సుజాత,కాకినాడ
డాక్టర్ గారు, నాకు కొత్తగా పెళ్లి అయింది. పిల్లలను కనటానికి ఎంత గేప్ అవసరం? ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
* మాతృత్వం ఒక అపురూపమైన అనుభూతి, ఒక మహత్తరమైన భావనకు ఆలంబన, ఒక పవిత్రమైన బాధ్యత, ఒక ఉత్తేజపూరితమైన జీవితథ.
స్త్రీ యొక్క మహాద్భుత సృజన శక్తికి, సంరక్షణా సామర్ధ్యానికి ప్రతీక గర్భం. మానవజాతి కొనసాగింపుకు, స్త్రీల సంపూర్ణ సమర్పణకు సంకేతం గర్భం.
అన్ని సమాజాలలోనూ జనుల జీవితాలకు, కలలకు, ఆశలకు, ఆకాంక్షలకు, ఆరోగ్యానికి కేంద్రం కుటుంబం. ఈ కుటుంబానికి ఆధారం, సంరక్షకురాలు స్త్రీ. కాని, ప్రపంచవ్యాప్తంగా రోజుకు 1600 మంది స్త్రీలు గర్భం, ప్రసవం కారణంగా చనిపోతున్నారు. ప్రకృతి సహజమైన ఈ థల్ని నిరపాయకరంగా దాటి జీవించే హక్కు ప్రతి స్త్రీకి ఉంది. అయినప్పటికి అభివృద్ధి చెందుతున్న దేశాలలోని అనేకమంది స్త్రీలకు ఈ హక్కు నిరాకరింపబడుతూంది. తన కుటుంబాన్ని, తెగను, జాతిని కొనసాగించే సామాజిక బాధ్యతను స్త్రీలు నిర్వర్తించే క్రమంలో సంభవిస్తున్న ఈ మరణాలలో 80 శాతానికి పైగా నివారించగలిగినవే అవడం అసలైన విషాదం.
అనేక ప్రమాదాలు, అనారోగ్యాలు, దు:ఖాలతో ముడిపడి వున్న కారణంగా గర్భం ఆనందాలతోపాటు అనేక సంశయాలనూ, సందిగ్ధాలనూ, భయాలనూ, కలవరాలనూ కలిగిస్తుంది. అవగాహన ద్వారా, పరిజ్ఞానం ద్వారా, సక్రమ ఆచరణ ద్వారా, సముచిత సేవలద్వారా ఈ విషాదాలను నివారించగలం.
గర్భం, ప్రసవం గురించి ప్రామాణిక సమాచారం :
బిడ్డను కనడం జీవశాస్త్రరీత్యా ఒక సహజమైన అంశమే అయినప్పటికి గర్భవతిగా వున్నప్పుడు, ప్రసవ సమయంలోనూ శరీరంలో జరిగే అనేక మార్పుల వలన గర్భిణీస్త్రీల ఆరోగ్యానికి, అనారోగ్యానికి మధ్య తేడా అంత ఎక్కువగా ఉండదు. పేదరికం, అవగాహనలేమి, ఆరోగ్యసేవల కొరత కారణంగా మనదేశంలో ప్రతిఏటా 1,50,000 మంది తల్లులు చనిపోతున్నారు. 2010 నాటికి అంతరిక్షంలోకి అడుగుపెట్టడానికి లక్ష్యిస్తున్న దేశంలో, 8 శాతం ఆర్ధిక అభివృద్ధిని సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న దేశంలో, ప్రతినిత్యం 450 మంది స్త్రీలు నివారించగలిగిన కారణాలతో చనిపోవడం ఆమోదించకూడని విషయం.
గర్భాన్ని ప్లాన్ చేసుకోవడం :
ప్రతి ఒకగర్భం కోరుకున్నది అయివుండాలి. యధాలాపంగా, ప్లాన్ లేకుండా వచ్చినది, వద్దనుకుంటున్నప్పుడు వచ్చినది అయి వుండగూడదు.
గర్భాన్ని ప్లాన్ చేసుకుని, సన్నద్ధంగా వుండడం తల్లి, బిడ్డలిరువురుకి మంచి ప్రారంభాన్నిస్తుంది. గర్భం వచ్చే అవకాశాన్ని మెరుగుపరచడమే కాక గర్భంలో బిడ్డ సవ్యంగా పెరగడానికి అనువైన పరిస్థితిని సృష్టించుకోవచ్చు. తల్లి జీవనశైలి పుట్టబోయే బిడ్డ ఇంకా ప్రాణం పోసుకోకముందే దాని ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. గర్భంలో వుండే శిశువు తన పోషణకు, భద్రతకు పూర్తిగా తల్లిమీదే ఆధారపడడంవల్ల గర్భం రాకముందు తల్లి జీవనశైలి, ఉదాహరణకు స్మోకింగ్ చెయ్యడం, పొగాకు నమలడం మొదలైనవి శిశువు ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపవచ్చు. అలాగే మద్యం, మత్తుమందుల దురలవాట్లను కూడా తల్లి గర్భం రాకముందే మానుకోవాలి. అదేవిధంగా కొన్ని ఆహారాల్ని కూడా గర్భిణిలు తినకూడదు.
స్త్రీ గర్భాన్ని కోరుకుంటున్నప్పుడు, తనగర్భంలో బిడ్డ ఆరోగ్యంగా పెరగాలంటే తను శారీరకంగా ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా, భావోద్వేగపరంగా సమస్థితిలో వుండాలని గ్రహించి దానికనుగుణంగా తననుతాను సన్నద్ధం చేసుకోవాలి. గర్భం, ప్రసవం, బిడ్డ సంరక్షణ గురించి, గర్భం సమయంలోనూ, ప్రసవం తరువాత తన శరీరంలోనూ, తన జీవనశైలిలోనూ, తన ప్రాధాన్యాలలోనూ చోటుచేసుకునే మరియు చోటుచేసుకోవలసిన మార్పుల గురించి ఆమె తెలుసుకుని వుండాలి. గర్భం రాకముందు, గర్భం వచ్చేక, ప్రసవ సమయంలో, ప్రసవం తరువాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడంద్వారా ఈ థలో తన జీవనయాత్రను ఏ ఒడిదుడుకులూ లేకుండా కొనసాగించగలుగుతుంది.
గర్భధారణకు ముందు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు :
1. గర్భధారణకు సంసిద్ధత : స్త్రీ, ఆమె భర్త ఇద్దరూ కావాలని కోరుకున్నప్పుడు, పుట్టబోయే బిడ్డను హృదయపూర్వకంగా, ఆనందంగా స్వాగతించగలిగినప్పుడే గర్భధారణ జరగాలి. భార్యా భర్తల మధ్య సంఘర్షణలు లేని, అనురాగపూరితమైన అనుబంధం వుండాలి. ఇతర కుటుంబ సభ్యుల ఆసరా, సహాయం వుండాలి.
2. ఆర్ధిక అంశాలు : గర్భం సమయంలో మంచి పోషకాహారాన్ని తినడానికి, వైద్య సలహాను పొందడానికి, అవసరమైన మందుల్ని కొనడానికి, వైద్య సలహాను పొందడానికి చేసే ప్రయాణపు ఖర్చులకు, ప్రసవ సమయంలో వైద్యానికి అయే ఖర్చులకు, ప్రసవం తరువాత తల్లి తగినంత పోషకాహారాన్ని తినడానికి, ఒకవేళ తల్లిపాలు సరిపడాలేని పరిస్థితిలో పోతపాలను కొనడానికి, బిడ్డకు జబ్బుచేస్తే వైద్యం చేయించడానికి, ఒకవేళ తల్లి బయట ఉద్యోగం లేక పనిచేస్తున్నట్లయితే, కుటుంబ సభ్యుల ఆసరా లేని కుటుంబాలలో బిడ్డను కనిపెట్టుకుని వుండే మనిషికి చెల్లించే వేతనానికి తగిన ఆర్ధిక వనరుల ఏర్పాటు వుండాలి. అవసరమైతే భార్యాభర్తలలో ఎవరో ఒకరు తమ ఉద్యోగానికి తాత్కాలికంగా సెలవుపెట్టి బిడ్డను సాకడానికి కూడా సంసిద్ధత, వెసులుబాటు వుండాలి.
3. భావోద్వేగ పరమైన సంసిద్ధత : బిడ్డ కొంచెం ఎదిగేవరకు తల్లితండ్రులు బిడ్డతో వీలయినంత ఎక్కువసేపు గడిపేందుకు, బిడ్డ సంరక్షణ తాలూకు ఒత్తిడిని, అలసటను అధిగమించేందుకు సన్నద్ధం కావాలి. గర్భంపట్ల, శిశువు సంరక్షణపట్ల సానుకూల దృక్పధంతో గర్భాన్ని కోరుకోవాలి. బిడ్డ సంరక్షణ కారణంగా తమ మధ్య బాంధవ్యంపై పడగల ఒత్తిడిని, తమ సాన్నిహిత్యానికి కలగగల అడ్డంకుల్ని పరిగణనలోకి తీసుకుని మరీ సానుకూల దృక్పధాన్ని మలచుకోవాలి. బిడ్డపుట్టగానే భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు వున్న అపార్ధాలూ, అపోహలూ, కలతలూ, సంఘర్షణలూ వాటంతటవే సమసిపోతాయనే భ్రమతో వేచివుండకుండా గర్భం రాకముందే వాటినన్నిటినీ పరిష్కరించుకుని భార్యాభర్తలిద్దరూ హృదయపూర్వకంగా, సంతోషంగా నూతన శిశువును స్వాగతించాలి.
పరిజ్ఞానం అవసరం :
సమాచారం, పరిజ్ఞానం అనేక సమస్యల్ని. బాధల్ని, ప్రమాదాల్ని నివారిస్తాయి. గర్భిణీ స్త్రీ సంరక్షణలో హెల్త్ ఎడ్యుకేషన్ ఒక ప్రధానమైన అంశం. ముఖ్యంగా మొదటిసారి గర్భవతి అయిన స్త్రీకి అనేక విషయాల గురించి పరిజ్ఞానం అవసరమవుతుంది.
-డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~