నా కథ-4 దొర కోడే-దొంగ కోడే — డా.బోంద్యాలు బానోత్(భరత్)
బాగ వర్షంకురిసి, వెలిసింది. అప్పటి దాకా పెద్ద మర్రి చెట్టుకింద వర్షానికి తలదాచుకున్న గొర్లు, ఒల్లు దులుపరింకుంటూ, ఆ చెట్టు కింది నుండి మెల్లగా పచ్చికబీడులోకి వెళ్ళుతున్నాయి. ఆకాశంలో పనవటిమొఖాన సింగిడి పొడిసింది. వాతావరణం తేటగ ఉంది. మేము వానకోటు/వాన జాబు మడతపెడుతున్నం. నేను నా వానజాబును చిన్నగా, మంచిగా మాడతపెడుతూ..మా దంటగానికి ఒక కొస పట్టకోమన్నాను..” ఏ…ఏ… దాన్నేమో సుతారంగ మడత పెట్టబడితివి.. .
ఎట్టోకట్టా మడతపెట్టీ, ఆ సుతిల్దారంతో గుంజ్జికడితే, అదే వుండే దానికి ఇంత సేపా..!?, రెండు-మూడు గం.ల నుండి వర్షం కారణంగా ఇయ్యాల, అవీ సరింగా మేత మెయ్యలేదు. ఆకలి మంటకు ఒక్కసారి దులుపరించి ఉరికినయంటే..!, ఇక చేతికి దొరకవు, జల్దీజల్దీ గాని …! , జీతమంటూ.. ఉంటే పరాయోనికే వుండాలే, అంటే గా ఊల్య/ఊర్లో ఎవడికైనా ఉండాలే.. కాని అయినవాడికీ/ కులపోడికీ/ పాలోడికీ/సుట్టపోడకీ.. జీతముండొద్దు, ఎందుకంటే, వాడొకమాటన్నా ఏమనిపించదు, ఎందుకంటే వాడెవ్వడో..! మనమెవ్వలమో..అంతగా మనసునొయ్యదు. అదే మనోడన్నాడనుకో..! ‘ఎందుకురా..! ఈ జీవితం’ అనిపిస్తది..” అన్నాడు మా దంటగాడు. “అరే..! ఇంకేమయింది రా..! అంతగనంగా బాదపడుతున్నావు.” అని నేనడిగాను.” అరే..!ఇంకేంగావాల్రా..! . అయీన్దానికి, కాన్దానికి, చిన్న -చిన్న విషయాలకి… ఎట్లబడితే -అట్ల మాటలనడం.. ఎవల్బడ్తరు.. బై..!? ఎడ్లకు గడ్డి సరిపోను వెయ్యమంటారు.. తెల్లారి ఎడ్ల కాల్లకింద తొక్కుడు గడ్డుంటే, ‘ఆ తిక్కల్దీ తిడుతది’, దానికి ఈయనకూడా వత్తాసు పలుకుతూ, ‘తినేయంత వెయ్యమన్నా.. గాని, తొక్కేయంత వెయ్యమన్నా నా..!?’ అంటడు. అరే.. అవీ పశువులు, తింటావుంటే కచ్చితంగా ఎంతోకొంత తొక్కుతాఏయి.. ఆ చిన్న విషయం తలియదా?” అన్నాడు.. బాధపడుతూ. ” అరే..నువ్వేంద్రబై.. ఉల్టా..వచ్చినవు..!’అందరూ తండా నుండి ఊల్లోల్లకు జీతముంటారు. కాని నువ్వు ఉల్లాసంగా ఊల్లోవున్నోడివీ తండాకొచ్చి జీతమున్నవు. అదికూడా,అందరూ ఉగాది నుండి ఉగాది వరకు ఉంటారూ, కాని నువ్వు ఉగాది నుండి దసరావరకు ఒకచోట, మల్లి దసరా నుండి ఉగాది వరకు ఇంకోచోట..! అదీ కూడా పోయి పోయి ఆ బోకరోని దగ్గర..! రోజుకు ఎన్ని అబద్ధాలాడతడో..వానికే గుర్తుండదు.” అన్నాడు, జాబును జాగ్రత్తగా మడతపెడుతూ.
” అరే..! బై ‘దూరపు కొండలు నునుపు’ అని ఎందుకంటారో..!? నాకిప్పుడు అర్థమయింది రా..” అన్నాను నేను. “అరె.. అదేంటి..!? అట్లంటావు..” అన్నాడు మా దంటగాడు. ” అట్లనకపోతే..! ఇంకెట్లంటారు..!? జీతమెక్కడున్నా, అది జీతమే. వీడు-వాడాని భేదం లేదు. జీతముండేటోడు, జీతముంచ్చుకునేటోడూ.., లేనోడు.., ఉన్నోడు.. అంతే తేడా” అన్నాను నేను. “అరే.. ఇంత కచ్చితంగా, వాస్తవాలు.. చెప్పుతున్నావంటే, నువ్వు మధ్యలోనే, ఆ దొరగాడి జీతం వదిలేసి రావడానికి వెనకాల ‘పెద్ద కథే’ ఉన్నట్టున్నది. ఐతే నాకు ఆ ‘కథ’ చెప్పవా..? ఎందుకంటే..!? నేను కూడా వచ్చె ఉగాది నుండి ఊళ్ళో జీతముండాలని, అనుకుంటున్నాను.” అన్నాడు మా దంటగాడు.
” అరే..నూవింతగనం అడుగుతుంటే నీకు చెప్పక పోతే, ఇంకెవరికి చెప్పుత బై…? మన బాధలు మనం- మనం, చెప్పుకోక తప్పదు..” అన్నాను.
“..ఐతే, మా ఇంట్లో మూఢనమ్మకాలు ఎక్కువ. మా పెదనాన్నకూ మంత్రాలొస్తాయని పుకారు. అందువలన అతనికి తండావాళ్ళు భయపడే వారు. మా అమ్మ-నాన్నకు కూడా ఆ భయముండేది. ఈ విషయం ఆయనకు కూడా తెలిసుంటది. అందుకే దానికి తగినట్టుగానే ప్రవర్తించేవాడు. ఒక రోజు ఆయన ‘బాగ తాగి’, నన్ను భయపెట్టి, నీ కొడుకు నా మాట వినలేదని, మా అమ్మ – నాన్నలను భయపెట్టి, మా ఇంటి మీదికొచ్చి గొడవ చేసి “వాని సంగతి నేను చూస్తా..”, అని అన్నాడు. ఐతే, నాకేమయిన చేతబడి, మంత్రాలు; చేస్తాడేమోనని భయపడి, నన్ను బడి మాన్పించి, ‘కోరెం సంజీవ రెడ్డి’కి రెండు సంవత్సరాలు జీతముంచి, అప్పు తెచ్చాడు. రెండు సంవత్సరాల తర్వాత, ఆ పాత అప్పు తీర్చడానికి, ‘గౌరీ కేదారి’ వద్దా కొత్త అప్పు చేశాడు. ఇంకో రెండు సంవత్సరాల తర్వాత, ఈ పాత అప్పుతీర్చడానికీ, మల్లి దొర ‘యాకుబ్ రెడ్డి’ వద్ద జీతం ముంచి, కొత్త అప్పు తెచ్చాడూ.
మా దొర ‘సంది యాకుబ్ రెడ్డి’, ఆయన తండ్రి పేరు ‘సంది నారాయణ రెడ్డి’ , ఈయన మా ఊరికి దొర. ఈయనకు ముగ్గురు కొడుకులు. పెద్దాయన ‘సింది క్రిష్ణా రెడ్డి’, పడిపాయన పేరు ‘సింది యాకుబ్ రెడ్డి’, చిన్నోడి పెరు ‘సింది బుచ్చిరెడ్డి’. వీళ్ళు ముగ్గురూ దొరలు. మా ఊరికి నాలుగు వైపులా వీళ్ళ భూములే ఉండేవి. వీళ్ళ తర్వాత ‘రావుల నర్సమ్మ’ కు కూడా భూమి బాగానే ఉండేది. ఆ తర్వాత ప్రతి రెడ్డి కుటుంబానికి పదెకరాలకు పైయిన్నే ఉన్నది. కాని వీళ్ళందరూ ‘కాపులుగా’ కూడా పిలువబడేవారు.
