నా కళ్లతో అమెరికా-15

 

డెత్ వేలీ 

అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం భలే వైవిధ్యమైనది. ఒకో దిక్కున ఒకో రకపు వాతావరణం కనిపిస్తుంది.  ఉత్తరానికి వెళ్తే మంచు, దక్షిణంగా వేడి, పశ్చిమ తీరమంతా సముద్రం. తూర్పున దుర్భేద్యమైన సియెర్రా నెవాడా పర్వత శ్రేణులు.  ఇంతే గాకుండా సంవత్సరంలో సగం రోజులు మంచు తో కప్ప బడి ఉండే తూర్పు  పర్వత శ్రేణులను ఆనుకునే  ప్రపంచ ప్రఖ్యాత ఎడారి ప్రాంతమైన “డెత్ వాలీ ”  కూడా ఉంది.

ప్రయాణం:

మా ఊరి నుంచి లాస్ ఏంజిల్స్ వెళ్లే రహదారుల గుండా రెండు వందల మైళ్లు దక్షిణంగా   వెళ్లి  అక్కడి నుంచి తూర్పుకు మరలా ప్రయాణం చెయ్యాలి. మొత్తం 520 మైళ్ల దూరం లో ఉంది.

ఇంకా పిల్లల స్కూళ్లకు సెలవులు ఇవ్వక ముందే మే నెలలో వచ్చిన లాంగ్ వీకెండ్ కు బయలుదేరేం.  ఇక్కడ మే నెల అపుడప్పుడే కాస్త వేసవి ప్రవేశిస్తూ నును వెచ్చగా, ఆహ్లాదంగా ఉంటుంది. నిజానికి పిల్లలకు సెలవులిచ్చాక జూలై నెలలో వెళ్లొచ్చు. కానీ డెత్ వాలీ లో జూలై నెలలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు  నమోదవుతూంటాయని చదివి ఇక ఇప్పుడు బయలు దేరాం.

మేం మధ్యాహ్నం బయలుదేరితే సగం దూరం వెళ్లేసరికే చీకటి పడిపోతుంది. కాబట్టి దారిలో సగం దూరం లో ఉన్న బేకర్స్ ఫీల్డు లో ఆ రాత్రికి ఆగిపోయాం.

నిజానికి మేం రాత్రి ఏడున్నర ప్రాంతానికి బేకర్స్ ఫీల్డు చేరాలి. కానీ ఫ్రీవే మీద రోడ్ వర్క్ మధ్యలో పది మైళ్ల మేర జరుగుతున్నందు వల్ల అమెరికాలో మొట్ట మొదటి సారి దారుణమైన ట్రాఫిక్ జాములో ఇరుక్కున్నాం. రాత్రి భోజనాల వేళ కు చేరిపోతాం కదా అనే ధీమాతో  మేం  తినేందుకేమీ తెచ్చుకోలేదు. ఇక బాత్రూముల బాధ ఇంకా చెప్పనలవి కానిది. ఇక్కడ ఫ్రీవేలు ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి వీలుగా ఉండవు. ఎక్కడో వంద మైళ్లకొకటి ఉండే రెస్ట్ ఏరియాల మధ్య  ట్రాఫిక్ జాములో ఇరుక్కున్నామంటే అంతే సంగతులు. దాదాపు యాభై మైళ్ల పాటు నెమ్మదిగా తాబేలు నడకలా సాగే ట్రాఫిక్ లో పడి మొత్తానికి రోడ్డు పక్క మొదటి తినే ప్రదేశం కనబడేసరికి పదయ్యింది. అక్కడ ఉన్న జనాల్ని, ఆ చిన్న పాటి దుకాణాన్ని చూసి సగం ఆశ పోయింది. అక్కడ తినేందుకు ఏమీ లేవు ఏవో చిప్స్ పాకెట్ల లాంటివి తప్ప. అవే ఏవో తిని కడుపు నింపుకున్నాం. ఇక బాత్రూముల దగ్గర పేద్ద లైను. ఇక అక్కడి నుంచి ఆ ట్రాఫిక్ లో నుంచి బయట పడి బేకర్స్ ఫీల్డుకి వెళ్లేసరికి నిస్సత్తువతో నిద్ర వచ్చేసింది అందరికీ.

మర్నాడు ఉదయానే డెత్ వేలీ బయలు దేరాం.

ఎడారి:

సరిగ్గా ఊరు దాటి నలభై మైళ్లు ప్రయాణించామో లేదో  అప్పటి వరకూ ఉన్న పచ్చదనం పోయి నేల మీద అన్ని చోట్లా బొడిపెలు మొలిచినట్లున్న చిన్న గుండ్రటి ముళ్ల జెముడు మొక్కలు దర్శన మిచ్చాయి. ఇక ఎంత దూరమెళ్లినా ఇదే దృశ్యం. ఎడారి కదా అంతా ఇసుకతో కప్పబడి ఉంటుందనుకున్నాను. ఎడారి ఇలా ఉంటుందని మొదటి సారి చూసేను. దారికి ఒక పక్కగా ఎత్తైన పర్వత శ్రేణులు వాటి కొసల మీద తెల్లగా మంచు చారికలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చాలా చాలా ఎత్తైన పర్వతాలు. ఎక్కడో ఫోటోలలో, వీడియోలలో, సినిమాలలో చూసినా,  స్వయంగా కళ్లతో చూసిన అనుభూతి వేరేగా ఉంటుంది.

అంత ఎత్తైన పర్వతాల్ని చూడడం కూడా మొదటి సారి మాకు. ఎక్కడా మచ్చుకు ఒక మొక్క కూడా లేని పర్వతాలు. ఎరుపు రంగులో ఆకాశపు నీలపు తెర మీద అందమైన  చిత్రమై వేళ్లాడుతున్నాయి. ఒకోసారి ఎదురుగా పర్వతాలు మధ్య సన్నని రహదారి ఇటూ అటూ కనుచూపు మేరలో ముళ్ల పొదలు. వృక్షం అనేది లేని ఆ చోట రోడ్డు మీద వేగంగా వెళ్తూంటే గాలికి పడవలా ఊగుతూంది మా  కారు.

లాంగ్ డ్రెవ్ ల లో మా రూల్ ప్రకారం మేమిద్దరం ప్రతీ వంద మైళ్లకోసారి డ్రైవింగు మార్చుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎక్కడా మధ్యలో ఊరు గానీ, మనుష్య సంచారం గానీ లేదు. నా ఆలోచనకు నాకే నవ్వు వచ్చింది. ఇక్కడ బాగా సారవంతమైన ప్రదేశాలలోనే మనుషులు అధికంగా ఉండరు, ఇక ఎడారిలో ఎందుకుంటారు?

భోజనాలు:

ఒక చోట దారి మలుపు తిరిగి  సరిగ్గా వెళ్తున్న దారికి అడ్డుగా ఉన్న మరో రోడ్డు లోకి ప్రవేశించింది. మలుపుకు ముందే దూరం నుంచి ఏదో ఊరు లా కనబడితే సంతోష పడ్డాం. హమ్మయ్య ఎడారి మధ్యలో ఒక ఊరు ఉంది. కనీసం తినడానికేమైనా దొరుకుతుందని. కానీ దగ్గరకు వెళ్లే కొలదీ కనిపిస్తున్న  పాత తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, చెక్కలు వేళ్లాడుతూ మనుషులు ఎన్నో రోజులుగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయినట్లున్న కొన్ని షెడ్ల వంటివేవో కనిపించాయి.   మాకు ఉన్న ఆశ కాస్తా పోయింది. ఇక మలుపు దగ్గర మరో మైలు ముందుకు వెళితే ఏదో రెస్టారెంట్ వుందని బోర్డు ఉంది. అప్పటికి మధ్యాహ్నం పన్నెండున్నర కావస్తోంది. అందరికీ ఆకలి వేస్తూంది. మేం పక్కకు తిరిగి వెళ్లిపోవలిసి ఉంది. మైలు ముందుకెళ్లి అక్కడసలు హోటలు ఉందో లేదో చూసొద్దామా? వెళ్లిపోదామా అని ఆగి కాస్సేపు తర్జనభర్జన పడ్డాం.  మైలే కదా ముందుకెళ్లి చూస్తే పోయేదేముంది? మళ్లీ ఇటువంటి బోర్డు మరో వంద మైళ్ల వరకూ కనిపించొచ్చు, కనిపించక పోవచ్చు. మొత్తానికి రెస్టారెంటు సంగతి చూసొద్దామని వెళ్లాం.  బయట పది వరకు ఆగి ఉన్న కార్లను చూసి ధీమా వచ్చింది మాకు. లోపలికి అడుగు పెట్టే సరికి హోటలు  నిండా కిట కిట లాడుతూ జనం.

రెస్టారెంటు గోడలకు, రూఫ్ మీదా ఎక్కడ చూసినా రక రకాల జంతువుల,  పక్షుల ఆకారాలు దర్శన మిచ్చాయి. అందులో కాలిఫోర్నియా రాష్ట్ర జంతువు గ్రిజిలీ బేర్, పొడుగాటి ముక్కుతో పెలికాన్ పక్షి లాంటివి పిల్లలను ఆకట్టుకున్నాయి.

ఆ రోజు శనివారం కావడం తో మెనూ లోనించి కేవలం వెజిటేరియన్ ఆర్డరు చేసాం.  ఇక్కడ వెజిటేరియన్ అంటే పచ్చి ఆకులు, అలములు,  ఉడకబెట్టిన బీన్సు, మొక్కజొన్నలు, బంగాళా దుంపలు, పిల్లలకైతే చీజ్ తో కాల్చిన బ్రెడ్డు.  అయినా అందరం విజృంభించి ఆదరా బాదరా అన్నీ ఖాళీ చేసాం.  ఉప్పు, మిరియాల పొడి, కారపు రేణువులు ఏవీ జల్లుకోకుండానే.  బిల్లు మాత్రం భారీ గానే వచ్చింది. అయినా ఎడారి లో ఈ మాత్రపు తిండి దొరికింది. అంతే చాలు ననుకున్నాం. భోజనాలు అయ్యేసరికి పిల్లలకి హుషారు వచ్చింది.  కారు లో జోరుగా పాటలు అందుకున్నారు. ఒకళ్ళు మెయిన్ సింగర్, మరొకళ్లు కోరస్, మరొకళ్లు పక్క వాయిద్యాలు.  నవ్వులూ, అల్లరీ మధ్య బయట కనిపిస్తున్న డ్రై నెస్ ని మర్చిపోయాం.

        మరి వందమైళ్ల తర్వాత ఒక రెస్ట్ ఏరియా వచ్చింది. కాస్సేపు ఆగి చక్కగా ఆడుకున్నాం. చుట్టూ పర్వతాలు కనిపిస్తున్నాయి. వాటిని ఒరుసుకుంటూ గాలి తెరలుగా పైకి లేస్తూంది. చుట్టూ నేల ఎర్ర మట్టి రంగు లో ఉంది. పిల్లలు మట్టి లో దుమ్ము లేపుకుంటూ, తరుముకునే ఆట మొదలు పెట్టారు. ఆకాశం ప్రకాశ వంతమైన సూర్య కాంతి తో మెరుస్తూంది.  మబ్బులు మచ్చుకైనా లేవు. చుట్టూ నిండు ఎడారి లో ఉన్నా గొప్ప వేడిగా అయితే ఏమీ లేదు ఎందుకో.  కాస్సేపట్లో బయలుదేరాం.  నిడుపైన రహదారి పర్వతాల్ని తరుముతూ.

 ప్రచండమైన గాలి: సరిగ్గా అరగంట లో ఉన్నట్టుండి ప్రచండమైన గాలి మొదలైంది. మా కారు బాగా కదలడం మొదలు పెట్టింది. మేం వేగంగా వెళ్తూన్న మూలాన  అని అనుకున్నాం. కానీ ఎక్కడా ఆగడానికి వీల్లేదు. చుట్టూ కనుచూపుమేర ఏమీ లేదు. కొంచెం వేగం తగ్గించి ముందుకు సాగాం. అయినా అదే పరిస్థితి. మేం పైన కట్టిన బాగేజ్ ఉందో పోయిందో అనిపించింది.

మొత్తానికి డెత్ వాలీ ట్రావెల్ ఇన్ ఫర్మేషన్  సెంటర్  అని బోర్డు కనబడ్డ  చోటికి వచ్చేం.  కారు ఆపి డోరు తీసేసరికి బయట గాలికి కారు డోరు చేతిలోనుంచి విసురుగా వెనక్కి పోయింది.  అంత గాలిని నేను పుట్టాక ఇంత వరకు చూడలేదు.  అక్కడి నుంచి రెండడుగుల్లో ఉన్న బాత్రూముకు వెళ్లాలంటే కూడా కష్టమ్మీద ఒకళ్లనొకళ్లం పట్టుకుని వెళ్లాం.  ఇక రైలు వాగన్ లాగా ఉన్న ఆ రెస్ట్ రూముల డోరు ఎంతకూ తెరుచుకోదు, తెరుచుకుంటే మూసుకోదు. వెనక్కి వెళ్లిన తలుపు  మూయలేనంత గాలి. బాగా బరువైన ఇనుప తలుపులవి. పరిశీలించి చూస్తే అక్కడ ఉన్నవన్నీ ఇనుప కట్టడాలే. అవును మరి ఈ గాలికి చెక్కలైతే ఎక్కడి వక్కడ ఎగిరి పోతాయి.

అక్కడి గాలిని గురించి ఏదో టీవీ కి  లైవ్ రిపోర్టు చేస్తున్నట్లు పిల్లలు, నేను కలిసి ఒక  వీడీయో తీసాం.  సత్య వెళ్లి information కనుక్కుని వచ్చే వరకు పక్కని ఏముందో తెలీని దుమ్ము, గాలి,  చలి లో పిల్లలు కారు చుట్టూ తిరుగుతూ ఆడుతూనే ఉన్నారు.  కారు లో కూర్చుంటే అమాంతం కారు లేచి వెళ్తూందేమోనని అనిపించింది. పాపాయి ప్రశాంతంగా నిద్ర పోతూంది కాబట్టి సరిపోయింది. లేక పోతే బాగా ఏడుపు పెట్టేది. ఇక్కడ ఎప్పుడూ ఇలాగే ఉంటుందో మే నెలలో ఇలా ఉందో తెలీదు.

ఈ భూమి ఎంత విచిత్రమైంది! చిన్నతనం నుంచీ  ఎక్కడా ఎప్పుడూ చూడనివి ఇంకా ఎన్నో ఇలా ఎన్నో ప్రదేశాల్లో  ఉన్నాయన్న మాట అనిపించింది.  అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో విసురు గాలులు విలయంగా కూడా మారతాయని విన్నాం. ప్రకృతి బలాన్ని గురించి వినడమే గానీ ఇలా  కళ్లారా  చూసింది లేదు.   ఇంతకీ  ఈ గాలికింత బలం ఎలా వచ్చిందిక్కడ? అది వాన పడే ముందు విసురుగాలి కాదు. జోరుగాలి, హోరుగాలి …ఏ పేరుతో పిలవాలి?  మేం అక్కడ ఉన్న అరగంట సేపట్లో కొంచెం కూడా తగ్గలేదు సరికదా ఇక దారి పొడవునా ఇదే పరిస్థితి.   ఎక్కడ ఆగాలో కూడా తెలీదు.  ముందుకే వెళ్లాల్సిందే. రాత్రికి అక్కడికి మరో రెండు వందల మైళ్ల లో ఉన్న మా బసకు  చేరుకునే వరకూ.

ఇసుక మైదానం:

మరో ఇరవై మైళ్లలో పూర్తి ఎడారి లోకి ప్రవేశిస్తామనగా ఒక చెక్ పోస్టు కనిపించింది.అప్పటికి కాస్త గాలి శాంతించింది. మరలా ఎండ మెరుస్తూ ముందుకొచ్చింది.   అక్కడ 20 డాలర్లు  టోల్ చెల్లించి ముందుకు వెళ్లాలి.  అంతా ఎడారేగా మళ్లీ ఈ రుసుమెందుకో అనుకున్నాం.  అయితే అది ప్రత్యేకంగా అక్కడ ఉన్న ఇసుక ఎడారి ప్రాంతాన్ని, అక్కడ నుంచి కనబడే డెత్ వాలీ సిసలైన స్వరూపాన్ని  రక్షించేందుకని తర్వాత అర్థమైంది.  మరో అరగంట లో సముద్ర తీరమ్మీది ఇసుకలా రోడ్డు పక్కన కనబడింది.   అక్కడ ఉన్న చిన్న పార్కింగు, ఆగి ముందుకు నడవ వచ్చుననే బోర్డు చూసి సంతోషంగా కారులోంచి బయటకు దుమికేం.  సరిగ్గా పది అడుగులు వేసామో లేదో ఇసుక బాగా వేడిగా చుర్రుమని కాళ్ల కింద కాలడం మొదలు పెట్టింది.  అప్పుడు గుర్తుకొచ్చింది. అక్కడ ఉత్తర అమెరికా లోనే అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుందని. కానీ విసురు గాలి వల్ల,  చిన్నప్పటి నుంచీ  మన దేశం లో వేడి  వాతావరణం అలవాటు వల్ల బయట నిలబడితే  అదేమంత పెద్ద ఎండ గా అనిపించలేదు.  అయితే వట్టి కాళ్లతో ఆ ఇసుకలో నడవడం కష్టం. ముందుకు చెప్పుల్లేకుండా పరుగెత్తిన మేం  మరలా పరుగెత్తుకొచ్చి చెప్పులేసుకున్నాం.  అడుగు పడ్డ చోట  అడుగు లోతు కూరుకు పోయే మెత్తని ఇసుక. పిల్లల సంతోషం చెప్పనలవి కాదు.  ప్రకృతి  వైవిధ్యం పెద్ద వాళ్లనే మురిపిస్తూంటే పిల్లల సంగతి చెప్పాలా? అయితే ఇసుకలో కూర్చుని ఆడుకునే పరిస్థితి లేనందు వల్ల పాపం ఎక్కడా కూర్చో లేదు.

సరిగ్గా వంద అడుగులు వేసేసరికి దూరంగా కనిపించే పర్వతం సాక్షిగా అలలు అలలు గా పర్చుకున్న పెద్ద ఇసుక మైదానం.  మధ్యలో కెరటాల  మీద మొలిచిన పడవల్లా అక్కడక్కడా ముళ్ళ పొదలు.  ఉండుండీ అలల మీద ఇసుక ని  తన విశాల హస్తాలతో అవలీల గా మోసుకెళున్న గాలి.  అంత వరకూ కబుర్లు చెప్తున్న అందరం మాటలు మరిచి ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉండి పోయాం.  అక్కడి నుంచి అడుగు ముందుకు వేస్తే ఆ అందమైన ఇసుక స్వరూపం చెదిరి పోతుందనిపించింది. చక్కగా రోజుల తరబడి పేర్చి నట్లున్న ఇసుక దొంతరలు.  వాటిపై పద్ధతిగా  గీసిన గాలి చిత్ర పటాలు.  పైన దేదీప్యమామైన ఆకాశం.  దూరంగా మౌన సాక్ష్యంగా గంభీరమైన ఎరుపు రంగు కొండలు. నిన్నా మొన్నటి వరకు ఇక్కడ ఉన్న సముద్రం అమాంతం గాలికి, వేడికి ఆవిరై ఇసుకై మిగిలినట్లుంది.

అక్కడ మొదటి సారి ఇండియా లో ఉన్నట్లు బాగా వేడి అనిపించింది. అయినా కదిలి రావాలనిపించలేదు.

ఎప్పుడూ గల గలా మాట్లాడే నేను మౌనం గా ఉన్నానంటే ఏదో అనుభూతి లో కూరుకు పోయానని పిల్లలు అర్థం చేసుకుంటారు.  తిరిగి వస్తూ నిశ్శబ్దంగా, నా చేతులు పట్టుకుని, నా నడుం  చుట్టూ అల్లుకుని నడిచారు వాళ్లు కూడా.  నా లోంచి ప్రవహిస్తున్న ఏదో తెలీని ఆనందానుభూతి తమకూ అందుతున్నట్లు.    కార్లోకి ఎక్కిన తరవాత కూడా మరలా ఒకసారి వెళ్లి రావాలని అనిపించింది. ఇన్ని వందల మైళ్లు ప్రయాణించిన బడలిక తీరి మనస్సు తేలికైన గొప్ప అనుభూతి. కళ్లు మూసుకున్నా,  తెరిచినా చెక్కు చెదరని అదే దృశ్యం నన్ను మరలా ఇన్ని రోజులూ వెంటాడుతూనే  ఉంది.

 మేం చీకటి పడే వేళకి ఆ ఎడారి దాటి ముందుకు వెళ్లాల్సి ఉన్నందున,  ఇంకా ముందు చూడవలసినవి ఉన్నందున బయలుదేరాం.

ఫర్నెస్ క్రీక్:

అక్కడి నుంచి మలుపుల సన్నని రహదారిలో మరలా ముందుకు సాగాం. ఫర్నెస్ క్రీక్ ప్రాంతానికి సాయంత్రం నాలుగయిదు  గంటల సమయానికి చేరుకున్నాం.  దారికి పక్కనే ఆ చుట్టు పక్కల ఉన్న గ్రాండ్ రిసార్ట్ కనిపించింది. ఒక రోజుకి ఒక కుటుంబం అక్కడ ఉండాలంటే కనీసం అయిదు వందల డాలర్లు చెల్లించాల్సిన ఖరీదైన రిసార్టది. మేం అక్కడ ఆగే ప్లాన్ ముందే పెట్టుకోలేదు కాబట్టి డ్రైవ్ థ్రూ లో చూసి సంతోషించాం.    ఎడారి మధ్య ఒక పెద్ద రాజ భవనం  కట్టినట్లు చుట్టూ పాం చెట్ల తో సహా నాగరికత భవనమై మొలిచిన గొప్ప దర్పంగా, విలాసం గా ఉందా హోటల్.  చుట్టూ ఉన్న పర్వతాల నిరాడాంబరతను గేలి చేస్తూ.

దగ్గర్లో ఎయిర్ పోర్టు కూడా ఉంది. ఆ ప్రాంతం లో రెండు మూడు రోజులు ఉండాలనుకునే వారు ఇంత కష్టమైన కారు ప్రయాణం చెయ్యకుండా ఖరీదెక్కువైనా ఫ్లై చెయ్యడం మంచిది.

బాడ్ వాటర్స్:  ముఖ్య రహదారి నుంచి కొంచెం లోపలికి వెళితే వచ్చే బాడ్ వాటర్స్ అనే  ప్రాంతాన్ని చూడడానికి మలుపు తీసుకున్నాం.  రోడ్డుకు ఒక పక్కగా ఎర్రని పర్వతాలు, మరో  పక్కన తెల్లని ఉప్పు మడి పరిచి నట్లున్న బాడ్ వాటర్స్ (సరస్సు అనొచ్చేమో).

అది సముద్ర మట్టానికి 282 అడుగుల దిగువన ఉండి,  ఉత్తర అమెరికాలోనే లోతైన ప్రాంతం.   అక్కడ ఎదురుగా కొండ మీద తలెత్తి చూస్తే ఎక్కడో పైన సముద్ర మట్టం గీత గీసి ఉంటుంది. ఎప్పుడో  నీరు ఆవిరి అయిపోగా మిగిలి పోయిన ఉప్పు కణికెల సరస్సు అది. చుట్టూ పర్వత ప్రాంతాలలో ఏదో నామ మాత్రంగా ఎప్పుడో కురిసే వర్షాలు ఇక్కడికే ప్రవహించినా మిగతా రోజులలో ఆవిరై పోగా ఇలా ఎప్పటికీ ఉప్పు మాత్రమే మిగులుతూ ఉందట ఇక్కడ. సరస్సు అంటే చిన్నదేం కాదు అటు అంచెక్కడో ఆకాశం లో ఉన్నట్లు, కనుచూపు మేర తెల్లగా కనిపిస్తూ ఉంటుంది.  కార్లు ఆపేందుకు ఉన్న చిన్న పార్కింగులో నుంచి సరస్సు లోనికి నడిచి వెళ్లేందుకు ముందుకు పరిచినట్లున్న చెక్క దారి వెంట ముందుకెళ్దామని కారు లో నుంచి బయటకు అడుగు పెట్టి కిందకు దిగామో లేదో మరలా ప్రచండమైన గాలి విసురుగా  తోసింది.

ఇక బాడ్ వాటర్ సరస్సు కు ఆరంభంలో ఉన్న చెక్క వంతెనకు మీద అడుగు పెట్టగానే కళ్లద్దాలు ఎక్కడివక్కడ ఎగిరి పోయాయి. మావి చప్పున పరుగెత్తి తీసుకున్నాం. వరు సర్దాకి తగిలించుకున్న ప్లాస్టిక్ కళ్లద్దాలు కర్ర వంతెన మీంచి  దూరం గా సరస్సు లోకి ఎగిరిపోయాయి.  ఇక ఆ పిల్ల ఏడుపు చూడాలి. మేం చెరో రెక్కా పట్టుకుని ముందుకు నడిపింఛేం. కొంచెం ముందుకు వెళ్లేంత వరకు ఉన్న మధ్య బాట తర్వాత అసలు సరస్సు ప్రారంభమవుతుంది. లోపలికి వెళ్లే కొలదీ అక్కడక్కడా నీళ్ల తో కొద్దిగా తడిగా ఉంది.  కానీ ముందంతా గట్టి పడ్డ ఉప్పు మీంచి నడిచాం కొంత మేర. అక్కడి నుంచి  ఉప్పు ముద్దలు విసురుకుని,  ఆడుకునీ, వచ్చేటప్పుడు పది నిమిషాలు కష్ట పడి   చేత్తో ఉప్పు ముద్ద చేసి తెచ్చుకున్నాం సావనీర్ గా.   విసురుగా వీస్తున్న గాలికి ఉప్పు మీద ప్రతిఫలిస్తున్న  సూర్య కిరణాలు చెదిరి పోయి రకరకాల స్వరూపాలుగా ఎటో గాలిలో ఎగిరిపోతున్నాయి.  ఒక పక్కగా పెద్ద పర్వతాల వరుస అడ్డుగా నిల్చున్నా ఈ గాలి ఎక్కడి నుంచి వస్తూందో అర్థం కాలేదు.

మేం తిరిగి వస్తుండగా ఒక్క సారిగా గాలి పక్కకు తోపు తోసింది.   నేను తూలి పడబోయాను.  సత్య అయితే ఆ గాలికి ఎదురు నిలబడి కొంత మేర కావాలని గాలితో వెనక్కి  వెళ్లి, మరలా ముందుకు వచ్చి నిలబడడం చేస్తున్నాడు. సముద్రం లో అలలు వచ్చినపుడు కాస్త పైకి ఎగిరి నిలదొక్కుకున్నట్లు. ఇక కోమల్, వరుల సంగతి చెప్పనవసరం లేదు. వాళ్లు గాలిలో పిల్లి మొగ్గలు వెయ్యడం ప్రారంభించారు.  నాకు భయం పట్టుకుంది. ఆ పిల్ల గాలికి ఎక్కడ ఎగిరి పోతుందోనని.  రెక్కలు గట్టిగా పట్టుకోమని అరిచాను.  అయినా పది అడుగుల్లో కూడా ఒకళ్ల మాట ఒకళ్లకి వినిపించడం లేదు.  అక్కడికి తొలి సారిగా గోల్డ్ రష్ సమయంలో తూర్పు నించి వచ్చిన  వాళ్లు ఎంతో ప్రయాసతో ఈ ఎడారిని దాటుతూ ఇక్కడ నీళ్లు   కనబడగానే సంతోషంతో పరుగెత్తుకొచ్చారట.  తీరా ఇక్కడ ఉప్పు కణికెల ఊట కనబడేసరికి “బాడ్ వాటర్స్”  అని తిట్టుకున్నారట.   ఆ పేరే ఈ ప్రదేశానికి స్థిరపడింది.

తిరిగి వచ్చే బ్రిడ్జి దిగేటప్పుడు  నిషిద్ధమైన ప్రాంతం మధ్య కు దిగి నేను అక్కడ ఉప్పు కణికెల మధ్య చిక్కుకున్న వరు కళ్లద్దాలని తెచ్చి ఇచ్చేంత వరకు ఆ పిల్ల మొహం సంతోషంతో వెలగ లేదు.  కానీ అది ఒక విధంగా  సాహసమే. అలా దిగినప్పుడు  ఊబి ప్రాంతాలుంటేనో.  కానీ ఉప్పు కణికెల  పెళుసుదనానికి గట్టి పెళ్లలుగా మారింది నేల.  అడుగు దిగబడడం కాదు కదా అడుగు ముందుకు పడని జారుడు కూడా లేదు.  నేనలా దిగి వెళ్తూంటే పిల్లలు “అమ్మా! అమ్మా !! వద్దు ” అని భయంగా అరిచారు. అయితే అవి చూసుకుని వరు ముఖంలో కనబడ్డ సంతోషం కోసం ఏదైనా చెయ్యొచ్చనిపించింది.

కార్లలో తిరగగలిగినది కాకుండా సైకిళ్ల పైన,  నడిచి తిరుగుతూ , ట్రెక్కింగుల ద్వారా  ఇంకా దగ్గరగా ఎడారిని  బాగా చూడొచ్చు.  కానీ చిన్న పిల్లలతో అవన్నీ సాధ్యం కావని మేం కేవలం  ఆ ఎడారి లో ఒక రోజు మాత్రమే గడిపాం.  కఠినమైన ఎండ, ప్రచండమైన గాలులు, ఎక్కడా నీటి చుక్క జాడ లేని వట్టి రాళ్లు రప్పలు, ఇసుక ఎడారి – మొత్తం మరణ ప్రాయం కాబట్టి దీనికి  డెత్ వాలీ అని పేరు వచ్చిందేమో- అంత ఎత్తైన పర్వతాల్ని, వైవిధ్యమైన వాతావరణాన్ని, ఇసుక మేటల్ని, ఉప్పు సరస్సుని చూడడానికి ఒక్క సారైనా వెళ్లి రావాలి.    మేం ఈ ప్రయాణం లో ఇంకా అక్కడి నుంచి మరో రెండు వందల మైళ్ల దూరం లో ఉన్న లాస్ వేగాస్ ను కూడా చూడాలనుకున్నాం కాబట్టి అటుగా దారి తీసాం.  మరలా నిడుపైన ఎడారి గుండా- ఆకాశం భూమీ వేరు వేరు రంగుల్లో కనబడే రహదారి వెంబడి.*

– డా. కె. గీత 

1h

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో