తళుకు బెళుకులకు ఆవల ఒక సరిహద్దు(కథ)-విజయభాను కోటే
“ఒకసారి నీ ఫోల్డర్ లో చెక్ చెయ్యి. తప్పకుండా ఉంటుంది” తన ల్యాప్‌టాప్ మూసేస్తూ, హడావుడి పడిపోతూ చెప్పాడు హరి. కప్పును పట్టుకోబోతున్న నా చెయ్యి మళ్ళీ ల్యాప్‌టాప్ వైపుకు మళ్ళింది. హరి ప్రక్కనే కూర్చున్న సుధీర్ కిసుక్కున నవ్వాడు. నా అసహనానికి కారణం అతనికి తెలుసు.
మూడు నిముషాల్లో నా ఫోల్డర్ లో కావాల్సిన ఫైల్ వెతకడం, ఓపెన్ చేసి, డీటైల్స్ చెక్ చేసి హరి ఈమెయిల్ కి పంపడం అయింది. ఇద్దరూ నా కేబిన్ లోంచి వెళ్లిపోయేముందు సుధీర్ నా వైపు, నా టేబుల్ పై ఉన్న కప్పును మార్చి మార్చి చూసిన చూపుకు ఇంకా తిక్క లేచింది. స్ప్రింగ్ డోర్ చిన్నగా చప్పుడు చేస్తూ మూసుకున్న వెంటనే కప్పును అందుకున్నాను.
“చల్లారిన కాఫీ నీకు నచ్చదు కదా, వదిలెయ్యి, మళ్ళీ తెప్పిద్దాం” లోపలికి వస్తూ అంది రాధ. నాలుకకు చల్లగా తగిలిన కాఫీ మళ్ళీ నన్ను వెక్కిరించింది.
“నా కేబిన్ ఒక సత్రం. సత్రంలో పర్సనల్ స్పేస్ ఉండదు” విసుగ్గా ల్యాప్‌టాప్ మూసేశాను నేను.
నా వేలు ల్యాప్‌టాప్ నుంచి తీసే లోపే గిరి ప్రత్యక్షం అయ్యాడు. కేబిన్ తలుపు మీద నాక్ చేద్దామన్న ఆలోచన ఎవరికీ రాదెందుకో!
“ఉదయం కనిపించలేదు, నువ్వు సెలవులో ఉన్నావేమో అనుకున్నాను” అన్నాను నేను మళ్ళీ ల్యాప్‌టాప్ తెరుస్తూ.
“రాత్రి బెనిఫిట్ షో కి వెళ్ళాను. సినిమా తర్వాత ఫ్రెండ్స్ తో తెల్లవారేదాకా సినిమా గురించి చర్చలు, వీడియోస్ చెయ్యడంతో సరిపోయింది. ఉదయం లేవలేకపోయాను. సెలవనే చెప్పాను. బాస్ ఊరుకోలేదు. మధ్యాహ్నానికైనా రమ్మన్నాడు. అందుకే తప్పలేదు.” నీరసంగా ఉన్న అతని ముఖం చూస్తూ ఒక నిట్టూర్పు విడిచాను.
“నీ ప్రమోషన్ కి ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం అని నీకు తెలుసు కదా గిరీ, అయినా ఈ పనులు..?” అర్థోక్తిగా నేను ఆగిపోయినా నేను చెప్పాల్సింది గిరికి అర్థం కాకుండా ఉండదు.
“మా తమ్ముడు బాగా గొడవ పెట్టాడురా సుధీర్. ఈ సారి టికెట్ ఖరీదు కూడా చాలా ఎక్కువ. అయినా తప్పలేదు. నా ప్రోజెక్ట్ నాకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. కానీ ఏమిటో నాకు సినిమా బలహీనత, మా నాన్నకు పేకాట బలహీనత. అయినా నా వర్క్ లో హెల్ప్ చేయడానికి మీరంతా ఉన్నారు కదా!” నా కళ్ళలోకి చూడకుండా తన ల్యాప్‌టాప్ లో ఏవో ఫోల్డర్స్ వెతుకుతూ అన్నాడు గిరి. జీవితంలో ప్రయారిటీస్ గురించి ఉపదేశించే ఓపిక నశించి చాలా కాలం అయింది. అందుకే ఇంకేమీ మాట్లాడలేదు నేను.
“నిన్న చూసిన బెనిఫిట్ షో గురించి మేము చేసిన వీడియో లింకు పెడతాను, చూసి లైక్ చెయ్యరా” అంటూ వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు గిరి.
పరుగుపందెంలో అయినా రన్నర్స్ కాసేపు ఊపిరి తీసుకుంటారేమో, మా రేస్ లో ఊపిరి తీసుకోవడం ఉండదు. డేటా అనలిస్ట్ ఉద్యోగం అంటే ఏమిటో నన్ను అడిగితే చెప్తాను. ఎవరు చెప్పారు టెక్నాలజీ పెరిగిన తర్వాత పనులు సులువు అయ్యాయని? అన్నింటినీ అనలైజ్ చేస్తూ, మా సొంత జీవితాన్ని అనలైజ్ చేసే సమయమే ఉండదు మాకు. ఈ రోజు శుక్రవారం అని గుర్తు చేసుకుంటేనే ఎంతో హాయిగా అనిపిస్తుంది. శనివారం హోటల్ అవర్ యూనివర్స్ లో గడిపే ప్రోగ్రామ్ వేసుకున్నాను మరి!
నా ప్రక్కనే ఉన్న గ్లాస్ వాల్ లో నీళ్ళు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. ప్రతి మూలా ఇండోర్ ప్లాంట్స్, టెబుల్స్ అన్నీ ఫిల్ అయి ఉన్నాయి. నా టేబుల్ దగ్గర మాత్రం నేను ఒక్కడినే ఉన్నాను. చాలా కాస్ట్లీ హోటల్ ఇది. వారానికి ఒక్క రోజైనా, అంటే శనివారమో, ఆదివారమో ఇక్కడ కాఫీ తాగడానికి వస్తూ ఉంటాను నేను. ఏంబియన్స్ అంత బావుంటుంది. ఒక్కళ్ళమే కూర్చుని, గ్లాస్ వాల్ బయటికి చూస్తూ, కాఫీ సిప్ చేయడం ఎంత బావుంటుందో తెలుస్తుంది.
ఆ హాల్ పేరు జూపిటర్. పెద్ద హాల్. ఈ హోటల్ లో ప్రత్యేకత ఏమిటంటే ఉన్న తొమ్మిది హాల్స్ కు తొమ్మిది గ్రహాల పేర్లు ఉండడం. తొమ్మిదవ గ్రహం ప్లూటో ని ఇపుడు మన సౌర కుటుంబం నుండి తొలగించారు కదా, ఇంకా తొమ్మిదవ హాల్ పేరు అదే ఎందుకు ఉంచారని అడిగాను మేనేజర్ ని ఒక రోజు. అతను నవ్వాడు. తమ సీ ఈ ఓ ని అడిగి చెప్తానన్నాడు. ఇప్పటికీ చెప్పలేదు.
జూపిటర్ ఏంబియన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నా కాఫీ పొగలు కక్కుతోంది. బుద్ధి నరాలు వికసిస్తున్నట్టు, మెదడులో పేరుకుపోయిన మంచు పొరలు ఒక్కో సిప్ తో విడిపోతున్నట్టు ఫీలింగ్ నాకు.
“ఈ మధ్య కాఫీ షాప్ ల సంస్కృతి బాగా పెరిగింది. అక్కడ పని చేసుకోవచ్చు, మీటింగ్స్ పెట్టుకోవచ్చు, ఎంత సేపైనా గడపవచ్చు. ఒక్క కాఫీ ఆర్డర్ తో..” రాధ చెప్పిన కాఫీ డే కి వచ్చే శనివారం వెళ్ళాలి.
నా కాఫీ నాలుగో సిప్ కి అనుకుంటా, జూపిటర్ స్టాఫ్ లో కలకలం మొదలు అయింది. స్టాఫ్ హడావుడిగా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేస్తున్నారు. క్రొత్త ఆర్డర్స్ చెప్తే, అవి అయిపోయాయి అంటున్నారు. ప్రవేశ ద్వారం దగ్గర ఒక అమ్మాయి నిలుచుంది. చిరునవ్వుతో లోపలికి రాబోయిన క్రొత్త కస్టమర్స్ ను ప్రక్క గ్రహానికి మళ్ళిస్తోంది. నాకు కాఫీ తీసుకొచ్చిన బరిస్టా నా దగ్గరకు వచ్చి నిలుచున్నాడు, కాష్ పేయింగ్ మిషన్ తో.
“నా కాఫీ ఇంకా అవ్వలేదు, ఈ రోజు భోజనం కూడా ఇక్కడే” నవ్వుతూ చెప్పాను అతన్ని వెళ్లిపొమ్మని సైగ చేస్తూ. జూపిటర్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బేవరేజస్, టిఫిన్స్, భోజనం అన్నీ సర్వ్ చేస్తారు. నీళ్ళు నములుతున్నట్టు ఏదో గొణిగాడు అతగాడు. నాకు అర్థం కాలేదని అర్థమై, గొంతు సవరించుకుని, “ఇక్కడ సర్వింగ్ ఆపేస్తున్నాము సార్. మీరు ప్రక్క ప్లానెట్ లో భోజనం ఆర్డర్ చేయవచ్చు” అన్నాడు.
అప్పటికే ముప్పావు హాల్ ఖాళీ అయిపోయింది. కొందరు ఇంకా తింటున్నారు. వారి అందరి దగ్గరా ఒక్కో స్టీవర్ట్ బిల్ చేయడానికి అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
నేను స్టీవర్ట్ మాటలను పట్టించుకోలేదు. కాఫీ అయ్యాక రమ్మని పంపేశాను. ఐదు నిముషాలకు హాల్లో నా టేబుల్ దగ్గర నేను, నాకు కుడి ప్రక్కన ఒక టేబుల్ దాటి ఉన్న ఇంకో టేబుల్ పై ఒక కుటుంబం మిగిలాము. మేము కూడా వెళ్లిపోతామని అనుకున్నట్టున్నారు, టేబుల్స్ అన్నీ శుభ్రం చేసేశారు. మేనేజర్ ఒకటి. రెండు ఫోన్ కాల్స్ అటెండ్ చేసి, అందరికీ ఏవో సూచనలు ఇచ్చాడు.
నా కుడి ప్రక్కన ఉన్న కుటుంబం తల్లి, తండ్రి, ఒక ఎనిమిదేళ్ల పాప. ఆ పాప నెమ్మదిగా తింటోంది. హడావుడిగా వాళ్ళ చుట్టే తిరుగుతున్న స్టీవర్ట్ ను విసుగ్గా చూసిన తల్లి, అతన్ని దగ్గరికి పిలిచి ఏదో చెప్పింది. అతను దూరంగా వెళ్ళిపోయాడు.
ఈ లోపు జూపిటర్ లో ఉన్న మూడు పెద్ద టెబుల్స్ ను ఒక యాభై మందికి సరిపోయేలా కలిపి సర్దారు అక్కడి స్టాఫ్. హాల్లో ముప్పావు భాగం ఇక ఖాళీ లేదు. మేము హాల్ ఎంట్రెన్స్ లో కూర్చున్నాము కాబట్టి, నా టేబుల్, పాప వాళ్ళ టేబుల్ జోలికి రాలేదు వాళ్ళు.
రెండు నిముషాలకు హాల్ తలుపులు తెరిచి పట్టుకుంది ప్రవేశ ద్వారం దగ్గర నిలుచున్న అమ్మాయి. ముందు ఒక నలుగురు లోపలికి వచ్చారు, హాలంతా పరికించి చూసి, చేత్తో సైగ చేయగానే దాదాపు యాభై మంది లోపలికి వచ్చారు. ఎవరో పార్టీ చేసుకోవడానికి బుక్ చేసుకున్నట్లున్నారు అనుకున్నాను నేను.
“సార్, మీ బిల్ చేస్తాను. కార్డ్ ఇస్తారా?” పరుగున నా దగ్గరకు వచ్చిన బరిస్టా అడిగాడు.
“సార్, మీ బిల్ చేస్తాను. కార్డ్ ఇస్తారా?” పరుగున పాప తండ్రి దగ్గరకు వెళ్ళి అడిగాడు ఇంకో స్టీవర్ట్.
“కాఫీ అయ్యాక పిలుస్తాను” అన్నాను నేను కూల్ గా.
“పాప తినడం పూర్తి కాలేదు, కాసేపు ఆగి రా” అన్నాడు పాప తండ్రి.
ఇరవై మంది కూర్చున్న టేబుల్ లో హెడ్ చైర్ పై కూర్చున్న వ్యక్తి తన హూడీ విప్పి ప్రక్కన పెట్టాడు. అతని ముఖం చూసి ఆశ్చర్యపోయాను నేను. అతను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హీరో, దినకర్. అతని ప్రక్కన ఉన్నామె రాగిణి, ఇపుడిపుడే తెలుగు సినిమాల్లో చేస్తోంది. ఆమె నటించిన సినిమాలు రెండు మూడు చూశాను నేను.
నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకుందామా అని అనుకున్నాను. వాళ్ళు చాలా సీరియస్ గా చర్చించుకుంటున్నారు. వాళ్ళను డిస్టర్బ్ చేయబుద్ధి కాలేదు నాకు. అయినా ఈ వారంలో ప్రశాంతంగా తాగుతున్న నా కాఫీని వదిలి వెళ్లాలని అనిపించడం లేదు. హాల్లో మంద్రంగా వినిపిస్తున్న సంగీతం ఒక్కసారిగా ఆగిపోయింది. కాఫీకీ, ఇన్స్ట్రుమెంటల్ సంగీతానికీ ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సంగీతం ఆగిపోవడానికి కారణం సినిమా వాళ్ళ మాటల హోరు ఆ సంగీతాన్ని డామినేట్ చేయడమే కారణం అనుకుంటా!
నా దగ్గరకు మూడో సారి వచ్చిన బరిస్టా ఇచ్చిన సమాచారం ప్రకారం దినకర్, రాగిణి, ఇతర నటులు ఈ ఊర్లో షూటింగ్ కోసం వచ్చారు. షూటింగ్ ప్యాక్ అప్ అయిన వెంటనే ఏదో చర్చల కోసం ఈ హాల్లోకి వచ్చారు. రాత్రికి నైట్ ఘాట్ కూడా ఉండడం వల్ల తమకు ఇచ్చిన హోటల్ కి వెళ్ళకుండా ఘాట్ కి దగ్గరలో ఈ హోటల్ ఉండడంతో ఇక్కడికి వచ్చారు. సినిమా వాళ్ళు హీరోతో చర్చలు మొదలు పెట్టారు. వాళ్ళ నవ్వులు, మాటలు ఎక్కువ అయ్యాయి. వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తే మనలాగే మాట్లాడుకుంటున్నారు. జోక్స్ వేస్తున్నారు, మనలానే తింటున్నారు, తాగుతున్నారు, చర్చల సమయంలో మనలానే వాదించుకుంటున్నారు, కొందరు శాంతపరుస్తున్నారు. అంతా మనలానే. మనలాంటి భావోద్వేగాలే, మనలాంటి చామత్కారాలే! ఈ ఆలోచన వచ్చినందుకు నన్ను చూసి నేనే నవ్వుకున్నాను. వాళ్ళేమీ ఇతర గ్రహం నుండి వచ్చినవారు కాదు కదా!
జూపిటర్ ముఖద్వారం దగ్గర కొందరు తచ్చాడుతూ కనిపించారు. గ్లాస్ డోర్ కావడం వల్ల లోపల ఏమి జరుగుతుందో కనిపిస్తుంది. కాసేపటికి ఆ కొందరి సంఖ్య పెరిగింది. ఇంకాసేపటికి హాల్ బయట హడావుడి పెరిగింది. డోర్ దగ్గర నిల్చున్న అమ్మాయిని వాళ్ళు ఏదో అడిగారు. ఆమె తల అడ్డంగా ఊపింది. కాసేపటికి హాల్ బయట ఉన్న ఫౌంటెన్ దగ్గర ఉన్న మొక్కలను విసిరేయడం మొదలు పెట్టారు. సెక్యూరిటీ వాళ్ళు అప్పటికే జూపిటర్ బయట ఉన్నారు. వాళ్ళను నిలువరించడానికి సెక్యూరిటీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. జనాలు లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ప్రవేశ ద్వారాన్ని బలంగా తోస్తున్నారు. ఇంకాసేపటికి బయట ఉన్న ఇతర డెకోరేటివ్ ఐటెమ్స్ ను విరగగొట్టడం మొదలైంది.
సినిమా వాళ్ళు తమ చర్చలు కొనసాగిస్తూనే తలుపు వైపు చూస్తున్నారు. బయటికి వెళ్తే జనాలను కంట్రోల్ చెయ్యడం సాధ్యం అవుతుందా కాదా అని తర్జన భర్జన పడుతున్నట్టు ఉన్నారు. స్పష్టంగా వాళ్ళ మాటలు అర్థం కావడం లేదు నాకు.
బయట గొడవ ఎక్కువ అయింది. పాప నెమ్మదిగా తింటోందని ఆమె తండ్రి ఆమెకు భోజనం తినిపించడం మొదలు పెట్టాడు. బయట గొడవ ఇంకా పెరిగింది. మేనేజర్ హీరో దగ్గరకు భయం భయంగా వెళ్ళాడు. నవ్వుతూ ఏదో మాట్లాడాడు. తన దగ్గర ఉన్న ఒక చిన్న పుస్తకం తీసి ఇచ్చాడు. దినకర్ నవ్వుతూ ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఇచ్చాడు. మిగిలిన స్టాఫ్ అందరూ హీరో దగ్గరకు వెళ్లిపోయారు. పాప తండ్రి ఇంకేదో ఆర్డర్ చేయాలని పిలుస్తున్నా ఎవరూ వినిపించుకోలేదు.
పాప ఏదో మాట్లాడుతోంది కానీ నేనున్న చోటికి వినపడలేదు. అప్పుడే పాప చేసిన సైగ చూసి అర్థమైన నేను గబగబ నా టేబుల్ మీద ఉన్న నీళ్ళ సీసా తీసుకుని ఆ టేబుల్ దగ్గరకు వెళ్ళాను. తింటున్నది గొంతుకు అడ్డు పడినట్లుంది. పాప మింగలేకపోతోంది. నా వద్ద నుండి నీళ్ళ సీసా తీసుకుని నీళ్ళు పట్టించిన ఆ తండ్రి నా వైపు కృతజ్ఞతగా చూశాడు. తన కుర్చీలో ఇబ్బందిగా కదిలింది పాప. అప్పుడు చూశాను నేను. రెండు కాళ్ళకూ కట్లు, కుడిచేతికి కూడా కట్టు ఉంది. అందుకేనేమో ఆమె ఎడమ చేతితో తింటూ ఉంది ఇంతసేపు! నా ఆలోచన గమనించినట్లు పాప తల్లి, “వారం క్రితమే పాపకు రెండు కాళ్ళకు ఆపరేషన్ అయింది. కొన్ని గంటల క్రితమే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. సాయంత్రం ట్రైన్ ఉంది మా ఊరికి” అంది.
వేరే ఊరి నుండి పాప ఆపరేషన్ కోసం ఇక్కడ హాస్పిటల్ కి వచ్చారన్న మాట. వారి పక్కన ఉన్న లగేజీ అప్పుడు గమనించాను నేను. పాప నన్ను చూసి నవ్వింది. నేను కూడా చిన్నగా నవ్వి, అయ్యో అనే భావన నా ముఖంలో కనబడకుండా జాగ్రత్తపడుతూ నా టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను.
ఎంట్రెన్స్ వద్ద ఉన్న అమ్మాయి పరిస్థితి ఘోరంగా ఉంది. తలుపులు బద్దలు కొట్టేలా ఉన్నారు జనాలు.
పాప తండ్రి మేనేజర్ దగ్గరకు వెళ్ళి గట్టిగా ఏదో అడిగాడు. మేనేజర్ అఇష్టంగానే పాప టేబుల్ దగ్గరికి వచ్చాడు. పాప తండ్రి ఇంకా ఏదో అంటూనే ఉన్నాడు. చూపుడు వేలు చూపించి ఏదో అంటుంటే, మేనేజర్ పాపను చూసి, హీరో వైపు చూపించాడు. పాప ఏమందో తెలియదు, మేనేజర్ ముఖం మాడిపోయింది.
మేనేజర్ తిరిగి సినిమా జట్టు దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడాడు. అప్పటికే విషయం గ్రహించిన వాళ్ళు ఏదో చెప్పారు. ఎంట్రెన్స్ దగ్గర ఉన్న అమ్మాయికి సందేశం వెళ్ళింది. డోర్ బయట సెక్యూరిటీ వాళ్ళు పది మంది నిలుచున్నారు. అమ్మాయి తలుపు తీసి రివ్వున వెనుతిరిగి హాల్ కి ఆనుకుని ఉన్న స్టాఫ్ కేబిన్ లోకి పారిపోయింది. గుంపు యొక్క ఉన్మాదం మరిగే స్థాయికి చేరుకోవడంతో, మరింత విధ్వంసం జరగకుండా ఉండటానికి హోటల్ సిబ్బంది అయిష్టంగానే తలుపులు తెరిచారు.
అంతే! సెక్యూరిటీ వాళ్ళను తోసుకుంటూ, తొక్కుకుంటూ జనాలు లోపలికి వచ్చేశారు. ఈ పరిణామం ముందే ఊహించిన పాప పేరెంట్స్ ఇద్దరూ పాపను ఎత్తుకుని నా టేబుల్ దగ్గరకు వచ్చేశారు. అయినా జనప్రవాహం ముందు నిలదొక్కుకోవడం చాలా కష్టం అయింది మాకు. అభిమానులు మరియు ఆటోగ్రాఫ్ కోరేవారి అరుపుల అస్తవ్యస్తమైన పోటులో గుంపు పెరుగుతుంది.
లోపలి పరిస్థితి ఇంకా ఘోరంగా మారక మునుపే బయటికి వెళ్లిపోవాలి. పాప ముందుకు తోసుకుంటూ, తొక్కుకుంటూ వెళ్తున్న జనాలను విప్పారిన కళ్ళతో చూస్తూ ఉంది. ఆమె తల్లిదండ్రుల ముఖంలో మాత్రం విపరీతమైన ఒత్తిడి. వాళ్ళు చెప్పినపుడే బయటికి వెళ్లిపోవాల్సిందేమో అనుకున్నాను ఒక క్షణం. అయినా సినిమా వాళ్ళు వస్తున్నారని చెప్పలేదు కదా వాళ్ళు!
గందరగోళంలో, నేను అనారోగ్యంతో ఉన్న అమ్మాయిని గుర్తించాను, ఆమె తల్లిదండ్రులు ఆమెను రక్షించడానికి పిచ్చిగా ప్రయత్నిస్తున్నారు. గుంపు గోడకు అతుక్కుపోయిన మమ్మల్ని కూడా వదలలేదు. తోసుకుంటూ పోవడమే! నేను సినిమా వాళ్ళ వైపు చూశాను. నాకేమీ కనిపించలేదు ఆ గుంపులో ఎవరు ఎవరో తెలియడం లేదు. వెనుక ఉన్న వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు అన్నట్టు ఉన్నారు. ఆలోచించకుండా, నేను ఆమెను నా భుజంపైకి ఎక్కించుకుని ముందుకు నెట్టాను, ఆమెకు హాని కలగకూడదు. ఇది ఒక పోరాటం. నేను గుంపు గుండా ఒక మార్గాన్ని సుగమం చేసుకోవడం మామూలు మాటలు కాదు!
ఆమె తల్లిదండ్రులు నన్ను అనుసరించారు. ఉద్ధృతితో పారుతున్న నదికి ఎదురీదడంలా ఉంది మా పరిస్థితి. ఎవరికీ పక్కవాళ్ళ పట్ల కనికరం లేదు. వాళ్ళ చూపంతా హాల్ కి అటు వైపు ఉన్న సినీ జనాలపైనే ఉంది. అదే గమ్యం, అందుకోసమే పోరాటం. దారిలో అడ్డుగా ఉన్న టెబుల్స్, చైర్స్ చేత్తో తీసి విసిరేస్తున్నారు, కాలితో తన్నేస్తున్నారు. వస్తువులను ఏమి ఖర్మ, ముందున్న జనాలను తోసుకుంటూ, తొక్కుకుంటూ పోతున్నారు.
మేము అతి కష్టం మీద ఎంట్రెన్స్ దగ్గరికి చేరే సరికి పోలీసులు రంగప్రవేశం చేశారు. వారి వెనుకే కెమెరాలతో మీడియా వాళ్ళు ప్రవేశించారు.
ఎంట్రెన్స్ దాటి ఫౌంటెన్ దగ్గర విరిగిన మొక్కల కుండీల దగ్గర ఆగి ఊపిరి పీల్చుకున్నాము మేము. నేను చుట్టూ జరిగిన విధ్వంసాన్ని చూస్తూ ఉంటే, పాపను నా భుజం మీద ఉండగానే తన కాళ్ళు, చేతులు తడిమి చూసుకున్నారు ఆమె తల్లిదండ్రులు. పాప అలసిపోయినట్లు ఉంది. నీరసంగా తలవాల్చి, కళ్ళు మూసుకుంది కాసేపు. కాస్త స్థిమిత పడడానికి మాకు పది నిముషాలు సమయం పట్టింది.
ఇక బయటికి నడుద్దాం అనుకునే లోపు చివరిగా హోటల్లోకి ప్రవేశించిన మీడియా వాళ్ళు కొందరు లోపలికి వెళ్ళే దారి లేక మా దగ్గరికి వచ్చారు. రావడం రావడం మా పర్మిషన్ ఏమీ ఆడగకుండానే కెమెరాలు సిద్ధం చేసుకుని, మమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మేము ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం అనే దానితో వాళ్ళకు సంబంధమే లేదు. యుద్ధంలో ఎదుటి దేశపు సైనికుడు దొరికిన వెంటనే కాల్చేయాలి అన్నట్టు మా వైపు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు.
“మీరు లోపలి నుండే వచ్చారా?”
“లోపల ఏమి జరిగినది?”
“లోపల సినిమా జనాలు ఉన్నట్టు ప్రజలకు ఎలా తెలిసింది?”
“లోపల ఎవరైనా గాయపడ్డారా?”
“సినిమా వాళ్ళ పరిస్థితి ఏమిటి?”
ఒక ప్రశ్న వెంట ఇంకో ప్రశ్న!
నేను గానీ, పాప తల్లిదండ్రులు గానీ సమాధానం ఇచ్చేలోగానే పాప ఒక మీడియా ఆమెను చూస్తూ, “ఆంటీ, నేను లోపలికి వెళ్ళాలి. హీరో, హీరోయిన్ లను చూడాలి. నన్ను తీసుకువెళ్తారా?” అని అడిగినది.
అప్పటివరకూ మేము లోపలి నుండి వచ్చాము అనుకున్న వాళ్ళు కాస్తా, మేము సినిమా బృందాన్ని చూడడానికి వచ్చామనుకుని ఇంటర్వ్యూ తీరు మార్చేశారు.
“చూడండి, ఇక్కడ ఒక అనారోగ్యంతో ఉన్న పాప సైతం హీరో, హీరోయిన్ మీద అభిమానంతో తన తల్లిదండ్రులను తీసుకుని వాళ్ళను కలవడానికి ఇక్కడికి వచ్చింది. అసలు లోపల ఇసుక వేస్తే రాలని జనం! ఈ పాప కోరిక తీరుతుందా? తాను అభిమానించే నటులను ఈమె కలుసుకోగలుగుతుందా?”
ఒకాయన మా పక్కనే నిలబడి కెమెరాతో ఏదేదో మాట్లాడేస్తున్నాడు.
పాప తల్లి పాపతో ఏదో చెప్పింది చెవిలో. పాప తల అడ్డంగా ఊపింది.
పాప తండ్రి నిస్సహాయంగా చూస్తూ నిలుచున్నాడు. ఇంకో రెండు గంటల్లో వాళ్ళ ఊరు వెళ్ళే ట్రైన్ ఉంది.
ఇంత కష్టపడి లోపలి నుండి బయటకు బ్రతుకు జీవుడా అనుకుంటూ వస్తే మళ్ళీ లోపలికి అంటుందేమిటి పాప!!
మీడియా వాళ్ళు ఒక నిముషం ఏదో చర్చించుకున్నారు. తర్వాత మా వైపు తిరిగి, “పాపను లోపలికి మేము తీసుకువెళ్తాం, మీరు ఖంగారు పడకండి. ఆమె కోరిక మేము తీరుస్తాం” అంటూ పాపను చేతిలోకి తీసుకోబోయారు.
పాప తండ్రి ఉలిక్కిపడ్డాడు. పాపను ఎత్తుకునే, ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.
పోలీసులు కొంత మంది చొప్పున, జనాలను బయటికి తీసుకువస్తున్నారు.
పాప తల్లి వెళ్లిపోదాం అంటూనే ఉన్నా, పాప తల అడ్డంగా ఊపుతూ, లోపలికి వెళ్దామని చెయ్యి అటు వైపే చూపిస్తుంది. పాపతో మాట్లాడే సమయం కూడా లేకుండా మీడియా వాళ్ళు అక్కడ హడావుడి చేస్తూనే ఉన్నారు.
“శ్వేతా, శ్వేతా, చూడు ఇన్స్పెక్టర్ గారు ఇటే వస్తున్నారు” మీడియా గుంపులోంచి ఎవరో ఆమెను ముందుకు తోసారు. ఆమె పేరే శ్వేత అనుకుంటా. హాల్ నుండి బయటకు వస్తున్న ఇన్స్పెక్టర్ వైపు హడావుడిగా వెళ్ళింది ఆమె. ఆయన్ని తీసుకువచ్చి పాప ప్రక్కన నిలబెట్టి ఫోటోలు తీశారు. ఇంటర్వ్యూ తీసుకున్నారు.
“నేను ప్రయత్నం చేస్తాను. పాప కోరికను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను” అని ప్రతిన బూనిన ఆయన మళ్ళీ జూపిటర్ లోకి వెళ్ళి, పది నిముషాల్లో తిరిగి వచ్చాడు.
నేను ప్రేక్షకుడిలా మిగిలిపోయాను. అసలు జనాలు హాల్లోకి రాకముందు పాప అక్కడే ఉంది, భోజనం చేస్తూ. అప్పుడు అడిగినా తల్లిదండ్రులు సినిమా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లలేదేమో! అలా అనుకున్నా, అది కరెక్ట్ అనిపించలేదు నాకు. పాపను బయటికి తీసుకువస్తున్నప్పుడు పాప నుండి అటువంటి స్పందన ఏమీ కనిపించలేదు.
కాసేపటికి శ్వేత పాపను ఎత్తుకుంది. ఇన్స్పెక్టర్ గారు ముందు నడుస్తూ ఉండగా, మీడియా ముందు, వెనుక కూడా కవర్ చేస్తూ ఉండగా.. మేము తిరిగి జూపిటర్ లోకి నడిచాము.
నేను బయటికి వెళ్లిపోదాం అనుకున్నాను. ఎందుకో వెళ్లలేకపోయాను. వారితోనే లోపలికి నడిచాను.
లోపల ఇంకా కొంతమంది ఫాన్స్ ఉన్నారు. ఇంకా ఫోటోలు, ఆటోగ్రాఫ్ లు అవుతున్నాయి. కానీ ఇందాకటి అంత రద్దీ లేదు.
లోపలికి నడుస్తూ, “నీకు ఈ హీరో, హీరోయిన్ అంటే అంత ఇష్టమా పాపా? ఒంట్లో బాగాలేకపోయినా వాళ్ళను కలవాలని ఇంత పట్టు పడుతున్నావు? భలే ముచ్చటగా ఉంది” అంటోంది శ్వేత.
పాప ఏమీ మాట్లాడలేదు. ఆమె చూపు హాల్ లోకి ప్రసరించింది. కుర్చీలు, టెబుల్స్ చిందర వందరగా పడి ఉన్నాయి. కొన్ని చోట్ల నీళ్ళ సీసాలు పడి ఉన్నాయి. కొన్ని చోట్ల గోడలకు తగిలించిన ఫోటోలు పగిలి క్రింద పడ్డాయి. కొన్ని గోడలకు వంకరగా వేలాడుతున్నాయి. సినిమా వాళ్ళు కూర్చున్న చోట పింగాణీ కంచాలు పగిలి క్రింద పడి ఉన్నాయి.
వాళ్ళందరి ముఖాలు కూడా వాడిపోయి, అలసిపోయి ఉన్నాయి.
దగ్గరకు వెళ్ళిన తర్వాత గానీ పాపను గమనించలేదు వాళ్ళు.
వెంటనే ప్రక్కనే ఉన్న కుర్చీ ఒకటి లాగి పాపకు వేశారు ఎవరో. పాప సర్దుకోవడానికి కాస్త ఇబ్బంది పడినా, కూర్చుంది. ఆమె వెనుక ఆమె తల్లిదండ్రులు నిలబడ్డారు, పాపకు అభిముఖంగా నేను నిలబడ్డాను. సినీ బృందం కాస్త వెనుక ఉన్నారు. హీరో దినకర్, హీరోయిన్ రాగిణి మాత్రం పాపను సమీపించారు. మీడియా వాళ్ళ కెమెరాలు క్లిక్ క్లిక్ మంటూనే ఉన్నాయి.
దినకర్ ముఖంలో ఒక రకమైన భావన. అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఆ మధ్య ఎపుడో కేన్సర్ పేషెంట్ ఒక అబ్బాయి కోరిక మేరకు ఆ అబ్బాయిని కలవడానికి వెళ్ళిన ఒక హీరో, ఆ హీరో ఫాన్ ను అని ఆ అబ్బాయి మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఆ హీరోను కలవడం తన జీవితంలో జరిగిన అత్యుత్తమ సంఘటన అని చెప్పడం గుర్తుకు వచ్చింది నాకు.
హీరోయిన్ రాగిణి పాప బుగ్గను మెత్తగా నిమిరింది. ఒక అనారోగ్యంతో ఉన్న పాపకు, రెండు కాళ్ళకు ఆపరేషన్ అయిన పాపకు తాము ఆటోగ్రాఫ్ ఇవ్వబోతున్నాము, ఆమెతో కొన్ని క్షణాలు గడపబోతున్నాము అన్న ఉద్విగ్నత కనపడుతోంది వారిలో. ఇదొక రకమైన సినిమా ప్రమోషన్ అన్నట్లు ఉంది. ఇంకా షూటింగ్ పూర్తి కాని సినిమాకి ఇంత గొప్ప ప్రమోషన్!
పాప తండ్రి మాటి మాటికీ తన గడియారం వైపు చూసుకుంటున్నాడు. ఆమె తల్లి ఫోన్ లో పదే పదే వస్తున్న కాల్ ను కట్ చేస్తూ ఉంది. హాల్లో అప్పటివరకూ ఉన్న డిమ్ లైట్స్ స్థానంలో ఎక్కువ వెలుతురు ఇచ్చే లైట్స్ స్విచ్ ఆన్ చేశారు, మీడియా వాళ్ళ లైట్స్ ఉండనే ఉన్నాయి.
“నీ పేరు ఏమిటి పాపా? ఏమి చదువుతున్నావు? మీరు మా అందరికీ స్ఫూర్తి. మీలాంటి అభిమానులను కలిగి ఉన్నందుకు మేము చాలా కృతజ్ఞులం. నీకు దినకర్ ఇష్టమా, నేను ఇష్టమా? నేనే అని చెప్పూ..” జోవియల్ గా మాట్లాడుతూ అంది హీరోయిన్.
కెమెరాలు అన్నీ వీడియో మోడ్ లోకి వెళ్లిపోయాయి.
పాప ఈ కాసేపట్లో నీరసాన్ని అధిగమించినట్లు ఉంది. అక్కడ ఉన్న నీళ్ళ సీసా వైపు చూపించింది. ఎవరో గబుక్కున నీళ్ళ సీసా అందించారు. పాప తండ్రి మూత తీసి నీళ్ళు తాగించాడు.
పాప నవ్వడం లేదు. కళ్ళలో ఏదో నిశ్చయం. తనకు నచ్చిన సినిమా వాళ్ళను కలుస్తున్న సంతోషం ఏమీ కనబడడం లేదు. ఆ మీమాంస అందరికీ ఉన్నట్లుంది. పాప నోరు విప్పింది. ఒక చేత్తో రాగిణి చెయ్యి పట్టుకుని, కాన్వా ఉన్న ఇంకో చేత్తో హాలంతా చూపిస్తూ, “ఇదంతా ఏమిటి ఆంటీ?” అంది.
వీడియో మోడ్ లో ఉన్న కెమెరాలు అన్నీ వీడియో ఆపాలో, వీడియో తియ్యడం కొనసాగించాలో అర్థం కాక సతమతం అవుతూ ఉండగానే, “నా పేరు కృతి. మాది ఈ సిటీకి దూరంగా ఉన్న ఒక చిన్న ఊరు. నా కాళ్ళలో నారాల్లో ఏదో ఇబ్బంది వచ్చింది. ఆపరేషన్ చేయించడానికి అమ్మా, నాన్నా ఇక్కడి హాస్పిటల్ కి తీసుకువచ్చారు. వారం నుండి ఇక్కడే ఉన్నాము. ఈ రోజే డిశ్చార్జ్ చేశారు. నాకు ఈ హోటల్ గురించి మా ఫ్రెండ్ చెప్పింది. తొమ్మిది గ్రహాల పేర్లు తొమ్మిది హాల్స్ కి ఉంటాయని. ఈ హోటల్ చూస్తానని చెప్తే ఇక్కడికి తీసుకువచ్చారు.” అంటున్న ఆమెను మధ్యలోనే ఆపి, హీరో కొంత డబ్బు తీసి పాప చేతిలో పెట్టబోయాడు.
పాప చూసిన చూపుకి అక్కడి వారందరూ ఖంగు తిన్నారు. అంత కఠినంగా చూసింది.
చేత్తో ఆ డబ్బును తోసేస్తూ, “మా నాన్న ఒక కంపెనీలో పని చేస్తాడు. అమ్మ బట్టలు కుడుతుంది. నా ఆపరేషన్ చేయడానికి నాన్న అప్పు చేశాడు. ఇంకో నాలుగేళ్ళు తీర్చాలంట ఆ అప్పు. నేను మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడగలేదు. మా అమ్మానాన్నా ఆ అప్పు తీర్చగలరు. నేను ఇక్కడ హోటల్ లో భోజనం చేస్తున్నప్పుడు నన్ను ఈ హోటల్ వాళ్ళు త్వరగా తినమని ఖంగారు పెట్టారు, త్వరగా డబ్బులు కట్టేసి వెళ్ళమన్నారు. నాన్న ఇంకో కప్పు పెరుగు అడిగితే, అయిపోయింది అన్నారు. మీరు వచ్చిన తర్వాత అందరూ మీ దగ్గరే ఉండిపోయారు. మా దగ్గర ఉన్న నీళ్ళు అయిపోయాయి. నేను భోజనం చేస్తూ ఉండగా పొలమారింది. ఇంకో నీళ్ళ సీసా కోసం నాన్న పిలిచినా ఎవరూ రాలేదు. మేము ఇక్కడ భోజనం చేయడానికి వచ్చిన కస్టమర్స్ ము కదా! మాకు సరిగ్గా అన్నీ చూసుకోవాల్సింది ఇక్కడ పని చేసేవారే కదా! డబ్బులు కట్టి తినే భోజనమే కదా!” మళ్ళీ నీళ్ళు తాగడం కోసం ఆగింది పాప.
ఇపుడు హోటల్ మేనేజర్ మీడియా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. కెమెరాలు ఆపమని. కొందరు ఆపేశారు. నేను నా ఫోన్ బయటకు తీసి, వీడియో తియ్యడం మొదలు పెట్టాను.
అప్పటికే సినిమా బృందం ముఖాలు మాడిపోయాయి. ఎలా స్పందించాలో అర్థం కాక పాప వైపే చూస్తూ ఉండిపోయారు.
పాప కొనసాగించింది, “మీరు వచ్చారు, బయట జనాలకు ఎలా తెలిసిందో కానీ అందరూ తలుపులు బాదారు. మిమ్మల్ని చూడడానికే అంత పిచ్చి ఎందుకు? నా కాళ్ళకు కట్లు ఉన్నాయని మాకు ఫుడ్ సర్వ్ చేసిన వాళ్ళు, మేనేజర్ అంకుల్ కూడా చూశారు. జనాలను వదిలితే నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించలేదు. ముందు అందుకే వెళ్లిపొమ్మని ఉండవచ్చు. కానీ ఆ విషయం మాకు చెప్పాలి కదా! మా స్కూల్ లో కస్టమర్స్ డే చేసినపుడు మా టీచర్ చెప్పారు. మనం డబ్బులు చెల్లించి అందుకునే వస్తువయినా, పని అయినా, మనకు గట్టిగా అడిగే హక్కు ఉందని. అందుకే అడుగుతున్నాను.” చుట్టూ చూస్తూ, ఒక్కో స్టీవర్ట్ పైనా చూపు నిలుపుతూ, చివరికి మేనేజర్ పై చూపు కేంద్రీకరించి చెప్పడం ఆపింది పాప.
సినీ బృందం ముఖాలు కాస్త సర్దుకున్నాయి. ఇదంతా హోటల్ సిబ్బంది గురించి అని కాస్త స్థిమితపడ్డాయి.
పాప దినకర్ ను దగ్గరికి పిలిచింది. సందేహిస్తూనే దగ్గరకు వచ్చాడు దినకర్. అతని చెయ్యి తడిమింది. ముఖాన్ని దగ్గరగా చూసింది. “మా పక్కింట్లో ఉండే అన్నయ్య ఒక హీరో సినిమా రిలీజ్ కి కటౌట్ కట్టడానికి అర్థరాత్రి వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాలేదు. ఎత్తు నుండి పడి చచ్చిపోయాడు. ఆ విషయం మా స్కూల్లో, ఇంట్లో కూడా మాట్లాడుకున్నాము. సినిమా వాళ్ళు కూడా మనుషులే అని, సినిమాల్లో నటించడం వారి వృత్తి అని మా టీచర్ చెప్పారు. ఇపుడు నిన్ను చూశాను కదా అంకుల్, నువ్వు కూడా మాలాగే ఉన్నావు. మరి నిన్ను చూడడానికి ఇంత మంది ఎందుకు అలా పిచ్చెక్కిపోయారు?”
“సినిమా వాళ్ళది కూడా మా అమ్మా,నాన్నల్లానే ఒక ప్రొఫెషన్ అని చెప్పింది అమ్మ. మీ ఉద్యోగం మీరు చేస్తున్నారు. నచ్చితే నచ్చిందని చెప్పడానికి మీకు ఈమెయిల్ చేయవచ్చు, లేదా మీ సోషల్ మీడియా లో మెసేజ్ పెట్టవచ్చు. ఇలా గొడవ, తోసుకోవడం ఎందుకు? వాళ్ళందరూ ఇపుడు లోపలికి వచ్చేస్తే నన్ను కూడా తోసేస్తారు. నాకు ఆపరేషన్ అయి వారమే అయింది.” కఠినంగానే ఉంది పాప మాట.
ఇంతమంది ఒకేసారి లోపలికి వచ్చేసి మమ్మల్ని తోసేస్తుంటే, నన్ను భుజాన ఎత్తుకుని, అమ్మనీ, నాన్ననీ కూడా జాగ్రత్తగా బయటకు తీసుకువెళ్ళిన ఈ అంకుల్ కదా అసలైన హీరో! అంటూ నా వైపు చూపించింది కృతి. ఆమె చదువుకుంటున్న ఆ స్కూల్ ను, ఆమెను ఇంత చిన్న వయసులోనే ఇంత పరిణితి చెందేలా పెంచిన ఆమె తల్లిదండ్రులను మనసులోనే మెచ్చుకున్నాను. అందరూ అదే అనుకుని ఉంటారు నాలా!
దినకర్ ముఖంలో పాశ్చాత్తాపం కనిపించింది. పాప చేతిని తన చేతిలోకి తీసుకుని, “నువ్వు చెప్పింది అక్షరాలా నిజం కృతి, కానీ సినిమా అంటేనే ఒక క్రేజ్.. ఈ ఫ్యాన్స్ మాకు చాలా విలువైన వాళ్ళే పాపా, కానీ తమ పనులు వదిలేసుకుని మా కోసం పిచ్చెక్కిపోవాలని మేము కూడా అనుకోము. సెలబ్రిటీలు అయినా మాకూ బయట అందరిలా తిరగాలని ఉంటుంది. కానీ స్వేచ్ఛగా బయటికి రాలేము. నీలా చిన్నప్పటినుండే సినిమా కూడా ఒక వ్యాపారం, సినిమా వాళ్ళది కూడా ఒక ఉద్యోగం అనుకుంటూ పిల్లలు పెరిగితే, ఈ తొక్కిసలాటలు ఉండవు…” ఇంకేదో చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నాడు అతను.
“సినిమాకు వేలకోట్ల వ్యాపారంగా మార్చిన తర్వాత, రిలీజైన వారంలోగానే పెట్టుబడికి పదింతల లాభంగా మార్చిన తర్వాత, క్రేజ్ లేని ప్రజలు ఉంటే ఎలా సాధ్యం అవుతుంది? నాలో నేనే అనుకుంటున్నాను అనుకుని బయటికే అనేశాను. కెమెరాలు ఒక్కసారిగా నా వైపు తిరిగాయి.
“వినోదం కాస్తా వెర్రితలలు వేసిన క్రేజ్ గా మారింది. సినిమా నటులంటే ఎప్పుడూ క్రేజ్ ఉంది, కానీ ఈ కాలంలో మరీ పిచ్చి పెరిగింది. దానికి కారణం హీరో లేదా హీరోయిన్ లతో అసలు సైన్స్ తో సంబంధం లేకుండా, వాస్తవికతతో సంబంధం లేకుండా ఎవరూ చేయలేని సాహసాలు సినిమాల్లో చూపించడం, అది నిజంగానీ హీరో లేదా హీరోయిన్ చేశారని వాళ్ళపై వెర్రి అభిమానం పెంచుకోవడం పరిపాటి అయిపోయింది. ఏదైనా ఒక వృత్తి అనుకోవాలి, నటనకు గౌరవం ఇవ్వాలి, మేము వినోదం కోసం డబ్బు చెల్లిస్తాము, కానీ ప్రేక్షకులుగా మేము స్పృహ కోల్పోకూడదు, సినిమాలపై లేదా నటీనటులపై మన పిచ్చి వెర్రితలలు వేయకూడదు, ఒక సెలబ్రిటీని చూసేందుకు మన భద్రత విషయంలో రాజీపడకూడదు. ఇంకా ఈ అంశంతో ముడిపడి ఉండే చాలా విషయాలు ఉన్నాయి. వాటి గురించి మీ మీడియా చర్చించాలి.” స్టేజ్ ఎక్కి ఎప్పుడూ మాట్లాడడం అలవాటు లేని నేనేనా ఇలా మాట్లాడింది అనుకున్నాను.
కృతి గొంతు సవరించుకుంది. “”ఈ హాల్ స్థితిని చూడండి, కుర్చీలు విరిగిపోయాయి, టేబుల్క్లాత్లు ప్రతిచోటా చెల్లాచెదురుగా ఉన్నాయి. చాలా వస్తువులు పగిలిపోయాయి, మీరు హోటల్‌కు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వవచ్చు, కానీ వనరులను అనవసరంగా వృధా చేయడం ఏమిటి? ప్రజల జీవితాలకు అంతరాయం కలగడం ఏమిటి?” ఆమె కళ్ళు హీరోపైకి వెళ్ళాయి.”మీరు నా ఆందోళనను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఎలా నివారించాలో మీరు ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను, కాబట్టి నా కుటుంబం వంటి సాధారణ ప్రజలు బాధ పడకూడదు.” అంటూ ఆమెను పైకి లేపేందుకు సిద్ధమైన తండ్రికి చేయి అందించి, హాల్ బయటకు చేయి చాపింది, ఇక వెళ్దాం అన్నట్టు.
వారు హాల్ నుండి బయటకు వెళ్లే సమయంలో, మీడియా సిబ్బంది అమ్మాయి కథను మరియు హీరో మరియు హీరోయిన్ ప్రతిస్పందనను ఘాట్ చేయడానికి ఆసక్తిగా అనుసరించారు. సినీ బృందం ముఖాల్లో ఏదో తెలియని భావం ప్రతిబింబిస్తోంది.
వారు నేర్చుకున్న పాఠాల గురించి ఆలోచిస్తారేమో!
నేను పాపను ఎత్తుకున్న ఆమె తల్లితండ్రుల వెనుక నడుస్తున్నాను. నాలో ఏదో నిశ్చయం! సరిహద్దులు నిర్ణయించుకోవడం, అమలు పరచడం ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యం! ఈ విషయం ఇంతకు ముందే తెలిసినా, ఏదో తెలియని జ్ఞానోదయం! మీడియా గుంపు విభజించబడింది, సగం మంది మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కోసం వెంబడించారు, మిగిలిన సగం మంది అమ్మాయి యొక్క పదునైన మాటలకు సినీ బృందం ప్రతిస్పందనను ఘాట్ చేయడానికి వెనుక ఉండిపోయారు. సెలబ్రిటీలు వివరణలు అందించి ఉండవచ్చు లేదా వారి భావోద్వేగాలను ఎలా పంచుకున్నప్పటికీ, నిజమైన పరివర్తన సాధారణ పౌరులతో ప్రారంభమవుతుందనే భావన నాలోకి ప్రవేశించింది. మన సమిష్టి చర్యలే ప్రపంచాన్ని పునర్నిర్మించగలవు. మార్పులకు పునాదులు వేయగలవు.
మరుసటి రోజు, నేను ఆఫీసులో నా సరిహద్దు ప్రదర్శనను ఆచరణలో పెట్టాను. నా ఆఫీస్ క్యాబిన్ వెలుపల, “విరామ సమయం” అని రాసి, చేతితో తయారు చేసిన కార్డ్బోర్డ్ బోర్డుని వేలాడదీశాను. సందేశం సరళమైనది అయినప్పటికీ ప్రభావవంతంగా పని చేసింది. మా సిబ్బంది సహజంగానే నా సరిహద్దులను గౌరవించారు, “స్వాగతం” అని నేను బోర్డును తిప్పే వరకు నా క్యాబిన్లోకి ప్రవేశించడం మానేశారు. ఆ క్లుప్తమైన విశ్రాంతి సమయంలో, నేను వేడి వేడి కాఫీని ఆస్వాదించదంలోని సంతృప్తిని, అనుభూతిని మనసారా పొందాను. విరామ సమయం అంటే మన వాడుక భాషలో బ్రేక్ తర్వాత ఇనుమడించిన ఉత్సాహంతో పని చేయగలుగుతున్నాను.
Comments
తళుకు బెళుకులకు ఆవల ఒక సరిహద్దు(కథ)-విజయభాను కోటే — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>