ఝాన్సీలో వారంలో ఒకరోజు సంత జరిగేది. చుట్టుప్రక్కల గ్రామాల వారు వారికి కావలసిన వస్తువులను కొనటానికి వచ్చేవారు. హల్వాయిపుర నుంచి మురళీమనోహర్ మందిరం దాకా జనంతో కిక్కిరిసిపోయేది. ఒకసారి ఆంగ్లేయ అధికారి ఏలీస్ బజార్ చూడటానికి వచ్చాడు. ఝల్కారీ కూడా తన స్నేహితురాలితో కలిసి బజార్కి వెళ్ళింది. అక్కడ మార్గంలో అందంగా ఉన్నటువంటి ఆమెను, ఆమె వీరత్వాన్ని, ఆమె దుస్తులను చూస్తూ ఒక్కనిమిషం ఏలిస్ నిలబడిపోయాడు. అతడు ఇటువంటి స్త్రీని అంతవరకూ చూడలేదు. ఆ సమయంలో ఝల్కారీబాయి అతని కళ్ళల్లోకి తొంగి చూసింది. ఒకర్ని మరొకరు చూసారు. ఝల్కారీ బాయి స్నేహితురాలితో అతను ఇలా అన్నాడు. మీరు ఇక్కడ్నుంచి త్వరగా వెళ్ళండి లేకపోతే నాకత్తికి పనిచెప్పాల్సి ఉంటుంది. తెల్లవాడైన తనవైపు ఆమె అలా చూడటం అతనికి నచ్చలేదు.
ఝల్కారీ పద – పోదాం ఈరోజు సంతకి కొన్ని కొత్త వస్తువులు వచ్చాయి అంటూ ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.
అప్పటికి దేశంలో ఆంగ్లేయులు యుద్ధం ప్రారంభించడం జరిగింది. దామోదర్ని దత్తత తీసుకున్న తర్వాత గంగాధరరావు చనిపోయిన సమాచారం నాటి భారతదేశ గవర్నర్ జనరల్ డల్హౌసీకి కలకత్తా చేరింది. సమాచారంతో పాటు ఏలీస్ ఇలా వ్రాసాడు. రాణీ లక్ష్మీబాయి ప్రజలమనిషి. ఝాన్సీని ఆంగ్లేయుల పాలనలో కలపటం మామూలు విషయం కాదు. ప్రతికూల పరిస్థితుల్లో యుద్ధం చేయటానికి కూడా ప్రజలు సిద్ధంగా వున్నారు అని వ్రాసాడు. సమాచారం దొరికిన వెంటనే రాజ్యం కోరలు చాచాలనుకొంది కానీ అయితే, పక్షవాతం వచ్చినట్లుగా ఎక్కడ ఉన్న అడుగు అక్కడనే ఉంచింది. డల్హౌసి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. చాలారోజుల వరకు ఆ ఆలోచన స్థిర రూపం దాల్చలేకపోయింది.
బ్రిటీషువారు బుందేల్ఖండ్ రాజకీయ ప్రతినిధి అయిన ”మేజర్ మాల్కమ్” ని కలకత్తాకి పిలిపించారు. అత్యవసర సమావేశంలో వారు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. శక్తి సామర్ధ్యాలన్నీ ఉపయోగించి ఝాన్సీ రాజ్యాన్ని ఆంగ్లేయ రాజ్యంలో కలుపుకోవాలన్నారు. 7 ఫిబ్రవరి 1854 న డల్హౌసి ఝాన్సీ రాజ్యం మీదకు దండెత్తాడు.
మాల్కమ్ వెళ్ళిన తర్వాత డల్హౌసి సైన్యాన్ని ఝాన్సీకి పంపించాడు. ఏలీస్ తగిన ఏర్పాట్లు చేసాడు. గవర్నర్ జనరల్ ఆజ్ఞానుసారం 07 మార్చి 1854 వ సంవత్సరంలో ఝాన్సీ ఆంగ్లేయుల పాలనలో కలుపబడింది. రాణికి స్వంత ఆస్తి, నగరంలోని భవనం సంవత్సరానికి 6 వేల రూపాయల గౌరవవేతనం ఇచ్చేట్లు నిర్ణయించటం జరిగింది. ఈ వార్త వినగానే ప్రజలు చాలా బాధపడ్డారు.
ఉన్నావ్ ద్వారానికి ఉత్తరాన ఒక పెద్ద కోట వుంది. ఆ కోటమీద ”అంజనీదేవి దేవాలయము ఉండేది. ఆమెపేరుతో ఆ కోటని అంజనీకోట అనేవారు. ఆ కోట 3 కొండలు కలిసిపోయే రైల్వేలైను దగ్గర అంతం అయ్యేది. క్రింద బాలాజీ మార్గం వుంది. అంజనీ దేవాలయ క్రింది భాగంలో మంచినీటి కాలువ ప్రవహిస్తుండేది. ఈ కాలువ లక్ష్మీ చెరువులో కలిసేది. మొదట్లో ఇది చాలా లోతుగా ఉండేది. తరువాత అది పూడిపోయింది. ఇందులో కేవలం వర్షపునీళ్ళు మాత్రమే ప్రవహిస్తూ ఉండేవి. అది బీడుభూమి. ఆ స్థలంలోనే పశువులను మేపటానికి జనం వస్తూ ఉండేవారు. భూమి తక్కువగా వుండటంతో ప్రజలు అడవిని నరికి తగలబెట్టారు. భూమిని శుభ్రంచేసి, పొలంగా మార్చారు. అయితే ఆ కాలువ పూర్వపు స్థితిని కోల్పోయి ఒక రేఖలాగా తయారైంది. ఇప్పటికి కూడా ఆ కాలువ అలాగే వుంది.
ఝల్కారీబాయి ప్రజలనోటి ద్వారా ఒక మాట వింది. అదేమంటే ఎక్కడనుంచో ఒక తోడేలు వచ్చి కాలువ దగ్గర ఉంటుంది. అది చిన్న, చిన్న మేకపిల్లలను, లేగదూడలను చంపి తింటుంది. దీంతో ప్రజలు బాధపడుతూ వున్నారు. ఒకరోజు దానిని చంపాలనే నిర్ణయంతో ఝల్కారీ బుల్లెట్ల సంచిని తగిలించుకొని, ఉన్నావ్ ద్వారం నుంచి బయలుదేరింది. ఆరోజు బాగా చలిగా ఉంది. రెండు రోజులక్రితం మంచు బాగా పడింది. నేలంతా చిత్తడి, చిత్తడిగా వుంది. ఇంకా ఆ తడి ఆరలేదు. గడ్డిమీద మంచు బిందువులు వజ్రాల్లాగా, మిణుకుమిణుకుమంటూ మెరుస్తూ ఉన్నాయి. ఆమె చలిలో వణుకుతూ వెళ్ళసాగింది. మట్టి అంటుకొని ఆమె కాళ్ళు కూడా బరువెక్క సాగాయి.
ఆ కాలువ దగ్గరికి వెళ్ళి ముందుగా ఆమె కాళ్ళు కడుక్కుంది. ఆ తర్వాత అంజనీ కోట చుట్టూ తిరిగి, మందిరంలో కూర్చుంది. కొంచెంసేపటి తర్వాత కొండ క్రిందికి దృష్టిని సారించింది. అక్కడి రమణీయమైన కొండను చూస్తూ వుంది. పొద్దు ఎక్కడంతోపాటు చలికొంచెం తగ్గసాగింది. అప్పుడు ఆమె శరీరంలో కదలిక రాసాగింది. అయితే కొంచెం దూరం జరిగి ఒక చెట్టు మీద తుపాకీ మొన వుంచి చెట్టు నీడలో నేల మీద కూర్చుంది. కొంచెంసేపటి తర్వాత ఝల్కారీ క్రిందికి చూసింది. అక్కడే తోడేలు ఉంది. ఝల్కారీ తుపాకీని గురిపెడుతూ వుంది. గురిపెడుతూ కొంచెం తడబడింది. ఇంతలో తోడేలు పారిపోయింది. తూటా గురితప్పి లేగదూడకి తగిలి ‘బా’ అనే శబ్దం వెలువడింది. ఝల్కారీ భయపడింది. ఆమె కొండ క్రిందకు దిగి కొంచెం దూరం నుండి చూసింది. కలవరపడిన మనస్సుతో ఆమె హృదయస్పందన పెరిగింది. ఆమెకి క్రింద ఏమీ కనిపించలేదు. మనస్సులో అది తోడేలా లేక లేగదూడా అని అనుకొంది. అయితే కొమ్ములు కనిపించలేదు. మనసులో ఓదార్పుగా అది తోడేలేకావచ్చు అనుకొంది మరలా లేగదూడా అనే ప్రశ్న కూడా ఆమె మనసును తొలవసాగింది. జరిగిన విషయం ఝల్కారీ ఇంటికి వచ్చి భర్తతో చెప్పింది.
పూరన్ :- నువ్వు చూశావా
ఝల్కారీ :- నేను దూరంగా చూశాను. హడావిడితో తడబడిపోయాను. ఇంకా ఎక్కడ చూడాలి.
పూరన్ :- అది ఒకవేళ ఆవుదూడే అయితే సమాజంలో అందరూ మనల్ని వేలెత్తి చూపుతారు.
ఝల్కారీ :- నాకు ఏమీ కనబడలేదు.
పూరన్ అప్పుడే ఇంటి నుంచి బయలుదేరి ఆ స్థలంలో వెతకటానికి వెళ్ళాడు. ఝల్కారీ తుపాకీ తూటా తగిలి ఒక బ్రాహ్మణుని ఆవుదూడ చనిపోయింది అని నగరంలో చర్చించుకోసాగారు. ఝల్కారీకి రాణిగారితో బాగా సాన్నిహిత్యం ఉండేది. ఝల్కారీ ప్రతిరోజూ వనంలో రాణిగారిని కలుస్తూ వుండేది. సంధ్యా సమయంలో తెల్లటి దుస్తులు ధరించి ఒక పళ్ళెంలో దీపం పెట్టుకొని, పూలు తీసుకొని ఆమె మందిరంలో పూజ చేయటానికి వెళుతూ ఉండేది. ఆమె మెడలో పూల మాల కూడా ధరించేది. అన్ని కులాల స్త్రీలు కూడా ఇలాంటి స్వతంత్రతని కలిగి ఉండేవారు. కానీ ఝల్కారీకున్న స్వతంత్రతలో ఒక ప్రత్యేకత వుంది. అది ఇతర అగ్రవర్ణస్తులకు నచ్చేదికాదు.
ఆ రోజు మందిరం దగ్గర ఆ ఝల్కారీ కనిపించకపోయేసరికి ఆమే పేద బ్రాహ్మణుడి ఆవుదూడని చంపింది అనే విషయం బలపడసాగింది. దాంతో అగ్ర కులస్తులు చాలాకోపంగా క్రూరంగా మాట్లాడసాగారు. ఝల్కారీబాయిని దేవాలయంలోకి, బావి దగ్గరకు రానివ్వద్దని కొందరు అనసాగారు. కొందరు ఆమెను నగరం నుండి బయటకు పంపాలి అనసాగారు. కొంతమంది అగ్రకులాల వారు ఈ నిజాన్ని దాచటం పాపం అని అనుకోసాగారు. వారికి తెలుసు ఆ ఆవుదూడ చనిపోలేదని. తుపాకీ తూటా తగిలి ఆవుదూడ కాలుకి గాయం అయింది. పూరన్కి వాస్తవం ఈ వ్యక్తుల ద్వారానే తెలిసింది. కానీ ఆవుదూడ పడిపోగానే అది చనిపోయింది, చనిపోయింది అని అందరూ అరవసాగారు.
అప్పటి వరకు కోరీ సమాజపు మనుష్యులకి ఝల్కారీ స్వతంత్రత మీద బాగా కోపం వుంది. పూరన్ని నీచుడిగా చూపించాలని కొంతమంది ఆలోచిస్తూ వున్నారు. దీంతో ఆలోచించకుండానే, కష్టపడకుండానే వారికి సులువైన అవకాశం దొరికింది. ‘మగన్గంధీ’ మరియు ‘శ్యామ్ చౌదరీ’ల ప్రోత్సాహంతో అతని జాతివారు పూరన్కి కుల బహిష్కార శిక్ష విధించాలని గురువారం రోజు పంచాయితీ పెట్టారు. ఆరోజు పూరన్ని గురువారం 10 గంటలకు ఉన్నావ్ ద్వారం బయట అరుగుమీదకు రావాలని ఆదేశించారు.
ఆరోజు పూరన్ ఇంట్లో అన్నం వండలేదు. ఉదయం నుంచి ఇంటి బయట ద్వారం వద్ద కూర్చొని వున్నాడు పూరన్. పూరన్ పంచాయితీకి వెళుతున్న జనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరో పూరన్ని పిలవటానికి వచ్చారు. భర్త పంచాయితీ దగ్గరికి వెళ్ళిన తరువాత ఝల్కారీ ఇంటి కప్పుపైకి ఎక్కి చూసింది. అక్కడ గ్రామంలోని ప్రజలు ప్రక్క గ్రామాల్లోని వారు ఉన్నారు. ఆమె ఆలోచనలో పడింది. ఎప్పుడూ నేను ఇతరుల మంచి గురించే ఆలోచిస్తాను. ఈరోజు మనుష్యులు నా గురించి మాట్లాడటానికి వచ్చారు. చిన్న కొమ్మ, పెద్ద చెట్టయికూర్చుంది. ఆమె వెనుకకు తిరిగి చాకలి కలువాని చూసింది. ఝల్కారీ కిందకు దిగుతూ కలువా ఎక్కడకి పోతున్నావు? అని అడిగింది.
బట్టలు తీసుకోవటానికి వస్తున్నాను అంటూ అతను వెళ్ళిపోయాడు. వెళుతూ, వెళుతూ ఆమెకి ఒక నాటి సంఘటనను గుర్తుచేసి మరీ వెళ్ళిపోయాడు. ఝల్కారీ ఇంటికి వచ్చి గడపమీద కూర్చొని ఆలోచిస్తూ వుండిపోయింది. కలువా రాణిగారి బట్టలు ఉతుకుతాడు. మొదట అతనికి చాలా గర్వం ఉండేది. సమాజంలో ఎవరిమాటా వినేవాడు కాదు. సమాజాన్ని లెక్కచేసేవాడు కాదు. ఒకరోజు అతని ఇంట్లో ఒకరు చనిపోయారు. చాకలివాళ్ళు అందరూ అతని ఇంటికి ఎవ్వరూ వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు. రాణిగారితో మరణ సమాచారాన్ని చెప్పించినా ఎవ్వరూ అతని ఇంటికి రాలేదు ఈ విషయాన్ని అతను రాణికి చెప్పాడు. రాణిగారు ఆ చాకలివాళ్ళని పిలిపించారు. చాకలి ఇంట్లో చావుకి ఎవ్వరూ ఎందుకు వెళ్ళలేదు? అని అందరిని రాణిగారు అడిగారు.
రాణిగారూ ఏమి చెప్పాలి! చాకలి కలువా ఎప్పుడూ మా ఇళ్ళకిరాలేదు. మేము అతని ఇంటికి ఎందుకు వెళ్ళాలి? అన్నారు. రాణిగారు చాకలి వాళ్ళకి సర్ది చెప్పి పంపించారు. చాకలి కలువాతో నీవు ఇలా చేయాల్సింది కాదు అని చెప్పారు.
ఝల్కారీ మనస్సులో అనుకున్నారు. కలువా ఎంత పెద్ద తప్పుచేసాడు అని. ఝల్కారీ తన మనస్సులో నేను ఎవరి పిలుపునీ స్వీకరించకుండా ఉండలేదు కదా. అయితే నా కులంవారు ఎందుకు నామీద అయిష్టంగా ఉన్నారు. నేను స్వతంత్రంగా ఉంటాను కదా అందుకేనేమో. నగరంలో వాతావరణం ప్రశాంతంగా లేదు. అందరూ ఆమెపై నిందలు వేస్తున్నారు. పూరన్కి వారిలో తమ మేలుకోరేవారు ఎవరూ కనిపించలేదు. ఇంతలో గ్రామపెద్ద ప్రజలందరినీ శాంతపరిచి పూరన్ని అడిగాడు. ఝల్కారీ తుపాకీ తూటా తగిలి ఆవుదూడ ఎట్లా చనిపోయింది అని.
పూరన్ :- మహారాజా ఆవుదూడ చనిపోలేదు కదా.
చౌదరిగారు కోపంగా ఊరి పెద్ద అబద్దం చెప్పాడా అన్నాడు.
పూరన్ :- తూటా దెబ్బ తగిలితే గాయం ఎక్కడ అన్నాడు.
‘బర్దీ’ అన్నాడు – తూటా తగులుతూనే ఆవుదూడ చనిపోయింది. నేను కళ్ళారా చూసాను.
బ్రాహ్మణుడు చెప్పాడు: ఆవుదూడ చనిపోయింది అని.
గ్రామ పెద్ద : ఆవుదూడని బైటకి తేకూడదు. అందుకే ఆవుదూడ శవం దాచిపెట్టబడింది. చనిపోయిన ఆవుదూడని ఎలా పంచాయితీలో హాజరుపరుస్తావు అన్నాడు. పూరన్కి నోటమాట రాలేదు.
– హిందీ:మోహన్ దాస్ నైమిశ్ రాయ్
– తెలుగు:జి.వి.రత్నాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~