సుకన్య

సుకన్య తాననుకున్నట్లు ఆశ్రమాన్ని నిర్మించే పనిలో మునిగి పోయింది. చిన్నాన్న గోవిందయ్య అన్ని పనులు పురమాయించటం, దగ్గరుండి శ్రద్ధగా పనిచేయించటం తన కర్తవ్యంగా భావించాడు.
వనజ కూడ తన సమయాన్నంతా సుకన్యతోనే గడపసాగింది.

సుకన్య తండ్రి మరణవార్త విన్న చందు ఫోన్‌లోనే సుకన్యతో మాట్లాడాడు. ట్రైనింగ్‌ ప్రోగ్రాం ఉండటం వల్ల రాలేకపోయానని, తన విచారాన్ని తెలియచేసాడు. వివేక్‌ కూడ ఢిల్లీలోనే ఉండటం వల్ల అతని తల్లిదండ్రుల ద్వారా గ్రామసమాచారాలన్ని ఎప్పటికప్పుడు వివేక్‌కి తెలుస్తుంటాయి. వివేక్‌ ద్వారా చందుకి తెలుస్తాయి…
  

వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తుంది సుకన్య అని తెలియగానే ఎందరో వచ్చి సలహాలు ఇచ్చారు సుకన్యకు. ఎంతో కొంత డబ్బు వసూలు చేయకుండా ఎట్లా నడుపుతావు అని సలహా ఇచ్చారు. అప్పడు గాని సుకన్యకు ఆలోచన రాలేదు.
  

  ”తాను ఉచితంగా తిండి తిప్పలు చూస్తుంటే వందల కొద్ది వచ్చిచేరుతారు. ఎంతో కొంత ఉన్నవారి వద్ద తీసుకొంటూ దిక్కులేనివాళ్ళకు, అనాధ పిల్లలకు ఉచిత భోజన, విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించుకొంది. తన నిర్ణయాన్ని తల్లితో చెప్పింది. ఈ మధ్య సుకన్యకు తల్లి ఆప్తమిత్రురాలయింది. తండ్రి పోయిన బాధను తనలో పోగొట్టింది. తన నిర్ణయాన్ని తల్లికి చెప్పింది. ఆమె కూడ తన అంగీకారాన్ని తెలిపింది. గోవిందయ్య నిర్విరామ కృషితో మూడునెలల్లో ఆశ్రమం సిద్ధమయింది. మరొక నెల రోజుల పాటు వంట వార్పు వగయిరాలన్ని సిద్ధ పరచారు. అప్పటికీ ఆస్ధలంలో అనేక రకాలయిన చెట్లు ఉండటం వల్ల అనవసరమైన వాటిని కొట్టించి తక్కిన వాటిని వదలి వేయటం వల్ల ప్రశాంతంగా అది ఒక మున్యాశ్రమంలాగా భాశిస్తున్నది. ఆశ్రమానికి  ‘వెంకయ్య’ పేరే పెట్టాలని సుకన్య ఆశయం ఫలించింది. ఆ వయసులో సుకన్య చేస్తున్న ఆ నిస్వార్ధత్యాగాన్ని అంతా కొనియాడకుండ ఉండలేకపోయారు. ఆనోట యీనోట విషయమంతా తెలుసుకున్న చందు తల్లిదండ్రులు కనకయ్య, సాయమ్మ ఒక్కసారి సుకన్యని కళ్ళారా చూద్దామని బయలుదేరారు.
ఆశ్రమంలోకి వచ్చిన ఆదిదంపతుల లాగా ఉన్న వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది సుకన్య.
   

”అమ్మా! ఇంత చిన్న వయస్సులో నీకింత పెద్ద ఆలోచన రావటం ఎంతో ఆశ్యర్యం. చల్లగా నూరేళ్ళ వర్ధిల్లాలి” అన్నది సాయమ్మ అప్యాయంగా తల మీద చెయ్యి ఉంచి.    సుకన్య ఆ దంపతుల సంస్కారానికి మెచ్చుకోకుండా ఉండలేక పోయింది. అటువంటి మంచి వారింటికి తాను కోడలుగా వెళ్ళలేక పోయానే అనుకొంది. కనకయ్య ఆశ్రమం అంతా కలయచూచాడు. ఎక్కడకక్కడ పొందికగా అమర్చి అన్ని వసతులతో అనాధలకు అన్నట్లుగా కాకుండా శ్రద్ధగా తనకోసం అన్నట్లు ఆ అమ్మాయి కట్టించింది అనుకొన్నాడు. అంతే కాదు ఆయనకు ఆ నిముషంలో ఒక ఆలోచన కూడ వచ్చింది ‘ఈ అమ్మాయి పెండ్లయి భర్తతో కాపురం చేస్తు పిల్లల్ని కనిపెంచినట్లుయితే ఆ కుటుంబానికొక్క దానికి పరిమితమయ్యేది తన శక్తిని తెలివిని అందరికి పంచపెడుతున్నది ఇది చాల గొప్ప విషయం.’
”అమ్మా! నీవు చేసిన పని చాలా మంచిది. ఇంత గొప్పపని చేయాలంటే ఎంత గొప్పమనసు ఉండాలి. పది కాలాల పాటు చల్లగా ఉండాలి” అంటు దీవించాడు కనకయ్య.

సుకన్యకు ఈ పనిలో పడిపోయాక చందు జ్ఞాపకాలు కూడ కొంచెం కొంచెంగా మరుగున పడుతున్నాయి. ఎంత సేపు ఆ అమ్మాయి ఆలోచనలన్నీ పిల్లల వసతులు గురించి వారి చదువు గురించి… తాను కాక ఎటువంటి స్వార్థ చింతన లేక పనిచేసే మరికొంత మంది ఉపాధ్యాయులుంటేనే కాని పాఠశాల నిర్వహణ జరగదు. అటువంటి సేవాపరాయణుల కోసం వెతుక్కోవటం ఈ ఆలోచనలతో సతమతమయ్యేది.

మరొక్క ఆరునెలల్లో పదిహేను మంది అనాధ బాలలు ఇరవై మంది వృద్ధులతో ఆప్రాంతమంతా సందడిగా ఆనందమయంగా కనిసించింది. అందరు సుకన్యను ఎంతో ప్రేమగా ‘అమ్మా’ అని పిలిచేవారు. ఆ పిలుపులోని ప్రేమ, ఆప్యాయతలు ఆమెను కట్టిపడేసాయి.  చందుకోసమే తాను పుట్టాననే భావనలో క్రమంగా మార్పు చోటు చేసుకోసాగింది. ఈ భీకర తిమిరలోకంలో కొట్టు మిట్టాడే వారికి తానొక చిన్న వెలుగు రేకై త్రోవ చూప గలుగుతుంది… అంతే చాలుననుకొంది సుకన్య. నిరంతరం ఆమె ఆలోచనా ప్రపంచం ఆ అనాధ బాలుర చదువు, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే తపన ఎక్కువయింది. ఈ పిల్లలంతా తల్లిదండ్రులెవరో తెలియనివారు. బస్టాండు, రైల్వే ఫ్లాట్‌ ఫారాల మీద అడుక్కొని జీవించేవారు. వారికి తను ఎలాగో నచ్చచెప్పి ఇక్కడకు తెచ్చింది. ముందుగా వాళ్ళతో బాగా మాట్లాడించాలనే ఆమె ప్రయత్నం… వారు ఎవరు లేనప్పుడు అలవాటయిన భాషలో బూతులు మాట్లాడుకొనేవారు ఒకరినొకరు తిట్టుకోనే వారు. వారిని ఆ త్రోవ నుండి సరయిన త్రోవలోకి తిప్పటం చాల కష్టమని పిలిచింది.వనజ విసిగిపోయింది. ”అక్కా! నిజానికి ఏపని ఆరంభించినా ఏదో ఒకసమస్య ఉంటునే ఉంటుందేం? వీళ్ళని ఒక త్రోవకు తేగలనన్న నమ్మకం నాకు లేదు. మరి నీ వేమనుకొంటున్నావ్‌!”

”అంత తొందరగ మార్పురాదు. కాని తప్పనిసరిగా వస్తుంది. ఆలనా పాలనా ఉండి ఎంతో క్రమశిక్షణతో పెంచబడుతున్న పిల్లల్లోనే మనం ఎన్నో అవలక్షణాలను చూస్తున్నాం… వీళ్ళు నిద్రలేచింది మొదలుకొని ఆకలి తీర్చుకొనే ఆరాటం తప్ప మరొక పరిస్ధితి నెరిగిన వారు కాదు. బాధ కలిగితే ‘అమ్మా’ అన్నా ఆ అమ్మకర్ధం ఏమిటో ఆ ఓదార్పు ఎట్లా ఉంటుందో తెలిసిన వాళ్ళు అసలే కాదు.తోడు లేక బ్రతికే దారి లేక, ఉంటానికి గూడు లేక, ఎవరికీ అవసరం లేని, పనికి రాని జీవచ్ఛవాల్లా ఇంత వరకు బ్రతికారు. ఇప్పుడిపుడే వాళ్ళకి అసలు జీవితం అంటే ఏమిటో బోధ పడుతుంది.

ఏది ఏమైనా వాళ్ళని మనుషులుగా మార్చేందుకు నా సర్వశక్తులు వినియోగిస్తాను.” సుకన్య చూపుల్లో ఆశాకిరణాలు.
ఆ ఆశ్రమంలో ఉన్న వృద్దుల్లో కొందరు బిడ్డలు లేక చూచే వాళ్ళు లేక వచ్చి చేరారు. ఇంకొందరు పిల్లలు ఉద్యోగరీత్యా దూరప్రదేశాల్లో ఉండటం చేత అక్కడ ఉండటం యిష్టం లేక వచ్చి చేరారు. మరి కొందరు కొడుకు కోడళ్ళు తమను సరిగా చూడటం లేదని వచ్చారు.

జీవితానుభవాన్ని కాచి వడపోసిన వయస్సు మళ్ళినవారు. వారిలో చక్కగా చదువుకొన్న వారున్నారు. ప్రక్కనే ఉన్న అనాధపిల్లల్ని దగ్గరకు తీసి వాళ్ళకు మంచి మంచి కధలు వినిపించటం వారివంతు.

అసలు నిరాశా నిస్పృహ అన్నది దగ్గరకు రానీయకుండా చేయాలని సుకన్య ప్రయత్నం. పేపర్‌ చదవటం చర్చించుకోవటం మంచి పుస్తకాలు చదవటం రామాయణభారత కావ్యాలను చదివి అవంటే యిష్టమయిన వారినందరిని చేర్చి వినిపించటం, టి.వి కొద్దిసేపు చూడటం ఓపిక లేని వారయినా సరే కూర్చుని ఆడుకొనే ఆటలయిన చదరంగం, గవ్వలాటలు ఆడటం ప్రతివారు ఏదో ఒకపనిలో నిమగ్నమయి సరదాగా గడపాలి. అదీ  సుకన్య ధ్యేయం. ఒకరిద్దరు ఆశ్రమంలో చేరటానికి వచ్చి వయసులో ఈపిల్ల ఇంత చిన్నది మనందరిని ఎట్లా సంభాలించగలదు’ అనుకొన్నారు. ఇప్పడు ఆ మూతి విరిచిన వారే సుకన్యలోని చాకచక్యం, ఓర్పులకు ముక్కుమీద వేలు వేసుకొంటున్నారు.ఆశ్రమాన్నంత శుభ్రంగా ఉంచటం అందరి విధి… వృద్ధులకు వంట వేరుగా తయారు చేయించేది సుకన్య వాళ్ళకు తేలికగా జీర్ణమయే పదార్ధాలు… అందరు కట్టిన డబ్బంతా ఎంత ఉందో, ఏమి చేయాలో ఎట్లా చేయాలో అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. 

అందరు సమావేశం అయి చాలా చక్కగ ఏమి వండాలి, ఎంత వండాలి, అని నిర్ణయించుకొనే వారు. వాళ్ళ డబ్బు వాళ్ళకు చక్కగా వినియోగించటం తప్ప సుకన్య ఏ విషయంలోను జోక్యం చేసుకొనేది కాదు. నిజానికి అది వృద్ధుల ఆశ్రమం అయినా అక్కడంతా ‘సహకారజీవ విధానం’ కనిపించేది. ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా ఒకరితో ఒకరు ఎంతో ఆత్మీయంగా, కలివిడిగా వ్యవహరించేవారు. ఒకరి జీవిత గాధలను మరొకరితో కలబోసుకొనే వారు. బాల్యస్మృతులు, యౌవనపు చిలిపి చేష్టలను తవిడి చూసుకొనేవారు. ఏండ్లు పైబడిన వారమనే ‘ఒకే కారణం’ వాళ్ళందరిని కలిపి ఉంచింది.
పిల్లలకు భారమై, విసుక్కొంటూ, తిట్టుకొంటూ అట్లా జీవితం గడిపే కంటే ఇదే వాళ్ళకు ఎంతో ఆనందంగా, హాయిగా, తృప్తిగా అనిపించసాగింది. ఇంతకాలం భర్తకు, పిల్లలకు, వారి పిల్లలకు సేవచేసి, ఇప్పడు అలసి, ఓపిక తగ్గిన ఈ రోజుల్లో విశ్రాంతిగా గడపడం, తమకిష్టమైన పని న్విహించుకొవటం ఎంతో తృప్తినిస్తున్నది. వారిలో వృద్థులు వితంతువులు కొందరయితే ఏవో కారణాలవల్ల భర్తవదిలిన వారు. అసలు పెండ్లే కానివారు. కొందరు లేసులు అల్లి, స్వెట్టర్లు అల్లి వాటిని అమ్మకానికి పంపి డబ్బుసంపాదించుకొనేవారు.

సుకన్య కెందుకో ఇంత క్రితం తాను బ్రతుకు బాటలలో కడదాక ఒంటరిగానే ప్రయాణం చెయ్యాలేమో! అనే భయం ఉండేది. ఇప్పుడట్లా అనిపించటం లేదు. తనతో పాటు వీరంతా తోడువస్తారు!
చాలు ఆ ధైర్యం… ఎంతో తృప్తినిచ్చింది.

రోజువలెనే ఆరోజు కూడ సాయకాలం పిల్లలంతా ఒక వైపు ఆడుకొంటున్నారు. స్త్రీలు ముగ్గురు, నలుగురు అక్కడక్కడ కూర్చొని కబుర్లాడుకుంటున్నారు. కొందరు పఠనంలో ములిగిపోయారు. వెంకమాంబ అనే ఆవిడ చాల శ్రావ్యంగా భాగవతపఠనం చేస్తున్నది.

”ఎవ్వని యవతారమెల్ల భూతములకు సుఖమునువృద్ధియు సొరిదిజేయు
నెవ్వని శుభనామ మీ ప్రొద్దునుడువంగ సంసారబంధములు సమసిపోవు
నెవ్వని చరితంబు హృదయంబు జేర్చిన భయమొంది మృత్యువు పరువు పెట్టు
నెవ్వని పదనది నేపారు జలములుసేవింప నైర్మల్యసిద్ధిగలుగు
దపసు లెవ్వని పాదంబు దగిలి శాంతి తెఱంగుగాంచిరి, వసుదేవదేవకులకు
నెవ్వడు దయించె తత్కధలెల్ల వినగ, నిచ్చపుట్టెడు నెఱిగింపు మిద్ధచరిత”

ఆశ్రమం ముందుకు కారు ఒకటి వచ్చి ఆగింది.. కారునుండి పుల్‌సూట్‌లో ఆజాను బాహుడయిన యువకుడు దిగాడు. ఆవెనుక అతన్ని తీసిపోని మరొకతను దిగాడు. వారు చకచక నడుచుకంటూ ఆశ్రమం వైపు వస్తున్నారు. వీరిరాకను గమనించి ఎవరో ఆఫీసర్లు వస్తున్నారంటూ పనిమనిషి వెంకటమ్మ సుకన్య గదిలోకి వెళ్ళి చెప్పింది. సుకన్య గబగబా నడుచుకుంటూ గది నుండి బయటకు వచ్చింది. ఎదురుగా వేగంగా చంద్రధర… ‘మర్యాద పురుషోత్తముడు’ శ్రీరాముడు… అని వెంకమాంబగారి గొంతువినపడుతుంది. చందుని చూడగానే సుకన్య నిశ్చేష్టురాలయింది. కబురయినా లేకుండ వచ్చిన ‘అనుకోని అతిధి’… మాట రాలేదు… కంటి రెప్పవేయటం మరచిపోయి చూస్తుండి పోయింది. అసలే పచ్చని బంగారు వర్ణం వాడేమో. ఢిల్లీలో ఉండటంవల్లనో… లేకుంటే ఆ పదవిలోని గాంభీర్యం వల్లనో మరింత పచ్చగ, అందంగా, ఠీవిగా కనబడుతున్నాడు.

చందు సుకన్యని చూచి ఆశ్చర్యపోయినాడు. సన్నగా ఉండే ఆమె మరింత సన్నగ అయిపోయింది. అయినా ఆమెలో ఏదో గొప్పతనం… ప్రేమమూర్తిలా ఉంది. అమ్మలోని ప్రేమనంత రాశిబోసినట్లున్న మాతృత్వంలోని గొప్పదనం ఏదో ఉంది…
ఇద్దరు తేరుకున్నారు రెండు నిముషాల్లో ”చందూ… నీవు… ఇదేనా రావటం…” సుకన్యే ముందు ప్రశ్నించింది.
”ఇదిగో నాకు కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఆర్డర్లు వచ్చాయి. నీకు చూపుదామనివచ్చాను…” అంటూ సుకన్య చేతిలో ఉంచాడు. చందు ఆర్డర్లు సుకన్య ఒకటికి రెండుసార్లు చదివింది… విశాలమైన కళ్ళు… విప్పార్చి చందువైపు చూచింది. కండ్ల్లనిండా ఆనంద భాష్పాలు… ఆ చూపులోని భావాలను… ఆ ప్రశంసలను అందుకొన్నాడు చందు. మరునిముషం తేరుకొని ”సుకన్యా! ఇదా ఆశ్రమం… చాలా బాగుంది. ఎంతో మంచి పనిచేసావు. ఆశ్రమాన్ని చూపించు మరి”  ఎంతో చనువుగా అడిగాడు. అతనే మళ్ళి వివేక్‌ని చూపుతూ.

”ఆఁ నీకు ఇతన్ని పరిచయం లేదు కదా! వివేక్‌  అని నా మిత్రుడు. సన్నిహితుడు. స్నేహితుడు. తమ్ముళ్ళులేని నాకు ఆ కొరత తీర్చాడు.” వివేక్‌ తానే కల్పించుకొని అన్నాడు. ”మిమ్మల్ని నేను బాబాగారి ఆశ్రమంలో ఉండగా కలిసాను. గుర్తు వచ్చిందా?””ఔను! నేను మిమ్మల్ని మరచి పోలేదు” అంది నవ్వుతూ సుకన్య.
వనజ అతిధులందరికి అల్పాహారం ఏర్పాటు చేయించింది.

వనజ కెందుకో వివేక్‌లోని ఉత్సాహం, చురుకుదనం ఎంతో ఆకర్షించినాయి. చందులాటి మంచి మనిషిని భర్తగ పొందలేక పోయిన అక్క దురదృష్టానికెంతో బాధపడింది.ఆశ్రమం అంతా తిరిగి చూచి సుకన్యని ఎంతో అభినందించారు అంతా. చందు ప్రత్యేకంగా సుకన్యని మెచ్చుకోలుగ చూస్త్తూ అన్నాడు.

”నీకిట్లాటి అద్భుతమైన ఆలోచన వచ్చినందుకు నిన్ను మనసారా అభినందిస్తున్నాను.”
సుకన్య కృతజ్ఞతాభావం ఉట్టిపడేలా చూచింది. ఏకాంతంగా సుకన్యని, చందుని వదిలేలాగా వివేక్‌ అందరిని మాటల్లో పెట్టి పక్కకి తీసుకువెళ్ళాడు.

”సుకన్యా! మనం వివాహం చేసుకొంటానికి మీనాన్న గారి అనుమతి పొందావా?”

”లేదు చందు ఆయన నావద్ద పెండ్లాడవద్దని ప్రమాణం చేయించుకొన్నారు. కాని పెండ్లి చేసుకోమని ఒక్కరోజు తన నోటితో అనలేదు. పైగా ఈ ఆశ్రమం నెలకొల్పటానికి ఆయనిచ్చిన ప్రోత్సాహం చాలా ఉంది. బహుశా ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చి ఉండవచ్చు. కాని దాన్ని నాకు తెలియ చేయలేదు… అందుకే నేను యిటువంటి నిర్ణయానికి వచ్చాను. చందు మీ అమ్మనాన్న ఉత్తములు వారికెటువంటి బాధకలిగించకు… చక్కగా పెండ్లాడి జీవితాన్ని ఆనందమయం చేసుకో.
”ఓహో! ఈ విషయంలోనే నీవే ఉత్తమురాలివి అనిపించుకోవాలనా? నీకు లేని పెండ్లి-సంసార జీవితం నాకులేవు. నీవు ఇందరికి సేవ చేస్తుంటే చూచి నేను నీనుండి కొంతయినా నేర్చుకోవద్దా… నాపరిధిలో నేను నా జిల్లా ప్రజలకు నాకు చేతనయినంత వరకు సహాయ సహకారాలనందిస్త్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతాను.  నిజానికి భార్యభర్తలుగా మనం ఆదర్శాలు ఆశయాలు ఉన్నా కొంతవరకు స్వార్ధానికి పట్టుబడేవారం ఏమో! ఇపుడు ఏవిధమైన ఆశ, లోభం లేకుండా నిస్వార్ధమైన  సేవలు చేయటానికి అవకాశం వచ్చింది. నీకు నా సహకారం ఎప్పటికీ ఉంటుంది. నాకు నీ సహవాసం ఎప్పుడు ఉంటుందని నా విశ్వాసం…”చందు సుకన్య రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకొన్నాడు. ఆప్యాయంగా ఆ చేతులను  ముద్దు పెట్టుకొన్నాడు.
  
వివేక్‌ తరచు ఆశ్రమానికి రావటం వనజ వివేక్‌ రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వంతో వాళ్ళమధ్య చనువు సన్నిహితత్వం పెరిగాయి. ఇద్దరు పెద్దల అనుమతితో ఏవిధమైన హంగు ఆర్భాటం లేకుండా రిజష్టర్‌ మ్యారేజి చేసుకున్నారు.

సుకన్య తల్లి సీతమ్మకు తన కూతురు చేస్తున్న పనిలో ఉన్న త్యాగం, ప్రేమ అర్ధం అయినాయి. ఆ అమ్మాయిని ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు. అభినందిస్తున్నారు… ఆశీర్వదిస్తున్నారు… ఆశ్రమం అభివృద్ది చెందుతున్నది. ఎందరో దాతలు సాయం చేస్తామని వస్తున్నారు… కలెక్టరు చంద్రధర్‌కి ఆమె సేవలను గర్తించిన అధికారులు సన్మానం చేయాలని సిఫార్సులు పంపారు. చందు చేతుల మీద సన్మానం ‘అనాధ బాంధవి’ బిరుదు అందుకొన్న సుకన్య తన జీవితం ధన్యం అయింది అని భావించింది.

సీతమ్మ తన బిడ్డకు లభించిన గౌరవాదరాలకు పొంగిపొయింది. తన భర్త పేరుతో ఉన్న ఆ ఆశ్రమం నిరంతరం ఆయన్ని గుర్తుతెస్తూ ఆమెకెంతో తృప్తి నిచ్చింది… అసలు తాము తమ బిడ్డకి ‘సుకన్య’ అని పేరెందుకు పెట్టారో! ఏ ముహూర్తాన ఆపేరు పెట్టారో ఆమె ఎప్పటికీ కన్యగానే ”సుకన్య” గానే మిగిలిపోయింది కదా అని చింతించింది సీతమ్మ.
ఎవరు ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది.   
ఆరోజు ఉదయమే కనకయ్య, సాయమ్మ ఆశ్రమంకి వచ్చారు. వస్తూనే సుకన్యని చూచి సాయమ్మ ఎంతో ప్రేమగా కౌగిలించుకొంది.

”తల్లీ నీ గురించి అంతా విన్నాను… నీలాటి సత్యకాలపు మనుషులు ఈ రోజుల్లోను వుంటారంటే నమ్మబుద్ధెయ్యలేదు. తండ్రి కిచ్చిన మాటకోసం జీవితాన్నే త్యాగం చేసావా తల్లీ” సాయమ్మ కండ్ల నిండా నీళ్ళు.
”అమ్మ! నీవు ఒప్పుకుంటే మాకున్నదంత నీకిచ్చి, ఈ ఆశ్రమంలో అందరికి సేవలు చేసుకుంటూ పడుంటాం… ఊఁ అనమ్మ” కనకయ్య అభ్యర్ధన.

”మీలాటి పెద్దవాళ్ళ సహకారం ఉంటే ఇంక నాకంత కంటే ఏంకావాలి” సుకన్య వాళ్ళకు నమస్కరిస్త్తూ అంది.
మంచి పనులన్నీ ఒకేసారి జరిగిపోతున్నాయా అన్నట్లు మరోగంటలోనే రామేశం వచ్చాడు.  ఒక్కడే కాదు. ‘ఎలిజిబెత్‌’ తో సహా తన కండ్లను తానే నమ్మలేక పోయింది సుకన్య.

”వచ్చాను సుకన్య గారు నా శ్రీమతితో సహా! మీలాటి నిస్వార్ధపరుల దగ్గర పనిచేయటం నా పూర్వ జన్మ సుకృతం… నిజమైన ఆశ్రమం అంటే మీదే? ఏ ప్రతిఫలం ఆశించకుండా ‘మానవసేవే మాధవసేవ’ అనే ధ్యేయంతో మీరు చేస్తున్న ఈ సత్కార్యాన్ని అభినందించకుండా ఎవరుంటారు. అందుకే ఉడతా సాయంలా నేను, నా శ్రీమతి చేతయినంత సేవచేస్తాం…” వచ్చిరాగానే రామేశం పొగడ్తలతో ముంచెత్తాడు సుకన్యను.

”రామేశం గారు మీరు మీ శ్రీమతితో సహా ఇట్లా ఈ అనాధలకు సేవ చేయడానికి రావటం ఎంతో ఆనందంగా ఉంది… నేను గాక వీళ్ళని గూర్చి ఇంతమంది ఆలోచించే వాళ్ళున్నారంటే… ఇంత మంది మంచి మనుషులున్నారు అని నాకు సంతోషం కలుగుతుంది. మీ అందరి సహకారంతో నేను ఈ పనులన్ని చక్కగ నిర్వహించగలను… మీ అందరి అండదండలతో ఇక్కడ ఈ పిల్లలను దేశసేవకై వినియోగ పడేవారిలా తీర్చిదిద్దుతాం మనమందరం. ఏమంటారు?

రెండో కంటికి తెలీకుండ చందు తనజీతంలో సగాన్ని గుప్తదానంలాగ సుకన్య ఆశ్రమ నిర్వహణకు పంపుతున్నాడు. మంచితనం మమత – సంకల్పం – సహకారం అనే నాలుగు స్తంభాల మీద నిర్వహించబడ్డ ప్రేమాలయానికి చలువపందిరి లాంటి చందు అండదండలు… సాయమ్మ, సీతమ్మ, గోవిందయ్య, కనకయ్యల నిరంతర అనురాగ పర్యవేక్షణ. ఎందరో స్వార్ధపరులు తమని తాము ఆత్మశోధన చేసుకొనే లాంటి సుకన్య అపూర్వ త్యాగం ఆశ్రమానికి పెట్టనికోటలై భాసిల్లుతున్నాయి. విశాలమైన ఆ ఆవరణకంటె మించిన హృదయ వైశాల్యమున్న ఆ ఆవరణలో శాంతి – సహనం – ఓర్పు – అనురాగం – అప్యాయతలే ఆస్థులుగా పెరుగుతున్న ఆ పిల్లలు భావి భారత ఆశాకిరణాలు! సుకన్య కంటి వెలుగులు

@@@          సమాప్తం    @@@

– విజయ బక్ష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సుకన్య, , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో