సంఘ సంస్కర్త మహాకవి గురజాడ 150వ జయంతి మరియు “దేశమును ప్రేమించుమన్నా” జాతీయ గీత స్వర్ణోత్సవాలు వంగూరి ఫౌండేషన్ మరియు తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో హ్యూస్టన్ నగరంలో డిసెంబరు 2వ తేదీన వైభవంగా జరిగాయి.
ఉదయం 11 నుంచి 12 వరకు, కమ్మని విందుభోజనం, స్నేహితుల కులాసా కబుర్లతో సభాప్రాంగణం కళ కళలాడింది .
12 గంటలకు “దేశమును ప్రేమించుమన్నా” అన్న గురజాడ వారి గేయాన్ని, హ్యూస్టన్ స్వరమాధురి గాయకులు అఖిల మమాండూర్, సుమన్ మంగు, సత్యభామ పప్పు కలిసి ఆలపించడంతో సభ ప్రారంభమయ్యింది.
ఉమ పోచంపల్లి గారు గురజాడ వారి దేశభక్తి గీతాన్ని ఇంగ్లీషులోకి అనువదించి గేయం గొప్పదనాన్ని వివరిస్తూ మాట్లాడారు. తరువాత గురజాడ వారి నాటకం ఆధారంగా తీసిన కన్యాశుల్కం సినిమాలోని కొన్ని సన్నివేశాలను సభికులు తిలకించారు. తరువాత కృష్ణకీర్తి, సత్యభామ, సుమన్ మంగు, మీన పెద్ది, దీప్తి బాదం కలిసి ఆలాపించిన “పుత్తడిబొమ్మ పూర్ణమ్మ” బుర్రకథ సభికుల మనసుని ఆర్ద్రం చేసింది.
తరువాత జరిగిన పుస్తకావిష్కరణ సభలో ఇటీవల ప్రచురించబడిన గురజాడ వారి సమగ్ర సాహిత్యం “గురుజాడలు” పుస్తకాన్ని, చింతపల్లి గిరిజాశంకర్ గారి “కదంబం” పుస్తకాన్ని, “చైతన్యం” అనే ఈ-పత్రికని ఆవిష్కరించారు. తరువాత గురజాడ వారి జీవితం గురించి “గురుజాడలు” పుస్తకంతో అనుబంధంగా వచ్చిన ఒక వీడియో ని సభ్యులు తిలకించారు. చింతపల్లి గిరిజాశంకర్ గారు తమ కదంబం పుస్తకంలోంచి ఒక అంశం చదివి సభ్యులని నవ్వుల్లో ముంచెత్తారు.
తరువాత గురజాడ మనుమరాలు అరుణ గురజాడ గారు, మునిమనుమరాలు చంద్రలేఖ కలిసి గురజాడ వారి వంశవృక్షం గురించి, వారి తాతగారి అనుభవాలు ఙ్ఞాపకాల గురించి మాట్లాడారు.
గురజాడ మీద సత్యం మందపాటి గారు వ్రాసిన వ్యాసాన్ని రాం చెరువు గారు చదవగా, రాచకొండ శాయి గారు వ్రాసిన వ్యాసాన్ని సత్యభామ పప్పు చదివారు.
వంగూరి చిట్టెన్రాజు గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం సుసంపన్నమైంది.*
– సత్యభామ పప్పు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Pingback: వీక్షణం-13 | పుస్తకం