అమరగాయకుడు ఘంటసాల గారి 90వ జయంతి సందర్భంగా నిర్వహించబడ్డ ప్రత్యేక “స్వర మాధురి” (గత మూడేళ్ళలో ఇది 14వ కార్యక్రమం) హ్యూస్టన్ నగరంలో విజయవంతంగా జరిగింది.
ఎప్పటిలాగే అంజలి సెంటర్ ప్రాంగణంలో నిర్వహించబడ్డ ఈ కార్యక్రమానికి రాం చెరువు సారథ్యం వహించారు. తనదైన శైలిలో ప్రేక్షకులకు ఘంటసాల గురించి, ఆయన పాటల గురించి, ఆయన సంగీతం గురించి పాత, క్రొత్త విషయాలు చెబుతూ ఎంతో ఆహ్లాదంగా జరిపించారు.
ఈ కార్యక్రమంలో ఒక్క పాట తప్ప అన్నీ ఘంటసాలగారు పాడినవో, స్వరపరచినవో అవడం విశేషం. కీ.శే.మొహమ్మద్ రఫీ గారి జయంతి కూడా ఈ నెలలోనె వస్తుంది కాబట్టి (డిసెంబర్ 24న) హిందీ భాషలో ఆయన పాడిన గీతం ఒకటి కార్యక్రమం చివరలో పాడి ఆయనను కూడా జ్ఞాపకం చేసుకున్నారు.
స్వరమాధురి బృందం పాడిన “వందే వందే భారత భారతి”గీతం తో కార్యక్రమం ఆరంభమయింది.
ఘంటసాల రికార్డు చేసి నలభయ్యేళ్ళు దాటినా, ఇప్పటికీ ప్రపంచమంతా మార్మోగిపోతున్న భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలను రవి ముక్కామల అద్భుతంగా గానం చేసి కార్యక్రమానికి చక్కటి వాతావరణాన్ని ఏర్పరచారు.
పలు సినిమాలనుండి భక్తి గీతాలు, ప్రేమ గీతాలు, విషాద గీతాలు, లాక్షణిక గీతాలు – ఇలా దాదాపు 50 పాటలు వినిపించారు. మాయా బజార్, దేవదాస్, పాందావ వనవాసం, బందిపోటు, లవకుశ, జగదేక వీరుని కథ, అప్పు చేసి పప్పు కూడు, గుండమ్మ కథ, ఇలా ఎన్నో మంచి చిత్రాల నుండి ప్రఖ్యాతి గాంచిన గీతాలను వినిపించారు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న గాయకులు.
ఇవే కాక కొన్ని పద్యాలు, సినీమేతర గీతాలు (ఉదా. సాంధ్యశ్రీ (?), పుష్ప విలాపం) పాడారు. ఘంటసాల స్వరపరచిన పాటల్లో సుశీల, లీల, పి.బి.శ్రీనివాస్, ఏ.ఎం. రాజా, మొదలైన వారు ఆలపించిన చక్కటి గీతాలను కూడా వినిపించారు.
కార్యక్రమంలో నాలుగు సంవత్సరాల చిన్ని పాపల నుండి దాదాపు అరవయ్యేళ్ళ వారు కూడా పాల్గొన్నారు. ఇలా వయోపరిమితి లేకుండా అందరూ ఘంటసాల మాస్టారి పాటల కార్యక్రమంలో పాల్గొనడం ఆయన సంగీతం ఆచంద్రార్కమూ నిలుస్తుందనడానికి సూచనప్రాయం. ఆధునిక సినిమా పాటలతో పాటు నలభై, యాభయ్యేళ్ళ పూర్వపు సంగీతాన్ని కూడా పాడుతున్న ఈ తరం వారిని చూసి సంతోషాన్ని వ్యక్తపరిచారు రాం చెరువు.
నాలుగేళ్ళ లాస్య పాడిన “శ్రీరాముని చరితమును” పాట అందరినీ ఆకట్టుకొనగా, సుమన్ పాడిన “శివశంకరీ” పాట, గొర్తి దంపతుల “సుందరి నీవంటి” పాటా, కేకే, రాంలు పాడిన పౌరాణిక పద్యాలు, రవి ముక్కామల, శివ, అఖిల, సత్యభామలు పాడిన పలు పాటలు – ఇలా ఎన్నో, అన్నీ ప్రేక్షకులను కూర్చీలకు బంధీకృతులను చేసాయి.
ఘంటసాల పాడుతుండగా మనకు తెర మీద కనబడే ఏకైక గీతం, “శేషశైలా వాసా” పాటు రవి గానం చేసిన తరువాత అంజలి సెంటరు వారికి, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితికి,వంగూరి ఫౌండేషన్‌కి ధన్యవాదాలు చెబుతూ కార్యక్రమాన్ని ముగించారు.
ఎంతో రుచికరమైన భోజనాలు సిద్ధం చేసి అందరికీ పెట్టిన తల్లులకు ధన్యవాదాలు.*
– చిలుకూరి సత్యదేవ్