ఓయినం

     (రెండో భాగం)

    కళ్ళు ఎర్రగా చేస్తూ ”ఏందిరా బిడ్డా నిన్న తిన్నది యింకా అర్గలేదా ఏంది. ఏందో మస్తు సోంచిల పడిపోయిన వేందిరా యింకా నువ్వు సోంచాంచే పొద్దులు మస్తుగున్నయి గాని మిగిలిన సేనుకి నీళ్ళుపెట్టి మీ పెద్దమ్మెందుకో పిల్సింది బిరాన పో. నేనూ బజారుదాకా పోయొస్తా” అంటూ కోపగిస్తూ ముందుకు కదిలాడు. మొగులయ్య ముఖం చిన్నబోయింది. పోతున్న పెద్దాయినను చూస్తూ ”పెద్దనాయిన ఎప్పుడు గింతే ఏదో ఒక ఒసుగు ఏయ్యందే ఊర్కోడు జెప్పిన పనంతా జేస్త గానీ జెర గలతు అయితే మస్తు తిడ్తడు గిప్పుడు నేనేం తప్పు జేసినానని” అన్కుంటు మరో మడిలోకి నీళ్ళు మలిపాడు. పొలానికి నీళ్ళు పెట్టి మొగులయ్య యింటికి పోయేసరికి పోచమ్మ వడ్లను సంచులల్ల పోస్తు అతని కోసమే ఎదురు చూస్తోంది. మొగులయ్య ఇంట్లకి అడుగుపెట్టంగానే ”మొగిలిగా, ఓ మొగిలిగా జెర బిరాన బజారుకు పోయి వడ్లు గిర్నిల పట్కరా” అన్నది

              ఆకలై కడ్పులో ఎలుకలు పరుగెడుతున్నాయి. ”బువ్వ అంట అడ్గితే పెద్దమ్మ ఏమంటదో” అని అనుకుంటూ వడ్లసంచులకు మూతులు కుట్టి ఎడ్లబండి మీద ఏస్తుంటే పోచమ్మ అన్నం తినమని చెప్పలేదు. మొగులయ్య ఇక తప్పదని బండిని గిర్ని దగ్గరకు తీసుకుపోయేసరికి అప్పటికే వడ్లసంచులతో గిర్ని నిండిపోయి కన్పించింది. అయినా ఆశకొద్ది గిర్నివాడి దగ్గరకు వెళ్ళి ”అన్నా నాయి అయిదు సంచులే ఉన్నయి గిర్నికి ఏస్తవా” అన్నడు.
ఇగో సూస్తున్నవుగా కత వొస్తే ఒక్కపారే గిన్ని సంచులొస్తయి లేకుంటే లే గియ్యల పట్టుడు కాదుగాని రెండు రోజులైనంకా రా” అని అంటుంటే ‘అన్నా అన్నా ఐదు సంచులేనే జెరెయ్యి” అని బతిమాలాడు.

             ”అరె తమ్మి అయిదు లేవు. గియిదు లేవు ఓడ్లు పట్టి పట్టి పెయ్యంతా జాన్‌ జాన్‌ అయింది. సప్పుడుజేక పో” అంటుంటే నిరాశగా వెనుతిరిగి బండి దగ్గరకు వచ్చి ఆలోచనలో పడ్డాడు. ”వడ్ల సంచులని గిర్నికాడ ఏసిపోదునా తిరిగి ఇంటికి తీస్కపోదునా ఉట్టి సేతులతోటి యింటికి పోతే పెద్దమ్మ ఏమంటదో ముందు ఇంటికి పోయి అడ్గివొచ్చినంకనే ఏదన్నా జెయ్యాలే” అని అనుకొని బండిని గిర్ని ముందరే ఉంచి ఎడ్లను విడిచి పక్కనున్న చెట్టుకు కట్టేసి ఇంటికి పరుగుతీశాడు.ఆయాస పడ్తు ఉత్తచేతులతో వచ్చిన మొగులయ్యను చూసిన పోచమ్మ ‘ఏందిరా గట్ల ఉర్కొస్తున్నవు బండేది బియ్యమేవి” అన్నది.

    ”గియ్యల గిర్నిల శానా వడ్లున్నయి పెద్దమ్మ గిర్నివోడ్ని శానా బతిమిలాడిన గియ్యాల పట్టుడు గాదన్నడు ఇంగ రెండురోజులైనంకా పడ్తనన్నడు. ఏమంటవోనని అడ్గుదామని వొచ్చిన” అని వగరుస్తూ చెప్తుంటే”దరిద్రం మొకపోడివి ఏడికిపోయినా గిట్లాంటి అర్కతులే జర్గుతయి తియ్యి మల్ల బండినేడ నాశనం జేసొచ్చినవు” అని కసురుకున్నది.”గిర్నీ కాడనే ఉంది ఒడ్ల సంచులు ఆడనే ఎయ్యాలనా, తీస్కరావాలనా” అన్నడు ఓనికిపోతూ.”ఓర్ని ముదనష్టపోడా ఎవలన్నా ఒడ్లసంచులు ఎత్కపోతే ఎట్లరా పోరాపో పోయి బిరాన బండిని తోల్కరా పో” అంటూ గద్దించేసరికి గిర్ని దిక్కు మళ్ళి పరుగందుకున్నాడు.

   ఎర్రటి ఎండలో మొగులయ్య వేగంగా పరిగెత్తుతుంటే ఒళ్ళంతా చెమటలు పట్టి నాలుక పిడుచకట్టుకు పోసాగింది. అయినా వడ్లసంచులు ఏమౌతాయోననే భయంతో మరింత వేగంగా పరుగెత్తి బండి దగ్గరకు పోయేసరికి అక్కడ సత్తయ్య బండినానుకొని కోపంగా నిల్చున్నాడు. ఆయాసంతో రొప్పుకుంటూ వస్తున్న మొగులయ్యను చూసి ”బండిని ఇడ్చి ఏడ్కిపోయి వస్తున్నావురా వడ్లను గిర్నికెయ్యలేదేంది” అన్నాడు. ”పెద్దనాయినా గిర్నీల శానా వడ్లున్నయి గిర్నోడు గియ్యాల మన వడ్లు పట్టనన్నడు గద్కని ఒడ్ల సంచులను గీడనే ఎయ్యాల ఇంటికి తేవాల అని పెద్దమ్మ నడ్గివస్తున్న” అన్నడు వగరుస్తూ.

        ”అరే బద్మాష్‌ ఆడు వడ్లు పట్టనంటే నువ్వు ఇంటికి పోతావు బే నడువు ఆడు ఎట్ల నా వడ్లు పట్టన్నడో అడ్గుతా” అంటూ గబగబా గిర్నీలోకి వెళ్లి ”ఏందివయా నా ఒడ్లు పట్టనన్నవంట గీ గిర్నిల కొల్వు జెయ్యాలని ఉందా లేదా జెప్పు” అని గిర్నీవాడితో గొడవకు దిగేసరికి. ”ఏంది సత్తెన్నా నీ వడ్లంటే నేను పట్టనాయే. అయినా పొద్దుగాళ్ల నుంచి గీడ్కేని జర్గలే నీ వోడ్లు ఎవళు దెచ్చిండ్రే” అని ఏమి తెలియనట్టు అడిగేసరికి సత్తయ్యకు తిక్కరేగి, వెనకకు గిరుక్కున తిరిగి ”ఏంరా మొగిలిగా నువ్వు వడ్లు తీస్కరాలేదంటుండు నువ్వేమో ఆడుపట్టనన్నడంటివి ఏం సంగతి బిడ్డా” అని గుడ్లు ఉరిమాడు.

      ”లే పెద్నాయినా నేనూ ఒచ్చి ఒడ్లు పట్టమని అడ్గిననే గానీ ఆయననే పట్టనన్నడు రెండు దినాలైనంకా రమ్మన్నడు” అని చెప్పబోతుంటే ”అరే పోరగా నేను నిన్నెందుకు గుర్తువట్ట జెప్పు అసలు నువ్వు గియ్యాల నా ముందలికే రాలే” అని గిర్నివాడు దబాయించేసరికి   ”లమ్డికొడ్క చెప్పిన పనిజెయ్యక ఏడవొయ్యి తిర్గొస్తున్నవురా” అంటూ మొగులయ్య చెంపమీద లాగి ఒక్క దెబ్బ వేసి ”పో పొయ్యి వడ్లసంచులు దెచ్చి గిర్నీల ఎయ్యి” అంటూ అరిచాడు.  మొగులయ్య కండ్లల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. దెబ్బపడిన చెంపను పట్టుకుని గిర్నీవోడి దిక్కుచూస్తూ ఎడ్లబండి వైపు కదిలాడు.

        సాయంత్రం వడ్లసంచులకు బదులు బియ్యంసంచులు, తౌడు సంచులు బండ్లోనుంచి దిగేసిరికి పోచమ్మ ”ఏంరా మొగిలిగా నాతోటి వడ్లు పట్టరన్జెప్పి, ఆడిడా తిరిగి సల్లంగా గిప్పుడు పట్టించుకొస్తున్నవేందిరా” అని నిలదీసేసరికి అప్పుడే వచ్చిన సత్తయ్య కాళ్ళుచేతులు కడుక్కుంటూ ”అసలు గీడు గిర్నికాడికి పోతేగా ఓడ్లు పట్టేది. బండి రస్తలనే ఇడ్సిపెట్టి యింటికొచ్చిననని జెప్తుండు. నేనూ బజారుకు పనుండి పోయొస్త మన బండి జూసి ఆగి ఈనికోసం సుట్టు జూస్తే ఈడేడుండు మస్తుసేపయినంక సల్లగోచ్చి నీకాడికొచ్చిన అని జెప్తుండు. అసలు గీడు నిజంగనే యింటికొచ్చిండా లేక యాడకన్నా తిర్గబోయిండా” అని అనుమానంగా మొగులయ్యను చూస్తూ భార్యను అడిగాడు.

            ”ఆ… పగటాల యింటికొచ్చిండయ్యా, గప్పుడొచ్చి గిర్నోడు రెండుదినాల దాకా వడ్లు పట్టడని జెప్తె బండిని తిర్గి తోల్క రమ్మన్నా. గప్పుడు పోయినోడు యింకెంద్కు యింటికి రాకపోయేనని సూస్తున్న గీడు గిట్లాటి అడ్డమైన అర్కతులు జేయ్యకుంటే ఈని అయ్య సొమ్ము ఏం పోతదో, ఈని అమ్మసొమ్ము ఏం పోతదో, గిదంతా ఎవల దిక్కెళ్ళి జేస్తుండన్కుంటుండో ఏందో పెళ్ళికి పట్టుమని పదిరోజులు లేదూ పెండ్లి ఎట్లయితదో అని నేనూ హైబతుపడ్తుంటే ఈని లెక్కలు ఈనికున్నయి ఈని పెండ్లి పెటాకులుగాను, మన పానంకు తగులవడిండు” అంటూ తిడ్తూనే సీకటి పడ్త్తుందిరా యింకా ఈడనే ఉండి ఏం  పొంచులింటున్నవు పొయ్యి బర్లను మల్పుకు రా పో” అని కసిరింది. పోచమ్మ మాటలు మొగులయ్యను శూలాల్లా గుచ్చాయి. కడుపులో ఆకలి కంటే గుండెమంట అతన్ని ఎక్కువగా బాధించింది.

   ముల్లుకర్ర తీసుకుని యింట్లోంచి మౌనంగా నడిచి ఓరాల గట్లేంట పోతుంటే అప్పటివరకు బిగపట్టుకున్న దుఃఖం ఉప్పెనలా పొంగుకొచ్చి గుండె బరువెక్కింది.
అక్కడే మోకాళ్ళమీద కూలబడి వోరంగట్టుపై పిడిగుద్దులు గుద్దాడు.
 

               పూలు పండ్లు అయ్యాకా బంగళాలో రావలసిన జీతం తెచ్చుకోనికి తల్లితో కల్సిపోయింది నీలమ్మ.
బంగాళా అల్లంత దూరంలో ఉందనగానే తల్లిని ఒదిలి గబగబా పరుగెత్తి దొరసాని ముందు నిలబడింది.
ఎన్నడు లంగా జాకెట్లో వచ్చే పనిపిల్లను లంగా వోణీలో చూసేసరికి ఆశ్చర్యపోయి, వింతంగా చూస్తూ ”ఏందే ఏం సంగతి పనికి రాకా వారంపైననే అయింది ఎందుకొస్తలేవు” అని అడిగింది. ”ఊకనే” అని సిగ్గుపడ్తూ తలొంచుకుంది. ”మరి ఈ కొత్తవేషం ఏమిటి ఆ సిగ్గేమిటి చిన్నపిల్లవు అప్పుడే నీకు వోణీలేంటి” అని అంటుండగానే
గేటులోపలికి ఎల్లమ్మ వచ్చి ”నమస్తేమ్మ” అన్నది. ”ఏం ఎల్లమ్మ ఈరోజు డ్యూటీకి పోలేదా అని క్షేమసమాచారాలు అడ్గుతూ ఏంటి నీలమ్మకు అప్పుడే లంగావోణీలేంటి? అదింకా చిన్నపిల్లేగా” అన్నది గుమ్మం దగ్గరకు వచ్చి.

           ”అవునమ్మ కానీ మొన్న ఆదివారం నా బిడ్డకు పూలుపండ్లు అయినయి గప్పుడే లగ్గం కూడా పెట్టుకున్నం, గా సుద్ది జెప్తామనే వచ్చినం” అని నసిగింది. దొరసాని కండ్లు మరింత వెడల్పు జేసుకుని ”ఏంటేంటి నీలమ్మకు నిండా పద్నాలుగు పదిహేనేండ్లు లేవు అప్పుడే పెండ్లా” అని ఆశ్చర్యపడింది. ”గట్ల ఆశీరపడ్తారేందమ్మా గంతేళ్ళకు నేనొక బిడ్డకు తల్లినయినా” అంటుంటే ”ఎల్లమ్మ మీది ఆ కాలం కాని ఈ కాలంలో పిల్లలకు యింత తొందరగా పెండ్లి ఏం బాగుంటుంది జెప్పు” అని అంటూంటే

                  ”ఏం జెయ్యలమ్మ ఈ పిల్లెనక యింకో ఆడపిల్లుంది ఈ పిల్ల పెండ్లయితే సగం బరువు తీర్తది ఆడపిల్లను కని ఎన్నటికైనా ఒక ఇంటికి ఎత్తియ్యాల్సిందే కల్లానమొచ్చినా కక్కొచ్చినా ఆగయి గట్లనే నా బిడ్డకు పెండ్లి గడియొచ్చింది” అన్నది.
”హు, మిమ్మల్ని మార్చటం ఆ దేవుడి తరం గూడా కాదు, తల్లిదండ్రులుగా మీ బాధ్యతలను మీరు తొందరగా నెరవేరుస్తున్నారంతే” అని నిట్టూర్చి ”సరే మీ ఇష్టం ఏది జరిగినా అంతా మంచే జరగాలి” అంటూ ఇంట్లోకి వెళ్లి జీతం డబ్బులు తెచ్చి ఇస్తు వాటితోపాటే యింకా కొన్ని రూపాలు ఎక్కువ ఇచ్చి ”ఇంగో వీటితో నా గుర్తుగా నీలమ్మకీ ఏదైనా కొనివ్వు” అంటూ నీలమ్మ దిక్కునిండుగా చూసింది. దొరసాని దగ్గర సెలవు తీసుకొనిపోతూ ఇన్ని రోజులు పనిచేసిన బంగళాని తిరిగి తిరిగి చూసింది నీలమ్మ.
  
      మిలటరీలో ఉన్న కొడుకును తొందరగా రమ్మని ఉత్తరం రాయించాడు సాలయ్య.
చెల్లెలి పెండ్లికని పదిహేను రోజుల ముందే పిల్లలను తీసుకొని తల్లిగారింటికి వచ్చింది చంద్రమ్మ.
అక్క పెళ్ళని బుజ్జికి చాలా సంతోషంగా ఉంది.

        ఇంటి ముందర ఉన్న చెట్టుకింద పావులాట ఆడుకుంటూ ”ఇంగో కొన్ని రోజులైతే మాయింట్ల మానీలక్క పెండ్లి దెల్సా. మాయమ్మ మాకు కొత్తబట్టలు దెస్తది, కొత్తగాజులేయిస్తది, మాయింట్ల పూరీలు, గర్జెలు జేస్తం, బగారన్నం వండుతం, యింకా గీ ఆకిలంతా పందిరేస్తం, ఆ సుట్టుతా టెంట్లేస్తం” అని తన స్నేహితురాలికి ఇంటిముందరి స్థలాన్ని చూయిస్తు జరగబోయే పెండ్లిని ఊహిస్తూ చెప్తున్నది. అది విని ”ఔ నాకు ముందే దెల్సులే” అన్నది స్నేహితురాలు.

             ఆ మాటని ”మా యింట్ల సుద్ది నాకు ముందు దెలుస్తది నీకెట్ల దెల్సమ్మా” అని ఎదురు ప్రశ్నించింది బుజ్జి.
”లే బుజ్జి నీలక్కకు కొత్త బట్టలు గట్టించ్చిండ్రు జూడు గప్పుడు ఒగనెలయితే నీలక్కా పెండ్లని మా అమ్మ జెప్పింది” అన్నది.
”ఓ మీయమ్మ గప్పుడు జెప్పిందేమోగాని మాయమ్మ నాకు అంతకంటే ముందుగాళ్లనే జెప్పింది” అని స్నేహితురాలిని ఆధిగమించే ప్రయత్నం చేస్తుంటే అరుగు మీద కూర్చున్న నీలమ్మ చెల్లి అతితెలివిని గమనించి పక్కున నవ్వింది.
కానీ బుజ్జి అదేం పట్టించుకోకుండా స్నేహితురాలి తోటి గొప్పులు చెప్తూనే ఉంది. అంతా విన్న బుజ్జి స్నేహితురాలు ”బుజ్జి అసలు పెండ్లంటే ఏందబ్బా” అని అడిగింది.

           ”ఓస్‌ నీకు గిది కూడా ఎర్కలేదా గదే మనం బొమ్మరిల్లాట ఆడ్తంజూడు గండ్ల పెండ్లికొడుకును పెండ్లిపిల్లనూ జేసి ఆడ్తంజూడు, గదే పెండ్లంటే” అంటూ సంభాషణను పొడిగిస్తూనే ఉంది బుజ్జి. నీలమ్మను ఆలోచనలు వరదల్లా చుట్టుముట్టాయి ”అవును అసలు పెండ్లంటే ఏంది? బుజ్జి అన్నట్టు బొమ్మరిల్లాటనా. ‘ఊహు’ గట్లకాదు. మల్లా బొమ్మల గురుగులాట ఆడుకున్నప్పుడు సిగ్గన్పియ్యదు, గాని మొన్న అందరి ముందర కూకోపెట్టినప్పుడు ఎందుకు భయం అన్పించింది. కండ్లెత్తి అందర్ని ఎంద్కు సూడలే భయం సిగ్గు ఒకటేనా ఊహూ కాదుగానీ కడుపుల ఆ వొనుకెందుకు వచ్చింది చెప్పు” అని మనస్సు నడిగింది.
”ఏమో నాకెర్కలే” అని మనసన్నది.
 

           పెళ్లికి వారం రోజులుందనంగా వీరేశం భార్యాపిల్లలతో బండి దిగాడు సంవత్సరాల తర్వాత వచ్చిన కొడుకుని పట్టుకొని కన్నీరు మున్నీరైంది ఎల్లమ్మ. కోడలిని మనవళ్లని గుండెలకు హత్తుకుంది.
పెళ్లి బాధ్యతనంతా కొడుకుకు అప్పగించి ఊపిరిపీల్చుకుంది. కొన్ని రోజులైతే పెళ్లయి వెళ్లిపోతుందని నీలమ్మని ఇంట్లో అందరూ పూవులెక్క చూస్తున్నారు.ఇంటికి సున్నం వేయటంతో పెళ్ళిపనులు మొదలైయ్యాయి. చుట్టుపక్కల చుట్టాలందరూ వచ్చి బియ్యం చేయటం, కారం దంచటం, ఇసురు రాయిలో పసుపేసి విసరుతూ

అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో
అల్లల్లనేరాడి, అల్లనేరాడి అల్లో నేరేడల్లో
అల్లానేరడి కింద సల్లని సెలిమే        || అల్లో నేరేడల్లో ||
సల్లాని సెలిమే కింద ఎవ్వారిపోయి    || అల్లో నేరేడల్లో ||
సల్లాని సెలిమే కింద నీలమ్మపోయి    || అల్లో నేరేడల్లో ||
సల్లాని సెలిమే కింద మామిడిచెట్టు    || అల్లో నేరేడల్లో ||
ఆ మామిడాకులు పెళ్లి తోరణాలు    || అల్లో నేరేడల్లో ||
ఆ మామిడి చెక్కాలు పెండ్లిపీఠాలు    || అల్లో నేరేడల్లో ||అని పాడారు. చివరగా పిండి ముగ్గును విసరటం చేస్తుంటే సాలయ్య కొడుకును తీసుకొనిపోయి బజారునుంచి పెండ్లికి కావలసిన సరుకులన్నీ తెచ్చారు.

       మరొకరోజు ఎల్లమ్మ, కొడుకు కోడలుతో పెళ్ళిబట్టలు, బాసాన్లు, బంగారం కొనుక్కొచ్చి బట్టలను కుట్టటానికి దర్జీకి ఇచ్చారు.
పెళ్ళి రోజు దగ్గరపడ్తున్న కొద్ది సత్తెయ్య, పోచమ్మ హడావిడి ఎక్కువైంది.

            ఇటు పొలం పనులు చూస్తూ అటు ఇంటికి సున్నం వేయటం, బజారుకు వెళ్లి సరుకులు తేవటం చూస్తుంటే, ఏదో ఒక వంకతో హడావిడి పెడ్తూ పరుగులెత్తించే పెద్దనాన్న, పెద్దమ్మల అజమాయిషీని భరించటం మొగులయ్యకీ భారంగానే తయారైంది.

       సుక్కమ్మ పోచమ్మ కనకమ్మ సత్యమ్మలు వచ్చి అడపాదడపా బియ్యం చేసి కారం దంచి, పసుపు విసిరి పిండి ముగ్గును దంచిపెడ్తుంటే చంద్రయ్య, రంగయ్య, పెండ్లికని సేండ్లోని చెట్లను నరికి కట్టెలు కొట్టారు. దూరంగా అడివిల ఉన్న కానుగు, మర్రి చెట్టనుంచి కొమ్మలను కొట్టుకొచ్చి ఇంటి బయట పందిరేశారు.
సత్తయ్య దగ్గరదగ్గరగా ఉన్న చుట్టాలకి పెండ్లిపత్రికలను పంచి దూరంగా ఉన్న చుట్టాలకు ‘నువ్వే పంచిరారా’ అంటూ పత్రికలను పంచే బాధ్యతను కూడా మొగులయ్యకే అప్పగించాడు.
 

         పెళ్ళికి యింకా ఐదు రోజులుంది.
పొద్దునే తన చుట్టు ఉన్న చుట్టాలందర్ని పిలిచి బజారుకు తీసుకుపోయి అందరికి గోట్లతో కలిపి ఆకుపచ్చగాజులేయించి పెళ్లి కూతురైతున్న నీలమ్మకు ఒక్కోచేతికి రెండు డజన్ల గాజులతో నాలుగు గోట్లు కలిపి పెళ్లిగాజులేయించింది ఎల్లమ్మ.
యింటికి రాగానే నీలమ్మకు చేతులకీ కాళ్ళకీ గోరింటాకు పెట్టి గోర్లపేంటు పెట్టారు.

         సాయంత్రమే పెళ్లికూతుర్ని చేయాలని యింట్లో హడావిడిగా ఒకవైపు పూరీలు వేసేవారు పూరీలు చేస్తే మరోదిక్కు వంటలు చేసేవారు వంటలు చేస్తున్నారు. అవన్ని అయ్యాక గర్జెలు, సేమియా చేశారు, రొట్టెలు పిసికి మలిజా చేశారు. అందరి మనస్సు సాయంత్రం జరగబోయే శుభగడియ మీదుంది.

 ఆ రోజు మొగులయ్యకు నలుగుపెట్టి పెండ్లికొడుకును చేసే దినం పొద్దున పత్రికలు పంచబోయిన మొగులయ్య ఇంకా యింటికి రాకపోవటం చూసి ”పొద్దుమింకుతోంది పోరగాడు యింకా యింటికి రాకపోయేసరికి ”ఏందిరా సత్తయ్య ఆడ్ని గియ్యాల కూడా ఆడ్కి యీడ్కి పంపియ్యకపోతే యింట్లనే ఉంచొచ్చుగదరా” అన్నడు పెద్దయ్య దారిదిక్కుచూస్తూ.
”పంపియ్యకపోతే ఏం జెయ్యమన్నవ్‌? ఆ… ఏం జెయ్యమన్నవ్‌ జెప్పు? నా పోరలా సిన్నోళ్ళు, నేను, అది ఇద్దరమే ఎంతకని తన్కులాడాలే జెప్పు? మనోళ్ళు ఒక్కలన్నా సమయాని ఒస్తుండ్రా జెప్పు? ఆడ్కి శాతనైనకాడ్కి పొర్లాడుతున్నగదే” అన్నడు కోపంగా.

         ”నువ్వు! నీ పెండ్లాము పిల్వంది మనోళ్ళెంట్ల వస్తార్రా అయిన శాతనైన కాడ్కి ఆళ్లు జేసే పన్లు ఆళ్ళు జేస్తేనే ఉండ్రు. యింగ సుట్టాలకి పక్కాలకి పత్రికలు ఇచ్చుడంటే అది నీకే ఎర్క. ఏమెరుగని పోరనికి పత్తజెప్పి పత్రికలిచ్చి రమ్మంటే ఆడు పత్తా సరిగా దెల్వక ఏడేడ తిర్గుతుండో పెండ్లికొడుకును జేసేటయిము రావట్టెరా” అని అంగలారుస్తూ పెద్దయ్య అక్కడ్నించి లేచిపోయాడు.

       ”ఏడ్కి పోతడు తియ్యి, టయిముకి ఆడే కుక్క లెక్కవస్తడు” అని సత్తెన్న సుట్టకాల్చుకుంటు ఇంగో నేనూ గట్ల దుక్నం కాడ్కిపోయ్యొస్త” అంటు కల్లు దుకాణం దిక్కు కదిలాడు.

           పక్కనే పందిరి గుంజలు నాటుతున్న చంద్రయ్య, రంగయ్య, ఎల్లయ్యలు ఈ సంభాషణ అంతా వింటునే ఉండి సత్తయ్య ఎదురు నుంచి పక్కకు పోగానే ”చంద్రన్నా జూస్తున్నవాయే సత్తెన్న లెక్కలు మనం జేసేది మనం జేస్తున్నం మీది మిక్కిలి ఏం జేస్తలేడంటడేందన్నా, అటు మొగిలిగాడు గూడా ఒక్క తీర్గపన్జేయ్యవట్టే ఇంగ గీకత జూడు మనం పత్రికలియ్యపోతే మనకు బస్సుచార్జీలు ఇయ్యవడ్తదన్జెప్పి, ఆడ్ని పంపిస్తే ఎంత దూరమన్నా నడ్సివోయి ఇచ్చొస్తడని ఆడ్ని ఆడ్కిఇడ్కి పంపిస్తుండు. కొడుకు గియ్యాల పెండ్లికొడుకైతడని గింతన్నా ఇనికి శమగుణం ఉందా బద్మాషుగాడు మనకు పేర్నాల వేడ్తడుగానీ ఈడెంత కతర్‌నాకోడన్కున్నవ్‌ థూనీయమ్మ పొద్దుగాళ్ల లేసి ఈని మొఖం జూస్తే పాపం పెద్దొడని మర్యాదిస్తున్నగాని లేకుంటేనా” అని ఎల్లయ్య కోపంగా పండ్లు పటపట నూరాడు.

        ”అవునే ఆడ్ని పొద్దుమింకి ఆరుగంటలకే పెండ్లిపిల్లగాడ్ని జేయాలన్రి, గియ్యాలగూడా  అని సేతికి పత్రికలిచ్చి తోలియ్యకపోతే గీయన ముల్లె ఏం బోయింది ఇచ్చిన కాడ్కి వచ్చినోళ్ళేసై” అన్నడు రంగయ్య.

         ”ఇంగోరా గిన్ని దినాలు సత్తెన్న ఆడింది ఆట పాడింది పాటైంది. ఈయన ఎట్ల జెప్తె మొగులయ్యగాడు గట్లిన్నడు, ఎట్లాడిస్తే అట్లాడిండు పెండ్లిదాకా ఈయన కతలు సాగుతాయి. యింగ ఆనికి రెండు సేతులు వోయి నాలుగు సేతులైతున్నాయి దినాలెప్పుడు ఒక్క లెక్కుండయి తమ్మి నవ్విన నాపచేనే పండే రోజొస్తది రా!” అంటూ మామిడాకులు కట్టడంలో మునిగాడు చంద్రయ్య.
 

      ఆరోజు నీలమ్మను పెండ్లిపిల్లను చేస్తరు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది. ఇంట్లో భోనం చేసి నీలమ్మకు ఎత్తి పోచమ్మ గుడి దగ్గరకు పోతుంటే ముందుగా డప్పులు వాయిస్తూ డప్పులోళ్ళు ముందు నడుస్తుంటే చుట్టాలు పక్కాలందరు కదిలివచ్చారు. గుడి దగ్గర భోనం, పెండ్లి బట్టలు ఎక్కించి దేవతకి దణ్ణం పెట్టుకుని యింటికి వచ్చి ఇంట్లో కొత్త సాపేసి దానిపై పెండ్లిపీటలేసి నీలమ్మ పక్కన తోడ పెండ్లికూతురును కూర్చోబెట్టి, రెండు మాణిక్యాలల్లో ఐదు దీపాలు ముట్టించి, పెద్ద తాంబూలంలో పసుపేసి కలిపి, మరో చిన్న తాంబూలంలో పసుపేసి కలిపి ముందుగా వచ్చిన ముత్తైదువలకి కాళ్ళకీ పసుపు పెట్టి, నుదుటన కుంకుమ బొట్టును దిద్ది, తలలో పువ్వులు పెట్టి చెంపల కింద గంధం పెట్టి, చాపేసి కూర్చోపెడ్తూంటే, మరోదిక్కు పెళ్లికూతుర్ని చేసే చుట్టాలు నీలమ్మకు తాంబూలంలో ఓయినం తీసుకొస్తుంటే ఒక దిక్కు ఎల్లమ్మ మరో దిక్కు సుక్కమ్మ చుట్టాలకు ఎదురెళ్లి తాంబూలాలను అందుకున్నారు.

– జాజుల గౌరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

9
Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో