కన్యాశుల్కం నాటకం ` సన్నివేశ కల్పనా చాతుర్యం

                                     ISSN 2278 – 4780

‘సామాజిక చైతన్యం’ అనే మాట ఆధునిక సాహిత్యం ఆవిర్భావం తర్వాత విమర్శనా రంగంలో బహుళ ప్రచారంలో ఉన్నమాట.  దీనికి నిర్దిష్టంగా అర్థం చెప్పడం కష్టం.  సాహిత్య పరిభాషలో సామాజిక చైతన్యం అంటే సాహిత్యం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడం.  అంటే సాహిత్యం కేవలం ఆనందించడానికే కాదు అది పాఠకున్ని ఆలోచనా దిశ వైపు నడిపించాలి.  లోకంలోని మంచేదో, చెడేదో గుర్తించ గలిగే విచక్షణని సాహిత్యం పాఠకుడికందించాలి.  అలాంటి సాహిత్యం సమాజానికి అవసరమని ఆధునిక ప్రపంచం గుర్తించింది.  ఈ దృష్టితో చూస్తే తెలుగులో గురజాడ అందించిన ‘కన్యాశుల్కం’ నాటకం గొప్ప సామాజిక చైతాన్యాన్ని కలిగుందని చెప్పక తప్పదు.  ఆ నాటకంలో గురజాడ కల్పించిన సన్నివేశాలు, సంఘటనలు, సంభాషణలు అనేక అంశాల పట్ల మనకు ఒక స్పష్టతని అందిస్తాయి.  సామాజిక జీవితం ఎన్ని సంఘర్షణలకు గురవుతూందో, ఏయే సందర్భాల్లో ఎలా మారిపోతుందో ఆ నాటకంలోని సన్నివేశాలు, సంఘటనలు గమనిస్తే అర్థమవుతుంది.  

                        కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఏడు అంకాలుగా విభజించాడు.  ఒక్కొక్క అంకాన్ని స్థలాలుగా విడమరచి సన్నివేశాల్ని కల్పించారు.  మొదటి అంకంలో రెండు సన్నివేశాలను కల్పించి ఆ తర్వాత ఒక్కొక్క అంకంలో ఒక్కో సన్నివేశం పెంచుకుంటూ వచ్చి చివరి అంకంలో ఒక సన్నివేశాన్ని తగ్గించారు.  గురజాడ, సన్నివేశాన్ని నడిపించడానికి సజీవ పాత్ర చిత్రణ చేసి కథను నడిపించిన తీరును, చాతుర్యాన్ని పరిశీలిద్దాం.  మొదటి అంకంలో మొదటి సన్నివేశం విజయనగరం బొంకుల దిబ్బలో జరుగుతుంది.  ఇందులో ప్రధానంగా మూడు పాత్రలు వస్తాయి.  నాటకం గిరిశం, వెంకటేశం, పొటోగ్రాపుల పంతులు గారి నౌకరు.  గిరిశం స్వగతంతో ఆరంభమౌతుంది.  పరీక్ష ఫెయిలయిన వెంకటేశాన్ని వలలో వేసుకొని వాళ్లింటికెల్లడానికి సిద్ధపడ్తాడు.  ఇంతలో మధురవాణిని గూర్చి ఆలోచిస్తుండగా ఫోటోగ్రాఫ్‌ పంతులు నౌకరు డబ్బుల కోసం గిరీశం వద్దకు వస్తాడు.  మొదట చెవుడు ఉన్నట్లు నటించినా మాటల్లో అతన్ని పడేసి తప్పించుకొంటాడు.  రెండవ సన్నివేశం కీలక పాత్రలయిన రామప్పపంతులు, మధురవాణిలతో ప్రారంభమౌతుంది.  మధురవాణి తను గిరీశం అధీనంలో ఉన్నానంటుంది. ఇంతలో గిరీశం వస్తాడు.  అప్పుడు మధురవాణి రామప్పపంతులు తనకిస్తున్న రెండొందల్ని తిరిగి ఆయనకిచ్చేసి ‘నేను డబ్బు మనిషినికాను’ అంటుంది.  అప్పుడే గిరీశాన్ని వెతుక్కుంటూ పూటకూళ్ళమ్మ అక్కడికి వస్తుంది.  రామప్పపంతులు మంచం కిందికి దూరతాడు.  గిరీశం కూడా అదే మంచం కిందికి దూరతాడు.  పూట కూళ్ళమ్మ చీపురుతో రామప్పపంతుల్ని కొట్టగా బయటికొస్తాడు.  గిరీశం కోసం మంచం కిందికి దూరగా పై నుంచి వచ్చి రామప్పంతులు నెత్తి మీద ఒక దెబ్బ కొట్టి పారిపోతాడు.  మధురవాణి రామప్పపంతుల్పి ముద్దు పెట్టుకొని ఆదరిస్తుంది.   

                                   రెండో అంకంలో మొదటి సన్నివేశం కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు ఇంట్లో జరుగుతుంది.   అగ్నిహోత్రావధాన్లు, వెంకమ్మలు తమ కొడుకుని గురించి మాట్లాడుతుండగా గిరీశం, వెంకటేశం ప్రవేశిస్తారు.  ఇంగ్లీషు చదువు కోసం ఎంత ఖర్చయినా ఫరవాలేదంటుంది వెంకమ్మ.  వెధవ ఇంగిలీషు చదువులు మనకు అచ్చిరావు అని అగ్నిహోత్రావధాన్లు బాధపడతాడు.  ‘ఫస్టుగా ఫాసయినాడు నేనే చాల శ్రమపడి చదువు చెప్పానండి’ అని అంటాడు గిరీశం.  ఇద్దరూ ఇంగ్లీషులో అవకతవకగా మాట్లాడుకొంటారు.  అగ్నిహోత్రావధాన్లు తన రెండో కూతురు సుబ్చిని లుబ్దావధాన్లకిచ్చి కట్టబెట్టాలని అనుకొంటాడు.  గిరీశం మొదటిసారిగా బుచ్చమ్మను చూస్తాడు.  ‘‘హౌ బ్యూటిపుల్‌! క్వైట్‌ అనెక్స్‌పెక్ట్‌డ్‌!’’ అని అంటాడు.  ‘‘పెద్ద కాంపెనుకి అవకాశం ఇక్కడ దొరకడం నా అదృష్టం’’ అని అనుకొంటాడు.  రెండో స్థలంలో కరటక శాస్త్రికీ, శిష్యుడు మహేశానికీ దేవాలయం మండపం మీద సంభాషణ నడుస్తుంది.  ఇందులో ‘‘ఓ పది రోజులు నువ్వు ఆడపిల్లవై పోవాలి’’ అని కరకట శాస్త్రి శిష్యుడికి చెప్పి, సుబ్బి పెళ్ళి తప్పించడానికి తను తలపెట్టిన       ఉపాయం చెప్తాడు.  నువ్వు నెగ్గుకొస్తే నా పిల్లనిచ్చి నిన్ను ఇల్లరికం ఉంచుకుంటానని మాట ఇస్తాడు.  మూడో స్థలం అగ్నిహోత్రావధాన్లు ఇంటి ఎదుటి వీధి.  కన్యాశుల్కం మీద లెక్చరిచ్చే ప్రయత్నం ఎలా పరిణమించిందో గిరీశం వెంకటేశానికి వివరిస్తాడు.  నీ తండ్రిని పాకెట్లో వేశాను అంటాడు.  ఒక పొలిటికల్‌ మహాస్త్రం ప్రయోగించి కత్తుకలిపేశాననీ బాగా ఆలోచిస్తే ఇన్ఫెంటు మ్యారెజి కూడుననే తోస్తుందనంటూ తన వాదాన్ని వివరిస్తాడు.  తను రాసిన ది విడో అనే పోయమ్‌ వెంకటేశానికి వినిపిస్తాడు.  ఇంతలో అగ్నిహోత్రావధాన్లు రాగా ఇద్దరూ బుచ్చమ్మ కేసు విషయమై దావాల గెలుపు విషయమై గిరీశం భరోసా ఇస్తాడు.  బుచ్చమ్మను ఆకర్షించడానికి ప్రయత్నింస్తూ ఉంటాడు.  

                                మూడో అంకం మొదటి సన్నివేశం రామచంద్రపురం అగ్రహారంలో రామప్పంతులు ఇంటి సావిట్లో జరుగుతుంది.  రామప్పపంతులు విషయం తెలిసి మధురవాణి ‘తెలియక మోసపోతినే’ అని పాడుతూ ఉంటుంది.  ఇంతలో రామప్పంతులు వస్తాడు.  ఇద్దరూ లుబ్దావధాన్ల పెళ్ళి విషయం మాట్లాడుకొంటారు.  ఈ పెళ్ళి వల్ల ద్రవ్యాకర్షణ ఎలా జరుగుతుందో చెబుతూనే ‘‘ఆ ముసలాణ్ణి కాపాడదామనే ఈ పెళ్ళితలపెట్టాను’’ అంటాడు.  ఈ సన్నివేశంలో తెలియవచ్చేవి రెండు ముఖ్య విషయాలు: అగ్ని హోత్రావధాన్లు రెండో కూతుర్ని లుబ్దావధాన్లకిచ్చి పెళ్ళి చేయడానికి సంబంధం కుదిర్చిన వాడు రామప్పపంతులు.  రెండు ఈ పెళ్ళి మానిపించమని అడుగుతుంది మధురవాణి.  రెండో సన్నివేశంలో కరటక శాస్త్రి శిష్యుడు (ఆడ వేషంలో ఉంటాడు), రామప్పపంతులు ఇంటికి వచ్చి మధురవాణిని చూసి ఆశ్చర్యపోతారు.  కరటక శాస్త్రికీ, మధురవాణికి పాత స్నేహం ఉన్నట్టు వారి మాటల వల్ల తెలుస్తుంది.  శిష్యున్ని చూసి ‘‘ఈ కన్నె పిల్ల నోరు కొంచెం చుట్ట వాసన కొడుతూ ఉంది’’ అని మధురవాణి అంటుంది.  లుబ్దావధాన్లకి నిశ్చయించిన పిల్ల తన మేనకోడలని, పెళ్ళి కాకుండా తప్పించుమని మధురవాణిని కరకట శాస్త్రి వేడుకొంటాడు.  అందుకు మధురవాణి మీనాక్షిని, సిద్ధాంతిని మంచి చేసుకోమంటుంది.  ఈ విషయం హెడ్‌ కానిస్టేబుల్‌కి చెబుదామంటుంది.  రామప్పపంతులు రావడం, కరటక శాస్త్రిని పరిచయం చేసుకోవడం జరుగుతుంది.  లుబ్దావధాన్లకు తక్కువ రేటుకు ఈ పిల్లను కుదిర్చి వచ్చే డబ్బులో ఏడో వంతు తనకు ఇచ్చేటట్లయితే వ్యవహారం నడిపిస్తానని రామప్పపంతులు మాట ఇస్తాడు.  మూడో సన్నివేశం కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్ల ఇంటికి మారుతుంది.  గిరీశం బుచ్చమ్మ కోసం తహతహలాడుతుంటాడు.  వెంకటేశాన్ని పిలిచి పాఠం చెప్పేవంకతో విధవల వివాహం ప్రస్తావన తీసుకొచ్చి బుచ్చమ్మను ప్రోత్సహిస్తాడు.  ఇంతలో అగ్నిహోత్రావధాన్లు ‘‘నేను కూడా వింటానని’’ కొంతసేపు పాఠం విని ‘‘ మీ ఇంగ్లీషు చదువులు బాగున్నాయి’’ అని గిరీశాన్ని మెచ్చుకుంటాడు.  అలా మెచ్చుకునేటట్లు చెప్పడం గిరీశానికి తెలియని విద్య కాదు గదా మేమంతా మిమ్మలినే నమ్ముకొని వున్నాం’’ అని అగ్నితో అనిపిస్తాడు.  నాలుగో సన్నివేశంలో బుచ్చమ్మ గిరీశం గురించి వెంకటేశాన్ని ఆడుగుతుంది.  వెంకటేశం అతన్ని అకాశానికి ఎత్తేస్తాడు.  ఇంతలో గిరీశం అక్కడికొచ్చిన బుచ్చమ్మతో ‘‘వదినా ఈ చెట్టు కింద నిలబడితే మీరు వనలక్ష్మిలా ఉన్నారు’’ అంటూ బోధ చెయ్యడమారంభిస్తాడు.  మీలాంటి దివ్య సుందర విగ్రహం,  గుణవంతురాలూ నా మీద కనికరించి ‘‘గిరీశంగారూ నన్ను పెళ్ళాడండి’’ అని అంటే పెళ్ళాడతాగానీ అచ్చమ్మల్నీ, పిచ్చమ్మల్నీ చేసుకొని ఉత్తమ బ్రహ్మచర్యం, లోకోపకారం మానుకుంటాననుకుంటున్నారా ఏవిటీ’’ అనంటాడు.  అప్పుడే అగ్నిహోత్రావధాన్లు వస్తాడు.  కేసులు, దావాల విషయం ప్రస్తావిస్తాడు.  ‘‘నాకు ఇంగిలీషు తెలియక పోవడం వల్ల చాలా చిక్కొచ్చింది’’ అని ఆయన చేత అనిపిస్తాడు గిరీశం.   

                                        నాలుగో అంకంలో మొదటి సన్నివేశం రామప్పపంతులు ఇంటి సావిడిలో జరుగుతుంది.  లుబ్దావధాన్ల పెళ్ళికి ఆడపెళ్ళి వారితో గిరీశం వచ్చి రామప్పపంతులు మీద చెయ్యి చేసుకునే అవకాశం ఉందని మధురవాణి ఊహిస్తుంది.  దాంతో పెళ్ళి తప్పిపోయేందుకు తంత్రం పన్నానని అంటుంది.  పెళ్ళి తప్పకపోతే వంటలకు పూట కూళ్ళమ్మను కుదుర్చుమని సలహాయిచ్చి రామప్పపంతులికి ఒక దారి చూపుతుంది మధురవాణి.  ఇంతలో పెళ్ళి వద్దంటూ లుబ్దావధాన్లు ఉత్తరం పట్టుకొని ప్రవేశిస్తాడు.  ఈ ఉత్తరం గిరీశం లుబ్దావధాన్ల గారి పేర రాసింది.  ఇంతలోనే మరో ఉత్తరం వస్తుంది.  మీ సంబంధమే అక్కర్లేదంటూ అగ్నిహోత్రావధాన్లు రాసినట్లుంటుంది.  లుబ్దుడికి ఉద్రేకం పెరిగి మళ్ళీ వేరే పెళ్ళి మీదకు మనసు మల్లుతుంది.  గుంటూరు శాస్త్రులు గారి సంబంధం గురించి చెప్పి లుబ్దుడిని పెళ్ళికొప్పిస్తాడు రామప్పపంతులు.  సిద్ధాంతి అప్పుడే వచ్చి పిల్ల లక్షణాల్ని వివరించి త్రయోదశినాడు పెళ్ళి మంచిదని చెప్పి నిష్క్రమిస్తాడు.  కరటక శాస్త్రి వచ్చి లుబ్దావధాన్లతో పెళ్ళి నిశ్చయం చేసుకుంటాడు.  పెళ్ళి సమయంలో పిల్ల ఒంటి మీద మధురవాణి కంటె పెళ్ళి తరువాత తీసుకుపోతానంటాడు పంతులు.  తర్వాతి సన్నివేశంలో లుబ్దావధాన్లు కరకట శాస్త్రి ఏకరాత్రి వివాహానికి ఒప్పుదల అవుతారు.  మూడో సన్నివేశంలో కరటక శాస్త్రి మీనాక్షిని కలుసుకొని ఆమెకు ఒక ‘పులిమెహరు’ ఆశపెట్టి మంచి చేసుకుంటాడు.  ఇంతలో సిద్ధాంతి వచ్చి, ‘నాలుగ్గడియల రాత్రి ఉందనగా శుభముహూర్తం’’ అని చెప్పి మంగళ స్నానాలు చేయించమని తొందర చేస్తాడు.  నాలుగో సన్నివేశంలో రామప్ప పంతులు పెద్దిపాలెం లౌక్యుల్ని పెళ్ళికి పిల్చి వచ్చేసరికి పెళ్ళి అయిపోవడం, పిల్లని అమ్మిన రూపాయల్ని గుంటూరు శాస్త్రుల్లు తీసికెళ్లిపోవడం అన్నీ జరిగిపోయి వుంటాయి.  వీటిని చూసి రెచ్చిపోతాడు రామప్ప పంతులు.  ఇంతలో సిద్ధాంతిరాగా తగ్గిపోతాడు.  ‘‘మర్యాదగా మాట్లాడితే నా అంత మంచివాడు లేడు’’ అని యోగ్యతాపత్రం తనకు తానే ఇచ్చుకుంటాడు.  ఐదో సన్నివేశంలో గిరీశం తన మాటకారి తనంతో బుచ్చమ్మను పూర్తిగా ఆకర్షించి, చివరికి ‘‘మీరు ఏం చెయ్యమంటే అది చేస్తాను’’ అనిపిస్తాడు.   

                                       ఐదో అంకంలో మొదట సన్నివేశం లుబ్దావధాన్లు పీడకలతో మొదలౌతుంది.  తాను చేసుకున్న పిల్ల రెండో పెళ్ళిదేమో అని ఆయన అనుమానం.  దాని మొదటి మొగుడు పిశాచయి చంపబోయాడని భయపడ్తాడు.  పెళ్ళాం వద్దని మీనాక్షితో అంటాడు.  ఈ విషయం నిజమేనని మీనాక్షి చేత అడిగించి నిజం తెలుసుకుంటాడు.  మీనాక్షి లోపలికెళ్ళి పెళ్ళికూతుర్ని కొట్టేసరికి మీనాక్షిని కొరికేసి పారిపోతాడు.  నూతిలో పడిరదేమోనని లుబ్దుడి అనుమానం.  అంతా        ఉపద్రవంలా ఉంటుంది.  రెండో సన్నివేశంలో రామప్ప పంతులు ఇంట్లో భుక్త, పోలిశెట్టి, సిద్ధాంతి, మధురవాణి పేకాడుతూ ఉంటారు.  అప్పుడు వీధి తలుపు చప్పుడౌతుంది.  ఆడవేషంలో వున్న మహేశం మధురవాణి కంటెను మధురవాణి కిచ్చేస్తాడు.  మధురవాణి అతనితో కాసేపు సరసాలాడుతూ ‘‘నేను దాసరి వేషం వేస్తాను.  కొత్త అగ్రహారం పోయి నీ గురువుని చేరుకుందువుగాని’’ అని అంటుంది.  మళ్ళీ ఆటసాగుతుంది.  రామప్ప పంతులు వస్తాడు.  మధురవాణి ‘‘లుబ్దావధాన్లు మాయ పెళ్ళాన్ని వాళ్ళ ఇంట్లోంచి లేవదీసుకుపోయి యెక్కడ పెట్టారు?’’ అని ఎదురుదాడి చెయ్యడమే కాకుండా, ఆ కంటె తేందీ గడపలో కాలు పెట్టనివ్వ’’ నంటుంది.  మూడో సన్నివేశంలో లుబ్దావధాన్లు ఇంటి వాకిలి.  ‘‘అన్ని విధాలా ఈ రామప్పపంతులు నా కొంప తీశాడు’’ అని లుబ్దావధాన్లు బాధపడ్తుండగా రామప్పపంతులు వచ్చి కంటె ఇమ్మని అడుగుతాడు.  మాటా మాటా పెరుగుతుంది.  ఇంతలో మీనాక్షి, అసిరిగాడు, పూజారి, గురవయ్య వస్తారు.  ఆ పెళ్ళికూతురు కూడా దయ్యమేనని చెప్పి దాన్నీ, దాని మొగుణ్ణి సీసాలో బంధించానంటాడు గురవయ్య.  నాలుగో సన్నివేశంలో రామచంద్రపురం అగ్రహారంలో సారాదుకాణం వెనక ఉన్న తోటలో మనసబు, మనవాళ్ళయ్య, వీరేశ, బైరాగి, సారాదుకాణదారు, పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌, హవల్దారు ముచ్చట్లాడుతూ సారా తాగుతుంటారు.  రామప్పపంతులొచ్చి హెడ్డుగారితో లుబ్దావధాన్లు నుంచి కంటె ఇప్పించమని కోరతాడు.  ఆ పిల్ల కంటె తీసికెళ్ళి ఉంటే దాని ఖరీదునిప్పించమంటాడు.  దొంగ సాక్ష్యం పలకడానికి బైరాగి సిద్ధంగా   ఉంటాడు.  ‘‘ఏవయినా దొరికితే హరిద్వారంలో మఠానికి పనికొస్తుందని’’ అంటాడు.  ఐదో సన్నివేశంలో దేవాలయ గుమ్మం దగ్గర హెడ్‌ కానిస్టేబుల్‌, రామప్పపంతులూ మాట్లాడుతుంటారు.  లుబ్దావధాన్లు కంటె సంగతి తెలియదన్నాడనీ, తమకు పన్నెండు రాళ్ళు పారేశాడనీ చెప్పి రామప్పపంతులు చేతిలో మూడు రూపాయలు పెడతాడు.  మీనాక్షి ఉంటే కొంత కంటెను గూర్చిన ఆచూకీ తెలుస్తుందని రామప్పపంతులు ముచ్చట్లాడుకోవడంతో ఆమెను తను పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చి కంటె గురించి అడుగుతాడు.  అప్పుడిచ్చిన మాటకు ప్రమాణంగా బుడ్డీని ఆర్పేసి మీనాక్షిని కౌగలించుకుంటాడు రామప్ప పంతులు.  లుబ్దావధాన్లు చీకట్లో రామప్పపంతులు పాదాల మీద కర్రతో కొడతాడు.  రామప్పపంతులు కుంటుకుంటూ వీధిన పడ్తాడు.  మీనాక్షి అతని వెంటపడ్తుంది.  ఇంటికొచ్చి తలుపు తట్టగా కంటె ఇస్తే గాని తలుపు తియ్యనంటుంది మధురవాణి.  రేపు పగలుగాని కంటె ఇవ్వనన్నాడు లుబ్దావధాన్లు’’ అనంటాడు రామప్పపంతులు.  మీనాక్షి వచ్చి ‘మీ కాగల పెళ్ళాన్ని కదా యెక్కడికి వెళుతానంటుంది.’’  కొంత ఘర్షణ తర్వాత ఇక్కడే వుండమని వీధంట నడుస్తాడు.  అంతలో మహేశం దాసరి వేషంలో ‘‘యిల్లుయిల్లనియేవు’’ అని పాడుకుంటూ వస్తాడు.  రామప్పపంతులు అది విని అక్కణ్ణించి పరిగెత్తుకొని పోతాడు.  

                                         ఆరో అంకంలో ఏడు సన్నివేశాలున్నాయి.  మొదటి సన్నివేశంలో పెళ్ళివారితో వచ్చిన అగ్నిహోత్రావధాన్లకు రామప్పపంతులు కనపడతాడు.  అప్పటికి పదిరోజులు కిందట లుబ్దావధాన్లకి వేరే అమ్మాయితో పెళ్ళి అయిపోయిందని చెబుతాడు.  ‘వెళ్ళి గాడిద కొడుకు యెవికలు విరగ్గొడతాను’ అంటాడు అగ్నిహోత్రావధాన్లు.  రెండో సన్నివేశంలో అగ్నిహోత్రావధాన్లు, రామప్పపంతులు, వెంకమ్మా తదితరులుంటారు.  లుబ్దావధాన్ల మీద క్రిమినల్‌ కేసు తేవడానికి అవకాశముందా? అని రామప్పపంతుల్ని అడుగగా అతన్ని బాగా ప్రోత్సహిస్తాడు రామప్పపంతులు.  కేసు ఖర్చుకోసం డబ్బులు లేవంటే ఏదో ఓక సరుకు తీసుకురా పొలిశెట్టి దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందాం అని అంటాడు.  బుచ్చమ్మ కోసం వెతికితే ఆమె జాడలేదు.  గిరీశంతో లేచిపోయి వుంటుంది.  ‘‘అయ్యవారు ఫకీరుముండని లేవదీసుకపోయాడు? నగలపెట్టె? నా కోర్టు కాగితాలో?’’ అని చిందులు తొక్కుతాడు అగ్నిహోత్రావధాన్లు.  మూడో సన్నివేశంలో విశాఖపట్నంలో మధురవాణి బసకు ఎదురుగా ఉన్న వీధిలో కేసు ఖర్చులు చెప్పి రామప్పపంతులు చాలా డబ్బులు గుంజుతాడు.  మధురవాణి దగ్గర మీ కడియం తాకట్టుపెట్టి డబ్బుతెద్దామని సలహా ఇస్తాడు.  కడియం రామప్పపంతులుకే ఇచ్చి డబ్బు తెమ్మంటాడు.  ఇంతలో వాళ్ళ వకీలు నాయుడు వస్తాడు.  నాయుడుగారు రాసిన డిఫెన్సు బాగాలేదని తెలుసుకుంటాడు.  అవధాన్లు గారు భీమారావు పంతులు గారికి వకాల్తీ ఇచ్చారని రామప్పపంతులు నాయుడుతో చెబుతాడు.  ‘‘అయితే నన్నిలాగు అమర్యాద చేస్తారూ? యీ బ్రాహ్మడి యోగ్యత యిప్పుడే కలెక్టరుగారి బసకెళ్ళి మనవి చేస్తాను’’ అని వెళ్ళిపోతాడు నాయుడు.  నాలుగో సన్నివేశం లుబ్దావధాన్ల బస.  లుబ్దావధాన్లు తన సంగతి గూర్చి విచారిస్తుండగా రామప్పపంతులు వచ్చి మిమ్మల్ని చూస్తే గుండె నీరై కారిపోతుంది.  మీకేదైనా సాయం చేస్తానని సానుభూతిని చూపిస్తాడు.  డిప్యూటి కలెక్టరికి సొమ్ముకావాలంటాడు.  అయితే లుబ్దావధాన్లు వెళ్ళిపొమ్మంటాడు.  సౌజన్యారావు అక్కడికి వస్తాడు.  ఆయన్ని స్తోత్రం చేసి ‘గొప్ప డిఫెన్సు సాక్ష్యం’ అని అనగా సౌజన్యారావు కూడా పంతుల్ని వెళ్ళిపొమ్మంటాడు.  తర్వాత లుబ్దావధాన్లకీ, సౌజన్యారావు పంతులు గారికీ జరిగిన సంభాషణలో ‘‘ఆ గుంటూరు శాస్త్రులుకీ పడమటి దేశపు యాస’’ లేదని తెలుస్తుంది.  ఐదో సన్నివేశంలో విశాఖపట్నంలో మధురవాణి ఇంటి ఎదుట ఉన్న వీధి కొనలో కరకట శాస్త్రి ‘‘నువ్వు ఆ కంటె వాళ్ళ నెత్తిన కొట్టకుండా లేచి రావడం నుంచి యీ ముప్పంతా వచ్చినట్టు కనబడుతుంది’’ అంటాడు శిష్యుడితో మధురవాణిని మంచి చేసుకొని, ఆ కంటెను అరువు పుచ్చుకొని కంటెను, పన్నెండువందలు డబ్బుల్ని లుబ్దావధాన్లకు పంపిస్తే అతని మీద ఖూనీ కేసు నిలవదని నిశ్చయించు కుంటారు.  ఆరో సన్నివేశంలో గురు శిష్యులిద్దరూ మధురవాణి బసకు వెళ్తారు.  మధురవాణి మహేశాన్ని ముద్దు పెట్టుకుంటుంది.  దయచేసి నా అల్లున్ని చెడగొట్టద్దు అని అంటాడు కరకట శాస్త్రి.  గురు శిష్యులిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారనే విషయం మధురవాణి తెలుసుకొని కంటెను అరువు యివ్వడానికి ఒప్పుకుంటుంది.  తన కంటె తిరిగి తనవద్దకు వచ్చేంత వరకూ కరకట శాస్త్రి శిష్యున్ని తన యొద్ద తాకట్టు పెట్టమంటుంది.  స్త్రీ వ్యసనం గల డిప్టీ కలెక్టర్‌ నాయుడు చేత మధురవాణి రాయబారాలు పంపుతున్నాడని తెలిసినప్పుడు కరకట శాస్త్రి వెళ్ళమని ప్రోత్సహిస్తాడు.  అందుకామె ‘యిటుపైన ఊర కుక్కలను. సీమ కుక్కలనూదూరంగా ఉంచడానికి ఆలోచిస్తున్నా’నంటుంది.  లోకమంతా స్వప్రయోజనాపరులని కరటక శాస్త్రి తలవాయగొడుతుంది.  ఏడో సన్నివేశంలో సౌజన్యారావు పంతులు గారి ఇంట్లో కచేరీ గదిలో ఆయనకూ, అగ్నిహోత్రావధాన్లకూ సంభాషణ జరుగుతుంది.  ‘‘పిల్లల్ని అమ్ముకోవడం శిష్టాచారం అంటారండీ?’’ అని ఆయన అన్నప్పుడు అవధాన్లు సమర్థించుకోబోతాడు.  ఆ తర్వాత గిరీశం ప్రస్తావన వస్తుంది. మర్యాద గల ఇంటిలో పుట్టిన బుద్ధిమంతుడగు కుర్రవాణ్ణి చూసి చిన్నపిల్లకి పెళ్ళిచేయ్యమని చెప్తాడు.  పెద్దపిల్ల ఆస్తిని ఆమెకు ఇచ్చెయ్యమంటాడు.  గిరీశం మీద గ్రంథం నడపటం మానుకోమంటాడు.  అలాగయితేనే లుబ్దావధాన్లు తెచ్చిన కేసును తీసేయిస్తానంటాడు.  అయినా అగ్నిహోత్రావధాన్లు సౌజన్యారావు పంతుల్ని తిట్టి వెళ్ళిపోతాడు.  

                             ఏడో అంకంలో ఆరు సన్నివేశాలున్నాయి.  మొదటి సన్నివేశం బైరాగి, పోలీసు హెడ్డు మొదలగు వాళ్ళతో దొంగ సాక్ష్యాల వ్యవహారం గురించి సంభాషణ నడుస్తుంది.  రెండో సన్నివేశంలో డిప్యూటి కలెక్టరు కచేరీలో నడుస్తుంది.  తన కూతురు అంగీరస నామ సంవత్సరంలో పుట్టిందని చెప్పినప్పుడు కోర్టుకు దాఖలు చేసిన జాతకంలో ‘భావ’ అని ఉందని దొంగజాతకం దాఖలు చేసినందుకు ముక్కుచివాట్లు పెడతాడు డిప్యూటీ కలెక్టరు.  ‘‘నీ దుర్మార్గత వల్ల నీ కుమార్తెను యీ అవస్థలోకి తెచ్చి మళ్ళీ ఎబ్‌డక్షన్‌ కేసు కూడానా? నీ పొట్ట కరిగించేస్తానుండు’’ అని బెదిరిస్తాడు.  ఛార్జీ కాగితంలో ముద్దాయి ఇంటిపేరు లేదని లేచిపోతాడు.  అగ్నిహోత్రుడి జ్వాల తగ్గక తప్పలేదు.  మూడో సన్నివేశంలో తన దగ్గరికి వచ్చిన పోలిశెట్టికి, సౌజన్యారావు పంతులు లుబ్దావధాన్ల గారి పక్షాన సాక్ష్యం చెప్పి పుణ్యం కట్టుకోమంటాడు.’’ బాపనోల్లు నచ్చాపనచ్చలు కొంచెం సేయి తడిజేస్తే సాచ్చీకం చెప్పిపోతారు బాబూ’’ అంటాడు పోలిశెట్టి.  నాలుగో సన్నివేశంలో అగ్నిహోత్రావధాన్లూ, వకీలు నాయుడూ మాట్లాడుతూ ఉండగా గిరీశం హడావిడిగా రంగంలోకి ప్రవేశిస్తాడు.  అగ్నిహోత్రావధాన్లు పక్కనుంచి గిరీశం మీద పడ్తాడు.  గిరీశం తప్పించుకొని అగ్నిహోత్రుని కాల్లుపట్టిలాగి ‘మామగారికి నమస్కారం’ అని పరుగెత్తుతాడు.  అగ్నిహెత్రుడు కిందపడతాడు.  

                          ఐదో సన్నివేశంలో గిరీశం లుబ్దావధాన్ల బసకొచ్చి ఆయన వ్యవహారాలూ చూడ్డానికి తన పేర ‘పవరాసటర్నామా’ గొలికి ఇచ్చేయ్యమంటాడు.  ఆయన ఒప్పుకోడు.  తర్వాత పోలీస్‌ హెడ్డు, దుకాణందారు వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు.  అసిరిగాడితో సహా అందరూ సాక్ష్యం చెప్పకుండా తప్పించుకొంటారు.  పూజారి గవరయ్య రంగంలో ప్రవేశించి ‘‘అవుధాన్లు గారు పెళ్ళాడినది కామినీ పిశాచం’’ అనీ, తన అబద్దపు సాక్ష్యం చెప్పననీ అంటాడు.  చివరికి నేనే సాక్ష్యానికి దిగి, కేసే నీళ్ళు కారించేస్తాను.  నాశక్తి చూతురుగానీ అంటూనే గిరీశం ‘‘సౌజన్యారావు పంతులుతో మాత్రం మాట ఇంకా చెప్పకండి’ అని హెడ్డుతో చెబుతాడు.  ఆరో సన్నివేశ స్థలం సౌజన్యారావు పంతులు గారి ఇంట్లో మేడమీద ఆయన పడగ్గది.  లుబ్దావధాన్ల మీద వచ్చిన కేసులో గిరీశం తను సత్యవంతున్ని అనిపించుకోవాలనుకొంటాడు.  ‘‘తమరు సెలవిస్తే మూడు సోకాసూ గాలించి పట్టుకుంటానండీ’’ అని తన యోగ్యతను సౌజన్యారావుకు చెప్తాడు.  గిరీశం స్త్రీ పట్ల నాకు విముఖత చాలా ఎక్కువండీ, అందుకే మా వాల్లు నన్ను నెపోలియన్‌ ఆప్‌ ఆంటీనాచ్‌ అని అంటారని సౌజన్యారావుతో చెప్తాడు గిరీశం.  నేను బుచ్చమ్మను ట్రూ లవ్‌ మారేజ్‌ చేసుకుంటున్నానంటాడు.  ఇంతలో పురషవేషంలో మధురవాణి అక్కడికి ప్రవేశిస్తుంది.  గిరీశం నిర్ఘాంతపోతాడు.  సౌజన్యారావు పంతులు, మధురవాణి మాట్లాడుకుంటారు.  తన గుట్టు రట్టు చెయ్యద్దని సైగల ద్వారా గిరీశం మధురవాణికి చూపిస్తాడు.  ‘‘వేశ్యజాతి చెడ్డది కావచ్చు గాని తాము శలవిచ్చినట్టు చెడ్డలో మంచి ఉండకూడదా? మంచి యెక్కడున్నా గ్రాహ్యం కాదా అంటే? అని మధురవాణి అడుగుతుంది.  ఇలా సంవాదం జరిగిన తర్వాత ఆమె తలపాగా దీసి తన నిజస్వరూపం చూపిస్తుంది.  నన్ను ముద్దు పెట్టుకోవాలని ఒక నిబంధన చేసి   ఉంటుంది.  చివరికి సౌజన్యారావు పంతులే వ్రతభంగమైనా బలహీనుడై ముద్దుపెట్టుకోబోతాడు.  ఆమె ముట్టుకోనివ్వదు.  చెడని వారిని చెడగొట్టొద్దని తన తల్లి చెప్పిందంటుంది.  సౌజన్యారావు భగవద్గీతనిస్తాడు.  అదే ఆమెకు పరివర్తనం.  మేడ గదినుంచి గిరీశాన్ని పిల్చి తక్షణం ఇల్లువదిలి వెళ్ళిపొమ్మంటాడు.  దీనితో కథ అడ్డం తిరిగిందని లోకం మీద పడ్తాడు గిరీశం.  రెండు అగ్రహారాలను, రెండు పట్టాల్లోనూ, నిర్దిష్టంగా రూపురేఖలూ, స్వభావాలూ మలచి తీర్చిదిద్ది పాత్రలతో, ఆసక్తికరమైన సంభాషణలతో, అద్భుతమైన సన్నివేశాలతో సాలెగూడు అల్లిక పనితనంలో గొప్ప కళా ఖండాన్ని అందించారు గురజాడ అప్పారావు గారు.  మధురవాణి పాత్ర అనన్య సామాన్యం.  ఈ ఇతివృత్తంలో అత్యంత కీలకమయిన పాత్ర మధురవాణి అనడంలో సందేహం ఏ మాత్రం లేదు.

  – గుండ్లూరు వెంకటరమణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.