ఆయన !

            నేను ఇంటిదగ్గర స్కూటీ స్టార్ట్ చేసి ఆఫీసుకి బయలుదేరిన కాసేపటికి ఆ ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ వస్తుంది. బిజీ జంక్షన్ కాబట్టి అక్కడ కాసేపైన రెడ్ లైట్ పడకుండా ఉండదు. ఆగినప్పుడల్లా నాకళ్ళు ఆయనకోసం వెతుకుతాయి. అసలు నా బండి ఆ జంక్షన్ కి చేరే ముందే నా వెతుకుడు మొదలవుతుంది. రోజూ సూర్యుడైనా కనిపించడేమో కానీ ఆ జంక్షన్లో ఆయన కనిపించక మానరు.
            ఆయన్ని చూసినప్పుడల్లా ఎంతో ముచ్చటేస్తుంది. 
ఆ తరం వ్యక్తుల్లో ఉన్న సిన్సియారిటీ, పని పట్ల శ్రద్ధ మన తరంలో కనిపించట్లేదేమిటో అని బాధేస్తుంటుంది. ఎన్ని వాహనాలు వస్తున్నా, ఎంతో పొల్యూషన్ కమ్ముకుంటున్నా నవ్వుతూ, విజిల్ ఊదుతూ, చేతులతో సిగ్నల్ ఇస్తూ, వాహనాలను కంట్రోలు చేస్తూ నిరంతరం శ్రమిస్తూ కనిపించే ఆయన్ని చూస్తే ఎప్పుడూ సంతోషంగా అనిపింస్తుంటుంది. ఎవరైనా రెడ్ లైట్ ఉన్నప్పుడు పోవడానికి ప్రయత్నిస్తే, నవ్వుతూనే సైగలు చేస్తూ నచ్చచెప్పే ఆయన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ప్రొద్దున మేము ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఎంత నవ్వు ముఖంతో కనిపిస్తారో అంతే ఫ్రెష్ గా సాయంత్రమూ కనిపిస్తాడాయన. అసలు అలుపనేది ఎరగకుండా ఇలా రోజంతా శ్రమించేవాళ్ళు ఇప్పుడు తక్కువయ్యరేమో  అనిపిస్తుంటుంది.
అంత పెద్దాయన అలా నిర్విరామంగా శ్రమ పడుతోంటే, కొత్తగా ట్రాఫిక్ పోలీసులుగా మారిన యువకులు తోటి కానిస్టేబుళ్ళతో సుత్తి కొడుతూనో, సిగ్నల్ స్తంబానికి చేరగిలా పడో, కుర్చీలో కునుకు తీస్తూనో, వాళ్ళ ఎస్ ఐ తో కలిసి కెమేరాతో జడిపిస్తూ హెల్మెట్ లేని వాళ్ళ దగ్గర, లోడు లారీల దగ్గర మామూళ్ళు వసూలు చేస్తూనో కనిపిస్తుంటారు. అయితే  ఈ వసూళ్లు చేసేటప్పుడు చలానా రాయనప్పుడు మాత్రం వాళ్ళ మొహాల్లో ఎంతో  ఆనందం కనిపిస్తుంటుంది. నాకు మాత్రం వాళ్ళకూ, అదే సిగ్నల్ దగ్గర, లేని బాధలు ముఖంలో చూపిస్తూ అడుక్కునే వాళ్ళకూ పెద్ద తేడా ఏమీ కనిపించేది కాదు. కాకపొతే వాళ్ళు అడుక్కుంటారు వీళ్ళు దోచుకుంటారు, ఖాళీ అయ్యేది మాత్రం మన పర్సులే.
వాళ్ళంతా ఎలా ఉన్నా కానీ ఆయనమటుకూ తామరాకు మీద నీటిబొట్టులా తుళ్ళుతూ చిన్మయానందంతో తనపని తను చేసుకుంటూ పోతుంటాడు. అసలు కాసేపు ఆ ట్రాఫిక్ జంక్షన్లో ఉంటేనే పొల్యూషన్ కి ఊపిరాడనట్లుగా, చెవులు బద్దలవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటిది ఎంత ఎండగా ఉన్నా, వాన పడుతున్నా, చలిగా ఉన్నాఋషిలా ఇలా పని చెయ్యగలగడం ఎంత కష్టమో చూస్తేనే తెలిసిపోతుంది. 
అనుకోకుండా ఒక ఆదివారం ఆయనగురించి పేపర్లో చదివి అబ్బురమనిపించింది. ఆయన రిటైర్ అయికూడా అయిదు సంవత్సరాలు అయిందనీ, అయినా ఇంటిదగ్గర ఉండి చేసేదేమిటని, ఉచితంగా ఇలా ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి ఆ సమాచారాన్ని స్నేహితులతో పంచుకోకుండా ఉండలేకపోయాను. అప్పటినుంచీ ఆయన మీద ఎడ్మిరేషన్ ఇంకా పెరిగిపోయింది. 
కానీ ఈమధ్య ఆయన్ను చూస్తే  నాకు కోపం వస్తోంది. ఆ మొహంలో నవ్వు మాయం అయిపొయింది. ఎప్పుడూ జంక్షన్ మధ్యలో ఉండి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే ఆయన ఇప్పుడు ఆగిన బళ్ల దగ్గరకు వెళ్లి వాళ్ళతో మాట్లాడటం, చెయ్యి చాచి అడగటం కనిపిస్తోంది. దేముడు దెయ్యం అయినట్లూ, ఋషి రాక్షసుడైనట్లూ అనిపించి మూడంతా పాడైపోయేది. నా ఫ్రెండ్స్ కి చెబితే వాళ్ళూ బాధపడ్డారు. ‘ ఏమో పాపం ఆయనకు ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చి ఉంటాయేమో ‘ అని అనుమానం వ్యక్తం చేసారు. ఆ ఆలోచన నాకు రానందుకు సిగ్గేసింది. నన్ను నేను బాగా తిట్టుకున్నాను. ఎలాగైనా ఆయన్ను కలిసి ఇలా మారిపోవడానికి కారణం ఏమిటో కనుక్కోవాలని నిశ్చయించుకున్నాను. కానీ కలెక్షన్లలో బిజీగా ఉన్న ఆయన్ను ఎలా కలవాలో అర్థం అయ్యేది కాదు.
అనుకోకుండా ఆయన్ను కలిసే అదృష్టం వచ్చేసరికి ఉత్కంఠగా అనిపించింది. నేను సిగ్నల్ దగ్గర కి వచ్చాను రెడ్ లైట్ పడింది. ఆగిన నా దగ్గరకు వస్తూ కనిపించాడాయన. మాట్లాడుదాం అని హెల్మెట్ తీసి పట్టుకోగానే వచ్చి చెయ్యి చాచాడాయన.
 ” ఏమిటంకుల్ ? ” అడిగాను బాధగా.
 ” హెల్మెట్ ఉన్నది చేత్తో పట్టుకోవడానికి కాదు నెత్తిమీద పెట్టుకోవడానికి చలానా రాయమంటావా లేకపోతే వెంటనే ఏమైనా ఇస్తావా ? ” రుసరుసలాడాడాయన.
” మీరు దగ్గరకు వస్తే.. మీతో  మాట్లాడుదాం అని హెల్మెట్ తీసా, అయినా మీరు ఉద్యోగం చెయ్యట్లేదుగా చలానా ఎలా రాస్తారు అంకుల్ ? ” లా పాయింట్ తీశాను నేను.
” నీకెవరు చెప్పారు నేను ఉద్యోగం చెయ్యట్లేదని ? నా యూనిఫాం చూడు. ఉద్యోగం చెయ్యకపోతే ఇక్కడ ఎందుకుంటాను ? నా టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే ఓ యాభై ఇచ్చుకోమ్మా. నాకాట్టే టైం లేదు. ” దబాయిన్చాడాయన.
” అంకుల్ సిగ్నల్ గ్రీన్ అయ్యింది నేను వెళ్తున్నా మీకు డబ్బులు కావాలంటే సిగ్నల్ దాటినాక ఆగుతాను వచ్చి తీసుకోండి. ” అని హెల్మెట్ పెట్టుకుని సిగ్నల్ జంక్షన్ దాటించాను నా స్కూటీని.
              రియర్ వ్యూ మిర్రర్ లో ఏమి చెయ్యాలో తేల్చుకోలేక నావేపు చూస్తున్న ఆయన్ను చూసి, ఇవ్వాళ ఇదేదో తేల్చెయ్యాలి అని నిశ్చయించుకుని ఆయనకు కనిపించేలా సైడ్ కి  వెళ్తున్నట్లు ఇండికేటర్ చూపిస్తూ స్కూటీ పక్కకు తీసి ఆపాను.
అది చూసి మళ్ళీ ఆశపడ్డ మొహంతో గబగబా నడుచుకుంటూ వచ్చి చేరాడాయన.
” తియ్యి డబ్బులు. వెంటనే వెళ్ళాలి నేను.” దర్పంగా అడిగాడు ఆయన.
” చూడండి అంకుల్ మీరు రిటైర్ అయ్యారనీ, మీరు ఇప్పుడు చేస్తున్న పనికి మీకు జీతం రాదనీ నాకు తెలుసు కానీ, ఇలా ఎందుకు మారారో చెప్పండి. ”  స్కూటీకి స్టాండ్ వేసి చేతులు కట్టుకుంటూ అడిగాను నేను.
” ఆ విషయం తెలిసిన దానివి, మరి డబ్బులిస్తాను రమ్మన్నావెందుకమ్మా ? ”  టోపీ తీసి బుర్ర గోక్కుంటూ అడిగాడు ఆయన.
” అంకుల్, మీకు కావలిసింది ఒక యాభై రూపాయలే అయితే అవి ఇప్పుడు కూడా ఇస్తాను కానీ నాకొక నిజం చెప్పాలి మీరు. ” మొహమాటం లేకుండా అడిగాను నేను.
” ఇచ్చేట్లైతే ఇచ్చెయ్యి తల్లీ వెళ్తాను, లేట్ అయితే మళ్ళీ నాకిబ్బంది. ” జాలిగా మాట్లాడుతూ అడిగాడాయన. 
 ” ఇంతకు ముందు మీరు ఎంత నిస్వార్ధంగా సేవ చేసేవాళ్ళో రోజూ చూసి మీకు పాదాభివందనం చెయ్యాలనిపించేది. కానీ ఈమధ్య మీరు ప్రవర్తిస్తున్న విధం నచ్చక చాలా బాధగా ఉంది. మీరు ఇలా ఎందుకు మారారో చెబితే యాభై కాదు వంద ఇస్తాను చెప్పండి అంకుల్ . ” స్ట్రెయిట్ గా పాయింట్ కి వచ్చేసాను నేను.
” ఎందుకులేమ్మా నేను వెళ్తాను వీలయితే ఒక యాభై ఇచ్చి పంపు లేకపోతె నన్ను వదిలెయ్యి.” వదిలించేసుకోవాలి అన్నట్లు అడిగాడు ఆయన.
” చూడండంకుల్, మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఆర్ధిక ఇబ్బంది ఉండి వాళ్లకోసం మీరిలా మారి ఉంటే నాకు చెప్పండి. మా ఫ్రెండ్స్ తో చెప్పి సాధ్యమైనంత సాయం చేస్తా. మీ వాళ్ళకెవరికైనా ఆరోగ్యం బాగోక పొతే చెప్పండి నాకు తెలిసినవాళ్లు ఆరోగ్యశ్రీలో మీకు ఉచితంగా వైద్యం చేయించగలరు. అంతేకానీ ఇలా యాభైకీ వందకీ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకండి.” 
 బుజ్జగింపుగా అడిగాను.
” దేముడి దయ వల్ల  నాకు అలాంటి అవసరాలేమీ లేవు తల్లీ. నేను ఒంటిగాడిని. నాకు వచ్చే పెన్షన్ నాకు హాయిగా సరిపోతుంది. ” 
” మీ కుటుంబం ఏమయ్యింది అంకుల్ ? భార్యా పిల్లలు, తోడబుట్టినవాళ్ళు  ఎవ్వరూ లేరా? “
” నేనొక అనాధను తల్లీ ! అనాధశరణాలయంలో వాళ్ళు చెప్పించిన చదువు వల్ల ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. నా ఉద్యోగం నాకు పెళ్లి కుదిరేలా చేసింది కానీ ఎప్పుడూ ఉద్యోగం గురించే ఆలోచించే నా తత్త్వం నచ్చక నా భార్య నన్ను వదిలేసింది. మళ్ళీ పెళ్లిచేసుకోవాలనిపించక ఒంటరిగానే మిగిలిపోయాను. నాకున్నదంతా నేను పెరిగిన అనాధ శరణాలయానికే రాసి ఇచ్చేశాను. నాకు ఏ దురలవాట్లు లేవు తల్లీ. నాకోచ్చే పెన్షన్ తో హాయిగా బ్రతికేస్తున్నాను.” 
” మరి ఏ అవసరమూ లేకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు అంకుల్ ? ” 
”  నాకు ఒక్కటే ఒక్క వ్యసనం ఉంది తల్లీ ! అది ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యడం ! నాకు నిద్రలో కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నట్లే కలలు  వస్తాయంటే నమ్ముతావామ్మా ? ” 
” ఓ కే నమ్ముతాను కానీ. దానికీ దీనికీ సంబంధం ఏమిటి ? ఆ పని చేస్తూనే ఉన్నారుగా ? ఇలా ఎందుకు మారారు ? “
” మా డిపార్ట్ మెంట్  లో ఉన్న పెద్దవాళ్ళకు మామూళ్ళ టార్గెట్ ఉంటుందమ్మా. అవి పూర్తి చెయ్యలేకనే కానిస్టేబుల్ గా చేరిన నేను ఏ ప్రమోషనూ లేకుండా కానిస్టేబుల్ గానే రిటైర్ అవ్వాల్సి వచ్చింది. ఆ మధ్య దాకా నేను పని చేస్తుంటే వసూళ్లు చేసుకుంటూ ఉండేవాళ్ళు మిగతావాళ్ళు. కానీ నేను రోజుకు ఇంత అని ఇవ్వకపోతే డ్యూటీ కి రానివ్వమని బెదిరించారు తల్లీ. ముందు ముందు నా పెన్షన్ నుంచి ఇచ్చే వాడిని కానీ వాళ్ళ దాహం తీర్చడానికి అది ఏ మూలకూ రావడం లేదమ్మా. నాకేమో ఈ పని తప్ప ఇంకోటి రాదు. రోజూ ఇలా కొంతసేపైనా ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యకపోతే నిద్రకూడా పట్టదమ్మా. అందుకని తప్పక ఇలా చెయ్యాల్సి వచ్చింది తల్లీ. ” 
తల దించుకుని చెబుతున్న ఆయన్ని చూస్తుంటే నాకళ్ళలోని నీళ్ళు ధారగా కారడం మొదలయ్యింది కర్చిఫ్ తో  తుడుచుకుంటూ పర్స్ తీసి వంద రూపాయలిచ్చి నమస్కారం చేసాను. ఈయన కష్టాన్నితీర్చాలీ అంటే ప్రపంచం మొత్తం తెల్సినా ఎవరూ పట్టించుకోని అవినీతి బూతాన్ని అంతమొందించాలి. అది చెయ్యడానికి నా శక్తి సరిపోతుందా, ఇంకెవరైనా తోడు కలుస్తారా అని ఆలోచిస్తూ మళ్ళీ స్కూటీ స్టార్ట్ చేశాను.

 – నిమ్మగడ్డ ప్రభాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, పురుషుల కోసం ప్రత్యేకం, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో