లాస్ట్ మెసేజ్

                             ప్రముఖ X చానల్ అధిపతి దశరథ్ దుర్మరణం. నగర పొలిమేరల్లో మితిమీరిన వేగంతో కారు నడుపుతూ అదుపు తప్పి డివైడర్ ని డీ కొట్టి పల్టీలు  కొట్టిన కారు. డ్రైవ్ చేస్తున్న దశరధ్ అక్కడికక్కడే దుర్మరణం. ఎక్స్ క్లూజివ్ Y వార్తలు చూస్తూ ఉలికిపడి పోన్ అందుకుంది ధాన్యమాలి   అప్పుడే ఆమె  పోన్ మ్రోగడం మొదలయ్యింది. లిఫ్ట్ చేసింది, అవతలి వైపు నుండి చానల్ సిబ్బంది .. “సారీ మేడమ్. సర్ కారుకి యాక్సిడెంట్.   ఆయన నో మోర్ ” చెప్పాడు

                             చేతిలో ఉన్న పోన్ లో ఆమె కోసం ఒక మెసేజ్ కాచుకు కూర్చుని ఉంది ఓపెన్ చేసి చదువుకుని అతని మరణవార్త విన్నప్పటి కన్నా ఎక్కువ షాక్ అయింది. పది రోజులపాటు దశరథ్ మరణ వార్త ప్రసారం చేసి చేసి సొంత చానల్ కి కూడా విసుగు కల్గింది.ఊదర గొట్టే వార్తల మధ్య దశరధ్ ని అందరూ మర్చిపోయారు. రాజకీయనాయకుడు  చనిపోతే సానుభూతి ఓట్లకోసం బై ఎలక్షన్ లో అతని భార్యకి సీట్ దక్కినట్లు దశరథ్ మరణించగానే అతని భార్య “దాన్యమాలి” కి చానల్ పగ్గాలు చేతిలోకి వచ్చాయి .

                       తెల్ల చీర కట్టుకుని,పొడవాటి జుట్టుని ఒక రబ్బర్ బాండ్ తో బంధించి నెమ్మదిగిగా నడుచుకుంటూ వచ్చి భర్త సీట్లో కూర్చుంది ఆమె. ఒక గంట కూర్చుని సిబ్బంది సానుభూతి వాక్యాలు,నమస్కారాలు భరించి ఇంటికి వచ్చేసింది . సాయంత్రం ఆమె చిన్ననాటి స్నేహితురాలు   సుధ ఆమెని పరామర్శించడానికి వచ్చింది ఆప్పుడామె శోక దేవతలా ఉంది. కొన్ని పొడి పొడి మాటల తర్వాత ఆమెని దాన్యమాలి అడిగింది

                          సుధా .. నీ భర్త చనిపోయి ఏడెనిమిది యేళ్ళు అయింది కదా ! అతని మరణాన్నిఎలా భరించావ్? ఇప్పటికి బిడ్డని పెట్టుకుని ఒంటరిగానే బ్రతుకుతున్నావ్!?
                   నీకెలాంటి ఇబ్బందులు కలగలేదా ? అడిగింది ఆర్దికంగా చాలా ఇబ్బందులు,అందుకోసం ఉద్యోగం చేయక తప్పదు. రకరకాల మనుషులు వారి వింత ప్రవృత్తులు. వాటిని భరిస్తూనే బ్రతుకుతున్నాను.తప్పదు కదా ..
ఇదిగో , దీని కోసం అంటూ ఎనిమిదేళ్ళ పాపని ఒడిలోకి తీసుకుంది.

 ఇవన్నీ సరే .. నీకెప్పుడు తోడూ కావాలని అనిపించలేదా ? అడిగింది ఆరాగా.

 అనిపించినా  అన్నీ అణిచేసుకుని బ్రతికేయాలి ఆడ బ్రతుకు కదా ! తప్పదు అంది

ఆమె కొంచెం విచారంతో

“అణచి వేసుకోవడం అంటే “.. అడిగింది.

            భర్త చనిపోయి పది రోజులు కూడా కాలేదు. ఇవేం ప్రశ్నలు అనుకుంటూనే  “మగవాడు బరి తెగించి తిరిగినట్లు ఆడవాళ్ళు తిరగడం అంత సులభంకాదు. పద్దతికాదు.
                అంత కన్నా తాడు బొంగరం లేనివాడినయినా,ఏమి తెలియని అమాయకుడినయినా కట్టుకోమని చెపుతారు . స్వాతిముత్యం సినిమాలో చెప్పినట్లు” అంది.

మౌనంగా వింది దాన్యమాలి.

              “ఏమిటో ..నీ   జీవితం ఇలా అయిపొయింది కోట్లు అయితే ఉన్నాయి కాని మనిషి మాత్రం లేడు  కదా ! పిల్లలున్నా బావుండేది. వాళ్ళని చూసుకుంటూ బ్రతికేదానివి” సానుభూతి చూపింది. ఇంకాసేపు ఉంది వెళ్ళిపోయింది

                భర్త ఉండి  కూడా  నేను ఇన్నేళ్ళు విధవరాలిగానే బ్రతికాను సుధా .అని  అరచి చెప్పాలనుకుంది. కానీ చెప్పలేకపోయింది. దశరథ్ మరణానికి తనే కారణం అయ్యింది ఏమో! తన బరితెగించినతనమా ..లేక ధిక్కార స్వరమా?

               ఇంతకు  క్రితం సుధ చెప్పినట్లు ఆడవాళ్ళు  అండర్ టోన్ లో తమ ఇబ్బందులని చెప్పుకుని నిట్టూర్చేవారు, పరిస్థితులకి అనుగుణంగా  రాజీ పడేవారు. తనలా తెంపరితనం చూపినవాళ్ళు తక్కువేమో ! ఓదార్చడానికి వస్తున్న  వాళ్ళని తప్పించుకుని గదిలోకి వెళ్ళిపోయింది.  మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసుకుని దశరథ్ పంపిన లాస్ట్ మెసేజ్ ని చూసుకుంది. పశ్చాతాపమో లేక అంత  కన్నా ఏమి చేయలేని నిస్సహాయతో ఆమె దుఖభారంలో మునిగిపోయి .. పది రోజుల వెనక్కి వెళ్ళి ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంది

తన చేతిలో ఉన్న  STD మెడికల్ రిపోర్ట్ ని పట్టుకుని అచేతనంగా ఉండిపోయింది ధాన్యమాలి

మళ్ళీ ఒకసారి లాబ్ సూపర్ వైజర్ ని పిలిచి ” ఈ రిపోర్ట్ నేను పంపిన వ్యక్తి … అదే ఆతను “శ్రీధర్ ” వేకదా! ఏవిధమైన పొరబాటు  జరగలేదు కదా? “..  అడిగింది అనుమానంగా

అలాంటిది  జరిగే  అవకాశమే లేదు మేడం .. ఖచ్చితంగా  మీరు పంపినతని శాంపిల్స్ యొక్క  రిపోర్ట్ ఇదే .. నిర్ధారణ చేస్తూ . చెప్పాడు .

