ఏంజిల్ ఐలాండ్ (Angel Island)
ఏంజిల్ ఐలాండ్ శాన్ ప్రాన్ సిస్కో చుట్టు పక్కల ఉన్న అన్ని ద్వీపాలలో కెల్ల పెద్దది. 19 వ శతాబ్దపు ప్రారంభంలో సైనిక అవసరాలకు మాత్రమే వాడిన ఈ ద్వీపం ప్రస్తుతం జాతీయ చారిత్రక ప్రదేశం గా ఉంది.
ప్రయాణం: ఏంజిల్ ఐలాండ్ మా ఇంటి నుంచి నలభై, ఏభై మెళ్ల దూరం లో ఉంది. అక్కడికి వెళ్లడానికి రెండు, మూడు దారులు ఉన్నాయి. ఫెర్రీలు శాన్ ప్రాన్ సిస్కో, టిబ్యురాన్, వాలెహో ల నుంచి ఉన్నాయి. మా ఇంటి నుంచి శాన్ ప్రాన్ సిస్కో నే దగ్గర అయినా అక్కడి నుంచి పడవ ప్రయాణం ఎక్కువ దూరం. అదీగాక శాన్ ప్రాన్ సిస్కో లో పడవ ఎక్క వలసిన చోట కారు పార్కింగు బాగా ఖరీదు ఎక్కువ. ఇదంతా సరే అయినా చివరి నిమిషపు ప్రయాణాలకి అక్కడి నుంచి టిక్కెట్లు దొరకవు. ఇన్ని కారణాల వల్ల ప్రతి గంట గంటకూ పడవ లు తిరిగే టిబ్యురాన్ ఫెర్రీ నుంచి ఎక్కుదామని నిర్ణయించుకున్నాం. అయితే ఈ ప్రయాణమూ కష్టసాధ్యమేనని వెళ్లొచ్చాక అర్థమైంది. ఒకే రోజు వెళ్లొచ్చే ప్లాను వల్ల కనీసం పది గంటలకు టిబ్యురాన్ లో ఉండాలని ఇంటి నుంచి తొమ్మిదింటికి బయలుదేరాం. శాన్ ప్రాన్ సిస్కో సిటీ దాటి గోల్డెన్ గేట్ బ్రిడ్జి మీంచి ఉత్తరానికి మరో పదిహేను మైళ్లు వెళ్లాలి మేం. అయితే శాన్ ప్రాన్ సిస్కో సిటీ లో వీకెండ్ ట్రాఫిక్ జాము-ల గురించి మర్చిపోయాం.
పొగ మంచు ప్రవాహం: గోల్డెన్ గేట్ బ్రిడ్జి దాటే సరికి పదకొండున్నర అయ్యింది. ఆ రోజు దట్టం గా పొగ మంచు పట్టింది. బ్రిడ్జి మీద తమాషాగా ఆ కాస్త మేరే. పొగమంచంటే అలాంటి ఇలాంటి పొగమంచు కాదు. బ్రిడ్జి దాట గానే వచ్చే కొండ మీద నుంచి స్పష్టం గా పొగ మంచు ప్రవాహమేదో ప్రవహిస్తున్నట్టు అటు కొండ మీంచి ఇటు సముద్రమ్మీదకో, ఇటు సముద్రమ్మీంచి అటు కొండ మీదకో వేగంగా పోటెత్తుతున్న మేఘసమూహం. అది దాటగానే కారులో బయటి నుంచి చూస్తే అక్కడేదో నదీ ప్రవాహం రహదారి కడ్డుగా ఆకాశం మీంచి ప్రవహిస్తోంది అనుకుంటాం. అద్భుతమైన ఆ దృశ్యపారవశ్యంలో మునిగి తేలుతూ ట్రాఫిక్ వల్ల కలిగిన ఆలస్యమంతా మరిచిపోయేం. టిబ్యురాన్ చేరేసరికి భోజనాల వేళ అయ్యింది.
మేం బోట్ కి టిక్కెట్ల కోసం లైనులో అరగంట నిలబడ్డాం. మరో గంట తర్వాత వెళ్లే బోట్లో టిక్కెట్లు తీసుకుని భోజనం కోసం పక్కనే ఉన్న హోటళ్ల లో అన్నిటి కన్నా త్వరగా తినేందుకు వీలున్న హోటల్ కోసం పదిహేను నిమిషాలు వెతకవలసి వచ్చింది. అన్నీ జనం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. మొత్తానికి ఒక హోటల్ లో, ఉన్న సమయంలో త్వరగా భోజనం కానిచ్చి పడవ లోకి పరుగెత్తేం. పుల్లని బ్రెడ్డు, వెన్న, ఫ్రైడ్ చికెన్, మేకరానీ చీజ్, కాసిన్ని ప్రెంచ్ ఫ్రైస్.. అంతే. నిజానికి సీఫుడ్ పుష్కలంగా దొరికే ఇలాంటి చోట స్థిమితంగా కూర్చుని నచ్చిన సీఫుడ్ ఆర్డరు చేసుకుని తింటాం కానీ అలా భోజనం చేసే అవకాశం ఈ సారి మాకు దొరక లేదు.
ఏంజిల్ ద్వీపం: అక్కడ వేచి ఉన్నంత సేపు లేదు ప్రయాణం. సరిగ్గా అరగంట లో ఎదురుగా కనుచూపుమేర దాదాపు రెండు గంటల నుండి కనిపిస్తూ మురిపిస్తున్న ఏంజిల్ ద్వీపం మీదకు అడుగుపెట్టాం. బోట్ ఆగిన ప్రదేశం నుంచి కుడివైపుకు కొద్దిగా నడిస్తే ఒక కెఫె వస్తుంది. అందులోనే ద్వీపమంతా తిప్పి చూపించే బస్సు టిక్కెట్లు అమ్ముతారు. చాలా పెద్ద లైను ఉండడం వల్ల సత్య ఒక్కడూ లైను లో నిలబడ్డాడు. పిల్లల్ని తీసుకుని నేను బయటంతా ఎండగా ఉండడం వల్ల కాస్త నీడను వెతుక్కుంటూ ముందుకు నడిచి, ఇంకాస్త ముందు బీచ్ ను ఆనుకుని ఉన్న మ్యూజియం ఎదురుగా కాస్త నీడ ఉన్న చెట్టు కింద కూలబడ్డాను. చల్లని నీళ్లల్లోకి దిగి అందరు పిల్లలూ ఆడుతున్నా మార్చుకునేందుకు బట్టలు తెచ్చుకోనందున నేను పిల్లల్ని నీళ్లలోకి వెళ్లనివ్వలేదు. దాంతో కాస్సేపు అలిగినా అంతలోనే అన్నీ మరిచిపోయి అక్కడక్కడే గడ్డిలో పరుగులెడుతూ ఆడడం మొదలుపెట్టేరు. పోలిక లేకపోయినా నాకు కాటలీనా ఐలాండ్ జ్ఞాపకం వచ్చింది. అలా మరో గంట నిరీక్షణ తర్వాత సత్య మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి బస్సు బయలుదేరుతుందని చెప్పాడు. మేం పరుగున వచ్చి చేరేం.
ఆ ద్వీపం మీద నిజానికి ఊరంటూ ఏమీ లేదు. ఎప్పటివో ఉన్న పాతకాలపు శిధిలావస్థ లో ఉన్న భవంతులు తప్ప. దాదాపు గంట సేపు తిరిగే టూరులో భీముని పట్నంలోని భవంతులను పోలిన కూలిపోతున్న, తలుపు లేని కట్టడాలు కొన్ని కనిపిస్తాయి. కాకపోతే ఇవి బాగా పెద్దవి.
ఇమ్మిగ్రేషన్ చెకింగు: 1910-1940 మధ్య కాలంలో ఈ ద్వీపంలో ఇతర దేశాల నుంచి ముఖ్యంగా చైనా నించి వలస వచ్చే వారిని శాన్ ప్రాన్ సిస్కో లో అడుగు పెట్టే ముందు ఇమ్మిగ్రేషన్ చెకింగు పేరిట ఇక్కడ ఉంచే వారట. ఎన్నో సంవత్సరాల నుంచి శాన్ ప్రాన్ సిస్కో లో నివాసమున్న వారైనా ఒక సారి స్వదేశానికి వెళితే వచ్చేక మళ్లీ ఈ మెట్టు దాటాల్సిందే. అయితే ఈ ఎదురు చూపు ఒక్కో సారి నెలలు దాటి సంవత్సరాలు కూడా పట్టేదట. ఇక్కడ అలా వేచి ఉన్న గృహాలు 1970 లో తీసి వేసెయ్యవలిసి వచ్చినపుడు ఇక్కడి చెక్క గోడల మీద కత్తితో చెక్కిన వందలాది చైనీ కవితలు బయటపడ్డాయట. వాటిలో కొన్ని చదివినప్పుడే అప్పటి ఇమ్మిగ్రేషన్ సిస్టం లోని లోటు పాట్లు బయటి ప్రపంచానికి తెలిసాయట.
మిస్సైల్ సెంటర్: ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ స్థలాన్ని యుద్ధ సన్నాహాలకు, సైనిక శిక్షణకు, మిస్సైల్ సెంటర్ గాను వాడే వారట. అలాగే యుద్ధ సమయంలో జబ్బు పడిన వారిని ఇక్కడ క్వారెంటైన్ లో ఉంచేవారు. క్రమంగా కేవలం క్వారంటైన్ స్టేషన్ గా మాత్రమే ఈ ద్వీపాన్ని వాడి, ఇతర కార్య క్రమాలన్నీ శాన్ ప్రాన్ సిస్కో కి మార్చి వేసారు.
1960 ల లో ఈ ప్రాంతాన్ని సంరక్షిత స్టేట్ పార్కుగా మార్చి వేసారు. ఇక్కడ ఒకప్పటి మిస్సైల్ సెంటర్ ను తుప్పు పట్టిన దశలో ఇప్పటికీ సందర్శకులు చూడొచ్చు. మా బస్సు టూరులో మాత్రం ఎక్కడా దిగనివ్వరు కాబట్టి దూరం నుంచి చూసి సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ ద్వీపంలో స్వయంగా ఏదైనా చూడాలనుకుంటే అద్దెకు దొరికే సైకిళ్లు తీసుకుని తిరిగి రావాల్సిందే. ఒక విధంగా ట్రెక్కింగు, సైక్లింగు ఎక్కువ దూరాలకు నడవాలనుకునే వారికి మంచి అవకాశం ఇక్కడ. కానీ మాలా చిన్న పిల్లల్ని తీసుకుని సాయంత్రానికి గూటికి చేరాలనుకునే వారికి ఈ బస్సు టూరు బెస్టు.
అద్భుత దృశ్యాలు: బస్సు టూరులో దిగువన కనిపించే అద్భుత దృశ్యాలు – దిగువన అందమైన నీలి కెరటాల మెరిసే అలల తళుకులు, అందులో చిన్నప్పటి కత్తి పడవల్లాంటి బుల్లి తెరచాప పడవల విన్యాసాలు, చుట్టూ కనుచూపుమేర పర్వతాలమీద వదిలి వచ్చిన పట్టణపు పాదముద్రలుగా పొట్టి పొట్టి భవంతులు ఆస్వాదిస్తూ ముందుకెళితే ద్వీపాంతరంలో ఏవో గాథల్ని వినిపించే ఎప్పటివో కట్టడాలు, జ్ఞాపకాలు పొరలై రాలుతున్న గోడల మీద ప్రతిఫలిస్తూ ఎవరివో హృదయ స్పందనలు. అడుగడుగునా దట్టమైన యూకలిప్టస్ చెట్లు, పేర్లు తెలీని దట్టమైన పొదలు, ఉన్నట్టుండి ఏమీ లేని ఎండు గడ్డి కొసల చిన్న మైదానాలూను. ఒకటి రెండు చోట్ల మాత్రం ఫోటోలకు ఆపుతారు. అక్కడి నుండి కనబడే శాన్ ప్రాన్ సిస్కో నగరాన్ని, గోల్డెన్ గేట్ బ్రిడ్జిని ఫోటోలు తీసుకోవడానికే పనిగట్టుకుని చాలా మంది వస్తుంటారు. అయితే ఆ రోజంతా దూరంగా ఆ నగరానికి, ఈ ద్వీపానికి మధ్య కమ్మిన పొగ మంచు వల్ల మాకు సరిగా ఏ దృశ్యమూ కనిపించలేదు. అయితే అదీ ఒక విశేషమే. కేవలం భవంతుల, బ్రిడ్జి కొసలు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతమంతా అటూ ఇటూ మబ్బు మింగి మధ్య కొంత మేర మాత్రం ఆకాశం లో హఠాత్తుగా మొలిచిన సుందర సరళ రేఖ మీద వెండి వెలుగుల కుంచె తో గీసిన కొసల వర్ణణా చిత్రం భలే బావుంది చూడడానికి. ద్వీపం లో కెల్ల ఎత్తైన పర్వత శిఖరాన్ని Mount Caroline Livermore అని పిలుస్తారు. డిసెంబరు నెలలో ఆ శిఖరమ్మీద నుంచి సుదూరాలకూ వెలుగులు విరజిమ్మే విద్యుద్దీపాలను వెలిగిస్తారట.
2008 లో దావానలం పుట్టుకొచ్చి ద్వీపంలో దాదాపు మూడవ వంతు అటవీ ప్రాంతమంతా దహించుకుపోయింది. ఉదయం నుంచి సాయంత్రానికి ఆర్పివేయగలిగారు కాబట్టి పాత కాలపు భవంతులన్నీ కాపాడగలిగారట.
కేవలం మైలున్నర పొడవు వెడల్పు కలిగిన ద్వీపంలో చరిత్ర మాత్రం విసృతమైనది.
సుదీర్ఘ ఎదురు చూపు: బస్సు టూరు అయ్యాక విజిటింగ్ సెంటర్ లో ఉన్న మ్యూజియం, వీడియో సెషన్లు చాలా ఆసక్తికరమైన విషయాల్ని చెప్తాయి. ఇక్కడ గోడలపై రాసిన కవితల్లో కొన్ని వినిపించినపుడు హృదయం ద్రవించకమానదు.
సుదీర్ఘ ఎదురు చూపు, ఒంటరి బందీతనం, అనుకున్న తీరాలకు చేరాలని ఎంతో దూరం అష్టకష్టాలకోర్చి సముద్ర ప్రయాణం చేసి వచ్చాక ” దేవుడు వరమిచ్చినా పూజారి తలుపు తెరలేదన్నట్లు” ఆ ద్వీపంలో చిక్కుబడి ఆత్రంగా గడపడం చివరి నిమిషం వరకూ ఉండి వెనక్కు వెళ్లిపోవలసి వస్తుందేమోనన్న వ్యధా వేదన. ఇవన్నీ కళ్లకు కట్టినట్లయ్యి మనకూ ఆ వ్యధ చుట్టుకుంటుంది.
ఇక్కడ ఉన్న తండ్రితో కలిసి బతకడానికొచ్చిన కొడుకుని ఆ కాలంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని ఆ వీడియోలలో దర్శనమిస్తాయి. మీ ఇంటికి ఎన్ని కిటీకిలు ఉండేవి? మీ వీధిలో ఎన్ని ఇళ్లు ఉండేవి? లాంటి ప్రశ్నలకు ఇద్దర్నీ విడి విడిగా చేసే ఇంటర్వ్యూలలో ఒకే సమాధానం రాకపోతే వెనక్కు వెళ్లిపోవాల్సిందే. అసలు ఆ ప్రశ్నలు ఎంత అవక తవకగా ఉండేవంటే వీసా రావడమంటే అదొక లాటరీలాగా భావించేవారట. ఒక్కో సారి నిజంగా కొడుకు కాకపోయిన వ్యక్తి కూడా ఈ ప్రశ్నలకు పరీక్షకు కూచున్నట్టు బాగా ప్రిపేర్ అయ్యి వీసా లభించి రాగలిగేవాడట.
నిజానికి ఇప్పుడు అటువంటి ప్రశ్నలు అడగకపోవచ్చు, అలా ద్వీపంలో వేచి చూడాల్సి రాక పోవచ్చు. కానీ వీసా నిబంధనలు ఇప్పుడు మాత్రం ఏం మారాయి? గంటల తరబడి నిరీక్షణలు, కఠిన నిబంధనలు. వీసా దేవుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చెయ్యాల్సి వస్తోందంటేనే అర్థం అవుతోంది కదా! మానవ ప్రయత్నాన్ని మించిన మానసిక శక్తి అవసరమని మనుషులు భావిస్తున్నారని.
కవిత: ఇక అక్కడి కవితల్లో ఒకటి-
Being idle in the wooden building, I opened a window.
The morning breeze and bright moon lingered together.
I reminisce the native village far away, cut off by clouds and
mountains.
On the little island the waiting of cold, wild geese can be
faintly heard.
The hero who has lost his way can talk meaninglessly of the
sword.
The poet at the end of the road can only ascend a tower.
One should know that when the country is weak, the people’s
spirit dies.
Why else do we come to this place to be imprisoned?
……………
ఈ చెక్క కట్టడాలలో పనీ పటా లేకుండా ఉన్న నేను కిటికీని తెరిచాను
తెల్లారగట్ల చల్లని గాలీ, సిరివెన్నెల కాంతి పెనవేసుకునున్నాయి
మేఘాల వెనుక, పర్వతాలు మూసివేస్తున్న చోట
నా పల్లె జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్నాను
నీటి బాతుల హీన స్వర ఘోష వినిపిస్తున్న ఈ ద్వీపంలో
మంచు చల్లని వేచిచూపు-
దారి తప్పిపోయిన నాయకుడు
ఖడ్గం గురించి అర్థంలేని ప్రేలాపనలు చేస్తాడు
కవి చిట్టచివర కి కేవలం చిన్న గుట్టని మాత్రమే అధిరోహిస్తాడు
దేశం బలహీనమైతే
స్పూర్తి మరణించినట్లే
ఈ ప్రదేశంలో ఖైదు కావడానికి తప్ప ఎందుకొచ్చాం ఇక్కడికి?
** ** **
తిరుగు ప్రయాణం: ప్రపంచంలో మనుషులు ఎన్ని రకాలైనా మనస్సులలోని దు:ఖమొకటే. ఈ ద్వీప గాథ విన్నాక అక్కడి కన్నీళ్లన్నీ మన కంట్లోకి ప్రవహించక మానవు.సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో తిరుగు పడవ ఎక్కాం మేం. అరగంట లో టిబ్యురాన్ లో దిగాం. వెనక్కి చూస్తే ఎదురుగా అదే నిశ్చల దరహాసంతో “ఏంజిల్ ద్వీపం” . ఎందుకో కాస్సేపు ద్వీపాన్ని చూస్తూ అక్కడే ఉండాలనిపించింది. పడవ దిగిన ప్రదేశం నుంచి కుండి చేతి వైపుగా కొంచెం ముందుకి నడిస్తే ద్వీపం పూర్తిగా కనిపిస్తుంది. అక్కడి నుండి రెండు చేతులూ చాచితే ద్వీపం మొత్తం రెండు చేతుల కొసల మధ్య నే ఉన్నట్లుంటుంది.తిరుగు ప్రయాణం లో మరలా బే బ్రిడ్జి మీద ట్రాఫిక్ జాం లో మామూలుగానే ఇరుక్కున్నాం. అయినా పొద్దుట్నించీ మనసంతా నిండిన ఆహ్లాదపు అనుభూతితో, గుండె బరువెక్కిన గాథలతో అలా ఎక్కువ సేపు ప్రయాణం చెయ్యడమే బాగా అనిపించింది. గోల్డెన్ గేట్ బ్రిడ్జి రాత్రి నియాన్ కాంతుల ధగ ధగ లతో కొత్త అందాల్ని వెదజల్లుతోంది. వెనకే దూరంగా ఏంజిల్ ద్వీపం చీకటి అలలని చుట్టుకుని మాకు నిశ్శబపు వీడ్కోలు పలికింది.
-కె.గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
3 Responses to నా కళ్లతో అమెరికా-18