తెలుగులో 20వ శతాబ్ది తొలి ఐదు దశాబ్దాల స్త్రీల కవిత్వం (1900-1950) – 4

సంస్కరణోద్యమ కవిత్వం:

                 స్త్రీ విద్య, బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, సహగమనం, హరిజన సమస్య, వేశ్యాసమస్య మద్యపాన సమస్య మొదలైనవి సంస్కరణోద్యమానికి  సంఙబంధించిన సమస్యలు. స్త్రీల అభివృద్ధికి సంబంధించిన హక్కులు, చట్టాలు మొదలైనవి కూడా ఇందులో భాగం, స్త్రీలు కవిత్వం వ్రాయటం సంస్కరణోద్యమ ఫలితంగా విద్యను అందిపుచ్చుకొనటం వల్లనే సాధ్యమైంది. కవిత్వం ద్వారా సామాజిక సంభాషణలోకి దిగిన స్త్రీలు సమాజ పురోగతికి అవసరమైన సంస్కరణ అంశాలను కేంద్రంగా చేసుకొని కవిత్వం వ్రాయటం  అత్యంత సహజంగా, అనివార్యంగా  జరిగింది.

            దేవులపల్లి సత్యవతమ్మ స్త్రీలను ఉత్తేజపరుస్తూ అబలత్వం మాని సబలగా చైతన్యం పొంది ధైర్యంగా మసలు కొమ్మని ప్రభోధిస్తూ వ్రాసిన కవిత ప్రబోధం. అప్పలనరసమ్మ ‘శిథిలంపు జీవనం’ అనే కవిత వ్రాసింది.

పుట్టి పెరిగి సుఖమ్మునెఱుగక
కాలమంతయు గడుపుచుంటివి
అడవిలోపల పూసి పెరిగిన 
మల్లెపూవు వలెన్‌. . . . . . . .
బ్రతికినన్ని దినాలు రగులుచు
వెలుగు చుండెడిని” –    అన్న కవితా  భాగంలో పుట్టి పెరిగి, సుఖమనేది  లేకుండా , సంప్రదాయాలు, కట్టబాట్లు పేరుతో స్త్రీలు ఎన్నో అవస్థలను అనుభవించారని, అడవిలో పూచిన మల్లెపూవులా స్త్రీల జీవితాలు ఎందుకు కాకుండా పోయాయని వేదనపడింది. ఎవరైతే గృహమందు ఆర్యధర్మాలు, సనాతన సంప్రదాయాలు, చదువులు, సచ్చరిత్రలు, సాధుగోష్టులను నిర్వహిస్తారో ఆమె ”గృహలక్ష్మి’ అని కాంచనపల్లి కనకాంబ పేర్కొంది.  జంతువులు, చెట్లు, ఇతర ప్రాణులు తమ జాతి గుణాన్ని మార్యుకోవని కేవలం మానవ జాతిమాత్రమే, పరజాతిని అనుసరిస్తారని అది విషంతో  సమానమని, అధర్మమని, స్వజాతిగుణాన్ని మానకూడదని కాంచనపల్లి కనకమ్మ వ్రాసిన ”స్వాతంత్య్రం” కవిత సూచిస్తుంది. నేడు నాగరికత పేరుతో ప్రజలు తిండి, కట్టు, బొట్టు, మార్చి వేశారని ‘నవనాగరికం” కవితలో తెలిపింది  తూతికం కమలాంబ. ఆడవాళ్ళ గొప్పతనాన్ని తెలుపుతూ వేదవల్లి తాయారమ్మ వ్రాసిన కవిత గృహలక్ష్మి (1931)
పతికెల్ల పనులందు పచరించునట్టి నె
లత లేని వాని యాలయము లయము
నాధుని కనుసన్న లాధారముగఁబోవు
వనితా రహితుని జీవనము వనము
సర్వయశంబు గడించు విద్యగల్గిన మాన
వతి లేని వాని భవమ్ము వమ్ము
కాంతుని శ్రమదీర్చి సంతోషమొనగూర్చు
తరుణీ రహితుని గోత్రము త్రమ్ము
గాన గృహలక్ష్మిలేని ముక్కుడులకెంత
కలిమి గల్గిననది యెల్ల కఱువుగాదె
భవనమెంతటి శృంగార భరితమైన
దివ్వె లేకున్న నది వన్నె దేరనట్లు ‘   అని  గృహిణీ ప్రాధాన్యతను స్థాపించింది.  గృహధర్మాలకు మూలమైన  గుణవతి అయిన భార్య లభించకపోతే పురుషుని జీవితం వ్యర్థమవుతుందని సూచించిందీ కవిత. పురుషుని పొట్టఆకలిని తల్లి గృహిస్తుందని, భార్య సంపాదన గ్రహిస్తుందని లోకంలోవున్న  నింద మాసిపోవాలని ఆశిస్తూ అంబటి లక్ష్మీనాంచారమ్మ వ్రాసిన కవిత ‘సతీహితం’.
             స్త్రీల జ్ఞానాభివృధ్దికి సంబంధించిన అంశాలలో విద్య, వివాహం, స్త్రీల జీవిత సమస్యలు, స్త్రీలకు ఉపకరించిన తోడ్పడిన అంశాల గుర్తింపు, స్త్రీల గొప్పతనం వస్తువుగా వచ్చిన కవితలు అనేకం వున్నాయి.
‘వేద పురాణశాస్త్రములు వేరై పోయిన భారతీయ సం
పాదన దేవతార్చనయు భక్తియు నీతియు నార్షధర్మముల్‌
ఏ దరిఁజేరనీయ కిటులింపుగఁ గాచిన తల్లినీవు ని
న్నాదర భావమున్‌ గనట అబ్బురమా లలనా శిరోమణి”  అంటూ  భారతీయ సంస్కృతీ పరిరక్షణలో స్త్రీ నిర్వహిస్తున్న గురుతర భాద్యతను ప్రశంసించింది అయ్యగారి రాఘవమ్మ ‘ భారత నారి’ పద్యాలలో. 
 సాంఘిక దురాచారాలలో ఒకటైన అస్ప ృశ్యాతా సమస్యను కూడా స్త్రీలు గుర్తించారు. హరిజనోద్యమ చైతన్యంతో కవిత్వం వ్రాశారు. కులమత బేధాలతో, సనాతన సంప్రదాయం పేరుతో ఆచరించే మూఢాచారాలతో నిండిన సమాజం సంస్కారమొందాలని కోరుతూ డి.యస్‌. రాజేశ్వరమ్మ ‘విశ్వనాథ’ కవిత వ్రాసింది.  హరిజన సమస్యను వస్తువుగా చేసుకొని చర్లనాగరాజకుమారి ‘ హరిజనఘోష ‘ కవిత వ్రాసింది. పరచూరి భువనేశ్వరిదేవి (1933) తెలుగు బిడ్డ కవితను వ్రాసింది. దీనిలో పదకొండు పద్యాలున్నాయి
కడుపునిండార  త్రాగంగ గంజిలేదు
కట్టుకొనుటకు చింపిరి బట్టలేదు
నిద్రవచ్చుచో జానెడు నేలలేదు
దీన హరిజన స్థితి ఇది తెలుగు బిడ్డ”
ఈ విధమైన పద్యాలలో హరిజనులు అంటరానివారిగా అనుభవిస్తున్న దీన స్థితిని వివరిస్తూ వారి దారిద్య్ర స్థితికి వేదన పడుతూ వారిని ఆదరించి అభివృద్ధికి పాటుపడాలని తెలియజేసింది.
 
                స్త్రీలలో చైతన్యం కలిగిస్తూ వారి సాహిత్య విజ్ఞానాన్ని పెంపొందిస్తూ  తెలుగు భాష సేవకు పాటుపడుతున్న గృహలక్ష్మిని ఎంతగా ఆదరిస్తున్నారో ప్రశంశిస్తూ గృహలక్ష్మి పత్రికను ఆశీర్వదిస్తూ ”దేశిరాజు  భారతీదేవి, సామినేని హనుమాయమ్మ, గుంటూరు విశాలక్ష్మి, ము. వసుమతి మహాలక్ష్మి మొదలైన వాళ్ళు కవిత్వం వ్రాశారు.
సీ అలర కేసరి యింట అల్లారుబిడ్డవై తెనుగు తల్లి ప్రేమ తీపెరిగి 
ప్రత్యాంధ్ర గృహలక్ష్మి ప్రతిభ జాటెడు వట్టి విజయపత్రిక వీవు వెలికి బ్రాకి 
తనకు భాషా ప్రౌఢతను జూపువారికి అపరంజి  కంకణాలమరదొడగి 
సరస కళాభ్యాసనాసక్తి జూపెడి వేళ లలనామణుల కాశలంటజేసి.
గీ ఆదిశక్తిని ముమ్మూర్తులాంధ్ర భాషాసిరికి, విద్యకు సౌభాగ్యశీలములకు
ననుచు చాటితి వాశీస్సులమ్మ నీకు రమ్య గృహలక్ష్మి సౌభాగ్యరాజ్యలక్ష్మి – వంటి పద్యాలు ఆకోవలోవి.
శ్రీమతి చిల్కపాటి సీతాంబ, గంటి కృష్ణవేణమ్మ  గృహలక్ష్మి పత్రికా సంపాదకులైన కేసరి మహాశయులను కీర్తిస్తూ వ్రాసిన పద్యాలు ఏడు వున్నాయి. 
‘వనితా లోకోన్నతికై అనయము కృషి సల్పి ధన్యులై యలరెడిన
య్యనఘులు శ్రీ కేసరికిన్‌ మన మలర నొనర్తునే  నమస్సులు భక్తిన్‌ అంటూ స్త్రీల మనోభావాలను వెలిబుచ్చుతూ వనితలకు చైతన్యం కలిగిస్తూ దినదిన ప్రవర్థమానమై వెలుగొందుతున్న గృహలక్ష్మిని కీర్తించటం ఈ పద్యాలలో కనిపిస్తుంది. తెలుగు వనితల మనస్సులో చైతన్యం కలిగించి  వారిని విద్యావంతులను చేయుటకు కంకణం కట్టుకొన్న పత్రిక గృహలక్ష్మి అని తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ కీర్తించింది.  ఆంధ్ర స్త్రీ పాలిట కల్పతరువై, అమృత భాండమై వెలుగొందుచున్న గృహలక్ష్మి పత్రికను చోడవరపు రంగనాయకమ్మ స్తుతించింది. గృహలక్ష్మి పత్రిక సంఘదురాచార మార్గాలను మాన్పించి సన్మార్గాలను గురించి వివరించిందని స్వాతంత్య్రమార్గానికి ధర్మమార్గాలను చూపెట్టిందని స్త్రీ విద్యాభివృద్ధికై తోడ్పడిందని గిడుగు లక్ష్మికాంతమ్మ  తెలిపింది అదేవిధంగా స్త్రీ జనోద్ధరణకై స్థాపించబడిన ” ఆంధ్రమహిళ”  మహిళల జాగృతికి, ఉన్నతికి మంచి మార్గం చూపుతూ వర్థిల్లాలని చుండూరి రమాదేవి ‘ఆశీస్సు”  అనే  కవిత వ్రాసింది. 
జాతీయోద్యమ కవిత్వం:
               1906లో వంగదేశ విభజనతో  ఒక రూపానికి వచ్చిన జాతియోద్యమం1919 తరువాత గాంథీ నాయకత్వంలోకి  వచ్చింది. 1930నాటికి గాంథీపిలుపునందుకొని జాతీయోద్యమంలోకి స్త్రీలు విస్తృతంగా వచ్చారు. జాతీయోద్యమం ఆనాటి స్త్రీలుకు ఒక ఉత్తేజకర ప్రేరణ. తమ శక్తులను వ్యక్తీకరించుకొనటానికి వేదిక ఆయింది. ఆ క్రమంలో స్త్రీలు జాతీయోద్యమం వస్తువుగా వ్రాసిన కవిత్వం పరిశీలించిదగింది.
                       న్యాయపతి వెంకట విజయలక్ష్మి, వోలేటి నిత్యకళ్యాణమ్మ, చావలిబంగారమ్మ, కల్పాలపార్వతిదేవి, వెలవోలు వసంతాదేవి మొదలైన వాళ్ళు జాతీయోద్యమ కవిత్వం వ్రాశారు. ఆంధ్రదేశపూర్వవైభవాన్ని, చారిత్రక వక్తుల గొప్పదనాన్ని ప్రశంసిస్తూ కవిత్వం వ్రాసిన కవయిత్రులు పాణకాకనకమ్మ, ద్రోణంరాజు లక్ష్ష్మీబాయమ్మ, స్థానాపతి రుక్మిణమ్మ, హనుమత్‌ శేషమ్మ మొదలైన వాళ్ళు  పొణకాకనకమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ వ్రాసిన కవిత ”ఆంధ్రతేజం’ (1950) ఇందులో ఐదు పద్యాలున్నాయి. రాజరాజనరేంద్రుని సామ్రాజ్యవైభవం, కాకతీయుల కళావైభవం, కృష్ణదేవరాయల సాహిత్యవైభవంతో ప్రసిద్ధి చెందిన ఆంధ్రదేశం ఎంతో గొప్పదని వర్ణించబడింది. స్థానాపతి రుక్మిణమ్మ వ్రాసిన కవిత”తుక్కాపంచకం’ శ్రీకృష్ణదేవరాయల దేవేరులలో ‘తుక్కాంబ’ ను రాజు త్యజించగా ఆమె బాధతో వియోగ భరితంగా  ఐదుశ్లోకాలు వ్రాసి పంపగా రాయలు వాటిని చదివి ప్రేమతో ఆమెను స్వీకరించిన అంశానికి సంబంధించింది. 
                  ‘సందేశం’ కవితను హనుమత్‌ శేషమ్మ(1950) వ్రాసింది. జయ చంద్రుని కూతురైన సంయుక్త తండ్రికి విరోధియైన పృథ్వీరాజును వరించింది. అందుకు కోపించి జయచంద్రుడు మహమ్మద్‌ ఘోరీసాయముతో పృథ్వీరాజును ప్రతిఘటించుటకు పూనుకొనగా యుద్ధము మానుకొని సంధి చేసుకోమని కూతురు తండ్రికి వర్తమానం పంపటమే ఇందలి సారాంశం. కన్నబిడ్డపై కోపం మాని ఆల్లునిపై యుద్ధం మానుకోమని, అతను గొప్ప ధైర్యసాహాసాలు కలవాడని, విదేశీయుడైన ఘోరీ సహాయంతో హైందవుడైన పృథ్వీరాజును ఎదిరించుట అన్యాయమని, అతనిని ఎదిరిస్తే చరిత్రలో దేశద్రోహం చేసిన వానిగా నీపేరు నిలిచిపోతుందని సంయుక్త తండ్రికి సందేశం పంపుతుంది. ప్రభువు శత్రువు చేతిలో చిక్కినాడన్న వార్తవిన్న రాణిసంయుక్తశత్రువులను సంహరించిందని పరచూరి అన్నపూర్ణదేవి ‘వీరసంయుక్త’ లో వర్ణించింది. ఈ చారిత్రక ప్రశంస అంతా జాతీయాభిమానాన్ని పెంచి పోషించాటానికే వలసపాలన పట్ల వ్యతిరేకతను కలిగించటానికే. 
                        గాంథీ మహాత్ముని నాయకత్వంలో సత్యాగ్రహం చేపట్టి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని మాతృదేశకీర్తి ప్రతిష్టలను పెంచుటకు కృషిసల్పిన వీర వనితలను ప్రశంసిస్తూ   నీలంరాజు సుబ్బాయమ్మ                                  ‘నారీ సత్యాగ్రహం’ కవిత వ్రాసింది (1930-31)
సత్యాగ్రహ ప్రభాసక్తిచే సర్వంబు
త్యజించి రణభూమిఁ దరసినారు
గాంథీమహాత్ముని ఘనదృష్టి పధమున
వెలలేని మణులై  వెలసినారు
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . 
ధరణి మీ జన్మలెంత సార్థకములయ్యె
ఆమల గుణులారా! భారతరమణులార!
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న స్త్రీలను, గాంధీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ దేశీరాజు భారతీదేవి 1931లో వ్రాసిన కవిత్వం ”దీవెనలోసుగుమమ్మ”
” సుమకూర్చినారుగా శాంతిసైన్యంబులన్‌
స్వాతంత్య్ర మొనగూర్చు సమరమునకు
భూన భోంతరముల పూర్ణమాశంఖముల్‌
పూరించినారుగా థీరులగుచు
శిరముల దాల్చిరి పరమేశునాజ్ఞానా
గాంథీ సవాజ్ఞల గారవమున
ప్రకటించినారుగా పికెటింగులూరూర
పరవస్త్రముల బహిష్కరణ జరుప
తాము శాసనోల్లంఘనోద్యమము బూని
భారతీయులు లోక విభ్రాంతి గొలిపి
వారికి జయంబు నింక చేకూరనట్లు
దీవెనె లొసగువమ్మా! ఓ దేశమాత” అని స్వాతంత్య్ర సమరానికై నడుంబిగించిన భారతవీరులకు జయముకలిగేల దీవించమని భరతమాతను స్తుతించింది భారతీదేవి.  దాస్యజీవనం నుండి విముక్తి పొందటానికి మేలుకొమ్మని ఉద్బోధ చేస్తూ లలిత కుమారి ‘మేలుకొలుపు’ కవిత 1930లో వ్రాసింది. భారత దేశం స్వాతంత్రం పొందిన తరువాత ధర్మవిధ పాలనతో జాతి దోషాలను చక్కదిద్దే పరిపాలన అందించే ”నూతన రాజ్యాంగచట్టం” అమలు జరుగాలని ఆశిస్తూ వ్రాసింది దేశిరాజు భారతీదేవి  దొప్పలపూడి అనసూయ ”విషాదవీచి(1950) కవితలో 18 పద్యాలున్నాయి. మహాత్మాగాంధీ హత్యకు గురియైన సందర్భంలో వ్రాసిన కవిత్వం ఇది. జాతికి వెలుగు చూపించిన జాతిపితని, ప్రేమమూర్తి అయిన ఆ మహాత్ముని గుండెను ప్రేల్చుటకు చేతులేలా వచ్చాయని, పేల్చిన తుపాకీ గుండు ప్రేమకు సాక్షియైన ఆయన గుండెను చీల్చుకొని పోయిందని, భర్త హత్యతో గుండెపగలక ముందుగానే అమ్మ కస్తూరిబాయి ఈ లోకాన్ని  విడిచిపోయిందని, గాంథీ మరణవార్త విన్న ప్రజానీకం కుప్పకూలిపోయిందనీ ఈ కవితలో వర్ణించిందామె.
ఎవ్వడవోయి నీహృదయమెంతటి కర్కశమోయి బాపుజీ
నివ్విధి హత్యజేయ మనసేటికి గల్గినదోయి ఇంక నీ 
వెవ్విధమైన మేలు ప్రజకీర్పడ జేయుదువోయి ఎన్నడే
నెవ్వరి కెట్టి హానియును నెంచి యెరుంగని సాధుమూర్తియే
దేశదేశాల చింతింపజేసినట్టి ప్రాణవిభున్‌ హత్యకున్‌ గుండె పగులకుండ
ముందుగా స్వర్గ ధామము నందుజేర జనిననీవెంతటి యదృష్టశాంత
భూమిని వైధవ్య భారమ్ము పొందకుండ శాశ్వతమ్ముగా హృదయేశు సరసజేరి
ఇంక కానుచుందవమ్మ నీయెల్లచోట్ల  సుమయంతంబగు పసుపు కుంకుమల పూడి
అమ్మకస్తూరిబాయి!  నాడస్తమించి  ఆత్మపతి ఆశ్రుతర్పణమందినావు
 
నేడు  భరతోర్విత గోడుగోడుమంచు  మూర్ఛలో మనుగు దుస్తరముప్పు తప్పె
మహాత్ముడు పేదలకు పెన్నిధియై, సత్య అహింసలే ఆయుధాలుగా కలిగి దేశ దాస్యాన్ని బాపాడని, అంటరాని తనాన్ని రూపుమాపి  మానవసేవకు పూనుకొన్న  మహాత్మునికి అంజలి  ఘటిస్తూ డియస్‌ రాజేశ్వరీ పట్నాయక్‌ వ్రాసిన ” బాపూజీకి భాష్పాంజలి” ఏడు పద్యాల మాలిక. 
 పేదసాదలకు పెన్నిధి  వీవె  దేశదాస్యమును బాపితివే 
సత్యహింసల పధగాముడవై  యమునకు నడచితివా? మహినిను గన లేమా!
సత్యాగ్రహమను సమరమొనర్చీ 
సత్యహింసా వ్రతమును నేర్పి సత్యాన్వేషణ సఫలత జూపి 
ధన్యుడవైతివిగా . . . . . . . . . . మము విడనాడితివా!   
బాల బాలికలు జోతలుసేయా 
భారతనారులు  హారతులీయా
బాపూరుధిరమె భారతసంతతి
ప్రగతిని జూపునుగా. . . .ప్రభయై వెలియునుగా” –  అంటుందామె తన కవిత్వంలో
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న స్త్రీలను ప్రశంసిస్తూ వ్రాసిన కవితలలో వోలేటి నిత్య కళ్యాణమ్మ వ్రాసిన ‘ సరోజిని’ ఒకటి 
శాంతియుద్దపు రంగమందున 
పంతమూనుచు నమ్మహాత్ముని
కుడి భుజమై వెలసి యుంటివి
పడతివయ్యు! సరోజినీ!
‘దండి’నా  లవణంపు సత్యా
గ్రహమందున నీవు చూపిన
పట్టుదల కల యోరిమికి జూ
పరీలు మ్రాన్పడిరి
శాంతి రణభూతలములో
నీస్థైర్యగుణమును గానబరచుచు
చాన లబలలుగారటంచును
జాటినావు సరోజినీ! అని భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఒక కవయిత్రిగా వెలుగొందిన సరోజినీ నాయుడి సేవలను ప్రశంసించింది. మీరాబాయి (స్లేడుకన్య) అనే మరొక కవితలో నీ వొక ఆంగ్లదేశ రమణీమణివైన ఉదారబుద్ధి హిం
దూపరమాతృకాప్రజ కనూనముదంబెద నుప్పతిల్ల స్వే
చ్ఛావిభవంబు కూర్పు నిజశక్తికి సర్వము ధారవోయఁ జు
మ్మివు మహాత్మునొద్ద కరుదెంచితివో జననీ! శుభః ఘ్రణీ అని ఆంగ్లదేశకన్య భారత స్వాతంత్య్రాన్ని కాంక్షించి, గాంధీ శిష్యురాలైనందుకు ప్రశంసించింది.
భరతమాతను ప్రశంసిస్తూ గడచిన చరిత్రను గుర్తుచేస్తూ, వర్తమానాన్ని తెలియజేస్తూ ఆచంట సత్యవతమ్మ 1933లో వ్రాసిన కవిత ‘భరతమాత’
షోడశరాజులు షడ్చక్రవర్తులు శివాజి మొదలగు
శూరతనయులు బొబ్బిలి వీరులు పూర్ణచంద్రురస
పుత్రసింహములు భువినీ సుతులని పూజింపబడిరి
అట్టి సంతతి వారము మాకా ఆర్యులరక్తము నాళనాత
ముల అణగియున్నదిక పొంగుచుండెను అమ్మ  దా
స్యమిక అంతమొందును
వైనతేయుని వలెనే గాంథి వదిలించును నీదాస్యబం
ధములు వనట నొందకమ్మ వందనమమ్మా! వరదారుణి
యో తల్లి భారతీ! అని స్వాతంత్య్రం రాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచింది.
 
               జన్మభూమిని, కన్నతల్లిని స్మరించని మగువ శవంతో సమానమని, దేశభక్తిని, మాతృభక్తిని చాటుతూ యమ్‌. అనసూయ 1933లో దేశభక్తి కవిత వ్రాసింది. కనుపర్తి వరలక్ష్మమ్మ  వ్రాసిన కవిత ‘భరతమాతృ అభివందన’
అసువులపై తీపి యావంత లేకుండ ఎలిమియై యురికంబమెక్కి యెక్కి
కఠిన శిక్షల త్రీవ కష్టాల కెదనోర్చి చెరసావాసంబు చేసి చేసి 
కొరడాల లాటీల క్రూరత మోదించు దయలేని సీతకు తాళితాళి
ఆస్తిపాస్తుల నూడ్చి యనదల జేసెడి నిష్ఠురవృత్తిని నిలిచి నిలిచి
మాతృదాస్య విచ్ఛేదైక మానసమున నీదు బిడ్డలు సలిపిననిండు కృషికి
      ఫలితమొదంగ గంటిపో భరతమాత పూర్ణస్వాతంత్య్రమును నింపు పొందకతన  అంటూ  ఎంతో మంది దేశభక్తులు ఎన్నో కష్టాలు పడి  తమ అసువులు బాసి సంపాదించిన స్వాతంత్య్రభారతం సకల జనుల పూజల నందుకొని వర్థిల్లాలని వ్రాసింది.
 
అభ్యుదయ కవిత్వం:
శ్రామిక వర్గాన్ని గురించిన కవిత్వం, ఆర్థిక సమానతలను బోధించే కవిత్వం ఈ విభాగంలోకి వస్తాయి, పరచూరి భువనేశ్వరి దేవి కర్షకా, కృషీవలా, పిలుపు, అనే కవితలను వ్రాసింది.
కర్షకుడు నిరంతరం శ్రమజీవి అతనిని బాధపడవద్దని అతని గొప్పతనాన్ని గూర్చి తెలుపుతూ వ్రాసిన కవిత కర్షకా!
నిరుపేదనని కంట నీరు పెట్టకుమోయి!
ఘనరత్నగర్భ నిన్గన్న తల్లి
కక్షుత్సిపాసలనెంచి క్షోభ పడకు మోయి!
ఘనుఁడు జీవనుఁడు నీ కన్న వాఁడు
నిస్పహాయుఁడనంచు’ నీరసింపకుమోయి’
జోడుగిత్తలు నీదు తోడు నీడ
తెలివి హీనుఁడనని దిగులు సెందకుమోయి!
నాగెటి కఱ్ఱు నీసాగుఁవాడు
చంద్రసూర్యులు నీవెట్టి చాకిరీలు
నిఖిలలోకాలు నీలోన నిలిచి యుండు
బరమపిత కంట మోద బాష్పంబ వీవు
మధుర జీవన! కర్షకా! వగచేదేల అంటుంది.
కృషీవలా! అనే మరో కవితలో
 
మేఘమాలికలలో  మె ఱుఁగులేఁదళ్కుతోఁ దొలుతగాఁజిఱున తొలకరించే
పోతుటీఁగలలోని పుటుక తేనియతోడ మరువుగా  తొలిపల్కులురిమి కురిసె
ఫణిఫణావళులలో మిణుకురామణితోడ దీటుగా దివ్య జ్యోతిస్సుగా
కాళరాత్రులలోని బాలెందులేఖతో హాయిగా నార్థ్రత్వ మావహింప
      మండుకడుపులు చల్లార్చఁ బండుపంట బైౖలు పొలములు నీపెంపగ జెరిఁగినట్టి
    స్వేచ్ఛయను నారు గొని రాఁగ వెడలు మోయి-విశ్వలీలా కృషీవలా వెఱఁగుమాలి అని వ్రాసింది.  దేశ స్వాతంత్య్ర ఆకాంక్ష కూడా ఇందులో  గర్థితం, స్వేచ్ఛఅనేనారు పెట్టమని  కోరటం దాన్నే సూచిస్తుంది.
 
వర్షాలు లేక పంటలు పండక కరువు వచ్చి కడుపు నింపుకొనుటకు కూలినాలి చేస్తే వచ్చే డబ్బు సరిపోక ఒక పేదరాలు- భర్తసహాయం లేక తన పిల్లల  ఆకలిబాధను ఎలా తీర్చాలోనని వేదన జెందుతూ  వున్న స్థితిని కనుపర్తి వరలక్ష్మమ్మ పేదరాలు (1928) కవితలో  చిత్రించింది. 
 
పొలపు పాటున్న పుణ్యదినాలయందు కాయమో కంకియో చేతికందుచుండె
ముద్దుబిడ్డల కవి యీయ మరియుచుండ్రి!యిపుడు లేదాయే నాభాగ్యమేమిసేతు
పైరు తల్లి విడిచి పలుగు రాళ్ళను గొట్టు! కర్మమొదలినపుడె కలిగెలేమి
వాన చినుకు రాలి వసుధ రంజిల్లక! బాయునెట్టు పెదవారికక్షుధ ” అని వ్రాసింది వ్యవసాయం జీవనానికి మూలమని సూచించింది.
 
మలమూత్రాలను శుభ్రపరుస్తూ  ప్రజలను కాపాడే త్యాగమూర్తి అయిన ”పాకీవాడి”ని ప్రశంసిస్తూ వెంకటరత్నమ్మ  వ్రాసిన కవిత ‘ పాకీవాడు’
 
నెయ్యుడా!నీవు తాకరాని నరుఁడంచు
శుచి యేఱుంగని వాడవంచు జనవితతి
పల్కహేతువేమొకొ? ప్రతిపదమునందు
శుద్ధినిను వెంబడింప, మా సుఖముగోరి
బుడమి నీవు రక్షింతువు మురికి నుండి
రమ్ము మిత్రమా! రమ్మునీ ప్రళయహర్తి!
మనుజునకు గల్గు దుర్యశోమల పదార్థ
మంతము వహించుచున్‌ మానవాళి సేవ
సలుపు ధైర్య సంపద మా కొసంగుమయ్య
                 ఆర్థిక అసమానతలను గుర్తించి  అవిపోవటానికి సోషలిస్టు విప్లవాన్ని గురించి చెప్పటం లక్ష్యంగా  1942లో  వట్టికొండ విశాలాక్ష్మి కవిత్వం వ్రాసింది.  కవిత్వాన్ని ఒక సైద్ధాంతిక భావనాబలంతో సంపూర్ణంగా సమాజపరం చేయటం ద్వారా, ప్రజాపక్షపాత వైఖరిని తీసుకొనటం ద్వారా విశాలాక్ష్మి స్త్రీల కవిత్వ దిశను మార్చింది. 
 
                 ఈమె రచించిన ‘అభ్యుదయ గీతాలు’ సంపుటిలో నవకవీ, కోయిల, వెలుగునీడలు, నిశ్చయం, స్వాగతం, అనునయం, అనుభూతి, భృంగమా, ఆవేదన, నవ్వువచ్చింది, అసూయ, ప్రణయభిక్ష,                     స్వప్న సందర్శనం, ప్రబోధము అనే 14 ఖండికలున్నాయి
 
                           నవకవి అనే కవితాఖండికలో స్త్రీల సౌందర్యాన్ని వర్ణించే కవిత్వం,  ప్రేమ కవిత్వం, విరహకవిత్వం వ్రాయడం కాక వీరవనితల చరిత్రను రచించి స్త్రీజాతిని మేల్కొల్పమనీ, ఆకలితో అలమటించే ప్రజల కష్టాలు ఆవిష్కరించే కవితలను వ్రాయమనీ,  భావకవిత్వం మాని స్వాతంత్య్ర ఉద్యమ ఉత్సాహాన్ని రగిలించే గీతాలు రచించి కొత్త సారస్వతాన్ని సృజించమని బోధ చేస్తుంది కవయిత్రి.  కోట్లకొద్దీ సంపద ఒక చోట కుప్పపడగా కూలీ జనులు పగలు రేయనక కష్టపడుతుంటే జాతిమత బేధాలచే  ప్రజాజీవితం  ఆశాంతితో నిండి వుంటే ప్రేమగీతాలు రచించాల్సిన అవసరంలేదు అంటుంది.  సర్వజనుల సమత్వాన్ని ఆశిస్తూ  విప్లవగీతాన్ని వినిపించమని కోయిల కవితలో కోయిలకు నివేదన చేసింది కవయిత్రి.
             భారతస్త్రీలు బానిసత్వపు బ్రతుకు బ్రతుకుతున్నారని,  ప్రజల అజ్ఞానాంధకారాన్ని తొలగించే ప్రయత్నంలో ఎన్నో అవాంతరాలుంటాయని అయినా సరే
 
సామ్యవాద విభాత కాంతులు
జగతి దౌర్జన్యాంధకారము
పారద్రోలెడు వరకు నిద్దుర
పట్టునే నాకు” అని సోషలిస్టు సమాజ నిర్మాణం పట్ల తన నిశ్చయ బుద్ధిని ఎరుకపరిసించింది.
                   స్త్రీలు చదువుకొని జ్ఞానవంతులు కావటాన్ని సహించని సంఘం పరిస్థితుల గురించి ‘అసూయ’ కవితను వ్రాసింది. విద్యావిషయక వివక్ష, కవిత్వం పురుషుల రంగంగావున్న స్థితి అన్నీ విశాలాక్షి కవితా  వస్తువులైనాయి. స్త్రీలు చైతన్య వంతులై నూతన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించింది.  
 
                       ఏడు భాగాలుగా వ్రాసిన ‘ప్రబోధము’ కవితలోని మొదటి భాగంలో ఝాన్సిలక్ష్మీ చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని స్వరాజ్య పోరాటానికి సిద్ధం కమ్మని భారతీయ వనితకు ఉద్బోధ చేసింది.. రెండవ భాగంలో ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్‌ శత్రువులను జయించి ఫాసిస్టులను అంతము చేయడానికై 
ఆవేశంతో యుద్ధరంగానికి రమ్మంటూ పురికొల్పాలని, మూడవ భాగంలో స్వాతంత్య్రపోరాటంలో భాగస్వామ్యంతో  స్త్రీలు స్వేచ్ఛను, విజ్ఞానాన్ని సాధించుకోవాలని, స్వాతంత్ర మెంత ముఖ్యమో స్త్రీలకు స్వేచ్ఛా అంతే ముఖ్యమన్న సంగతిని పురుషలోకానికి తెలియపరచాలని అన్నది.  రాబోయే స్వాతంత్య్రాన్ని  ఊహించిన కవయిత్రి కమ్యూనిజాన్ని ఈ దేశానికి ఆశాజ్యోతిగా భావన చేస్తూ 
 
సుత్తీ కొడవలి సుందరముగనూ
అందే యిమిడీ అగుపడుచుండగ
స్వాతంత్రము తన జన్మ హక్కెయని
దిక్కుదిక్కులకు తెలుపుచునున్నది”    – –  జాతీయ జెండాను సంభావించి సమున్నతంగా ఎగరవేసింది. నాలుగవ భాగంలో. 
 
                     ఐదో భాగంలో హిందూ ముస్లింల సమైక్యతను కాంక్షించింది. భర్తదుష్టుడైనా పతి సేవే పరమ భాగ్యమనే వ్రాతలెన్నో వ్రాసి భారతీయ స్త్రీలను అజ్ఞానంలో పడవేసారని, శత్రుసంహారానికై కత్తి పట్టి ప్రజల కండగా నిలిచిన రష్యా స్త్రీలు ఫాసిజాన్ని సర్వ నాశనం చేయడానికి ఉద్యుక్తులై వున్న  ఈ సమయంలో మనదేశంలో ప్రవేశించిన ఫాసిజాన్ని ఓడించడానికి, దాస్యవృత్తి తొలగించుకోవడానికి స్త్రీలు పురుషులు మేల్కొనాలని పిలుపునిచ్చింది ఈ కవితలో.
 
                           సంఘసంస్కరణ, జాతీయోద్యమ, అభ్యుదయోద్యమాల సంబంధంలోకి వచ్చి ఆ ఉద్యమ ఆశయాలతో ఆచరణలతో ప్రభావితమౌతూ, స్త్రీలు తమను తాము ఉద్దరించుకొనాలని ఆరాట పడటం,  అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ అధికారాలనుండి విముక్తిని ఆశించటం 1900 – 1950 మధ్య కాలపు స్త్రీల కవిత్వంలో కనబడే జీవవంతమైన శక్తి. 

– కాత్యాయనీ విద్మహే
                                                                                      – డా|| జి. కిషన్‌ ప్రసాద్‌

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో