భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

గాంధీజీ ఆధ్వర్యంలో ‘ నిఖా ‘ చేసుకున్న ఫాతిమా బేగం

     స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కోరుకున్న ప్రజలు వివక్షతను  ఏమాత్రం సహించరు. మహత్తరమైన స్వేచ్ఛా,సమానత్వాల కోసం నడుం కట్టిన యోధులు సుఖ,సంపదలను లెక్కచేయరు. లక్ష్యసాధన పరమావధిగా భావించిన వారు ఆ మార్గం తప్ప అందుకు అడ్డం వచ్చే ప్రతిదాన్ని త్యజిస్తారు. ఆ కార్యాచరణకు ప్రతిరూపంగా నిలుస్తారు శ్రీమతి ఫాతిమా బేగం.
                                             దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలలో మహాత్మాగాంధీ తోపాటుగా పాల్గొని, అక్కడున్న లక్షలాది రూపాయలను ఆర్జించిపెట్టే వ్యాపారాన్ని వదులుకుని, గాంధీజీ తోపాటుగా భారతదేశం విచ్చేసిన కుటుంబ సభ్యురాలు ఫాతిమా బేగం. ఆమె తండ్రి ఇమామ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ దక్షిణాఫ్రికాలో ప్రఖ్యాత  అరేబియా గుర్రాల వ్యాపారి. దక్షణాఫ్రికాలో సాగుతున్న వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఇమామ్‌ ఖాదిర్‌ గాంధీజీకి క్రియాశీలక సహకారం అందించారు. ఆ క్రమంలో  అక్కడున్న సర్వసంపదలను త్యజించి అతి సామాన్య ఉద్యమకారునిగా కుటుంబంతో సహా ఆయన భారత దేశం వచ్చారు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న విముక్తి పోరాటంలో భాగస్వామ్యం వహించేందుకు సర్వసంపదలు వదులుకుని గాంధీజీ వెంట నడిచారు.
ఆ మహనీయుని  పెద్ద కుమార్తె ఫాతిమా బేగం. ఆమె కుంటుంబం అంతా సబర్మతీ ఆశ్రమంలో గడిపింది. ఆ కారణంగా ఫాతిమా గాంధీజీ కనుసన్నలలో పెరిగారు. ఆశ్రమంలో అన్ని పనులలో ప్రతిఒక్కరికీ చేదోడుగా ఉంటూ ఆశ్రమ నిబంధనలను  పాటిస్తూ  ఆశ్రమవాసుల, ప్రత్యేకంగా మహాత్ముని ప్రశంసలను అందుకున్నారు.
                                        ఆమె తండ్రి అబ్దుల్‌ ఖాదిర్‌ను గాంధీజీ స్వంత సోదరునిగా భావించి గౌరవించారు. ఆ అనుబంధంతో  20 సంవత్సరాల ఫాతిమా వివాహం విషయంలో గాంధీజీ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆమె వివాహా ఆహ్వానపత్రాన్ని ఆయన స్వయంగా రూపొందించారు.  ఆ వివాహానికి ప్రముఖులను, ప్రజలను ఆహ్వానిస్తూ 1920 ఏప్రిల్‌ 2న వెలువడిన ఆహ్వాన పత్రిక గాంధీజీ పేరిట ప్రచురితమై జాతీయోద్యమ సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. ఆ ఆహ్వాన పత్రిక ఇలా సాగింది.
                                        ప్రియమైన మిత్రమా! ఫాతిమా బేగం నా మిత్రులు మరియు నా సోదరులు ఇమాం అబ్దుల్‌ ఖాదిర్‌ సాహెబ్‌ గారి జ్యేష్ట పుత్రిక. ఇమాం సాహెబ్‌ దక్షణాఫ్రికాలో, భారత దేశంలోని ఆశ్రమ, జైలు జీవితంలో నా సహచరులు. సయ్యద్‌ హుస్సేన్‌ మియాతో ఫాతిమా బీబీ వివాహం  1920 ఏప్రిల్‌ 26 తేది శనివారం సాయంత్రం ఏడు గంటలకు జరపాలని నిశ్చయమైంది. ఆరున్నరకు మిలాద్‌ షరీష్‌ ఆరంభమౌతుంది. ఈ సంతోషకర  సమయంలో మిరూ కూడా పాల్గొని వధూ, వరులను తమ శుభాకాంక్షలతో అలంకృతులను చేయగలరు.
                                                                                        ఇట్లు
                                                                                                      మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ.
                                     ఈ వివాహ కార్యక్రమం  గాంధీజీ ఆధ్వర్యంలో అతి సాదాసీదాగా పూర్తయ్యింది.  ఈ వివాహం గురించి గాంధీజీ తన నవజీవన్‌ పత్రికలో విశేషంగా ఉల్లేఖించారు. వివాహం తరువాత ఫాతిమా అత్తవారింటికి వెళ్ళింది. ఆశ్రమ జీవితంలో అలవర్చుకున్న శిక్షణ, సహిష్ణుత, దేశభక్తి, సామాజిక సేవాభావాలను అత్తవారింట పరిమళింప చేయాల్సిందిగా కోరుతూ గాంధీజీ ఆమెను ఆశీర్వదించారు. ఆ దిశగా అత్తవారింట కూడా జాతీయోద్యమ భావాలను పరిమళింప చేసిన ఫాతిమా బేగం చిన్న వయస్సులోనే కన్నుమూశారు.

  ప్రసంగాలతో ప్రజలను ఉద్యమ దిశగా నడిపిన  దిట్ట-అక్బరీ బేగం

 
                                   ప్రజా పోరాటాలలో మహిళలు పాల్గొనటం ఒకవంతైతే, ఆ పోరాటాలలో పాల్గొనటమే కాక, తోటివారిని కూడా పాల్గొనేట్టు చేయటం గొప్పవిద్య.  అది ఆయా వ్యక్తుల స్వచ్ఛమైన ప్రవర్తన, నిజాయితీ, నిబద్ధతల విూద ఆధారపడి ఉంటుంది.  ఈ మేరకు జాతీయోద్యమం తొలిథలో జరిగిన ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమం దిశగా మహిళలను కార్యోన్ముఖులను చేయటమే కాకుండా, ఆయా స్త్రీల కుటుంబ సభ్యులను కూడా పోరాట దిశగా నడిపించే సత్తాగల ఆలోచనాత్మక ప్రసంగాలను చేసిన యోధురాలిగా శ్రీమతి అక్బరీ బేగం ఖ్యాతిగాంచారు.
                              ఆమె ప్రముఖ స్వాతంత్య్రోద్యమకారుడు, న్యాయవాది ఆసఫ్‌ అలీ తల్లి. ఆమె భర్త అహసన్‌ అలీ. ఆయన పోలీసు అధికారి. స్వమతం పట్ల అత్యంత భక్తిప్రపత్తులున్నా ఇతర మతాల పట్ల వివక్షత చూపని విశాల హృదయం ఆమెది. ఆమె కుమారుడు  హిందూ యువతి అరుణా గంగూలిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె కొంత కినుకు వహించినా ఆ తరువాత అరుణా ఆసఫ్‌ అలీని ఆదరించి కూతురు స్థానం కల్పించారు. ఆరుణా అసఫ్‌ అలీకి ఆమె ఉర్దూ నేర్పారు. ఆమెతో కలసి అక్బరీ బేగం పలు జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. (Aruna Asaf Ali, GNS Raghavan, NBT, india, 1999)
                                          ఖిలాఫత్‌-సహాయనిరాకరణ  ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న రోజులవి.  1920 మే మాసంలో ఢిల్లీలో మహిళల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో  అక్బరీ బేగం ఉత్తేజపూరిత ప్రసంగం చేసి బ్రిటీష్‌ పోలీసుల ఆగ్రహానికి గురయ్యారు. ఆనాడు ఆమె చేసిన ప్రసంగం ఈ విధంగా సాగింది.
 విూరంతా విూ కుటుంబాల పాలకులు, శాసకులు సంపూర్ణాధికారులు కారా? అది నిజమైతే మనం మన కుటుంబాలలోని మగవాళ్లందర్నీ సహాయ నిరాకరణ ఉద్యమంలో నిష్టగా పొల్గోనేట్టు ప్రోత్సహించాలి. ఉద్యమం పట్ల నిబద్ధతతో వ్యవహరించేలా చూడాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సాంఘికంగా బహిష్కరించాలి. మన మగవాళ్ళను కర్మనిష్టాపరులను చేయాలి. మీ  హృదయాలలో  భగవంతుడిని, మహమ్మద్‌ ప్రవక్తను సన్నిహితంగా ప్రతిష్టించుకోవాలంటే, స్వర్గంలో బీబీ ఫాతిమా సేవలో నిమగ్నం కావాలన్న అభిలాష మీకున్నట్టయితే ధర్మపోరాటం పట్ల దృఢచిత్తులై వ్యవహరించండి. (భారత్‌కి స్వాతంత్ర సంగ్రామం మేఁ ముస్లిం మహిళావోంకా యోగ్‌దాన్‌, డాక్టర్‌ ఆబెదా సమీయుద్దీన్‌, ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆబ్జెక్టివ్‌ స్టడీస్‌, న్యూఢిల్లీ, 1997 పేజి.313)
                                              అక్బరీ బేగం మతసామరస్యానికి, విభిన్న మతస్థుల మధ్య స్నేహసంబంధాల పటిష్టతకు ఎంతగానో కృషిచేశారు. ఆమె తన ప్రసంగాలకు ఆధ్యాత్మికతా సుగంధాన్ని అద్దారు. ఆ కారణంగా ఆమె  ప్రసంగాలు మహిళలను ప్రధానంగా ముస్లిం మహిళలను ఉద్యమ దిశగా నడిపాయి. మతసామరస్య పటిష్టతకు దోహదపడ్డాయి.  ఆ ప్రసంగాల ద్వారా మహిళలు కదలి వచ్చి ఖిలాఫత్‌- సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేట్టు ఆమె కృషి సాగింది.
ఈ మేరకు  ఖిలాఫత్‌ ఉద్యమంలో ఆమె ప్రధాన పాత్ర వహించారు.  పలు పర్యటనలు జరిపారు. అనేక సభలు-సమావేశాలలో ప్రసంగించారు. ఆసఫ్‌ అలీ లాంటి ప్రముఖ జాతీయోద్యకారుడ్ని విముక్తిపోరాటానికి అందించి, స్వరాజ్యం కోసం పోరాడుతున్న జాతీయోద్యమకారులకు ప్రేరణగా నిలిచి స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తనదైన స్థానాన్ని ఆక్బరీ బేగం సొంతం చేసుకున్నారు.

 విముక్తి పోరాటంలో  అరెస్టయిన  తొలి ఢిల్లీ మహిళ-మహబూబ్‌ ఫాతిమా

                                       పరదా చాటున జీవితాలు గడిపే కులీన వర్గానికి చెందిన ముస్లిం ఆడపడుచులు బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటాలలో బహిరంగంగా రంగం మీదకు రావటం జాతీయోద్యమ ప్రారంభ దినాలలో చాలా విశేషం.  ఆనాడు ఏ సాంఘిక జనసముదాయానికి చెందిన మహిళలైనా జైలుకు వెళ్ళడానికి అంతగా ముందుకొచ్చేవారు కారు. అటువంటి వ్యతిరేక వాతావరణంలో  శ్రీమతి మహబూబ్‌ ఫాతిమా ఢిల్లీలో అరెస్టయ్యి జైలుకెళ్ళి సంచలనం సృష్టించారు. జాతీయోద్యమం పరవళ్ళుతొక్కుతున్న సమయమది. మాతృభూమి విముక్తి పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్న కాలమది. ఆ వాతావరణంలో ఫాతిమా ఇంట్లో కూర్చోని ఉండలేకపోయారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు.  ఆనాడు మహిళలు అరెస్టులు కావటం, జైలు కెళ్ళటం విశేష వార్త. అటువంటి విశిష్టమైన వార్తకు ఆమె కారకులయ్యారు.
                                               1919లో  జనరల్‌ డయ్యర్‌ జలియన్‌ వాలాబాగ్‌లో వందలాది దేశభక్తులను బలి తీసుకున్నాడు. ఆ కిరాతక చర్యకు బలైన అమరయోధులను స్మరించుకుంటూ, ప్రతి ఏడాదిలా 1932 ఏప్రిల్‌21న జలియన్‌వాలాబాగ్‌ అమరవీరుల దినోత్సవం జరిగింది.  ఆ రోజును పురస్కరించుకుని ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్‌ ఫాతిమా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు.  అందుకు ఆగ్రహించిన పోలీసులు ఆమెను అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చారు. బ్రిటీష్‌ కోర్టులో న్యాయపోరాటం చేయడానికి ఫాతిమా తిరస్కరించగా ఆమెకు ఆరు మాసాల జైలు శిక్ష, 50 రూపాయల జరిమానా విధించారు. ఈ వార్తను బిజనోర్‌ నుండి ప్రచురితమయ్యే 1932 ఏప్రిల్‌ 25 నాటి మదీనా అను ఉర్దూ పత్రిక శిక్షకు గురైన తొలి ఢిల్లీ ముస్లిం మహిళ  శీర్షికతో ప్రత్యేకంగా ప్రచురించింది.

                             తొలిసారిగా అరెస్టయిన బెంగాల్‌  బేగం సిస్టర్స్‌బేగం జహీరా-సుల్తానా 

                          భారత స్వాతంత్య్రోద్యమానికి పుట్టినిల్లు బెంగాల్‌. ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 1763లో ఫకీర్లు-సన్యాసుల తిరుగుబాటు ఇక్కడే ప్రారంభమైంది.  బెంగాల్‌లో పురుషులతోపాటుగా మహిళలు కూడ జాతీయోద్యమంలో ముందున్నారు. పర్దానషీ మహిళలై ఉండి కూడా అరెస్టులకు గురై జహీరా బేగం, సుల్తానా బేగం సోదరీమణులు చరిత్ర సృష్టించారు.స్వాతంత్య్ర సమరయోధుడు, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు ఫ్రోఫె¦సర్‌ అబ్దుల్‌ రహీం కుమార్తెలు ఈ బేగం సోదరీమణులు. జాతీయోద్యమంలో భాగంగా జరిగిన విదేశీ వస్తుబహిష్కరణ ఉద్యమంలో వారు చురుకైన పాత్ర నిర్వహించారు.  ఈ సందర్భంగా మధ్యం విక్రయశాలలు, విదేశీ వస్తువులను విక్రయిస్తున్న దుకాణాల ఎదుట ఈ వీరి నేతృత్వంలో పికెటింగ్‌ జరిగింది.
                  ఆ కారణంగా జహీరా బేగం, సుల్తానా బేగంలను ప్రభుత్వం  అరెస్టు చేసింది. ఈ సంఘటనను పురస్కరించుకుని, 1930 ఆగస్టు 30నాటి అభ్యుదయ అను వార్తా పత్రిక బేగం సోదరీమణుల అరెస్టులకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ  బెంగాల్‌ ప్రాంతంలో మొదటి సారిగా అరెస్టయిన ముస్లిం మహిళలు, అని రాసింది.
ఈ సంచలనాత్మక వార్త ముస్లిం మహిళల్లోఉత్సాహాన్ని పెంచింది. స్వరాజ్య సాధన కోసం సాగుతున్న జాతీయోద్యమంలో పాల్గొని, పోలీసుల దాడులను, కిరాతకాలను భరిస్తూ, అరెస్టులకు, జైలుశిక్షలకు వెరవకుండా చివరివరకు సాగేందుకు ప్రజలకు ప్రేరణ కలిగించింది.

పోలీసులు గుర్రాలచే తొక్కించినా బెదరని  హమీదా తయ్యాబ్జీ

బ్రిటీషు బానిస బంధనాల నుండి విముక్తి కోరుకున్న భారతీయులు దృఢసంకల్పంతో ఆ దిశగా ముందుకు సాగారు.  పోరుబాటలో దీక్ష చేపట్టారంటే వారిని మార్గం మళ్లించడం ఎంతటి క్రూరత్వానికైనా సాధ్యమయ్యేది కాదు.ప్రభుత్వం ఎంతటి దారుణాలకు పాల్పడినా ఉద్యమకారులు పోరుబాట తప్పలేదు. ఈ వైఖరికి పురుషులైనా, స్త్రీలైనా తేడా కన్పించలేదు. భయానక హింసకు కూడా ఏమాత్రం వెరవక మున్ముందుకు సాగిన సాహస మహిళలు జాతీయోద్యమంలో పలువురు దర్శనమిస్తారు. ఆ మహిళలలో చెప్పుకోదగ్గవారు శ్రీమతి హమీదా తయ్యాబ్జీ.
                             గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన తయ్యాబ్జీ కుటుంబానికి చెందిన హవిూదా తయ్యాబ్జీ 1911లో బరోడాలో జన్మించారు. ఆమె  సీనియర్‌ కేంబ్రిడ్జిలో విద్యాభ్యాసం గావిస్తున్న సమయంలో తన కుటుంబీకులతోపాటుగా జాతీయోద్యమంలో పాల్గొనేందుకు చదువును మధ్యలో వదిలేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌ యువజన సమితిలో ఆమె సభ్యురాలు.  తాత అబ్బాస్‌ షంషుద్దిన్‌ తయ్యాబ్జీ, మహాత్మా గాంధీల రాజకీయ సిద్ధాంతాల పట్ల ప్రభావితులయ్యారు. జాతీయోద్యమంలో భాగంగా జరిగిన అన్ని ప్రధాన సంఘటనలలో ఆమె పాల్గొన్నారు.
                               (1911- ) ఈ క్రమంలో  బ్రిటీష్‌ పోలీసుల లాఠీ దెబ్బలను రుచి చూశారు.  స్వదేశీ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తూ, మహిళలతో ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో మహిళల నిబద్ధతను నీరు కార్చేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం పోలీసులను ఉసికొల్పింది. అమెను పలు హింసలకు గురిచేసింది. ఆమెను ప్రత్యేక లక్ష్యంగా పెట్టుకుని గుర్రాలచే తొక్కించింది. అటువంటి భయానక సంఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆమె ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు. మరింత పట్టుదలతో ముందుకు వెళ్ళారు. ఆమె తన  సహచరిణులను సవిూకరించుకుని రెట్టింపు ఉత్సాహంతో అహింసామార్గంలో ఆందోళనలో పాల్గొన్నారు. అరెస్టులు, లాఠీ దెబ్బలు, జైలు శిక్షలకు ఏమాత్రం భయపడకుండా ఉద్యమబాటన తన కార్యక్రమాలను కొనసాగించిన ధైర్యశాలి. ఈ మేరకు ఆమె పలుసార్లు జైలు శిక్షలు అనుభవించారు.
                              గాంధీజీ ఆదేశాల మేరకు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలో పనిచేసేందుకు వెళ్ళిన ఆమె తన కార్యదక్షతను ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకోవటం మాత్రమే కాకుండా భారత జాతీయ కాంగ్రెస్‌  నాయకుల ప్రశంసలందుకున్నారు.  ఆమెకు పలు కార్యక్రమాల బాధ్యతలను జాతీయోద్యమం అప్పగించింది. జాతీయ  కాంగ్రెస్‌ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని ధైర్య సాహసాలతో నిర్వహించటమే కాకుండా  క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఆమె ప్రముఖ పాత్రపోషించారు. ఆమె కార్యక్రమాల నిర్వహణా సరళిని ప్రశంసిస్తూ 1932 ఏప్రిల్‌ 24న బేగం రెహనా తయ్యాబ్జీకి గాంధీజీ  లేఖ రాశారు. ఆ లేఖలో  హవిూదా ఎంతో ధైర్యవంతురాలు. హవిూదాకు మరింత ఆయుష్షును భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఆమె చేపట్టిన కార్యకలాపాలను ఆమెకు స్యయంగా మహాత్ముడు రాసిన లేఖలలో, ఇతరులకు ఆయన రాసిన పలు లేఖలలో ప్రత్యేకంగా ప్రస్తావించి రెహనా సాహసాన్ని, కార్యదక్షతను చరిత్రకు అందించారు.
               మతాతీత భావాలుగల హవిూదా తయ్యాబ్జీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కల్చరల్‌ రిలేషన్స్‌కు చెందిన ప్రముఖుడు ప్రబోధ్‌ మెహతాను (బొంబాయి) వివాహం చేసుకున్నారు.  ఆ తరువాత బాధ్యతలు మరువని పౌరురాలుగా, కుటుంబాన్ని సమర్ధవంతంగా తీర్చిదిద్దిన ఆదర్శ గృహిణిగా, మాతృమూర్తిగా బేగం హవిూదా జీవితం గడిపారు.

 – సయ్యద్ నశీర్ అహమ్మద్

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
106
పురుషుల కోసం ప్రత్యేకం, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో