నామిని నెంబర్ వన్ పుడింగి

ఒక రచయిత, తన జీవితాన్ని గురించి ఇంత ధైర్యంగా నిజాయితీగా నిర్లజ్జగా నిర్మొహమాటంగా నిర్మోహత్వంతో రాసిన పుస్తకం ఇదొక్కటే అయి ఉండచ్చు. బహుశా ఇతర భాషల్లో కూడా ఇన్ని జీవన  వైవిధ్యాలూ వైరుధ్యాలూ కలిగిన జీవిత చిత్ర ప్రదర్శన వెలువడిన దాఖలాలు లేవు. ఇందుకు నామిని సుబ్రహ్మణ్యం నాయుడిని అభినందించకుండా ఉండలేము.
అందుకే దీనిగురించి ఇలా ప్రత్యేకంగా మాట్లాడుకోవలసి వస్తోంది.
పుడింగి అంటే ఏమిటో నాకు తెలీదు కానీ నామిని నెంబర్ వన్ పుడింగి అని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను.
ఉదాహరణకి నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారికి తన చిత్తూరు జిల్లా మాండలికం తప్ప మరే భాషా నచ్చదు. కథనం ప్రామాణిక భాషలోనూ పాత్రల సంభాషణలు మాండలికంలోనూ వుండటం అస్సలు నచ్చదు. కేవలం తెలుగు భాషలోని ప్రామాణిక భాషా మాండలికాలని సంకరం చేస్తేనే సహించలేరు. (ఆయనకి  మాత్రమే కాదు, భాష పట్ల గౌరవం కలిగినవారెవరికీ కూడా ఇలాంటి భాషా సాంకర్యం నచ్చదు.) అంతటి భాషా నిబద్ధత కలిగిన నామిని వారు తన పుస్తకానికి పెట్టిన పేరులోనే తెలుగు భాషని ఇంగిలీషుతో సంకరం చెయ్యడాన్ని ఏమనాలి ? తన కుమారుడికి టాంసాయర్ అనే పేరు పెట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? దీన్ని చూస్తూంటే ఆయనకి బాగా ఇష్టమైన చిత్తూరు భాషలోని సాటువ గెవనం వస్తాంది, ‘ నీ ఉత్త మాటా నా ఇత్తడి రూకా ఒగిటేలే పోబ్బా’ అనేదే ఆ  మాట.
ఇలాంటి విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసి కూడా పుస్తకంగా తెచ్చే తెంపు కలిగిన వారిని పుడింగ్ అని కాక ఏమంటారు ?
నామిని ఏనాడూ సాహిత్యాన్ని సృష్టించలేదు. జీవితాన్ని  దర్శించారు  దాన్నే ప్రదర్శించారు  అని నమ్మేవాళ్ళలో నేనూ ఉన్నాను. ఎందుకంటే, అనుభవాలనీ అనుభూతులనీ అందంగా అనితర సాధ్యమైన రీతిలో అక్షరాల్లోకి అనువదించారాయన.
కానీ తన జీవితాన్ని గురించి ఏమాత్రం దాపరికం లేకుండా రాసుకున్నఈ పుస్తకంలో నామిని అక్కడక్కడా   తనని తాను కోల్పోవడాన్ని గమనించగలం. నామిని మాత్రమే కాదు ఏనారయినా సరే కొన్ని సమయ సందర్భాలలో తమని తాము కోల్పోకుండా వుండరు. అలా కోల్పోయినవాళ్ళు చాలామంది చాలా సందర్భాలలో ఆ విషయాన్ని ఒప్పుకోరు.
తమ గోడు వెళ్ళబోసుకునే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఇతరులమీద బురద చల్లే అధికారం బహుశా నామినికి మాత్రమే ఉండుంటుంది కాబోలు. పనిలో పనిగా అంజనం వేసి మొత్తం హైదరాబాదులోని ప్రతి ఆఫీసునీ సినిమాలాగో టీవీ సీరియల్లాగో చూసే అద్భుత శక్తి కూడా ఉండుంటుంది. లేకపోతే తను ఎక్కడో తిరుపతిలో కూర్చుని ఇక్కడ హైదరాబాదులో ఏ సంపాదకుడు ఎవరెవరి దగ్గర ఎంతెంత దొబ్బారనేది  అంత సాధికారికంగా ఎలా చెప్పగలరు ? ( దొబ్బారనే పదం నాది కాదు. వారిదే. )
తను తన భార్యని ఎంత దారుణమైన పదాలతో సంభావిస్తారో తెలుసుకోవడం ద్వారా చదువరులు  ఏం నేర్చుకోవాలని నామినివారు భావిస్తున్నారో ఆయనకే తెలియాలి.
‘ ఏనుగు పడింది ఏనుగే లేచింది ‘ అనేది ఇందులోని  ఒక ఉప శీర్షిక.
ఏనుగు నెత్తిమీద ఎవరూ చెత్త పోయ్యలేరు కాబట్టే దాని నెత్తిన అదే చెత్త చెదారం పోసుకోవడానికి వీలు కల్పించడానికే  ఆ దేవుడు దానికి తొండం పెట్టాడంటారు.
ఏనుక్కి తొండం ఇచ్చినట్టే నామినికి కలం ఇచ్చాడేమో అనే అనుమానం చదువరుల్లో కలిగితే అది వారి తప్పు కాదు.
ఇలాంటివి తప్ప మిగిలినవన్నీ  ఆయన వ్యక్తిగత వ్యవహారాలు కాబట్టీ మనం వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
పుస్తకం చివర్లో ఆయన చెప్పిన విషయాలు అపురూపమైన వ్యంగ్య వైభవంతో విలసిల్లాయి. కానీ వాటిని  చదివినప్పుడు కలిగిన  అనుభూతిని చివర్లో  ఇచ్చిన ఆయన బ్యాంక్ ఎక్కౌంటు నెంబరు సవాలు చేస్తుంది.
అయినా సరే, దీని ప్రత్యేకత దీనిదే.
తప్పుచెయ్యడం తప్పు. తెలిసో తెలియకో చేసిన తప్పుని, తప్పని గుర్తించక పోవడం ఇంకా తప్పు. ఆ తప్పుని తప్పని ఒప్పుకోకపోవడం మరీ పెద్ద తప్పు. ఇవన్నీ అర్ధమయిన తరవాత కూడా చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చెయ్యడం జరిగిందీ అంటే అది తప్పుగా మిగలక  ఒప్పుగా మారిపోయిందని అర్ధం.
అలా ఒప్పులుగా మారిపోయిన తప్పులు చెయ్యని మనిషి ఒకవేళ ఎవరయినా ఉన్నారని చెబితే దాన్ని మించిన అబద్ధం ఇంకొకటి ఉండదు.
ఇందులో అలాంటి అబద్ధాలు లేవు.
అవి కనపడక పోవడానికి కారణం మనం కప్పుకున్న సంస్కారపు ముసుగు ఆయన వేసుకోకపోవడమే. అలా వేసుకోక పోవడం వల్లే ఇలా విమర్శించే అవకాశం కలిగింది.
కాస్త లోతుగా ఆలోచిస్తే, ఆవేశం ఆవేదన ఈ రెండింటికీ విచక్షణా జ్ఞానం ఉండదని అర్ధమవుతుంది. ఆ రెండింటినీ జయించగలిగేది ఆలోచన మాత్రమే. కానీ ఆవేశ కావేషాలూ ఆవేదనాలూ ఆక్రందనలూ అసంకల్పిత ప్రతీకార చర్యలవంటివి. ఇవి కలిగినంత వేగంగా ఆలోచన రగలదు.
నిజమే,
జీవిత వాస్తవిక చిత్రాలు ఇలాగే ఎటువంటి ముసుగులూ లేకుండా ఉత్త బిత్తల గానే వుంటాయి.
వాటికి బట్టలు కుట్టగల దర్జీలకి కావలసిన కొత్త కొలతలని ఇవ్వగలడీ పుడింగి.
అయితే కొలతలు తీసుకోవడానికి కావలసిన కొలమానాలని తెలుగు సాహిత్యకారులు కనిపెట్టవలసి వుంది.
ఇందులో ఒక సందర్భంలో ‘ దీన్ని కూడా చింపేసి ఉంటే ఎంత బాగుండు ?’  అంటారాయన.
ఆ వాక్యాన్ని  చదివిన వెంటనే మనకీ అదే మంచిపనేమో అనిపిస్తుంది.
కానీ, చదవడం పూర్తి చేసి మళ్ళీ మన దైనందిన కార్య కలాపాలలో పడిపోయి యధాలాపంగా జీవించేసున్నప్పుడు మనకి ఎదురుపడే ఎన్నో సందర్భాలు ఈ పుడింగి మాటల్ని గుర్తు చేస్తాయి.
అప్పుడుగానీ..,
ఆయన దీన్ని సగంలోనే చింపి పారేసి వుంటే మనం ఏం కోల్పోయి ఉండే వాళ్ళమో మనకి తెలిసి రాదు.

– రాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలు, , , , , Permalink

25 Responses to నామిని నెంబర్ వన్ పుడింగి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో