ISSN 2278 – 4780
స్త్రీలు కథలు రాయకుండా ఉంటే మానవజీవితంలోని అనేక పార్శ్వాలు, చీకటికోణాలు సమాజానికి తెలిసేవి కావు. మానవసంబంధాల్లో వ్యక్తి సున్నిత స్పందనలు మనస్తత్వాలు స్త్రీల కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి.
వర్ధమాన రచయిత్రి నామని సుజనాదేవి కథలు, కవిత్వం రాశారు. ’ఎదలయలు’ కవితాసంపుటి, ’మనో స్పందన’ కథా సంపుటి అనే పుస్తకాలను వెలువరించారు.
’మనో స్పందన’ కథాసంపుటిని పరిశీలించినప్పుడే కథలు ఎంతో వస్తువైవిధ్యంతో ఉన్నాయి. మాతృత్వపు విలువను తెలిపే స్త్రీలు, మనషుల మధ్య ప్రేమాను బంధాలు, ఆత్మీయతానురాగాలు తెలిపే స్త్రీలు, బాధ్యతా రహితంగా ప్రవర్తించే భర్త నుండి విముక్తి పొందిన భార్య. సమాజంలో యువతులు, విచక్షణను కలిగిఉన్నటువంటి స్త్రీలు, లేఖలద్వారా భర్తను ఏప్రిల్ ఫూల్ చేసిన భార్య, లేఖలు రాసి క్రొత్త దంపతులను ఏప్రిల్ ఫూల్ చేసిన స్త్రీ, ఎదుటివారి భర్తలకన్నా తన భర్త గొప్పదనాన్ని తెలుసుకున్న భార్య, పొగడ్తలకు పడిపోకుండా జీవితాన్ని సమాలోచించగల స్త్రీలు, ఆత్మవిశ్వాసం గల స్త్రీలు, కూతురు, కోడలు మధ్య తేడా ప్రేమను పంచగల అత్త, ఒంటరినై వయస్సుతో పనిలేకుండా పెళ్ళి చేసుకున్న స్త్రీ, విధివంచించినా ఆత్మవిశ్వాసాన్ని కలిగిఉన్న స్త్రీలు, నామని సుజనాదేవి కథల్లో కనిపిస్తారు.
’నన్ను క్షమించమ్మా’ కథలో వృద్ధులైన భార్యాభర్తల్లో భార్య చంద్రశేఖర్ వద్ద, భర్త మరో కొడుకు వద్ద ఉండిపోవలసి వస్తుంది. కొన్నాళ్ళకు చంద్రశేఖర్ భార్య శిరీష తల్లిగారింటికి వెళ్ళింది. కొద్దిరోజులకే గాఢమైన అనుబంధం ఏర్పడటం ద్వారా శిరీష లేకుండా రెందు రోజులకే యుగాలు గడిపినట్లనిపించింది. ఆ సమయంలో తల్లి నలభై సంవత్సరాలు సహజీవనం చేసి పిల్లలకోసం తండ్రికి దూరంకావడం వల్ల ఎంతో తీవ్రమైన ఆవేదనకు గురౌతుందని తెలిసి చంద్రశేఖర్ కు గుండె పిండేసినట్లుగా అనిపించింది. తండ్రిని చూడటానికి తల్లిపడే మనోవేదన తల్లి చెబితే గాని తెలుసుకోలేని తీవ్ర అజ్ఞానానికి ఎంతగానో కుమిలిపోయాడు.
సహజంగా మాతృత్వపు విలువలు కనబడతాయి. అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు బిడ్డలా! అనే సామెతకు దగ్గరి రూపం ఇందులో కనబడుతుంది. పిల్లల సంతోషమే తన సంతోషంగా భావిస్తున్న తల్లి మాతృత్వపు విలువను ఈ కథ ద్వారా రచయిత్రి తెలియజేశారు.
’హేమ తపన’ లో శశిధర్ అనే యువకుడికి ఎదురింటిలోకి కొత్తగా వచ్చిన అమ్మాయితో స్నేహం ఏర్పడుతుంది. ఆమె అందానికి ముగ్ధుడై ఆమె తలపులతో విహరిస్తూ ధైర్యం చేసి ప్రేమలేఖ ఇస్తాడు. అందులో ’ఐ లవ్యూ, ఐ వాంట్ టు మారీ యూ’ అని చదివి ఒక్కసారి అతని మొఖం దీర్ఘంగా చూసి వెళ్ళిపోయింది.
తెల్లవారి శిల్ప శశిధర్ కు ఒక పెద్ద ఉత్తరం ఇస్తుంది. అందులో ప్రియమైన స్నేహితుడు శశిధర్ కు నీవు నన్ను ప్రేమిస్తున్నానన్నావు. అసలు ప్రేమంటే అర్ధం తెలుసా, పెళ్ళంటే బంధం తెలుసా నీ దగ్గర భార్య కోసం ఖర్చు చేయడానికి ఒక్క రూపాయి కూడా లేదు. అలాంటిది చదువు కోసం కాలేజీకి పంపిస్తే సినిమాల ప్రభావం వల్ల యువత హీరోగా ఊహించుకుని ఆ తర్వాత జీరోలుగా బ్రతుకుతున్నారు.
సమాజంలోని ఆడపిల్లలంతా శిల్పలాగా మంచిచెడులను గమనించదగిన విద్యావంతులు, వివేకం కల్గినవారు ఉంటే వారిజీవితాలతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని ఈ కథ ద్వారా తెలియజేశారు.
’ఎంతమంచి వారు’ కథలో ఎదురింట్లో ఉంటున్న భార్యా భర్తలిద్దరూ అన్యోన్యంగా జీవితం సాగించాలనుకుంటారు. వారి కంటే పక్కింట్లో ఉన్న భార్యా భర్తలు బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రేమను కనబరుస్తున్న భర్తను చూసి ఎదురింట్లో ఉన్న భార్య బాధపడి భర్తను అడుగుతుంది. భర్త ప్రేమనేది గుండేల్లో ఉంటుంది దాన్ని ఇతరులకు వ్యక్తపరచాల్సిన అవసరం లేదనగా బాధపడుతుంది. రెండు నెలలకు అంత ప్రేమగా కనిపించే వారి మధ్య ఇన్ని గొడవలా! చూసేవాళ్ళంతా తిట్టేశారు. జరుగుతున్న విషయం జీర్ణించుకోలేకపోయింది.
సమాజంలో చాలా మంది స్త్రీలు తమ భర్తలకన్నా ఎదుటివారి భర్తలు మంచివారని పొగుడుతూ ఉండే భార్యలకు ఈ కథ ఒక కనువిప్పును కలిగిస్తుంది.
’మార్పు ’ లో శివానికి తల్లిదండ్రులు లేని కారణంగా మేనత్త పెంచినందుకు తన ఆస్తిని తీసుకుని ఆమెను ఒక తాగుబోతుకు కట్టబెట్టడం ద్వారా ఆ బాధ భరించలేక విడాకులు ఇచ్చింది. సమాజంలో భర్తలేని భార్యను చులకనగా చూస్తారన్న విషయం తెలిసినా ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ళపై తాను నిలబడగలనన్న ఆత్మవిశ్వాసం గల స్త్రీ గా కనబడుతుంది.
బాధించే భర్త ఉండి భర్త పంచే ప్రపంచమని భావించే స్త్రీలకు ఈ కథ ఒక కనువిప్పును కలిగిస్తుంది.
’పెళ్ళి సందడి’ లో రాణి, శరత్ లు నూతన దంపతులు వారిని ఆటపట్టించడానికి వదిన రాసిన ఉత్తరాలు అవి చదివి ఒకరి భావాలు ఒకరు రాశారని భ్రమపడి ఆ తర్వాత కలుసుకున్నప్పుడు ఆ ఇద్దరూ రాయలేదని తెలిసి వదిన ఏప్రిల్ ఫూల్ చేసిందనుకుంటారు.
’ లేఖా సుందరి’ ఈ కథలో భర్త ఆఫీసుకు సుధ పేరుతో లేఖలు రాస్తూ అందులోని అక్షరాలు తన మనసుకు ఆనందాన్ని, అనురాగాన్ని పంచుతున్నట్లుగా కనిపించే భావాలతో ఉన్న ఆ లేఖలను చూసి ఒక వైపు సంతోషం మరొకవైపు కొత్తగా పెళ్ళైందన్న బాధ. చివరకు ఈ లేఖలతో ఏప్రిల్ ఫూల్ చేసింది తన భార్యేనని తెలుసుకున్నాడు సాయి కృష్ణ.
ఈ లేఖలద్వారా అర్ధవంతమైన, రసవంతమైన, అక్షరాలను పొందుపర్చగల వ్యక్తి రచయిత అన్నట్లు తెలుస్తుంది. సహజంగా ఈ గుణాలన్నీ అబ్బాయిలకుండేవి. కానీ అవే పనులు అమ్మాయిల ద్వారా అబ్బాయిలను వేధించగలవు అన్న విషయం ఈ కథలద్వారా తెలియ జేశారు.
’మనసా ’ మనసా’ కథలో భర్తకు పిల్లలకు సేవచేస్తూ అలసిపోయిన రవళికి చేలి వేలు తెగి మరింత బాధగా ఉంది. అయినా పట్టించుకోని భర్తను చూసి ఒకసారి పెళ్ళికి ముందు గుడికెళ్ళినప్పుడు కాలికి ముల్లు గుచ్చుకుంటే దాన్ని తీసి ఎత్తుకునిపోవాలా అన్న ఆయనమాటలు ఈ రోజు బాధలో ఉన్నా కనీసం సానుభూతి కనబరచని భర్తను చూసి బాధపడుతున్న సమయంలో ఎదురింట్లో ఆనంద్ అద్దెకు దిగాడు. రవళి అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఇంతికి వచ్చి లెటర్ కూడా ఇచ్చాడు. ఈ విషయం భర్తకు చెప్పి క్షమాపణ కోరుతుంది. తెల్లవారి ఆనంద్ రాగానే చెంప పగలగొడుతుంది. మరుసటి రోజు పేపర్ లో అమ్మాయిలను మంచి మాటలతో లోబర్చుకుని దుబాయ్ షేక్ లకు అమ్మే వాడని ఫోటోతో సహా చూపించగా రవళికి పెద్దగండం నుండి తప్పించుకున్నానన్న విషయం తెలుస్తుంది.
పొగడ్తలతో పొంగిపోయే స్త్రీలకు ఈ కథ ఒక కనువిప్పును కలిగిస్తుందని తెలిపారు.
’కర్తవ్యం’ లో నీలిమ, వినోద్ లు ప్రేమికులు హాస్ట నుండి బయటకు రమ్మన్న వినోద్ తర్వాత రాకుండా పోయాడు. ఆ రోజు రాత్రి విధి ఆడిన వింతనాటకంలో పావులా బలైపోయింది నీలిమ. తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో మేనమామ కూడా నాలుగు చివాట్లు పెట్టి పంపించాడు. చివరకు వినోద్ కూడా తన ప్రేమను కనబరచలేదు.
విధికి తలవంచిన నీలిమ అందరిలా ఆత్మహత్యే శరణ్యమనుకోలేదు.
’ పడమటి సంధ్యారాగం’ పద్మ చిన్నతనంలో ప్రేమపెళ్ళిచేసుకోవడం, కొడుకు కడుపులో పడగానే భర్త మరణించడంతో తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు, సమాజంలో అందరి మాటలనుండి తట్టుకుని ఒక ఉద్యోగం సంపాదించుకోవడం. కొడుకును పెంచి పెద్దచేసి పెళ్ళి చేయగానే భార్యతో విదేశాలకు వెళ్ళిపోవడం, నలభై సంవత్సరాలకే తిరిగి ఒంటరితనం రావడం, విమల ద్వారా వెంటరన్ అథ్లెటిక్ మీట్ గురించి తెలుసుకుని రైల్లో ఎదురుగా సీటుపై ఉన్న శ్రీనివాస్ జీవితంలో కూడా బిడ్డను కని భార్య చనిపోవడం అమ్మాయికి పెళ్ళి చేస్తే భర్తతో విదేశాలకు వెళ్ళిపోవడం తాను నలభై రెండేళ్ళకే ఒంటరిజీవితం అనుభవించడం, వీరిద్దరికీ చివరకు కొడుకు,కోడలు, బిడ్డ, అల్లుడు బంధువులందరి మధ్య పెళ్ళి జరగడం తోడు దొరికినందుకు ఇద్దరూ సంతోషించారు.
ఎంత బలవంతపెట్టినా మళ్ళీ పెళ్ళి చేసుకోననే పద్మ వయస్సుతో పని లేకుండా తన జీవితంలో ఉన్న చీకటిని పారద్రోలి ఆనందపు వెలుగులు నింపుకోవడం ఈ కథలో కనబడుతుంది.
’తన దాకా వస్తే గానీ’ కథలో పెళ్ళై ఆరేళ్ళయినా పిల్లలు లేనందువల్ల బాధపడుతున్న కొడుకు, కోడలును చూసి వసుంధర సూటి పోటి మాటలతో శిరీష మనసుకు గాయం చేస్తుంది. కొడుక్కు రెండవ పెళ్ళి చేస్తానంటుంది. కూతురు అనూషకు కూడా పిల్లలు లేనందువల్ల వాళ్ళ బామ్మగారు రవితేజకు రెందవ పెళ్ళి చేస్తానంటే వసుంధర దగ్గరకు వచ్చి అనూష ఏడుస్తూ విషయం చెబుతుంది. వెంటనే అనూషతో వెళ్ళి రవితేజకు ఈ ప్రయత్నం మానుకోవల్సిందని ప్రేమగా చెబుతుంది. ఇప్పుడే మీకేమీ వయసు పైబడలేదుగా అంటుంది. వెంటనే రవితేజ నీవు శిరీషను బాధించడం లేదా? ఆమె కూడా ఒక ఇంటి ఆడపిల్లే కదా! ఆమె మనసును మీరెందుకు గాయపరుస్తున్నారు అంటాడు.
సమాజంలోని అత్తలంతా కూతురును ఒక విధంగా కోడలును ఒక విధంగా చూసుకుంటున్న తీరు ఈ కథలో కనబడుతుంది. వసుంధరకు చివరకు జ్ఞానోదయం కల్గుతుంది.
’అనగనగా ఒకరోజు’ లో అక్కకు క్యాన్సర్ వలన చావుబ్రతుకుల మధ్య ఉందన్న విషయం తెలిసి ఉమ చెన్నై బయలుదేరాలని గణేష్ తో చెప్పగా నాకు సెలవు లేదు. అయినా నాలుగురోజుల్లో పోతుందని తెలిసి వెళ్ళడం ఎందుకు? అంటాడు. ఉమ ఉద్యోగం చేసి నెలకు ఇరవై వేల వరకు సంపాదిస్తుంది. ఉత్తమురాలు, గుణవంతురాలు, ఉద్యోగస్తురాలు, అందగత్తె కూడా. పెళ్ళై నాలుగు సంవత్సరాలైనా భర్తే బాధగా మారాడు. పెళ్ళనగానే ఎన్నో ఊహలు, ఆశలతో అడుగుపెట్టిన ఆమెకు భర్త దృష్టిలో భార్య అంటే కేవలం వేరే ఇంటి నుండి అన్నీ సమకూర్చడానికి వచ్చే జీతం లేని పనిమనిషి అని తెలిసింది.
రైలు ప్రయాణంలో ఎదురుగా ఉన్న యువకులు ఓదార్చుతూ ఇచ్చిన టీ, బిస్కెట్స్ తినగానే నిద్ర మూంచుకు వచ్చింది. స్పృహ వచ్చి చూసే సరికి హాస్పిటల్ లో చుట్టూ అత్త, ఆడపడుచు, భర్త, పోలీసులు అందరినీ చూసి భయంతో జరిగిన విషయం చెప్పింది. ఆ యువకులు తన వద్దనున్న డబ్బు, చైను, గాజులు, పట్టీలు అన్నీ తీసుకుని తనను స్టేషన్లో వదిలి వెళ్ళారని తెలిసి అక్క పోయిందన్న విషయం తెలిసి బాధపడుతున్న నన్ను ఓదార్చడానికి బదులు ఆ యువకులకు నాకు మధ్య ఏదో జరిగుంటుందని అనుమానంతో మాటలను ఈటెలుగా గుచ్చుతున్న భర్త ప్రవర్తనకు విడాకులు ఇవ్వాలనుకుంటుందన్న విషయం తెలుసుకుంటాడు గణేష్.
ఈ రకమైన తిరుగుబాటుకు గణేష్ నిశ్చేష్టుడయ్యాడు. బాధ్యతా రహితంగా ప్రవర్తించే పురుషుల మధ్య స్త్రీల జీవితం, వాళ్ళ స్వేఛ్ఛ అనగారిపోతున్న పరిస్థితిని రచయిత్రి ఈ కథ ద్వారా చూపించారు.
’స్పందించే హృదయం’ లో కొడుకు బర్త్ డే రోజున రాత్రి అయినా రానటువంటి భర్తను గురించి ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతుండగా స్కూటర్ పై వెళ్ళినవాడుఆటోలో రక్తపుబట్టలతో దిగితుండగా చూసి భయం పుట్టింది. వేణ్ణీళ్ళు బాత్రూంలో పెట్టి స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చి అన్నం కలిపి తినిపిస్తుంది. విషయం అడుగగా రోడ్డుపై ఒక ప్రయాణికుడికి యాక్సిడెంట్ జరిగింది. అతన్ని ఇరువైపులా ప్రయాణికులు పట్టించుకోకపోవడంతో నేనే నా జేబులోని డబ్బు కట్టి హాస్పిటల్లో జాయిన్ చేయించి రక్తము ఇచ్చి వాళ్ళ బంధువులకు ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చారని చెప్పాడు.
తన భర్త గొప్ప దయార్ద్ర హృదయుడని గమనించిన శిరీష ఈ నాగరిక ప్రపంచంలో మనుషుల మధ్య ఆత్మీయతానురాగాలు ప్రేమానుబంధాలు మనిషికి మనిషికి మధ్య సంబంధాలే తెగిపోతున్నవి. ఒకరి బాధల్ని చూసి స్పందించే తీరిక, ఓపిక ఎవరికీ లేవు అని తన భర్తను గర్వంగా గుండెలకు హత్తుకుంటుంది.
భర్తను చూసి గర్వించే స్త్రీ ఈ కథలో కనబడుతుంది.
– టి.అన్నపూర్ణ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~