ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం అన్నట్టు డిల్లీ సంఘటన తరువాత ఒక దాని వెంట మరొకటి జరిగిన పరిణామాలు , మళ్ళీ మళ్ళీ జరిగినట్టుగా వచ్చిన రేప్ వార్తలు యావత్ ప్రపంచాన్నే కుదిపేసాయి.యువతుల్ని అత్యాచారం చేయడం,గ్యాంగ్ రేప్ లు చేయడం ఈ రోజు కొత్తేమీ కాదు. సెప్టెంబర్ 29 2006 లో మహారాష్ట్రలోని ఖైర్లాంజి గ్రామం లో జరిగిన దారుణ ఊచ కోత , గ్యాంగ్ రేప్ ల సంఘటన ఇంకా గుర్తుండే ఉంటుంది. అసలు అది మరిచి పోయే సంఘటన కాదు. దళిత బుద్దిస్టు కుటుంబానికి చెందిన భుత్ మాంగే కుటుంబ సభ్యుల్ని హిందూ వర్గానికి చెందిన కుటుంబాలు సాముహికంగా దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు.కొంత కాలంగా భూవివాదం పేరుతో భయ్యాలాల్ కుటుంబాన్ని ఆ వర్గం వేధిస్తూనే ఉంది . భయ్యాలాల్ కుటుంబం నీతికి , ఆత్మ గౌరవానికి తలవంచారు తప్ప పై వర్గాల బెదిరింపులకి తల ఒగ్గలేదు . ఈ సంఘటనలో 44 సంవత్సరాల సురేఖ భుత్ మాంగే , వారి పిల్లలు రోషణ్ (23), సుధీర్ (21), కుమార్తె ప్రియాంక (18)లపై దాడి చేసి గ్రామంలోకి నగ్నంగా ఈడ్చు కెళ్ళారు. గ్యాంగ్ రేప్ జరిపారు. అత్యంత హీనంగా దయనీయంగా అన్నల చేత చెల్లిని అత్యాచారం చేయడానికి బలవంతం చేసారు.తరువాత వాళ్ళని కర్రలతో కొట్టి చంపి పంటకాలువలో పడేసారు.ఈ సంఘటన సమయంలో ఇంట్లోలేని భయ్యాలాల్ భుత్ మాంగే ఒక్కడే బ్రతికి బట్టకట్టాడు . ఇంకా దారుణం ఏమిటంటే ఈ సంఘటనలో పురుషులతో పాటు వారి భార్యలు కూడా పాల్గొన్నారు. సురేఖా, ఆమె కూతురు ప్రియాంకల్ని రేప్ చేయడానికి ఆ స్త్రీలు దగ్గర ఉండి తమ పురుషులను ప్రోత్సహించారు. ఆరు సంవత్సరాల తరువాత ఆ నేరస్తులకు మరణ శిక్ష వేసి యధా ప్రకారం దానిని కారాగార శిక్షగా మార్చారు .ఈ సంఘటన జరిగినప్పుడు అనేక ప్రజా సంఘాలు , దళిత సంఘాలు మాత్రమే ఈ సంఘట పై స్పందించి ఆందోళనలు చేసారు . మిగిలిన వర్గాల వారు ఇది తమకి సంబంధించని సంఘటనగా ఉండి పోయారు . ఆ తరువాత ఈ సంఘటన వెంట మరెన్నోదాడులు దళిత స్త్రీలపై జరిగాయి. ఇప్పటికీ ఖైర్లాంజి సంఘటన అత్యంత నీచమైన సంఘటనగా కన్పిస్తుంది . నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం ప్రతి రోజు ముగ్గురు దళిత మహిళలైనా హత్యలు చేయబడుతున్నారు.మైనారిటి ముస్లిం స్త్రీలపై అత్యాచారాలు, గృహ హింసలు సర్వ సాధారణ మైపోయాయి . 1992లో రాజస్థాన్ లో భన్వరి దేవి అనే దళిత మహిళపై కూడా సాముహిక అత్యాచారం జరిగిన సంఘటన కేసులో రాజస్థాన్ న్యాయ మూర్తి ఇచ్చిన తీర్పు దళిత స్త్రీల ఆత్మ గౌరవానికి దిగగొట్టిన ముళ్ళ కిరీటం లాంటిది.కామంతో కళ్ళు మూసుకుపోయిన అగ్ర వర్ణాల తీర్పు మాయని మచ్చ లాంటిది. ‘భన్వరి దేవి అంటరాని కులానికి చెందినది కాబట్టి అగ్ర కులానికి చెందిన పురుషులు అత్యాచారం చేసి ఉండరు’ అన్న వ్యాఖ్య దళిత వర్గాల్లో ఒక సంచలనాన్ని రేపింది.ఈ వ్యాఖ్యలపై ఎంత మంది స్త్రీ వాదులు స్పందించారో !ఆ తరువాత జరిగిన అనేక అత్యాచార సంఘటలు చోటు చేసుకున్నా కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లకు, దిన పత్రికలకు మాత్రమే అవి పరిమితమ య్యాయి .ఎంతో మంది విద్యార్థినులపై వారి పురుష స్నేహితులు సాముహిక ఆత్యాచారాలు జరిపి , వాటిని మొబైల్ ఫోన్ లలో వీడిగా యోలు చిత్రీకరించి స్నేహితులకు ఎం.ఎం .స్ లు పంపుకున్నారు . వయస్సు తో సంబంధం లేకుండా గృహిణుల పైన , వృద్దుల పైన చివరకి నెలల వయస్సున్న బాలిక లపై కూడా అత్యాచారాలు, హత్యలు జరిగాయి. కాల్ సెంటర్ ఉద్యోగినులు అత్యాచారాలకు బలై అనుమానాస్పద హత్యలకు గురయ్యారు.ఏది ఏమైనా ఇన్ని సంఘటనలు జరిగిన తరువాత డిల్లి ఉదంతంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది . నిర్భయ/ దామిని/ అమానత్ ఆమె అసలు పేరు ఏదైనా కానీయండి . ఆమె బ్రతకాలని , తనకి న్యాయం జరగాలని మనస్పూర్తిగా కోరుకున్నారు . నిందితులకు కఠిన శిక్షలో, మరణ శిక్షలో వేయాలని ఆందోళనలు జరిపారు.స్త్రీలు మాత్రమే ఇది తమ సమస్య అని భావించ లేదు, ఈ సారి పురుషులు, విద్యార్ధులు సైతం ఈ పాశవికమైన సంఘటనని తమ కుటుంబ సభ్యురాలికే జరిగినట్టుగా స్పందించారు. ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిపారు.ఆ పై ఆమె ఆత్మ శాంతి కోసం ప్రార్ధనలు చేసారు . ఇది అంతా ఆ యువతిని తమ సొంత వ్యక్తిలా భావించడం వల్లే ఇవన్ని చేసారు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా స్త్రీ స్త్రీయే , ప్రముఖ స్త్రీలంతా కంట తడి పెట్టారు. ప్రభుత్వ పోలీసులే అత్యంత హేయంగా , ఆందోళన కారులపై దాడులు చేసారు.ఈ ప్రతి స్పందన, ఈ భావన ఇక నుంచి ప్రతి స్త్రీ పైనా ఉండాలని ఆశిద్దాం . అంటే ఇలాంటి సంఘటనలు జరగాలనీ , ఇలా ప్రతి స్పందించాలనీ కాదు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇక జరగవని హామీ ఏమి లేదు . ఈ సంఘటన వెను వెంటనే దాదాపుగా ఆరేడు సాముహిక రేప్ లు కార్లలో, వాహనాలలో జరిగినట్టు చూసాం .ఇప్పుడు జరిగిన తిరుగుబాటు ఖండన. ఆందోళన,చైతన్యం కొన్నేళ్ళుకు ముందే వచ్చిఉండాల్సింది , కఠిన శిక్షలు అమలు పరిచేలా చట్టాలను మార్చి ఉండాల్సింది. అంతేకాకుండా ప్రభుత్వం, న్యాయ వాదులు న్యాయం వైపే మొగ్గు చూపి ప్రజా సంఘాలకు, మానవ హక్కుల సంఘాలకు మద్దతు ఇస్తే ఈ దేశం లో స్త్రీలకి , యువతులకి కొంత న్యాయం చేకూరుతుంది. కామాంధుల ఆగడాలకి ఆనకట్ట పడుతుంది.నిర్భయ .శ్రీలక్ష్మి ,స్వప్నిక ,ప్రత్యూష సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.-పుట్ల హేమలత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ |
5 Responses to సంపాదకీయం