తల ఊపి ..”సరే ..ఇక మీరు వెళ్ళవచ్చు” అని చెప్పింది.

                       బోర్లించిన కడవ లాంటి పొట్టతో ఎప్పుడూ తెల్లని బట్టలలో ఫ్రెష్ గా కనిపించే భర్త హటాత్తుగా బరువు తగ్గడం తరచూ జ్వరం రావడం లాంటి  లక్షణాలు గమనించి తనతో పాటు హాస్పిటల్ కి తీసుకు వచ్చి STD టెస్ట్ చేయించుకోమని
చెప్పింది. నేనింత  పబ్లిక్ గా ఆ టెస్ట్ చేయించుకుంటే నా పరువేం  కాను కుదరదంటే కుదరదు అన్నాడతను. అయితే నేనే టెస్ట్ లకి  కావాల్సిన శాంపిల్స్ అన్నీ తీస్తాను అంటూ తనే స్వయంగా తీసుకుని  “శ్రీధర్  ” అనే మారు పేరుతొ ఆ శాంపిల్స్ ని లాబ్ కి  పరీక్షల కోసం  పంపించింది

                     తన పనులన్నీ అయ్యాక రూం కి వచ్చి చూస్తే “శ్రీధర్ ” పేరుతో వచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ ఎదురుగా  టేబుల్ పై పెట్టి ఉన్నాయి. తెరిచి చూస్తే షాక్ కొట్టినట్లు అయింది. ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకున్నాననుకుంది కానీ  తను ఎంత
రక్షించబడ్డానో అన్న సంగతి అర్ధమై మనసులో కనబడని దేవుడికి దణ్ణాలు పెట్టుకుంది

               కాసేపటి తర్వాత కాల్ చేసి ” దశరథ్ .. ఎక్కడ ఉన్నారు? అడిగింది. “ఏమిటి సంగతి ఒక మీటింగ్ లో ఉన్నాను ఎనీ అర్జంట్ ? “అడిగాడతను

                ” మీ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి.  అర్జంట్ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే రండి . కానీ ఈ రోజు మాత్రం తప్పకుండా మీరు ఇంటికి రావాలి “చెప్పింది

              “సరే ! నేను ఏ సంగతి కాల్ చేస్తాను”  అంటూ కాల్ కట్ చేసాడు అతను.ఎంత ధీమా… అసలు ఆ టెస్ట్ లలో ఎలాంటి అనారోగ్యముందో తెలుసుకునే ఆసక్తిలేదతనికి  అనుకుంటూ … ఆ రాత్రి ఇంటికి వస్తే అతనితో ఎలా మాట్లాడి విషయం చెపితే బాగుంటుందో అని ఆలోచిస్తూ ఉండి  పోయింది

               కొన్నాళ్ళ క్రితం   ఇదే కార్పోరేట్ హాస్పిటల్ లో  అనేక సార్లు తను మాత్రం దొంగ పేర్లుతో ఇలా టెస్ట్ లు చేయించుకోలేదు అని అనుకుని .. నేను టెస్ట్ చేయించుకోవడం అనేది ఇతరులకి తనపై నమ్మకం కల్గించడానికి అలాగే ఇతరుల నుండి మెడికల్ రిపోర్ట్స్ కంపల్సరీ  అని  షరతు  విధించింది  ముందు ముందు తనకి ఎలాంటి ఆరోగ్యపరమైన  ఇబ్బంది కలగ కూడదనే ఉద్దేశ్యం తోనూ చేసినవి కదా, మనం తాగే నీరు, తినే ఆహారం, మన పరిసరాలు ఎలా అయితే పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటామో అలాగే శారీరక సంబంధం ఏర్పరచుకునే వ్యక్తి కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ని కలిగి ఉండలేదని తీర్మానించుకోవాలి  కదా !  ఇతరుల నుండి మనం ఏమి ఆశిస్తున్నామో ఇతరులకి కూడా మన నుండి అలాంటి హామీ ఇచ్చితీరాలనుకునే నిబద్దత కల్గిన వ్యక్తి గా ఉండాలని  అనుకోవడంలో తప్పేమీ ఉంది ?  అలా ఆలోచిస్తూనే … “ఆ మాత్రం నిబద్దత లేకపోతే  ఎలా ?..” స్వగతంలో అనుకోబోయి పైకే అనేసింది

“నన్నా.. మేడం  ఏదో అంటున్నారు”  అని అడిగింది జూనియర్ .

“ఆహా,  లేదు లేదు నిన్ను కాదు జనరల్గా అంటున్నాను” అంది

                      ఆమె ఏం మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో అర్ధం కాక విచిత్రంగా ఆమె వైపు ఒకసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది జూనియర్ మళ్ళీ ఆమె ఆలోచనలు  ఆగిపోయిన నిబద్దత దగ్గర మొదలయ్యాయి నైతికత – అనైతికత మధ్య మనకి కనబడేది ఒకే ఒక  అక్షరం తేడానే!  ఆచరణ లో మాత్రం ఎంత కష్టం ? ఈ ప్రపంచం మొత్తం డబ్బు,సెక్స్  అధికారం అనే మూడింటి చుట్టూనే తిరుగుతుంటుంది. ఎవరి అవసరం ఏమిటో, ఎంతో మరొకరికి  తెలియనట్లు నైతికత అనైతికత అనే అర్ధాలు కూడా మనఃప్రవర్తులును బట్టి మారి పోతుంటాయి.  ఎవరి నడవడికకి వారే జవాబుదారీ అయినప్పుడు మనం వేరొకరిని  ఎలా జడ్జ్ చేయగలం ?
                 ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గర నుండే దశరధ్ తో మాట్లాడటం మొదలెట్టాలి అనుకుంది.  వీలైనంత  బలంగా అతని బలహీనత పై దెబ్బ కొట్టాలని ఉవ్విళ్ళూరుతుంది ఆమె

                    తమ ఏడడుగుల బంధం మొదలైన ఏడేళ్ళ నుండి ఎన్ని అనుభవాలు!!   సళ సళ  కాగే ఎసరులో పడేసిన బియ్యంలా పగిలి తుక తుక ఉడుకుతున్నాయి  మనసుకి తగిన గాయాలు పచ్చి వాసన వేస్తూ చేదైన  జ్ఞాపకాలని గుర్తు చేస్తున్నాయి   వద్దు వద్దు అనుకుంటూనే గుర్తు చేసుకునే ఆగత్యం పట్టినందుకు విసుక్కుంటూనే  బయటికి వచ్చి కారు నడుపుకుంటూ ఇంటి దారి  పట్టింది.

                 శిశిరం రాకుండానే అర్ధంతరంగా రాలే ముదురుటాకుల్లా  రాలి  గాలివాటుకు కొట్టుకుపోతే బాగుండును  ఈ  జ్ఞాపకాలు మనసునిబాద పెట్టకుండా…  అని అనుకుంటుంది  కానీ మళ్ళీ  వద్దనుకున్న ఆజ్ఞాపకాల బురదలోనే కూరుకుపోతుంటుంది

                రవీంద్రభారతి వేదికగా తను తన విధ్యార్ధులతో చేయిస్తున్న  నృత్య ప్రదర్శన సందర్భంగా  కవరేజ్ కోసం వచ్చిన  దశరధ్ తో   తన పరిచయం ఒక గమ్మతైన విషయం ఒక జర్నలిస్ట్ గా  పరిచయం అయిన  అతనితో ప్రేమలో పడటం విచిత్రమే! పరిచయమైన ఒక నెలరోజులకే ఇల్లు విడిచి  వెళ్ళిపోయి అతనిని పెళ్ళాడటం మరొక విచిత్రమే!

తను   డాన్స్  టీచర్ గాను,  అతను జర్నలిస్ట్ లాగా పని చేసుకుంటూ ఒక సంవత్సరం ఆనందంగానే గడిపారు

                     దశరథ్  మనసులో ఎప్పుడూ  మేడలు, కోట్లు  గురించి ఆలోచనే!  డబ్బు ఎలా సంపాదించవచ్చో అన్న మెలుకువలు బాగా వంట బట్టించుకుని అడ్డదారులు  త్రోక్కినప్పుడల్లా అతనితో  తీవ్రంగా వ్యతిరేకించేది .

                “ఇప్పుడు వ్యతిరేకించిన నువ్వే ఆ డబ్బుకి హారతులు పట్టే రోజు వస్తుందిచూడు ” అంటూ శపధాలు చేసేవాడు. రకరకాల వ్యాపారాలు చేసేవాడు అందులో అమ్మాయిలని  ఎరగా  వేసి  కాంట్రాక్టర్ లకి  బిల్లులు చేయించడం అనేది మంచి నీళ్ళ  ప్రాయం అనే  పేరు గడించాడు.  అవినీతి నాయకులకి  కొమ్ముకాస్తూవారికి  విశ్వస నీయమైన వ్యక్తిగా  నమ్మకం సంపాదించాడు.

క్రమేపి అతను ఆమెకి దూరం అయ్యాడు అనే కంటే  ఆమె అతనికి దూరం జరగ సాగింది ఆమె దూరం జరిగినప్పుడల్లా  దశరధ్ మాత్రం ఆమెని ఎద్దేవా చేసేవాడు .. “నువ్వెప్పుడూ  పనికి మాలిన నీతి  కబుర్లు చెపుతావ్  గడ్డి వామి దగ్గర కుక్క లాంటి దానివి, నువ్వు తినవు ఎదుటి వారిని తిననివ్వవు అని.” శూలాల్లా గుచ్చుకునే ఆమాటలకి దాన్యమాలికి కన్నీళ్లు ముంచుకొస్తాయి అయినా వాటిని  కసిగా దాచేసుకుని  లోపలంతా తడిసి ముద్దయిపోయేది .

ప్రతినెల జీతం అందుకున్నవెంటనే  ఓ రెండు వేల రూపాయలైనా సరే పదులు, ఇరవైలు నోటులుగా  మార్చి   పట్టణానికి దూరంగా విసిరి పారేసినట్లున్న మురికి వాడలకి వెళ్లి  అందరికి పంచి వారి నవ్వులని భుజానకున్న సంచీలో వేసుకుని ఆనందంగా ఇంటికి వచ్చి అమ్మ-నాన్నలకి తన జీతం ఇంతే అని అబద్దం చెప్పినటువంటి సంఘటనలు చెపితే ఎంతగానో మెచ్చుకుని, నీలాంటి అమ్మాయే భార్యగా  నాకు  కావాలి అని కోరుకున్న దశరథ్ యేనా ఇతను అన్న అనుమానం
కల్గేది.

కొన్నాళ్ళకి ఆమె ఇష్టంగా సాగించుకునే డాన్స్ స్కూల్ కూడా  వెళ్ళ వద్దని తీర్మానించేసాడు,  దానితో  ఆమె కృంగి పోయింది   జీవితంలో వరుసగా ఏమి కోల్పోతుందో అర్ధం అవసాగింది భర్త చేతిలో కీలుబొమ్మగా మార్చబడుతుంది స్వేచ్చని కోల్పోతుందని అర్ధమయిపోయినప్పుడైనా మేల్కోని   తన అర్భకత్వం పై జాలి పడుతుంది. ఒక మనిషి హాయిగా నవ్వడం చూస్తే తను ఎందుకలా నవ్వలేకపోతుందో అర్ధం కాని స్థితి నుండి బయట పడలేకపోతుంది  బహుశా  ఒకేఒక మనిషి  తన జీవిత సర్వస్వం అనుకోవడం మూలంగా వచ్చిన పరిస్థితి అది  , ప్రతి ఆడపిల్ల అలాగే జీవిస్తుందేమో .. నేను అలాగే ఉన్నాననుకుని  సర్ది
చెప్పుకోవడం అలవాటు చేసుకుంది అది కొన్నాళ్ళే !

  బాహ్య  స్వేచ్చని నిరోదించగలరేమో  కానీ  అంతర్ స్వేచ్చన్ని అణచి వేయడం సాధ్యం కాని పని కనుక   మనసు పరి పరి విధాలుగా తలపోస్తుంది.  ఆలోచన వాటిని నియంత్రించ లేకపోతే మనిషి ఎంతకైనా తెగిస్తాడు అంట .

తన  విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది .

                 ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త  సాన్నిహిత్యం దక్కని  ఆమెలో సంతోషం క్రమంగా మాయమవడం మొదలెట్టింది. రోజులు, వారాలు, నెలలు ఆతను ప్రక్కన లేకుండానే గడిచిపుతున్నాయి అతని కోసం ఎదురు చూసిన రోజులు అతను వచ్చాక
ఇందుకేనా  ఇతను రావాలని కోరుకున్నాను వద్దు గాక వద్దు అనుకున్న బరువైన క్షణాలు  ఆమె జీవితంలో భాగమయిపోయాయి.   ఎప్పుడూ  మనసంతా ఇసుర్రాయిలో పడి నలిగే గింజలా నలిగి పోయేది .

పిడికెడంత ప్రేమ కావాలి, అది తప్ప ఇంకేది వద్దనిపిస్తుంది   అదే మాట దశరధ్ తో అంటే ఎంత సేపు  ప్రేమ ప్రేమ అంటావు !? ఏం  చేసుకుంటావు ఈ పనికి రాని  ప్రేమ ని.  ప్రేమ ఏమన్నా డబ్బుని సృష్టించగలదా ! డబ్బుతో వచ్చే సుఖాలు కంటే ప్రేమ గొప్పదా ?   అందరూ నువ్వు అనుకున్నట్లు అణాకాణీ  ఖర్చు లేని ప్రేమని ప్రకటిస్తూ..  భార్య  ఎదురుగా ముప్పొద్దులు కూర్చుంటే  అది మాత్రమే  గొప్ప ప్రేమ అని నిరూపించు కున్నట్లా  !?  అని లాజిక్ గా మాట్లాడే అతనితో పోట్లాడి కూడా నెగ్గలేనని అర్ధం అయింది .

                        మొదట్లో మనసుకి సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నం చేసేది, తర్వాత  సెగలు రగిలే శరీరం ని జోకొట్టడానికి ప్రయత్నం చేసింది  శరీరానికి సర్ది చెప్పడం మనసుని సర్ది పెట్టుకున్నంత తేలిక కాదని తెలుస్తుంది . ఎక్కడో చదివిన గుర్తు “మనసు పిలుపు కన్నా శరీరం పిలుపు బలంగా ఉంటుందని/ అదే నిజమవుతుంది . ఆమెలో శరీర కాంక్షలు మేల్కొన్నప్పుడల్లా దశరథ్ కోసం ఎదురు చూపులు చూసేది కళ్ళు ఎర్రబడేవి ఎర్రబడ్డ కళ్ళలోనే సూర్యుడు పుట్టుకొచ్చేవాడు నిన్నటి రోజున పుడమితో  పొద్దస్థమాను రమించినా మళ్ళీ  తీరని కోరికలా ..

                 చిన్న వ్యాపారాలు చేసే దశరధ్ ఒక రాజకీయ ప్రముఖుడి అండతో ఒక చానల్ కి అధిపతిగా మారాడు    అతనికి వార్తలు సృష్టించడం తెలుసు వాటిని క్యాష్ చేసుకోవడం తెలుసు.  డబ్బు వెదజల్లి , ఉద్యోగ అవసరం కనిపెట్టి అనేకానేక అమ్మాయిలతో సరదాలు తీర్చుకోవడం తెలుసు. తాత్కాలిక  మత్తు నిచ్చే ఖరీదైన మద్యాలు ,  ఎంత  మంది అమ్మాయిలని మార్చినా  సంతృప్తి పడనీ మృగ వాంచలు, నిద్రపోనివ్వని అనవసర కాలక్షేపాలు  మగత నిద్రలో కరిగే  అనేకానేక రాత్రులు కలగాపులగమయి దశరథ్ కి ఇల్లుని కాని ఇల్లాలిని కాని క్షణం పట్టించుకునే తీరిక లేకుండా చేసాయి .

                      డబ్బు డబ్బుని సృష్టించడానికి ఎక్కువ కష్టపాడాల్సిన అవసరం లేకుండానే పొలాలు,తోటలు,ప్లాటుల రూపంలో, బంగారం రూపంలో పేర్చబడుతున్నాయి. అయ్యో ! ఈఅవినీతి డబ్బు నా కంటికి కనబడదే ? కాల్చి బూడిద చేయాలి  ఈ ధనం, ఈ కార్లు , ఈ బంగళాలు, ఈ నగలు, ఈ క్రెడిట్ కార్డులు  ఏవి వద్దు నాకు. నాకు ప్రేమ కావాలి, ఆ ప్రేమతో నా శరీర వాంఛ ని  మేల్కొలపాలి.  భూమిని  నిట్టనిలువుగా తాకే ఉదృతమైన జడివానలాంటి తాకిడితో   అతని శరీరాన్ని తాపి  తన
అణువణువుని ఉద్దీపనం చేయాలి లాంటి తలపులతో,మొహం తో   ఒక విధమైన  మైకం తో బ్రతికింది .  అలా  కోర్కెతో కాలిపోయేటప్పుడే  తను  ఎప్పుడో ఒకప్పుడు  . సిగ్గు విడిచి  భర్త దరి చేరినా    ఆతను మాత్రం భార్యకి చేరువ కాలేని
స్థితిలో మత్తులో మునిగిపొయేవాడు   ఆమె అణువణువులో అసంతృప్తి సెగలు డబ్బుతో పాటు వచ్చి చేరుతున్న అనేకానేక కొత్త పరిచయాలు. నిత్యం  ఏదో ఒక పార్టీకో ,ఫంక్షన్ కో వెళ్ళాల్సి రావడం,  ఉన్న అందానికి  ఎంతో  కొంత మెరుగులు దిద్దుకోవడానికి పార్లర్ కి అలవాటు పడటం, స్పా కి వెళ్లి శరీరంని అప్పగించి గంటలు గంటలు మసాజ్ లతో  కాలక్షేపం చేయడం, అందంగా అలంకరింప జేసుకుని నాజూకైన మునివేళ్ళతో అతి నాజూకుగా ఉండి పదే పదే  జారిపోయే పైటని పట్టుకుని గంటల తరబడి ఉండాల్సి రావడం. పైటని నాజ్జూగా   పట్టుకున్నట్లుకొన్ని పరిచయాలని  అలాగే  పట్టుకుని  తర్వాత వదిలేయడం,   అతి ఖరీదైనమనుషుల మధ్యలో అత్యంత నాటకీయంగా నవ్వులు పులుముకుని  మెలగడం విసుగ్గా తోచేది   అదే సమస్తం  అనుకుని బ్రతకడాన్ని  అలవాటు చేసుకోవడం కూడా కష్టమనిపించింది .

                          హఠాత్తుగా డబ్బు పుట్టుకొచ్చిందని  పుట్టుకలో లేని దర్పం,ఠీవి కూడా పుట్టుకొస్తాయని అనుకోవడం భ్రమ అని తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు ఆమెకి. భర్త గురించి తమ దాంపత్య జీవితం గురించి చూచాయగా తెలిసిన కొందరు జలగల్లా అంటుకోవాలని  చూసారు.  డబ్బున్న వాళ్ళ పట్ల  తనలో పెరిగిన ఉన్నవిముఖత వల్లనేమో వారికి చేరువ కాలేక పోయింది  కొన్ని అనుభవాల తర్వాత పంక్షన్లకి, పార్టీలకి దూరం అయి పోయింది. తనకి తానే  ఒంటరి తనం అనే శిక్ష
విధించుకుంది

                        అప్పుడప్పుడూ భర్త తో విపరీతంగా పోట్లాడేది.  ఆమె  పోట్లాడినప్పుడల్లా ఆమెని శిక్షించదానికన్నట్లుగా ఒక నెల రోజుల పాటు ఇంటి వైపు కూడా తొంగి చూసేవాడు కాదు  ఏ మలేషియా నో, సింగపూరో ఆడ స్టాపు నంతా వేసుకెళ్ళి   వారి
మధ్య ఉల్లాసంగా గడిపి వచ్చేవాడు   పెళ్ళయి రెండేళ్ళు అతనితో కాపురం చేసినా తన కడుపున ఒక బిడ్డైనా పుట్టలేదు. వాళ్ళని చూసుకుంటూ బ్రతికే దాన్ని అనుకునేది . తనకి “ధాన్యమాలి ” అని పేరెందుకు పెట్టారో కాని ఆ పేరు సార్ధకమయినట్లు ఉంది. ఈ ఒంటిస్తంబపు మేడలో ఒంటరిగా  జీవిస్తూ నిండు యవ్వనం మ్రగ్గిపోతూ సంతాన భాగ్యంకినోచుకొక విలపించే ధాన్యమాలి గుర్తుకువచ్చింది. తను ఆమెలా అలమటించాల్సిందేనా ? జీవితం ఇలా తగలబడాల్సిందేనా ?   తనలో ఎడతెరిపిలేని ఆలోచనలు మిసెస్ దశరథ్ కి ఏదో లోపం ఉందట,  పిల్లలు పుట్ట అవకాశం లేదని తెలిసాక అతని భార్య ఆ డిప్రెషన్  తో అతనిని అసలు పట్టించుకోదట అందుకే దశరధ్  అలా తిరుగుతూ ఉంటాడు అని మన హై  క్లాస్స్ లేడీస్ చెప్పుకుంటున్నారు  అవునా అది నిజమేనా ?  .అని  ధాన్యమాలితో సన్నిహితంగా ఉండే సృజన  అడిగినప్పుడు
దుఖం ఉవ్వెత్తున ముంచుకు  వచ్చింది. నేను గొడ్రాలిని కాదు కాదు . నా భర్త నపుంసకత్వమే అందుకు  కారణం అని దిగంతాలు వినబడేలా అరచి చెప్పాలనిపించేది.

                      అదే మాట అతనితో చెపితే వాళ్ళన్నది నిజమే కదా! నా బెడ్ ఫెర్పోర్మేన్స్ ఏమిటో నీకు తెలియనిదా !? నేనంటే   పడి  చచ్చిపోయే యంగ్ గాళ్స్ నడుగు,. నేను ఎలా సుఖ పెడతానో,సుఖ పడతానో చెపుతారు అని పచ్చిగా చెపితే తన లోని ఆడతనమే సిగ్గుపడింది. తన పై తనకే సందేహం వచ్చింది నాలో ఆడతనం లేదా!? నేను అతనికి ఏ మాత్రం సుఖాన్ని ఇవ్వలేకపోతుందా ? అని ఆలోచించడం ఎక్కువ చేసింది .

                          దొంగ తిరుగుళ్ళు తిరిగే ప్రతి మగవాడు భార్య  ఆడ తనం పై   నిందలు మోపేవాడే! తనని అర్ధం చేసుకోవడం లేదని కుంటి  సాకులు చెప్పేవాడే ! కోర్కెల వరద లో మునిగిపోయినప్పుడల్లా పుట్టలో పాముల్లా బయటికి వచ్చి జరజర ప్రాక్కుంటూ పోయి  ఎక్కడో ఒక చోట లుంగలు చుట్టుకుంటారు  వాళ్ళ కొవ్వేక్కిన ఒంటికి, కంటికి కనబడేది ఆడది అయితే చాలు అంతే ! అనుకుంది కసిగా

                          ఒకోసారి అసలు తను ఎందుకు అతనితో కలిసి ఉండాలి !? విడాకులు తీసుకుంటే జీవితమంతా తిని కూర్చునే అంత దనం లభిస్తుంది. తర్వాత తను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని అనుకునేది,  మళ్ళీ అంతలోనే .. ఛీ చీ.. పెళ్లి చేసుకోవడం అంత బుద్ధి  తక్కువ పని ఇంకొకటి లేదు. అవసరం అయితే సహజీవనం అయినా చెయ్యొచ్చు కాని  . ప్రతి చేతకాని వెదవ కి  భార్య అనగానే   ఎక్కడ లేని అధికారం, అర్ధం లేని అహంకారం  గుర్తుకు వస్తాయి  అవలీలగా వాటిని భార్య పై ప్రదర్శిస్తాడు. అనుకుంది .

                  మళ్ళీ అంతలోనే మరొక విధంగా ఆలోచనలు చేసేది.  అయినా నేను దశరథ్ కి విడాకులు ఇస్తే సంఘంలో  హోదా కోసమయినా ఇంకో పెళ్లి చేసుకుంటాడు, అతని డబ్బు ,హోదా చూసి ఎవరో ఒక అందగత్తె అతనికి దగ్గరవుతుంది అయినాక కదా అతనిలో అసినం లేదని తెలిసేది, అర్ధం అయ్యేది , మళ్ళీ ఇంకో ఆడదాన్ని    ఈ ఒంటి స్థంబపు మేడ లోకి   రానివ్వ కూడదు, ఆ యవ్వనాన్నీ మగతోడు   లేకుండా రగిలిపోనివ్వ కూడదు అనుకుంది. మళ్ళీ అంతలోనే ఇంకొకామె  వస్తే  మాత్రం తనలా మడికట్టుక్కు కూర్చుంటుందని నమ్మకం ఏమిటి ? మనసు ఉండాలే కాని అనేక మార్గాలు అనుకుంది ..ఇలాంటి  పిచ్చి పిచ్చి ఆలోచనల మధ్య గడిపే ఆమె  కాలక్షేపం కోసమో  లేక  తనని తానూ మర్చిపోవడం కోసమో  భర్త సూచించినట్లు హాస్పిటాలిటి మేనేజ్మెంట్ కోర్స్ లో జాయిన్ అయి ..ఓ  రెండేళ్ళు నేర్చుకోవడం లోనే శ్రద్ద చూపింది. ఆ రెండేళ్లలో ఒక కార్పోరేట్ ఆసుపత్రినే నెలకొల్పాడు దశరథ్. ఆ హస్పిటల్  ని మేనేజ్ చేయడం కోసమే తనని  ఆ కోర్స్ చదవమన్నాడని అర్ధం అయిపొయింది .

                      పనిలో పడి  తనలో రగిలే  అసంతృప్తి జ్వాలలు ఆరిపోతాయని  భావించాడేమో  కాని అక్కడే తనలో  పూర్తి మార్పు వస్తుందని ఊహించలేకపోయాడనుకుంది . రోజూ తను అందంగా తయారై హాస్పిటల్ కి వెళ్ళడం హాస్పిటల్ లో పని చేసే  పని వాళ్ళు దగ్గరనుండి డాక్టర్లు వరకూ తన అందాన్ని కళ్ళతోనే తాగేయాలన్నట్లు  చూడటంని  గమనించింది ఎవరికి ఎక్కువ  చనువు ఇవ్వకుండా తనకి ప్రపంచానికి మధ్య ఒక సరిహద్దు రేఖ  గీసుకుంది .

                          ఒక రోజు భర్త దశరధ్ ఫోన్ చేసి తమ చానల్ లో   యాంకర్ గా పని చేసే ఒక అమ్మాయి   హాస్పిటల్ కి వస్తుంది   ఎవరికీ అనుమానం  రాకుండా రహస్యంగా ఆమెకి  ట్రీట్మెంట్ ఇప్పించమని ఆమెతో  చెప్పాడు    శరీరంలో అంగుళం మాత్రం కూడా  పరుల కంట బడకుండా  బట్టలు చుట్టుకున్న ఆమె నేరుగా తను ఉన్న రూంలోకి  వచ్చింది. ప్రాబ్లమ్  ఏమిటి అని అడుగుతున్న ధాన్యమాలి  ముందు ఆమె భోరున ఏడ్చింది ఆమె కట్టుకున్నముసుగులు అన్నీ తొలగించి చూపింది   ఆమె
ఒంటి నిండా గాయాలు  గోళ్ళతో గ్రుచ్చినట్లు,పంటితో కొరికినట్లు, కొడవలి ముక్కుతో  భూమిని త్రవ్వినట్లు  రక్తం చిందిస్తున్న గాయాలు.    చూస్తున్న ఆమెకి   అరికాళ్ళ నుండి ఒణుకు పుట్టుకొచ్చింది.

                                 ఎవరి పాలబడి  ఇంతవరకు తెచ్చుకున్నావ్ అని ఆ అమ్మాయిని  కోప్పడి  ఆమెని ఎప్పుడైనా  చూసినా కూడా గుర్తుపట్టడానికి అవకాశం ఇవ్వకుండా నార్త్ నుండి వచ్చి పని చేస్తున్న డాక్టర్ తో ట్రీట్మెంట్ ఇప్పించింది   పైకి నాగరికంగా కనిపిస్తూ అనాగరికంగా దాడి చేసిన మానవ మృగం తన భర్తే అని అర్ధం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు   సంపాదన కోసం క్షణ క్షణం ప్రాకులాట,  నిత్యం  మద్యం లో మునిగి తేలుతూ 35 ఏళ్ళకే  డయాబెటిస్,బిపిని  డబ్బుతో సమంగా పెంచుకుపోయే అతనిలో   లైంగిక పటుత్వం కోల్పోయినంత వేగంగా  మనసులో మెదిలే వికృతమైన కోర్కెలు చావనందు వల్ల  నిత్యం ఎంతో మంది  అమ్మాయిల కాయాలపై ఈ గాయాలు మచ్చలుగా మిగిలిపోతూనే ఉంటాయని అర్ధమయింది.  భగవంతుడా ! ఆడదానిపై ఎందుకింత ఆరాచకం ! ఎందుకింత హింస? ఈ తల్లులు ఏ అవసరం కోసం  ఇలాంటి హింసని భరిస్తున్నారో తెలియదు కదా ! వాళ్ళకి ఆ అవసరాలు ఎందుకు కల్పిస్తావు తండ్రీ !   లోలోపల దుఖిస్తుంది ఆమె అప్పుడప్పుడు అతనికి కావాలని తను చేరువైన క్షణాలని గుర్తుకు తెచ్చుకుని భీతిల్లింది .  ఆనాటి నుండి అతనికి దూరంగా తన జాగ్రత్తలో తానూ ఉండసాగింది .

                               కాలం ఎవరి బాధలతోను,  ఎవరి అసహ్యాలతోను తనకి ప్రమేయం లేనట్టు కరిగిపోతూనే ఉంది ఆ కరిగే కాలంలో ఆమె  నైతికత అనే పదం కి  అర్ధం ని మార్చుకోవాల్సి వచ్చింది . భర్త పై కల్గిన అసహ్యంలో నుండి బయటపడి లోకాన్ని చూడటం మొదలెట్టింది 32 ఏళ్ళ వయసు. యువతి గా జీవితం అనుభవించక ముందే ప్రౌడ గామారడం ని మనసు అంగీకరించినట్లు శరీరం అంగీకరించ లేక పోతుంది మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి శరీరానికి మర్ధనలు అవసరమే అని ఒక స్పా సెంటర్ కి వెళ్ళింది .

                              “మేడం ! లేడీ స్టాఫ్ ఈ రోజు తగినంతమంది లేరు రేపు అప్పాయింట్ మెంట్ తీసుకుని వస్తారా ! లేదా ఉన్న మేల్  స్టాఫ్ తో  మసాజ్ చేయించుకుంటారా ? మీ ఇష్టం ” అన్నారు .

                               “వై నాట్ ” అంటూ లోపలి వెళ్ళిన ఆమె లోపల అలజడులని  కార్యరూపం లోకి
తెచ్చుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. మొదటి సారి స్పా సెంటర్ లో పనిచేసే పాతికేళ్ళ అందమైన యువకుడు,రెండవసారి మొబైల్ చాట్ లో పరిచయం అయిన ముప్పయ్యి ఏళ్ళ యువకుడు, మరి కొన్ని సార్లు తన క్రింద  పనిచేసే చురుకైన యువకుడు .. ఆమెలో కోర్కె   మొదలై నప్పుడల్లా నచ్చినవాడి కోసం వేట  ప్రారంభించేది అందుకు రక రకాల ఉపాయాలు కనిపెట్టేది మేల్ ప్రాస్టిట్యూట్స్ గురించి తెలుసుకుంది, సుఖించడానికి సులభ మార్గాలు ఎన్నుకునేది.  ఈ లోకంలో
డబ్బుతో అన్నీ కొనవచ్చు అన్న దశరధ్ మాటని నిజం చేసింది. నిజానికి డబ్బు అవసరం లేకుండానే ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోను సుఖించవచ్చు అని కూడా తెలుసుకుంది. సంప్రదాయ కుటుంబం లో పుట్టిన తనేనా ఇలా చేస్తుంది? అని ప్రశ్నించుకునేది. మంచి చేయడానికి పొటీ పడాలి కాని తప్పులు చేయడానికి పోటీ పడినట్లు తయారైన తనని తానూ విశ్లేషించుకుని తన భర్త ఎడబాటు వల్లనే తానూ ఇలా చేయాల్సి వచ్చిందని అనుకుని సంతృప్తి పడేది .

                                        హఠాత్తుగా దశరధ్ ని ఒక కార్ల షో రూం ప్రాంభించమని కోరింది అతను ఆమె అడిగిన పనిని మారు మాట్లాడకుండా  చేసాడాంటే అదొక్కటే ! నేను ఎందుకు ఆ కోరిక కోరానో తెలిస్తే గుండె ఆగి చస్తావు  ! అనుకుంది మనసులో నవ్వుకుంటూ ..  క్రొత్త మోడల్ కారు వచ్చిన ప్రతి సారి  క్రొత్త కారుని డ్రైవ్ చేయాలని ముచ్చట పడేది  ఒకరోజులోనే అలా  కారు నేర్చుకోవడం రెండో రోజు ట్రయల్ కి వెళ్ళడం చేసేది ఒకోసారి ఒంటరిగా లాంగ్ డ్రైవ్ కి వెళ్లాను అని చెప్పేది ఎవరికీ ఆచూకి తెలియనివ్వకుండా క్రొత్త క్రొత్త వ్యక్తులని వెదుక్కునేది . తనని గుర్తుపట్టకుండా డ్రెస్సింగ్  స్టైల్ మార్చేసుకునేది ,పేరు మార్చేసుకునేది , పోన్ నంబర్ మార్చేసుకునేది .అయితే ఆమె ఎప్పుడూ ఒక విషయంలో జాగ్రత్త తీసుకునేది   తను ఎంచుకున్న  వ్యక్తీ హెచ్ ఐ వి టెస్ట్ రిపోర్ట్  తీసుకుని వారికి తన ఫ్రెష్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ముందుకు నడిచేది  ఆమె కి తను చేస్తున్నది  ఏమాత్రం తప్పుగా తోచలేదు ఎక్కడా ఆత్మ వంచన లేదు. మనిషికి  అత్యంత సహజ మైన అవసరమైన పిజికల్ నీడ్ . ఆ అవసరాన్ని అణుచుకుని  లేని పవిత్రత ఆపాదించుకుని నటించుతూ బతకడం అవసరం లేదు అనుకుంది .

                                        ఒకోసారి ఏకాంతంలో తను చేసిన పనులకి నవ్వుకునేది తన  మనసుని ,యవ్వన్నాని బంధించి కోర్కెల కొలిమిలో మండమని నిర్దేశించడానికి దశరధ్ కి ఏమి అధికారం ఉంది అతను భర్తగా నా అవసరాలు ఎప్పుడైనా గుర్తించాడా !? అసలు గుర్తించడానికి ప్రయత్నించాడా ? యుగ యుగాలుగా స్త్రీని ఇంటిలో బందీ చేసి తానూ మాత్రం తన వాంచలని  యదేచ్చగా తీర్చుకుంటూనే ఉంటాడు, మరి శరీర యాతనతో బాధపడే స్త్ర్రీ మాత్రం ఊరుకుంటుందా !? పట్టపగలు కాకిని చూసి భయపడే స్త్రీ కూడా  ప్రియుని కోసం అర్ధరాత్రి అవలీలగా నదిని దాటి వెళుతుందట” అని చదివింది గుర్తుకు వచ్చి  “నిజం ” చెప్పారు అని పడి పడి నవ్వుకునేది. తనలాంటి ఆడ వారిని చూసయినా సమాజం స్త్రీల ఆలోచనల్లో
వస్తున్న మార్పుని గమనించి మగవారిని తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిస్తుందేమో ! లేకపోతే  రాళ్ళతో కొట్టి చంపండి అని వెంటబడుతుందేమో !

                                     ఈ హై  క్లాస్ సొసైటీ లో మార్పు కోసం, అవసరాల కోసం, సరదాల కోసం  కార్లు మార్చుకున్నట్లు లైఫ్ పార్టనర్ ని మార్చుకోవడం ప్యాషన్ అయిపోతే అది తప్పు కానప్పుడు నేను చేసింది యెంత మాత్రం తప్పు కాదు అని అనుకునేది. తనని తానూ సమర్ధించుకునేది . సంఘంలో ఏది ఎక్కువ చెలామణి అయితే అదే గొప్పగా భావించే సంస్కృతిలో దశరధ్  లాంటి మగవాడు ఏం  చేసినా చెల్లుబాటవుతుందనుకుంటాడు. మగవాళ్ళకి  మాత్రమే అది ఎల్లప్పుడూ చెల్లుబాటు కాదు స్త్రీ ఆలోచనలు లో కూడా మార్పు వస్తుంది ఆ మార్పు అనివార్యం అయినప్పుడు వారు మారకుండా ఎలా
ఉండగలరు అని ప్రశ్నించాలనుకునేది .

                      నేను చేసేదంతా భర్తకి తెలిస్తే!?  అన్న ప్రశ్న తలెత్తేది .  తెలిసి ఉండవచ్చుననే అనుమానం ఉంది  అయినా అతనికి ఏమి సమాధానం చెప్పాలో కూడా ఆమెకి స్పష్టంగా తెలుసు.  తనను తానూ సమర్ధించుకోవడానికి  ఒక బలమైన గోడని కట్టుకుని ఉంది ఆమె.

                             గతం ని గుర్తు చేసుకుంటూ…  ఏడేళ్ళ గా జరిగిన  పెళ్లి అనే నాటకంలో కొన్ని అంకాలు తను ఊహించని రీతిలో ముగిసి  పోయాయి  ఇక ఈ రోజు ఇది ఆఖరి అంకం కావచ్చు లేదా కాకపోవచ్చు మొగుడు అనే వాడిని బంతిలా ఆడుకునే అవకాశం నాకు దొరికింది కనుక అతనిని  వదలకూడదు అనుకుంది కక్షగా.   ఆడది తెగబడితే నైతికత అనే గుమ్మం దాటితే  ఎలా ఉంటుందో  అనేదానిని ఋజువు చేస్తూ … తను ఏం  చేసిందో, చేస్తుందో చెప్పి హై పిచ్ లో తన రివెంజ్ ఏమిటో వినిపించాలనుకుంది . అది తలచుకుంటూ  కారు నడుపుతూనే పడి  పడి నవ్వుకుంటూనే  ఉంది.  ఆ నవ్వులో  కళ్ళలో జల జల కారే కన్నీరు కలసిపోయింది .

ఇవన్నీ తెలియని దశరథ్  మాత్రం ఆమెకి  ఆ ఆవకాశం ఇవ్వకుండానే  రిపోర్ట్ల గురించి ముందే తెలుసుకుని   ..  తననే ప్రశ్నిస్తున్నట్లున్న ధాన్యమాలిని గుర్తు చేసుకుంటూ .మితిమీరిన వేగంతో కారు నడిపి కావాలని యాక్సిడెంట్ చేసుకుని  భయంగా  మరణాని కంటే  ముందే కళ్ళు మూసాడు.

జరిగిన విషయాలని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళ మధ్య   మెసేజ్ని మరొకమారు చదివింది. అందులో . “నా కంతా  తెలుసు,.కారణమూ నేనేనని తెలుసు, ఒక భర్తగా నీకు చాలా అన్యాయమే చేసాను హెచ్ ఐ వి పాసిటివ్ అని నాకు తెలుసు కనుకనే ఇన్నేళ్ళు నిన్ను దూరంగా ఉంచాను. కేవలం అది నీ పై ప్రేమ వల్లనే ! నిజం నీకు తెలిస్తే  ఎక్కడ అసహ్యించుకుంటావొనని నీకు తెలియనివ్వలేదు . రహస్యంగా నువ్వు పర పురుషులతో తిరగడం తెలుసు   మగాడిగా జరిగినవాటిని జీర్ణించుకుని బ్రతకడం చాలా కష్టం అని తెలుసు. నివురు కప్పిన నిప్పు లాంటి నిజాలని భరించ గల్గడం చాలా చాలా కష్టం కనుక  బలవంతపు మరణమే శరణం అని మరణాన్నిఆహ్వానిస్తున్నాను. సంస్క్రతి సంప్రదాయం పేరిట అణచిపెట్టబడిన ఆడవాళ్ళు , గదులలో మగ్గుతున్న ఆడవాళ్ళు మేలుకుని అవకాశాలని అందుకోవాలని, తెంపరితనం తో  ఆ అవకాశాలని దుర్వినియోగం చేసుకోవాలని చూస్తే, వాళ్ళ ప్రవర్తనని,  ప్రశ్నలని ,   పురుష ప్రపంచం భరించలేదు. తట్టుకోలేదు. చంపడం లేదా చావడం రెండింటిలో ఏదో ఒకటి జరిగి తీరుతుంది.ఆఖరికి ఏమి మిగలదు. అంతా సర్వనాశనం !  ఇకనైనా  నీకు స్వేచ్చాన్ని ప్రసాదించానని   అనుకుంటూ నేను  తప్పుకోవడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ మనసులో నాపై ప్రేమే ఉంటె నా కోసం రెండు కన్నీటి చుక్కలు చాలు,  ఇదే లాస్ట్ మెసేజ్. రియల్లీ సారీ  ధాన్యమాలి  .. సెలవ్ !

 – వనజ వనమాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

16 Responses to లాస్ట్ మెసేజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో