నైలునదీ మూలాల అన్వేషణలో ఫ్లారెన్స్ బేకర్
ఫ్లారెన్స్ హంగేరీ దేశానికి చెందిన వనిత. ఆ దేశంలో జరిగిన అంతర్యుద్ధాల వలన చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి. వాటిల్లో ఫ్లారెన్స్ వారిది కూడా ఒకటి. బిడ్డలులేని ఒక నర్సు ఫ్లారెన్స్‌ని చేరదీసి పెంచుకొంటుంది. చివరికి ఆ నర్సు అండదండలు కరువైపోయే సరికి ఆమె బానిస వ్యాపారుల చేతికి దొరుకుతుంది. డాన్యూబ్ నదీ తీరాన ఉన్న పురాతనమైన ఓట్ట్టోమాన్ పట్టణంలో జరుగుతున్న సంతలో ఈ బానిసలందరినీ వేలానికి పెడతారు ముస్లిం వ్యాపారులు. ఆనాటి ఒట్టోమాన్ పట్టణం అంటే ఇప్పటి బల్గేరియా దేశమే.
ఒక పక్క ఆకాశాన్నంటే కట్టడాలు, మరో పక్క పేదల గుడారాలు, వాటి మధ్యన తిరిగే బక్కచిక్కిన కుక్కలు. ఇలాంటి తారతమ్యాలు ఎక్కువగా కనిపించే ఒట్టోమాన్లో 1859వ సం||లో జరిగిన బానిసల సంతకి ఫ్లారెన్స్ తరలించబడుతుంది. సంతలో వేలం మొదలుకాగానే డబ్బున్న వాళ్ళందరూ త్వరగా, ఆశగా గుమికూడతారు. వారిలో ఇండియా నుండి వచ్చిన ఒక మహారాజు కూడా ఉన్నాడు. అతని పక్కన ఒక విదేశీయుడు పొడవైన గడ్డం, బలిష్టమైన శరీరంతో చాలా చురుగ్గా చూస్తున్నాడు అక్కడి వింత సంతని. ఆయన పేరు శామ్యూల్ బేకర్..
సంతలో మొదటి పాట మొదలవగానే ఆ సంతకి తేబడిన తల్లులూ, పిల్లలూ భయపడి ఒకర్నొకరు వాటేసుకుని ఒక మూలకి జరిగిపోతున్నారు, ఎవరు ఏ ధనికుడికి అమ్ముడుపోతారో తెలియదుకాబట్టి. వేలం పాటలు చాలా ఆలస్యంగా ముగుస్తుంటాయి. మూడోసారి పాడిన వేలంలోకి సన్నగా, తెల్లగా ఉండే ఒక సౌందర్యవతిని ప్రవేశపెట్టారు. ఆమె బంగారు రంగు జుట్టంతా వీపుమీదనుండి జలపాతంలా కిందికి పడుతూ ఉంది. అందరిలాగా ఆమె భయపడకుండా, ధైర్యంగా నిలబడింది. కానీ ఆమె చూపుల్లో దైన్యం, ఒంటరితనం చోటు చేసుకొంటున్నాయి.
ధనికులైన స్థానిక పాషాలు అందర్నీ తోసుకుంటూ ముందుకువచ్చి వేలం పాటను అందుకొంటారు. కానీ హఠాత్తుగా వెనుకనుంచి ఎవరో వారికంటే ఎక్కువ ధరకి పాడి, గుప్పెడు బంగారు లీరాల్ని ఆ పాటగాడి వైపు విసిరివేసి, కనురెప్ప పాటులో ఆ బానిస స్త్రీని బయటకు లాక్కొని పోతాడు.
ఇంగ్లండు దేశస్తుడైన శామ్యూల్ బేకర్‌కి సాహసయాత్రలు, ప్రయా ణాలు అంటే ఎంతో ఇష్టం. నైలునది పుట్టుక గురించి తెలుసుకొందామని ఆయన ఆరాటం. రాయల్ జాగ్రఫికల్ సొసైటీ వారికి తన కుతూహలాన్ని ఎన్నోసార్లు తెలియజేశాడు. స్వయంగా చిత్రకారుడు, పత్రికా విలేఖరి మాత్రమే కాకుండా గొప్ప వేటగాడు. స్వతహాగా ధనికుడు కావడం వలన తన అభిరుచుల్ని తీర్చుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చుపెట్టేవాడు. కానీ దురదృష్టవశాత్తూ పెళ్ళి అయిన పది సంవత్సరాలకే భార్య చనిపోవటంతో విచారంలో మునిగిపోతాడు. ఆయన నలుగురు బిడ్డలూ అమ్మాయిలే. అయినా ధైర్యాన్ని కూడగట్టుకొని వారిని బంధువుల ఇంటి దగ్గిరపెట్టి, వారి విద్య కోసం అన్నిఏర్పాట్లు చేసి, మనశ్శాంతి కోసం ఆఫ్రికా అడవుల్లో తిరుగుతూ ఉంటాడు.
అడవి ఏనుగుల్ని, పులుల్ని వేటాడుతూనే, నైలునది పుట్టుక గురించి విషయ సేకరణ చేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా తాను ఆ నది అన్వేషణలో ముఖ్యమైన పాత్ర నిర్వహించాలని కలలు కనేవాడు. తన ఆఫ్రికా అనుభ ఫ్లారెన్స్ బేకర్వాల్ని ఎప్పటికప్పుడు రాసి, లండన్ పత్రికలకి పంపిస్తుండేవాడు.
అలాగా ఒంటరిగా ఆఫ్రికా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న సమ యంలో ఒట్టోమాన్ పట్టణంలో జరుగుతున్న బానిసల సంతకి వెళతాడు. అక్కడ బంగారు రంగు జుట్టుతో ఉన్న ఫ్లారెన్స్‌ని చూసిన మరుక్షణం ఆమె ధైర్యానికి ఆశ్చర్యపడి, తాను చేయాలనుకున్న సాహస యాత్రలకి సరైన తోడు ఆమె తప్ప మరెవ్వరూ లేరని క్షణాల్లో గమనించి, ఆమెను దక్కించు కొంటాడు.
ఫ్లారెన్స్ ఈ పరిస్థితుల్లో బేకర్‌కి దగ్గిరౌతుంది. ఆ తరువాత ఆమె జీవితమంతా నమ్మశక్యంకాని సాహస ఘట్టాలతో, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో, ఆశ్చర్యంగొలిపే సంఘటనలతో కూడిన హాలీవుడ్ సినిమా లాగా సాగిపోతుంది.
ఇన్నాళ్ళూ నత్తనడకలాగా సాగిన శామ్యూల్ ప్రయాణాలు, పరిశోధ నలు అప్పటినుండి కొత్త ఊపు అందుకొంటాయి. మనసు కుదుట పడుతుంది. తన కలలు తనని వీడిపోతున్న సమయంలో దొరికిన ఈ కొత్త తోడుతో, బేకర్ తన ఆఫ్రికా అన్వేషణల్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వహించ గలుగుతాడు.
కానీ అప్పటకే నైలునది మూలస్థానం తెలుసుకోవటం కోసం రిచర్డ్ బర్టన్, జాన్ స్పీక్ అనే ఇద్దరు ఇంగ్లండు దేశీయులు బయలుదేరిపోతారు, రాయల్ జాగ్రఫిక్ సొసైటీవారి ఆర్ధిక సహాయంతో. వారితో పాటుగా తాను బయలుదేరతానంటే సొసైటీవారు ఒప్పుకోరు. కాలం కదలిపోతూనే ఉంది. అందువలన ఇప్పుడు తన ఖర్చుతో తానే నది అన్వేషణకి బయలు దేరటానికి నిశ్చయించుకొంటాడు.
బేకర్ వివరిస్తున్న నైలునదీ యాత్ర గురించి వినగానే ఫ్లారెన్స్ సంతోషంతో ఉప్పొంగిపోయింది. అది ఎంతో కష్టమైన ప్రయాణం అని తెలిసినా తాను పడ్డ బాధలకంటే తక్కువే అనుకొంది. పరుగెత్తే జింకల్ని పట్ట గలిగినవాడు, సింహాల్ని వేటాడగలిగిన ధైర్యస్తుడు అయిన తన బేకర్‌తో ప్రపంచపు ఆవలి అంచులకు వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉంది ఫ్లారెన్స్.
ఇలాంటి పెద్ద ప్రయాణం చేయటానికి సిద్ధంగా ఉన్న ఫ్లారెన్స్‌కి ఆఫ్రికా వాతావరణాన్ని అలవాటు చేయటంకోసం, బేకర్ ఆమెని తీసుకొని సూడాన్‌లోని ఒక నదీతీరం చేరుకుని, అక్కడ ఒక సంవత్సరం పాటు నివసిస్తారు.
అక్కడ స్థానికులైన హమ్రాన్ అరబ్బులతో కేవలం కత్తులు మాత్రమే పట్టుకుని ఏనుగుల వేటకి వెళ్ళేవాడు బేకర్. ఇథియోపియా నుండి వచ్చే నైలునదీ ఉపనదుల్ని అనుసరిస్తూ కొన్ని నెలలు తిరుగుతారు. ఆ సమయంలోనే అరబ్, మధ్య ఆఫ్రికా భాషల్ని బాగా నేర్చుకొంటారు ఇద్దరూ.
ఈ విధంగా సూడాన్ పరిసరప్రాంతాల్లో గడిపి, అక్కడి పరిస్థితులకి అనుగుణంగా జీవించటం ఎలాగో తెలుసుకొని, వారు తలపెట్టిన మహా యాత్రలో మొదటగా సూడాన్ రాజధాని ఖోర్టమ్కి వెళతార్ష్ము 1862 వ సం|| డిశెంబరులో.
ఇక్కడ నుండి మధ్య ఆఫ్రికా ఫ్లారెన్స్ బేకర్వెళ్ళటానికి సులభం. నగరంలో బానిసల వ్యాపారం ఎక్కువ. ఏనుగు దంతాలు, అతివిలువైన ఇతర అడవి సంపద అంతా ఖోర్టమ్ నుండి బయట దేశాలకి ఎగుమతి అవుతూ ఉంటుంది. పైగా అక్కడ మురికి, ఈగలు ఎక్కువ. ఫ్లారెన్స్‌కి ఇది నచ్చదు. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ జరుగుతున్న అక్రమ వ్యాపారంలో గవర్నరు మూసాపాషా నుండి చిన్న ఉద్యోగుల వరకు ప్రతివారికీ సంబంధం ఉంది. తమ యాత్ర కోసం వారికి చాలామంది పనివాళ్ళు, ఆహారం, పడవలు, ఆయుధాలు కావాలి. అవన్నీ ఇచ్చి తమకు సహాయం చేయవలసిందిగా ఈజిప్టు వైస్రాయినుండి బేకర్ తీసుకొన్న ఫర్మానాని ఖోర్టమ్లోని అధికార్లకి చూపిస్తాడు.
అయినాసరే ఆ స్థానిక ఆఫీసర్లు బేకర్ యాత్రకి సహాయం చేయ టానికి ఒప్పుకోరు. ఎందుకంటే బేకర్ ఆఫ్రికా లోపలికి వెళితే స్థానికులు చేస్తున్న అక్రమ వ్యాపారాలు అన్నీ అతనికి తెలిసిపోతాయనే వారి భయం. అందువలన సాహస వీరులైన ఇంగ్లీషు వారిని ఏమాత్రం ఆ ఛాయలకి వెళ్ళకుండా చేస్తున్నారు.
అయినాసరే బేకర్ వెనుకంజ వేయకుండా తమ వద్ద ఉన్న డబ్బులో ఎక్కువ భాగం ఖర్చుపెట్టి మూడు పడవల్నికొంటాడు. వాటిని నడిపేందుకు, లాగేందుకు కలిపి నలభైమంది పనివారిని, ప్రయాణించేందుకు కొన్ని గుర్రాల్ని, సామానులు మోసేందుకై గాడిదల్ని, అందరికీ రక్షణగా ఉండేం దుకై నలభైఐదుమంది సాయుధులైన అరబ్ వీరుల్ని, నాలుగునెలలకి సరిపడా ఆహారపదార్ధాలని తీసుకొని ఖోర్టమ్కి దక్షిణంగా 1600 కి.మీ. దూరంలో ఉన్న గోండోకోరోకి బయలుదేరుతారు.
సరిగ్గా బేకర్ దంపతులు బయలుదేరబోయే సమయానికి ఇంగ్లండు నుండి ఒక ముఖ్యమైన ఉత్తరం వస్తుంది వారికి. అది రాయల్ జాగ్రఫిక్ సొసైటీ వారిది. వారికి తనపై ఇన్నాళ్ళకి జాలి కలిగిందేమో అనుకొంటాడు బేకర్.
నైలునది మూలాలు తెలుసుకోవటం కోసం వెళ్ళిన స్పీక్-గ్రాంట్ అనే ఇద్దరు అన్వేషకుల గురించి సంవత్సరం గడిచినా ఎలాంటి జాడ తెలియక పోయేసరికి, వారిని వెతుక్కుంటూ జాన్ ఫెథిరిక్ అనే ఆఫీసరు బయలు దేరుతాడు. ఇతడు వారిని కలుసుకున్నాడో లేదో కూడా తెలియకుండా పోయింది. అందువలన స్పీక్-గ్రాంట్ల కోసం ఫ్లారెన్స్ బేకర్తాము పంపుతున్న ఆహార పదార్ధాలూ, పరిశోధనకి కావలసిన సామాగ్రినీ, తమతో పాటుగా తీసుకు వెళ్ళి, ఆ పరిశోధకులు కనిపించే పక్షంలో వారికి అందజేయవలసిందిగా బేకర్ని కోరుతూ సొసైటీ వారు రాసిన ఉత్తరం అది.
అలాంటి మంచి అవకాశాన్ని బేకర్ వదులుకోదలచు కోలేదు. వారి అభ్యర్ధనని వెంటనే ఒప్పుకొంటాడు. తనకి అదృష్టం ఉంటే స్పీక్-గ్రాంట్లు నైలునదీ మూలాలకి చేరుకోక ముందే వారిని కలవగలిగితే, వారి కీర్తిలో తాను కూడా పాలుపంచుకోవచ్చు. లేకపోతే వారి తిరుగు మార్గంలో కలిసి తన బాధ్యతగా వారికి సామానులు అప్పగించవచ్చు అనుకొంటాడు.
బేకర్ బృందం అంతా ఖోర్టమ్ నుండి బయలుదేరుతారు. దారి చాలా ప్రమాదంగా ఉంటుంది. ఇదే ఇంత అపాయాలతో ఉంటే గోండో కోరోనుండి ఎలా ఉంటుందో అని ఊహించుకొంటూ ఉంది ఫ్లారెన్స్. నిజమైన మధ్య ఆఫ్రికా నుండే నైలు నది మూలాలకి దగ్గిర దారి ఉంటుంది. కాబట్టి ఈ కఠినమైన దారిలో ప్రయాణం చేయకతప్పదు.
నదీ ప్రవాహం వలన ఈ బాటంతా బురదగా మారిపోతూ ఉంది. కొన్నిసార్లు వారి పడవ బురదలో ఇరుక్కుపోయి కదిలేది కాదు. అందుకోసం పడవకి చక్రాలు అమర్చి లాగాల్సి వచ్చేది. దారి పొడవునా బానిసల వ్యాపారులే ఉంటారు. ఇలాంటి దారిలో నలభై రోజుల ప్రయాణం తరవాత గోండోకోరోకి చేరుకొంటారు. ఇక్కడికి ఖోర్టమ్ నుండి సంవత్సరానికి ఒకసారి మాత్రమే పడవలు వస్తాయి. వరదలు లేనికాలంలో మాత్రమే ఆ పడవలు వచ్చితీరాలి. పైగా ఆ పడవలు ఒంటరిగా అక్కడ ఉండటంకూడా కష్టమే. దొంగల భయం ఎక్కువ. ఒకర్ని ఒకరు చంపుకోవడం, తిట్టుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. వారు కొనితెచ్చిన లేదా పట్టుకొచ్చిన బానిసల్ని విపరీతంగా కొడుతూ నానా బాధలు పెడుతుంటారు. కొందరు బానిసలు పారిపోవటానికి ప్రయత్నించేవారు. అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా అక్కడికక్కడే చంపేసేవారు వ్యాపారులు.
బేకర్వారి గుడారాల్లోకి ఎలుకల మందలు దాడిచేసేవి. దోమలు అయితే మబ్బుల మాదిరిగా, మందంగా గాలిలో తిరుగుతూ సమయాను కూలంగా మీద పడేవి. ఇలాంటి పరిస్థితులు ఉన్న గోండోకోరోకి, నరకానికి పెద్ద తేడా ఉన్నట్లుగా కనిపించలేదు ఫ్లారెన్స్‌కి.
ఫ్లారెన్స్ బేకర్ గోండోకోరోలోని ప్రజల మనస్తత్వం చూస్తే ఖోర్టమ్ చాలా మంచిదిగా తోచింది. ఇక్కడ పలికే నాధుడు లేడు. శతృవులు బేకర్ వాళ్ళ పడవమీదకి తుపాకీలను ఎక్కుపెట్టటమే కాకుండా, ఒక గుండు పేల్చి తామంటే ఏమిటో తెలియజేస్తారు. ఆ తుపాకీ గుండు కాస్తా ఒక చిన్న పిల్లాడి ప్రాణాలు తీస్తుంది. అదొక భయానక ప్రదేశం అని తెలిసినా పదిహేను రోజులపాటు అక్కడే ఉండి స్పీక్-గ్రాంట్ల జాడ తెలుసుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తారు.
ఈ ప్రదేశం దాటితే అంతా చీకటి మయం. పట్టపగలే కాగడాలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొందరు దొంగలు బేకర్ దంపతుల్ని అడ్డుకొంటారు. కానీ ఫ్లారెన్స్ వారితో చాలా కఠినంగా మాట్లాడి, బెదిరించేసరికి ఆ ముఠానాయకుడు బేకర్ని క్షమాపణ వేడుకొంటాడు. ఇలాంటి సంఘటనలు జరగటం మొదలయ్యేసరికి బేకర్ వెంట వచ్చిన మనుషులు ఒక్కొక్కరే చల్లగా జారుకోవటం మొదలు పెడతారు. మిగిలిన కూలీల్లో సగంమంది రాత్రిపూట పారిపోతారు.
ఇంతలో ఒక శుభోదయాన దూరంగా తుపాకీ మోతలు వినిపిస్తాయి. ఏదో పెద్ద బిడారు వస్తుంది అనుకొని, ఆ వైపుగా వెళ్ళిన బేకర్‌కి ఇద్దరు బక్క చిక్కిన తెల్లవాళ్ళు ఎదురౌతారు. బేకర్ ఆనందానికి హద్దుల్లేవు. బున్యూరో ప్రాంతాల నుండి వస్తున్న ఆ ఇద్దరూ స్పీక్-గ్రాంట్లే. వారు నైలునదికి ముఖ్య ఆధారమైన సరస్సుని కనిపెట్టారని తెలిసికొని మరీ ఆశ్చర్యపోతాడు. రాయల్ జాగ్రఫీ వాళ్ళు పంపిన సరంజామా అంతా వారికి అప్పజెప్పి, ‘నా కోసం ఏమైనా కొంచెం కీర్తి మిగిలిందా?’ అని అడుగుతాడు బేకర్.
‘విక్టోరియా సరస్సుకి కొంచెం పడమరగా మరో పెద్ద సరస్సు ఉందనే పుకార్లు విన్నాం. అదికూడా నైలు నదిలోకి ప్రవహిస్తుందట. మా వద్ద సామానులు, ఆహారపదార్ధాలు తక్కువగా ఉండేసరికి అటుగా వెళ్ళటం మానివేశాం’ అని చెబుతారు.
‘అయితే మరి దాని గురించిన వివరాలు కొన్ని రాసి ఇస్తారా?’ అని బేకర్ అడగ్గానే, గ్రాంట్ చిన్న స్కెచ్ గీసి, ‘నైలుకి ఇది రెండవ ఆధారం’ అని చెప్పేసరికి బేకర్ ఎంతో ఆనందపడి, ‘కనీసం ఈ మాత్రం అవకాశమైనా నాకు మిగిలింద్ష్మి నన్ను ఒక అన్వేషకుడిగా నిరూపించుకొనేందుకు’ అనుకొంటాడు.
‘అక్కడికి వెళ్ళాలంటే వందలమైళ్ళు నడుచుకొంటూ వెళ్ళాలి. మరి మేడమ్‌తో ఇది సాధ్యమా? అంటూ అనుమానంగా ఆమె వైపు చూస్తార్ష్ము ఫ్లారెన్స్ పట్టుదల గురించి తెలియని స్పీక్-గ్రాంట్లు.
బేకర్‌కి వారు చెప్పిన ముఖ్యమైన విషయం ఏమంట్ష్మే దారిలో ఎదు రయ్యే బున్యూరో రాజ్యం గురించి, మరీ ముఖ్యంగా దురాశాపరుడైన దాని రాజు కామ్రాసి గురించి.
మిత్రులకి వీడ్కోలు చెప్పి వెంటనే తమ యాత్రను కొనసాగించారు బేకర్ దంపతులు. ఆ కొత్త సరస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవాలని తమతో పాటు మిగిలి ఉన్న సేవకులతో బున్యూరో రాజ్యం వైపుగా బయలు దేరారు. ‘ఆ సరస్సు చూసేవరకూ నాకు విశ్రాంతి లేదు’ అంటూ బేకర్ని తొందరపెట్టసాగింది ఫ్లారెన్స్. పదిహేడు మంది మాత్రమే తమతో పాటు మిగలటం వలన, తమంతట తాము బిడారుగా మారలేక పోతారు. కాబట్టి ఆ దారిలో ప్రయాణించే ఒక బానిస వ్యాపారి పెద్ద బిడారు అండతో ప్రయాణించవలసి వచ్చింది.
– ప్రొ.ఆది నారాయణ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~