ఐతే ఆ ముగ్గురిలో ‘యాకుబ్ రెడ్డి’ ‘దొర’, కూ మంచిపెరున్నది. ఇంతో- అంతో చదువుకున్న వ్యక్తి. ఈయనకు ఇద్దరు భార్యలు. ఎందుకో కానీ పెద్దామె ఈయనతోటి ఉండేది కాదు. రెండో ఆమె ‘రాణెమ్మ దొరసాని’తో ఊళ్ళో వుండేవాడు. వీళ్ళకి నాకు తెలిసిన వరకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వీళ్ళందరూ హనుమకొండలో ఉండి చదువుకునేవారు. పెద్దకొడుకు ‘రణధీర్ రెడ్డి’ సెలవుల్లో ఇంటికొచ్చేవాడు. అందరికంటే చిన్నోడు చిన్నకొడుకు. ఇంటి వద్దే వుండేవాడు.
నేను కొత్తగా ఉగాది నుండి జీతం పనిలోకి పోయాను. నాది ‘తిండిజీతం’ అంటే వాళ్ళింట్లోనే తినాలే, రాత్రింబవళ్ళు వాళ్ళ ఇంటికాడనే వుండాలి. ఆరోజుల్లో ‘దొర’ దగ్గర జీతమంటే ఆ సమాజంలో కాసింత గౌరవం ఉండేది. తిండిజీతం కాబట్టీ బైయట పనులు, ఇంట్లో పనులు; ఊడవడం, చల్లడం, బొల్లుతోమడం, మంచినీళ్ళు, ఉప్పునీళ్లు, అవసరమైతే వంటవండటం, పశువుల పెండతీయడం, మేతేయడం, గోబర్ గ్యాస్ లో పెండ కలిపి పోయడం, … మొదలగు పనులన్నీ నేనే చేసేవాణ్ణి.
ఐతే, ఉగాది నుండి ఎండాకాలం మొదలైంది. బడి పిల్లలకు సెలవులు కావడంతో వాళ్ళ పిల్లలందరూ ఇంటికీ వచ్చి ఉన్నారు. అప్పుడు నేను వాళ్ళకు, వాళ్ళు నాకు కొత్తే. ఆ సమయంలో పదీ-ఇరవై రోజులు ఇంటివద్దనే వున్నారు. సాయంత్రమైతే ఇంటి ముందు దుమ్ము లేవకుండా పలచగా నీళ్ళు చల్లీ, ఊడ్చీ మంచాలు వేసీ, వాటిమీద దుప్పట్లూ, దిండ్లు వేసేవాడిని. అప్పుడు ఆ పిల్లలందరూ వచ్చీ, ఆ మంచాలపైన కూర్చోవడం, ఒరగడం, పడుకోవడం తమకు నచ్చినట్లుగా వుండేవారు. మా దొర, దొరసాని కూడా మాట్లాడుతూ కూర్చోనేవారు. నేను వాళ్ళకు దగ్గరలోనే దర్వాజ మెట్లమీద కూర్చునే వాణ్ణి. ఆ పిల్లలకు ఏదైన అవసరమై పిలుస్తే, నేను వెంటనే ఆపనిచేసిపెట్టేవాణ్ణి. సరిగ్గా గుర్తులేదు, కాని వాళ్ళు ముగ్గురో, నలుగురో అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు. వాళ్ళ మధ్య ఒకటీ లేదా రెండు సంవత్సరాల గ్యాప్ మాత్రమే ఉన్నట్టు కనిపించేది. వాళ్ళు మాట్లాడుకుంటూ, మధ్య మధ్యలో ‘ఇంగ్లీష్ ‘ పదాలు ప్రయోగించేవారు. నేను ఆ ఇంగ్లీష్ పదాలను శ్రద్దగా వినేవాణ్ణి. వాళ్ళకూ నా పేరు ‘బొంద్యాలు బాణోత్’ అని సరిగ్గా పలకడం రాకపోయేది. అందువల్లా ” అరె ఈ రోజు నుండి నీ పేరు ‘రాము’ . నిన్ను ఈరోజు నుండి ‘రాము’ అని పిలుస్తాము” అని అన్నాడు మా దొర. “సరే దొర” అన్నాను. ఆ రోజునుండి ఆ పిల్లలందరూ నన్ను ‘రాము’ అని పిలిచేవారు.
పెద్ద కొడుకు ‘రణధీర్ రెడ్డి’ నీ జీతగాళ్ళు అందరు చిన్న ‘దొర’ అని పిలిచేవాళ్ళు. అక్కడిదాకా ఎందుకు? అందరికంటే చిన్న కొడుకు ఐదుసంవత్సరాలుంటాడు, ఆయనను కూడా ‘చిన్న దొర’ అనే పలకరించేవారు.వాళ్ళ నాన్న వయస్సున్న వాళ్ళు కూడా ఆ చిన్న పిల్లోడిని ‘చిన్నదొర’ అని పలకరించేవారు. నాకు కొంచెం విడ్డూరంగానే అనిపించేది. ఎందుకంటే ?ఇతని వయసెక్కడా..!? వాళ్ళ వయసెక్కడా..!? అని అనిపించేది. ఐతే నేను, ‘రణధీర్ రెడ్డి’ మేమిద్దరం సమవయస్కుల్లా అనిపించే వాళ్ళం. నేను కూడా ‘చిన్న దొర’ అనే పిలిచేవాణ్ణీ. అతను సైకీలు తొక్కడం నేర్చుకునేందుకు చిన్న సైకిల్ కిరాయికి తెచ్చేవాడు. తొక్కడం ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడప్పుడు నాకు కూడా ఇచ్చేవాడు. నేను కూడా సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేసేవాణ్ణీ.
చూస్తూండగానే రోజులు గడిచినయి. వార్షాకాలం మొదలయింది. బడులు ప్రారంభమయినయి. పిల్లలందరూ బడికి ‘హన్మకొండ’కు వెళ్లి పోయారు.
ఐతే, ఉగాది నుండి విత్తనాలు వేసేంతవరకు పశువులను మేపడమంతా సుఖం ఇంకోటి వుండదు అనిపిస్తుంది. ఇంటికాడ వదులుతే, సర్వలకుంటనుండీ మేసుకుంటూ మా పటేలోల్ల బయికాడా కల్లంపొల్లు వగైరా మేసి.. బాగా ఎండ కొట్టే సమయాన బలిజోల్ల మామిడి తోటలో చెట్లకింద నీడకు పశువులన్నీ హాయిగా పడుకునేటివి. మేము కూడా మధ్యాహ్నం అన్నం తిని, ఆ చెట్లకింద ఆడుకునే వాళ్ళం, బావుల్లో ఈత కొట్టేవాళ్ళం, అవసరమైతే కాసేపు పడుకునే వాళ్ళం. మల్లి పొద్దుగుంజాముల మూడు నుండి నాలుగు గంటల సమయాన, పశువులు వాటికవ్వే లేసి మడికట్లల్లో మేయడానికి బయలుదేరేవి. మేము కూడా వాటి వెనకాల తిరుగుతూ, పొద్దు బూకే సమయానికి ఇంటికి తోలుకోని పోయి, కట్టేసి, మేతేసి, మిగతా పనులు చూసుకునే వాళ్ళుం.. .
ఐతే, ఈ ‘యాకుబ్ రెడ్డి దొర’ నలుగురి నుండి ఐదుగురు మనుజులవరకు జీతంలో పెట్టుకునేవాడు. పశువుల కాపరికీ ఒకరు, గొర్ల కాపరికీ ఒకరు, వ్యవసాయానికీ ముగ్గురు మొత్తం ఐదుగురు జీతగాన్లను పెట్టుకునే వాడు. ఇందులో ‘శాలోల్ల యాలాద్రీ’ చాలా సంవత్సరాలుగా ఈ దొర వద్దనే జీతము ఉంటున్నాడు. ఓఇద్దరు మా తండా వాళ్ళు ఉండేవాళ్ళు. ఐతే ఈ సంవత్సరం మా తండా నుండి బీచ్య(వ్యాండో బీచ్య) ఉన్నాడు. అతను ఇంటికీ వచ్చేవాడు, అవసరమైతే బాయికాడికీ పోయేవాడు. నన్ను ఇక్కడ జీతముంచాలని అనుకున్నప్పుడు, మా నాన్న దొరింటికాడి తిండీ-తిప్పలు, సాదక-బాదకాల గురించి ఈ ‘బీచ్య’ నే అడిగి తెలుసుకున్నాడు. ” అచారేర్ ఖ్వాడి ఘంఘం గందావ, అంబార్ ఆచార్, లింబూర్ ఆచార్, అమొళ్యార్ ఆచార్…, ఓ కాయిఁఖావజకో తోన ఘాలఛ..కత్ మళఛ తోన..!?, ఖా ఖాన్ తీన్మీనార్ మాయిఁ, అంబార్ సరీకో, అత్రాజాడో వేజాచీ.. దేఖ్…మార్వాత్ లబ్బారి..వతో..” అని అన్నాడు పెద్దజీతగాడు ‘బీచ్య’. దొరల ఇంట్లో అట్లానే ఉంటుంది కావచ్చు అని అనుకున్నాను. అది వినీ మా నాన్న కూడా సంతోష పడ్డాడు. సంవత్సరం వరకు నాకొడుక్కూ తిండికీ, ఉండడానికీ రంధీ లేదు అని అనుకున్నాడు.
‘మనుబోతుల కొంరయ్యా’ గొర్ల కాపరిగా ఉండే వాడు. వాడు కేవలం గొర్లవరకు మాత్రమే చూసుకునే వాడు. కాని ఎండాకాలంలో నిళ్ళు ఎక్కువ పట్టడంతో, మాతోపాటు ‘కొంరయ్య’ కూడా నీళ్ళకు వచ్చేవాడు.
ఐతే, ఈ ‘యాలాద్రి’ ఊళ్ళోవాడు కావడం వలన ఏ సమయానికైనా అందుబాటులో ఉండేవాడు. రాత్రైన, పగలైన.. ఎక్కువ సమయం దొరింటి వద్దనే ఉండేవాడు. పొద్దుగాల చీకట్లోనే వచ్చీ పాలు పిండి దొరసానికిచ్చేవాడు. రాత్రి పూట కల్లాలవద్దా కావలుండేవాడు. ఎప్పుడైనా ‘దొర కుటుంబం’ ఊరికి పోతే, ఇల్లంతా ఈ ‘యాలాద్రి’ మీద వదిలేసి పొయేవారు. అంటే అంత నమ్మకం ఉండేదన్నమాట.
ఇక తిండీ విషయానికొస్తే.. జీతంలో చేరిన నాటినుండి రెండు నెలల వరకు అంతో-ఇంతో, రాత్రిదో-పగలుదో, తొక్కో-పులుసో..పెట్టేది మా దొరసాని. కాని ప్రతిసారి భోజనంలో మామిడి కాయతొక్కు వేసేది. దాంతో కడుపులో మంటేసేది. కాని అది ‘ప్రతిపూట మామిడి కాయ పచ్చడి’ తినడం వల్లనే కడుపులో మంటవుతుందన్నా విషయం నాకు తెలియదు.
రెండు నెలల తర్వాత, వంటింట్లో గ్యాస్ పొయ్యిని వాడే విధానం, దానిమీద వంట వండే విధానం.. మొదలగు విషయాలు నేర్పించింది మా దొరసాని. “అరే..! ‘రాము’ ఈ రోజు నుండి నీమందము నువ్వు ఇందులో వండుకో. మా మందం మూడు గ్లాసుల బియ్యం ఈ గిన్నేలో వండు.. అర్థమయిందా ర..!?, ఉల్లి గడ్డలు, కూరగాయలు కోసేయ్యి, నేను కూర వండుత” అని అన్నది మా దొరసాని. నేను ఏమి అనలేక అవునన్నట్లుగా తలూపాను. తర్వాత రోజునుండి నా అన్నం నేనే వండుకున్నాను. వాళ్ళకు కూడా ‘అన్నం’ నేనే వుండేవాడిని. ఏరోజుకారోజు కూరగాయలు కోయమని ఇచ్చేది, వాటిని నేను కోసిచ్చేవాడిని. కూరలు మాత్రం మా దొరసానే వండేది.
ఐతే, రోజు తోమినట్లే, ఆరోజు కూడా బొళ్ళుతోముతున్నాను. కూరగిన్నే తోమడానికి చేతికి తీసుకోని తోమపోతే అందులో ఒక మనిషికి సరిపడా ‘మటన్ షోర్వా, ఓ రెండు-మూడు మటన్ ముక్కలు, ఓ రెండు బొక్కలు’ పడేసి వున్నాయి. అవి చూసి ‘నేను బాధపడ్డాను. ఎందుకంటే ఈ విధంగా, వృధాగా పడేసే బదులు నాకేసిన తినేవాడిని కదా..! రోజు మూడు పూటలు ఆ మామిడికాయ పచ్చడి, అప్పుడప్పుడూ రాత్రి మిగిలిన (చలికూర).. తినీ బోర్ కొడుతోంది.’అని అనిపించింది…ఈ విధంగా ఓ రెండు-మూడు నెలలు గడిచింది.
ఒక రోజు పశువులను తోలుకోని ఇంటికి వచ్చాను. వాటిని కట్టేసి, మేతేసి ఇంటికి పోయేసరికి, ఇంటికి తాళమేసి ఉంది. దొరసాని ఇంట్లో కనబడుత లేదు, దొర కూడా కనబడుత లేడు. పొద్దూకి చీకటి కావస్తోంది.. నేను ఇంటిముందు తాళం వేసియున్న ఆ దర్వాజ వైపు చూస్తూండగా.. “అరె..! ఓ పిలగా..! ఇట్రా..” అని అన్నాడు నాగటేడ్లకు మేతేసుకుంటూ ‘యాలాద్రి’. ఐతే, నేను అతని దగ్గరికి పోయాను. “ఈ రోజునుండి మీ దొరసాని వచ్చేంతవరకు నువ్వు మా ఇంటివద్దనే బువ్వతినాలి, అర్థమయిందా..!? వాడిచ్చే ఆతులపొట్టూకు, వానికి చేసింది చాలకా, ఇంకా, ఇప్పుడు నీకు కూడా మేమే చెయ్యాలే..! నిన్నంటే ఏమి లాభం, నిన్న-మొన్నోచ్చినోడివి, నీకు మాత్రం ఏమి తెలుసు, మా కష్టాలు. నేను, నా భార్య సంవత్సరాల తరబడి, రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసినా..మా బతుకులు మాత్రం మారలేదు…సరే ఇవ్వన్నీ నీతో చెప్పుకుంటుంటే వచ్చేదీ లేదు పోయేదీ లేదు. ఐతేమాయే గాని, నీకూ మా ఇల్లు తెలుసా..!? నాతో రా.. ఇద్దరం పోయి, ఇంత తినీ మల్లొదం.” అని అన్నాడు ‘యాలాద్రి’.
ఇక ఆ రోజునుండి, రోజు అన్ని పనులు చేసుకోని బువ్యాల్లకు ‘యాలాద్రి’ వాళ్ళ ఇంటికి పోయి, ఇంత తినీ పగటికి ఇంత టిఫిన్ బాక్స్ లో పెట్టిస్తే, అది పట్టుకోని, పశువులను తోలుకొపోయి కంచేలో మేపుకోని మళ్ళీ సాయంత్రం వాటిని తోలుకోని ఇంటికి వచ్చి, వాటిని కట్టేసి, మేతేసి.. ఇంకేమన్నా చిన్నా-చితక పనులుంటే చూసుకోని.. అప్పటికే రాత్రి అన్నం తినేయాల్లైతే.. ‘యాలాద్రి’ వాళ్ళ ఇంటికి పోయి, ఇంత బువ్వ తిని, దొరింటికీ పోయి పడుకునే వాణ్ణి. ఐతే, వీళ్ళు కేవలం ‘నూకలబువ్వ’ దాని మీదికీ పచ్చి పులుసు లేదా మామిడికాయ పచ్చడి పెట్టేవాళ్ళు. ఐతే, ఈ ‘నూకల బువ్వ, పచ్చి పులుసు, మా మామిడి కాయ పచ్చడి’ గురించి ఎవన్నంటే..!? ” మీ దొర, మీదొరసాని, నీకు వండిపెట్టమని ఈ నూకలే ఇచ్చిండ్రు. అదే మేము పెడుతున్నాం..” అని అన్నాడు ‘యాలాద్రి’ వ్యంగ్యంగా.
ఐతే,ఎండాకాలంలో స్వేచ్ఛగ, దూరం-దూరం వరకు పోయి, మేసిన పశువులు, వర్షాకాలం వచ్చేసరికి పరిమితమైన ప్రదేశం లోనే తిరిగి-తిరిగి మేత మేసే పరీస్థితి ఏర్పడింది. దానితో పాటు గత రెండు సంవత్సరాలుగా ఆపశువుల్లో కొన్ని దొంగవైనయి. ముఖ్యంగా ఎల్లకోల్యాగైతే చేన్లు మొలకెత్తగానే పశువుల మంద నుండి రెప్పపాటున తప్పించుకోని ‘లచ్ముపురం’లోని ‘కృష్ణా రెడ్డి’ ‘దొర’ గారి వెరుశెనిగా మొలకల చేనులో పడి మేయడం అలవాటయింది. ఈ విషయం మా పెద్ద పాలేరు ‘యాలాద్రి’కీ తెలిసింది. ” అరే ‘బొందయ్య’ నువ్వు నా కొడుకులాంటోడివి, నువ్వు ఆ పాపిస్టోని చేతి దెబ్బలు తింటుంటే నేను చూడలేను. వాడు నమ్మించి దొరకబట్టీ కొడితే ఇక జీవితంలో బతికినా చచ్చినోడితో సమానం. ఇట్లనే పొయిన సంవత్సరం, పాపం ఆ సన్నూర్ తండోడినీ నమ్మించి, నవ్వుకుంటూ దగ్గరికి పిలిచి, దొరకబట్టీ, రెండు చేతులు కట్టేసి, తనకు ఎదురు లేరని భావించీ, ఎదడికర్రతో ఎక్కడపడితే అక్కడ కొట్టీ-కొట్టీ లేవకుండా చేస్తే, వాడు జీతం వదిలేసి పారిపోయిండు. కాని వాడు ఈనాటివరకు సరిగ్గా కోలుకోలేదు. కావునా జాగ్రత్తగా ఉండూ సుమా.. తర్వాత చెప్పలేదనేవు ..! . ఆ ‘దొంగా’ కోడే మెడకు తుంటకట్టూ. రెపటినుండీ దానిమీద కన్నేసివుంచూ..అర్థమయిందా..!? ” అని ఆ దొర యెక్కా అమానవీయ వ్యక్తిత్వం గురించి వివరంగా చెప్పాడు యాలాద్రి.
ఆ ‘కృష్ణా రెడ్డి దొర’ గురించి మా పెద్ద జీతగాడు ‘యాలాద్రి’ చేప్పే దానికి మరియు బయట జనం మాట్లాడుకునే దానికి తేడా లేదు. అప్పటినుండి నాలో భయం ఎక్కువయింది. ఆ ‘దొంగ కోడే’ మెడకు తుంట కడదామంటే అది ఇంటికి రావడం లేదు. ఒక వేళ వచ్చినా ఏ రాత్రో వచ్చి మళ్ళీ చేన్లోమేసేందుకు వెళ్ళిపోతుంది. అది ఇప్పటి అలావాటే కాదు, గత సంవత్సరం నుండి చేన్లల్లోపడిమేయడం అలవాటయింది.
ఒక రోజు సాయంత్రం పొద్దుబూకాల్లకూ, పెరట్లో చార్మినార్ సిగరేట్ డబ్బా చేతిలో పట్టుకోని, ఒసన్నటి ఎదడు కట్టే సంకలేసుకోని, నేను వరిగడ్డీ కోసం పోయే దారిలో నిలబడి ఉన్నాడు. నేను పశువులను కట్టేసి మేతవేసేందు గడ్డి వామి దగ్గరికీ పోతున్నాను. ” ఒరే రాముగా ‘అగ్గిపెట్టె’ తీసుకోని రార..” అని అన్నాడు ‘దొర ‘చాలా సాఫ్టుగా. అప్పటికీ ‘యాలాద్రి’ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి, కాని నేను జీతమున్నది వాళ్ళ తమ్ముడికే కదా..!?, ఇంత చిన్న మాట వినకపోతే ఏమనుకుంటాడో అని.. ఎట్లైతే గట్లే తర్వాత చూద్దామని.. భయపడుకుంటానే, ‘అగ్గిపెట్టె’ పట్టుకోని దగ్గరికి పోయి, ‘అగ్గిపెట్టె’ ఇయ్యబోయిన, దొర అదే చేయ్యినీ గట్టిగా పట్టుకోని, రెండడుగులు వెనక్కు జరిగి నావెనక భాగాన తొడలమీదికేల్లి గుంజి ఒక్కటి సరిసిండు. నేను ఆ దెబ్బకి లబో-దిబోమని, ‘ఏ..యాడియే…ఏ బాపురే..!’, అని మొత్తుకోని కిందపడి, చేతినిండా మట్టి పట్టుకోని, పైకి లేస్తూనే ‘దొర’ గారి కంట్లో కొట్టీ, ఆ రాత్రే, ఊరొదిలి మా ఇంటికి -తండాకు పారి పోయి వచ్చిన.. . ఆ విధంగా “కర్ణుడి చావుకు అనేక కారణాలు” అన్నట్లు.. నేను ఊళ్ళో ‘జీతం’ వదిలీ పారిపోయి, తండాకు రావడానికి ఈ పై కారణాలు… కావా? .
-— డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
నా కథ-4 దొర కోడే-దొంగ కోడే — డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>