ని నిర్వహిస్తూ నిండు నూరేళ్ళూ బ్రతకమన్న ఉపనిషత్ వాక్యం ముగింపు .   

 

– ఆచాళ్ళ శ్రీనివాసరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

One Response to మృత్యుం (న) చమే ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో