తెలుగులో 20వ శతాబ్ది తొలి ఐదు దశాబ్దాల స్త్రీల కవిత్వం (1900-1950)

ISSN 2278 – 4780                 

సాహిత్యం క్రమానుగతంగా ఎట్లాపరిణమిస్తూ వస్తున్నదో చెప్పేది సాహిత్య చరిత్ర. సాహిత్య చరిత్ర లక్ష్యం భావనాత్మకతతో సంస్కృతీ భాషణం చేసిన స్త్రీ పురుషుల జీవితాన్ని నమోదు చేయటం, వ్యాఖ్యానించటం. సాహిత్యరంగంలో వ్యక్తమయ్యే మానవచరిత్రను వ్రాయటం సాహిత్య చరిత్రకారుల పని. గతానికి సంబంధించిన సాహిత్య రచనలను కనిపెట్టి స్థలకాలాల సంబంధంలో కాలక్రమ వరుసలో వివరిస్తూ ఇయ్యటమే సాహిత్య చరిత్ర.. ఆక్రమంలో ఆయా స్థలకాలాల మేధోవాతావరణంలో రచయితలు ఏ రాజకీయ మత సాంస్కృతిక భావాలతో సంఘర్షించారో, వేటిని ఆమోదించి ప్రచారం చేశారో, వేటిని నిరాకరించారో వివరించటం కూడా జరుగుతుంది. ఆ రకంగా సాహిత్య చరిత్ర అంటే భావాల చరిత్ర కూడా. సాహిత్య చరిత్ర రచనలో ఏ రచయిత తక్కువకాదు, అమౌలికంకాదు. ఎందుకంటే ప్రతి రచయిత పరంపరాగత సంప్రదాయజ్ఞానాన్ని ఉపయోగించుకొని తమదిగా స్వీకరించి వస్తువును భావాలను సమకూర్చుకొని వ్రాస్తారు. కనుక చరిత్రలో ప్రతిరచనకు, రచయితకు వున్న ఖచ్చితమైన స్థానాన్ని నిర్దేశించి చూపటం సాహిత్య చరిత్ర లక్ష్యం.    

                   అయితే తెలుగు సాహిత్య చరిత్ర రచనలు ఈ సూత్రాలను, లక్ష్యాలను అంతగా పట్టించుకొన్నట్లు కనబడదు. భావాత్మకతలో సంస్కృతీభాషణం చేసిన స్త్రీపురుషుల జీవితాన్ని నమోదు చేయటం, వ్యాఖ్యానించటం అన్న మౌలిక సూత్రం చరిత్రకారులు విస్మరించారు. అందువల్ల సాహిత్య చరిత్రలన్నీ పురుషసాహిత్య చరిత్రలుగానే రూపొందాయి. స్త్రీలు వ్రాయకపోతే చరిత్రకారులు ఏంచెయ్యగలుగుతారు అన్న ప్రశ్నవెయ్యవచ్చు ఎవరైనా. వ్రాసిన స్త్రీల పట్ల, వారి రచనల పట్లా చిన్న చూపు, తిరస్కారం సాహిత్య చరిత్ర రచనలో ప్రతిఫలిస్తూనే వచ్చాయి. ప్రాచీన సాహిత్య చరిత్ర రచనలో కందుకూరి వీరేశలింగం పంతులు దగ్గరనుండి కూడా లోతులేని కవులని మొల్ల, తరిగొండ వెంగమాంబ వంటి వారు, వేశ్యలని వారి వృత్తివల్ల ముద్దుపళని వంటివారు నిర్లక్ష్యానికి గురి అయిన సందర్భాలు లేకపోలేదు.   

                   ఆ లోపాన్ని ఆనాడే గుర్తించి నిరసించిన మహిళ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. కవయిత్రుల రచననలకు నిష్పాక్షిక స్థానము, ప్రవేశ పాధాన్యాలు ఇచ్చిన గ్రంథాలు వేళ్లమీద లెక్కించి చెప్పటానికి కూడా లేవంటారు ఆమె. ఆంధ్ర రచయితలు లాంటి సాహిత్య విమర్శన(మధునాపంతుల సత్యనారాయణ రచన) లలో మచ్చునకైనా ఒక్క కవయిత్రి పేరు పేర్కొనకపోతే ఏ సారస్వతేయులకూ చీమకుట్టలేదు – అది శోచనీయమన్నారు. ఆవిధంగా  మహిళావాఙ్మయానికి జరిగిన తీరని అపచారానికి పరిహారంగా ఆమె ‘ ఆంధ్ర కవయిత్రులు’ రచించారు. ఆరకంగా స్త్రీల కవిత్వ చరిత్ర రచనకు ఆమె ప్రారంభంచేశారు.   

                    చాటు పద్య రచయితయితలయిన చానమ ప్రోలమలతో ప్రారంభించి, సంస్కృతకావ్యాలు వ్రాసిన వాళ్లను కూడా ప్రస్తావిస్తూ తాళ్ళపాక తిమ్మక్క మొదలైన తొలితరం కవులను 26 మందిని, వీరేశలింగం యుగానికి చెందిన కొటికలపూడిసీతమ్మ, భండారు అచ్చమాంబ వంటి మలితరం కవులను 29మందిని,  కాంచనపల్లి కనకమ్మతో ప్రారంభించి మూడవతరం కవులును 19మందిని, స్థానాపతిరుక్మిణమ్మతో ప్రారంభించి నాలుగవతరం కవులను 10 మందిని, తల్లాప్రగడ విశ్వసుందరమ్మతో ప్రారంభఙంచి నవ్యాంధ్రయుగకవులుగా అయిదవతరం వారిని 41 మందిని – మొత్తం 125 మంది కవుల గురించి వ్రాశారు. చరిత్ర తెలియని ఇతర కవయిత్రులంటూ మరొక 65 మందిని  పేర్లతో, రచనలతో పేర్కొనారు. అనుబంధంలో మరొక ఏడుగురు రచయితలను పరిచయంచేశారు.    

                   కవి జీవితకాలాలను, కవిత్వాలను పేర్కొని కావ్యవిమర్శ చేయటం అన్న పద్ధతిలో సాగింది ఆంధ్రకవయిత్రుల రచన. అయితే ఈ గ్రంథానికి ‘పీఠిక – దీపిక’ వ్రాస్తూ జమ్ముల మడక మాధవరామశర్మగారు గుర్తించి చెప్పినట్లుగానే ఇందులో గద్యరచనల ప్రస్తావన లేదు (21) అంటే కథ, నవల, నాటకం, వ్యాసం వంటి ప్రక్రియలలో స్త్రీలు చేసిన కృషి పరామర్శ ఇందులో లేదు. కవయిత్రుల చరిత్ర రచనకు పూనుకొన్న లక్ష్మీకాంతమ్మను అభినందిస్తూనే ఇంకా తెలియకుండా వున్న రచయిత్రులు తెలంగాణలో, రాయలసీమలో,  రాష్ట్రేతరాంధ్రులలో ఎందరో వుండటానికి వీలుందని సూచన చేసి వదిలారు. (11) ఆరకంగా చూచినపుడు ‘ఆంధ్ర కవయిత్రులు’ పుస్తకాన్ని భిన్న ప్రక్రియలలో రచయిత్రులు చేసిన కృషితోనూ, భిన్న ప్రాంతాలలో రచనలు చేస్తున్న స్త్రీలను ప్రధానసాహిత్య స్రవంతిలోకి తీసుకొని రావటం ద్వారానూ, మరింత సమగ్రం చేసుకొనే పని ఎప్పటికపుడు జరుగుతూ ఉండాలి. కానీ 1951లో లక్ష్మీకాంతమ్మగారు  ఉపేక్షిత స్త్రీల కవిత్వం గురించి ఆపేక్షతో  ‘ ఆంధ్రకవయిత్రులు’  వ్రాస్తే  అర్థ శతాబ్దం దాటినా మళ్ళీ అటువంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. లక్ష్మీకాంతమ్మగారి వారసత్వాన్ని అభివృద్ధికరంగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరాన్ని సమకాలీన మహిళా అస్థిత్వ చైతన్యం ఉద్యమాలు, అభివృద్ధిలో స్త్రీల భాగస్వామ్యం, సాధఙకారత వంటి భావనలు ముందుకు తెస్తున్నాయి. కనుకనే ఇపుడు 1900-1950 మధ్య కాలపు స్త్రీల కవిత్వంపై  ఈ అంచనా. |    1900-1950 మధ్యకాలం స్త్రీల చైతన్యాభివృద్ధి దిశగా తెలుగు సమాజం ఎదిగిన కాలం. వీరేశలింగం పంతులు ప్రారంభించిన స్త్రీ విద్యా ఉద్యమం ఫలితంగా విద్యావంతులైన తొలితరం స్త్రీలు స్త్రీలకు సంబంధించిన సంస్కరణ ఉద్యమాన్ని తామె ముందుకు తీసుకొని వెళ్ళే బాధ్యతను స్వీకరించారు. సంఘసంస్కరణ మహాసభలలో చురుకుగా పాల్గొన్నారు.     స్త్రీలు నాయకులుగా ఎదుగుతున్నారనడానికి వారు మహిళా సంఘాలు పెట్టుకోవడం, మహిళా సమస్యల మీద చర్చించు కోవడం, నిర్ణయాలు తీసుకోవడం నిదర్శనం. సంస్కరణ్యోదమం మహిళల నాయకత్వ స్థాయిని పెంచింది.  

                          స్త్రీ సమాజం, ఆసికా స్త్రీ సమాజం (1902) శ్రీ చెన్నపురి హిందూ మహిళా జ్ఞాన సమాజము (1911 నాటికే వుంది.) కర్నూలు స్త్రీ విద్యాభివర్థిని సమాజం, (1910) ప్రార్థనా సమాజం (1890) జనానా సమాజం(1903)  స్త్రీ సనాతన ధర్మ మండలి(1904) సత్య సంవర్థినీ సమాజం (1911) స్త్రీ హితైషఙణి మండలి, ఆంధ్ర యువతీ మండలి (1935) మహిళా సేవా మండలి, భారతసేవా సమాజము – మహిళా శాఖ, హితకారిణి సమాజం (1907) శ్రీ సాధువమ్మ సేవా సదనము, బాల సరస్వతీ స్త్రీ సమాజము, శ్రీకాకుళం, కోనసీమ మహిళా సంఘాలు, బృందావన పుర స్త్రీ సమాజము, (1901) లక్ష్మీ సహాయ సమాజం, అఖిల భారత మహిళా సభ – ఆంధ్రశాఖ మొదలైన సమాజాలు, ఏర్పాడ్డాయి. స్త్రీలు వాటిని నడుపుకున్నారు.      ఇవేకాక ఆంధ్ర మహిళా సభ, సంఘ సంస్కరణ మహాసభ, ఉభయగోదావరి మండల మహిళా సభ, ఆర్యవేశ్య సభ, స్త్రీల సభ మొదలైన సభలలో కమలాకరమ్మ, మోచర్ల లక్ష్మీ నరసమ్మ, బుర్రా బుచ్చి బంగారమ్మ, లక్ష్మీ నరసమాంబ, శుద్ధపల్లి అచ్చమాంబ, కొటికెల పూడి సీతమ్మ, ఆదుర్తి భాస్కరమ్మ, కళ్ళేపల్లి వెంకటరమణమ్మ, వారణాసి సీతమ్మ, తురగా మాణిక్యమ్మ, ఏకా ఆది లక్ష్మమ్మ, కోలచలమల కాంతమ్మ, బండారు అచ్చమాంబ, ఆచంట రుక్మిణమ్మ, తుర్లపాటి రాజరాజేశ్వరమ్మ, సీరము సుభద్రమాంబ, మాగంటి అన్నపూర్ణదేవి, వేదాంతం కమాలాదేవి, కుమారి జమునాబాయి, సూరి భ్రమరాంబ, మోటుపల్లి రాజబాయమ్మ, కడప రామసుబ్బమ్మ, జంపాల భారతీదేవి, జంపాల  రత్న మాణిక్యం,  కొల్లూరు మహాలక్ష్మమ్మ మొదలైన మహిళలు పాల్గొని స్త్రీ విద్య, జ్ఞానాభివృద్ధి, ఐకమత్యం, బాల్య వివాహా నిషేధం, స్త్రీ స్వాతంత్య్రం ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయాలలో స్త్రీల పాత్ర, స్త్రీల ఘనచరిత్ర, చరిత్ర రచన, మతం, కన్యాశుల్కం, వరశుల్కం పిల్లల పోషణ మొదలైన అనేక విషయాల మీద చర్చించారు.   

                    సంస్కరణోద్యమాలు స్త్రీల విషయంలో తీసుకొచ్చిన కొత్త చర్చలు, చైైతన్యం కారణంగా స్త్రీ సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ప్రభుత్వాలపై తెచ్చిన ఒత్తిడి ఫలితంగా శారదా చట్టం వంటి బాల్య వివాహ నిషేదచట్టాలు, పునర్వివాహచట్టాలు మొదలైనవి వచ్చాయి. వాటిని, స్త్రీ విద్యను, జీవిత వాస్తవాలుగా  మలచటానికి  అవసరమైన సంస్కారాలను అభివృద్ధి పరిచే ప్రయత్నం ఈ కాలంలో ముమ్మరంగా కొనసాగింది. స్త్రీ ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్య్రం, విడాకులు, పొదుపు మొదలైన అనేకానేక విషయాల మీద చర్చోపచర్చలు జరిగిన కాలం ఇది.  వాటిలో స్త్రీలు చురుకుగా పాల్గొని  తమ అభిప్రాయాలు చెప్పటం విశేషం.   

                              జాతీయోద్యమ క్రియాశీల రాజకీయాలలోకి కూడా స్త్రీలు ప్రవేశించారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైళ్ళకు వెళ్ళారు. వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ, అరికెపూడి మాణిక్యాంబ భారతీదేవి రంగా వంటి వాళ్ళెందరో ఆ కోవలో వున్నారు. కజిన్స్‌, స్లేడ్‌ వంటి విదేశీ వనితలు గాంధీ  శిష్యులై ఈ  ఉద్యమానికి మద్దతు తెలిపారు.     1920ల నుండి రష్యా విప్లవ ప్రభావం వల్లనైతేనేమీ, దేశీయ రాజకీయార్థిక పరిస్థితుల కారణంగా నైతేనేమీ దేశంలో వ్యాపిస్తున్న వామపక్షభావాలు ఏకీకృత కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడి బొంబాయి తదితర చోట్ల కార్మికులను కూడగట్టి సమ్మెలు నడిపింది. రైతాంగంలో కూడా కొత్త చైతన్యానికి కారణమైంది. ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు ప్రాభవంలోకి వచ్చి నిజాం వ్యతిరేక సాయుధరైతాంగ పోరాటనాన్ని నిర్వహించటం ప్రత్యేకంగా గుర్తించదగినది.  

                 సాయుధ రైతాంగ పోరాటాలలో స్త్రీలు అనేకమంది పాల్గొన్నారు. అభ్యుదయ భావచైతన్యాన్ని సమాజంలో వ్యాపింపజేయటానికి ఈ కాలంలో ప్రయత్నాలు జరిగాయి. కోమర్రాజు అచ్చమాంబ వంటి స్త్రీలు తదనుగుణంగా స్త్రీలను సమీకరించే కృషి,  స్త్రీల చైతన్యాన్ని మెరిగెక్కించే  కృషి చేశారు. 1942లో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులలో  వట్టికొండ విశాలాక్షి  ఏకైక మహిళా ప్రతినిధి.  1950లో  నూతన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశ స్త్రీల ఆశలకు ఆకాంక్షలకు అనుకూలంగా ప్రాథమిక  హక్కుల రూపంలో,  ఆదేశకసూత్రాల రూపంలో రాజ్యాంగ బద్ధత సమకూడింది. ఈ నేపధ్యంలో స్త్రీలు ఎలా ఆలోచించారో, ఎలా స్పందించారో, నిశ్శబ్ద విప్లవాలను ఎలా సృష్టించారో తెలుసుకొవటానికి ఆకాలంలో స్త్రీలు సృష్టించిన సాహిత్యం గొప్ప ముడిసరుకు. స్త్రీలు సమకాలీన రాజకీయార్థిక పరిస్థితులను తమ జ్ఞాన చైతన్యాల నుండి ఏవిధంగా నిర్వచించారో, వివరించారో విశ్లేషించారో తెలుసుకొనటం, తద్వారా భావజాల చరిత్రకు స్త్రీలు చేసిన దోహదాన్ని అంచనా వేయటం ఇపుడిక జరగాల్సిన పని. 1900 – 1950 మధ్య కాలంలో స్త్రీలు వ్రాసిన కవిత్వం ఆధారంగా ఆపని చేయవచ్చు. ||    కవిత్వం చాలా ప్రాచీన”మైన ప్రక్రియ. అయినా కవిత్వ చరిత్ర అంతా ప్రధానంగా పురుషులదిగానే ఉంది. ప్రాచీన కవిత్వంలో స్త్రీలు ఒక శాతం మాత్రమే. ఆధునిక యుగంలో  విద్యావకావశాలవల్ల, సామాజిక ఉద్యమాల వల్ల స్త్రీలు కవులు కావటానికి పరిస్థితులు కలసివచ్చాయి. అయినా ఆధునిక కవుల సరసన స్త్రీలకు సముచితమైన స్థానం లభించలేదన్నది వాస్తవం. ఈ లోపాన్ని సవరించే క్రమంలో ఆంధ్రమహిళ, గృహలక్ష్మి, తెలుగు తల్లి, భారతి మొదలైన పత్రికలు, వైతాళికులు, వంటి కవితా సంకలనాలు, సంపుటాల ఆధారంగా సేకరించిన 133 మంది కవయిత్రులు వ్రాసిన 252 కవితా ఖండికలు, శతకాలు, కావ్యాలు   ఇపుడు అందుబాటులో వున్న ముడిసరుకు. వీటిలో కొన్ని వివిధ పత్రికలలో వచ్చిన సమీక్షలు, వ్యాసాలు ఆధారంగా గుర్తించినవి కూడా వున్నాయి.    

             ఈ 253 రచనలలో  11 శతకాలు కాగా, 131 వచన కవిత్వ ఖండికలు, 96 పద్య కవిత్వ ఖండికలు 15 పాటలు  వున్నాయి. 133 మంది కవయిత్రులలో పద్య కవిత్వం మాత్రమే వ్రాసిన వారు 44 మంది. పద్య కవిత్వం, వచన కవిత్వం రెండూ వ్రాసినవారు 76మంది. కేవలం పాటలు వ్రాసిన వారు 10 మంది. కేవలం శతకాలు మాత్రమే వ్రాసిన వారు ముగ్గురు.     పద్యకవిత్వం వ్రాసిన కవయిత్రులలో ఎక్కువగా వ్రాసింది చిల్కపాటి సీతాంబ. ఆయ్యగారి రాఘవమ్మ,  గంటి కృష్ణవేణమ్మ, కల్పాల పార్వతి దేవి, స్థానాపతి రుక్మిణమ్మ మొదలైన వాళ్ళు. ఈ వరుసలో వున్నారు. వచన కవిత్వం  వ్రాసిన వాళ్ళు ప్రధానంగా చావలిబంగారమ్మ,  సౌదామిని (బసవరాజు వెంకటరాజ్యలక్ష్మి). కాంచన పల్లి  కనకమ్మ, వోలేటి నిత్య కల్యాణమ్మ, దేవులపల్లి సత్యవతమ్మ, స్థానాపతి రుక్మిణమ్మ, తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ, చిల్కపాటి సీతాంబ, పి. అప్పలనర్సమ్మ, గుడిపూడి ఇందుమతి, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, కంకిపాటి రుక్మిణమ్మ, పరచూరి భువనేశ్వరీదేవి, పైడిమర్రి సీతాదేవి, వెంపటి అన్నపూర్ణమ్మ,  పరచూరి అన్నపూర్ణాదేవి, చదలవాడ రాఘవమ్మ,  బొడ్డు సీతామహాలక్ష్మి మొదలైన వాళ్ళు రెండింటిలోనూ వున్నారు. అలాగే పాటలు వ్రాసిన కవయిత్రులలో మదమంచి అనంతమ్మ, చావలిబంగారమ్మ, పాకాల రాజమణి,  చోడవరపు రంగనాయకమ్మ, గిడుగు సత్యవతిలాంటి వాళ్ళున్నారు. శతకాలు వ్రాసిన వారిలో జి. ఇందుమతి, చేబ్రోలు సరస్వతీ దేవి, కాంచనపల్లి, కనకాంబ, స్థానాపతి రుక్మిణిమ్మ పేర్కొనదగినవారు.  

             స్వాతంత్రానికి పూర్వం స్త్రీలు ఉత్సాహంగా పోటీ పడుతూ సమస్యాపురణంలో పాల్గొన్నారు.  పద్యరచనాభ్యాసం చేశారు. ”రాటము వలదనుచు గాంధి రవమునన్‌ బలికెన్‌” అనే సమస్యా- పురాణంలో బో. సీతాబాయి, అబ్బూరి రాజ్యలక్ష్మి, బసవరాజు వెంకటలక్ష్మమ్మ, సమయమంత్రి రాజ్యలక్ష్మి, ద్విభాష్యం సత్యవతి, గాలం రంగనాయకమ్మ, పులిజాల కమలాబాయి, బొడ్డుపల్లి యశోదాబాయి, కోనేరు వెంకటరామమ్మ బెల్లంకొండ కనకమ్మ, బొడ్డు సీతామహాలక్ష్మి, రావుల రాజ్యలక్ష్మి, కల్పాల పార్వతమ్మ, జ్ఞానాంబ, ఎన్‌.హెచ్‌. అలిమేలు మంగతాయార్‌, చెన్నూర్‌ అన్నపూర్ణమ్మ, నరహరిశెట్టి నాగరత్నాంబ, చదలవాడ ధర్మరాజు సతి,  బి. అదిలక్ష్మాంబ, నందిగామ సౌభాగ్యవతి, ఆయల సోమయాజుల శేషమ్మ, వడ్లమన్నాటి సూరమ్మ, యన్‌ యలివేణి, యస్‌, హైమావతి, చదలవాడ రాఘవమ్మ, తురగా సూర్యకాంతమ్మ, యశోదాబాయి, అచంట సత్యవతమ్మ, పంతులసీతాలక్ష్మి, తటపర్తి సత్యరామమ్మ, అమలగంటి లలితాదేవి, కంఙభంమెట్టు లక్ష్మీకాంతమ్మ, పాకనాటి శ్రీ లక్ష్మీ కామేశ్వరి, పాకాల చంద్రకాంతమణి మొదలైన వాళ్ళు పాల్గొని పద్యాలు వ్రాశారు.    అంతేగాకుండా పరచూరి భువనేశ్వరీదేవి, సామవేదుల చిరంజీవమ్మ, ఏలూరి పాటి లక్ష్మీసరస్వతీ, కె. రామసుబ్బమ్మ, ఆరాధ్యుల వెంకటసుబ్బలక్ష్మి, భాగవతుల వెంకటజోగమాంబ, దేశిరాజు భారతీదేవి, పేరేపు మహాలక్ష్మి, హరి లక్ష్మీదేవి, పిండిప్రోలు కొండమాంబ, గండికోట సావిత్రిదేవి, వడ్లపూడి శేషారత్నం, అయితా సూర్యకాంతం, గంటి కామేశ్వరమ్మ శేషమాంబ, సామినేని హనుమాయమ్మ, సామవేదం సీతారామమ్మ, యం. రామలక్ష్మమ్మ, యం. వేదపల్లి తాయారమ్మ, కనుపర్తి వరలక్ష ్మమ్మ, మానాప్రగడ సీతారామమ్మ, కర్రికమల మొదలైన స్త్రీలు అనేకమంది సమస్యాపూరణాలలో పాల్గొంటూ కవిత్వాన్ని వ్రాయడానికి ముందుకొచ్చారు. దీన్ని బట్టి స్త్రీలు ప్రతిభావ్యుత్పత్తులలో ఏ మాత్రం వెనుకబడి పోలేదు అనే విషయం వెల్లడవుతుంది. ఈ కాలపు స్త్రీల  కవిత్వాన్ని కావ్యాలు, ఖండికలు అని రెండు భాగాలుగా వర్గీకరించి పరిశీలించవచ్చు.

  – కాత్యాయనీ విద్మహే
                            – డా|| జి. కిషన్‌ ప్రసాద్‌

(ఇంకా వుంది)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

5
UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో