నేను ఎవరు?( సమకాలీనం) -బంగార్రాజు ఎలిపే
భారత దేశంలో పూజింపబడే స్త్రీని. పూజకు అర్హత ఉంది కానీ నాకు స్వాతంత్ర్యం లేదు. నేను మీతో సమానం కాదు. ఎందుకంటే నేను స్త్రీని. నేను ఎంత చదువుకున్నా నా గురించి నేను నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదు. బాల్యంలో నాన్న నిర్ణయిస్తాడు. వివాహ బంధంలో భర్త నిర్ణయిస్తాడు. వృద్ధాప్యంలో కొడుకు నిర్ణయిస్తాడు. వాళ్ల నిర్ణయాధికారంలోనే నా జీవితం గడిపే స్త్రీని నేను. సమాజంలో చాలామంది నా స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి మాట్లాడతారు. అప్పుడు నా గురించే కదా వీళ్ళంతా మాట్లాడేది అనిపిస్తుంది! అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 న అయిపోయిందిలే, ఆ రోజు కూడా నేను స్త్రీనని, నాకు కూడా సాధికారత ఉండాలని ఎంతో మంది పోరాటం చేస్తున్నారని అనిపిస్తుంది. నా కోసం నేనెపుడైనా పోరాటం చేశానా? పోరాడితే ఓడిపోతానని తెలుసు కనుక పోరాటం చేయడం లేదా? ఏమో!
నేను ఒక కథ చెబుతాను. నా లాంటి ఎందరిదో ఈ కథ! నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమగా పెంచారు. అడిగిందల్లా ఇచ్చారు. నేను పదో తరగతి పాస్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది. నాన్నా, నేను బైపిసి చదువుతాను అంటే నాన్న సరే అని చదివించాడు. తర్వాత అగ్రికల్చరల్ బీఎస్సీ చేస్తాను అంటే అది కూడా చదివించారు. కానీ అది పూర్తయిన తర్వాత నాన్న చదువు తర్వాతి ఘట్టం ఉద్యోగమని తెలుసుకోక, నాకు పెళ్లి చేశారు. నాకు కూడా అదే సరైన నిర్ణయం ఏమో అనిపించింది. అందరూ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. సంవత్సరం అయింది, ఒక బాబు పుట్టాడు. మూడేళ్ళ తర్వాత ఒక పాప, ఆ తర్వాత వాళ్ళ ఆలనా పాలనా, నాదే బాధ్యత. ఒకరోజు తిరిగి వెనక్కి చూశాను…నాకు 50 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను, “నేను ఎవరిని?”. చాలాసార్లు ఆలోచించాను నేను ఎవరిని అని, నాకు సమాధానం దొరకలేదు. ఇన్నాళ్ళూ నేను ఒక కూతురిని, ఒక భార్యని, ఒక తల్లిని. పిల్లలు ఎదిగిపోయారు, ఎగిరిపోయారు. భర్త ఉద్యోగంలో బిజీగా ఉన్నాడు. ఇంట్లో పనులు ఎన్ని చేసినా, ఇంకేదో నేను చేయాల్సింది చేయలేదని ఒకటే దిగులు. నాన్న కష్టపడి చదివించిన చదువు విలువ లేనిది అయిపోయింది, జీవితపు ఘట్టాల్లో ముఖ్యమైన ఘట్టాన్ని మరచి, తర్వాతి ఘట్టాన్ని చేరిన నేను నా ఉనికిని మర్చిపోయాను. ప్రభుత్వం నా మీద పెట్టిన ఖర్చు కు నేను రుణం తీర్చానా? మీరు అనవచ్చు నేను భార్యగా, తల్లిగా నా బాధ్యతలు నెరవేర్చాను కదా అని, కానీ నేను చదివిన చదువు, నాన్న కష్టం ,నా టీచర్స్ యొక్క ప్రోత్సాహం, నాకు ఇష్టమైన అగ్రికల్చర్ బీఎస్సీ ఏమైంది? నాపై ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఏమైంది? ఈ దేశ అభివృద్ధిలో నేను భాగం కాలేకపోయాను. నాకోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. నేను వాటిని వినియోగించుకున్నానా?
ఇప్పుడు ఇంకా ఎన్నో పథకాలు వచ్చాయి. బేటి బచావో బేటి పడావో, నా రక్షణ కోసం చట్టాలు, ఉజ్వల యోజన, స్వధార్ఘర్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన. వన్ స్టాప్ సెంటర్ ఇలా అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి నన్ను సాధికారక మహిళగా నిలబెట్టాలని చూస్తోంది. కానీ నాకు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం లేదు. నేను ఒక్కదాన్నే కాదు, మన దేశంలో చాలామంది స్త్రీలకు వారు ఎవరో వారికి తెలియదు. వారిపై వారికి హక్కులు ఉండవు. వారి పేరు మీద ఆస్తులు ఉంటాయి. కానీ వాటి హక్కులు మాత్రం వారివి కావు. ఎందుకంటే వారు స్త్రీలు. కాలు బయట పెట్టాలి అంటే అనుమతి అవసరం. ఎందుకంటే నేను స్త్రీని కదా! సమాజంలో మార్పు రానంత వరకు నేను ఎవరినో నాకు తెలియదు లేదా నేను మారేవరకు నేనెవరో నాకు తెలియదు. (ఇది ఎంతో మంది మహిళల ఆవేదన)
దేశ పౌరులలో దాదాపు సగం ఉన్న మహిళలు స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం మరియు ప్రాతినిధ్యం కోసం పోరాటంలో ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకుందాం. ఎంతో మంది స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య వారిపై వారికి హక్కు లేకపోవడం. చాలామంది అంటూ ఉంటారు ఆడపిల్ల సంపాదించాల్సిన అవసరం లేదు అని. సంపాదన ముఖ్యమా? తన చదివిన చదువుకు సార్ధకత చేకూర్చటం ముఖ్యమా? ఏది అవసరం. తను చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, పిల్లలను మరియు ఇంటి బాధ్యతను తనే చూడాలా? పిల్లల్ని మగవారు చూడలేరా? ఆలోచించండి బయటికి వెళ్లినా, ఎక్కడికి వెళ్ళినా, పిల్లల ఆలనాపాలనా చూసేదీ స్త్రీ మాత్రమే! ఇది నిజం.
ఈ మధ్య నా స్నేహితురాలు అమెరికా నుండి వచ్చింది. ఆమెతో జరిగిన సంభాషణలో, తాను ఒక్కత్తే అమెరికాలో తన భర్త దగ్గర పిల్లల్ని వదిలి వస్తే ఎంతో మంది అడిగే ప్రశ్నల గురించి చెప్పింది.
“పిల్లల్ని వదిలి వచ్చావా? వాళ్ళు ఎలా ఉంటారు నువ్వు లేకుండా? ఎవరు చూసుకుంటారు? వాళ్ళు ఉండగలరా? ఎలా వదిలేసి వచ్చావు?”
“నేను పిల్లల్ని వాళ్ళ నాన్న దగ్గర వదిలి వచ్చాను. పక్కింట్లో వదిలి రాలేదు. పిల్లలను తండ్రి చూసుకోవాలని ఎందుకు అనుకోరు? పిల్లలకు చేయాల్సిన పనులు తల్లి మాత్రమే చేస్తుందా? తండ్రి ఎందుకు చెయ్యడు?”
వాళ్ళిద్దరి మధ్యా ఎంతో సయోధ్య ఉంది. ఇద్దరూ బాధ్యతలు పంచుకుంటారు. అయినా సమాజపు భావజాలంలో మార్పు రాదు. ఆమె చెప్పిన సమాధానమే ప్రతి స్త్రీ చెప్పగలగాలి. వారిద్దరి మధ్య ఉన్న సయోధ్య ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఇటువంటి విషయాలను normalise చేసి తీరాలి.
కుటుంబ బాధ్యతలు సమానంగా ఉండాలి. భర్త చదివిన చదువుకు లభించిన గౌరవం, భార్య చదివిన చదివుకు లభిస్తే, నేను ఎవరు అని ప్రశ్నించుకునే అవసరం స్త్రీకి రాదు. ఆలోచించండి! చట్టాల వల్ల, ఉద్యమాల వల్ల రాని సమానత్వం ఇలా ఆలోచిస్తే వస్తుందేమో, ప్రయత్నిద్దామా?
స్త్రీల ఆవేదనను నేను వ్యక్తీకరించాను!
వారి భావోద్వేగాలు ఇలా ప్రతి పురుషునికి చేరితేనే మనలో మార్పు వస్తుంది!! కుటుంబాల్లో మార్పు వస్తుంది. పితృస్వామ్యాపు భావజాలం అంతమౌతుంది!!
-బంగార్రాజు ఎలిపే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
నేను ఎవరు?( సమకాలీనం) -బంగార్రాజు ఎలిపే — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>