కాఫీని చాలా సేపటి నుండి స్పూన్ తో అలా కలుపుతూనే ఉంది నీరజ. కాఫీ కిందికి పైకి వలయాలు గా తిరుగుతూ ఉంది. నీరజ మనసు ఆ వలయాల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతోంది. రెండు చుక్కలు ఒలికి నైటీ మీద పడటంతో చేతిలో ఉన్న కాఫీ గ్లాసు మీదకు దృష్టి పోయింది. కాఫీ చల్లగా అయిపోవడంతో తిరిగి వేడి చేసుకుంది. కాఫీ తాగుతూ పేపర్ చదవడం నీరజకు ఇష్టమైన పనులో ఒకటి. ఉదయం ఆఫీసుకు పోయే హడావిడిలో ఉంటుంది కాబట్టి హెడ్ లైన్స్ మాత్రం చూస్తుంది. సాయంకాలం పూర్తి వివరాలు చదువుకుంటుంది.
అయితే ఈ పూట పేపర్ లో వదివిన విషయం తలచుకుంటేనే నీరజకు కడుపు రగిలిపోతోంది. ఏ పని మీద ధ్యాస లేకుండా పోయింది.
’కోర్టులు ఎందుకు ఈ మధ్య ఎలాంటి రూల్స్ ఇస్తున్నాయి? జడ్జీలు వెనకా ముందు ఆలోచించుకోరా? ఈ విషయంలో ఆలోచించబుద్ధవ్వదేమో వాళ్ళకు… ఎంతయినా మగాళ్ళూ కదా!’ ప్రొద్దుటి నుండి ఆ మాటలను పదే పదే అనుకుంటూనే ఉంది.
’ఇంతకు ముందు కోర్టు తీర్పుల గురించి పేపర్లో చదువుకుంటూ వాటి వెనుక ఉన్న రాజకీయాల గురించి మాట్లాడేది తను… ఇప్పుడు ఏకంగా తనకే చుట్టుకుంది… ఏం చెయ్యాలి? పిల్లలకు ఏం చెప్పాలి? చెప్పకుండా ఉండే విషయం కాదు. ఇక రేపో మాపో శరత్ ఎం.సెట్ కు అప్లై చెయ్యాల్సి ఉంటుంది… వాడికి ఎలా చెప్పాలి?’ తల పగిలిపోతున్నట్టుగా ఉంది నీరజకు.
పిల్లలు రాత్రి ఎనిమిదింటికి కాని ఇంటికి రారని తెలిసినా మాటిమాటికీ గేటు వైపు చూస్తోంది. అన్నానికి బియ్యం కడిగి పెట్టింది. కోడి గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకుంది.
ఏ పని చేస్తున్నా ఒకటే ఆలోచన… ఎడతెగని ఆలోచన… వద్దనుకున్నా ఆగని ఆలోచనలు… ఆఫీసుకు పోతే అక్కడా ఇదే.
రిజిస్టర్లో సంతకం చేసి, బ్యాగ్ ప్టేబుల్ మీద పెట్టిందో లేదో… పక్క సెక్షన్ సూపర్నెంట్
” మేడమ్ చూసారా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పిల్లలకు ఇక నుండి కంపల్సరీ గా తండ్రి కులమే వర్తిస్తుందంట. చదివారా?… ఇక నుండి మీ పిల్లలకు రిజర్వేషన్ చెల్లదేమో…” ఎంత వెటకారమో ఆయన గొంతులో…
తన పిల్లలకు ఇంత వరకు రిజర్వేషన్ వాడుకునే అవకాశం రాలేదు. వాడుకోవాల్సిన టైమ్ లో ఇలాంటి తీర్పు వచ్చిందే అనే బాధ కంటే ఆయన మాట తీరే తనను ఎక్కువ బాధ పెట్టింది. అతనిది మరీ విచిత్రం.. చదువులు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు తప్ప లోయర్ క్యాస్టు వాళ్ళకు రావు అంటాడు. శరత్ ను పట్టుకుని మీవాడు హైబ్రీడ్ రకం మేడమ్… సగం రక్తం ఓసీ రక్తమే కదా… అందుకే మార్కులు బాగా వస్తున్నాయి అనలేదూ? ఇక ఆనందంగా ఉంటాడేమో! తనూ అదే అనేసింది కదా!
“ఏంటీ సార్…. గుడ్ న్యూస్ లాగ చెప్తున్నారు…. ఎవరు ఎలా అనుకున్నా, ఇది మాత్రం చాలా అన్యాయం” తను ఆ మాట అన్నదో లేదో
” అవును మేడమ్, ఇది చాలా అన్యాయం… తండ్రి క్యాస్టే ఎందుకు పెట్టాలి?తల్లులు మనుషులు కారా? ఇంత చిన్న విషయం ఆలోచించకుండా ఇష్టానుసారం తీర్పులు ఇవ్వడమేనా…?” మాధవి భాయ్ అంటుంటే ఆ మనిషికి ఎంత ఉక్రోషం వచ్చిందో…!
” ఇప్పుడు మీ పిల్లలకు రిజర్వేషన్ లేకుండా పోతుందనే కదా… ఈ రూలింగ్ అన్యాయం అంటున్నారు. మీ బాధను నేను అర్ధం చేసుకున్నాను లెండి”
ఎంత మాటన్నాడు…!?
ఆ మాటను అప్పుడే విన్నంత కోపం వచ్చింది నీరజకు. అన్నం పొంగుతుంటే మూత తీసి పక్కన పెట్టింది. కుతకుత ఉడుకుతున్న అన్నం వంక తదేకంగా చూసింది. ఉడుకుతున్నది అన్నం కాదు తన శరీరమే అనిపించింది నీరజకు.
మాధవి బాయ్ సమస్యా తన సమస్యా ఒకటేనా? బుద్ధి లేని వెధవ. తను కేవలం రిజర్వేషన్ కోల్పోతున్నందుకు మాత్రమే బాధ పడుతోందా? కాదే… మరి ఎందుకు సరైన సమాధానం ఇవ్వలేకపోయింది…
” మీరు అలా అనుకుంటే నేను ఏమీ చేయలేను సార్…” అంటూ డిస్కషన్ ఆపి… ఎందుకు తను ఫైల్స్ చూడటంలో పడిపోయింది. తను ఎందుకు వ్యతిరేకిస్తోందో చెప్తే విని ఊరుకుంటాడా? ఉండే రకమేనా? ప్రశ్నల పరంపర మొదలు పెట్టేస్తాడు. ’అతని’ ప్రస్ధావన వస్తుంది. పర్సనల్ విషయాలు చెప్పాల్సి వస్తుంది… చెప్పినా అర్ధంచేసుకునే మనుషులు కారు… పైగా మీకు ఇంత ఇగో పనికి రాదు మేడమ్… రాజీ పడాలి.. సంసారాలంటే అంతే మరి… అని తేలుస్తారు. తనకు మాటిమాటికీ వాళ్ళ తీర్పులు వినే ఓపిక లేదు… అయితే ఇలా లోపల్లోపల ఆలోచించుకుంటూ కుళ్ళాల్సిందేనా?…’
అన్నం మాడువాసన రావడంతో దీర్ఘంగా నిట్టూరుస్తూ స్టవ్ ఆఫ్ చేసింది. నీరసంగా అనిపించి పరుపు మీద వాలింది.
ఆలోచించకూడదు అని నీరజ ఎంత అనుకున్నా అవే ఆలోచనలు. మెలకువలోను అవే… నిద్రలోను అవే… భర్త జ్ఞాపకాలు… అతనితో పడిన ఘర్షణలు… నిత్యం నీరజను వెంటాడుతూనే ఉంటాయి.
’ఇద్దరు చిన్న పిల్లలను ఆమె మొఖాన వదిలేసి నాసుఖం నేను చూసుకున్నానే అనే ఫీలింగ్ ఆ మనిషికి వస్తుంటుందా? ఒక్కసారయినా భార్యా పిల్లలనుగుర్తు చేసుకుంటాడా? గుర్తు చేసుకోవడం ఏం ఖర్మలే… ఇప్పుడు ఆ భార్యా, బిడ్డ ఉన్నారు కదా… ఛీ ఛీ సిగ్గులేని మనిషి..’ గాలికి కిటికీ రెక్కలు టపటప కొట్టుకుంటుంటే తిట్టూకుంటూ వాటిని ధన్ మని శబ్దం చేస్తూ మూసింది నీరజ.
” నయ వంచకుడు… నిలువెల్లా స్వార్ధం… ఎంతసేపూ తన సుఖం… తన కోరికలు… ఇవతల మనిషి గురించి ఆలోచనే ఉండదు… తనకేమో ఇంట్లో, ఆఫీసులో పని, పైగా చిన్న పిల్లలిద్దరు. సంవత్సరం గ్యాప్ తో పుట్టిన పిల్లలు… తగినంత నిద్ర ఉండేది కాదు. పడుకుంటే చాలు ఒళ్ళు తెలియనంత నిద్ర… అతనికేమో శరీరం నిండా కోరికలు… నీతో సుఖం లేకుండా పోయింది అంటూ రోజూ ఘర్షణే. నిద్ర లేకుండా ఏంటి ఈ గోల అంటే… ఎంత నీచంగా మాట్లాడేవాడు… మొగుని మీద మొకం మొత్తినట్టుంది… బయట ఎవరినన్నా మరిగినావా అనే వాడు. అసహ్యం అనిపించినా… పోనీలే… ఆ పిచ్చిలో ఉక్రోషంతో ఏదో వాగుతున్నాడు అని సరిపెట్టుకోవడానికి ప్రయత్నించేది. రాత్రి పూట ఈ హింస అయితే పగటి పూట డబ్బులకోసం హింస…’
’ మంచి ఫెచ్చింగ్ పోస్ట్… ఎంత సంపాదించొచ్చు…! అందరూ నీలాగే ఉన్నారా? నాలుగు చేతులా సంపాదిస్తున్నారు… నీకు చేతకాకపోతేచెప్పు నేను వచ్చి డీల్ చేస్తాను. చెప్పిన చోట సంతకాలు పెడ్తూ ఉండు చాలు…’ అలా మాట్లాడుతున్నప్పుడు తనకు విపరీతమైన కోపం, ఆవేశం వచ్చేవి.
’నేను చస్తే కూడా ఆ పని చెయ్యను. నువ్వు నా ఆఫీసు విషయాల్లో కలుగచేసుకోకు… నీ సంగతి నువ్వు చూసుకో…”
అప్పటికయినా ఊరుకునేవాడా? లేదే…
” అంతేలే.. నీకు మొగుడంటే లెక్కా జమా! ఏ రకం గానూ సుఖపెట్టలేని దానివి… కొంపలో అడుగుపెడ్తే చాలు ఏడుపులు, మూలుగులు… మనశ్శాంతి లేకుండా పోతోంది. అన్నీ ఒదులుకుని నిన్ను చేసుకున్నందుకు… ఆహా ఏం సుఖపడిపోతున్నానో…. కడుపు నిండిపోతోంది…. ఏం… నా కోసం సంపాదించమంటున్నానా..? పిల్లల కోసమే కదా… ఈ పిల్లకు పెండ్లి చెయ్యాలంటే మాటలా? మీ ఇండ్లల్లో మాత్రం నా కూతుర్ని ఇవ్వను, మా రెడ్ల ఇంటికి కోడలుగా పోవాల్సిందే… నాలాగా కట్నం లేకుండా ఫ్రీగా చేసుకోవడానికి ఎవ్వరూ రారు. లక్షలు లక్షలు గుమ్మరించాలి” చెయ్యి చేసుకోవడం ఒక్కటే తక్కువ. నోటికి అదుపు లేకుండా పోయేది.
“లక్షల కట్నం వదులుకొని నిన్ను చేసుకున్నాను..” రోజులో ఎప్పుడో ఒకసారి తనతో అనేవాడు.
మొదట్లో తన కోసం ఎంత త్యాగం చేశాడు అని మురిసిపోయేది. ఏమయ్యిందో తన బుద్ధి ఇప్పుడు. కొంచెం కూదా అనుమానమే రాలేదు మొదట్లో… ఎంత లోఫర్ వెధవ కాకపోతే ఇంట్లో భార్య తో గడుపుతూ… వేరే ఆడదానితో సంబంధం పెట్టుకుంటాడు ఎంత నాటకమాడాడు? చాలా రోజులు తనకు తెలీకుండా మేనేజ్ చేశాడు. తీరా తెలిశాక నిలదీసి అడిగితే ఏ మాత్రం జంకు గొంకు లేకుండా
” అవును, అయితే ఏం? నీ నుండి నాకు సుఖం లేనప్పుడు ఇట్లనే చేస్తాను. నీకు ఈ రోజు తెలిసింది కాబట్టి అడుగుతున్నావ్. ఇది ఈ రోజుది కాదు. సో…. ఇప్పుడు కూడా ఏం తెలియనట్లే ఉండి మొగుడ్ని సుఖపెట్టేది నేర్చుకో”
’అబ్బా! ఎంత సిగ్గు లేకుండా మాట్లాడాడు. నీతి లేని మనిషి, ఎంతకయినా తెగించే రకం. ఛీ ఛీ తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది.’
పడుకున్నదల్లా ఒక్కసారి పైకి లేచింది నీరజ. పళ్ళు కొరుకుతూ దిండు విసిరి కొట్టింది.
’ఈ మంచాలు, పరుపుల మీదనే అతనితో గడిపింది…’ వాటిని కాల్చి వేయాలన్నంత ఆవేశం తన్నుకు వచ్చింది నీరజకు.
అంతలోనే విరక్తిగా నవ్వుకుంది.
’వీటిని కాల్చేయగలను… మరి అతనితో పాటు అయిదు సంవత్సరాలు సంసారం చేసిన ఈ శరీరాన్ని ఏం చెయ్యాలి? కాల్చేయగలనా? పిల్లల్ని ఏం చేయాలి? పిల్లల కోసమే కదా ఒంటరిగా ఈ యుద్ధమంతా! పిల్లలమీద అతని నీడ కూడా పడకూడదు. అతని గురించిన టాపిక్కే ఇంట్లో రాకూడదు. హూ(.. ఎంత రాకూడదు అనుకున్నా ఈ రోజు మాట్లాడకతప్పదు. ఇక నుండి ఆ తండ్రికి పిల్లలుగా వీళ్ళు పెరగాలా? సిగ్గు లేకపోతే సరి… కోర్టు కాదు కదా.. ఎవరొచ్చి చెప్పినా వినేది లేదు.. అందరికీ సమాధానం చెప్తుంది తను… మరి..’ గొంతులో ఏదో అడ్డం పడినట్టయ్యి ఉక్కిరిబిక్కిరయ్యింది నీరజ. పొద్దుటినుండి పడుతున్న వేదనంతా ఒక్కసారిగా బయటకు రావడంతో వెక్కివెక్కి ఏడ్చింది. తన శరీరంలో కొన్ని భాగాలు కోసేసినట్టుగా విలవిలలాడింది.
కొద్ది సేపటికి బలవంతాన లేచి మొహం కడుక్కుంది. మళ్ళీ ఒక్కసారి కాఫీ కలుపుకుని తాగింది. తిరిగి ఆలోచనలు చుట్టుముడుతుంటే.. వాటి నుండి తప్పించుకోవడానికి అవసరం లేకున్నా చెట్లకు నీళ్ళు పోసింది.
పిల్లలు వచ్చే టైమ్ అవుతుండటంతో ఉడకబెట్టిన గుడ్లను వొలిచి టొమాటోలు, మసాలా వేసి కూర చేసింది. పిల్లలు ఎగ్ మసాలాను చపాతి తో పాటు ఇష్టంగా తింటారని గుర్తుకు వచ్చి తలా ఒక చపాతీ చేసి హాట్ ప్యాక్ లో పెట్టింది.
** ** ** ** **
పిల్లలతో చెప్పాలా వద్దా అని నీరజ మనసు కొద్దిసేపు ఊగిసలాడింది.
చెబితే డిస్టర్బ్ అవుతారేమో.. చదువుకోకుండా, నిద్రపోకుండా ఆలోచిస్తారేమో.. కాని తప్పదు.. ఎప్పుడో ఒకసారి చెప్పాల్సిందే.. అదేదో ఇప్పుడే తేల్చేస్తే సరి.
సోఫాలో కూర్చుని శరత్ ని పిలిచింది నీరజ.
’ఏంటమ్మా’ చేతిలో పుస్తకంతో పాటు వచ్చాడు.
’రేఫు నీకు ఎగ్జామ్ ఏదైనా ఉందా నాన్నా..’
అమ్మ తనతో ఏదో చెప్పాలనుకుంటోంది అన్న విషయం శరత్ కు అర్ధమయ్యింది. పుస్తకం పక్కన పడేసి.. వాళ్ళ అమ్మ పక్కన కూర్చున్నాడు.
’ చిన్నా టి.వి ఆఫ్ చెయ్యమ్మా..’ షర్మిల కు చెప్పింది నీరజ. ఊ అన్నదే కానీ ఆఫ్ చెయ్యలేదు. మళ్ళీ ఒక్క సారి గట్టిగా చెప్పే సరికి ఠక్కున ఆఫ్ చేసింది.
నీరజ మొహం చూసి ’ ఏదో సీరియస్ మ్యాటర్ ఉన్నట్టుంది’ అనుకుంటూ వాళ్ళ అమ్మకు ఇంకొక వైపున కూచుంది.
పిల్లలిద్దరు చెరో వైపున కూచునే సరికి నీరజకు వేయి ఏనుగుల బలం వచ్చినట్టయ్యింది. దు:ఖం కూడా గొంతులోకి వచ్చింది. ఇద్దరివీ చేతులు తీసుకుని మెల్లిగా నిమిరింది. ఈ చేతులకు తన కన్నీటిని తుడవగలిగే శక్తి ఉంది అన్న భరోసాతో రెండు క్షణాలు కళ్ళు మూసుకుంది. మూసిన కన్నుల నుండి రెండు కన్నీటి చుక్కలు రాలి పిల్లల చేతుల మీద పడ్డాయి.
తల్లిని అలాంటి దైన్య స్ధితిలో ఎప్పుడూ చూడలేదు వాళ్ళు. ఒక్కసారి అలా చూసే సరికి గుండె గొంతుకలోన కొట్టుకున్నట్లయ్యింది. ముఖాలు చిన్నబుచ్చుకుని తల్లి ముఖంలోకి చూసారు. నీరజ వెంటనే సర్దుకుంది. టీపాయ్ మీదున్న పేపర్ తీసి రెండవ పేజ్ లోని న్యూస్ ఐటమ్ చదవమని ఇచ్చింది.
తల్లిని అంతగా బాధించిన విషయం ఏమిటో అన్నట్టు ఆత్రంగా చదివారు.
“అయితే ఇక నుండి మేము మధుసూధన్ రెడ్డి పిల్లలం అన్నమాట. అయితే నీ సంగతి ఏంటి… గార్డియన్ వా అమ్మా”
శరత్ ఒక్కసారిగా అలా డైరెక్టు గా మాట్లాడే సరికి నీరజకు నోటమాట రాలేదు. మెల్లిగా తేరుకుని గ్లాసు మంచినీళ్ళు తాగింది. శరత్ వ్యంగ్యంగా అన్నాడో… లేక జడ్జిమెంట్ ను ఒప్పుకుంటున్నాడో కొద్దిసేపు నీరజకు అర్ధం కాలేదు.
” నీకు రిజర్వేషన్ పోతుందనే బాధ లేదా శరత్”
” ఎందుకు ఉండదమ్మా”
“అంతేనా? అంతకుమించి ఇంకేమీ అనిపించలేదా?”
“ఏమన్నా అనిపించడానికి నీవు ఆయన గురించి మాకు చెప్తే కదమ్మా!” షర్మిల కలుగజేసుకుంది.
షర్మిల మాతలకు కొంచెం నొచ్చుకున్నా వెంటనే సర్దుకుంది.
అంతవరకు ఎలా చెప్పాలి అని సతమతమవుతున్న నీరజ రెలీఫ్ గా ఫీలయ్యింది. చెప్పడం మొదలు పెట్టింది.
పిల్లలతో చెప్పకూడని విషయాలు చెప్పకుండా దాటేసింది.
శరత్, షర్మిల వాళ్ళ నాన్న గురించి అమ్మమ్మ, పెద్దమ్మల మాటలు విని తెలుసుకున్న విషయాలే. అమ్మకు నాన్నకు పడదు, నాన్న గురించి అమ్మ దగ్గర మాట్లాడటం బాగుండదు అని చిన్నప్పుడే వాళ్ళకు అర్ధమయ్యింది.
అమ్మ ఇంట్లోను, ఆఫీసులోను పని చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి పెంచితే… నాన్న మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసి ఇంకొక పెళ్ళి చేసుకున్నాడు అని నీరజ మాటలు విన్నాక వాళ్ళకి అనిపించింది.
’అలాంటి వాడిని తండ్రి అని ఎలా అనుకోవాలి’ ముఖం చిట్లించుకున్నాడు శరత్.
“అమ్మా! రిజర్వేషన్ ను వినియోగించుకోలేక పోతామే అని బాధ అయితే ఉంది.. అలా అని మా గురించి ఆలోచించకుండా వదిలి వెళ్ళిపోయిన మనిషికి కొడుకుగా ఉండటం కూడా నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. మా గురించే ఆలోచిస్తూ… మా కోసమే బ్రతుకుతున్న మా అమ్మ కావాలి అంతే… నువ్వు ఎలా డీల్ చేస్తావో నాకు తెలియదు… నేను నీకు మాత్రమే కొడుకుని…” స్పష్టంగా చెప్పాడు.
చదువుకోవడానికి రూమ్ లోకి పోతుంటే కాసేపు కూర్చోమని నీరజ ఆపేసింది.
’ అమ్మా ఒకవేళ నాన్న మంచిగా ఉండి మమ్మల్ని బాగా చూసుకుని మనతోనే ఉండుంటే అప్పుడు మాకు నాన్న క్యాస్ట్ పెట్టుండే దానివా?” షర్మిల గొంతులో సందేహం.
’అదేం ప్రశ్న చిన్నా అలా అడిగావ్’
’పోనీ, నువ్వు ఓసీ అయ్యుండి… ఆయన బిసి అయ్యుంటే ఏం చేసేదానివి” కుతూ హలంగా అడిగాడు శరత్.
‘”ఒకవేళ అలా అయ్యుండి… అతని ప్రవర్తన ఇలానే ఉండుంటే మాత్రం…. ఇప్పుడు నా స్టాండ్ ఏమిటో అప్పుడు కూడా అదే. అందులో తిరుగులేదు. ఒక్క విషయం గమనించండి. పిల్లలకు తండ్రి క్యాస్టే పెట్టాలి అని చెప్పడం వలన తల్లులకు అన్యాయం చేస్తున్నట్టుగా మీకు అనిపించడం లేదా’ ఆవేదనగా ఉంది నీరజ గొంతు.
’ మరి తల్లి క్యాస్ట్ పెట్టుకుంటే అప్పుడు తండ్రులకు అన్యాయం జరిగినట్టు కాదా..’ శరత్, నీరజ దెబ్బతిన్నట్టు షర్మిల వైపు చూశారు.
’అయితే నువ్వు ఆయనకు కూతురిగా ఉంటానంటావ్ అంతేనా?’ తీవ్రంగా ప్రశ్నించాడు శరత్.
’ నీకేమైనా పిచ్చా.. నేను అలా అన్నానా? అమ్మా! పోనీ నువ్వు చెప్పు’
ఏం చెప్పమంటావ్..’ ముఖం పక్కకు తిప్పుకుంది నీరజ.
అమ్మకు తన మీద కోపం వచ్చిందని షర్మిలకు అర్ధం అయ్యింది.
శరత్ మీద గొంతుదాకా కోపం వచ్చింది.
’నేను మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డం రావద్దు’ శరత్ కు వార్నింగ్ ఇచ్చింది.
” అమ్మ క్యాస్టా, లేకుంటే నాన్న క్యాస్టా అని ఫైటింగ్ చేసే బదులు అసలు క్యాస్ట్ లేకపోతే ఏమవుతుంది? మన ఇంటి వరకు మనకు అమ్మనే సర్వస్వం. అందులో తిరుగులేదు. అయితే ఈ యూజ్ లెస్ సుప్రీంకోర్టు మనల్ని ఏడిపిస్తోంది. దాన్ని పట్టించుకోకపోతే సరి… పట్టించుకోవాలనే రూలేమీ లేదు కదా.! రిజర్వేషన్ అవైల్ చేసుకోకుండా నీ క్యాస్ట్ రాసుకోవడానికి వీలుంటే అదే రాయించమ్మా. లేదా, మమ్మల్ని ఏ క్యాస్ట్ కు సంబంధం లేకుండా జనరల్ గా రాయించు.. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందేమో..”
నీరజ తదేకంగా షర్మిల వైపు చూస్తోంది.
” ఏం తప్పు లేదు మా ఫ్రెండ్ అనూష వాళ్ళ పేరెంట్స్ అలానే చేశారు. వాళ్ళ అమ్మ వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజేనంట. చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఈ పిల్లకు ఎక్కడా క్యాస్ట్ మెన్షన్ చెయ్యలేదు… ఏమయ్యింది… బానే ఉంది కదా తను. నీకొకసంగతి చెప్పనా… ఆ పిల్లను ఎవరైనా మీ క్యాస్ట్ ఏంటి అని అడిగితే, నాకే అవసరం లేదు, మీకంత అవసరమా అంటుంది…”
నీరజకు షర్మిలను చూస్తుంటే ఆశ్చర్యంగా కొత్తగా ఉంది.
’తన చేతుల్లో పెరిగిన పిల్లేనా ఈ పిల్ల… ఎన్ని మాటలు నేర్చింది. ఏమీ పట్టనట్టు నిర్లక్ష్యంతో ఉండే షర్మిలేనా ఇంత డీప్ గా ఆలోచించేది..’ అపురూపంగా చూసింది షర్మిల వైపు.
తనేమో ఎంతసేపు ఆ పాయింట్ దగ్గరే ఆగిపోయి ఆలోచించింది. దాని నుండి బయటికి వచ్చి ఎందుకు ఆలోచించలేకపోయింది. తన సంగతి వదిలేస్తే.. కులాల్ని ధిక్కరించి.. వాటిని కాలదన్ని పెళ్ళి చేసుకుంటే.. పిల్లలను తిరిగి ఏదో ఒక కులంలో బంధించడం న్యాయమేనా?
పిల్లలు ఎప్పుడు అక్కడినుండి వెళ్ళిపోయారో గమనించలేదు. వాళ్ళ కోసం చూస్తే చదువుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఒకసారి పేపర్ తీసి అదే న్యూస్ ఐటమ్ చదివింది.
’అసలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటే ఎలా ఉంటుంది? తమ ఆఫీసులోనే ఎన్నోసార్లు అలాంటి వాళ్ళకు లోన్స్ ఇవ్వలేదూ… వాళ్ళందరికీ సపరేట్ రిజర్వేషన్ ఉంటే ఎంత బాగుంటుంది…’ తన ఆలోచనకు నవ్వు వచ్చింది నీరజకు.
’ఉన్న రిజర్వేషన్లనే ఊడపీకేస్తుంటే… ఇంక ఈ డిమాండ్ ను ఒప్పుకుంటాయా? ఎంతసేపు ఒకవైపు నుండే ఆలోచిస్తాయి.. రెండో వైపు చూసి చూడనట్టుంటాయి. ఎర్ండు వైపుల కాలుండా ఇంకా ఏమైనా ఉందా అనే జ్ఞానం ఏ మాత్రం ఉండదు!’ చేతిలో ఉన్న పేపర్ ను నలిపి, ఉండచేసి మూలకు విసిరి కొట్టింది.
– కె.సుభాషిణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to నాణెం కు మరో వైపు