భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

               1920 డిసెంబరులో ఆరంభమైన  సహాయనిరాకరణ ఉద్యమంలో మౌలానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసా క్రియాశీలక పాత్ర నిర్వహించారు. హిందూ, ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ఆమె ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేశారు. ప్రజలు ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే బలమైన బ్రిటీషు ప్రభుత్వాన్ని మన దేశం  నుండి తొలిగించగలమని మౌలానా దంపతులు ప్రబోధించారు. స్వదేశీయతను ప్రోత్సహించటం తోపాటు విదేశీ వస్తువులను బహిష్కరణ తదితర అంశాల విూద ఆమె పటిష్టమైన ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆ కార్యక్రమాలలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యమానికి ఊపిరిపోస్తూ అలీఘర్‌ ఖిలాఫత్‌ స్టోర్స్‌ ఏర్పాటు చేశారు.  ఈ మేరకు మౌలానా దంపతులు భారత దేశంలో  ముందుగా స్వదేశీ బట్టల వ్యాపారం ఆరంభించిన వారయ్యారు. స్వదేశీని విస్త్రుతంగా ప్రచారం చేసేందుకు నిశాతున్నీసా పలు సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలలో  ప్రసంగిస్తూ మహిళలను ఆ దిశగా ప్రోత్సహించారు. ఈ ఉద్యమంలో ఆమె నిర్వహించిన బృహత్తర పాత్రను కొనియాడుతూ 1920 మే 19నాటి యంగ్‌ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ ప్రత్యేక శీర్షిక కూడా నిర్వహించారు.

                 1920లో మౌలానా హసరత్‌ మోహాని తమ నివాసాన్ని అలీఘర్‌ నుండి కాన్పూరుకు మార్చి అక్కడ ఖిలాఫత్‌ స్వదేశీ స్టోర్స్‌ లిమిటెడ్‌ ను ప్రారంభించారు. ఈ వ్యాపార నిర్వహణలో నిశాతున్నీసా బేగం భర్తకు చేయూతనిచ్చారు. ఆరంభంలో ఈ వ్యాపారం బాగున్నా  ఆ తరువాత మౌలానా అరెస్టులు, ప్రభుత్వం ఒత్తిడి, పోలీసుల అరాచకం వలన వ్యాపారం నష్టదాయకంగా పరిణమించింది. ఆ కారణంగా ఆర్థికంగా మౌలానా ఇక్కట్లు పడాల్సివచ్చింది. 

                       ఆర్థికంగా అవస్థల పాలవుతున్నా నిశాతున్నీసా దంపతులు రైలులో మూడవ తరగతి బోగీలలోని అసౌకర్యాలను భరిస్తూ సుదీర్ఘ ప్రయాణం చేసి 1921 నాటి అహమ్మదాబాద్‌  సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చారు. అహమ్మదాబాద్‌లో ఆబాది బానో బేగం నేతృత్వంలో అఖిల భారత మహిళల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కస్తూరిబా గాంధీ, సరళా దేవిలతోపాటుగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిశాతున్నీసా మాట్లాడుతూ  స్త్రీ విద్య పట్ల  అత్యధిక శ్రద్ధ చూపాలన్నారు. మహిళలో చైతన్యం రావాలంటే ముందుగా చదువు చాలా అవసరమని భావించారు. స్వగ్రామంలో ఆడపిల్లలకు అక్షరజ్ఞానం అందించడానికి చిన్నతనంలోనే ప్రయత్నించిన నిశాతున్నీసా ఈసారి అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ వేదిక మీద నుండి ఆ అంశాన్ని ప్రకటించారు. 

                  1921లో అహమ్మదాబాద్‌ జాతీయ కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మౌలానా మోహాని  సంపూర్ణ స్వరాజ్యం  కోరుతూ చారిత్రాత్మక ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనను  బేగం నిశాతున్నీసా బలపర్చారు. గాంధీజీ వ్యతిరేకత వలన ఆనాడు ఆ ప్రతిపాదన తీర్మానం కాలేకపోయింది. ఆ సంఘటన నేపధ్యంలో 1922లో గయాలో జరిగిన మరొక సమావేశంలో ఆనాటి అంశాన్ని పురస్కరించుకుని మహాత్మాగాంధీ వైఖరిని నిశితంగా విమర్శిస్తూ ఆమె అద్భుత ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం సభికులను ఆశ్చర్యచకితులను చేసింది. ఆ సమయంలో జైలులో ఉన్న మహాత్ముడు కూడా ఆమె అభిభాషణ వివరాలను తెలుసుకుని నిశాతున్నీసా నిబద్ధతను అభినందించారు.

                    ఈ సందర్భంగా  సంపూర్ణ స్వరాజ్యం కాంక్షిస్తూ మౌలానా మోహాని చేసిన పలు ప్రసంగాల పట్ల ఆగ్రహించిన ప్రభుత్వం 1922 ఏప్రిల్‌ 14న ఆయనను అరెస్టు చేసింది. బేగం నిశాతున్నీసా మళ్ళీ న్యాయపోరాటం ఆరంభించారు. మౌలానా  కుటుంబం అలీఘర్‌ నుండి కాన్పూరుకు తరలి వెళ్ళినందున ఈ సారి ఆమె పోరు కాన్పూరు నుండి సాగింది. చివరకు  మౌలానాకు కోర్టు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు జాతీయోద్యమకారునిగా మౌలానా మోహాని అత్యధిక సమయం జైళ్ళలో గడపాల్సి రావటంతో నిశాతున్నిసా ఆర్థికంగా పలు కడగండ్లను ఎదుర్కొంటూ కూడా జాతీయ కాంగ్రెస్‌ నుండి ప్రజల నుండి వచ్చిన ఆర్థికసహాయాన్ని తిరస్కరించారు. ఈ విధంగా అన్ని  కష్టనష్టాలను సహిస్తూ పోరుబాటన సాగిన నిశాతున్నిసా ఉద్యమకారుల కుటుంబాల కు ఆదర్శంగా నిలిచారు.

                      అహమ్మదాబాద్‌ జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలనంతరం 1924 డిసెంబరు 29న మౌలానా హసరత్‌ మోహాని భారత జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. భర్తను రాజకీయ సహచరునిగా భావించిన బేగం నిశాతున్నీసా ఆయన అభిప్రాయాలను సమర్ధించారు. ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొంటూ, సంపూర్ణ స్వరాజ్యం, ప్రజల సంక్షేమం కాంక్షించే ఆ దంపతులు తమ లక్ష్యం దిశగా ముందుకు సాగుతూ, భారత కార్మికోద్యమ నిర్మాణంలోనూ భాగస్వామ్యం వహించారు.

               చివరివరకు అటు ప్రజలతో మమేకమై జాతీయోద్యమంలో, ఇటు కార్మికులతో ఏకమై కార్మికోద్యమంలో ఆమె చురుకైన పాత్రను కొనసాగించారు. 1925లో కాన్పూరులో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల సందర్భంగా జరిగిన   కార్మికుల భారీ ప్రదర్శనకు ఆమె నాయకత్వం వహించారు. ఆ తరువాత క్రమక్రమంగా నిశాతున్నీసా బేగం క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.

                      ఈ మేరకు జీవితం చరమ థ వరకు ఏదో ఒక మార్గాన బ్రిటీషు వ్యతిరేక పోరాటంలో ఆమె చూపిన తెగువ, ధైర్యసాహసాలను స్వయంగా గమనించిన మౌలానా ముహమ్మద్‌ అలీ ఆమె వ్యక్తిత్వంలోని ఔన్యత్యం మౌలానా మోహాని  కంటే గొప్పదని కీర్తించారు . ఆమెలోని ఉత్తమ గుణసంపదను మననం చేసుకుంటూ ఆనాటి ముస్లిం మహిళలలో మాత్రమే కాకుండా సమకాలీన పురుషులలో కూడా అంతటి స్థాయి కన్పించదని, మౌలానా హసరత్‌ మోహాని స్వయంగా నిశాతున్నీసా బేగం గురించిన రాసిన ఆర్టికల్‌లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

                      బేగం నిశాతున్నీసా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నా భర్తతోపాటుగా పలు ప్రాంతాలను చుట్టివచ్చారు. ఆ పర్యటనలలోని విశేషాలను, తన అనుభవాలను రాజకీయాభిప్రాయాలను అక్షరబద్ధ్దం చేస్తూ  గ్రంథాలను రాసి ప్రచురించారు.ఈ విధంగా  ప్రత్యక్షంగా తన  విలక్షణమైన వ్యవహారసరళితో, పరోక్షంగా తన భర్త అభిప్రాయాలను ప్రభావితం చేస్తూ, అటు భారత స్వాతంత్య్ర సంగ్రామంలో, ఇటు భారత కార్మికోద్యమ చరిత్రలో అత్యుత్తమ ధైర్యసాహసాలు, కార్యదక్షత, సమయస్ఫూర్తి ప్రదర్శించిన ఉద్యమకారిణిగా తనదైన ముద్రను సుస్థిరం చేసుకున్న  బేగం నిశాతున్నీసా 1937 ఏప్రిల్‌ 18న కాన్పూర్‌లో కన్నుమూశారు.

గాంధీజీ  ఆహ్వానం మేరకు నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన
అమీనా తయ్యాబ్జీ


బ్రిటీషు వ్యతిరేక పోరాటాలలో భాగంగా సాగిన  సంస్కరణోద్యమాలలో  ఆనాడు మహిళలు  చురుగ్గా పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలలో నిబద్ధతతోపాటుగా ఎంతో కార్య దక్షతను ప్రదర్శించారు. ఆ కారణంగా సమర్థత గల అటువంటి మహిళలను మహాత్మా గాంధీ స్వయంగా ఆహ్వానించి వారికి నాయకత్వపగ్గాలను అందించారు. అంతటి మహాత్తర గౌరవాన్ని దక్కించుకున్న మహిళలలో  అగ్రగణ్యులు బేగం అవిూనా తయ్యాబ్జీ.
 అవిూనా తయ్యాబ్జీ గుజరాత్‌కు చెందిన  ప్రసిద్ధ తయ్యాబ్జీల కుటుంబంలో 1866లో జన్మించారు. జాతీయ కాంగ్రెస్‌ నాయకులు జస్టిస్‌ బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ ఆమె తండ్రికాగా  జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యాబ్జీని ఆమె వివాహం చేసుకున్నారు. ఆ కుటుంబంలో ఉన్న రాజకీయ వాతావరణం మూలంగా అమీనా చిన్ననాటి నుండే స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితురాలయ్యారు. ఆమె మొదటి నుండి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు.
అవిూనాలో గల పట్టుదల గుజరాత్‌ మహిళలలో ఆమెపట్ల ఉన్న గౌరవాన్ని గమనించిన గాంధీజీ 1930 ఏప్రిల్‌ 11న ఆమె కుమార్తె రెహనా తయ్యాబ్జీ పేరిట ఓ లేఖ రాస్తూ మధ్యపాన నిషేధం, విదేశీ వస్తువుల  బహిష్కరణ తదితర అంశాల విూద (1866-1942)గుజరాత్‌ మహిళల సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఆ సమావేశానికి నీవు, విూ అమ్మగారు తప్పక హాజరుకావాలి అని కోరారు. స్వయంగా మహాత్ముడు పంపిన ఆహ్వానాన్ని గౌరవిస్తూ అవిూనా సమావేశానికి హజరయ్యారు. ఆ సమావేశంలో  గాంధీజీ సమక్షంలో గుజరాత్‌  మహిళా కాంగ్రెస్‌ అధ్యకక్షురాలిగా అమీనా తయ్యాబ్జీ ఎంపికయ్యారు.  మద్యపాన నిషేధం, విదేశీ వస్తువుల బహిష్కరణ కోసం కృషిచేయాలని నిర్ణయిస్తూ ఆ సమావేశం తీర్మానించింది. 

                           ఆ నిర్ణయాల మేరకు గుజరాత్‌ మహిళా కాంగ్రెస్‌ నేతగా  అమీనా తయ్యాబ్జీ అన్ని కష్టనష్టాల కోర్చి  మద్యపాన నిషేధం, విదేశీ వస్తువుల బహిష్కరణోద్యమానికి  ప్రాణం పోశారు. గుజరాత్‌ అంతటా ధర్నా, పికెటింగ్‌, రాస్తారోకో లాంటి ఆందోళనా రూపాలతో ఉద్యమించి భారతదేశం మొత్తానికి గుజరాత్‌ను ఆదర్శప్రాయమైన మార్గంలో నిలిపారు. విదేశీ వస్తువుల బహిష్కరణకు ప్రత్యామ్నాయంగా ఖద్దరు వస్త్రధారణను ప్రోత్సహించారు. రాట్నం తిప్పటం, నూలు వడకటం, ఖద్దరు నేయటం, ఖద్దరు ధరించడాన్ని స్వయంగా ఆచరించి ఆయా కార్యక్రమాలకు బహుళ ప్రాచుర్యం కల్పించారు.

                  ఆమె కృషి, కార్యదక్షతను గమనించిన గాంధీజీ తన యంగ్‌ ఇండియా, నవజీవన్‌ పత్రికలలో తగిన తీర్మానం చేసి గుజరాత్‌ మహిళలు మహత్తరమైన బాధ్యతను స్వీకరించారు. ఆ బరువును మహిళల పక్షాన అవిూనా తయ్యాబ్జీ ఆమె కమిటీ భరించారు అని ప్రశంసించారు. ఈ ఉద్యమం నేపధ్యంలో మహిళా కాంగ్రెస్‌ పక్షాన వైశ్రాయికి పంపిన లేఖలో 24 మంది మహిళల సంతకాలతో పాటుగా అమీనా తయ్యాబ్జీ సంతకాన్ని కూడా గాంధీజీ కోరడం ద్వారా జాతీయ స్థాయిలో ఆమె ప్రాధాన్యత వెల్లడయ్యింది. ఆ లేఖలో ఆమనా ఖురేషి, రెహనా తయ్యాబ్జీలు కూడా సంతకాలు చేశారు.

               చివరివరకు జాతీయోద్యంలో పాల్గొని, మహాత్ముని అడుగుజాడల్లో ఆమె నడిచారు. బాధ్యత స్వీకరించిన  కార్యక్రమాలన్నిటినీ దీక్షాదక్షలతో నిర్వహించి ఉద్యమకారులకు ఆదర్శంగా నిలచిన శ్రీమతి అవిూనా తయ్యాబ్జీ 1942లో కన్నుమూశారు.

కలకత్తా  పారిశుధ్య కార్మికుల పెద్దమ్మగా ఖ్యాతిగడించిన
మజీదా హసీనా బేగం

భారతదేశంలోని విప్లవదళాలు బ్రిటీష్‌ ప్రభుత్వ పైశాచిక దాడులకు గురై, విప్లవకారులు భయంకర శిక్షలకు  బలి కావటంతో స్వాతంత్య్రోద్యమంలో  అగ్నియుగం గా భాసించిన విప్లవోద్యమం కొంత మేరకు బలహీనపడింది. మాతృభూమి విముక్తి కోసం ఆ యోధులు ప్రదర్శించిన అసమాన దేశభక్తి ప్రజలలో, ప్రధానంగా యువకులలో, త్యాగపూరిత ఆలోచనలకు అంకురార్పణ చేసింది. ఆ సమయంలో రష్యాలో ప్రజలు సాధించిన విజయం ప్రపంచ వ్యాపితంగా యువతరాన్ని ఉత్సాహపర్చింది. బ్రిటీష్‌ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ఒకవైపున పోరాడటమే కాకుండా అన్నిరకాల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలన్న చైతన్యానికి ఆ ఉత్సాహం కారణమయ్యింది. ఈ మేరకు వెలువడిన చైతన్యదీప్తుల వెలుగులో అంకిత భావం గల యువత పుట్టుకొచ్చింది. ఆ వెలుగు దివ్వెలలో ఒకరు శ్రీమతి మజీదా హసీనా బేగం.

                    ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కలకత్తాను ప్రధాన కేంద్రంగా చేసుకుని   బ్రిటీష్‌ వ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభించి మజీదా హసీనా బేగం ప్రజా పోరాటాలకు నాంది పలికారు. జాతీయోద్యమంలో పాల్గొనాల్సిందిగా ప్రజలను కోరుతూ  జనచైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రజలలో బ్రిటీష్‌ వ్యతిరేక భావాలను పెంపొందించారు.  ఈ జనచైతన్య కార్యక్రమాలలో భాగంగా ఆమె సాగించిన పర్యటనల్లో కలకత్తా పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్యకార్మికుల దుర్భర పరిస్థితులను స్వయంగా గమనించారు.

              స్వాతంత్య్రోద్యమకారిణిగా ఉద్యమాల అనుభవంగల ఆమె శ్రమ జీవులు కష్టనష్టాలను అనుభవపూర్వకంగా తెలుసుకుని  అసహాయులైన కార్మికులను సంఘటితంచేసి కనీస హక్కుల సాధనకు సంకల్పించారు. ఆ దిశగా కార్మికులను సమైక్యపర్చి పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో పలు ఇక్కట్లకు గురయ్యారు, పలుమార్లు అరెస్టయ్యారు.  బ్రిటీష్‌ పోలీసుల లాఠీ దెబ్బలను రుచి చూశారు.

                      ఆమె ప్రారంభించిన పోరాటానికి కార్మిక సంక్షేమం ఆశించే యువకులు, ప్రజలు అన్నివిధాల అండదండలిచ్చారు.  కలకత్తా మహానగరంలోని పారిశుధ్య కార్మికులు, పేదాసాదా జనం మజీదా హసీనా బేగంను, తమ ఆత్మబంధువుగా మనస్సులలో ప్రతిష్టించుకుని ఆమె వెంట నడిచారు. కనీస హక్కులను సాధించుకున్నారు. ఈ విజయాలు  హసీనా బేగంలో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. ఆమె  మరింతగా ఉద్యమించారు.

                           బ్రిటీష్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఆమె ఏమాత్రం సహించలేదు. ద్వితీయ ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొని ఆమె జైలు కెళ్ళారు.   పోరాటమే ఊపిరిగా తన కార్యక్షేత్రాన్ని నిర్దేశించుకుని కృషి ప్రారంభించిన ఆమె మహిళల సమస్యల మీద కూడా దృష్టిసారించారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆందోళను విస్తరింప చేశారు.  జాతీయోద్యమం చివరి థలో మతం పేరుతో మనుషులను చీల్చపూనుకున్న మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా  పోరాడారు. ఆమెకు వేర్పాటువాదుల నుండి ప్రమాద ఘంటికలు వినవచ్చినా ఏ మాత్రం అధైర్యపడకుండా ఆ శక్తుల కుయుక్తులను, కుట్రలను ఎండగడ్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేయగల ప్రసంగాలు చేస్తూ ప్రజలను సంఘటిత పర్చారు. 

                           ఆమె నిరంతరం ప్రజల కోసం శ్రమించారు. ఆ కారణంగా ప్రజల ప్రశంసలను అందుకున్నారు. శ్రీమతి మజీదా హసీనా బేగం పలు విజయాలు సాధించి స్వాతంత్రోద్యమ చరిత్రలోనే కాకుండా, కార్మిక పోరాటాల చరిత్రలో కూడా చిరస్మరణీయమైన ఖ్యాతి గడించారు.

జాతీయోద్యమానికి సర్వం వొడ్డిన దానగుణశీలిషంషున్నీసా అన్సారి            

మాతృభూమిని బ్రిటీష్‌ దాస్యశృంఖలాలనుండి విముక్తం చేయడానికి సాగిన  మహత్తర స్వాతంత్య్ర సంగ్రామంలో ఈ దేశపు స్త్రీ పురుషులు విభిన్న పాత్రలను నిర్వహించి లక్ష్యసాధనలో తోడ్పడ్డారు. ఈ మేరకు పోరుబాటన నడిచిన మహిళల్లో ఆత్మార్పణలతో కొందరైతే, అద్వితీయ త్యాగనిరతి, దాన,ధర్మ,దయాగుణాలతో మరికొందరు తమదైన క్రియాశీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ద్వితీయ వర్గీకరణలోని మహిళలు తాము స్వయంగా ఉద్యమించకున్నా ఉద్యమకారులకు అన్ని విధాల తోడ్పాటు అందచేస్తూ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటూ పరోక్షంగా ఉద్యమానికి జవసత్వాలను అందించారు. ఈ కోవకు చెందిన దానగుణశీలి శ్రీమతి షంషున్నీసా అన్సారి. 

                           భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రధాన భూమిక నిర్వహించిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు  ఢిల్లీకి చెందిన డాక్టర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి ఆమె భర్త. 1899లో డాక్టర్‌ అన్సారిని    ఆమె వివాహమాడారు. ఆమె సాంప్రదాయక మత విద్యను అభ్యసిం చటంతోపాటు  పర్షియన్‌, ఉర్దూ, అరబ్బీ బాషలలో  ప్రావీణ్యం సంపాదించారు. సాహిత్య, రాజకీయ,సామాజిక గ్రంథాల పఠనం పట్ల ఆమెకు ఆసక్తి ఎక్కువ. సమకాలీన సమాజ (-1938)స్వరూప స్వభావాలను, రాజకీయాలను అవగాహన చేసుకోవటం పట్ల అభిలాష.  ఈ మేరకు సంతరించుకున్న పరిజ్ఞానం వలన ఆమె సమకాలీన రాజకీయాల గురించి భర్తతోపాటుగా మహాత్మాగాంధీ లాంటి మహానాయకులతో చర్చించటం జరిగింది. ప్రముఖ నాయకులతో అభిప్రాయాలను పంచుకుంటూ, తన వైఖరిని స్పష్టం చేయడానికి ఆమె ఏమాత్రం వెనుకాడ లేదు. జాతీయ,అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ భర్త అభిప్రాయాలను కూడా ప్రభావితం చేసిన ప్రతిభావంతురాలు.

                                         1921నాటి ఖిలాఫత్‌ ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొనటం ద్వారా  ఆమె జాతీయోద్యమ రంగప్రవేశం చేశారు. జాతీయోద్యమంలో బేగం షంషున్నీసా, డాక్టర్‌ అన్సారి బహుముఖ పాత్ర నిర్వహించారు. ఢిల్లీ ఖిలాఫత్‌ కమిటీ మహిళా విభాగం అధ్యకక్షురాలుగా ఆమె సేవలందించారు. డాక్టర్‌ అన్సారి ప్రత్యక్ష కార్యకలాపాలలో పాల్గొంటే షంషున్నీసా బేగం పర్దానషీ మహిళ అయిఉండి కూడా బృహత్తరమైన బాధ్యతలను నిర్వహించి మహాత్మా గాంధీజీ నుండి ప్రేమాభిమానాలందుకున్నారు. ఆమె ముస్లిం మహిళలలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, అలీ సోదరుల మాతృమూర్తి ఆబాది బానో బేగం ఢిల్లీ వచ్చిన సందర్భంగా మహిళలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ఖిలాఫత్‌ ఉద్యమం కోసం రెండువేల రూపాయలకు పైగా విరాళాలను వసూలు చేసి ఆమెకు అందజేశారు. 

                  భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో ఆమె ప్రత్యేక ఆసక్తి చూపారు. అన్సారి తోపాటుగా  ఆమె కూడా ప్రతి సమావేశానికి హాజరయ్యేవారని రచయిత్రి  పేర్కొన్నారు. డాక్టర్‌ అన్సారి ప్రారంభించిన కార్యకలాపాలలో ఆమె కీలకపాత్ర వహించారు.  ఆధునిక విద్యావిధానాలు, సాంప్రదాయక విద్యాపద్ధతుల మధ్యన సమన్వయం ఏర్పరచడానికి, మక్కాలోని పవిత్రస్థలాలను పరిరక్షించి అభివృద్ధి పర్చేందుకు సాగిన కృషిలో తోడ్పాటునందించిన ఈ సంస్థకు ఆర్థిక వనరులు సమకూర్చడానికి  షంషున్నీసా బేగం ఎంతగానో శ్రమించారు.
జాతీయ కాంగ్రెస్‌ ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమాలు ఏవీకూడా ఆమె భాగస్వామ్యం, సహకారం లేకుండా ఆరంభమయ్యేవి కావు.  జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు ఏవి జరిగినా, అవి ఎన్ని రోజులు జరిగినా ఆ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతి యోధుడికి  డాక్టర్‌ అన్సారి ఇంట ఆతిధ్యం లభించేది. ఆ కారణంగా  ఆయన గృహంలో జాతీయోద్యమకారులందరికి అతిధి గృహంగా ఉండేది. ఉద్యమకారులకు అన్ని సదుపాయాలు కల్పించటం జరిగేది. ఆ సందర్భంగా షంషున్నీసా బేగం సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ వారివారి అవసరాలకు తగ్గట్టుగా వసతి, భోజన ఏర్పాట్లు చేసేవారు. అతిధులెవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రణాళికాబద్ధంగా ఆతిధ్యాన్ని, ఇతర సదుపాయాలను కల్పించటంలో ఆమె శ్రద్ధవహించారు.

                    ఢిల్లీకి వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన స్వాతంత్య్రసమరయోధులకు వారివారి అవసరాలు, అలవాట్లను బట్టి ఏర్పాట్లు చేయటంలో ఆమె ప్రత్యేకత చూపారు. మాంసాహార, శాకాహార, యూరోపియన్‌ భోజనం ఇష్టపడే వారికి ప్రత్యేక శిబిరాలు ఉండేవి. అతిధుల కోసం శిబిరాల ఏర్పాటు ఎక్కడోకాకుండా  విశాలమైన ఆవరణలో ఏర్పాటు చేసి వారికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ ఒక్కరి విశ్వాసాలకు, మనోభావాలకు భంగం కలుగకుండా   చూసుకున్నారు. ఈ ఏర్పాట్లకు ఆమెకు తగినంత ధనం సమకూర్చటం డాక్టర్‌ అన్సారి వంతైతే, ఏర్పాట్ల నిర్వహణ, పర్యవేక్షణను బేగం అన్సారి తన భుజస్కంధాల విూద వేసుకుని శ్రమించారు. ప్రతినిధుల శిబిరాల నిర్వహణాభారాన్ని అతిధులు ఆశ్చర్యపోయేలా సమర్థవంతగా నిర్వహించటం ఆమె ప్రత్యేకత.

                                   షంషున్నీసా బేగం అంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఎంతో సమర్ధవంతంగా నిర్వహించటం ద్వారా మహాత్మాగాంధీని కూడా ఆశ్చర్యచకితుల్ని చేశారు. జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగినన్ని రోజులు వచ్చేవారు, పోయేవారితో ఈబిజీ-ఏరీ-ఐబిజిబిళీ ధర్మశాలను తలపింపచేసేది. ఆ కారణంగా 1931మార్చి 29నాటి  నవజీవన్‌ పత్రికలో  అన్సారి  ధర్మశాల  శీర్షికతో డాక్టర్‌ అన్సారి ఇంట అతిథ్యం లంభించే తీరు తెన్నులను, ఆయా కార్యక్రమాల నిర్వహణలో బేగం షంషున్నీసా  చూపిన శ్రద్ధను ప్రశంసిస్తు  గాంధీజీ ప్రత్యేక వ్యాసం రాసారు. 

                          ఈ వ్యాసంలో షంషున్నీసా దయాగుణాన్ని, సహనశీలతను, కార్యనిర్వహణా దక్షతనేకాక, ఆమె ప్రగతిశీల భావాలను ఎంతగానో కొనియాడారు.  ఆ వ్యాసం చివరిలో, అన్సారి బేగం సమక్షాన శ్రద్ధాభావనలతో నా శిరస్సు వంచాను (మైనే శ్రద్ధా భావ్‌సే అపనా శిర్‌ బేగం అన్సారి కే సమక్ష్‌ మే ఝుకా దియా) అని అన్నారు. మహాత్మా గాంధీ తన ఢిల్లీ పర్యటనలో డాక్టర్‌ అన్సారి ఇంట మాత్రమే బసచేసేవారు. ఆ సందర్భంగా  బేగం అన్సారితో కుటుంబ విషయాలనే కాకుండా, జాతీయోద్యమ కార్యక్రమాల గురించి కూడా చర్చించేవారని రచనల ద్వారా తెలుస్తోంది. ఆ సన్నిహితత్వం నేపధ్యంలో మహాత్ముడు ఆ మహనీయురాలి పట్ల అంతటి అపూర్వ గౌరవాన్ని ప్రకటించారు.

                              అద్వితీయ త్యాగమూర్తులైన డాక్టర్‌ అన్సారి, బేగం షంషున్నీసా దంపతులకు సంతానం లేదు. జాతీయోద్యమ కార్యక్రమాలలో తలమునకలై ఉన్న ఆ దంపతులు సంతానం గురించి ఆలోచించలేదు. చాలా కాలం తరువాత జోహారా బేగం అను అమ్మాయిని, షౌకతుల్లా  అను అబ్బాయిని పెంచుకున్నారు. ఈ ఇరువురు కూడా జోహరా బేగం అన్సారి, షౌకతుల్లా అన్సారి పేర్లతో ప్రసిద్ధులయ్యారు. బిడ్డలు జోహారా బేగం,  షౌకతుల్లా అన్సారిలను స్వాతంత్రోద్యమంలో కియ్రాశీలక పాత్ర వహించే విధంగా బేగం అన్సారి  తీర్చిదిద్దారు.
1936లో డాక్టర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి మరణించారు.  భర్త మరణించినా ఆయన లేని లోటు కన్పించకుండా బేగం షంషున్నీసా చివరి శ్వాస వరకు స్వరాజ్య కాంక్షతో భారత జాతీయ కాంగ్రెస్‌కు, జాతీయోద్యమకారులకు తన ఇంట అసమానమైన సేవలందించారు.  డాక్టర్‌ అన్సారి సమకూర్చిపెట్టిన సంపదను, తన అమూల్యమైన సమయాన్ని ఆమె పూర్తిగా జాతీయోద్యమానికి అంకితం చేశారు. డాక్టర్‌ అన్సారి ఏమి సాధించినా అదంతా షంషున్నిసా సహకారంతో మాత్రమే నని ఆమె ప్రముఖుల గౌరవాన్ని అందుకున్నారు. ఆమెతో పరిచయమున్న ప్రతి ఒక్కరిచే పవిత్రమైన.. దానశీల మహిళగా ప్రశంసలందుకున్నారు.

                                 ఈ మేరకు చివరివరకు స్వాతంత్య్రోద్యమానికి తోడ్పాటు అందిస్తూ, జాతీయోద్యమ కార్యకర్తల, ఉద్యమనాయకుల, ప్రజల గౌరవాభిమానాలను అందుకున్న స్వాతంత్య్ర సమరయోధురాలు శ్రీమతి షంషున్నీసా అన్సారి 1938లో కన్నుమూశారు.

 – సయ్యద్ నశీర్ అహమ్మద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో