సుకన్య

”నీవయితే వనజకు ధైర్యం చెబుతావని నిన్ను పిలిపించాం. నీవు దాన్ని ఓదార్చాలి.” వనజ తండ్రి అభ్యర్ధన.
”బాబాయి!  మీరు చెప్పాలా? వనజ పరిస్ధితి అంతా కనుక్కొని నేను ధైర్యం చెబుతానుగా” హామి ఇస్తున్నట్లు అంది సుకన్య.
రాత్రి ఎనిమిది గంటలవుతుండగా డాక్టర్‌ మళ్ళీ వనజను పరీక్షించారు ‘అమ్మా’ అని ఒక్కసారి కదిలింది. డాక్టర్‌ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ‘ఆ అమ్మాయి పరిస్ధితి పర్వాలేదు’ అని చెప్పాడు. అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరిసింది. ఇప్పటి వరకు ఆవార్త కోసం ఎదురు చూచిన వాళ్ళంతా ఎపుడు మాట్లాడుతుంది అని మళ్ళీ ఎదురు చూడసాగారు.
మరో నాలుగు రోజుల్లో వనజకు మాట్లాడే శక్తి వచ్చింది. ఈలోగా వనజ అత్తగారు కోలుకొని ఆసుపత్రికి వచ్చి చూచింది. కోడలి పరిస్ధితికి వెక్కివెక్కి ఏడ్చింది. ”అయ్యో సమయానికి అబ్బాయి లేడు. వ్యాపారం పని మీద కలకత్తా వెళ్ళాడు” అంది.
సుకన్యకు ఆమె మాటల మీద నమ్మకం కలుగలేదు.
”కలకత్తా లో ఏమిటండి బిజినెస్‌” అడిగింది సుకన్య.
”రెడీమెడ్‌ షాపు ఉంది… డ్రస్సులు అవీ తెస్తుంటాడు…”
”మీకు పట్నంలో ఉందాషాపు? ఎక్కడ? షాపు పేరేమిటి?”
వరుసగా సుకన్య వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వనజ అత్త తప్పించు కొందామని చూసింది. కాని మళ్ళీ మళ్ళీ సుకన్య అడిగిన తర్వాత చెప్పక తప్పలేదు. ”అంటే మా అబ్బాయికి కాదు. వాడి స్నేహితుడికి ఉంది షాపు. ఆ బట్టల కొనుగోలు కోసం వెళ్ళాడు”
మొత్తం మీద వనజ తల్లిదండ్రులు ముందు ఆ అమ్మాయి పరిస్ధితి చక్కబడితే చాలనుకొన్నారు. తక్కిన విషయాలు గురించి అట్టే ఆలోచించలేదు.
మరో రెండు రోజులకి వనజ కోలుకోంది. సుకన్యను చూచి ఏడుపు మొదలు పెట్టింది. కాని డాక్టరు ఎట్టి పరిస్ధతుల్లో ఆవేశపడకూడదని హెచ్చరింటంతో నెమ్మదిగా అందరు కలసి ఆ అమ్మాయిని ఓదార్చారు.
మరొక వారం రోజుల్లో వనజ బాగా కొలుకోంది. ఈ వారం రోజుల్లో ఒక్కరోజు  కూడ వనజ భర్త రమేష్‌ చూడటానికి రాలేదు. అత్తమామలు రెండుమూడుసార్లు  వచ్చారు. సుకన్య ఆసుపత్రిలోనే వనజకు తోడుగా ఉండేదుకు అట్టేపెట్టారు. వనజ ఇప్పడు లేచి కూర్చోగలుగుతున్నది. ఆహారం కూడ కొంచెం కొంచెం తీసుకొంటున్నది. మొత్తం మీద ఇక ఏమీ భయపడవలసిన అవసరం లేదని మరో రెండురోజుల్లో ఆ అమ్మాయిని ఆసుపత్రి నుంచి పంపుతామని డాక్టర్లు చెప్పారు. సాయంత్రం చల్ల గాలికి వనజని నెమ్మదిగా నడిపించుకొంటూ కారిడార్‌లోకి తీసుకవచ్చింది సుకన్య. ఇద్దరు కుర్చీల్లో ఎదురెదురుగ కూర్చున్నారు.
”అక్కా! నీవు ఎవరెన్ని చెప్పినా వినకు. హాయిగా చందుని పెండ్లి చేసుకో! ఇక్కడి నుంచి వెళ్ళిపో” అంది.
సడన్‌గా ఇట్లా మాట్లాడిందిదేమిటా అని ఆశ్యర్యపోయి చూస్తున్న సుకన్యతో మళ్ళీ అంది వనజ.
”నా పెండ్లి కోసం డాడి  ఎంత కష్టపడ్డారు ఎంత డబ్బు ఖర్చు చేసారు. అమ్మ నా పెండ్లి చేయటమే తనజీవిత ధ్యేయం అన్నట్లుండేది. కాని నేను నిజంగా పెండ్లాడిన తర్వాత ఒక్కరోజు కూడా సంతోషంగా గడపలేదు. ఎప్పుడు గొడవలు ఏడుపులే. అసలు తమ కొడుకు అంత చెడ్డవాడని తెలిసి మరొక ఆడపిల్ల గొంతు కోయటానికి మా అత్తమామలు ఎందుకు సిద్ధపడ్డారు? పైగా ఈ పెండ్లి కుదిర్చిన మధ్యవర్తులు అన్నీ తెలిసే ఎందుకు మోసగిస్తారు.”
”పిచ్చిదాన నీకు తెలియదా? వంద అబద్దాలు ఆడయినా ఒక పెళ్ళి చేయమన్నారు. తర్వాత పెళ్ళయింది పిచ్చి కుదిరింది. అని కొందరు ముందు ఎంత అల్లరి చిల్లరిగా తిరిగిన పెళ్ళి తర్వాత మారతారు. అట్లాగే ఇతను బుద్ధిమంతుడవుతాడని తల్లిదండ్రులు ఆశపడి ఉంటారు…” ”నీ వెప్పుడు ఇంతే చెడ్డవాళ్ళలోనూ మంచి వుందనే చెబుతావు.”
”వనజ! అసలేం జరిగింది. నీవు ఎట్లా పడ్డావు?  ఏమయింది?”
”ఏ ముందక్క! ప్రతిరోజు జరిగే గోడవలే ఇవి. నాపేరనున్న పొలం అమ్మి డబ్బుతెమ్మంటాడు. ఎట్లా అడగను అమ్మనాన్నలను పోనీ కొంత క్యాష్‌ అయినా తెమ్మని నిర్భంధం నేను దానికి ఒప్పుకోలేదు. మొదట తిట్లు… తర్వాత చేయిచేసుకోవటం మొదలయింది. త్రాగుడు… వేలకువేలు పెట్టి క్లబ్బుల్లో పేకాటలు. ఇట్లా డబ్బుతగలేసేం దుకేనా నేను పుట్టింటి నుంచి డబ్బుతేవాలా! అని కొంచెం గట్టిగా ప్రశ్నించా దాని ఫలితం ఇది! ఆ తల్లిదండ్రులు కూడా కొడుకుని వదిలేసారు. ఎవరేమి చెప్పినా వినిపించుకోడు. అమ్మనాన్నలంటే గౌరవం ప్రేమ లేదు. తన మెళ్ళో చైన్‌ పేకాటలో పెట్టాడు. ఇక ఆటలు సాగవు అనుకొంటే అపుడు నాతో ప్రేమగా మాట్లాడి నావద్ద ఉన్నవి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. ఒక పుస్త్తకం చదువుదామని గాని, పోనీ టి.వి చూద్దామని గాని ఏవిధమైన ఆలోచనలు లేవు. అతను నాతో గడిపిన సమయం చాలా తక్కువ. రాత్రిళ్ళు చాలా లేట్‌గా వస్తాడు. అలసిపోయి పడుకోంటాడు నాకు భార్యగా అతని వద్ద చనువు లేదు. అసలు అతనితో నేను ఏది పంచుకోలేదు. ఇపుడు చెప్పు అక్కా! నేను నాజీవితం చాలా చక్కగా సాగిపోయేలా అమ్మనాన్న అన్ని విధాల చక్కటి వరుడ్ని తెచ్చి ముడిబెడతారనుకొన్నాను. నేననుకొన్నదేమిటి? కాని జరిగిందేమిటి?  మంచి మనసుతో నేనెంతో గొప్ప ఆలోచనలు చేసి తల్లిదండ్రులని కష్టపెట్టని నిర్ణయాలు  తీసుకొన్నానని అనుకొన్నాను. ఇదంతా నాకర్మంటావా?”
దుఃఖంతో మాట్లాడలేక పోయింది వనజ.
”అట్లా ఎందుకనుకుంటావ్‌? బహుశా ఈ ఎడబాటుతో అతనిలో మార్పు వచ్చి ఉండవచ్చు కదా?”
”మార్పు వచ్చిన వాడయితే ఇంత కాలం నన్ను చూడకుండా ఎట్లా ఉన్నాడంటావ్‌? తను చేసిన పనికి పశ్చాత్తాపపడకుండ ఎట్లా ఉన్నాడక్కా?”
”సరే! నీవిపుడు అట్లాటివి ఏవీ ఆలోచించకు. మనసు పాడుచేసుకోకు.”
”లేదక్కా! మనసులో ఏదో పెట్టుకొని దిగులు పడుతూ కూర్చునేకంటే, నీతో ఉన్నదున్నట్లు చెప్పేస్తే నాకు హాయిగా ఉంటుంది.”
”వనజ! ఏమి జరగదు అంతా సవ్యంగానే అవుతుంది. మళ్ళీ నీవు ఇష్టపడేవరకు అమ్మనాన్న నిన్ను అక్కడికి పంపరు సరేనా?”
అక్కడికి వెళ్ళక మరెక్కడికి వెళ్ళమంటావ్‌ నన్ను నీవే చెప్పు… పుట్టింట్లో ఎక్కువ కాలం ఉంటే  విలువ ఉంటుందా? కన్నవారు కూడా గౌరవించరు… విడాకులు తీసుకుందామంటే అమ్మనాన్న ఒప్పుకుంటారా? అక్కా! నేను ఇంకా చదివి ఏదో ఒక ఉద్యోగంలో సెటిలయి నా మానాన నేను బ్రతుకుతాను. కాని తిరిగి అతని వద్దకు వెళ్ళను. నీవు నాన్నకు అమ్మకు నచ్చజెప్పు.”
”అట్లాగే! నీ ఇష్ట ప్రకారమే చేద్దాం… చాలాసేపు కూర్చున్నావు… కొంచెం రెస్టు తీసుకుందువుగాని రా వెళ్దాం.”
అంటూ వనజ చెయ్యి పట్టుకొని లోపలకు తీసుకువెళ్ళింది సుకన్య.
అసలు ఈ పెండ్లిళ్ళు-విడిపోవటాలు ఏమిటి? మన దేశంలో పిల్లల క్షేమం దృష్ట్యా తప్ప నిజంగా భార్యాభర్తల మధ్య అంత విడదీయరాని గాఢమయిన అనుబంధం ఉందా? ఎన్ని సమస్యలు వచ్చినా, ఇష్టమున్నా లేకున్నా ఎందుకు అట్లాగే కలసి ఉండాలని నిర్ణయించుకొన్నారు? విదేశాల్లో లాగ ఇక్కడ ఎందుకని విడిపోవటం లేదు. ఆ సమాజంలో విడాకులు పొందినా ఆపిల్లల గురించిన ఆందోళన వారికుండదు. పైగా ఎవరు వారిని తక్కువగా చూడరు. అదే ఇక్కడయితే పెండ్లాడి ఒకసారి భర్తను విడిచి పెట్టిన స్త్రీకి గౌరవం ఎక్కడుంది? కష్ట్టమైన నిష్ఠూరమైన భర్త ఎటువంటి వాడయినా స్త్రీ జీవితాంతం అతన్ని అంటిపెట్టుకొని ఉండవలసినదే!
సుకన్య ఇట్లా పరిపరి విధాల ఆలోచనల్లో మునిగిపోయింది. ఆమర్నాడు వనజని డిశ్చార్జ్‌ చేసారు. సుకన్య కూడ ఆ అమ్మాయితో ఇంటికెళ్ళింది. ఆశ్రమానికి వెళ్ళలేదు.
తల్లిదండ్రులెంత చెప్పినా వనజ అత్తమామల మీద భర్త మీద కేసు పెట్టటానికి ఒప్పుకోలేదు. అనవసరపు యాగి తప్ప దీని వల్ల ప్రయోజనం లేదని వాదించింది.
సుకన్య ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పి ఆశ్రమానికిక తిరిగి వచ్చింది.
వనజ అత్తమామలు  కాని భర్త కాని వచ్చి ఆ అమ్మాయిని తమ ఇంటికి తిరిగి పంపమని అడగలేదు. కనీసం ఆరోగ్యం ఎట్లా ఉందని ప్రశ్నించలేదు.

మరో ఆరునెలల కాలం మామూలుగా గడిచిపోయింది. అయితే సుకన్య గర్వించే విషయం ఒకటి జరిగింది. చందు ఐ.ఎ.ఎస్‌.కి ప్రిపేర్‌ అవుతున్నానని తెలియ చేసాడు. ఆ మహా యజ్ఞంలో విజయం పొందాలంటే రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పాటు శ్రమిస్తున్నానని, మొదటి ప్రయత్నంలోనే సాధించగలననే విశ్వాసముందని లెటరు  వ్రాసాడు. ఆలెటర్‌ చివర్లో అతను వ్రాసిన వాక్యాలను మళ్ళి మళ్ళి చదువుకొని మురిసిపోయింది. సుకన్యా! నాహృదయాది దేవతకు దూరంగా వున్నా, నా హృదయం నిరంతరం ప్రతీ విషయం ఆమెతో చెపుతునే ఉంటుంది. అనుమతి తీసుకొంటూ, ఆమోదం పొందుతూనే ఉంటుంది.” చందు ఎక్కడున్నా ఏమయినా ‘తనవాడు’ అసలు ఆమాట అనుకొంటేనే ఎంత హాయిగా ఉంది. ఎంత తృప్తిగా ఉంది. ఎంత సంతోషంగా ఉంది.
ఆ రోజు ఆశ్రమంలో అంతా విచారంగా కూర్చున్నారు. బాబాగారికి ఆరోగ్యం బాగా లేదని అంతా ఆందోళన పడుతున్నారు. ఒళ్ళు తెలీని జ్వరంతో ఆయన మూలుగుతున్నాడు. సామన్య మానవమాత్రునిలాగా ఆయన అంత బాధపడటం, రోగంతో తీసుకోవటం చాల మందికి వింతగా అనిపించింది. బాబా కదా! ఏదో ఒక శక్తితో రోగాన్ని మటుమాయం చేసుకోవచ్చు కదా! అని కొందరన్నారు.
సుకన్యకు అనిపించింది మనిషి ఎక్కడో ఒకచోట సుఖం శాంతి తృప్తి కావాలని అన్వేషిస్తునే ఉంటాడు. అందుకే ఇన్ని వందల మంది బాబాలని, అమ్మలని, ఆశ్రమాలని, మఠాలని తిరుగుతుంటారు. నిజానికి మనసులో లేని ఆనందం ఎక్కడి నుండో ఎలా పొందగలం! ఇట్లా ఏదో సంతోషం-సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వచ్చిన వీరంతా బాబాకు ఏవో అపూర్వశక్తులున్నాయని నమ్మేవారే! అందుకే ఆయనకు సామాన్యమానవుడిలా జ్వరం వచ్చిందన్న విషయం నమ్మలేకపోతున్నారు.
అంతకుంతకు జ్వరం తీవ్రత ఎక్కువుతున్నది. ఆశ్రమంలో అందరిని చూచే డాక్టర్‌ ఎవరయినా స్పెషలిస్టుకి చూపెడితే మంచిదన్నాడు. బాబాగారు ఆరోజు లాయరుని పిలిపించారు. ఆయన పెద్ద కూతురు, చిన్న కూతురు ఇద్దరు అల్లుళ్ళు, కొడుకు కోడలు, భార్య అంతా ఆశ్రమం ఆస్తులన్ని తమకు దక్కేలా విల్లు వ్రాయాలని పట్టుబట్టారు. అయితే ఆశ్రమంలో పాఠశాలను అభివృద్ధిలోకి తెచ్చిన అప్పారావు పంతులుకు పాఠశాల పెత్తనం ఎప్పటీకీ అప్పగిస్తానని అంతకు పూర్వమే బాబా మాట ఇచ్చాడు. ఇప్పడాయన వాళ్ళంతా దానికి వ్యతిరేకంగా ఆయన మీద ఒత్తిడి తీసుకువచ్చారు. ఆశ్రమంలోని సమస్తం తమకే దక్కాలని గొడవవడ్డారు. బాబా ఆవిధంగా చేయక తప్పలేదు.
ఎట్లాగో ఈవార్త బైటకి పొక్కింది. అంత క్రితం క్షణం వరకు బాబాని సాక్షాతు భగవంతుని అవతారం, అని కీర్తించిన అప్పారావు ఆయన మీద కారాలు మిరియాలు నూరటం ప్రారంభించాడు. ఆశ్రమంలో ఒక విధమైన సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. పాఠశాలను ప్రాణప్రదంగా ప్రేమించిన అప్పారావు ఇప్పడు తనకంత అవసరం అగత్యం లేదనుకోసాగాడు. క్రమంగా లోపలి గొడవలు బయటకు పొక్కాయి. బాబాకి ఏమిశక్తులు లేవు, మహాత్యాలు లేవు, ఆయన సామాన్య మానవమాత్రుడేనని అందుకే జబ్బుపాల పడ్డాడని ఆనోట ఆనోట ప్రచారం అయింది. పాఠశాల తరపున బాబాకి వచ్చే ఆదాయం గురించి కూడా అందరూ చెప్పకోసాగారు.
”నిజానికి సమాజానికి అంత సేవ చేయాలని, నలుగురికీ ఉపయెగపడాలనే ధ్యాసే ఉంటే అనాధ పిల్లలని చేరదీయ వచ్చుకదా? దిక్కులేని వృద్దులకు ఆశ్రమం నడపవచ్చు కదా! ఆశ్రమంలో నడిపే ప్రతిదానిలోను లాభాపేక్ష కనపడటం లేదా? ఇట్లా వ్యాఖ్యానాలు సాగిపోతున్నాయి.
”అయినా ఈ మధ్య ఏదో వంకతో ఎవరో ఒకరు ముక్కు మూసుకొని ఏదో కూర్చోటం… మనమంతా వాళ్ళు మన కష్టాలను ఇట్టే చేత్తో తీసి పారేస్తారని నమ్మి వాళ్ళ చుట్టు మూగటం… అపారమైన బహుమానాలనివ్వటం. తర్వాత ఏదో ఒక రోజు వాళ్ళ అసలు రంగు బయట పడటం… మనం అలో లక్ష్మణా అంటు ఏడుస్తూ కూర్చోవటం…
ఇట్లా నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకోవటం ప్రారంభించారు. అప్పారావు కూడా తన శాయశక్తుల బాబామీద వ్యతిరేక  ప్రచారం మెదలెట్టాడు. బాబా పేరుతో పాఠశాల నడుపుకొంటూ డబ్బు సంపాదించుకున్న అతనికి అంతా తన సొంతం కాలేదని తెలియగానే ఎంతటి కక్ష పెరిగి పోయిందో! అదే తనకు ఆదాయం తెచ్చిపెడుతున్నపుడు అపురూపమైనది, అపూర్వమైనది బాబా మహిమ అంటూ కొనియాడాడు. ఇప్పుడు తనకు ఆర్ధిక లాభాలను తెచ్చిపెట్టదు అని తెలిసినపుడు నిందిస్తున్నాడు.
ఈ ప్రపంచంలో మానవ కార్యకలాపాలకు సంబంధాలను అన్నింటిని నిర్ధేశించేది డబ్బు మాత్రమే!
బాబాగారిని పట్నం తీసుకెళ్ళే కంటే డాక్టర్లనే ఆశ్రమానికి రప్పిస్తే బాగుంటుందని ఆయన భార్య సావిత్రి దేవి అభిప్రాయం వెలిబుచ్చుటం వల్ల ఆయనను పట్నం తరలించే కార్యక్రమం వాయిదా వేసారు. డాక్టర్లు వచ్చి పరిశీలించారు. వైద్యం బాగానే కొనసాగుతుంది.
ఈ పరిణామాన్ని తెలుసుకొన్న వెంకయ్య తాను తొందరపడి తన కూతుర్ని ఆశ్రమంలో దించానేమో అనుకొన్నాడు. వనజ విషయం ఆయనలో కొంత మార్పు తెచ్చింది. ఇప్పడు క్రొత్తగా జరిగిన ఈ ఆశ్రమ వ్యవహారం ఆయన్ను మరింత కలతపరిచింది. సుకన్యలో వివాహ విషయంపై ఏమైనా మార్పు వచ్చిందేమో అనిపించింది. ఆరోజు కూతురిని కలసి మాట్లాడాలనిపించి ఆశ్రమానికి వచ్చాడు. బాబాను చూడటానికి ఎవరిని అనుమతించటం లేదు. అందుకని కూతురువద్దకే వెళ్ళాడు సరాసరి. సుకన్యలో చెరగని ఆత్మవిశ్వాసం తరగని గొప్పదనం తండ్రి అయిన ఆయనకే సరిగా అర్ధం కాలేదు.
”అదేమిటి నాన్నా! సడన్‌గా వచ్చారేం! ఏమిటి విశేషం” అంది తండ్రి ప్రక్కనే క్రింద కూర్చుంటూ.
”ఏముందమ్మా! ఎందుకో నిన్ను చూడాలనిపించి వచ్చాను. నీకిక్కడ ఎట్లా ఉంది? వచ్చేస్తావా? ఉండగలవా?” ఆదరంగా ప్రశ్నించాడు.
”బాగానే ఉంది. నాకు మొదటి నుంచి బాబాల మీద సద్భావనేం లేదు. అయినా నాకు సర్వీసు చేయటానికి అవకాశం వచ్చింది కాబట్టి వినియోగించుకొన్నాను.
”ఔను తల్లీ! అదీ నిజమే! మరి నీ పెండ్లి విషయంలో ఏమి చేద్దాం. ఇంకా ఎంతకాలమిట్లా ఉండిపోతావ్‌?…”
”మీరు అడిగినట్లు మీకోరిక నెరవేరుస్తున్నాను నాన్నా! కన్నవారి ఋణం తీర్చుకొంటున్నాను…”
”అంటే ఋణం తీర్చుకోవటమంటే ఇట్టానా తల్లీ! నీవు పిల్లాపాపలతో కళకళ లాడుతుండాలి. నీకో సంసారమంటూ ఏర్పడాలి.. అదీ నా కోరిక.”

 – విజయ బక్ష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
97

సుకన్య, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో