ఆ’మే’ డే ! (సంపాదకీయం)

సుమారుగా నూట ఇరవైఏడు సంవత్సరాల క్రితం చికాగోలో కార్మిక హక్కుల కోసం దోపిడీ దారులకి వ్యతిరేకంగా శ్రామికులు పోరాడిన రోజున ప్రారంభమైన చైతన్యం , ప్రపంచ కార్మికుల గుండెల్లో చైతన్యాన్ని నింపుతూనే  ఉంది .కార్మిక సమస్యలు , వాదాలు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం  అయి పోయాయేమో అనిపిస్తాయి. అన్ని దేశాలలోను . అన్ని జాతులలోను కార్మిక వర్గంలో అట్టడుగు స్థాయి ప్రజలే . అయితే కొన్ని కొన్ని సమూహాల్లో స్త్రీ , పురుషుల తేడా లేకుండా తరతరాలుగా కార్మికులుగా మలచబడుతున్నారు . వీరికి ఆర్ధిక  స్వాతంత్యమూ , వ్యక్తి స్వాతంత్ర్యము , సామాజిక భద్రత కుడా అందని స్థాయి లో బ్రతుకులు వెళ్లదీస్తున్నారు .

ఆదిమ యుగాల నుంచి స్త్రీ కుటుంబ ఆధిపత్యానికి గురి అవుతూనే ఉంది . అధిపత్య కులాల స్త్రీలు తమ కుటుంబ పురుషులకు మాత్రమే లొంగి ఉంటే , దళిత , బహుజన మహిళలు స్థాయి భేదాల ప్రకారం బయట సమాజం చేతిలో కుడా అణచబడుతూనే ఉన్నారు . క్రమంగా కుటుంబ పోషణ కోసం సమాజ నిర్మాణ బాధ్యతల్లో పాలు పంచుకుని , ఆదాయ వనరుల్ని వెతుక్కోవలిసిన వసరం ఏర్పడింది . ఆ దేశం , ఈ దేశం అని లేకుండా ఏ దేశం లో నైనా కార్మిక స్త్రీల స్థితి గతులు అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నాయి . వ్యాపార సంస్థల్లో పై స్థాయి కార్మికులుగా ఉన్నా వారికి లభించే రాయితీలు , వేతనాలు చట్టాలు క్రింది స్థాయి కార్మికులకి లభించటం లేదు . కాయ కష్టం ఎక్కువ గా ఉండే పనులు అంటే రాళ్ళు కొట్టడం , రోడ్లు వెయ్యటం , వంతనలు కట్టడం , బావులు తవ్వడం , గృహనిర్మాణంలో ఇటుకలు మోయడం , పొలాలలో నాట్లు వేయడం, కోతలు కోయడం వంటి పనుల్ని ఎక్కువ శాతం దళితులు , దళిత మహిళలు చేస్తుంటారు . గిరిజన మహిళా కార్మికులైతే తునికాకు సేకరణ ,జీడి పిక్కలు కోయడం , తేనె , కుంకుళ్ళు వంటివి సేకరించి అమ్మడం చేస్తుంటారు . ఈ పనులు చేసే స్త్రీలకి ప్రభుత్వ కార్మికులకి లభించే ఎటువంటి రాయితీలు లభించవు . వారితో సమానంగా వీరు కుడా సమాజ నిర్మాణపు పనుల్లో పాల్గొని దేశాన్ని ప్రగతి పథం లోకి నడవడానికి పరోక్ష కారణం అవుతున్న వారే . పైగా కొన్ని కొన్ని పనుల్లో ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు పురుషులతో సమానంగా పని చేసే స్త్రీ లకి వేతనాలలో మాత్రం పక్ష పాతం చూపిస్తూనే ఉన్నారు . మహిళా సాధికారత సమాన హక్కులు అంటూ ఎన్ని రూపాల్లో గొంతు చించుకుంటూ అరిచినా ఈ అసమానత్వం మాత్రం సమాజం నుంచి పోవటం లేదు . ప్రభుత్వమైనా,ప్రైవేటు గుత్తేదారులు స్త్రీలకు , పురుషులకు సమా వేతనాలు ఇచ్చే చట్టాన్ని ప్రభుత్వం రూపొందించి ఖచ్చితంగా ఆమలు చేసేలాగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది .

చట్టం అంటే గుర్తుకు వచ్చింది . డిల్లీ నగరంలో నిర్భయ కేసు వెలుగులోకి వచ్చాక ఆ నగర మంతటికీ . తరవాత అన్ని రాష్ట్రాలకి ‘మాస్ హిస్టారియా’లాగా మైనర్ బాలికలపై అత్యాచారాలు ఒక వెల్లువలా కొనసాగుతున్నాయి . మన చట్టం , న్యాయ వ్యవస్థ  నేరస్తులని పట్టుకున్నా ఆచితూచి అడుగేస్తూ ఎట్ట కేలకు నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చింది . మన చట్టాల్లోని లొసుగులు సామాన్య నేరస్తునికి కూడా అంతు లేనంత ధైర్యాన్ని ఇస్తాయి. ఎంత పెద్ద దేశ ద్రోహం చేసినా ఏళ్ళ తరబడి కారాగారాలలో పెట్టి సర్వ సుఖాల్ని అందిస్తారు . కేసు కొల్కి వచ్చేసరికి జీవితాలే వెల్లమారి పోతాయి . అందుకే ఎన్ని చట్టాలు వచ్చిన ‘నిర్భయం ‘గా పసి మొగ్గల్ని కదంబ హస్తాలతో నలిపి పడేస్తున్నారు .

24_ndperiscopeWFS__1153619eఆడపిల్లలు ఇంత అమానుషంగా పురిటిలోనే ప్రాణాలు కోల్పోవడం లేదా మృగాళ్ళ దాష్టీకానికి గురవటం జరుగుతూ ఉంటే అక్కడక్కడ మానవత్వం కూ డా పరిమళిస్తూనే ఉంటుంది . మానవత్వం వికసించడానికి ధనము , విద్య  లేదంటే పేరు కోసం పాకులాడే తాపత్రయం ఉండక్కర్లేద్దని ‘నిర్మల ‘రుజువు చేసింది . ఘజీయా బాద్ కు చెందిన నిర్మల పుట్టెడు పేదరికంలో ఉంటూ నలురుగు పిల్లల తల్లైనా, అప్పుడే పుట్టి పారేయబడ్డ ఆడ బిడ్డ ని ఇంటికి తీసుకెళ్ళింది . ముగ్గురు మగ పిల్లలు , మరొక ఆడ పిల్ల ఉన్నా కూడా వారితో పాటు ఈ పాపని పెంచుకోవడానికే నిర్ణయించుకుంది . భర్త , అత్త కుటుంబ సభ్యులు ఎంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తను ఆ పాపని పెంచడానికే నిశ్చయించుకుని భర్త కుటుంబం లోంచే   వేరైయింది .
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మల సాహసానికి , మాతృ హృదయాన్ని గుర్తుంచి “హిమ్మత్ హై జీనే కి “(జీవన ధైర్యం ) అవార్డుని అందించారు . స్త్రీ మరొక స్త్రీ ని రక్షించుకోవడానికి , తమ జీవితాల్నే ఫణంగా పెట్టుకోవటం , త్యాగాలు చేసుకువడమే తప్ప ప్రభుత్వం నుంచి , పురుషుల నుంచి కూడా పూర్తి  స్థాయి సహకారం లభిస్తే చిన్నారుల జీవితానికి భరోసా ఏర్పడుతుంది .

HY-18WRITER_GN9_HY_1431888eసుమారు 185 పుస్తకాలు రాసి ,స్త్రీల జీవితాల్ని తమ రచనలలో చిత్రించిన ప్రముఖ రచయిత శ్రీ రావూరి భరద్వాజ కి జ్ఞాన్ పీఠ పురస్కారం లభించడం యావద్భారత దేశానికి సంతోషకరమైన విషయం .స్త్రీల పక్షాన వారి సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని రచనల్ని చేసిన భరద్వాజకి విహంగ మహిళా సాహిత్య పత్రిక తరుపున అభినందనలు తెలియజేస్తున్నాను .

                                                                                  – పుట్ల హేమలత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయం, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to ఆ’మే’ డే ! (సంపాదకీయం)