మా అమ్మమ్మ గారిల్లు

             మా అమ్మమ్మగారిది కాకినాడ ,జగన్నాధపురం. గొల్లపేటలో ఇల్లు . తాటాకిళ్లు ,పెంకుటిళ్లు పోయి డాబా లొచ్చాయి తప్ప ఆ సందు అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది . ఇంటి బైట గేదెలు ,పేడ ,రొచ్చు . కారులో గాని ,ఆటోలో గాని వెళ్తే వీధి చివర దిగిపోయి నడచి వెళ్ళాల్సిందే. ఆ సందు లోంచి రోడ్డు మీదికొచ్చి ఎడం వైపు చూస్తే చారిటీస్ స్కూలు భవనం కనబడుతుండేది . అది హైస్కూలని నా కప్పటికి తెలీదు అలాంటి స్కూల్లో పెద్ద పెద్ద చదువులు చదవాలి అని అనుకొంటూవుండేదాన్ని . రోడ్డుకు కుడివైపు ఐదారిళ్ళ అవతల రేలంగి వెంకట్రామయ్య గారి ఇల్లు వుండేది .బైట నిల్చుంటే కన్పించేలా ఆ ఇంటి హాలులో ఆయన ఫోటోలు  చాలానే ఉండేవి,రేలంగి గారి చెల్లెల్ని మా అమ్మ ‘అక్కా’ అని పిల్చేది. అలా వెళ్తున్నప్పుడు నన్ను లోపలికి తీసుకెళ్ళి వాళ్ళిల్లుచూపించింది .

        మా అమ్మ ఒక్కరోజు మాత్రమే వెళ్ళి మానేసిన బడి చారిటీస్ స్కూల్. మా అమ్మ తన బాల్యం గురించి చెప్తూ సిపాయిల గుడారాలు గురించి చెప్పేది .బహుశా రెండవ ప్రపంచ యుద్దపు రోజులు కావచ్చు ,స్కూల్ గ్రౌండ్స్ లోనూ ,స్కూల్ ఎదుట రోడ్డుకి అవతల ఖాళీ స్థలాల్లోనూ బోలెడన్ని గుడారాలు ఉండేవట ,.బడికి సెలవులిచ్చేసారట ,మా అమ్మ స్నేహితులు పిల్లలంతా కలిసి అక్కడికెళ్ళి కంచెబైట నిల్చుని సిపాయిల్ని చూసేవారట. పెద్ద పెద్ద కళ్ళు ,బూరె బుగ్గలు ,పొడవైన జుట్టుతో ఉన్న మా అమ్మను పిల్చి సిపాయిలు బిస్కెట్లు ,రొట్టెల పేకెట్లు ఇచ్చేవారట .
           మా అమ్మ తన చిన్నప్పటి ఇంకో జ్ఞాపకం చెప్తుండేది.వాళ్ళ మేనమామతో కలిసి కాకినాడ నుంచి రాజమండ్రికి ప్రయాణం చేసిందట.రాజమండ్రి చేరేసరికి  మూడు రోజులు పట్టిందట .పడవలోనే వంటలు ,భోజనాలూనట . పడవలో వండిన తాజా చేపల వేడి వేడి పులుసు ఎంత బాగుండేదో చెప్పేది.నది ఒడ్డున చెట్లు ,చేమలు ,సూర్యోదయాలూ అస్తమయాలు ,నదిని కోసుకొంటూ ప్రవాహానికి ఎదురుగా పడవ నడక ,అక్కడక్కడ మజిలీలు – ఓ కథలాగా చెప్పేది . నేను మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునేదాన్ని .

                                                                                   అప్పట్లో ,అంటే నా బాల్యం నాటికి మావూరి నుంచి కాకినాడకి బస్సులు రోజుకి ఒకటో రెండో ఉండేవి ,మా నాన్న వ్యవసాయం ప్రారంభించి బండి ,ఎద్దులు కొన్నాక కాకినాడకి అన్నవరం లాంటి తీర్ధ ప్రదేశాలకి సొంత బండిలోనే వెళ్ళేవాళ్ళం ,ఆ రోజుల్లో సవారీ బండి ఉండడమంటే ఈ రోజుల్లో కారు ఉన్నంత . మా అమ్మ తెల్లవారు ఝామునే లేచి వంట చేసేసేది ,బండి కింద చిక్కంలో అన్నం గిన్నె ,పప్పు ,పెరుగు ,తినుబండారాలు సర్దేది .పిల్లలం మాకు స్నానాలు చేయించి మంచి బట్టలు వేసేవారు . చద్దన్నాలు తినేసి సిద్దమయ్యేవాళ్ళం. మా అమ్మ మంచి జరీ చీర కట్టుకుని ,ఒళ్ళంతా నగలు అలంకరిచుకుని ,బారెడు జుట్టు దువ్వి జిలేబిముడి వేసుకుని ,ఆ ముడి చుట్టూ పూలు పెట్టుకుని

పాలేరు రాజన్న మళ్ళీ అంతా సరిచేసేవాడు ,అంతా ఎక్కింతర్వాత బండి మీదికి ఒక్క గెంతులో ఎక్కేసి ఎద్దుల్ని అదిలించేవాడు . ఇంటికి కాపలాగా నా నమ్మ వుండిపోయేది.రాజన్న వెనక మా నాన్న ,నాన్న పక్కనో ఎదుటో అమ్మ కూర్చునేవారు ,నే నెప్పుడూ కాళ్ళు కిందికి వేసుకుని వెనకాతల కూ ర్చొనేదాన్ని ,మా పెద్ద చెల్లి ,తమ్ముడుకి చెరోపక్కా చిన్నచెల్లి  ,చిన్న తమ్ముడు హాయిగా నిద్రపోయేవారు ,దారి పొడవునా కంచెల నిండా గులాబీ రంగు బఠానీ పూలు,నీలిరంగు శంఖం పూలు లాంటి రకరకాల పూలు గుత్తులు గుత్తులుగా ఉండేవి . కట్టమూరుకీ , పెద్దాపురానికి మధ్యలో మరీ ఉండేవి .
రాజన్నతో చెప్తే అక్కడ బండి ఆపి పూలు ,ఆకులు కోసి ఇచ్చేవాడు . వాటమైన ఓ రాయి ముక్కో ,పెంకుముక్కో ఏరి తెచ్చి బండిలో పూలన్నీ అలంకరించి పూజ ఆట ఆడేవాళ్ళం , ప్రసాదాలకి మా అమ్మ తెచ్చిన పాకుండలు ,జంతికలు లాంటి తినుబండారాలు ఎలాగు ఉండేవి .

                                                                        ఎద్దుల్ని అదిలించి పరుగులెత్తించడం ,కొట్టడం ఇష్టముండేది కాదు మా నాన్నకి , అందుకని అవి మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ హాయిగా నడుస్తూండేవి. మాకు రెండు జతల ఎద్దులుండేవి.ఒక జత ఎర్రవి ,మరో జత  తెల్లవి,ఎర్ర ఎద్దులకి రాముడు ,లక్ష్మణుడు అనీ ,తెల్ల ఎద్దులకి భరతుడు,శత్రుఘ్నుడు అని నేనే పేర్లు పెట్టేను .తెల్ల ఎద్దులు బాగా ఎత్తుగా ఉండేవి . వాటికి కడితే బండి వెనక్కి తేలిపోయేది . అందుకని మా ప్రయాణాలకి రామ లక్ష్మణులే బండిని లాగేవి.
పెద్దాపురానికీ ,సామర్లకోటకీ   మద్యనున్న పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోగానే బండి విప్పేసి ఎద్దుల్ని నీళ్ళకి రోడ్డవతలి చెరువులోకి తోలుకెళ్ళేవాడు రాజన్న ,ఇప్పుడక్కడ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ,ఎత్తైన భారీ విగ్రహం నిర్మించబడ్డాయి. అప్పట్లో పాండు రంగాలయం నిత్యం పూజలతో చాలా ప్రసిద్దంగా వుండేది . అప్పట్లో పాండురంగడు ,జగన్నాధుడు ,కామాక్షి వంటి మూర్తుల ఆరాధనలే కాదు ఇళ్ళల్లో పేర్లు కూడా పెట్టబడేవి ,ఇప్పటి అయ్యప్ప ,సాయి బాబాల్లాగా.
పాండురంగాలయం  ఆవరణ నిండా చల్లని నీడనిచ్చేచెట్లు ఉండేవి . ఆవరణలోనూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని పూజ చేయించే వారు అమ్మా నాన్న ,పూజారిగారు అందరికీ ఆకులనిండా పులిహోరో ,చెక్కెరపొంగలో ప్రసాదం ఇచ్చేవారు. మా నాన్నా,రాజన్నా  చెట్లక్రింద భోజనాలకి అన్ని సర్దుతుండగా మా అమ్మ నన్ను వెంట తీసుకుని రోడ్డుదాటి  అవతలిపక్కకి వెళ్ళేది. అక్కడికి కొంతదూరంలో ఓచిన్న గుంతలాంటిది వుండేది . అది కాకమ్మ గుండం గుడి అట ,అక్కడ చేతులు జోడించి కాస్సేపు నిలబడి తిరిగొచ్చేవాళ్ళం . ఆ కాకమ్మ అత్తా ఆడపడుచుల ఆరళ్ళన్నీ భరించి ,భర్తతో సహగమనం చేసిందట. సహగమనం అంటే ఏంటో తెలిసింతర్వాత నాకు భలే భయం వేసేది.మా అమ్మ రమ్మన్నా నేను రాను పొమ్మనేదాన్ని ,కాకమ్మ కధకూడా ఒక ద్విపద కావ్యం ఉండేది .
మా వీధిలో అత్తలు కొందరికి ఆ కథంటే చాలా ఇష్టం ,నా చేత చదివిస్తే కధ చివరికొచ్చేసరికి ముక్కులు చీదుతూ ,పైట కొంగుల్తో కళ్ళు తుడుచుకుంటూ “మొగుడే లేకపోయేక ఎదవ బతుకెందుకమ్మా “అని నిట్టూరుస్తూ వుండేవారు . అందులో గొడుగోరత్తకి అప్పటికి నలభైఏళ్లు వాళ్ళా యనకి ఎనభైఏళ్ళు ,ఆవిడ రోజూ చేసే పూజలు, వ్యాఖ్యానాలు విని ఆ ముసలాయన పోతే ఈవిడతప్పకుండాసహగమనం చేస్తుంది అనుకునేదాన్ని ,ఆయన పోయేక వున్న ఇల్లు అమ్మేసి పుట్టింటికెళ్ళిపోయి చాలా కాలమే బతికింది . సరే , ఇక రాజన్నతో బాటు అందరం భోజనాలు కానిచ్చి తిరిగి బయలుదేరేవాళ్ళం ,ఇంచుమించు పొద్దువాలే వేళకి ,లేదా ఇంకొంచెం ముందుగా అమ్మమ్మ గారింటికి చేరుకునే వాళ్ళం  .
               అమ్మమ్మ వాళ్ళది మూడుగదుల తాటాకిల్లు .దక్షిణ ముఖంగా ఒకదాని పక్కనొకటి ఉత్తరాన్ని పూర్తిగా ఆక్రమించిన ఇల్లు ,ఇంటిముందు పెద్ద నేరేడుచెట్టు ,ఇంటికి మూడింతలుండే ఖాళీ స్థలం ,బండిని అక్కడ విప్పేవారు . అప్పట్లో – వస్తున్నట్లు ముందుగా కబుర్లంపే అవకాశాలు లేక నేరుగా వెళ్ళిపోవడమే. అందరూ మమ్మల్ని చూసి ముందు ఆశ్చర్యపోయి ,తర్వాత ఆనందంగా పరుగెట్టుకొచ్చేవారు. ఒకోసారి బస్సులోనూ వెళ్ళేవాళ్ళం . ముఖ్యంగా నాకు సెలవలు రాగానే అమ్మమ్మగారిల్లే నా వేసవి విడిది . అమ్మమ్మ ,తాతయ్య ,ముగ్గురు మామయ్యలు (ఒక మామయ్య ఉద్యోగరీత్యా వేరే ఊళ్లోనూ ,ఇంకో మామయ్య మాఇంట్లోనూ వుండేవారు ),పెద్దత్త,పిన్ని  అంతమంది అదే ఇంట్లో.
తూర్పువైపు చివరిగది వంటగది ,మధ్యగది పెద్దమామయ్య వాళ్ళ పడకగది. పడమటి వైపు చివరిది తాతయ్యవాళ్ళది. రాత్రి ఆగదిలో ఉన్న పందిరి మంచం మీదే అందరం ఇరుక్కునే వాళ్ళం . రాత్రి భోజనాల తర్వాత మానాన్న మా ఊరెళ్ళి పోయే వారు . మావయ్యలు వాకిట్లో మంచాలమీద పడుకునేవాళ్ళు ,వర్షాకాలమైతే ఎదురింటివాళ్ళ పెద్ద అరుగులమీద .
ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం,తాతయ్య పైడా జమిందార్ల దగ్గర దివాన్ గా ఉండేవాడట. మా అమ్మమ్మ బోలెడంత బంగారం పెట్టుకుని కళకళ లాడిపోయేదట ,అయిదుగురు కొడుకులు ,ఇద్దరాడ పిల్లలు , వచ్చీ పోయే చుట్టాలకి నాలుగైదు రకాల నీచుకూరల్తో భోజనాలు ,అన్నిటికీతోడు మా తాతయ్య పేకాటపిచ్చి కుటుంబాన్ని ఆర్ధికంగా దెబ్బతీసిందని అనుకునేవారు . పైడా వారితో కలిసి దిగిన ఫోటోలలో తాతయ్యకి జుట్టుముడి, ముక్కుకి,చెవులకి బంగారుపోగులు ఉండేవి ,చేతిలో బెత్తంతో కుర్చీలో కాలుమీద కాలేసుకుని కూర్చున్న తాతయ్య భలే ఠీవిగా ఉండేవాడు ,నాకు ఊహ తెలిసేసరికి తాతయ్య పోగులు తీసేసాడు . జుట్టుకూడా క్రాఫ్ చేయించుకున్నాడు ,పొద్దున్నే స్నానంచేసి ,పట్టుబట్ట  కట్టుకుని  తిరుచూర్ణం పెట్టెతో అరుగుమీద కూర్చునేవాడాయన . చిన్న అద్దంలో చూసుకుంటూ చాలాసేపు దిద్ది దిద్ది తిరునామం పెట్టుకునే వాడు. పిల్లలం మమ్మల్ని పిల్చి ఆయన దగ్గరున్న వెండి గులిమిపుల్లతో మాచెవుల్ని శుభ్రం చేసేవాడు.. మాకు కూడా తిరునామాలు దిద్దిమురిసి పోయేవాడు. అప్పటికింకా మా పెద్దమామయ్యకి పిల్లలు పుట్టలేదు . నేనే  మొదటిమనవరాల్ని .
      మా రెండో మామయ్యక్కడే మెట్రిక్ చదువుకున్నాడు . మిగతా నలుగురూ పెద్దగా చదువుకోలేదు . అందరూ కాకినాడలో ఉన్న రామదాసు మోటార్స్ లో పనిచేసేవారు . నాకిష్టమని సాయంకాలం వస్తూ వస్తూ తలా ఒక పొట్లం జీడిపప్పు పకోడీ ,పాపిడి స్వీటు మెయిన్ రోడ్డులో ఉన్న నేతి మిఠాయి షాపు నుంచి కొనుక్కోచ్చేవారు “నువ్వొస్తేనే తెస్తారు చూడు ,నాకెప్పుడూ తెచ్చిపెట్టరు ” పిన్ని మూతి ముడుచుకుని అనేది . వాళ్ళిం ట్లో తను అందరికన్నా చిన్నది .
“పోనీలేపిన్నీ , మనిద్దరం పంచుకుని తిందాం” అనేదాన్ని నేను .
“ఈ పిల్ల సరిగా అన్నం తినదు కదమ్మా ,అవన్నా తిననియ్ ” అనేది అమ్మమ్మ .
అమ్మమ్మగారి వాకిట్లో తూర్పున ఐదారు తాటి చెట్లుండేవి . వాటిని కల్లుతీసే వాళ్ళకి అమ్మేసారు ,ఉదయం,సాయంకాలం కల్లుతీసే ఆసామి వచ్చి నడుముకు సైకిలు టైరు,పాదాలకు రబ్బరుపట్టీ వేసుకుని చెట్లెక్కడం ,కల్లుకుండలు మార్చడం, దిగడం చూడ్డానికి గొప్పసాహసకృత్యంలా ఉండేది .. పండిన నేరేడు పళ్ళు వాకిట్లోను ,రాత్రిపడుకున్న మంచాలమీద రాలిపడి ఉండేవి . వాటిని చెంబుల్లోకి ఏరి నీళ్ళతో కడిగి తినడం బలే బావుంటుంది. అమ్మమ్మగారి వాకిట్లో నిలువెత్తు రంగూన్ జాడి ఉండేది . వాడుక నీళ్ళు వీధి కుళాయిలనుంచి పట్టి తెచ్చి దాంట్లో నింపుకునేవారు . మగవాళ్ళు ఆ జాడీ దగ్గర ఉన్న రాతిపలకల మీద నిలబడి స్నానాలు చేసేవారు ,ఆడవాళ్ళకి చిన్న తాటాకుల దడి ఉండేది . స్నానం చేసి ఇంట్లోకి వచ్చేలోపల కాళ్ళ నిండా మట్టి అంటుకుపోయేది . దానికి తోడు ఆ మట్టిలో పుష్కలంగా కరెంటు చీమలొకటి ,మా మమ్మ వాళ్ళింట్లో నాకు అస్సలు నచ్చనిది కక్కసు లే కపోవడం.ఆడా మగా అందరూ చెంబులు పట్టుకుని రెండు వీధులకవతల ఉన్న సాముహిక మరుగుదొడ్లకి వెళ్ళేవారు . భరించలేని దుర్గంధం ,ఆపైన కూర్చుంటే కింద తొట్టెలో పడిపోతామేమోనని భయం వేసేది, ఆ తొట్టెలు నిండేవరకు శుభ్రం చెయ్యక పురుగుల్తో నిండిన ఘోరమైన దృశ్యం,నేను కళ్ళు,ముక్కు మూసుకుని కూర్చుంటే నా గోల పడలేక పాపం మాపిన్ని నన్ను గట్టిగా పట్టుకుని నిల్చునేది .
ఇంటికి తిరిగి వచ్చేక పాదాల్ని తోమీ తోమీ కడుగుతుంటే “అయ్యో,మా నీల్లన్నీ వొంపేయ్యకమ్మా ,మళ్ళీమోసి తెచ్చుకోలేం . ” అని అందరూ నవ్వుతుండేవారు . మామయ్యల్లో ఎవరు బజారుకెళ్తున్నా నన్ను తీసుకొని వెళ్ళేవారు . అమ్మమ్మగారింట్లో రోజూ మాంసాహారం ముఖ్యంగా సముద్రపు చేపలు వండేవారు,నాకిష్టమని రోజూ పీతలు కూడా తెప్పించేది అమ్మమ్మ ,ఉడకబెట్టిన పీత డెక్కలు సుత్తితో కొట్టి నాకు తినిపించేది పిన్ని,ఉప్పు ,కారం చాలా తక్కువ వేసి నాకోసం పీతలకూర చేసేది అమ్మమ్మ .
“ఈవిడేమన్న ఇంటికి మహారాణీయా ?ఈపిల్లకోసం అందరం చప్పటి కూరలు తినాలా “అని సరదాగా గొడవచేసేవాడు మా చినమామయ్య . అప్పట్లో జగన్నాధపురం పార్క్ చాలా బాగుండేది, తీరిక దొరికితే చిన్నమామయ్య నన్నక్కడికి తీసుకెళ్ళి ఆడించేవాడు ,తర్వాత తర్వాత నేనే వెళ్లి కూర్చుని వస్తూండేదాన్ని . ఇక బజార్లో బుల్లిబుల్లి పీతలు సముద్రపు ఒడ్డునలాగా వేల సంఖ్యలో పరుగులు పెడుతుండేవి ,వాటిని చూడ్డం భలే బావుండేది ,అలా చూస్తూ నిలబడి పోతే మామయ్య బలవంతంగా లాక్కొచ్చేవాడు .
                   అమ్మమ్మ గారింటికెళ్ళేటప్పుడు నెక్లెస్ ,జూకాలు,జడగంటలు ,నాగారం,చేమంతిపువ్వు పెట్టుకుని వెళ్ళినా అమ్మమ్మ’కాకినాడలో కాపలా కాయలేం ‘ అంటూ అవన్నీ విప్పిదాచేసేది .మా ఆఖరి మామయ్య  ఎప్పుడూ “నువ్వు మా అక్క వాళ్ళ అమ్మాయివికాదు , మన్యం సంతలో దొరికేవు”అని ఏడిపిస్తూ ఉండేవాడు . ఇంకా ఏడిపించడానికి “మీ నాన్నని మీ ఊర్లో పోలీసులు పట్టుకున్నారంటా “అనేవాడు .( ఆ రోజుల్లో చిన్న పిల్లలకి పోలీసులంటే చాలా భయం ఉండేది) .  అంతే నేను ఆపకుండా  రాగం మొదలుపెట్టి ఇంటికెళ్ళిపోతానని కదం తొ క్కేసేదాన్ని ,అమ్మమ్మో ,పెద్ద మావయ్యో ఎవరో ఒకళ్ళు చిన్న మావయ్యని తిట్టి , ఒకోసారి కొట్టి నన్నూరుకోబెట్టేవాళ్ళు . (అలాంటి చిన్న మావయ్య పదేళ్ళ క్రితం పోయినప్పుడు తను ముఖ్యమైన వస్తువులు దాచుకొనే ట్రంకు పెట్టె మూతలోపలి వైపు నా టీనేజ్ ఫోటో ఒకటి అంటించి ఉండడం చూసి నా మనసు కలత చెందిపోయింది ). ఒకోసారి నాన్న మీద బెంగతో జ్వరం వచ్చేసేది . కబురు పంపేవాళ్ళు కాబోలు మరుక్షణం మా నాన్నొచ్చి నన్ను ఇంటికి తీసుకొఛెసెవారు.

                                                           ఓసారి మా అమ్మమ్మకి వీపు మీద రాచపుండు వేసిందని జనరల్ హాస్పిటల్లో చేర్పించారు . రెండు మూడు సార్లు ఆవిడను చూడ్డానికి హాస్పిటలుకి వెళ్లేం . పిల్లల్ని లోపలికి రానిచ్చేవారుకారు . కారిడార్లోనే ఉండిపోయేవాళ్ళం ,అక్కడ తెల్లగౌనుల్లో ,తెల్లచీరల్లో తిరుగుతున్న నర్సులు ,డాక్టర్లు నాకు చాలా నచ్చే వారు. అప్పుడే నిశ్చయించేసుకుని అందరికీ చెప్పేసేను పెద్దయ్యాక నర్సునో ,డాక్టర్నో అవుతానని. అమ్మమ్మకి నయమై ఇంటికొచ్చిందని తెలిసి మళ్ళీ వెళ్ళేవాళ్ళం.నేను బండి నొగలో నిలబడి ఉన్నాను ,అమ్మమ్మ వాకిట్లో నిలబడి కట్టువిప్పి ఇంకా మానీ మానని ఎర్రని పుండు అమ్మకి చూపిస్తోంది . అటు చూసిన నాకేమైందో తెలీదు కళ్ళుతిరిగి ఫట్ మని ముందుకి పడ్డాను ,మెలకువొచ్చేసరికి ఆవీదిలోనే ఉన్న హాస్పిటల్లో ఉన్నాను. బండి కాడి కొట్టుకుని నుదుటిమీదా ,పెదవికిందా గాయాలు. కట్టుకట్టి ఇంటికి తీసుకొచ్చేరు . అప్పుడే తెలిసిందినాకు -నేను గాయాల్ని ,రక్తాన్ని చూసి తట్టుకోలేనని, అమ్మ ,మామయ్యలు అంతా నవ్వులు “ఈవిడ పెద్దయ్యాక నర్సో, డాక్టరో అవుతుందంట . ఉన్నట్టుండి మా తాతయ్యకి బాగా లేదని కబురొచ్చింది . అందరం వెళ్లేం . అంతకుముందే మాట పడి పోయిందట.. ఏవేవో సైగలు చేస్తూ ఉండేవాడు. నన్ను మంచం పక్కన నిలబెడితే నా వేపు తదేకంగా చూస్తూ నాతల నిమిరేడు , చూస్తూండగానే కళ్ళల్లోంచి ప్రాణాలు తరలిపోయాయి . నేను అంతదగ్గర్నుంచి చూసిన మొదటి మరణం అదే,అప్పటికి నేను మూడోతరగతిలో ఉన్నాను. పరీక్షలని నాన్న నన్ను తీసుకుని మర్నాడు ఇంటి కొచ్చేసారు. ఆ రాత్రి వాకిట్లో మంచం మీద నిద్రపోతున్న నాదగ్గరికి పొట్టిగా మంచం అంత ఎత్తులో పెద్ద తలకాయ, కోరల్తో ఉన్న ఓ చందమామ రాక్షసుడు వచ్చి గోళ్ళతో రక్కినట్టై పెద్దగా అరుస్తూ లేచి కూర్చున్నాను. అంతే,పదిరోజులు జ్వరంతో పడకేసాను. మా నాన్నమ్మ రక్షపోగులు కట్టించి, విభూది బొట్లు పెట్టి వెయ్యి దేవుళ్ళకి మొక్కి నన్నంటిపెట్టుకుని కూర్చుంది, “అసలే అర్భకం పిల్ల,ఇలాంటి పిల్లని సావుకాడికి తీసుకెల్తారా !”అని ఒకటే సనుక్కునేది . అప్పట్లో ఇప్పుడున్నన్ని మందులు, డాక్టర్లు లేక పిల్లలకి ఏ అనారోగ్యం వచ్చినా చాలా భయపడిపోయేవారు పెద్దవాళ్ళు .*

– కె . వర లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to మా అమ్మమ్మ గారిల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో