ఈ నెల నర్తనకేళీలో ‘నాట్య పారిజాత ‘స్వాతి సోమనాథ్ తో ‘అరసి’ ముఖాముఖి ………
*మీ స్వస్థలం ?
మాది శ్రీకాకుళం లోని దూసి అగ్రహారం . కాని నేను పుట్టింది బీహార్ , పెరిగింది ,చదివింది అంతా హైదరాబాద్ లోనే .
*మీ కుటుంబం గురించి చెప్పండి ?
మా నాన్న పేరు సోమనాథ్ ,రైల్వే ఉద్యోగి , అమ్మ పేరు లక్ష్మి గృహిణి . అన్నయ్య ,నేను .
*మీకు నృత్యం పై ఆసక్తి ఏ విధంగా కలిగింది ?
మొదటి ప్రపంచ సభలు జరిగినప్పుడు మా నాన్న నన్ను లాల్ బహదూర్ స్టేడియంలో జరుగుతున్న యామిని కృష్ణమూర్తి నృత్య ప్రదర్శనకి తీసుకు వెళ్ళారు . ఆ రోజు ఆమె చేసిన నృత్యం నన్ను బాగా ఆకట్టుకుంది . పళ్ళెం మీద నిలబడి చేస్తుంటే ఆశ్చర్యపోయాను . నేను అలా చేయాలి అనే కోరిక నాకు నృత్యం ఆపి ఆసక్తిని కలిగించింది .
*మీరు అగ్రహారం లోనుంచి వచ్చిన కుటుంబంలో పుట్టిన వారు , నృత్యం అనగానే ఇంట్లో ఏమన్నారు ?
ఇక్కడా నేను ఒక విషయం చెప్పాలి . మా నాన్న గారికి కళలు , సాహిత్యం , సంగీతం అంటే అభిరుచి ఎక్కువ . రైల్వే ఉద్యోగం చేస్తున్న తరచుగా ఈ సాహిత్య , నృత్య కార్యక్రమాలకి హాజరవుతుండేవారు.పైగా మా తాతయ్య గారు తూర్పు భాగవతం రాసారు . ఆ విధంగా ఆ ఇంట్లో కళలు పట్ల అభిరుచి ఉంది .
*మీ తొలి గురువు ఎవరు ?
తొలి గురువు భాగవతుల రామ కోటయ్య గారు . ఆయన వద్ద రెండు సంవత్సరాలు నేర్చుకున్నాను . ఆయన అప్పటికే పెద్ద వారు కావడం తో మరణించారు .
*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు ఎక్కడ జరిగింది ?
y.m.c స్కూల్ వార్షికోత్సవంలో తరంగం చేసాము . దానిలో నేను శ్రీ కృష్ణుడు గా చేసాను . నేను చిన్నప్పుడు యామిని కృష్ణ మూర్తి గాఋ చేసిన తరంగం చేసే నాట్యం పై ఆసక్తి కలిగిందో అదే నా తొలి ప్రదర్శన అయ్యింది .
*తరవాత ఎవరి వద్ద నృత్యాన్ని అభ్యసించారు ?
సుమతి ఘోషల్ గారి వద్ద మొదలు పెట్టాను . ఆమె వద్ద కూచిపూడి , భరత నాట్యం రెండింటిని నేర్చుకున్నాను . నాలుగు సంవత్సరాలు నేర్చుకున్నాను .
*సుమతి ఘోషల్ వద్ద నేర్చుకున్నాక ప్రదర్శన ఎప్పుడు ఇచ్చారు ?
నా పదవ తరగతి పరిక్షలు అయ్యాక కూచిపూడి లో అరంగేట్రం చేయించారు . అప్పట్లో అరంగేట్రం కి 30 వేలు ఖర్చయ్యాయి .
*ఆ తరవాత మీరు బయటకి వచ్చి విడిగా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు ? కారణం ?
అవునండి . మా నాన్న గారు చనిపోవడంతో ఆర్ధికంగా ఇబ్బందుల్లో కురుకుపోయాము . ఆ సమయంలో నేను నృత్యం నేర్చుకోవడానికి కుదరని పని . ఆ సమయంలో నేను చదువుకున్న చదువుతో ట్యూషన్ చెప్పడం , నేర్చుకున్న విద్యతో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాను .
*మీరు సుమతి గారి వద్దనుండి బయటకి వచ్చే సమయానికి ఎంత వరకు నేర్చుకున్నారు ?
నిజం చెప్పాలి అంటే అప్పటికి నేను నేర్చుకున్నవి పది ఐటమ్స్ మాత్రమే , మా గురువు గారు చెప్పింది తక్కువైన , ఆమె దగ్గ దాదాపు వంద మంది విద్యార్ధులు ఉండేవారు . నా సీనియర్స్ చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నదే ఎక్కువ .
మీ గువురు గారి నుండి బయటకి వచ్చే అమయానికి 10. 11 ఐటమ్స్ మాత్రమే తెలుసు అంటున్నారు , తరవాత ఎలా
సుమతి గారి వద్ద పాటలు పాడిన బొచ్చు సరోజిని గారు ఆమె కు తెలిసిన పాటలు , కీర్తనలు , జావళీలు అన్నిటికి జాతులతో సహా రాసి ఇచ్చారు .అప్పటికి నాకు లయ జ్ఞానం ఉంది కాని తాళ జ్ఞానం లేదు . ప్రదర్శన చేయాడానికి ఒక పది ఐటమ్స్ చూసుకుని , వాటిని సాధన చేసి వెళ్లి చేసేదానిని .
*మీరు దేశ విదేశాలలో చాలా ప్రదర్శనలు ఇచ్చారు ? విదేశాలలో ప్రదర్శన లలో మీకు గుర్తున్న సంఘటన చెప్పండి ?
ఒకసారి బోజాంబే లో ప్రదర్శన ఇచ్చాము . m.s సుబ్బలక్ష్మి పాడిన ‘అధరం మధురం వదనం ‘ పాటకు ఆ రోజు నృత్యం చేసాను . ఆ ప్రదర్శనకు సాంస్కృతిక మంత్రి వచ్చారు . ఆయన నా ప్రదర్శన అంతా చూసి స్వాతి బ్యూటిఫుల్ ,కృష్ణ బ్యూటిఫుల్ , ఇండియా బ్యూటిఫుల్ అని అభినందించారు . భాష తెలియని వ్యక్తి అంత గొప్పగా మాట్లాడటం మరిచిపోలేని సంఘటన .
*మరి స్వదేశంలో మీకు లభించిన ప్రశంసలలో మరిచిపోలేనిది ?
ఆకెళ్ళ సత్యనారాయణ గారు ఒకసారి నా నాట్యం చూసి విశ్వనాధ సత్యనారాయణ వేయిపడగలలోని దేవదాసి తో పోల్చారు . అది ఎప్పటికి మరిచిపోలేనిది .
*మీ నృత్య శిక్షణ సంస్థ పేరు ? ఎప్పటి నుండి ప్రారంభించారు ?
నేను దాదాపుగా 25 సంవత్సరాల నుండి శిక్షణ ఇస్తున్నాను . నృత్య భారతి అనే పేరుతో సంస్థ ను స్థాపించి 17 సంవత్సరాలు అవుతుంది .
*మీరిచ్చే శిక్షణ పద్ధతి ఎలా ఉంటుంది ?
మా గురువు సుమతి గారి పద్దతిలోనే శిక్షణ ఇస్తాను . ఒత్తిడి లేకుండా ఆటలాగ నేర్పిస్తాను . రామాయణ ,భారత , భాగవత కథలు చెబుతూ శిక్షణ ప్రారంభిస్తాను .
*మీరు ఎంత వరకు చదువుకున్నారు ?
చదువు అంతా హైదరాబాద్ లోనే సాగింది . ఏం .ఫిల్ ఇంగ్లీష్ లిటరేచర్ లో చేసాను . కూచిపూడిలో ఏం. ఏ చేసాను .
*మీరు అప్పటికే చాలా ప్రదర్శనలు ఇచ్చారు ? ఆ తరవాత కూచిపూడిలో ఏం . ఏ చేయాడానికి కారణం ?
నిజమే, కాని ఏ ప్రదర్శనలకు వెళ్ళిన అంటే దూరదర్శన్ లాంటి వాటికి సర్టిఫికేట్ అడగటం వలన చేయవలసి వచ్చింది . ఆ రెండు సంవత్సరాల కోర్సులో వేదాంతం రాధేశ్యాం గారితో పరిచయం నా అదృష్టం . ఆయన సాక్షాత్తు నటరాజు స్వరూపమే .
*ఇంగ్లీష్ లో ఏం .ఫిల్ చేసారు అంటున్నారు ? ఆ భాష పై అంతా అభిరుచి ఎలా కలిగింది ?
చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ ఇష్టమే . మా నాన్నగారు కుడా ఆంగ్ల రచయితల కథలు చెబుతుండేవారు . ఆ ఇష్టం అలాగే కొనసాగింది . ఇప్పుడిప్పుడే తెలుగు సాహిత్యం కుడా చదువుతున్నాను .
*తెలుగు సాహిత్యంలో మీరు చదివిన పుస్తకం ?మీకు బాగా నచ్చిన పుస్తకం ఏమిటి ?
వేయిపడగలు . విశ్వనాధ సత్యనారాయణ వంటి గొప్ప కవి మరొకరు లేరేమో అన్పిస్తుంది . ప్రతి తెలుగు వాడు , ప్రతి భారతీయుడు చదవలసిన పుస్తకం వేయిపడగలు . నేను ప్రతి సంవత్సరం చదువుతాను
*మరి అంతగా మిమ్మల్ని ఆకర్షించిన వేయిపడగలు కథని స్వాతి సోమనాథ్ తరహాలో ఆలోచించారా ?
నేను చేసిన హిందుత్వ నృత్య రూపకంలోని విషయం , వేయి పడగలకు దగ్గరగానే ఉంటుంది .
*హిందుత్వ (hinduthvam )నృత్య రూపకం రావడానికి , దాని గురించి చేసిన కృషి చెప్పండి ?
ఒకసారి ఇలాగే మాటల సందర్భంలో ప్రస్తావన వచ్చినప్పుడు చక్రధర్ గారు నృత్య రూపకాన్ని చేసే ముందురాణి శివ శంకరశర్మ గారు రచించిన ‘ Last Bramans పుస్తకం చదవమన్నారు . తరవాత వేయిపడగలు చదవమని చెప్పారు . laast bramans ఒక పది సార్లు చదివాను . ఆ తరవాహ హిందుత్వం నృత్య రూపకం రూపొందించాను .
*నృత్య రూపకాల ప్రసక్తి వచ్చింది కాబట్టి మీరి చేసిన నృత్య రూపకాల గురించే మాట్లాడుకుందాం? .
తప్పకుండా , చెప్పండి .
*శరణం గోవిందం(sharanam govindam ) నృత్య రూపకం గురించి చెప్పండి ?
పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య రచించిన కీర్తనలలోని కృష్ణ తత్వాన్ని తీసుకుని చేసాను . కామి శెట్టి శ్రీనివాసరావు గారు దిని మీద నృత్య రూపకం చేస్తే బాగుంటుంది కదా అన్నారు . అప్పుడు ఆలోచించి ఈ శరణం గోవిందం చేసాను .
*’సర్వజ్ఞ శంకర ‘(sarvagna shankara ) నృత్య రూపకం ఏ సందర్భం లో చేసారు ?
శరణం గోవిందం చూసిన కేరళ సమాజం వారు చేయమంటే సర్వజ్ఞ శంకర చేసాను . మొదటి రోజు శరణం గోవిందం , రెండవ రోజు సర్వజ్ఞ శంకర ప్రదర్శిన ఇచ్చాము .
*మీ మొదటి నృత్య రూపకం ‘ప్రణయ వరూధిని ‘(pranaya paroodhini ) చెప్పండి ?
ఆంద్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన రచించిన మను చరిత్ర ఆధారంగా చేసుకుని ప్రణయ వరూధిని చేసాను .
*మరి మొదటి నృత్య రూపకానికి లభించిన పొగడ్తలు , విమర్శలు గురించి ?
చాలా వచ్చాయండి . అసలు అనుభవమే లేని స్వాతి సోమనాథ్ నృత్య రూపకం చేస్తుంది అని రకరకాలుగా విమర్శలు చేసిన వారు ఉన్నారు . సద్విమర్శ చేసిన వారు లేకపోలేదు . ఆంధ్ర జ్యోతి ఉదయ్ గారు విమర్శ అద్భుతంగా చేసారు . ఆ రూపకంలోని అన్ని విషయాలను ప్రస్తావించారు , చివరకి కేశాలంకరణ గురించి కూడా సూచనలు చేసారు . ఆ తరవాత వాటిని మార్చుకుంటూ , నన్ను నేను తీర్చిదిద్దు కుంటూ ఈ స్థాయికి వచ్చాను .
*మీ రెండవ నృత్య రూపకం రాస గోపాలం (raasa gopaalam ) చేసిన విధానం చెప్పండి ?
జయ దేవుడుగీతా గోవిందం లో రచించిన అష్ట పదుల్ని తీసుకుని చేసాను . అష్టపదుల్లో ఒక్కొక్క దానిలో ఎనిమిది చరణాలు ఉంటాయి . మొత్తం 26 అష్ట పదులు వాటిని అన్నింటిని తెలుసుకుని 12 మాత్రమే తీసుకుని గంటన్నర పాటు రాస గోపాలం గా ప్రదర్శించాను .
*నౌకా చరిత్రం (nouka charithram ) నృత్య రూపకం మీరు కృష్ణుడుగా చేసారు కదా ? ఆ రూపకం గురించి చెప్పండి ?
త్యాగరాజు రచించిన నౌకా చరిత్రం తీసుకుని చేసాను . అష్ట పదులు , తరంగాలు , అన్నమయ్య కీర్తనలు మనకు నచ్చినట్టు మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది . కాని ఈ నౌకా చరిత్రం అలా వీలుకుదరదు . దీనికి సంబంధించి బాలమురళి కృష్ణ పాడిన క్యాసెట్ విన్నాను . దానిలో సగానికి సగం లేవు . గోపాల క్రునయ్య గారిని అడిగాను ఆయన ముందు అంగీకరించలేదు . బాలా మురళి కృష్ణ గారు పాడిన దానిని మార్చడం మంచిది కాదు అన్నారు . ఆ తరవాత ఆలోచించి ఎక్కడెక్కడ లేదో అక్కడ అద్భుతమైన సంగీతం ఇచ్చారు . నేను కృష్ణుడిగా అయిదుగురు గోపికలతో చేసాను .
*ప్రస్తుత కాలం లో స్వాతి సోమనాథ్ అంతే అందరికి గుర్తుకు వచ్చే నృత్య రూపకం కామ సూత్ర(kaamasuthra ) చేస్తున్నప్పుడు , ప్రదర్శించి నప్పుడు ఎదురైనా సంఘటనలు చెప్పండి ?
బయట ప్రపంచంలో ని సంఘటనలను చూసే కామసూత్ర చేసాను . అది చేస్తూన్నాని తెలిసి చాలా మంది విమర్శించారు . మొదటి ప్రదర్శన రవీంద్ర భారతిలో ఇవ్వడం జరిగింది . అప్పుడు బయట కట్టిన పోస్టర్ మీద వ్యతిరేకిస్తే తరవాత ప్రదర్శనకి దానిని మార్చి రాసాను . ఎవరైతే కామసూత్ర నృత్య రూపకం చేస్తున్నప్పుడు విమర్శించారో వాళ్ళే ఆ నృత్య రూపకం చూసి అభినందించారు .
*మీరు కామాసుత్ర చేస్తున్నప్పుడు అనుకున్న ప్రయోజనం నెరవేరిందనే అనుకుంటున్నారా ?
మన వాళ్ళు చూసే విధానం , ఆలోచించే తీరు వేరు .కామసూత్ర పుస్తకాన్ని ప్రచురించిన సంస్థలు కూడా దానిని పక్క త్రోవ పట్టించారు . చివరకి దానిలో సూత్రం పోయి కామం మాత్రమే మిగిలి పోయింది . నేను చేసింది ప్రజలుకు ఎంత వరకు చేరింది అనేదాని కంటే కామసూత్ర అనేది తప్పు కాదు దాని గురించి అందరు తెలుసుకోవాలి అనే అల్లోచన అందరిలోనూ కలిగింది .
*ద్రౌపది ని ఒక అంశం గా తీసుకుని చాలా మంది చేసారు మళ్ళీ దానినే తీసుకోవడానికి కారణం ?
చేసారు కాని , అందరు ద్రౌపది పుట్టుక నుంచి స్వయంవరం వరకు మాత్రమే చెప్పారు . నేను మాత్రం స్వయంవరం నుండి మొదలు పెట్టి మహాప్రస్థానం వరకు చూపించాను .
*అసలు ద్రౌపది చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది ?
కామసూత్ర తరవాత ఏ అంశాన్ని తీసుకోవాలి అని ఆలోచించినప్పుడు , ఒకసారి పీటర్స్ తీసిన ధారావాహికలో ద్రౌపది పాత్ర గుర్తుకు వచ్చింది . ఆపాటికి అది చూసి చాలా కాలం అవుతుంది . కాని ద్రౌపది పాత్ర చేసిన మల్లికా సారాబాయి నటన నన్నున్ బాగా ఆకట్టుకుంది . ఆ తరవాత దూరదర్శన్ వారు ఆరు నిమిషాల నిడివిల టెలిఫిల్మ్ తీసారు దానిలో ద్రౌపది , సీత , నేను ద్రౌపది పాత్ర చేసాను . ఆ విధంగా ఆలోచన ఎప్పటి నుండో ఉంది .
*ద్రౌపది నృత్య రూపకం లో ఏ ఏ ఘట్టాలను చూపించారు ?
ఒకరినే భర్తగా ఊహించుకున్న తనకి అయిదుగురుకి భార్య అని తెలియడం , వివిధ సంఘటనలలో తను వ్యవహరించిన తీరు తీసుకుని మహాప్రస్థానం వరకు చేసాము . ద్రౌపదిలో ఉన్న తిరుగుబాటు , అన్యాయాన్ని ఎదిరించడం , భర్తలను ప్రశ్నించే విధానం అందరికి తెలియాలనే చేసాను .
*ద్రౌపది స్క్రిప్ట్ ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా చేత రాయించారు , ద్రౌపది కూడా స్త్రీవాదే అనా ?
కాదండి . నేను దూరదర్శన్ లో టెలిఫిల్మ్ చేసినప్పుడు దానికి ఓల్గా గారే స్క్రిప్ట్ రాసారు . ఆ పదాలు , సంభాషణలు బాగా నచ్చాయి . అందుకే ఆమెను రాయమని అడిగాను . సరే అని రాసి ఇచ్చారు .
*నాట్యం నేర్చుకునే వారికి మీరిచ్చే సలహా ఏమిటి ?
నాట్యాన్ని ఒక అభిరుచిగా మాత్రమే ముందు నేర్చుకోండి . తరవాత పట్టుదల తో సాధన చేయండి . నేర్చుకున్నది ఏదైనా శ్రద్ధ తో సాధన చేస్తూ ,రామాయణ భారత , భాగవత కథలను తెలుసుకుంటే మన సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి .
*త్వరలో స్వాతి సోమనాథ్ ఏ నృత్య రూపకం తో వస్తున్నారు ?
ఒక 6,7 నెలలో ఒక నృత్య రూపకం తో వస్తాను . విషయం పాతదే . చెప్పే విధానం కొత్తది . నృత్య రూపకాలను ప్రజలు చూడటానికి ఆసక్తి తగ్గిపోతుంది కాబట్టి , ఈ నృత్యాన్నే ప్రజల వద్దకు తీసుకు వెళ్ళే ప్రయత్నం అనే అంశం తో రూపొందిస్తున్నాను .
మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే
– అరసి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
4 Responses to నర్తన కేళి -8