వివిధ ప్రాంతాలలో సంక్రాంతి -2

(రెండవ భాగం)

బీహార్‌

    బీహార్‌లో ‘హో’ తెగవారు వారి నిత్యజీవిత సుఖదుఃఖాలు ప్రతిబింబించే విధంగా నృత్యాలు చేస్తారు. పంటలు చేతికి అందగానే ఆనందంతో చేసే నృత్యం ‘జోంనామ’ నృత్యం అంటారు. ఇక్కడ సంక్రాంతిని పర్వంగానే భావించి పవిత్ర జలాలలో స్నానమాచరించడం, దానధర్మాలు చేయడం, దేవతలను పూజించడం, పితృదేవతలకు  తర్పణాలివ్వడం లాటివి ఎవరికి వారు ఇళ్ళలో నిర్వర్తించుకుంటారు. సామూహికంగా గాని, వ్యక్తిగతంగా గాని పండుగ జరుపుకునే అలవాటు వీరికి లేదు.
రాజస్థాన్‌
    రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో భిల్లులు సంక్రాంతి పండుగ నాడే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సంక్రాంతినాడు పెళ్ళి చేసుకుంటే నవ వధూవరులకు కష్టాలు నష్టాలు కలుగవని వీరి నమ్మిక. సంక్రాంతి నాడు వివాహం జరిగాక వధూవరులను మొదటిరోజు ఊరేగించి వారికి పసుపు, సున్నిపిండితో నలుగు పెడతారు. రెండవరోజు గ్రామంలోని వీధుల గౌరవార్థం, మూడవరోజు క్షుద్రదేవతాధిపతి మెప్పుకోసం, నాల్గవరోజు దేవతల తృప్తికోసం, ఐదవరోజు మర్రిచెట్టు పూజకోసం, ఆరవరోజు ‘ఎరుమల దేవత’ను కొలిచేందుకు వరుసగా ఆరు రోజుల పాటు వధూవరులను ఊరేగిస్తారు.

గుజరాత్‌
     గుజరాత్‌లో ఈ పండుగ ప్రధానంగా గాలిపటాల పండుగగా నిర్వహింపబడుతోంది. వీరికి ఇది ఒక్కరోజు పండుగ. ఇది సురక్షిత సంపదకు ప్రతీక. భోగి, కనుమ వీరికి తెలియదు. సంక్రాంతికి వీరు బెల్లం, నువ్వులు,  సెనగలు, పప్పులు, మరమరాలతో వేరువేరుగా చిక్కీలు (అచ్చులు) తయారుచేస్తారు. పండుగకు15 రోజుల ముందునుంచే స్త్రీలు వీటిని తయారుచేయడం ప్రారంభిస్తారు. సంక్రాంతినాడు ఇంటి ఆడపడుచు పాదాలకు కుంకుమ రాసి ఆ అడుగులు ఒక గుడ్డపై ముద్రపడేలా చేస్తారు. దానిని ఇంటి గడప ముందుంచి వారిని స్వాగతిస్తారు. అలా చేస్తే లక్ష్మి సుస్థిరంగా అక్కడే ఉంటుందని వీరి విశ్వాసం. ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను, బంధువులను పిలిచి, శ్రీనాథ్‌ భగవాన్‌ను, గోవును పూజిస్తారు. జొన్న పొంగలిని గోమాతకు తినిపిస్తారు. బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి ఆశీస్సులు పొందుతారు. వచ్చిన వారందరికి చిక్కీలు పంచిపెడతారు. పతంగులను పగటిపూట ఎగురవేయడమే కాక రాత్రిపూట వాటికి కొవ్వొత్తులు బిగించి నింగిలో ఎగురవేయడం వీరి ప్రత్యేకత. పెద్దవారు చిన్నవారికి బహుమతులిస్తారు.
    వేద పండితులు తమ శిష్యులకు జ్యోతిషశాస్త్రంలోను, తత్వశాస్త్రంలోను పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ పండుగ వీరికి కుటుంబాల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య సద్భావనను పెంపొందించడానికి సహకరిస్తుంది.

మధ్యప్రదేశ్‌ (మాళవదేశం)
  

  సంక్రాంతికి ముందు రోజున ఇంటిల్లిపాది తలంటు పోసుకుంటారు. అందరూ నూతన వస్త్రాలు ధరిస్తారు.  స్త్రీలు పాత గాజులు తీసివేయించి క్రొత్త  గాజులు వేయించుకుంటారు. సాయంత్రం ఐదు తాంబూలాలు పంచి పెడతారు. ఒక్కొక్క తాంబూలానికి ఏడు తమలపాకులు, ఏడు వక్కలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి వేస్తారు. ఈ ఐదు తాంబూలాలలో మొదటి తాంబూలం భర్తకిచ్చి, మిగిలిన నాలుగు నలుగురు ముత్తైదువులకు ఇస్తారు. ఆనాటి పిండి వంటలలో నువ్వుపప్పు, బెల్లం ప్రధానమైనవి.
    సంక్రాంతినాడు నువ్వుల ముద్ద ఒంటికి రాసుకుని తలంటు పోసుకుంటారు. పుణ్యస్త్రీలు చక్కగా అలంకరించుకొని ఐదు మట్టిముంతలు తీసుకొని ఒక్కొక్క ముంతలో బియ్యము, పప్పు దినుసులు, క్యాబేజి ముక్కలు, చెఱకు ముక్కలు ఉంచుతారు. ముంతమీద మూకుడు మూతవేసి దానిలో బెల్లంపాకంతో తయారుచేసిన నువ్వు వుండలు ఉంచుతారు. ఈ పిడతలు తీసుకొని తమ స్నేహితులు, ఇరుగు పొరుగు ఇండ్లకు వెళ్ళి వారికి ఒక్కొక్క పిడత ఇస్తారు. వారు కూడ తిరిగి వీరికి అలాంటిదే ఒక పిడత ఇస్తారు.
    ఆనాడు బ్రాహ్మణునకు భోజనం పెట్టి, దక్షిణ ఇస్తారు. పిండి వంటలలో నువ్వుల లడ్డు తప్పనిసరిగా                  ఉండాలి. క్రొత్త అల్లుళ్ళని పండుగకు తీసుకొని వస్తారు. సాయంత్రం పేరంటాళ్ళంతా ఒకచోట చేరి చిన్న పిల్లల్ని పీట మీద కూర్చుండబెట్టి వారి తలలమీద నుంచి వేరుసెనగపప్పులు, మిఠాయి వుండలు, రేగుపళ్ళు మొదలైనవి పోస్తారు. వచ్చిన స్త్రీలు వాటిని ఏరుకుని ఇళ్ళకు తీసుకువెళ్తారు. ముత్తైదువులందరికి పసుపు, కుంకుమ, నువ్వుపప్పు పంచిపెడతారు. తెలిసినవారందరికి నువ్వుపప్పు పంచిపెట్టడం ఇంటిలో అందరికీ ప్రధాన కర్తవ్యం. మగవారంతా తమకంటే పెద్దలైన స్త్రీ, పురుషుల వద్దనుండి నువ్వుపప్పు తీసుకొని దానిని తమకన్న చిన్నవారికి ఇస్తారు. భార్య తన భర్తకు ఈరోజు తప్పనిసరిగా నువ్వుపప్పు ఇవ్వాలి. వీరి సంక్రాంతిలో నువ్వులకు ఇంత ప్రాముఖ్యం ఉండడం వల్లనేనేమో వీరు సంక్రాంతిని ‘తిల సంక్రాంతి’ అని అంటారు. సంక్రాంతినాడు స్నానం చేయనివాడు ఏడు జన్మల వరకు రోగిగా, దరిద్రుడుగా పుడతాడని వీరి నమ్మకం. దక్షిణాయనగత పాపం            ఉత్తరాయణ పుణ్యకాలంలో పోగొట్టుకోవాలి. అందుకే ఈనాడు సూర్యుని ఆరాధించి తిలలు, కూష్మాండము, భాండము, ధాన్యం, లోహం, వస్త్రం, తైలదీపదానాలు చేయాలని వీరు విశ్వసిస్తారు.

ఒరిస్సా
   

ఈ రాష్ట్రంలో కూడ దీనిని పంటల పండుగగానే పరిగణిస్తారు. అయితే వీరికి సంక్రాంతి ఒక్కరోజు పండుగ మాత్రమే. సంక్రాంతికి ముందు మార్గశిర మాసంలో పంటకోతకు వచ్చే సమయంలో ప్రతి గురువారం వనితలు ధాన్యలక్ష్మిని పూజిస్తారు. ధాన్యలక్ష్మిని పూజించిన తరువాతే కోతలు కోసి పంటను ఇంటికి తీసుకొని వస్తారు. ఈ పూజ చేసే ప్రదేశాన్ని ముందు గోమయంతో అలికి పైన జేగురుతో అలంకరించి దానిపైన ధాన్యం గంపలనుంచి పూజిస్తారు.
    వీరిది సౌరమానం. వీరి పంచాంగం గజపతిరాజుల పేరు మీద సంక్రమణాన్ని బట్టి రచిస్తారు. సూర్యసంక్రమణాన్ని అనుసరించి వీరికి నెల మారుతుంది. వీరికి నూతన సంవత్సరం ఎప్పుడూ ఆంగ్ల మాసమయిన ఏప్రియల్‌ పదునాలుగవ తేదీన జరుగుతుంది. ఇది మేష సంక్రమణం జరిగే రోజు. వీరు మన చైత్రం, వైశాఖ మొ॥ మాసాలను కూడ పరిగణిస్తారు. వీటిని ఋతుమాసాలు అని అంటారు. సౌరమానాన్ని అనుసరించేవారు గనుక సంక్రాంతికి సూర్యారాధన చేస్తారు. మకర సంక్రమణం జరిగే రోజున వీరు గృహాన్ని శుభ్రపరచి గడపలను ఇంటిని కడుగుతారు. గుమ్మాలను మామిడాకులు, పూలతో తోరణాలు కట్టి గడపలకు పసుపు పూసి, రంగులతో అలంకరిస్తారు. సంక్రమణం నాడు పూజ చేసే స్థలాన్ని ‘మండల’ అని అంటారు. ఈ ప్రదేశాన్ని ‘చాడగోబర్‌’ (ఆవుపేడ)తో అలికి పైన ‘గేరు’ (ఇది ఒక విధమైన రాయిని పొడిచేసి తయారుచేస్తారు. చూడడానికి కుంకుమ లాగ ఉంటుంది) తో అలంకరించి ఆపైన రుబ్బిన వరిపిండితో రెaాటీ (ముగ్గులు) పెడతారు. ఆ ముగ్గుల పైన గోమయంతో చేసిన గొబ్బెమ్మలను వివిధ ఆకృతులలో అమరుస్తారు. పొడవైన పుల్లలను చివరి భాగంలో పూలతో అలంకరించి వాటిని గొబ్బెమ్మలపై గ్రుచ్చి నయనానందకరంగా తయారుచేస్తారు. అనంతరం పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు.
    మకర సంక్రాంతికి వీరు ‘మకొరచావల’ అనే పదార్థాన్ని తయారుచేసి నివేదన చేస్తారు. దీనికి క్రొత్త బియ్యం అప్పుడే ఇంటికి చేరిన పంట నుండి తీసి దానిని నానబెట్టి కొంచెం మొరుంగా రుబ్బుతారు. పాలుకాచి ఆ పాలలో రుబ్బిన బియ్యాన్ని జీడిపప్పు, ఎండుద్రాక్ష, రకరకాల డ్రై ఫ్రూట్స్‌, ఛన (పనీర్‌), కొబ్బరికోరు అన్ని పచ్చివే ఆ వేడిపాలలో వేస్తారు. ఇది ఒక బిధి (విధి). దీనిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని ప్రసాదం లాగ క్రొద్దిక్రొద్దిగా తిని ‘అబ్‌సే హమ్‌ మకొర్‌ రహేంగే’ అని అంటారు. అంటే అంతా స్నేహంగా సోదరభావంతో ఉంటాము అని అర్థం. బంధుమిత్రులను పిల్చి విందులు చేసుకుంటారు. విందులో ఖీర్‌, పీఠా తప్పనిసరిగా ఉండాలి. విందు అనంతరం పాటలు పాడి నృత్యాలు చేసి ఆనందాన్ని పంచుకుంటారు.
    సంక్రాంతినాడు పాఠశాలలకు తప్పనిసరిగా సెలవు ప్రకటిస్తారు. విద్యార్థులంతా చాట్‌సాల (పాఠశాల) అవధాని (ఉపధ్యాయుడు) ఇంటికి వెళ్ళి వరుసగా నిలబడతారు. అవధాని ‘మకొరచావల’ అందరికి పంచి పైన చెప్పిన విధంగా ‘అబ్‌ సే హమ్‌ మకొర్‌ రహెంగే’ అని ప్రతిజ్ఞ చేయిస్తాడు. అప్పటినుండి ఆ రోజంతా పిల్లలు పెద్దలు అంతా ఒకరినొకరు ‘మకొర్‌’ అని పిల్చుకుంటారు. వీరికి మకర సంక్రమణంతో సమాన ప్రతిపత్తి గల ఇంకొక సంక్రాంతి ‘రజ సంక్రాంతి’. ఆ సమయంలో భూమాత రజస్వల అవుతుంది అని వీరి నమ్మకం. అంటే  పంటలు పండడానికి అనువైనదిగా ఉంటుందని భావం. జూన్‌ నెలలో వృషభ సంక్రాంతి ముగిసి మిథున సంక్రాంతి ప్రారంభమయే సమయాన్నే వీరు ‘రజ సంక్రాంతి’గా పరిగణిస్తారు. ఒక్క మకర సంక్రాంతియే కాక సూర్యుని యొక్క పన్నెండు సంక్రాంతులలో ఏ సంక్రాంతి అయినా వీరికి అతి పవిత్రమైనదే. సంక్రాంతి రోజున ఏ పనయినా ముహూర్తంతో నిమిత్తం లేకుండా చేయవచ్చని వీరు భావిస్తారు.
    మకరమేళా సందర్భంగా భువనేశ్వర్‌కి నలుబది కిలోమీటర్ల దూరంలో నున్న ‘అత్రి’ అనే ప్రదేశంలో కూడ మేళా జరుగుతుంది. ఇక్కడ వున్న వేడినీటి బుగ్గలో స్నానమాచరిస్తే సంతానం లేనివారికి పిల్లలు కలుగుతారని విశ్వసిస్తారు.
    ఒరిస్సాలోని ‘బార్‌గఢ్‌’లో ‘ధనుయాత్ర’ అనే పేరుతో జాతర జరుగుతుంది. ఇది ధనుర్మాసం పదవరోజున ప్రారంభమై పదకొండు రోజులపాటు జరుగుతుంది. ఇది కంసవధకు ప్రతీకగా జరిపే వేడుక. జాతర మొదలైన రోజున నిర్దేశింపబడిన వ్యక్తి అచ్చు ద్వాపరయుగం నాటి కంసునిలా వేషధారణచేసి ఏనుగునెక్కి వీధులలో సంచారానికి బయలుదేరుతాడు. ఎక్కడయినా అపరిశుభ్రత కనబడితే తన గజ వాహనాన్ని ఆపి సంబంధిత వ్యక్తిని అధికారపూర్వకంగా గర్జిస్తూ పిలుస్తాడు. ఆ వ్యక్తి ఎంతటివాడైనా చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కంసుని ముందు తలవంచవలసినదే. కంసుడు విధించిన శిక్ష అనుభవించవలసినదే. ఈ శిక్ష సాధారణంగా జరిమానా రూపంలోనే ఉంటుంది. దీనిని బంగారు మొహిరీల లెక్కలో విధిస్తాడు. ఒక బంగారు మొహరీ R ఒక రూపాయి లెక్కన జరిమానా పడ్డవారు రుసుము చెల్లిస్తారు. ఈ పదకొండు రోజులు రాజ్యమంతా కంసుడిదే ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు అంతా ఆయన సేవకులే. కంసుడు తలచుకుంటే కలెక్టర్‌, ఎస్పీ కూడ అతనిముందు హాజరుకాక తప్పదు. పది రోజులు పాలన సాగించిన కంస మహారాజు పదకొండవ రోజున కృష్ణుని చేతిలో హతమయేదాక ఈ జాతర సాగుతుంది. కంసవధా ఘట్టాన్ని అభినయించాక ఈ తంతు ముగుస్తుంది. ఈ పదిరోజులు కంసుని శిక్షకు గురికాకుండా ఉండడానికి మునిసిపాలిటీ సిబ్బంది జాగరూకతతో పనులు నిర్వర్తిస్తారు. ఈ కంస పాత్రకు సాధారణంగా భారీ శరీరం, పెద్ద పెద్ద మీసాలు ఉన్న వ్యక్తులనే ఎంపిక చేసుకుంటారు. గత ఇరువది సంవత్సరాలుగా ఈ కంస పాత్రను ‘గోపాల్‌ సాహూ’ అనే పోలీసు అధికారి పోషిస్తున్నారు. పెద్ద మీసాలు భారీ కాయం రాజోచిత దుస్తులు తలపై కిరీటం చేతిలో గద ధరించి ఏనుగు పైనెక్కి వచ్చే ఈ కంసుని తిలకిస్తే ద్వారపయుగంలోని కంసుడే మనముందు ప్రత్యక్షమయాడా అనే భ్రాంతి కలిగి ప్రజలంతా అణిగిమణిగి అతని ఆజ్ఞానుబద్ధులై వ్యవహరిస్తారు.

మహారాష్ట్ర
   

మహారాష్ట్రలో మకర సంక్రమణాన్ని గురించి ఆసక్తికరమైన ఒక గాథ ప్రచారంలో ఉంది. ఒకానొకప్పుడు ‘మకరాసురుడు’ అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు ప్రజలను అనేక బాధలకు గురిచేసేవాడు. మానవులనే కాక దేవతలను కూడ హింసించడం ప్రారంభించాడు. వాడి బాధలకు తట్టుకోలేక దేవతలంతా మానవులను కూడ వెంటనిడుకొని ఆదిశక్తి వద్దకు వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తమను ఆ రాక్షసుని బారి నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థించారు. దేవి వారి ప్రార్థననాలకించి ‘‘ఓయీ! మీరంతా ఐకమత్యాన్ని వీడి పరస్పరం కొట్లాడుకొంటూ స్నేహభావం విడనాడి ఉన్నారు. అందుచేతనే ఈ రాక్షసబాధ కలిగింది. మీరంతా పరస్పరావగాహనతో స్నేహంగా ఉండి ఒండొరులయందు ప్రేమభావంతో మెలిగితే నేను మిమ్మల్ని ఈ దానవుని బారి నుండి కాపాడుతాను.’’ అంది. దానికి వీరంతా సమ్మతించి తమలో తాము పోట్లాడుకోవడం మాని ప్రేమానురాగాలతో స్నేహభావంతో మెలగడం ప్రారంభించారు. అది చూచి దేవి ప్రసన్నురాలై మకరాసుర సంహారం గావించింది. మకరాసురుని పీడ వదిలిన సంతోషంతో ప్రజలు మకర సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. ఈ పండుగకు ముఖ్యమైనవి తిలలు, బెల్లం, మకరాసురుణ్ణే కొందరు సంకరాసురుడు అని వ్యవహరిస్తారు.
    ముందురోజు జనవరి 13న వీరికి భోగి. ఆ రోజు నీటిలో తిలలు కలిపి ఆ నీటితో స్నానం చేస్తారు. బాజరా రొట్టె, నువ్వులు కలిపి చేసిన వంకాయ, బీన్స్‌ కూరలు, కిచిడీ వండుకుని తింటారు.
    సంక్రమణం రోజున గంగాస్నానం చేస్తారు. ఆరోజు నువ్వులు, బెల్లం కలిపి చేసిన తీపి పదార్థాన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని ‘‘తిల్‌గుడ్‌లో మీఠా బోలో’’ అని అంటారు. అంటే ఈ నువ్వులు, బెల్లం తిని తీయగా మాట్లాడు అని అర్థం. స్త్రీలు మట్టి పిడతలు కొనుక్కుంటారు. వాటిలో చెఱకు ముక్కలు, సెనగలు, రేగుపళ్ళు వేసి బ్రాహ్మణులకిస్తారు. నూతన వధూవరులు తిలలతో తయారుచేసిన ఆభరణాలు ధరిస్తారు. స్త్రీలు పసుపు, కుంకుమ, ఏదయినా వస్తువు ముత్తైదువులకు పంచిపెట్టుకుంటారు. ఈ పండుగ ఐకమత్యతకు చిహ్నం. తమ సంతోషాన్ని పదుగురితో పంచుకోవడం పదిమందితో స్నేహ సౌహార్ద్రాలు నెరపుతో కలిసిమెలసి జీవించడం అనే ప్రయోజనాలు ఈ పండుగ వల్ల సమకూడతాయి.
    మహారాష్ట్రీయులు సంక్రాంతికి హల్వా అనే పదార్థం చేస్తారు. లోపల నువ్వుగింజ పెట్టి దానిచుట్టూ గుండ్రంగా ఉండేలా పంచదారపాకంతో కప్పి చిన్న చిన్న వుండలలాగ తయారుచేస్తారు. ఇవి పూర్వకాలంలో వచ్చే బల్లిగుడ్లు అనే చిన్న చిన్న గుడ్లలాగ ఉంటాయి. పేరు మాత్రం ‘హల్వా’. వీటి లోపల నువ్వుపప్పే కాక మరమరాలు, ఏలకు గింజలు, లవంగాలు, సీమబాదం చీలిక, గసగసాలు, సగ్గుబియ్యం, సెనగపప్పు ` ఇలా చిన్న చిన్న బద్దలలాంటివి పెట్టి చేస్తారు. నూతన వధూవరులు ధరించే తిలాభరణాలు కూడ వీటితోనే తయారుచేస్తారు. ఈ హల్వా పైన చెప్పిన బల్లిగుడ్లలాగే కాకుండా నక్షత్రాల లాగ ఇతర ఆకారాలలో కూడ తయారుచేస్తారు. ఈ హల్వాని చిన్న ఇత్తడి ‘వాటీ’లో వేసి అది, పండు, తాంబూలం, గాజులు అన్ని కలిపి ముత్తైదువులకు ఇచ్చుకుంటారు. ఈ హల్వా అతి బీదవారి నుంచి అతి గొప్పవారి వరకు అన్ని వర్గాలవారు తప్పనిసరిగా చేసుకుంటారు. ఇటీవలి కాలంలో ఇవి బజారులో విరివిగా దొరుకుతున్నాయి.
    సంక్రాంతి రోజున ఒంటికి నువ్వులపిండి రాసుకుని సముద్రస్నానం చేయాలని మహారాష్ట్రుల విశ్వాసం. దీనికిగాను వారు ఒక పురోహితుణ్ణి వెంటబెట్టుకొని సముద్రతీరానికి వెళ్ళి నువ్వులపిండి రాసుకుని మంత్రం చెప్పించుకొని శాస్త్రోక్తంగా సముద్రస్నానం చేస్తారు. బ్రాహ్మణునికి దక్షిణ ఇవ్వడంతో ఆ కార్యక్రమం ముగుస్తుంది. ఇంటికి వచ్చి నువ్వులతో నిండిన కంచుపాత్రలను దక్షిణతో బ్రాహ్మణులకు దానం ఇస్తారు. వీటిని తిలాపాత్రలంటారు. ఒక్కొక్కప్పుడు రాగిపాత్రలు, ఇత్తడి కుందెలు, గొడుగులు మొదలైన ఇతర వస్తువులను కూడ దానం చేస్తారు. బంధుమిత్రులందరిని విందుకు ఆహ్వానిస్తారు. సాయంత్రం క్రొత్త బట్టలు ధరిస్తారు. ఈ విధంగా చేయడం వెనుక అతి పురాతనమైన గాథ ఒకటి ఉంది.
    పూర్వకాలంలో ద్రోణాచార్యులు వారి భార్య jైున కృపి ఒక ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవారు. కృపి గుణవంతురాలు, పరమ పతివ్రత. ఒకనాడు ద్రోణుడు బయటకు వెళ్ళాడు. కృపి ఏకాంతంగా ఆశ్రమంలో ఉన్న సమయంలో దుర్వాసముని సమిధలకై అన్వేషిస్తూ అటు వచ్చాడు. కృపి ఆ మునిని పూజించి, ‘‘స్వామీ! మేము అతి పేదరికంలో మగ్గుతున్నాం. ఈ ప్రపంచంలో మాకు ఒక్క ముదుసలి గోవు తప్ప ఇంకేమి లేదు. సంతానం కూడ లేదు. భాగ్యప్రదమైన వ్రతమేదయినా నాకు ఉపదేశించండి.’’ అని ప్రార్థించింది. ముని ఆమె వేదనని అర్థంచేసుకొని ‘సంక్రాంతి పర్వాన్ని’ జరుపమని ఉపదేశించాడు. ‘‘ఓ కోమలి! ఆ వ్రత విధానం తెలియజేస్తాను విను. సంక్రాంతి నాడు గంగానదిలో స్నానం చేసి బ్రాహ్మణునికి పెరుగు దానం చేయాలి. నందుని భార్య అయిన యశోద ఇలాగే బ్రాహ్మణునికి పెరుగు దానం చేసింది. ఆ దానానికి ఫలితంగానే ఆమెకు కృష్ణపరమాత్మ కుమారుడయ్యాడు. ఆ కొడుకు వారి పేదతనాన్ని బాపి తండ్రిjైున నందుని గొల్లకులానికి రాజును చేశాడు.’’ అని చెప్పి ఆ రోజే మకర సంక్రాంతి అనే సంగతిని కూడ జ్ఞప్తి చేశాడు. దగ్గరవున్న నదికి వెళ్ళి శరీరానికి నువ్వులపిండి రాసుకుని స్నానం చేసి రమ్మని చెప్పగా ఆమె ఆ విధంగా చేసి వచ్చి దుర్వాసమునికి పెరుగు దానం చేసింది. అనంతరం పిండివంటలతో భోజనం పెట్టింది. ముని సంతృప్తుడై ఆమెను దీవించి ఆమె చేసిన వ్రత మహిమ వలన ఆమెకు చక్కని కొడుకు పుడతాడని అతడు తండ్రి యొక్క మూడు విధాలయిన ఋణాలు తీరుస్తాడని చెప్పి వెడలిపోయాడు. కాలక్రమాన కృపి, ద్రోణాచార్యులకు చక్కని పుత్రుడు కలిగాడు. అతడే అశ్వత్థామ. పుత్రోదయం అయినప్పటినుండి వారికి ఏ చీకు చింత లేక హాయిగా కాలం గడిచింది. ఈ వ్రతం ఎంతో మహిమాన్వితమైనదని నమ్మడం వల్ల నేటికీ ముంబాయిలో బాక్‌బే వద్ద సంక్రాంతినాడు వేల సంఖ్యలో ప్రజలీ వ్రతాచరణకై సముద్ర స్నానాలు చేస్తారు. 

-డా.సుబ్బలక్ష్మి మర్ల

 పరిచయం :

బహుముఖ ప్రజ్ఞాశాలి డా; సుబ్బలక్ష్మి మర్ల సాహిత్య శ్రీ బిరుదాం కితురాలు . M.A M.Pill,Ph.D పట్టా పొందారు. ఇటు జానపద సాహిత్యంలోనే కాక మరొక వైపు ఛందస్సు, వ్యాకరణ పూరితమైన పద్య ,శతక రచనలలోను మన సంస్కృతి ,సంప్రదాయాలు, ఆధ్యాత్మిక , భక్తి పూర్వక ఫణి తిలోను , ఆధునియా సరళిలోను  ఈమె రచనలు సమకాలిన, సమ యోచితంగా, సమయ స్పూర్తితో, సమర్ధవంతంగా అటు పండితులకే కాక  సామాన్యులకు అర్దమఎసరలిలో రాయడం ఈమె యొక్క ప్రతిభకు ప్రతీక.ఈమె తెలుగు భాషా సాహిత్యాలను గ్రంధస్థం చేసిన కృషి ఎనలేనిది.

గద్య రచనకు డా:సుబ్బలక్ష్మి మర్ల అనే పేరుతోను, పద్య రచనకు ‘సూర్యశ్రీ’
అనే కలం పేరుతో రాస్తున్నారు, వందకి పైగా ఆధ్యాత్మిక , సృజనాత్మక వ్యాసాలూ వివిధ దిన, వార , మాస పత్రికలలో వెలువడ్డాయి. ప్రముఖ దిన పత్రికలలో Voice of the New Women ‘నవ్య ‘ శీర్షికతో ‘సంక్రాంతి సుబ్బలక్ష్మి అనే పేరుతోను , ‘నాయిక’ శీర్షికతో చదువుల సరస్వతి  సుబ్బలక్ష్మి అనే పేరుతోను ఈమె గురించి ప్రచురించారు.

ఆమె రచించిన పది గ్రంధములు:-
1.తెలుగు జానపద సాహిత్యం-పౌరాణిక గేయ గాధలు పి హెచ్.డి  పట్టా  పొందిన గ్రంధం
2.సాహితీ సౌరభం  (వ్యాస సంకలనం )
3.కదంబ కందమాలిక (శతకం)
4.సూర్యా భ్యుదయము  (కావ్య ఖండిక 15 ఛందస్సులతో రాసిన పద్య రచన )
5.ఉదాహరణ కావ్యము (విశిష్ట సాహితీ ప్రక్రియ)
6.శతవసంతాల స్వాతంత్ర్య సమరయోధులు -శ్రీ పారుపూడి రామమోహన రావు – జీవితచరిత్ర
7.ఆధ్యాత్మక సంస్కృతి వ్యాసావళి .
8.శ్రీ వేంకటేశా ప్రభో ( శార్దూల విక్రీడిత ఛందస్సుతో శతకము)
9.లక్ష్మి శతకము (ఆటవెలదు లతో )
10. జానపదుల సంక్రాంతి పండుగ -భారతీయ సంస్కృతి దర్పణం

ఈ పది గ్రందాల వ్యాసాల, రచనల వైవిధ్యంలో  వైశిష్ట్యం గోచరిస్తుంది. ఈమె రచనల అధ్యయనంలో ఏ దృష్టి కోణంలో చూసినా     తో  Research Oriented గా ఉండుటయే గాక పరిశోధనా దృష్టిలో నిశిత విమర్శకు, ప్రతిభాపాటవాలకు నిదర్శనం.

తెలుగు జానపద సాహిత్యం పౌరాణిక గేయ గాధలు  ఈ గ్రంధం లో ఒక Encyclopedia గా ఎందరో ప్రముఖుల ప్రశంసల నందుకుంది. ‘ఉదాహరణ కావ్యము అనే గ్రంధం ఒక అరుదైన విశిష్ట సాహితీ ప్రక్రియ.యిప్పటి వరకు ఈ కావ్యం రచించిన కొద్ది మంది కవులలో ఈమె ఒకరైననూ, కవయిత్రిలలో ఈమె మొదటిది.

ఇక  జానపదుల సంక్రాంతి పండుగ భారతీయ సంస్కృతి దర్పణం అనే గ్రంధం ఆచాయ బిరిడు రాజు రామరాజు జానపద విజ్ఞాన బహుమతి పొందినది , ఈ గ్రంధం పదకొండు అధ్యాయాల  సౌగంధమాల. ఈఎ పండుగ యొక్క ఆవిర్భావం , పర్వంగాను, పండుగగాను, 18 రాష్ట్రాలలో జరుపుకునే వైశిష్ట్యాన్ని వేరు వేరు కళాకారుల రక రకాల వేశాధారణలతో  22 విభిన్న కళారూపాలుగా వారి ప్రతిభను ప్రదర్శించే విధానం వివరించారు.

ఈమె  చేసిన కృషికి గుర్తిన్పోగా ఈమె గ్రంధస్థం  చేసిన 10 రచనల విశిష్టతలను గ్రహించి తెలుగు భాషా పరంగా చేసిన కృషిని అభినందించి అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్  వారు ‘సాహిత్యశ్రీ’ బిరుదు ప్రదానం చేశారు .

1d

 

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.