ఎనిమిదో అడుగు – కొత్త ధారావాహిక ప్రారంభం !

జీవితాన్ని ఏ కోణంలోంచి చూడాలి అన్నది ప్రశ్న. చూడాల్సిన కోణంలోంచి చూడాలి అన్నది జవాబు. కానీ పరుగే లక్ష్యమైనప్పుడు ఆ పరుగు ప్రశ్న వైపా! జవాబు వైపా అన్నది మీమాంస…. మనుషులు నిరంతరం తమను తాము తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు కొన్ని జీవితాలు రాటుదేలతాయి. కొన్ని జీవితాలు రాలిపోతాయి. అందుకే ముగింపు ప్రారంభమై, ప్రారంభం ముగింపు అయి భయపెడుతుంది.     

        సహనం కోల్పోతే సముద్రం కూడా అదుపు తప్పుతుంది కదా!  స్వేచ్ఛను కోరుకునే మనిషి తనను తాను తెలుసుకుంటూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి.  తాను కోల్పోయింది ఏమిటో తనకు కావల్సింది ఏమిటో తెలుసుకోవాలి….
            ఒక సాయంత్రం ఏటి ఒడ్డు కెళ్లి చంద్రుడు వచ్చేంతవరకు ఓపికతో నిరీక్షిస్తే వెన్నెల మిళితమైన ఏటి నీటిని చూడొచ్చు. అది లేనప్పుడు వట్టి నీటినే చూసి తిరిగి వెళ్లిపోవలసి ఉంటుంది.
            చూడాల్సిన కోణంలో, చూడాల్సిన దృష్టితో చూసినప్పుడే జీవితం కాని, ప్రకృతి కాని అందంగా అనిపిస్తుంది. ఒక రాయికి అందమైన ఆకృతి రావాలంటే ఉలి దెబ్బలు భరిస్తేనే కదా!   ముందుగానే ఉలిక్కి పడితే రాయి శిల్పంగా మారుతుందా…? 
            ‘ఏడు మల్లెల ఎత్తు, సంపెంగ ముక్కు, కలువకళ్లూ’ అంటూ కవులు వర్ణిస్తుంటే ` అది రాస్తున్న కలాలను చూసి పువ్వులు నవ్వుతాయట… ‘చూడు చూడు మమ్మల్ని తీసికెళ్లి అందరి చెవుల్లో ఎలా పెడ్తున్నారో’
అని ఎగతాళిగా….కానీ స్నేహిత అనే అమ్మాయి కళ్లూ, ముక్కూ, పెదవులు అచ్చం తమనే పోలివుండటం చూసి బాల్కనీలో కుండీలో పూసిన పూలు సంభ్రమాశ్చర్యాలతో గర్వంగా ఆకుల చాటున ఊగుతున్నాయి…స్నేహితకేమో తన బుగ్గపై మొటిమ ముత్యమై మెరుస్తుంటే అదో పెద్ద లోపంలా దిగాలుగా కూర్చుని గోటితో దాన్ని చిదుముతోంది. 
            ‘‘పాలు తాగవే స్నేహా! కాలేజి టైం అవుతోంది.’’ అంటూ స్నేహిత దగ్గరకి వచ్చింది.  ఆమెతల్లి విజయలక్ష్మి.
            తల్లిని పట్టించుకోకుండా తనపనిలో తనుంది స్నేహిత.  
            ‘‘అలా కూర్చున్నావేం? ఏమైందక్కడ? ఏదీ చూడనీ! ఓ అదా! పోతుందిలే…రాత్రికి శొంటికొమ్ము రంగరించి పెడతా’’అంది అక్కడే వున్న స్నేహిత బామ్మ గోమతమ్మ.
            బామ్మ మాటకి బయటపాదుల్లో అల్లుకొని వున్న లేత తమలపాకు చిన్న బుచ్చుకొని,మా మీద పడే నీటి బిందువు ఎలాగూ ఒక్కక్షణం నిలవదు.  కనీసం మమ్మల్ని పోలిన స్నేహిత బుగ్గపై మొటిమ అయినా 
మంచు బిందువులా వుందనుకుంటే ఈ బామ్మేంటి శొంటి కొమ్మును అరగదీసి పెడతానంటుంది? అన్నట్లు గింజుకుంటుంటే… ‘అయ్యో! బాధపడకండి మీకు మేమున్నాం.’ అన్నట్లు పూలన్నీ ఓదార్పుగా తమలపాకు బుగ్గల్ని నెమ్మదిగా నిమిరాయి. 

      vihanga 123      తల్లి చేతిలోని పాలు తీసుకొని తాగుతూ డ్రస్సింగ్‌ టేబుల్‌ దగ్గరకెళ్లి నిలబడిరది స్నేహిత. విజయలక్ష్మి పనిపిల్లను పిలుస్తూ బయటకెళ్లింది.  
            అంతలో లాండ్‌ ఫోన్‌ లిప్ట్‌ చేసి ‘‘స్నేహితా! నీకు ఫోన్‌! నీ స్నేహితురాలు చేతన…’’ అంటూ స్నేహితను పిలిచి ` రిసీవర్ని ఎత్తిపట్టుకొని అక్కడే నిలబడిరది బామ్మ.
            ఒక్క వుదుటున ఫోన్‌ దగ్గరకి వెళ్లి గోమతమ్మ  చేతిలోని రిసీవర్‌ అందుకొని …‘‘చెప్పవే చేతనా! ఎక్కడున్నావ్‌!’’ అంది స్నేహిత. 
            ‘‘సరిగ్గా యూనివర్శిటీ క్రాస్‌ రోడ్డు దగ్గర వున్నాను.  హాస్టల్‌ నుండి బయటకొచ్చి నీ కోసం వెయిట్‌ చేస్తున్నా…. ఎంతసేపు? త్వరగారా! ఇక్కడే ఆటో ఎక్కి వెళ్దాం!’’ అంది చేతన. 
            ‘‘వస్తున్నా… ఎందుకంత తొందర? ఫస్ట్‌డేనే కదా! క్లాసులేం జరగవట… ప్రషర్స్‌డే వరకు ఇలాగే వుంటుందట….’’ అంటూ తనకి తెలిసిన సమాచారాన్ని చెప్పింది స్నేహిత.
            చేతన ఆశ్చర్యపోతూ….‘‘మరి అప్పటి వరకు కాలేజికి వెళ్లొద్దా?’’ అంది. 
   ‘‘నేనలా అన్నానా? వస్తున్నా తల్లీ!’’ అంది స్నేహిత.
    ‘‘మొబైల్‌ తెస్తున్నావా?’’ అంది చేతన .
‘‘నాకు గుర్తుందమ్మా! నువ్వు చెప్పింది’’. అంటూ స్నేహిత ఫోన్‌ పెట్టేసింది.  బామ్మ అక్కడే నిలబడి స్నేహిత వైపు చూస్తూ.
   ‘‘ఏంటే గుర్తుందంటున్నావ్‌?’’ అంది వెంటనే.
‘‘ ఏం లేదు బామ్మా! మాది ప్రొఫెషనల్‌ కోర్స్‌ కదా! మా సీనియర్స్‌ మా దగ్గర సెల్‌ నెంబర్ల్లు తీసుకొని పిచ్చి, పిచ్చి మెసేజ్‌లు పంపి ఏడిపించే అవకాశం వుందట.. అందుకే చేతన మొబైల్‌ తేవద్దని గుర్తు చేస్తోంది’’.అంది స్నేహిత.
            అవునా అన్నట్లు తన విహంగ వీక్షణాలను స్నేహితపై నిలిపి అక్కడే నిలబడింది బామ్మ.
            ‘‘దారియ్యవే బామ్మా! నేను వెళ్తాను.’’ అంది స్నేహిత. 
            గోమతమ్మ పక్కకి తప్పుకోగానే ` నోట్‌బుక్‌, పెన్నూ వెతుకుతూ పాటపాడుతోంది స్నేహిత. గోమతమ్మ బుగ్గన చేయి పెట్టుకొని, పాటవింటూ ఓచోట కూర్చుని మనవరాలినే చూస్తోంది. 
            ‘‘ధీర, ధీర, ధీర మనసాగలేదురా! చేర రార శూర సొగసందుకో దొర! అసమాన సాహసాలు చూడ రాదునిద్దుర! నియమాలు వీడి రాణి వాసమేలుకోర ఏక వీర ధీర…..శశిముఖితో సింహమే జంటకడితే మనమేగా… కుసుమముతో ఖడ్గమే ఆడగా… మగసిరితో అందమే అంటుకడితే అంతేగా… అణువణువూ స్వర్గమే అయిపోదా… శాసనాలు ఆపజాలని తాపముందిగా… చెఱసాలలోన ఖైదుకాని కాంక్షవుందిగా…శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్రచేసి….’’ అంటూ పాటలో కొన్ని వాక్యాలను మరచిపోయినా స్నేహిత గొంతులో ఆపాట తియ్యటి ధారలా సాగుతోంది. 
              గోమతమ్మ ఎప్పుడూ లేనంతగా ఆశ్చర్యపోతూ ఊపిరి బిగబట్టింది. అంతేకాదు ఆమె గుండెలో ఉద్విగ్నమైన సన్నటి గీర… బరువుతో కూడిన నిట్టూర్పు…..       

    ‘పిల్లలేకదా! మనకు తెలియకుండా వీళ్లకేం తెలుసని మనమనుకుంటాం కాని…. పక్క మనిషికి కూడా తెలియని, అంతుచిక్కని భావుకత వీళ్లలో గోప్యంగా దాగి, పిలవకముందే పలుకుతుంది.తెలియని వాళ్లు దీన్ని భావ నిధి అనుకుంటారేమో కాని, ఇది నిజంగా నిధి కాదు. బుడుంగున మునిగిపోయే సుడిగుండం. దుమ్ముతో చెలరేగి వీచే పెనుగాలి… పరిసరాల మార్పుకి, పరిస్థితుల ప్రభావానికి లొంగి అమ్మో! అమ్మో! దీని పాటలు, దీని వాలకం చూస్తుంటే ఇది చదవటానికి వెళ్తుందా? లేక ఇప్పుడు కాలేజీలో ఎవడు కన్పిస్తే వాడ్ని ప్రేమించటానికి వెళ్తుందా? దిక్కుమాలిన ఈ వేగమేంటి? ఈ పాట లేంటి?’ అని గోమతమ్మ మనసులో అనుకుంటుంటే ఆమె చూపులు స్నేహితకు గుచ్చుకుంటున్నట్లనిపించి…
            ‘‘ బై! బామ్మా!’’ అంటూ ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకొంది. పండిన పండులా పసుపు రంగులో మెరిసే బామ్మ బుగ్గల్ని రోజుకొక్క సారైనా నిమరందే వూరుకోదు స్నేహిత.  బామ్మ ఏదో మాట్లబోయే లోపలే…
            స్నేహిత బయటకొచ్చి యూనివర్శిటీ క్రాస్‌ రోడ్డు వరకు నడచి చేతనను కలిసింది.  ఖాళీ ఆటో ఆగగానే … ‘‘వాగ్ధేవి కాలేజి’’ అంది చేతన.  ఆటో వాడు ఎక్కమన్నట్లు తలవూపి, ఇద్దరికి ఎంతవుతుందో చెప్పాడు. వాళ్లు కూర్చోగానే ఆటోని పోనిచ్చాడు. 
            చేతన, స్నేహిత` ‘వాగ్ధేవి కాలేజి’లో బి.ఫార్మసి మొదటి సంవత్సరంలో జాయిన్‌ అయ్యారు.  ఇంటర్‌మీడియట్‌ రెండు సంవత్సరాలు కూడా వాళిద్దరు ఒకే కాలేజిలో చదివారు.  వాళ్లు తొలిసారి కలుసుకున్న క్షణాలు ఎంత బలమైనవో తెలియదు కాని ఆ క్షణం నుండి మంచి స్నేహితులయ్యారు.. మొదటిరోజు కాబట్టి సీనియర్స్‌తో ర్యాగింగ్‌ వుంటుందన్న భయం ఆ ఇద్దరిలో వుంది. 
            అంతలో ఓ అబ్బాయి రోడ్డు పక్కన నిలబడి ఆత్రంగా ఆటోవైపు చూస్తూ చేయి వూపాడు.  ఆటో ఆగింది.  ఆ అబ్బాయి ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా తండ్రి వయసు వున్న ఒకాయన్ని ఆటోవైపు నడిపించాడు.  చేతన వైపు చూసి కాస్త జరగమన్నాడు.  ఎందుకో ఆ పెద్దాయన వైపు చూసింది చేతన. ఆయనకి ఆరోగ్యం బాగలేనట్లు, అర్జంట్‌గా హాస్పిటల్‌కి తీసికెళ్లడం కోసం వస్తున్నట్లు అర్థం చేసుకొంది. వెంటనే స్నేహిత వైపు జరిగి, ఆయన్ని కూర్చోబెట్టటానికి స్థలం ఇచ్చింది చేతన… ఆయన ఆటోలో కూర్చోగానే ఆ అబ్బాయి తేలిగ్గా ఓనిట్టూర్పు వదిలి, వెళ్లి ముందుసీట్లో ఆటో అతని పక్కన కూర్చున్నాడు. 
            ఆరోగ్యం బాగుండకపోవటం వల్ల ఆయన స్థిరంగా కూర్చోలేక కళ్లు తిరిగినట్లై, నెమ్మది,నెమ్మదిగా చేతన మీదికి ఒరుగుతున్నాడు.  మొదట్లో భయపడిన చేతన ఆ తర్వాత ఆయన తలకి తన భుజాన్ని ఆసరాగా వుంచింది. ఆటోలో కూర్చున్న క్షణం నుండి పడిపోతానేమోనన్న భయంతో ఆయన చేతన చేతిని వూతగా పట్టుకొని కళ్లు మూసుకున్నాడు.  ఆయన చేతిలోంచి తనచేతిని తియ్యకుండా అలాగే వుంచింది చేతన.
            స్నేహిత కాస్త ముందుకి వంగి చేతన వైపుకి తిరిగి ఆయన్ని పరిశీలనగా చూసింది.ఆయన వేషదారణను బట్టి ` బాగా డబ్బున్న వాడిలా వున్నాడు. కానీ అంతకు మించిన సంస్కారిలా అన్పిస్తునాడు.  జ్వర తీవ్రత వల్ల వణుకుతున్నాడు.  ‘అయ్యో! పాపం!’’ అనుకొంది మనసులో….
            ఆ అబ్బాయి మాత్రం ఆయనెలా వున్నాడో వెనక్కి తిరిగిచూడాలన్న ధ్యాసలో లేడు. ఒకటికి రెండు సార్లు సెల్‌ఫోన్‌లో టైం చూసుకుంటూ హాస్పటల్‌ రాగానే ఆటో వాడిని ఆపమన్నాడు.  ఆటో ఆగగానే కిందకి దిగి    ఆటో ఆతనికి డబ్బులిచ్చి వెనక సీట్లోంచి ఆయన్ని దించబోయాడు.  ఒక్కడికి సాధ్యం కాలేదు.    
             ఆయన చేతిలో చేతన చేయివుంది. ఆమె దాన్ని విడిపించుకోబోయింది.  వీలుకాలేదు. ఆయన శరీరం వణుకుతూ తడితేనే పడిపోయేలా వుంది.  అది గమనించి, ఆయన తోటి ఆమెకూడా దిగింది.  ఆ అబ్బాయి కృతజ్ఞతగా చూశాడు. ఆయన అడుగు వెయ్యాలంటే తూలి పడబోతున్నాడు. ఆయన్ని నడిపించి హాస్పిటల్లోకి తీసికెళ్లటం ఆ అబ్బాయి ఒక్కడి వల్ల కావడం లేదు.  ఆయన పక్కన ఆసరాగా నిలబడి, ఆయన్ని పట్టుకొని నడిపిస్తూ హాస్పిటల్‌ వైపు కదిలింది. చేతన..
            విస్మయంగా చూస్తూ.‘‘నువ్వెక్కడికే వెళ్తున్నావ్‌?’’ అంది స్నేహిత.  
            … కొద్దిగా తలతిప్పి పూర్తిగా వెనక్కి చూడకుండానే ‘‘ఈ సార్‌ని హాస్పిటల్‌ వరకు వదిలేసివస్తా. ఆగవే!’’ అంది చేతన.  
             అది విని ఆటోవాడు విసుగ్గా చూస్తూ తొందరపడ్తుంటే భయంగా చూసి… ‘‘మరి నేను కూడా దిగనా?’’ అంది స్నేహిత. 
            ‘‘వద్దు, వద్దు నువ్వెళ్లు.  నేను వేరే ఆటోలో వస్తా…’’ అంది ఆయన్ని అతి జాగ్రత్తగా నడిపిస్తూ చేతన. అది చూసి….
            ‘‘ప్చ్‌! దీంతో ఎప్పుడూ ఇదే బాధ. తన అవసరం ఎక్కడ వుంటే అక్కడే ఆగిపోతుంది.  ‘మానవత్వమా నువ్వెక్కడే?’ అంటే చాలు! ‘ఇక్కడే నీ పక్కనే, నేనే,’ అన్నట్లు ప్రవర్తిస్తుంది.  చచ్చిపోతున్నా…’’ అని తనలో తను అనుకుంటూ తల కొట్టుకొంది స్నేహిత.  ఆటో వేగంగా వెళ్లి, కాలేజి దగ్గర రోడ్డు మిాద ఆగింది. ఆటో దిగి, 
కాలేజిలోకి వెళ్లి చేతన కోసం ఎదురు చూస్తూ ఓ చోట నిలబడింది స్నేహిత.
            హస్పిటల్లోకి వెళ్లగానే ఆయన్ని ఓ చోట కూర్చోబెట్టారు.  కూర్చున్నాక కూడా ఆయన చేతన చేతిని వదలటం లేదు.  నెమ్మదిగా చేయి విడిపించుకొని కాలేజీకి వెళ్లాలని ఆయన పక్కన కూర్చుంది చేతన.  ఆయన వాలిపోతున్నట్లు వెంటనే ఆమె భుజంపై తలపెట్టుకొన్నాడు.  ఆయన ఒళ్లు కాలిపోతోంది.  కంగారుపడ్తూ ఆ అబ్బాయి వైపు చూసింది చేతన.
            అతను అటు తిరిగి నర్స్‌తో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత…. ముఖం అదోలా పెట్టుకొని, తలవంచుకొని, పెదవిని కొరుకుతూ, మొబైల్‌ని బయటకి తీశాడు. నెంబర్‌ నొక్కి చెవిదగ్గర పెట్టుకొని అటు, ఇటు తిరుగుతూ అవతల నుండి సమాధానం రాకపోవటంతో విసుగ్గా చూసి,మళ్లీ అదే నెంబర్‌కి ప్రయత్నించి, అసహనంగా, మొబైల్‌ను జేబులో పెట్టుకుంటూ చేతన వైపు చూశాడు.
            ‘‘ఈయన్ని త్వరగా డాక్టర్‌ దగ్గరకి తీసికెళ్లండి!’’ అంది చేతన ఆ అబ్బాయి నే చూస్తూ 
            ‘‘డాక్టర్‌ గారు రావటానికి ఇంకో రెండు గంటలు పడ్తుందట…’’ అన్నాడు. 
            ‘‘అయ్యో! ఇప్పుడెలా?’’ అంది చేతన. 
              చేతన వైపు ఆలోచనగా చూశాడు.  ఈ అమ్మాయి తనపాటికి తను వెళ్లకుండా ఇలా వచ్చిందీ అంటే ప్రస్తుతం ఏ పని లేని మనిషై వుంటుంది. అంకుల్ని ఈ అమ్మాయికి అప్పజెప్పి వెళ్తేసరి అనుకున్నాడు.  వెంటనే వంగి ఆయన చెవిదగ్గర ముఖం పెట్టి…. ‘‘అంకుల్‌! అంకుల్‌!’’ అన్నాడు.
            ఆయన మౌనంగా కళ్లు మూసుకొని వున్నాడు. అంతే!

            ఆ అబ్బాయి వెంటనే చేతన వైపు చూసి… ‘‘నేనిప్పుడే వెళ్లి! వీళ్ళబ్బాయిని పంపిస్తాను.  ఫోన్‌ చేస్తే కలవట్లేదు.  అతను కాకతీయ మెడికల్‌ కాలేజిలో ఫోర్త్‌ ఇయర్‌ మెడిసిన్‌ చేస్తున్నాడు.  బహుశా హాస్పిటల్‌ల్లో వున్నాడేమో అతని నెంబర్‌ కూడా మీకిస్తాను.  ఆలస్యం అయితే ఫోన్‌ చెయ్యెచ్చు….నేను అర్జంట్‌గా కాలేజికి వెళ్లాలి.  అందుకే మీ హెల్ప్‌ తీసుకోవాలనుకుంటున్నాను.  నా పేరు హేమేంద్ర.’’ అన్నాడు. ఆమె నోరు విప్పి ఏదో అనబోతుంటే వినకుండా.
            ‘‘ మీరింకేం చెప్పొద్దు.  ప్లీజ్‌! ప్రభాత్‌ వచ్చేంత వరకు అంకుల్‌ దగ్గరే కూర్చోండి! ’’ అంటూ ఒక్కక్షణం కూడా ఆగకుండా వెళ్లిపోయాడు.
            అవాక్కయి, అయోమయంగా చూసింది. 
            పైకి చెప్పుకోలేకపోతోంది కాని, టైంకు కాలేజీకి వెళ్లలేకపోతున్నానన్న టెన్షన్‌ ఆమెను కుదురుగా కూర్చోనీయటం లేదు.  అక్కడ స్నేహిత ఒంటరిగా ఎంత భయపడ్తుందో? ఇక్కడేమో ఈయన్ని చూస్తుంటే జాలిగా వుంది.  వీళ్ళ అబ్బాయి ఎప్పుడొస్తాడో? తనెప్పుడు కాలేజీకి వెళ్తుందో? అలాగే కూర్చుని… నిమిషాలు గడుస్తుంటే బెంగ ఎక్కువై , తనేంటి ఇలా ఇరుక్కుంది? అనుకొంది.         
            పేషంట్లు వస్తున్నారు.  వాళ్లతోపాటు తోడుగా ఎవరో ఒకరు వచ్చి వాళ్ల పక్కన కూర్చుంటున్నారు.  ఆశ్చర్యం కాకుంటే నిజానికి ఆయనకి తాను ఏమవుతుందని ఆయన తాలూకు మనిషిలా ఆయన పక్కన కూర్చుని వుంది? మదర్‌ థెరిస్సా లాగ ఫీలవ్వకపోయినా ఏదో చిరు తృప్తి మాత్రం మనసుకి హాయిగా అన్పిస్తోంది.
            అంతవరకు చేతన చేయి పట్టుకొని భద్రతా భావంతో కూర్చుని వున్న ఆయన పేరు ధనుంజయరావు.  ఆమె చేయి వదలి నెమ్మదిగా తలను గోడకు చేర్చి, ఒకసారి మెళ్లగా కళ్లు తెరచి, మళ్లీ మూసుకున్నాడు బాధగా…. ఆయన జ్వర తీవ్రత వల్ల బాగా నీరసించినట్లు కనిపిస్తున్నాడు.  దాహంగా వుందన్నట్లు చేతిని నోటికి దగ్గరికి పోనిచ్చి చేతన వైపు చూశాడు. ఆమె వెంటనే బయటకెళ్లి వాటర్‌ బాటిల్‌ తెచ్చి తాగించింది.  నీళ్లు తాగాక కళ్లు తెరచి ఆమెనే చూస్తూ ‘‘నువ్వెవరి అమ్మాయివి?’’ అని అడగాలనుకుకొని మాట్లాడే శక్తి లేనివాడిలా ఆగిపోయాడు. 
            … ఆయనకి కొద్ది, కొద్దిగా గుర్తొస్తోంది.  భార్య పెళ్లికి వెళ్లటం,  ప్రభాత్‌ కాలేజికి వెళ్లటం, అంతవరకు బాగానే వున్న తనకి జ్వరం రావటం… బయట ఎక్కడో ఫ్రెండ్‌ రూంలోవుండి చదువుకుంటున్న హేమేంద్ర  రోజులాగే కాలేజీకి వెళ్లేముందు తన ఇంటికి టిఫిన్‌ తినటానికి వచ్చి, బాగలేని తనని చూసి హాస్పటల్‌కి తీసుకురావటం…. ఆటోలో తనొక అమ్మాయి పక్కన కూర్చోవటం… ప్రస్తుతం ఆ అమ్మాయే తోడుగా వుండటం…!!!.
            పేషంట్లు పెరుగుతున్నారు.  డాక్టర్‌ గారింకారాలేదు.  ముందు రోజు చూపించుకున్న పేషంట్లు లాబ్‌ వైపు వెళ్లి టెస్ట్‌కోసం రక్తం, మూత్రం ఇచ్చి వస్తున్నారు.  కొంతమంది రిపోర్టులు పట్టుకొని వచ్చి, కూర్చునేస్థలం లేక నిలబడ్డారు.  ఎదురుగా కన్పిస్తున్న నర్స్‌ పేషంట్ల ఎత్తు, బరువు చూసి, బి.పి. చెక్‌ చేసి రాసి పంపుతోంది.  శారీరక బాధ మహా చెడ్దది అన్నట్లు అక్కడ నిరీక్షిస్తున్న పేషంట్లలో సర్వం తెలిసిన వాళ్లున్నారు.  ఏమీ తెలియని వాళ్లున్నారు.  తెలిసీ, తెలియని వాళ్లున్నారు.  ఎవరి బాధ వాళ్లది. ఆకలై ఏడ్చే పసిపిల్లలు…ఆపుకోలేక స్వేచ్చగా దగ్గే వాళ్లు…. బాధను భరించలేక సన్నగా మూలిగేవాళ్లు…సహనం లేని నర్స్‌  కోపానికి బలై మౌనంగా చేష్ఠలుడిగి, నిస్సహాయంగా చూస్తూ సంయమనం పాటించే వాళ్ళు, ఇంట్లో టి.వి. చూడనట్లు, హాస్పిటల్లో వున్న టి.వి.వైపు కళ్లప్పగించిచూసే వాళ్లు. అదో కొత్త ప్రపంచంలా అన్పించింది చేతనకి…

– అంగులూరి అంజనీదేవి

(ఇంకావుంది)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

రచయిత్రి పరిచయం:

 పేరు    :    అంగులూరి అంజనీదేవి

తల్లిదండ్రులు    :    మామిడేల వెంకటసుబ్బమ్మ , రాఘవయ్య

పుట్టిన తేది     :    ఏప్రిల్‌ 19

భర్త    :    అంగులూరి అంజనేయులు

విద్యార్హతలు    :    బి.ఎ. తెలుగు లిటరేచర్‌

1. ప్రచురించబడ్డ కథలు (25)    :    ఇరువై ఐదు

 2.కథల సంపుటాలు (1)    :    జీవితం అంటే కథ కాదు (2009)

నవలలు  :  

* మధురిమ (ప్రగతి వీక్లీ సీరియల్‌ ` 1981)
*నీకు నేనున్నా . . . (డైరెక్టు నవల`2008)
*మౌనరాగం (నవ్య వీక్లీ సీరియల్‌` 2009)
*ఈ దారి మనసైనది (స్వాతి వీక్లీ సీరియల్‌ `2010)
*రెండోజీవితం (స్వాతి వీక్లీ సీరియల్‌`2011)

కవితా సంపుటాలు (1)    :

 గుండెలోంచి అరుణోదయం (1986)

*    పొందిన పురస్కారాలు (2)    :

 1) ‘ఉమ్మెత్తల’ సాహిత్య అవార్డు

2) 22`04-2010 లేఖిని సంస్థ వారి యద్దనపూడి సులోచనారాణి గారి
మాతృమూర్తి పురస్కారం (నవల)

3) 26`01`2012 హెల్త్‌కేర్‌ ఇంటర్‌నేషనల్‌ వారి ‘జాతీయ పురస్కారము’

4) 06`05`2012 ‘న్యూస్‌ మేకర్‌ సెలబ్రెటీ పురస్కారం’

*   ఆకాశవాణిలో    :    కడప ఆకాశవాణి కేంద్రం వాళ్లు నా కథానికల్ని,కవితల్ని
ప్రసారం చేస్తూ నా వాణిని అనేక సార్లు వినిపించడం జరిగింది.

23`03`2012 వరంగల్‌ ఆకాశవాణి వారు నిర్వహించిన కవి   సమ్మేళనంలో పాల్గొని కవితను వినిపించడం జరిగింది.

*నాగురించి నేను    : 

 ఎన్నో నిద్రలేని రాత్రుల్లో ఆలోచించి, ఆలోచించి, తపించి, తపించి, తపస్సు చేస్తే కురిసిన అక్షరాలే నా కవితలు, కథలు, నవలలు.
స్వశక్తితో ముందుకు సాగాలి. ఆత్మ ప్రేరణతో మనిషి ఉత్తేజం పొందాలి అని చెప్పడం కాదు. ప్రస్తుతం నేను చేస్తున్నది అదే… ఏ బేషజాలు లేకుండా మాట్లాడే వాళ్లే నాకు నచ్చుతారు. నిజాయితీగా వుండేవాళ్లు కూడా.. కానీ స్నేహం చేద్దామంటే అలాంటి వాళ్లు దొరకరు…
మౌనం మనిషిని ప్రపంచం నుంచి వేరుచేస్తుంది… సంబాషణ అవసరం.
అందుకే నేను చెప్పవలసింది వుంటేనే నోరు విప్పుతాను…
ద్వేషాన్ని ద్వేషంతో ఎప్పటికీ ఎదురించలేము, ప్రేమే దానికి సరైన ఔషదం…
నన్ను ఎవరైనా ప్రేమిస్తే బావుండు అనే భావన నుండి బయటపడి నన్ను నేను ప్రేమించుకునే స్థాయికి ఎదిగాను. అదే ఇప్పటి నా ఎదుగుదలకి కారణం…. ప్రస్తుతం నా వృత్తిలో జీవితాన్ని చూసుకుంటూ, ప్రవృత్తిలో నా ఆశలకి జీవం పోసుకుంటున్నాను.

*  నాకు నచ్చిన ఆలోచన :  

 మన కన్నా గొప్పవారిని ఎప్పుడూ అగ్నిహోత్రంలా భావించాలి. వారికి అత్యంత సన్నిహితంగా ఎప్పుడూ వెళ్లకూడదు. దగ్దమైపోతాము. అలా అని దూరంగా వుండకూడదు. మనస్సు గడ్డ కట్టుకు పోతుంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

6 Responses to ఎనిమిదో అడుగు – కొత్త ధారావాహిక ప్రారంభం !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో