అంతర్వీక్షణం – 2(ఆత్మ కథ) -విజయభాను కోటే
ఇంకో ఏడాదికి చెల్లి భూమి మీదికి వచ్చింది. అప్పుడు నా ప్రయోగాలు ఇంకా ఊపందుకున్నాయి. ఇంట్లో వస్తువులు, పుస్తకాలు కాకుండా బుల్లి బొమ్మ లాంటి బుజ్జాయి దొరికింది. నా ప్రయోగాలకు మిగిలిన వస్తువుల్లా మెత్తగా ఊరుకోక, ఏడుపుతో ఇంట్లో వాళ్ళకు సమాచారం అందించేది. ఏడుపుకీ ఇంట్లో వాళ్ళు వచ్చే సమయానికి నా పని కాస్తో కూస్తో పూర్తి చేసేదాన్ని. పెద్ద ప్రయోగాలు ఏమీ కాదు.. మా చెల్లి కళ్ళు మూసి తెరుస్తూ ఉండేది కదా, నిద్రపోయేటపుడు కళ్ళు మూసి ఉండేవి. వాటిని తెరవాలి. తెరిస్తే మళ్ళీ మూసుకుపోయేవి. అందుకని ఒక రోజు నా బుల్లి శాస్త్రవేత్త బుర్ర మరీ పదునుగా పని చేసి, చీపురులోని పుల్లలు విరిచి, చెల్లి కళ్ళు తెరిచి, రెప్పల మధ్య నిలబెట్టబోయనాన్నమాట. నా అద్భుతమైన వనరుల సమీకరణ, అత్యద్భుతమైన ఆలోచనా సరళిని అర్థం చేసుకోలేని మా మమ్మీ, పిల్ల కళ్ళు పోయేవి అంటూ, చెల్లి గుండెలకు హత్తుకుని ఒకటే ఏడుపు. శాడిజం అనుకోకండి. చెల్లిని బాధ పెట్టాలన్నది కాదు నా ఆలోచన, చెల్లి కళ్ళు తెరిచి నా వైపు చూడాలి. ఈ పెద్దలకు అర్థం కాలేదు.
మర్నాడు బట్టలు సర్ది, అమ్మమ్మ దగ్గరికి పంపేశారు నన్ను. అక్కడ కూడా ఊరికే కూర్చునే రకం కాదు నేను. ఇల్లు పీకి పందిరి వేయడం పాత ఫ్యాషను. నేను ఇంటిని పరిశోధనకు తగినట్టుగా తయారుచేసేదాన్ని. ఇది పెద్దవాళ్లకు అర్థం అయ్యేది కాదు. మా అమ్మమ్మ మమ్మీతో చెప్పేటపుడు నా అల్లరి గురించి చెప్తే, “ఏం చేస్తోంది అమ్మా?” అని అడిగేది మమ్మీ. మా అమ్మమ్మ పిచ్చి చూపులు చూస్తూ, “ఏం అల్లరి చేస్తోందో చెప్పలేము. మామూలు అల్లరి మాత్రం కాదు” అనేది.
ఎంత అల్లరి చేసినా, ఇంట్లో వస్తువులు తిరగా మరగా చేసినా, అమ్మమ్మకి, తాతయ్యకీ అదేమిటో, నేనంటే వల్లమాలిన ప్రేమ. ఎంత గారమంటే, జ్వరం వస్తే చాలా రోజులు తగ్గేది కాదు నాకు. ఎన్ని రోజులు జ్వరం ఉంటే అన్ని రోజులు తిండి తినేదాన్ని కాదు. సోడా మాత్రమే తాగేదాన్ని. అదేమీ విచిత్రమైన అలవాటో! ఊర్లో ప్రకాశరావు డాక్టర్ గారి వైద్యం మాత్రమే పడేది. తాతయ్య స్కూల్ నుండి వచ్చి, డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళేవారు. అక్కడ ఇంజెక్షన్ చేస్తే, ఇంకో నాలుగు ఊర్లకు వినపడేలా ఏడ్చి, ఇంటికి వచ్చి నాలుగు సోడాలు తాగి పడుకునేదాన్ని. ఆ సోడాల అబ్బాయిని ఇంటికే రప్పించి, ఆ అబ్బాయిని పగటిపూట అంతా ఇంటిదగ్గరే ఉంచి, భోజనం పెట్టి, రోజు మొత్తానికి ఉన్నందుకు డబ్బులు, సోడా డబ్బులు ఇచ్చి పంపేవారు అమ్మమ్మా, తాతయ్యా! ఆ సోడాల అబ్బాయికి కూడా ఇదే బావుండేది. ఎండలో తిరిగే పని ఉండేది కాదు.
ఇంతకీ ఎండల్లో జ్వరం ఎందుకు వచ్చేది అనేది చెప్పాలి కదా! ఎండలు ఎక్కువై వచ్చే జ్వరం కాదు. అమ్మమ్మ వేసవిలో పచ్చళ్లు పట్టేది. అందరికీ ఏడాది అంతా సరిపోయేలా పచ్చళ్లు. ఇక వేసవిలోనే కారం ఆడించేది. అది కూడా కుటుంబం మొత్తానికి, చూట్టాలకి కూడా సరిపోయే అంత కారం. అప్పుడు మరి కారం సామాను, పచ్చళ్ల సామాను ఎండలో ఆరబెడతారు కదా! ఇక నా నోటికి బోలెడంత పని అన్నమాట. ఎండుమిర్చి తప్ప, మిగిలిన సామాను అంతా సగానికి పైగా నేనే తినేదాన్ని. అదీ సంగతి!
ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఆ మధ్య ఏదో సినిమాలో బాబూ మోహన్, “ఏందుకు, ఏమిటి,ఎలా?” అని డైలాగ్ తో, ఆ సాహసాలతో అందరినీ నవ్వించాడు కాదా! అది ఇప్పుడేమి ఖర్మ, చాలా కాలం క్రితమే, నా బాల్యంలో, “ఎందుకు? ఏమిటి?ఎలా?” అనే పరిశోధనలు నేను చాలానే చేశాను.
ఈ inquisitive nature వల్లనే ఇప్పటికీ research అంటే మహా ఇష్టం. విద్యాపరంగా చాలా దేశాల విద్యావిధానం గురించి టీచర్ అయ్యాక research చేశాను. 2021 లో నాకు “Cushing’s Disease” అనే ఒక “Rare Disease” ఉందని తెలిసిన తర్వాత దాని పుట్టు పూర్వోత్తరాలు, దేశవిదేశాల్లో ఆ వ్యాధి గురించి జరిగిన research, ఈ వ్యాధితో జీవించేవారి జీవన విధానం అన్నీ తెలుసుకున్నాను. అందుకే కదా భయం లేకుండా Brain Surgery చేయించుకుని, ఎన్నో comorbidities ఉన్నా, మూడేళ్ళ తర్వాత కూడా బ్రతికి ఉండి ఈ నా ప్రయాణం గురించి రాస్తున్నాను.
సరే! Serious విషయాలకు ఇంకా సమయం ఉంది. బాల్యంలో మనం పెంపొందించుకున్నవి కావచ్చు, తల్లిదండ్రులు పెంపొందించినవి కావచ్చు, బడిలో నేర్చుకున్నవి కావచ్చు, వాటి impact గట్టిగా ఉంది అంటే, ఆ లక్షణాలు, ఆ అలవాట్లు ఎప్పటికీ మనతో ఉండిపోతాయి. పుట్టుకతో వచ్చే కొన్ని వారసత్వ లక్షణాలు కూడా అంతే! ఈ రెంటికీ భేదం చాలా మందికి తెలియదు. తెలుసుకోవడం మాత్రం అవసరం.
చెల్లి కాస్త నడవడం మొదలు పెట్టేసరికి నేను వీరలెవెల్లో చదవడం, రాయడం నేర్చేసుకున్నానట. నా పరిశోధనలు ఇంట్లో ప్రకంపనలు పుట్టించకూడదని ఇంకా బడి వయసు రాకుండానే నన్ను బడిలో వేసేశారు. స్కూల్ కి వెళ్ళడానికి రోజూ ఏడ్చేదాన్నట. మా తాతయ్య నాతో పాటు క్లాస్ కి వచ్చి వెనుక బెంచ్ లో వంగి కూర్చునేవారట. రెండు రోజులు పోయాక మా టీచర్ తాతయ్యను చూసి, “ఇదేమిటండీ, మీరు ఇలా రోజూ వచ్చి కూర్చుంటే పిల్లకు స్కూల్ ఎలా అలవాటు అవుతుంది? మీరు వెళ్లిపోండి” అనే పంపేసారట. మా తాతయ్య ఎవరో తెలిస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు. పిల్లలను ఒకటో తరగతిలో చేర్చినపుడు తల్లిదండ్రులకు అభయం ఇచ్చి, ఇంటికి పంపే హెడ్ మాస్టారు. మనవరాలి మీద ప్రేమ అలా ఉంటుందేమో కదా!
ఇక తాతయ్య రావడం మానేశాక, నాకు స్నేహితులు పెరిగారు. మాటల పుట్ట అనేవారు అందరూ. నాకు టీచర్స్, ఆఖరికి హెడ్ మాస్టర్ గారి భార్య కూడా స్నేహితులే! ఇంతా చేసి బుద్ధిగా ఉండడం అనేది మన చరిత్రలోనే లేదు కదా! ఇక “ఎందుకు?ఏమిటి?ఎలా?” ఉండనే ఉంది. స్కూల్ అయ్యే సమయానికి కాస్త అటూ ఇటూగా డాడీ వచ్చేవారు తీసుకువెళ్లాడానికి లేదా రిక్షా ఉండేది. ఈ లోపు స్కూల్ బయట ఉన్న బండ్లన్నీ నావే! పుల్ల ఐసు అమ్మే అంకుల్, మామిడి ముక్కలకు కారం పూసి అమ్మే మామ్మ, తీపి బిళ్ళలు అమ్మే ఆంటీ అందరూ నా దోస్తులే!
అవన్నీ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి వాటిని కొని, తిని, seasonal గా వచ్చే ఏ వ్యాధినీ ఇంటికి రాకుండా వదిలిన ప్రసక్తే లేదు! కళ్ల కలక దగ్గర నుండి, జ్వరాల వరకూ అన్నీ నేను ఇంటికి తెచ్చినవే! నా గురించి నాకు యాభై ఏళ్లు దగ్గరకు వచ్చినా, ఇంకా చెప్పి చెప్పి మా మేనమామలు, అత్తయ్యలు నవ్వుతూనే ఉంటారు. బ్రతికి ఉన్నన్నాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, మమ్మీ, డాడీ కూడా చెప్పి నవ్వుతూనే ఉండేవారు! ఇందరిని నవ్వించిన నేను గ్రేట్ కదా!
(ఇంకా ఉంది )
-విజయభాను కోటే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అంతర్వీక్షణం – 2(ఆత్మ కథ) -విజయభాను కోటే — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>