పాటలు – కధలు – గాథలు

ఉత్తరం వైపు మా ఇంటికెదురుగా మాలపల్లెను ఆనుకొని కుమ్మరి ఆవం,దాని పక్కనే వాళ్ళ పూరిల్లు ,పెద్ద వాకిలి ఉండేవి .వాళ్ళకి కోమట్ల రామాలయం ఎదుట పెద్ద పెంకిటిల్లు ఉండేది .దాన్ని బొండా  వారికి అమ్మేసి ఇక్కడికి వచ్చేసారు .ఆ ఇంటి యజమాని పేరు కుమ్మరి రామయ్య, ఆయన్ని మా నాన్న ‘అన్నయ్య’  అని పిలవడం వలన నేను పెదనాన్న అనేదాన్ని .వాళ్ళ పిల్లలు సీత ,జగ్గమ్మ నా ఈడు వాళ్ళు .వాళ్ళకో అన్నయ్య ,తమ్ముడు , ఇద్దరు చెల్లెళ్ళు   ఉండేవాళ్ళు .వాళ్ళ అమ్మ అందమైనదే అయినా అదిక కాన్పుల వల్ల పాలిపోయి రోగిష్టిగా ఉండేది రామయ్య పెద్దనాన్న పొట్టిగా వెన్నుకంటుకుపోయిన కడుపు తో ఉండేవాడు .కాని ఎక్కడా నిలబడకుండా పరుగేడుతున్నట్టే  పనులు చేసేవాడు .మోకాళ్ళ పైకి బిగించి కట్టిన కావి రంగు గాంధీ పంచె ,ఆచ్చాదన లేని పై భాగంలో మట్టితో రంగు  మారిన జందేప్పోగు , వేలుగుతున్నప్పుడు పెదవి చివర ,ఆరిపోయినప్పుడు చెవి సందున ఉండే సన్నని పొగాకు చుట్ట పీక -అదీ ఆయన ఆహార్యం .

                      ఆయన చక్రం తిప్పుతూ ఆరె   మీద   కుండలు తయారు చేస్తుంటే చూడటం నాకెంతో బావుండేది .ఆ నైపుణ్యం నన్నెప్పుడు   ఆశ్చర్యం లో   ముంచేసేది .ఉదయం లేవగానే వాళ్ళింటికెళ్ళి పోయేదాన్ని .సీత వెంటనే పీట తెచ్చివేసేది .ఆయన మేడలో  నల్లతాడుతో కట్టిన పెద్ద వెండి  వింగా కాయ ఉండేది .ఆయన చీకటితో లేచి పెద్ద బానడు నీళ్ళతో స్నానం చేసి ,నుదిటికి ,భుజాలకి విభూది పూసుకొని ,బోలెడన్ని పూలతో శివ పూజ చేసే వాడు .పూజ పూలు రెండు చెవుల్లో పెట్టుకొనేవాడు .ఆ తర్వాత కావిడేసుకొని ఇంటికి దగ్గర్లోనే ఉన్న మంచి నీళ్ళ చెరువుకెళ్ళి మట్టి తెచ్చి వాకిట్లో కుప్ప పోసేవాడు .ఆ మట్టిని నీళ్ళతో తడుపుతూ ,చిన్న చిన్న రాళ్ళను ఏరుతూ అడుసు తొక్కేవాడు .ఒకసారి వాళ్ళ పిల్లలు నేనూ ఆ అడసులో దిగి చిందులేసే వాళ్ళం .ఆ తర్వాత ఆ మట్టిని సారె మీద వేసి కేవలం చేతి వేళ్ళ నైపుణ్యం తో రకరకాల కుండలు తయారు చేస్తుండే వాడు .తయారైన అడుగు లేని పాత్రని పదునైన దారం తో కోసి పక్కన పెట్టేవాడు .వాటిని నీడలో ఆరబెట్టడం ,లోపల పేర్చడం లాంటి పనులన్నీ వాళ్ల పిల్లలు చేస్తుండే వారు .నేను వెళ్ళగానే ‘ఏం లచ్చింతల్లి ,బువ్వ తిన్నావా ‘అని పలకరించేవాడు .

            రాత్రిళ్ళు పెద్ద ఇలాయి దీపం బుడ్డి పెట్టుకొని దిమిసా చెక్క తో కుండల అడుగుల్ని తడుతూ కూర్చేవాడు ,అలా కూర్చేవేళ లో ఆ దిమిసా తాళానికి అనుగుణంగా భజన పాటలు ఎన్నెన్నో పాడుతూ ఉండేవాడు ,వారం అంతా  తయారైన కుండల్ని ఆవంలో పేర్చి శనివారం రాత్రికి కాల్చేవాడు ,ఆదివారం సాయంకాలం ఆవంలోంచి  కుండల్ని జాగ్రత్తగా తీసి వాకిట్లోనూ, ఇంట్లోను పేర్చేవాళ్ళు .సోమవారం సంతకి కావిడితో మోసుకెల్లి అమ్మకానికి సిద్ధం చేసేవాడు .ఈ క్రమం లో జరిగే  పనులన్నిట్లో అతని గొంతు లోంచి పాట  అలా నిరంతరం ఎడతెరిపి లేకుండా సాగుతూ ఉండేది .అన్ని శివుడి మీది భక్తీ పాటలే ,రామాలయంలో భజన జరుగతుంటే రాముడి పాటలు పాడేవాడు ,అతను మంచి మృదంగా వాద్యకారుడు .భజనల్లో ఘటం కూడా వాయించేవాడు .బడికి రాక పోయినా సీత ,జగ్గమ్మ నాకు మంచి మిత్రులు .సీతని “అక్క ‘అని ,జగ్గమ్మని చెల్లి అని పిల్చేదాన్ని .మేమంతా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళమ్మ చచ్చిపోయింది పురిట్లో .ఆ పసికందుని పెంచడం,అందరికి వండడం ,వడ్డించడం అన్ని వాళ్లిద్దరే చేస్తూ ఉండేవారు .ఇంటందరూ ఎప్పుడూ మట్టిలో మునిగి  తేలుతుండేవాళ్ళు .వాళ్ళమ్మ పోయేక వాళ్ల్లింట్లో ఇంటికీ వాకిలికి తేడా లేకుండా అయిపొయింది .పెదనాన్న కొడుకులకి పనిపట్టు పడలేదు ఆయన ఓపిక ఉడిగిపోయేక వాళ్ళు కూడా ఇల్లు ఆవం అమ్మేసుకొని ఊరికి దూరంగా ఉచిత స్థలాలిచ్చే చోటికి వెళ్ళిపోయేవారు .

                         వాళ్ళ ఆవనికి ఎదురుగా ,మా తూర్పు గోడకి పక్కగా ఒక డాబా ఇల్లుండేది .చిన్న గది ,వసారా మీద వేసిన చెక్క మెట్ల డాబా అది .మా వీధిలో ఆ రోజుల్లో ఏకైక డాబా ఇల్లు అదే .ఆ ఇంట్లో సుబ్బమ్మ ,రాఘవ అనే తల్లి కూతుళ్ళు ఉండేవారు .పెద్దావిడ కి  భర్త లేడు ,కూతురు కూడా వాళ్ళాయన్ని నూతిలో తోసి చంపేసిందని చెప్పుకొనేవారు.కూతురికి వెంకట్రావు,నారాయణరావు అనే కొడుకులిద్దరూ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ వయసు తేడా చాలా  ఉండేది .చిన్న వాడు నారాయణ రావు నా కన్నా రెండేళ్ళు పెద్ద .అందుకని వాళ్ళిద్దర్నీ నేను అన్నయ్య అని పిలవాలని చెప్పింది మా అమ్మ.వాళ్ళమ్మ మాత్రం మా నాన్నని “చిన్నాన్న “అని పిలిచేది.పెద్దావిడ ‘మరిదిగారు”అనేది శుభ్రమైన ,మంచి డిజైన్లు ఉన్న తెల్ల చీరల్లో ,బంగారు గాజులు ,గొలుసులు వేసుకొని ధనిక దర్పంతో ఉండేవారు .వాళ్ళ కోసం రాత్రిళ్ళు ఎవరెవరో మగవాళ్ళు వచ్చేవారట .వీధిలో ఆడవాళ్ళంతా వాళ్ళ గురిచి గుసగుసలు పోయేవారు  .కాని ,కబుర్లు చెప్పుకోవాడానికి వాల్లోస్తే మాత్రం బాగానే మాట్లాడేవారు .వాళ్ళు మాటికి ముందు మేం పెద్ద కాపులం అంటుండేవారు .వాళ్ళు రావాల్సిందే కాని వాళ్ళింటికి ఎవరూ వెళ్ళేవారు కారు .వాళ్ళని వాళ్ళ చుట్టాలేవరూ ఏ కార్యనికీ పిలిచేవారు కారు.వాళ్ళింట్లో ఒక బేటరీ రేడియో ఉండేది.( అప్పటికింకా ఈ ఊరికి కరెంటు రాలేదు ) నాకేమో రేడియో వినాలని వాళ్ళ వీధి అరుగు మీద కూర్చుంటే వెంటనే కట్టేసేవారు ,పొండి పొండి అని తరిమేసేవారు .

వాళ్ళ నారాయణ రావు నాకన్నా పొట్టిగా ఉండేవాడు ,కాని చిన్నతనం _అంటే అయిదారేళ్ళ వయసులోనే మిట్ట మద్యాహ్నాలు వాడు ఆడపిల్లల్తో అసభ్యమైన పనులు చెయ్యడం చూసారట చాల మంది .వాడితో ఎప్పుడూ మాట్లాడవద్దని చెప్పేది మా అమ్మ .

నాకు చదవడం రాయడం వచ్చాక ఆ రాఘవ మా ఇంటికొచ్చి నాకొక పేపరు ,పెన్సిలు ఇచ్చి ఎవరెవరికో ప్రేమ లేఖలు రాయించు కొనేది .మొహమాటానికో ఏమో మా అమ్మ వారించేది కాదు .ఎప్పుడైనా నేను ‘రాయను’ అని పారిపోబోతే కసిరి ‘రాసిపెట్టు పాపం ‘అనేది అలా ఎవరెవరికో తెలీదు కాని నా పుస్తకాల పాండిత్యం ఉపయోగించి ఆవిడకీ మరో సీతమ్మ అనే ఆవిడకీ బోలెడన్ని ప్రేమలేఖలు రాసి పెట్టేను చివరికి ఆ ఇంటికొడుకులు అక్కరకు రాక ఇల్లు అమ్ముకొని రాజమండ్రి వెళ్ళిపోయేవారు .తర్వాత చాన్నాళ్ళకి నారాయణరావు మట్టి కొట్టుకున్న బట్టల్తో మా స్కూలుకీ వచ్చి ఏదైనా ఆర్థిక సాయం చెయ్యమని దీనంగా అడిగేడు .వాళ్ళ అమ్మమ్మ ,అమ్మ,అన్నయ్య అందరూ చచ్చిపోయారట ఇతనికి ఆరుగురు ఆడపిల్లలు పుట్టేరట.చాలా ఇబ్బందుల్లో ఉన్నాడట.

మా ఇంటికి పశ్చిమంగా రెండో ఇల్లు తెలుకల వాళ్ళది అక్కడొక పూరిల్లు ,వాకిట్లో పెద్దపాకలో గానుగ ఉండేవి .వాళ్ళ పిల్లలు అప్పల్రాజు అనే అమ్మాయి ,తెలుగాడు అనే అబ్బాయి .మగపిల్లలు బతక్క వాడికాపేరు పెట్టేరట

వాళ్ళ నాన్న హటాత్తుగా పోయడొకరోజు .తర్వాత వాళ్ళ అమ్మే గానుగ పని చూసేది .ఆ పని ఆవిడకు సరిగా రావడం లేదని అందరూ పై వీధిలో గానుగకి వెళ్ళిపోవడం మొదలు పెట్టేరు .దాంతో తిండికి చాలా కట కట పడేవారు .బక్క చిక్కి ఎముకలు బైట పడి ,వెన్నులు వంగిపోయి ఉండేవారు తల్లి ముగ్గురూ ,కటిక దారిద్య్రం తాండవిస్తూ ఉండేది వాళ్ళింట్లో,అప్పల్రాజు నాకన్నా బాగా పెద్దది .ఎప్పుడూ వాళ్ళ రోగిష్టి తమ్ముణ్ణి చంకనేసుకొని తిరుగుతుండేది నన్ను మాత్రం ‘చెల్లీ ‘అని ఆప్యాయంగా పిలుస్తుండేది.ఒకరోజు ఉన్నట్టుండి వాళ్ల్లమ్మ కూడా చచ్చిపోయింది .వాళ్ళ పాకాని,గానుగానీ అయిన కాడికి అమ్మేసి దూరపు బంధువులేవరో వాళ్ళిద్దర్నీ మరో ఊరికి తిసుకేల్లిపోయేరు .తేలుగాడు మాత్రం పెద్దయ్యాక మళ్లి ఈ ఊరికె వచ్చి హోటల్స్ లో పనిచేస్తూ ఉండేవాడు తనతో బాటు పనిచేసే యానాదుల అమ్మాయిని పెళ్ళాడేడు నేను స్కూలు నడుపుతున్నప్పుడు అప్పల్రాజు  నలుగురు పిల్లల్నే సుకొని తన తమ్ముడింటికొచ్చినట్టుంది .నన్ను చూడ్డానికోచ్చింది .రెండో  పెళ్లి వాడికో ,మూడో పెళ్లి వాడికో ఇచ్చిచేసారట “ఏవండి ,మీరు “అంటూ మాట్లాడసాగింది .అలా అనొద్దని,చిన్నప్పటి లాగే ‘చెల్లి ‘అనమని చెప్పేను .ఆమె ముఖంలోకి ఆనందం ఉప్పెనలాగా వచ్చింది ఒక్కసారిగా నన్ను వాటేసుకుంది .వెళ్ళేటప్పుడు బొట్టుపెట్టి నేనిచ్చిన చీరెను,పిల్లలకిచ్చిన కాసిని డబ్బుల్ని ఆప్యాయంగా హత్తుకుని “ఎంత దానివయ్యేవ్ “అంటూ నా చెంప నిమిరింది .కన్నా రావు మావయ్య గురించి అడిగింది.

మా చిన్న మావయ్య వెళ్ళిపోయేక మా మూడో మావయ్య కన్నారావు మా నాన్నకి సాయం చెయ్యడానికి మా ఇంట్లో ఉండేవాడు  .పోరుగూళ్ళకి వెళ్లి చిట్స్ డబ్బు వసూలు చేసి తేవడం ,పెళ్ళిళ్ళకీ మైక్స్ అద్దెకి పట్టుకెళ్ళి ఆ డబ్బులు తేవడం చేసేవాడు .

కన్నారావు మావయ్య రాత్రి స్నానం చేసి వీధరుగు మీద పక్కవేసుకోగానే నాతోబాటు వీధిలో పిల్లలందరూ అక్కడ చేరిపోయేవాళ్ళు .అందులో అప్పల్రాజు కూడా ఉండేది .మావయ్య తనకి నిద్రొచ్చేదాకా కధలు ,జోక్స్ చెప్తుండేవాడు .పైన చెప్పిన వాళ్ళంతా క్రమం తప్పకుండా రోజూ వచ్చేవాళ్ళు,మావయ్య తలపట్టి ,కాళ్ళు నొక్కి బతిమలాడి కధలు చెప్పించుకునేవారు .ఓ సారి చెప్పిన కధ మరోసారి చెప్పేవాడు కాదు .శ్రీ శైలంలో మొదలుపెట్టిన కధను నడిపి నడిపి కాశీలో ముగించేవాడు.సాధారణంగా ఆ కధ ల్లో ముఖ్యమైన పాత్ర ఎప్పుడూ ఒక చిన్న పిల్లవాడిదై ఉండేది ఆ శ్రీ శైలం ఎటుంటుందో,కాశీ ఎక్కడుంటుందో తెలీక పోయినా ఆ పిల్లవాడివెంట మేమందరం ఆ కల్పనా లోకం లోకి వెళ్ళిపోయేవాళ్ళం .

  మా కన్నారావు మామయ్య ఆహార్యం తమాషాగా అన్పించేది,నల్లని ఎత్తైన మనిషి .మా నాన్న బట్టలు కుట్టించుకోమని డబ్బులిస్తే మెరిసే షార్క్ స్కిన్ పేంట్లు ,పాత సినిమాల్లో రేలంగి వేసుకొనే బొమ్మల బుష్ షర్టులు కొనుక్కునేవాడు.కాకినాడ లో ముస్లీమ్ స్నేహితుల సాంగత్యం ప్రభావం కాబోలు కళ్ళకు సుర్మా పెట్టుకొనేవాడు ,సన్నటి మీసకట్టు,ఒత్తైన జుట్టుకి వంటాముదం పట్టించి పైకి దువ్విన క్రాఫు,నవ్వితే పళ్లన్నీ కన్పించి కళ్ళు చిన్నవై పోయేవి .నన్ను అమ్మగారు అని ,తల్లి అని పిలిచేవాడు .మా చిన్న తమ్ముణ్ణి మెడ పైకి ఎక్కించుకొని బాగా గారాబం చేసేవాడు.తను తెచ్చే బెల్లం కజ్జి ఉండల రుచి ఇప్పటికీ గుర్తు .

 కె.వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

3 Responses to పాటలు – కధలు – గాథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో