ఎన్‌కౌంటర్

                  మీడియా మొత్తం హడావిడి.  ప్రశ్నల వర్షం కురిపిస్తూనే వున్నారు.  కెమేరాలు రకరకాల కోణాలలో క్లిక్‌మనిపిస్తున్నాయి.

హాస్టలు చుట్టూ జనాలు ఆఫీసరుకు ఊపిరాడటం లేదు.  జర్నలిస్టుగా వెళ్ళిన నేను పరిస్థితిని అవగాహన చేసుకునే క్రమంలో గుండెల్లో నుండి ‘మాతృహృదయం’ అనే చిన్న స్పర్శ తన్నుకొని వచ్చింది.  మూడు నెలల పసిగుడ్డు.  కళ్ళు ఎంత పెద్దగా వున్నాయి.  తలంతా రింగుల జుట్టు.  చూస్తుంటే కడుపులో  దేవినట్లు వుంది.  యిక జనాల గుసగుసలు.  పాపం అప్పుడే ఆయుష్షు తీరింది.  ఏ తల్లికి మనస్సు వచ్చిందో, కన్నీళ్లు రాని వాళ్ళు లేరు.  జర్నలిస్టుగా అడగవలసిన ప్రశ్నలు అడిగాను.

పేపరు ఆఫీసుకు వచ్చాను కాని, మొక్కుబడిగా అనాధ బిడ్డ, హాస్టలులో వసతులు లేక వైద్యసేవలు లేక మృతి.  దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని

అతి సాధారణంగా వార్త వ్రాసి యింటికి వచ్చి పడుకున్నా కంటి మీదకు కునుకు రావటం లేదు  నాకు..

అటు యిటు పచార్లు చేస్తుంటే – ‘ఆడదానికి ఈ వృత్తి పనికిరాదని చెప్పినా వినిచావవు.  యింటికి ఎప్పుడు వస్తావో, ఎప్పుడు బయటకు పోతావో తెలిసి చావదు.  పోనీ యింట్లో వున్నంతసేపు హడావిడిగా వుంటావు.  ఏదో ఆలోచిస్తూ వుంటావు.  యింటి బాధ్యతలు తీసుకొని మొగుడికి యింత సుఖాన్ని యిద్దామన్న బుద్ధి లేదు.  రేపటి నుండి ఈ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం చూసుకో’. అన్నాడు విశ్వం.

ఏమిటి రోజు వుండే గోలే కదా!  అవును అసలు ఉద్యోగం వద్దు.  ఇంటిపట్టున మహాలక్ష్మిలా వుండు అని మాత్రం

అనలేదు.

వేరేఉద్యోగం చూసుకోమంటున్నాడు అంటే పెళ్ళాం సంపాదన కావాలి.  అదే ఎలాంటి సంపాదన అంటే యిటు యింటి  బాధ్యతలు అతనిమీద పడకుండా చూసుకోవాలి.  అతను పిలిచినప్పుడల్లా ఒళ్ళో వాలిపోయే భార్య కావాలి.  కాబట్టి అన్నిసమకూరే విధంగా వుండే ఉద్యోగం కావాలి.  ఎంతగా మారిపోయింది మగ సమాజం …అని మనస్సులో అనుకొని ఫన్నీగానవ్వుతూ,

‘చూడు విశ్వం, నీవు చెప్పినట్లుగా వుండటం నాకు యిష్టం వుండదు.  నా యిష్టమైనట్లుగా వుండటం, నాకు యిష్టమైన పనులుచేస్తాను అని పెళ్ళికి ముందే చెప్పాను.  అప్పుడు యిలాంటి అమ్మాయి కోసమే నేను ఎదురు చూస్తుందని తెగ మెచ్చుకొని పెళ్ళి చేసుకొని ప్లేటు మార్చి మాట్లాడుతున్నావు.  ఎంతయినా మొగుడివి కదా!  మొగుడి పాత్రలోకి ప్రవేశించాక పెళ్ళికి ముందు చెప్పిన ఆదర్శాలు, అగ్నిసాక్షిగా వదిలివేయటం మామూలే కదా!  అయినా చూడు విశ్వం.  ఈ వృత్తి అంటే నాకు చాలా ఇష్టం బురద మట్టలా మట్టిలో బ్రతికే కంటే నాగుపాములా బుసలు కొడుతూ ఛాలెంజ్‌గా బ్రతకటం నాకు యిష్టం.

యిప్పుడయినా నా వృత్తి నీకు యిష్టం లేకపోతే చెప్పు నాదారి నేను చూసుకుంటాను.’

‘అమ్మా, మహంకాళి యిక నన్ను వదిలిపెట్టు.  ఎంత ఛాలెంజ్‌ వృత్తయినా కొంచెం నీ గురించి కూడా ఆలోచించుకో.  పెళ్ళిఅయితే చేసుకున్నావు.  సరదాగా నాలుగురోజులు ఎక్కడికయినా వెళ్ళామా!  లేదే!’ అన్నాడు.

‘అవును  విశ్వం నాకు కుదరదు.  అలా నా గురించి ఆలోచించకుండా కష్టపడ్డాను కాబట్టి నేను ఆడదాన్ని అన్న విషయం మర్చిపోయి ఒక మంచి డేరింగ్‌ జర్నలిస్టుగా ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నాను.  దీనిలో వుండే తృప్తి నీకు చెప్పినా  తెలియదులే.  సరే గాని నేను వారం రోజులు క్యాంపుకు వెళుతున్నాను.  ఒక చిన్న కేసులో చాలా విషయాలు సేకరించాలి.’

‘  ఏమిటి చిన్న కేసే కదా!  వారం రోజులు కావాలా?’

‘అది కాదు విశ్వం.  ఈరోజు చిన్న బిడ్డ సంక్షేమ హాస్టలులో చనిపోయింది.  కారణాలు సరిగా చెప్పటం లేదు. 

అందుకని రిస్కు తీసుకుందామని అనుకుంటున్నాను.’

****                   ****                                ****               ****                                   ***

‘మేడమ్‌ నిన్న మీ దగ్గర బిడ్డ చనిపోయింది కదా!  కొంచెం విషయాలు తెలియాలి చెప్పండి మేడమ్‌.’ 

మహిళా సంక్షేమ శాఖ  అధికారిని అడిగాను.

‘నేను ఏమి చెప్పలేను.  మాకు పనులు ఎక్కువయ్యాయి.  బాధ్యతలు పెరిగాయి.  ఎన్నని చూసుకుంటాము.  మహిళాసంక్షేమ శాఖ అంటే అందరికి జవాబుదారి అయిపోయింది.  సంక్షేమ శాఖ కాదు సంక్షోభ శాఖగా మారింది.  ఈమధ్య వచ్చిన గృహహింస చట్టాన్ని మమ్మల్నే చూడమన్నారు.  రోజు మొగుడు పెళ్ళాల కేసులతోనే మా పుణ్యకాలం గడిచిపోయింది.  ఎన్ని కార్యక్రమాలు చూస్తాము మేము?మాకు వున్నది రెండు చేతులు, పది చేతులు చేసే పని మాకుయిస్తే మేము మాత్రం ఏం చేస్తాం.  రోజు మీ పేపరు వాళ్ళతో పెద్ద గోల.  మా శాఖ గురించి రోజు ఏదో ఒకటి రాస్తూనేవుంటారు.  ఈ కేసు విషయంలో నేను ఏమి చెప్పలేను.

పోలీసులు ఈ బిడ్డను తీసుకొని వచ్చి వదిలి నెలరోజులు అయింది.  పుట్టిన వెంటనే బిడ్డకు అందవసిన కనీస అవసరాలు అందకపోవటం మూలాన కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.  అవి పెరిగి బిడ్డ చనిపోతే తప్పంతా మాదేనని అందరూ మాట్లాడుతున్నారు.  నాకు కూడా అంత పెద్దగా వివరాలు తెలియదు.  యిక్కడ పనిచేసే ఆయాలను అడగండి విషయాలు తెలుస్తాయి.’ అని వెళ్ళిపోయింది.

***                 ****                        ***             ****                                 ***

ఆయాల దగ్గరకు వెళితే, ‘బిడ్డ వచ్చినప్పుడే చాలా బలహీనంగా వున్నాడు.  మేము మాత్రం ఏమి చేస్తాము.  యిక్కడ యాభై మంది అనాధ బిడ్డలు వుంటే యిద్దరమే ఆయాలు వుండేది.  ఒకరు పగలు ఒకరు రాత్రి డ్యూటీ చేస్తాము.  అందరుసంవత్సరము లోపు పిల్లలే.  వీళ్లందరికి సేవలు చేయటం ఎంత కష్టమో మీకు చెప్పినా తెలియదమ్మా.  యిక్కడ సరైన సౌకర్యాలు కూడా వుండవు.  ఆయుష్షు ఉన్నోడు బ్రతుకుతాడు, లేదంటే మా చేతుల్లో మాత్రం ఏముంది.  చనిపోయిన బిడ్డకు రెండు రోజుల నుండి జ్వరం, డాక్టరు దగ్గరకు తీసుకొని వెళ్ళటానికి వేరే మనిషి లేడు.  నేను వెళితే మిగతా పిల్లలను చూసుకోవటానికి ఎవ్వరూ ఉండరు.  హాస్టలు ఇన్‌చార్జికి చెప్పాను.  ఆమె కొడుకు పెళ్ళని పదిరోజులు సెలవు పెట్టింది.

యిక వేరే దారి లేక నా దగ్గర వున్న మందులు వాడితే తగ్గుతుందని వాడుతూనే వున్నాను.  రాత్రికి రాత్రి ఫిట్సు వచ్చి చనిపోయాడు.’ అని చెప్పింది ఒక ఆయా.

మరి బిడ్డను యిక్కడికి ఎవరు తీసుకొచ్చి చేర్చారు?అని అడిగాను.

” పోలీసులమ్మా.  తిమ్మాపురం పోలీసులు తీసుకొని యిచ్చి వెళ్ళారు.”

అంతే వెంటనే తిమ్మాపురం బయలుదేరాను విషయం తెలుసుకుందామని స్టేషనుకు వెళితే ఒక్కరూ లేరు.

ఆరా తీయగా అనుమానం మొగుడు భార్యను గొడ్డలితో నరికాడట.  అందరూ అక్కడనే వున్నారట.  సాయంత్రానికి

వచ్చారు.

విషయాలు సేకరించగా చాలా క్రొత్త కోణాలు కనబడుతున్నాయి.

****                     ****                        ****                           ****                                         ****

అది రాత్రి 8 గంటల సమయం.

గవర్నమెంటు హాస్పటల్‌ వెనుక గేటు సందులో నివాసం వుంటున్న ఫాతిమా చెత్తకుండీలో కసువు

పారెయ్యటానికి వెళ్ళింది.

అక్కడ చీకటిలో యాభై  సంవత్సరాల ముసలావిడ పయిటను తల చుట్టూ కప్పుకొని ఒడిలో రక్తం ఓడుతున్న పసిగుడ్డును

చెత్తకుండీలో పడవేయటానికి సిద్ధంగా వుంది, అంతలో ఫాతిమానుచూసి ఖంగు తింది.  ఫాతిమా కాళ్ళు పట్టుకొని ముసలావిడ ఏడవటం ప్రారంభించింది.

“అమ్మా, ఎవరికి చెప్పకు.  నాకు యింతకంటే గత్యంతరం లేదు.  ఈ పసిగుడ్డును చెత్తకుండీలో పడేయటానికి వచ్చాను.  నా బిడ్డ యిప్పుడే ప్రసవించింది.  నా బిడ్డకు పెళ్ళి కాలేదు.  ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఒక వెధవ మోసగించి పారిపోయాడు.

వాడు  ఎక్కడ వుంటాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు.  మేము ఏరోజుకారోజు కూలి చేసుకుంటూ గాని డొక్కాడదు.

యిప్పుడు ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి పెంచుకోలేము.  ఈ బిడ్డ వుంటే దాని జీవితం నాశనం అయిపోతుంది.  దాన్ని మాలో ఎవ్వరు చేసుకోరు.  యిక ఈ బిడ్డతో తన బతుకు తెల్లవారిపోతుంది.  దాన్ని ఎవ్వడూ పెళ్ళి చేసుకోవటానికి ముందుకు రాడు.

అలాగని దీన్ని అందరూ వాడుకోవాలని చూస్తారు.  వయస్సులో వున్నది.  మరల ఏ తప్పులు చేసినా ఆ పాపాలను యోయటం మావల్ల కాదు.  ఈరోజే మేమందరం మా ఊరు వదిలి ఎక్కడికయినా వెళ్ళిపోతాము.  కూలి చేసుకొని బ్రతికేటోళ్లము ఏ వూరు అయితేనేమి?

మాకు ఈ విషయం బయటకు పొక్కనీయకమ్మా.  దీని అమ్మకు కూడా తెలియదు దాని బిడ్డను నేను ఎత్తుకొని వచ్చింది.  నీ కాళ్ళు పట్టుకుంటాము.  ఈడ వదిలేస్తే దీనికి ఆయుష్షు వుంటే ఎవరో ఒకరు తీసుకొని బ్రతికిస్తారు లేదంటే చచ్చిపోతుంది.  ఈ పాపం నాకు తప్పదు.  మాకు చదువులు సంధ్యలు లేవు.  అదే చదువుకొని అన్నీ తెలుసుకున్న పెద్దోళ్ళు అయితే గుట్టుచప్పుడు కాకుండా కడుపు తీయించుకునే వాళ్లు.  మేము మొరటువాళ్లము.  మాకు జ్ఞానం లేదు.  కడుపొచ్చిన సంగతి గానీ , బిడ్డ ఎప్పుడు పుట్టేది గానీ తెలవదు.  కడుపులో తిప్పుతూ తిన్నది తిన్నట్లు వాంతులు అవుతుంటే కడుపొచ్చిందని, నొప్పులు వస్తే కాన్పు సమయం అన్న విషయం తెలిసేది.  అదిగాకుండా నా బిడ్డకు పట్టుమని పద్దెనిమిది  ఏళ్లు కూడా లేవు.

దానికి ఏమీ తెలియదు.  అన్ని విషయాలు పట్టించుకునే బుద్ధి మాకు లేదు.  కడుపు తీయించటానికి తెలియక బిడ్డను కనవలసి వచ్చింది.  అమ్మా, ఈ విషయం దయచేసి ఎవరికి చెప్పకు తల్లీ నీ కాళ్ళు పట్టుకుంటాను.”అని బ్రతిమాలింది ముసలావిడ.

” అదికాదమ్మా, నిజంగా నీవు చెప్పింది అంతా నిజమే అయితే ఈ బిడ్డను నేను తీసుకొని పోతాను.  నీకు

యిష్టమేనా?” అని

ఫాతిమా  అనగానే ఆ ముసలి కాళ్లు పట్టుకొని అమ్మా, చచ్చి నీ కడుపున పుడతాను.  పదమ్మా నీ యింటికాడకు ఈ బిడ్డను తెచ్చి యిస్తాను అని యింటికి వచ్చింది.

బిడ్డను ఫాతిమా చేతిలో పెడుతూ ”యిది నిజంగా అదృష్టవంతురాలు, ఏడ చచ్చిపోతుందో అనుకున్నాను.  అలాంటి నీ చేతుల్లో పడింది.  చాలమ్మా, దేవుడు దీనికి మంచి రాత రాసిపెట్టాడు, వస్తానమ్మా”

అని వయస్సు తేడా కూడా లేకుండా కాళ్ళకు దండం పెట్టుకొని పోయింది.

***                                          ***                                         ***                        ***

యిక ఫాతిమా యింట్లో బిడ్డ ఏడుపు ఇనగానే ఫాతిమా ఆనందానికి అంతులేదు.  తన యింట్లో పసిబిడ్డ ఏడుస్తుందని అసలు వూహించలేదు.  తనకి యింతటి అదృష్టం కల్పించిన ఈ బిడ్డను ముద్దుల వర్షం కురిపించింది.  కాళ్ళు నిలబడటం లేదు, తను తల్లి అయింది.  తనకు జరిగిన శాపాలన్ని మటుమాయం అయ్యాయి.  ఫాతిమా భర్త పని మీద వూరికి వెళ్ళాడు.  రెండు రోజులకు గాని రాడు.  ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు, శాపనార్థాలు, అవమానాలు, ఒంటరితనాలు భరించింది.

ఈ బిడ్డతో తన జీవితమే మారిపోతుంది.  తనను నానా మాటలు అన్న వాళ్ళు నోరు మూసుకుంటారు.  కనకపోయినా పెంచిన తల్లి అంటారు.  అంతేగాని గొడ్డుమోతు అనరు.  అది చాలు ఈ జీవితానికి సార్థకత వచ్చింది.  పోనీ పిల్లలు పుట్టే అదృష్టం తనకు జన్మతహ ప్రాప్తించలేదు.  అలాగని భర్త తన దౌర్భాగ్యాన్ని క్షణం క్షణం నిందిస్తూ యింటికి రావటానికి యిష్టపడేవాడు కాదు.

ఏమన్నా అంటే నాకోసం యింట్లో పిల్లా పాపలు వుంటే కదా యింటికి రావాలని అనిపించేది.  ఎప్పుడూ చూసే నీ దరిద్రపు ముఖాన్ని చూడటానికి రావాలి.  పోనీ యింకో పెళ్ళి చేసుకుందామంటే నీ అయ్య ఆస్తినంతా నీపేర రాసి యింకో పెళ్ళి చేసుకుంటే ఆస్తి దక్కదని రాసి చచ్చాడు.  అందుకోసం నిన్ను భరిస్తున్నాను.  లేదంటే ఈపాటికి యింకోదాన్ని చేసుకొని డజను పిల్లలను కనిపారేసే వాడిని.  నీవు నాకు పెద్ద గుదిబండ అయిపోయావు అంటాడు.  యిక అత్త, ఆడబిడ్డలు ఎన్ని మాటలు అంటారో!

వీళ్లందరికి ఫాతిమా కూలి లేని కూలికన్నా అధ్వాన్నం.  ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలని వుండేది.  కాని జీవితం అంటే యింతేనా!

నిజంగా ఆడదానిగా బ్రతకాలంటే పిల్లలను కంటేనే ఆడదా!  యింతకంటే ఆమె ఈ సమాజంలో ఏమీ చెయ్యలేదా!  సమాజంలో ఎంతోమంది అభాగ్యులు తల్లిదండ్రులు లేక అల్లాడుతున్నారు.  వాళ్ళందరికి నేను అమ్మను కాకూడదా అనిపిస్తుంది.  ఆమాట అంటే చాలు యింట్లో అందరూ యింత ఎత్తున ఎగిరారు.  శాయిబుల్లో పుట్టి, బురఖా వేసుకొని యింటిపట్టున బ్రతకక అందరికి తల్లివి అవుతావా!  అక్కరలేదు.  గొడ్డుమోతుదానివి అయితే అయ్యావు గాని నీవు ఏ సమాజ సేవ చేయొద్దు, నోరుమూసుకొని పడివుండు.  మా పిల్లలందరిని పెంచి పెద్దచెయ్యి చాలు అంటారు.  అయితే వాళ్లందరిని పెంచుతాను.  మరి వీళ్లందరి చేత నన్ను అమ్మా అని పిలిపించండి చాలు అంటే ఏమి మేము వుండగా నిన్ను అమ్మా అని ఎందుకు పిలిపిస్తాము అంటారు.

అందుకే ఈ బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చింది.  అదృష్టం నా తలుపు తట్టింది.  బిడ్డను అపురూపంగా చూసుకోవాలి.  కాలుక్రింద పెట్టకుండా సాకాలి.  అంతే ఆలోచిస్తూ వుండగానే తెల్లవారింది.

ఉదయం లేచినప్పటి నుండి ఒకటే హడావిడి.  తన అన్నను పిలిపించింది.  యింట్లో అందరిని పిలిచింది.  కుప్పతొట్టిలో బిడ్డ దొరికింది, తెచ్చానని చెప్పింది.  మొదట ఎవ్వరూ ఒప్పుకోలేదు.  కాని ఫాతిమా ఈ బిడ్డ కావాలని మొండిగా చెప్పింది.  యిక ఎవ్వరూ కాదనలేకపోయారు.  అంతే చుట్టాలందరిని పిలిపించి పెద్ద పండగలా చేసింది.  ఆ బిడ్డకు నామకరణం కూడా చేసింది.

యిక ప్రతి సెకను ఆ బిడ్డను వదలకుండా చూసుకుంటూనే వుంది.  సొంత బిడ్డను కూడా ఎవరూ సాకరు, అంతగా ఫాతిమాకు ఆ బిడ్డే ప్రపంచం అయింది.  ఏది ఏమైనా తను తల్లిని అయ్యాను అని మనస్సులో ఒకటే సంతోషం.

****                 ***                                    ****                 ***                              ****

అక్కడ ఈ బిడ్డ అసలు తల్లి అయిన అంజమ్మ పరిస్థితి అగమ్యగోచరంగా వుంది.  పురిట్లో బిడ్డ లేదని తెలుసుకొని మనస్సు మొద్దుబారిపోయింది.  మొదటిబిడ్డను అపురూపంగా తన ప్రక్కన లేకపోవటం మనస్సు తట్టుకోలేకపోయింది.  ఒక్కసారన్నా బిడ్డను తాకాలని, పొదివి పట్టుకొని బిడ్డకు పాలు పట్టాలని శరీరం తపిస్తూ వుంది.  ఆమెను ఓదార్చటం ఎవరి వల్లా కలేదు.

ఒకవేళ బిడ్డ చనిపోయిందని అనుకుంటే అంజమ్మ ఒక్కసారన్నా బిడ్డను చూపించలేదని కోపంతో వాళ్ళ అమ్మను నానా బూతులు తిడుతూనే వుంది.  ఒకటే ఏడుస్తూనే ఉంది.  ఎక్కడ శోష వచ్చి పడిపోతుందో అనిపిస్తుంది.  ఆమెను ఓదార్చటం ఎవరివల్లా కాలేదు.  నీళ్లు కూడా ముట్టటం లేదు.  ఎలాగు వాడు మోసం చేసి వెళ్లాడు.  అలాగని కన్నబిడ్డను ఎందుకు వదులుకుంటాను.  దాన్ని చూసుకొని బ్రతుకుతాను కదా!  ఆ బిడ్డకూడా దక్కలేదు అంటూ తిండి, నీళ్లు ముట్టకుండ ఏడుస్తూనే వుంది.  దాన్ని ఓదార్చటం వాళ్ల అమ్మ వల్ల కావటం లేదు.  వారం రోజులు గడిచినా అంజమ్మ పరిస్థితి మారలేదు.

బాగా నీరసం అయిపోయి మంచానికి అతుక్కుపోయింది.  ఎక్కడ చచ్చిపోతుందోనని భయం వేసింది అంజమ్మ అమ్మకు.

అందుకని గుట్టుగా తెలిసిన వాళ్ళ సలహా తీసుకొంది.  పోయి బిడ్డను తెచ్చుకొమ్మని సలహా యిచ్చారు.  ఫాతిమా దగ్గరకు వెళ్లి బిడ్డను అడిగితే ఫాతిమా యింట్లో అందరూ అసలు నీ బిడ్డ కాదు.  మాకు ఫాతిమా కుప్పతొట్టిలో దొరికిందని చెప్పింది.  నీవు చెప్పింది నిజం అని నమ్మకం ఏమిటి అని ఆమెను తిట్టి తిట్టి పోశారు.  కాని అంజమ్మ బాధను చూసి తల్లి వూరుకోలేదు.  బిడ్డను పారేయటం తప్పు అనిపించి ఎలాగయినా ఆ బిడ్డను అడిగి తీసుకొని అంజమ్మకు తన బిడ్డను దగ్గరకు చేర్చాలని అనుకున్నది.

మళ్ళీ తెలిసిన వాళ్ళకు జరిగిన విషయం చెప్పి సలహా అడిగితే, వాళ్లు ఒక పని చెయ్యి పోలీసుల దగ్గరకు వెళ్ళి అయ్యా, మేము బీదవాళ్ళం, ఆడపిల్ల పుట్టిందని దాని మొగుడు దీన్ని తిడతాడని భయపడి బిడ్డను వాళ్ళకు యిచ్చాము.  వాళ్లు బాగా ఆస్తిపరులు, బిడ్డను బాగా చూసుకుంటామని యిచ్చాము.  కాని దాని మొగుడు వచ్చి బిడ్డ లేనిది దాన్ని వాడి యింటి గడప తొక్కొద్దని అన్నాడని పోయి పోలీసులకు చెప్పి బిడ్డను తెచ్చుకో అని సలహా పడేశారు.  నిజమే అనుకున్న ఆ ముసలి పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు ఫాతిమాను, అంజమ్మను వాళ్ల యిద్దరి సంబంధీకులను పిలిపించారు.  అంజమ్మను ఎన్ని ప్రశ్నలు వేసినా నా బిడ్డ  కావాలి అంటుంది కాని ఒక్కమాట మాట్లాడదు.  పోనీ అంజమ్మ భర్త ఏడి అంటే వారి నుండి సమాధానం రాలేదు.  పెళ్ళి  కాకుండా తల్లి అయిందని తెలిస్తే యింకా గొడవ అవుతుందని ఏమీ చెప్పలేదు.  కూలి పనులకు పోయాడు చాలా దూరం.

యిప్పుడిప్పుడే రాడు అని చెప్పారు.  యిక ఫాతిమా పరిస్థితి చాలా ఘోరంగా వుంది.  ఆమె భర్త, అత్త ఆడబిడ్డలు ఆమెను చంపేస్తారన్నంత భయం వచ్చింది.  ఎలాగు గొడ్డుమోతుగా వుండవు.  పాపిష్టిదానవు.  పెంచుకుందామన్న బిడ్డ కూడా నీకు దక్కలేదు.  నీకు బిడ్డల యోగ్యత లేదు.  చచ్చినా బ్రతికినా ఒకటే నీవు.  ఎన్ని అబద్దాలు చెప్పావు, బిడ్డను నువ్వు తెచ్చుకొని కుప్పతొట్టిలో దొరికిందని చెబుతావా!  ఎన్ని రంగులు నేర్చావే!  పోనీలే తెచ్చుకుందిలే అనుకుంటే మా పరువు, మర్యాద మంటగలిపావు.  ఏనాడు యింటి గుమ్మం దాటని మమ్మల్ని పోలీసుస్టేషనుకు తీసుకొని వచ్చి మా యిజ్జతు తీస్తావా!  ఛీ ముండ యింతకంటే చావరాదా, పీడపోతుంది అన్నారు.

ఈ తతంగం చూసి యిదంతా కుదరదు.  పోలీస్‌స్టేషనులో ఈ బిడ్డను పెట్టుకొని మేము ఏమి చేసుకుంటాము.  అందుకని ఒక  పని చెయ్యండి.  అంజమ్మా నీవు మీ ఆయనను తీసుకొని వచ్చి మీ యిద్దరు సంతకాలు పెడితే బిడ్డను తీసుకొని పొండి.  యిలా పిల్లను తెచ్చుకోవటం లేదా కుప్పతొట్టిలో దొరికినా మాకు రిపోర్టు యివ్వాలి గాని యిలా తెచ్చుకోవటం నేరం.  మీమీద కేసు పెడుతున్నామని పోలీసులు చెప్పారు.  అప్పటిదాకా ఈ బిడ్డను సంక్షేమ హాస్టలులో వుంచుతాము.అంజమ్మ భర్త వస్తే బిడ్డను తీసుకొని వెళ్ళండి.  లేదంటే సంక్షేమ హాస్టలులోనే వుంటుంది.  కావలసిన వాళ్ళకు దత్తత యిస్తారని చేతులు దులుపుకొని ఆ బిడ్డను హాస్టలుకు చేర్చారు.

మరుసటిరోజే ఫాతిమా డిపార్టుమెంటుకు వెళ్లి ఆ బిడ్డను దత్తత కావాలని అడిగింది.  ఆ పిల్లను దత్తత యివ్వటానికి చట్టం ఒప్పుకోదని, యివ్వటం కుదరదని, దానికి చాలా రూల్సు వున్నాయని చెప్పింది.  ఈ హాస్టలులో యిలాంటి పిల్లలు యాభై మంది వున్నారని, వారిని దత్తత తీసుకొనటానికి వంద  మంది రెండు సంవత్సరాల క్రింద అప్లికేషను పెట్టారని, కాబట్టి అర్హత కలిగిన వాళ్ళకు ఈ పదిమంది బిడ్డలను యిస్తామని, కాబట్టి ఫాతిమాకు ఈ పిల్ల దొరకటం కుదరదని చెప్పారు.  ఆ బిడ్డను వదలలేక ఏడుస్తూ యింటికి చేరింది. 

****                                        ****                              ****                             ****
పేపర్లో ప్రత్యేక వార్త సంచలనం కలిగించింది.  ఎన్నో వర్గాలను సమస్యలను ఆలోచింపజేసింది.

ఎవరినైన నిస్సహాయులను చేసి చంపితే ఎన్‌కౌంటరు.  మరి యిక్కడ ఈ బిడ్డను అటు కన్నతల్లి, పెంచిన తల్లి దగ్గరకు తీసి అక్కున చేర్చుకొని జీవితాన్ని యివ్వవలసిన సంక్షేమ కార్యక్రమాలు కలసి ఆ బిడ్డను ఎన్‌కౌంటరు చేసారు.  ఎవరిని నిందించాలి అని విసిరిన సవాలు చాలా మందికి చెంపదెబ్బ కొట్టినట్లు అయింది.  ప్రతి పాఠకుడు తనకు తాను మనస్సులో ఎన్నో పరిష్కార మార్గాలు వెతుకుతూనే వున్నాడు.  నలుగురు కలసిన చోట చర్చ నడుస్తూనే వుంది.  ఎన్ని జరిగినా మరల ఆ బిడ్డకు జీవితాన్ని ఎవరు యిస్తారన్న ప్రశ్న వెంటాడుతూనే వుంది.  పొరపాటు ఎక్కడ?  ఈ వార్తకు ఏమి సమాధానం చెప్పాలా అని సంబంధితులు మెదళ్ళను ఆలోచింపచేస్తూనే వున్నాయి.  సమాధానాలు, పరిష్కారాలు మాత్రం బేతాళుడిలా చెట్టెక్కి కూర్చున్నాయి*

-పూసపాటి రాజ్యలక్ష్మి

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , Permalink

One Response to ఎన్‌కౌంటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో